close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ధృతి

ధృతి
- తులసి బాలకృష్ణ

తుపాను గాలిలో చిగురుటాకులా వణికిపోతోంది శాంత. గాభరాతో గుండెలు దడదడలాడుతున్నాయి. వేగంగా నడుద్దామనే ప్రయత్నంలో కాళ్ళు తేలిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటలు ధారలుధారలుగా. ఆమెలోని భయాన్ని పదింతలు చేస్తూ పక్క సందులో ఓ వూరకుక్క నిర్విరామంగా కంచుగంటలు మోగిస్తున్నట్లు భయంకరంగా మొరుగుతోంది. ఈ సమయంలోనే సన్నని తుంపర... కరెంట్‌ కూడా ఇప్పుడే పోవాలా... ఖర్మ! వీధి దీపాలు ఆరిపోయి... గుడ్డి చీకటి...

వెనగ్గా అవాకులూ చవాకులూ పేలుతూ వస్తున్న మస్తాన్‌గాడు ఇదే అదనుగా మరింత దగ్గరకొచ్చాడు. వాడు పెద్దడుగులు వేస్తే, తను వాడి చేతికి అందిపోవచ్చు. పరిగెడదామన్నా శక్తి అందట్లేదు.

అదృష్టం... ఇంటికి చేరిపోగలిగింది. శక్తి కూడగట్టుకుని రెండు అంగల్లో ఇంట్లోకి దూరి, తలుపులు బిగించేసి, నిస్సత్తువతో కింద కూలబడి, గోడకి జార్లబడి, కళ్ళు మూసుకుని, వూపిరి అందడానికి ఒగర్చసాగింది.

బయటనుంచి మస్తాన్‌గాడి హెచ్చరిక వినిపిస్తోంది. ‘‘ఏయ్‌! ఇదే నీకు లాస్ట్‌ వోర్నింగ్‌. నానసలే మంచోణ్ణి గాదు. మరియాదగా ఇనకపోతే, ఏదో రోజున బలవంతంగా లాక్కుపోతాను. అవిటోడయిన మొగుడితో ఏం సుకపడ్తావ్‌? ఒయిసులో వున్నావ్‌, నాతో ఒత్తే సొర్గం సూపిత్తా...’’

భర్త ప్రసక్తి తెస్తూ వాడు అంత నీచంగా మాట్లాడేసరికి ఆమె గుండెలు బాధతో ఘూర్ణిల్లాయి. ‘‘ఎన్నాళ్ళని తప్పించుకుంటావో సూత్తాగా...’’ మస్తాన్‌గాడి మాటలు దూరమయ్యాయి.

రెండు నిమిషాలకి గుండె దడ కొంత స్వాధీనంలోకి వచ్చాక, నెమ్మదిగా లేచి, చేతిలోని సంచీతో లోపలి గదిలోకి నడిచింది శాంత. అక్కడ కరెంట్‌ లేని కారణంగా... మసిబారిన చిమ్నీ దీపం వెలుతురు గదంతా మసకమసకగా పరుచుకుని ఉంది. అవిటివాడై మంచం మీద పడి ఉన్న భర్త గిరిధర్‌ తనవైపు సానుభూతిగా చూస్తున్నాడు. పాప, బాబు తండ్రికి ఇరుపక్కలా కూర్చుని సేవలు చేస్తున్నవాళ్ళల్లా ఒక్క ఉదుటున లేచొచ్చి తనని చుట్టుకుపోయారు. బయట వర్షం భోరుమంటోంది.

‘‘శాంతా, పిల్లలు కంగారుపడుతున్నారు. చీకటిపడ్డాక కూడా నువ్వు బజారుకి పోయి అవి తీసుకురావడం అంత అవసరమా?’’ అడిగాడు గిరిధర్‌ ప్రేమగా.

