close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కబోర్డులూ అందంగా...

కబోర్డులూ అందంగా...

గోడ మీద పెయింటింగ్‌ వేసినట్టు అందంగా కనిపించేలా చేసే వాల్‌ స్టిక్కర్లు మనకు సుపరిచితమే. అయితే ఈ మధ్య బట్టల్లాంటివి పెట్టుకునేందుకు వాడే కబోర్డులూ గోడలో సగం ఉండేలా చాలా పెద్దగానే చేయించుకుంటున్నారు. మరి అవి మాత్రం ఏ చెక్క రంగులోనో సాదాగా ఎందుకుండాలి? అందుకే వాటి కోసం కూడా చూడ చక్కని పెయింట్‌ వేసినట్టు రకరకాల పూలూ తీగలతో ఉండే స్టిక్కర్లు బజార్లో దొరుకుతున్నాయి. కబోర్డు సైజుని బట్టి మనకు నచ్చిన డిజైన్లను కొనుక్కొని అతికించేసుకోవడమే!


తొక్కతీయడం సులభం!

రుకైన మందపాటి చెక్కుతో ఉండే పైనాపిల్‌ను తరగడం కాస్త కష్టమైన పనే. ఈ పనినీ సులభంగా చేసుకునేందుకు సాయపడుతుంది ప్రోగ్రెసివ్‌ పైనాపిల్‌ కోరర్‌. ముందు పైనాపిల్‌ను రెండు ముక్కలు చేయాలి. తరువాత ఈ అర్ధచంద్రాకారంలో ఉండే కోరర్‌ను బొమ్మలో చూపినట్టు ఒక్కో ముక్క అంచున ఉంచి పై నుంచి కిందకు లాగితే ఒకేసారి చెక్కూ దాంతోపాటూ పండు మధ్యలోని తీసేయాల్సిన భాగం రెండూ వేరవుతాయి. ఇక, ఎంచక్కా ముక్కలు తరుక్కొని తినడమే!


పండూ డబ్బా మ్యాచింగ్‌!

ప్రయాణాల్లోనో ఆపీసులోనో పండ్లు తిందామని తీసుకువెళుతుంటాం. ఇలా తీసుకెళ్లేప్పుడు ఆ పండ్లకు మాత్రమే సరిపడేలా వాటి ఆకారంలోనే అరచేతిలో సరిపడే చిన్న చిన్న బాక్స్‌లు డిప్‌ టు గో కంటెయినర్స్‌ పేరిట బజార్లో దొరుకుతున్నాయి. చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తూ స్థలాన్ని ఆదా చేసే ఈ డబ్బాలు యాపిల్‌, ద్రాక్ష, మామిడి, నారింజలాంటి పండ్ల ఆకృతుల్లోనూ దొరుకుతున్నాయి. సగం తరిగి పెట్టిన నిమ్మ ముక్క, లేదా ఉల్లిగడ్డ, సలాడ్ల కోసం తరిగి మిగిలిన టామాటా ముక్కలను భద్రపరచుకునేందుకు అచ్చం వాటి రూపాల్లోనే ఉన్న ఫుడ్‌ సేవర్‌ కంటెయినర్లూ దొరుకుతున్నాయి. చిన్నగా, గట్టి మూతను కలిగి ఉండే వీటిలో ఆయా పదార్థాలను ఉంచి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిలవ ఉంటాయట కూడా!


  కొవ్వొత్తి గుటుక్కు!

వేడుకలకు కేకు కత్తిరించడం మామూలే. దాని మీద అలంకరణ కోసం రకరకాల కొవ్వొత్తులను వాడుతుంటాం. కట్‌ చేయడం పూర్తవగానే కేకును తిన్నట్టు, ఇప్పుడు దానిమీది కొవ్వొత్తులను కూడా తినొచ్చు. ఎందుకంటే ఎడిబుల్‌ క్యాండిల్స్‌ పేరిట కొవ్వొత్తులు చాక్లెట్‌తో తయారై వస్తున్నాయి. అందులోనూ మిల్క్‌ చాకొలేట్‌, డార్క్‌ చాకొలేట్‌ లాంటి ఫ్లేవర్లూ ఉంటున్నాయి. అచ్చం కొవ్వొత్తుల్లా తయారు చేసిన వీటిపైన కొద్దిసేపు వెలిగేలా చిన్న ఒత్తి ఉంటుంది. కొవ్వొత్తిని ఆర్పేయగానే ఒత్తి తీసేసి వీటిని తినొచ్చు.


ఒంపుగానూ పెట్టొచ్చు!

డీప్‌ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్‌ కోసం రెండు నుంచి నాలుగు ట్రేలు పట్టేలా ఛాంబర్‌లుంటాయి. లేదంటే ఐస్‌క్యూబ్‌ట్రేలో నీళ్లు పోసి దాన్ని అటూ ఇటూ ఒరగకుండా సమానంగా డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. అలాంటప్పుడు డీప్‌ ఫ్రీజర్‌లో మందులూ, ఐస్‌క్రీం డబ్బాలూ మరేవైనా వస్తువులు పెట్టుకోవడం కష్టం. సిలికాన్‌ మూతతో ఉండే స్పిల్‌ప్రూఫ్‌ ఐస్‌క్యూబ్‌ ట్రేలతో ఆ బాధ ఉండదు. వస్తువులతో పాటూ వంపుగా నిలువుగా అవకాశాన్ని బట్టి ఎలా అయినా పెట్టుకొని వీటిలో ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకోవచ్చు. మరిన్ని ఐస్‌క్యూబ్స్‌ కావాలనుకున్నప్పుడు ఈ ట్రేలను ఒకదాని మీద ఒకటి అమర్చి పెట్టుకోవచ్చు కూడా. మూత ఉండటం వల్ల ఫ్రీజర్‌లో ఉండే ఇతర పదార్థాల వాసనా ఈ ఐస్‌క్యూబ్‌లకు పట్టదు. బాగున్నాయి కదూ కొత్త రకం ట్రేలు!  


 

 

ఫ్యాషన్‌గా ఉన్నాయి కదా అని జుంకాలు కొనుక్కుంటాం... కానీ వాటికి నప్పే గొలుసు ఉండదు. రంగులు ముచ్చటగొలుపుతున్నాయి కదా అని గాజులు కొని తెచ్చుకుంటాం... వాటితో సరితూగే దుద్దులు దొరకవు. ఇన్నాళ్లూ సిల్క్‌థ్రెడ్‌ జువెలరీ విషయంలో యువ ఫ్యాషన్‌ ప్రేమికులు పడుతున్న కష్టాన్ని తెలుసుకున్నారేమో... ఎంచక్కా గాజులూ, కమ్మలను గొలుసుతో కలిపి సెట్‌చేసి సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి తెస్తున్నారు డిజైనర్లు... ఇవన్నీ దారాలతో చేసినవా అనిపించేలా ఎంత బాగున్నాయో కదూ!

ఫ్యాషన్‌ మనిషిలోని కళా హృదయాన్ని తట్టి లేపుతుంది. అతన్ని సృజనాత్మకత వెంట పరుగులు పెట్టిస్తుంది. అదే కళా సృజనకు దారి తీస్తుంది. దాని ఫలితాలే ఇప్పుడు మనం పెట్టుకుంటున్న ