close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనాథలకు అమ్మ ఒడి

అనాథలకు అమ్మ ఒడి 

మహేష్‌, మాధవి, గంగోత్రి, వెంకటేష్‌... వీరంతా ఒకే ఇంట్లోని పిల్లలు. వీరేకాదు ఆ ఇంట్లో మరో 12 మంది పిల్లలుంటారు. వీరందరికీ అమ్మానాన్న భాగ్యలక్ష్మి, వెంకటి. ఒకప్పుడు ఈ దంపతులు సంతానం కోసం మొక్కని దేవుళ్లు లేరు. ఎక్కని హాస్పిటల్‌ మెట్లు లేవు. కానీ ఇప్పుడు వారిల్లు నిత్యం పిల్లలతో ఎంతో సందడిగా ఉంటోంది. దీనికి కారణం వారికి పిల్లలపైన ఉన్న ప్రేమానురాగాలే!

దిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లికి చెందిన పన్నెండేళ్ల మహేష్‌, తొమ్మిదేళ్ల మాధవిల తల్లిదండ్రులు వారి చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయారు. అదే మండలం పెర్కపల్లికి చెందిన తొమ్మిదేళ్ల గంగోత్రికి కూడా అమ్మానాన్నాలేరు. ఆరేళ్ల వెంకటేష్‌కు తల్లి లేదు, తండ్రి జైల్లో ఉన్నాడు. వీరిలో ప్రతి చిన్నారీ కన్న తల్లికి దూరమైనా అమ్మ ప్రేమకు మాత్రం దూరంకాలేదు. ఈ చిన్నారులందరికీ దుర్గం భాగ్యలక్ష్మి యశోదమ్మగా మారి ప్రేమాప్యాయతలను పంచుతోంది. బెల్లంపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి వెంకటితో ముప్ఫై ఏళ్ల కిందట పెళ్లైంది. అతడు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. భాగ్యలక్ష్మికి హార్మోన్ల సమస్య ఉండటంతో వారికి సంతానం కలగలేదు. అనేక ఏళ్లపాటు హాస్పిటళ్ల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో బంధువుల అమ్మాయిని పెంచుకున్నారు. కానీ ఆమెకు వూహ తెలిశాక వీరిని వదిలి కన్నవారి దగ్గరకు వెళ్లిపోయింది. ఆ సంఘటన భాగ్యలక్ష్మి దంపతులకి బాధ కలిగించినా వారు త్వరగానే దాన్నుంచి కోలుకున్నారు.

సంస్థకు శ్రీకారం
భాగ్యలక్ష్మి, వెంకటి దంపతులు ఆ తర్వాత తమ జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేయాలనుకొని 1999లో ‘అమ్మ’ పేరుతో బెల్లంపల్లిలో ఓ సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కళాకారుల్ని ప్రోత్సహించేవారు. వీటితోపాటు అప్పుడప్పుడూ సేవా కార్యక్రమాల్నీ చేపట్టేవారు. తమ సొంత డబ్బుతోనే సంస్థను నడిపేవారు. తర్వాత్తర్వాత బెల్లంపల్లికే పరిమితం కాకుండా నిర్మల్‌, మంచిర్యాలతోపాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని మరికొన్ని చోట్ల కార్యక్రమాల్ని నిర్వహించేవారు. ఎన్ని చేస్తున్నా తల్లిదండ్రులు కాలేకపోయామన్న వెలితి ఆ దంపతులకు ఉండేది. ఆ మాధుర్యాన్ని చవిచూడాలని మూడేళ్ల కిందట బెల్లంపల్లిలో ‘అమ్మ’ పేరుతో అనాథశరణాలయాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం ఈ శరణాలయంలో 16 మంది బాలబాలికలు ఉంటున్నారు. వీరంతా చదువుకుంటున్నారు. వారిని పాఠశాలలకు తీసుకువెళ్లి తిరిగి తీసుకురావడానికి సొంత ఖర్చుతో ఆటోని కొన్నారు భాగ్యలక్ష్మి దంపతులు. పిల్లలకు ఎలాంటి లోటూ రానీయకుండా చూసుకుంటున్నారు. పిల్లలంతా భాగ్యలక్ష్మి, వెంకటిలను అమ్మ, నాన్న అని పిలుస్తుండటంతో సంతానంలేదన్న చింత వారిలో తీరిపోయింది. చిన్నారుల్లో కూడా తల్లిదండ్రులకు దూరమయ్యామన్న ఆలోచన రాకుండా ఎంతో మమకారంతో చూసుకుంటున్నారా దంపతులు. ఉదయం లేచింది మొదలు ఇంటిపనులూ, వంట పనులూ చేస్తూనే పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తూ తనలో ఎన్నాళ్లనుంచో దాగిన అమ్మప్రేమను చూపుతుంది భాగ్యలక్ష్మి. వెంకటి ఆర్టీసీలో ఇంఛార్జి స్క్వాడ్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆయన బాగోగులు చూసుకుంటూనే పిల్లల సంరక్షణనీ చూసుకుంటోంది భాగ్యలక్ష్మి.

నెలకు 25వేలు
ఉదయం అయిదింటికే నిద్రలేచే భాగ్యలక్ష్మి కాసేపటికి పిల్లలందరినీ నిద్రలేపి వారిచేత స్నానపానాలు పూర్తి చేయిస్తుంది. తర్వాత ధ్యానం, పూజ. ఎనిమిదింటికి టిఫిన్‌. పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటుండడంతో మధ్యాహ్న భోజనం అక్కడే. రోజూ స్కూల్‌ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలు తినడానికి ఏవైనా తినుబండారాలు పెడుతుంది. పిల్లలు సాయంత్రం ఆడుకున్న తర్వాత దగ్గరుండి వారందరినీ చదివిస్తుంది. ఎనిమిదింటికి మళ్లీ భోజనం పెట్టి రాత్రి 9:30కు పిల్లల్ని నిద్రపుచ్చుతుంది. పిల్లలంతా నిద్రపోయాకే ఆమెకు విరామం. అనాథశరణాలయం నిర్వహణకు నెలకు రూ.25 వేలు ఖర్చవుతుంది. వెంకటి ఉద్యోగ విరమణ సమయంలో వచ్చిన మొత్తంలో నాలుగు లక్షల రూపాయల్ని బ్యాంకులో పొదుపు చేశారు. ప్రతి నెలా ఆ మొత్తానికి కొంత వడ్డీ వస్తుంది. దాంతోపాటు వెంకటికి పింఛను రూపంలో వచ్చే రూ.6వేలు కూడా అనాథాశ్రమ నిర్వహణకే కేటాయిస్తున్నారు. వీరి ఔన్నత్యానికి ప్రోత్సాహంగా దాతలు బియ్యం, వంట సామగ్రి, దుస్తులు, ఇతర వస్తువులు అందిస్తుంటారు. సామాజిక స్పృహ ఉన్నవారు తమ పిల్లల పుట్టినరోజు వేడుకల్ని అనాథాశ్రమంలో నిర్వహిస్తూ వారికితోచిన సహాయం అందిస్తున్నారు. కొందరు విరాళాలూ ఇస్తుంటారు.

‘అనాథశరణాలయం స్థాపించడంవల్ల మాకు పిల్లలులేని లోటు తీరింది. ఈ పిల్లల్నే మా పిల్లలుగా చూసుకుంటున్నాం. మమ్మల్ని ప్రోత్సహిస్తూ దాతలు సహృదయంతో ముందుకొచ్చి విరాళాలతోపాటు దుస్తులూ, భోజనం సమకూర్చుతున్నారు. పిల్లలకు వసతి కోసం దగ్గర్లోని సింగరేణి క్వార్టర్స్‌లో ఇంటిని కేటాయించమని సంస్థ సీఎండీకి లేఖ రాశాం. క్వార్టర్స్‌ కేటాయిస్తే ఇంటి అద్దె, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. అప్పుడు మేం మరింత మంది పిల్లల్ని చేరదీయడనికి ఆస్కారం ఉంటుంది. దాతలు ముందుకు వస్తే పిల్లలకు ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తాం’ అని చెబుతారు భాగ్యలక్ష్మి, వెంకటి దంపతులు. అమ్మనాన్నల ప్రేమకు అవధులుండవు అనడానికి నిదర్శనమే ఈ దంపతులు.

- కాయల పూర్ణచందర్‌, ఆదిలాబాద్‌ డెస్క్‌
ఫొటోలు: వల్లబాయ్‌

 

 

చక్కని చిత్రలేఖనాలను గియ్యాలనీ మంచి చిత్రకారుడిగా గుర్తింపు పొందాలనీ చాలామంది కలలుగంటారు. కానీ దాన్ని నిజం చేసుకోవడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో ధవల్‌ఖత్రీ ఒకడు. ఈ ఒక్కడి గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే అతడికి రెండు చేతులూ లేవు గనుక.

నేను ఎగరేస్తే గాలిపటం ఎంతెత్తుకు ఎగురుతుందో తెలుసా... ఇవాళ అందరి పతంగులకన్నా నా పతంగే పైకెళ్తుంది చూడండి... అంటూ అహ్మదాబాద్‌లోని ఇసన్‌పూర్‌లో ఓ మేడమీద గాలిపటం ఎగరేస్తున్న పద్నాలుగేళ్ల పిల్లాడు చూసుకోకుండా అక్కడున్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లను పట్టుకున్నాడు. అంతే, షాక్‌ కొట్టి, ఒక్కసారిగా పైనుంచి కిందికి పడిపోయాడు. చుట్టుపక్కలున్నవాళ్లు పరుగెత్తుకుంటూ దగ్గరికెళ్లి చూస్తే అప్పటికే షాక్‌ వల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆ గుంపులో ఉన్న ఓ వైద్యుడు తక్షణమే స్పందించి చేతులతో గుండెమీద వెంటవెంటనే గట్టిగా నొక్కడంతో మళ్లీ వూపిరి పోసుకున్నాడు. తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. షాక్‌ వల్ల రెండు చేతులూ తీవ్రంగా దెబ్బతిన్నాయనీ ఆ చేతుల్ని తొలగించకపోతే ప్రాణాలకు ముప్పొచ్చే ప్రమాదం ఉందనీ శస్త్ర చికిత్స చేసి, రెండు చేతుల్నీ తీసేశారు వైద్యులు. ధవల్‌ కళ్లు తెరిచి చూసేసరికి అతడి చేతులు మోచేతుల వరకు మాత్రమే మిగిలాయి. దాంతో మరింత షాక్‌కి గురయ్యాడు. కానీ ‘చేతుల్లేకపోవడం కన్నా ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలు వైకల్యం’ అని తల్లి చెప్పిన మాటలను ధవల్‌ గట్టిగా నమ్మాడు.

ఆరునెలల్లో...
గాయం నయమవ్వగానే తల్లి అతడి రెండు మోచేతుల మధ్యలో పెన్సిల్‌ పెట్టి రాయడం నేర్చుకోమని ప్రోత్సహించింది. మొదట్లో పెన్ను పట్టుకోవడానికే చాలా కష్టపడ్డాడు. తర్వాత నెమ్మదిగా ఒక్కో అక్షరం రాయడం మొదలుపెట్టాడు. కానీ అలవాటు లేకపోవడంతో ఎక్కువసేపు మోచేతుల్తో పెన్ను పట్టుకుని రాయలేకపోయేవాడు. నొప్పిని భరిస్తూనే ఆరునెలల పాటు ఎంతో కష్టపడి పూర్తిస్థాయిలో వేగంగా రాయడం నేర్చుకున్నాడు. అంతలోనే ధవల్‌కి మరో ఎదురు దెబ్బ తగిలింది. అతడు చదివే పాఠశాల ప్రిన్సిపల్‌ ‘చేతుల్లేని నువ్వు చదువులో ఎలా ముందుకెళ్తావు ఇక స్కూలుకి రావొద్దు’ అన్నాడు. ఈసారీ ధవల్‌ నిరుత్సాహపడలేదు. మరో పాఠశాలలో చేరి మొండి చేతుల్తోనే పరీక్షలు రాసి పదోతరగతి పూర్తి చేశాడు. అదే స్ఫూర్తితో చిత్రలేఖనాలు వెయ్యడం నేర్చుకోవాలని, ఆ కోర్సులో చేరేందుకు కొన్ని కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ‘చేతుల్లేని వాళ్లు బొమ్మలు వెయ్యడం అసాధ్యం’ అంటూ ఎక్కడా సీటివ్వలేదు. ‘చేతులున్నవారికే ఏ కొద్దిమందికో అబ్బే విద్య అది. అలాంటిది నువ్వు పెయింటింగులు వేస్తావా...’ అని తెలిసినవారూ నిరుత్సాహపరిచేవారు. ధవల్‌ ఆత్మవిశ్వాసమూ అతడి పట్టుదలా అన్నిటికీ సమాధానం చెప్పాయి. అయిదేళ్లలో చూడచక్కని చిత్రలేఖనాలను అలవోకగా వెయ్యడం మొదలుపెట్టాడు. దేవుడి బొమ్మలూ, ఆకర్షణీయమైన సీనరీల నుంచి అమితాబ్‌బచ్చన్‌, సచిన్‌ తెందుల్కర్‌, కత్రినాకైఫ్‌ లాంటి సెలెబ్రిటీల వరకూ ఏ చిత్రమైనా అతడి కుంచె నుంచి జాలువారిందంటే అది చూడచక్కని కళాఖండమై తీరుతుంది.

ఓ పెయింటింగు గియ్యాలంటే... కుంచెతో ఒక్కో రంగును ఎంతో జాగ్రత్తగా కాగితం మీద అద్దాలి. గీసేటపుడు చేతిలోని కుంచె ఏమాత్రం అటూ ఇటూ జరిగినా జారినా అప్పటివరకూ వేసిన చిత్రం పనికిరాకుండా పోవచ్చు. అంటే చిత్రలేఖనం వెయ్యడానికి మనసుతో పాటు చేతులు కూడా చురుకుగా పనిచేయాలి. అందుకే, ఆ చేతులే లేకుండా ఇంత అందమైన చిత్రలేఖనాలకు ప్రాణం పోస్తున్న ధవల్‌ ఖత్రి ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యాడు. జాతీయస్థాయి ఛానెళ్లలోనూ షోలు చెయ్యమంటూ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాదు, అతడి పెయింటింగులు దేశ విదేశాల్లోనూ అమ్ముడుపోతున్నాయి. ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా సాధించొచ్చు అనడానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏముంది..?


 

 

లక్షల మందిలో ఒకే ఒక్కడు! 

ప్రపంచంతో పాటు మారేవాళ్లు కొందరుంటే, ప్రపంచాన్నే మార్చేవాళ్లు ఇంకొందరుంటారు. అంతర్జాతీయంగా అలాంటి మార్పు తీసుకొస్తోన్న పది మంది యువతీయువకులతో ప్రఖ్యాత ‘టైమ్‌’ సంస్థ ఇటీవలే ఓ జాబితా రూపొందించింది. అందులో చోటు దక్కించుకున్న ఒకేఒక్క భారతీయుడు ఉమేష్‌ సచ్‌దేవ్‌. మనుషుల మాటలకు స్పందించి పనిచేసేలా అతడు సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ గ్రామీణ భారతంలో పెను సంచలనం.

భారత్‌లో పంటలు పండని వూళ్లున్నాయేమో గానీ, సెల్‌ఫోన్‌ మోగని పల్లెలు మాత్రం లేవు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటికొక ఫోన్‌ ఉండటం చాలా మామూలు విషయమే. కానీ వాళ్లలో చాలామంది నిరక్షరాస్యులు కావడం వల్ల ఫోన్‌లో ఇంటర్నెట్‌ వాడలేకా, సందేశాలను చదువుకొని స్పందించడం రాకా బ్యాంకింగ్‌, వ్యవసాయం, ఇన్సూరెన్స్‌ తదితర రంగాల్లో సేవల్ని వినియోగించుకోవడంలో వెనకబడుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు, కొన్ని కోట్ల మంది గ్రామీణులది ఇదే సమస్య. వాళ్ల ఇబ్బందుల్ని దూరం చేయగల శక్తిమంతమైన ‘యామ్‌వాయిస్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ని ఉమేష్‌ సచ్‌దేవ్‌ రూపొందించాడు. భారత్‌లో ఏ భాషలో, ఏ యాసలో మాట్లాడినా అర్థం చేసుకొని, చెప్పిన పని చేయగల సామర్థ్యం ఈ సాఫ్ట్‌వేర్‌ సొంతం. దీని వల్ల లక్షల మంది గ్రామీణులు సులువుగా బ్యాంకింగ్‌ సేవలు పొందుతున్నారు. వ్యవసాయానికి సంబంధించిన సలహాలూ, సూచనలూ, వాతావరణ పరిస్థితులనూ తెలుసుకుంటున్నారు. మొత్తం మీద వాళ్లు కూడా ఆధునిక ప్రపంచంలో భాగమవుతున్నారు. ఆ మార్పుని తీసుకొచ్చినందుకే ఉమేష్‌ను టైమ్‌ సంస్థ ‘నెక్స్ట్‌ జనరేషన్‌ లీడర్స్‌’ జాబితాలో చేర్చింది.

మనిషి మాటే పాస్‌వర్డ్‌
ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఉంటే ఎక్కణ్ణుంచి ఎక్కడికైనా డబ్బులు పంపించడం నిమిషాలమీద పని. కానీ గ్రామాల్లో ఆ సదుపాయం లేని ఫోన్లూ, ఉన్నా వాటిని వినియోగించడం రాని వ్యక్తులే ఎక్కువ. ఉమేష్‌ సంస్థ ‘యూనిఫోర్‌’ తయారు చేసే సాఫ్ట్‌వేర్‌ వల్ల ఆ పని చాలా సులభమవుతుంది. సాధారణంగా బ్యాంక్‌ పౌరసేవల కేంద్రానికి ఫోన్‌ చేస్తే ఫలానా భాష కోసం ఒకటి నొక్కండీ, క్రెడిట్‌ సేవల కోసం రెండు నొక్కండీ, మీ బ్యాంక్‌ ఖాతా నంబరు నొక్కండీ అంటూ అనేక దశలు దాటాక కానీ బ్యాంకు ప్రతినిధితో మాట్లాడే అవకాశం రాదు. వీటిలో ఏ దశలో తెలీక తప్పు బటన్‌ నొక్కినా పనికాదు. కానీ యూనిఫోర్‌ తయారు చేసిన ‘యామ్‌వాయిస్‌’ సాఫ్ట్‌వేర్‌ మాట్లాడే వ్యక్తి గొంతుని బట్టే అతని వ్యక్తిగత వివరాలను గుర్తిస్తుంది. ఫలానా వ్యక్తి ఖాతాకు డబ్బుల్ని పంపించమని చెబితే ఆ పని చేస్తుంది. వేలి ముద్రల్లానే ప్రపంచంలో ఏ ఇద్దరి గొంతులూ ఒకలా ఉండవు. ఆ సిద్ధాంతం ఆధారంగానే ‘వాయిస్‌ బయోమెట్రిక్స్‌’ అనే సాంకేతికత సాయంతో ఫోన్‌ చేసిన వ్యక్తి గొంతును బట్టి అతడు ఎవరన్నది ఆ సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుంది. ‘వర్చ్యువల్‌ అసిస్టెన్స్‌’ పరిజ్ఞానంతో ఆ వ్యక్తి పదాల్ని ఎలా పలికినా, ప్రశ్నను ఎలా అడిగినా వివరాల్ని గుర్తించి జవాబిస్తుంది. ఓ రకంగా ఆ సాఫ్ట్‌వేర్‌ మనిషి మాటలకు స్పందించి పనిచేసే రోబో లాంటిదన్న మాట. మొత్తం పాతిక భాషల్నీ, నూట యాభైకి పైగా యాసల్నీ గుర్తించే సామర్థ్యం దానికి ఉంది. దాంతో దేశంలో ఫోన్‌ ఆధారిత సేవల్ని దాదాపు ప్రతి ఒక్కరికీ అందించగలదు. వివిధ రంగాల్లోని వందకు పైగా సంస్థలు ‘యూనిఫోర్‌’ సాంకేతికను ఉపయోగిస్తున్నాయి. దానివల్ల యాభై లక్షల మంది లాభపడుతున్నారు. సమయం, మానవ వనరుల వృథా బాగా తగ్గిపోయింది. భారత్‌లో ఐటీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, తమిళనాడు ప్రభుత్వం, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాంటి సంస్థలతో పాటు దుబాయ్‌, ఫిలిప్పీన్స్‌లోని అనేక కంపెనీలు వీళ్ల క్లయింట్ల జాబితాలో ఉన్నాయి.