‘‘మీకివ్వాల్సిన టాబ్లెట్లు అయిపోయాయి. అవి పడకపోతే ఈ రాత్రి మీరెంత నరకం అనుభవిస్తారో నాకు తెలుసండీ’’ అంటూండగానే ఆమె గొంతు పూడుకుపోయింది. దుఃఖం ఒక్కసారిగా లోనుండి సునామీలా తన్నుకొచ్చింది. మొదలు నరికిన చెట్టులా కూలబడి, మంచం మీదకు తల వాల్చి బావురుమంది. గిలగిల్లాడుతూ చూశాడు గిరిధర్‌. బిక్కచచ్చిపోయి మౌనంగా చూస్తున్నారు పిల్లలు.

‘‘ఏం జరిగింది శాంతా?’’ గిరిధర్‌ గొంతు కీడుని శంకించింది. ‘ఏం కాలే’దన్నట్లుగా శాంత తలయితే అడ్డంగా వూపిందిగానీ గుక్కతిప్పుకోలేక చిన్నగా వెక్కుతూనే ఉంది. దుఃఖంతో ఆమె శరీరం జలదరిస్తోంది. ఆందోళనగా అడిగాడు గిరిధర్‌ ‘‘ఆ మస్తాన్‌గాడు అల్లరిపెట్టాడా మళ్ళీ?’’

దుఃఖాన్ని అదుపుచేసుకుంటూ, కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ‘‘లేదు, లేదు. సింహంలా బతికిన మిమ్మల్ని చూస్తూంటేనే... దుఃఖంగా ఉంది’’ అబద్ధం చెప్పబోయింది శాంత.

‘‘కాదులే. ఆ వెధవే ఏదో అల్లరి పెట్టి ఉంటాడు నిన్ను. నా కాలూ చెయ్యీ బాగున్నప్పుడు నేను కనపడ్డప్పుడల్లా ‘నమస్తే అన్నా’ అంటూ భయంతో వంగివంగి సలాములు చేసిన వెధవ... ఇప్పుడు...’’ గిరిధర్‌ గొంతు పూడుకుపోసాగింది. కనుకొలకుల్లోంచి ధారలుగా కన్నీళ్ళు కారుతూండగా నీరసంగా గొణిగాడు ‘‘వెధవ అసమర్ధపు బతుకైపోయింది నాది. నా ఎదురుగానే నా భార్య ఓ రౌడీ వెధవ కారణంగా ఇలా మనసు కష్టపెట్టుకుంటూంటే, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాన్నేను. ఫ్యాక్టరీలోని యాక్సిడెంట్‌లో నా కాలూ చెయ్యీ పోగొట్టకుండా ఆ దేవుడు ప్రాణాలు తీసుకుపోయుంటే బాగుండేది.’’

గబుక్కున అతని నోరు మూస్తూ పక్కనే కూర్చుని ‘‘ఛ ఛ... అలా మాట్లాడకండి. నాకేం కాలేదు. అంతా మంచే జరుగుతుంది’’ అంది శాంత చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ. కానీ మస్తాన్‌గాడి హెచ్చరిక ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉంది. గుండెలు దడదడలాడుతూనే ఉన్నాయి.

ఆ రాత్రి ఆమె నిద్రకు దూరమయింది.

***

పొద్దున్నే పాపని భర్త దగ్గరకు తీసుకొచ్చింది శాంత. ఈమధ్యకాలంలో చాలా దిగులుకి గురై నీరసంగా కనిపిస్తున్న పాప ఈరోజు పుట్టినరోజు కారణంగా తలంటు పోసుకుని, కొత్త గౌను తొడుక్కుని నూతన ఉత్సాహంతో కనిపిస్తోంది.

‘‘నాన్నగారి కాళ్ళకు దణ్ణం పెట్టమ్మా’’ అంది శాంత. మోకాళ్ళ మీద కూర్చుంది పాప.

మంచం అంచు మీదుగా కిందకు జార్చుకున్న ఒంటి కాలుని గబుక్కున పైకి లాక్కుని వారిస్తూ ‘‘ఒంటికాలు వాణ్ణి. నాకు కాదు, అమ్మ కాళ్ళకు పెట్టు. ఇకనుంచి అమ్మే ఈ ఇంటి పెద్దదిక్కు’’ అన్నాడు గిరిధర్‌, పాపని తల్లివైపు తిప్పుతూ.

‘‘ఛఛా... ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి. మాట్లాడితే నామీద ఒట్టే. నేను పెద్ద దిక్కేవిటీ... పిరికిదాన్ని, అశక్తురాల్ని. ఎప్పుడూ ఈ ఇంటికి మీరే మహారాజు’’ అని వారించి, ‘‘పాపా, నాన్నగారికి దణ్ణం పెట్టి, ఆశీర్వాదం తీసుకో తల్లీ’’ అంది శాంత. నమస్కరిస్తూన్న కూతుర్ని దగ్గరగా పొదువుకుని, నుదుట ముద్దుపెట్టి, ఆశీర్వదించి ‘‘తల్లీ, ఈరోజు అంతా నీ ఇష్టప్రకారం జరుగుతుంది. నీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం... సినిమాకా, షికారుకా?’’ అనడిగాడు గిరిధర్‌ లాలనగా.

‘‘నాకు జూ అంటే ఇష్టం’’ అంది పాప ఉత్సాహంగా.

‘‘ఓకే, జూకి వెళ్ళండి, అమ్మ తీసుకెళుతుంది.’’

ఉలిక్కిపడింది శాంత. మళ్ళీ సర్దుకుని ‘‘నాన్నగారికి కొద్దిగా తగ్గాక, మనందరం జూకి తప్పకుండా వెళ్దాం, ఏం? నాన్నగారు లేకుండా నేను తీసుకెళ్ళలేనమ్మా మిమ్మల్ని’’ అంది బుజ్జగింపుగా. ‘అలాగే’ అన్నట్లు తలూపిందిగానీ పాప మొహంలో కించిత్‌ నిరుత్సాహం కనబడుతూనే ఉంది.

‘‘అలాక్కాదు శాంతా! చెప్పాగా... ఈరోజు పాప ఇష్ట ప్రకారం జరగాలని. భోజనాలయ్యాక పాపనీ, బాబునీ జూకి తీసుకెళ్ళు. నాకు పుస్తకాలూ టీవీ ఉన్నాయిగా కాలక్షేపానికి.’’

‘‘అదికాదండీ, వీళ్ళని ఎక్కడికన్నా తీసుకెళ్ళడం నావల్ల అవుతుందా? ఆ బస్సులూ అవీ ఎక్కి వెళ్ళడం... అందులో పిల్లలతో...’’

‘‘ఇంకేం మాట్లాడొద్దు నువ్వు... ప్లీజ్‌! చూడు... ‘మీరు జూకి వెళ్ళండి’ అని నేననగానే దాని మొహం ఎలా వెలిగిపోతోందో! పగలే కదా... ఏమీ ఇబ్బంది ఉండదు. మళ్ళీ సాయంత్రం చీకటిపడేలోపు వచ్చేయండి అంతే!’’

***

భర్త మాట తీసెయ్యలేక అతనికి దగ్గరలో అవసరమయినవన్నీ ఏర్పాటుచేసి, పిల్లలతో జూకి వచ్చిన శాంత గుండెల్లో - ఎన్నడూ భర్త తోడు లేకుండా అలా పిల్లల్ని ఎక్కడికయినా తీసుకువెళ్ళిన అనుభవం లేకపోవడంతో ఏదో గాభరాగానే ఉంది.

కానీ, అక్కడి జంతువుల్ని చూస్తూ, ఆనందంతో మైమరిచి గంతులు వేస్తూన్న తన పిల్లల్ని చూస్తూంటే... వాళ్ళమీద జాలి, ప్రేమతో కూడిన ఆనందంతో ఆమె కళ్ళలో నీళ్ళూరాయి. ‘పాపం, పసివాళ్ళు... తండ్రికి యాక్సిడెంట్‌ అయ్యాక గత మూడు నెలలుగా మొహాల మీద నవ్వనేదే ఎరుగరు. ఇక్కడకు తీసుకురావడం చాలా మంచిదయింది’ అనుకుంటూ వాళ్ళకి ఐస్‌క్రీమ్‌ తెద్దామని ఓ స్టాల్‌ వైపు నడిచింది.

ఇంతలో... ఒళ్ళు గగుర్పొడిచే అనౌన్స్‌మెంట్‌!

‘‘హెచ్చరిక! పెద్దపులి కంచె దూకి బయటికి వచ్చేసింది. దాన్ని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ వెంటనే త్వరగా బయటకు వెళ్ళిపోవాలి. త్వరగా వెళ్ళిపొండి... త్వరగా ఖాళీ చేయాలి’’ మైకులో ప్రకటన!

‘‘హమ్మో! బాబోయ్‌! నాయనోయ్‌!’’ భయంతో అరుపులూ, కేకలూ, ఏడుపులూ... పెద్ద కలకలం! కకావికలై పరుగులు తీస్తున్నారు జనం.

ప్రకటన ఇస్తూ వస్తున్న వ్యాన్‌లోని జూ స్టాఫ్‌ - చేతుల్లో తుపాకులతో ఆదుర్దాగా గాభరాగా కలియ చూస్తూన్నారు పులి కోసం.

లేళ్ళని చూస్తూ ఆనందిస్తూన్న పాప, బాబు ఈ కలకలానికి బెదిరిపోయి చుట్టూ చూశారు. పరుగులు పెడ్తూన్న జనం అడ్డం రావడంతో తల్లి కనిపించలేదు వాళ్ళకి. జనం నెట్టేస్తూంటే గట్టిగా ఏడుస్తూ, ఇద్దరూ చేతులు పట్టుకుని పడుతూ లేస్తూ తమకి తోచిన దిక్కు పరుగెత్తారు.

ప్రకటన విన్న శాంత గుండె జారిపోయింది. చేతిలోని ఐస్‌క్రీముల్ని అక్కడే పడేసి ‘‘పాపా! బాబూ!’’ అని వెర్రిగా అరుస్తూ, చుట్టూ వెయ్యి కళ్ళతో వెదుకుతూ... వాళ్ళెక్కడా కనిపించక... గాభరాగా... పిచ్చిగా అటూఇటూ పరుగెత్తసాగింది. అలా పరుగెత్తుతూ ఓ రాయిని గుద్దుకుని బోర్లాపడిపోయింది. చేతులూ కాళ్ళూ చెక్కుకుపోయి, రక్తం కారుతున్నా లక్ష్యపెట్టే స్థితిలో లేదు ఆమె. పిల్లలు... పసివాళ్ళు... తన ప్రాణాలు... ఎటు వెళ్ళిపోయారో!? భయంతో ఎంతగా తల్లడిల్లిపోతున్నారో? కొంపదీసి, బోనులోంచి తప్పించుకున్న పులి దిక్కు పోలేదు కదా!? ఆ ఆలోచనతో గాలిలో దీపంలా అల్లల్లాడిపోయింది ఆమె. గొంతు చించుకుని, కంఠనాళాలు తెగిపోయేంత గట్టిగా ‘‘పా..పా! బా..బూ!’’ అని అరిచింది.

‘‘అ..మ్‌..మ్మా’’ ఓ దిక్కు నుంచి ఏడుపు, భయం నిండిన బాబూ, పాపల గొంతులు.

ఆనందం... అంతలోనే విపరీతమైన భయం... ఒక్కసారే కమ్మేయగా ‘‘నేనొస్తున్నా, మీరక్కడే ఉండండమ్మా... భయపడకండీ’’ అని మళ్ళీ అదే స్వరంతో అరిచి, అటు దిక్కు పరుగెత్తింది శాంత వేగంగా.

అంతలోనే ‘‘అమ్మా... పులీ’’- ఆ కేక పాపది! విపరీతమైన భయం ధ్వనించింది ఆ స్వరంలో. కరచరణాలు ఆడలేదు శాంతకి. గుండె ఆగిపోతుందేమోనన్నంత ఉక్కిరిబిక్కిరితో కూడిన భయం. పిల్లలకి ధైర్యం కలిగించేలా అరుద్దామన్నా గొంతు విచ్చుకోవడం లేదు. ‘దేవుడా! ఏవిటీ పరీక్షా?’ అనుకుంటూ గట్టిగా శక్తికొద్దీ ఓసారి గాలిని పీల్చి, జనాన్ని తప్పించుకుంటూ పిల్లల గొంతు వినిపించిన దిక్కు పరుగెత్తింది.

అక్కడ... ఓ పొద పక్కన... భయంతో ఒకరినొకరూ కరుచుకుపోయి ఏడుస్తూ ఆకుల్లా వణికిపోతూన్న తన పిల్లలు..! వాళ్ళకెదురుగా ఓ అయిదారు గజాల దూరంలో తల తిప్పకుండా వాళ్ళవైపే చూస్తూన్న పెద్దపులి! మరో మనిషి అనేవాడు లేకుండా అంతా ఖాళీ. శాంతకి వూపిరి అందటం లేదు... తన గుండె చప్పుడు సమ్మెట దెబ్బల్లా వినిపిస్తోంది. నోట్లో తడారిపోయింది... మెదడు మొద్దుబారిపోయింది. ఏం చేయాలో తోచడం లేదు. ఆలోచించే శక్తి లేదు. ఆలస్యమైతే తన పిల్లలు పులికి ఆహారంగా... హమ్మో!

జన్మలో ఎరుగని... ఒళ్ళు తెలియని వెర్రి ఆవేశం, మొండి ధైర్యం ఆవహించేశాయి ఆమెని. ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం- ఆ భయంకరమైన పెద్దపులి నుంచి తన పిల్లల్ని కాపాడుకోవడమే! అదొక్కటే! ఒక్కసారిగా అనంతమైన శక్తి తనకున్నంత భావన కలిగింది ఆమెలో. చేతికందిన ఓ చెట్టు కొమ్మని విరిచి, ముందుకి ఉరికి, పిల్లలకి అడ్డు నిలిచి, రెక్కల కింద పిల్లల్ని దాచుకుని కాపాడే పక్షిలా... వాళ్ళిద్దర్నీ తన వెనక దాచుకుని ‘నా బిడ్డల వైపు ఒక్క అడుగువేసినా నిన్ను చీల్చి చెండాడేస్తా’నన్నంత రౌద్రంతో... అపర కాళికనే తలపించే రూపంతో... శరీరంలో ఎటువంటి చలనం లేకుండా నిలిపి... రెప్పలు వాల్చకుండా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో... పులి కళ్ళలోకి చూడసాగింది.

తల్లి వెనక చేరిన పిల్లలిద్దరూ భయంతో ఆమెని గట్టిగా పట్టేసుకుని, ముఖాలు ఆమె చీరలో దాచేసుకున్నారు. ఓ చేత్తో కొమ్మని ఎత్తి పట్టుకుని, మరోచేతిని పిల్లల తలల మీదుంచి ధైర్యం కలిగిస్తోంది ఆమె. రెప్పలు వాలని ఆమె చూపు పులి వైపే ఉంది.

పులి చూపు కూడా ఈ తల్లీపిల్లల వైపే ఉంది.
పులిలోగానీ, శాంతలోగానీ కించిత్‌ చలనం లేదు.
అలా సూటిగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు.
క్షణాలు యుగాల్లా సాగుతున్నాయి.
ఎవరిలోనూ కదలిక లేదు.

ఇంతలో ‘ఢాం!’ తుపాకీ పేలిన శబ్దం. రాతిబొమ్మలా, ధృఢంగా, బలంగా నిలబడి ఉన్న పులి నెమ్మదిగా నేల మీదకు ఒరిగిపోసాగింది. ట్రాన్క్విలైజింగ్‌ బుల్లెట్స్‌ పేల్చి, పులిని పడవేసిన జూ స్టాఫ్‌ వ్యాన్‌ దిగి, పరుగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఉచ్చులో బిగించి, వ్యాన్‌లోకి ఎక్కించసాగారు. శాంత దగ్గరకొచ్చి ‘‘వండర్‌ఫుల్‌! యు ఆర్‌ గ్రేటమ్మా’’ అన్నాడు జూ క్యురేటర్‌ అభినందనగా.

బొమ్మలా నిలబడిపోయిన శాంతకి క్రమేపీ ఒళ్ళు తెలిసింది. విభ్రమతో చుట్టూ చూసి ‘పులిని ఎదిరించి నిలిచింది తనేనా?’ అని ఆశ్చర్యపోతూనే, పిల్లలిద్దర్నీ గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో తడిమింది... ఆనందభాష్పాలతో అభిషేకించింది. ఆ తర్వాత మౌనంగా వాళ్ళతోబాటు గేటు వైపు బయలుదేరింది. కూడా వస్తూన్న క్యురేటర్‌ అంటున్నాడు ‘‘అడవి జంతువులు క్రూర మృగాలయినా అన్ని సందర్భాలలోనూ మనిషి కనబడగానే అటాక్‌ చేయడానికి సాహసించవు. వాటిలోనూ ప్రాణభీతి, పిరికితనం ఉంటాయి. వాటికి ప్రాణహాని జరగబోతోందని భయపడ్డప్పుడూ, నరమాంసానికి అలవాటుపడ్డప్పుడూ మాత్రమే తామంతట తాముగా అటాక్‌ చేస్తాయి. ఆ పరిస్థితుల్లో అలా ధైర్యంగా కదలకుండా మీరు నిలబడటం చాలా మెచ్చుకోదగ్గ పని’’ చెపుతూనే ఉన్నాడు.

మౌనంగా పిల్లలిద్దరి చేతులూ పట్టుకుని గేటు వైపు వేగంగా నడుస్తూన్న శాంత మస్తిష్కంలో ఏవో... ఏవేవో ఆలోచనలు... నరనరాల్లో ఉజ్వలిస్తూన్న ఏదో వింత నూతనశక్తి.

పిల్లలతో జూ బయటకొచ్చాక ఎప్పుడు బస్సెక్కిందో ఆమెకే తెలియదు. యాంత్రికంగానే టికెట్స్‌ తీసుకుంది. ప్రయాణాలు చేయడం తనకి ఎప్పట్నుంచో అలవాటయినదే అయినట్లు... అసలు చిన్నప్పట్నుంచీ తనకు భయమే తెలియనట్లు... తను సాహసానికి మారుపేరయినట్లు... తనంటే భయానికే భయమన్నట్లు... ఆమెలో ఏవేవో వింత భావాలు.

తమ కాలనీ స్టాప్‌ రాగానే దిగింది పిల్లలతో. అక్కడ... కొంచెం దూరంలో మస్తాన్‌గాడున్నాడు. బస్సు దిగిన తనవైపు కళ్ళెగరేస్తూ ‘ఇప్పుడెలా తప్పించుకుంటావు’ అన్నట్లుగా పిచ్చిచూపులు చూస్తూ, ఈల వేస్తూ ఇటే వస్తున్నాడు. వాడిని చూసి, చూపుని చుట్టూ తిప్పింది శాంత. బస్టాప్‌ షెల్టర్‌ కింద బెంచీ మీద తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన తెలుగు మాస్టారు కనిపించారామెకు. ‘‘నమస్కారం మాస్టారూ’’ అంది అటు నడిచి, రెండు చేతులూ జోడించి. కళ్ళు చిట్లించి చూస్తూ, క్రమేపీ గుర్తుపట్టి ‘‘బాగున్నావా శాంతా’’ అంటూ బోసినవ్వుతో పలకరించారు ఆయన.

‘‘మాస్టారూ, మీ చేతి కర్రొకసారిస్తారా... ప్లీజ్‌’’ అంది శాంత గంభీరంగా.

‘‘కర్రెందుకే తల్లీ? పిల్లిపిల్లల్నీ, కుక్కపిల్లల్నీ చూసి చిన్నప్పటిలాగే ఇప్పటిక్కూడా ఇంకా భయపడుతూనే ఉన్నావా?’’ నవ్వుతూనే అడిగారు మాస్టారు అర్థంకాక.

కొంగు నడుముకు చుట్టి ‘‘మీరు చెప్పిన పాఠం ‘...దండం దశ గుణం భవేత్‌’ని ఆచరణలో చూపిద్దామనీ’’ అంటూ కర్రని అందుకుని, మస్తాన్‌ని చంపేసేలా చూస్తూ రౌద్రాకారంతో ‘‘ఒరేయ్‌, ఓనాడు భయంతో నువ్వు వంగివంగి దణ్ణాలు పెట్టిన గిరిధర్‌ భార్యనిరా. నన్ను బెదిరించడానికి నీకు ఎన్ని గుండెల్రా... వార్నింగ్‌లు ఇస్తావా... రా, నా చేతుల్లో ఈరోజు నీకు చావు మూడిందిరా రాస్కెల్‌’’ అంటూ వాడివైపు విసురు గాలి వేగంతో పెద్దపెద్ద అంగలతో నడవసాగింది.

ఈ హఠాత్పరిణామానికి అదిరిపడ్డాడు మస్తాన్‌. నమ్మశక్యంకాక... ఆశ్చర్యంతో బిత్తరపోయి చూశాడు. ఆమె అపర కాళికావతారంతో తనవైపే దూసుకు వస్తూండటంతో... విస్తుపోతూనే... భయంతో వణికిపోయాడు. బింకంగా అక్కడే నిలబడటానికి సాహసించలేకపోయాడు. అప్రయత్నంగానే నెమ్మదినెమ్మదిగా వెనకడుగులు వేయసాగాడు. ఆమె కర్రని బలంగా పట్టుకుని, ఆగకుండా వేగంగా పెద్దపెద్ద అంగలతో తనవైపు పూనకంతో వస్తూండటంతో బెదిరిపోయి, అదిరే గుండెలతో వెనుతిరిగి పరుగు లంఘించుకున్నాడు. వాడిని కనుచూపుకి అందనంత దూరం తరిమికొట్టి ‘‘మళ్ళీ ఈ ఏరియా ఛాయల్లో కనిపిస్తే ప్రాణం తీస్తాను రాస్కెల్‌’’ అని గర్జించి, తిరిగి కోపంగా ఒగుర్చుతూ వచ్చింది శాంత.

తమ తల్లి దున్నపోతు లాంటి ఓ రౌడీని అలా తరిమికొట్టడం చూస్తూన్న పిల్లలిద్దరూ ఆనందంపట్టలేక చప్పట్లు చరుస్తున్నారు. ఆమె సాహసానికి నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయిన జనమంతా కూడా... మాస్టారితో సహా... నెమ్మదిగా తేరుకుని, అభినందనగా గట్టిగా చప్పట్లు చరిచారు.

నిటారుగా సాగి, సంపూర్ణ ‘ఆత్మబలం’తో... గుండెలు నిండిన ‘ధృతి’తో పిల్లలతోబాటు ఇంటివైపు అడుగులు వేస్తూన్న శాంతకి ‘ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో నిలబడితే ఈ సమాజంలోని క్రూర మృగాలను ఎదుర్కోవడం అసాధ్యంకాదన్నమాట’ అనిపిస్తూండగా... కొండంత బలం వచ్చిన అనుభూతి కలగసాగింది.

నిబ్బరంగా, బలంగా పడుతున్నాయి ఆమె అడుగులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.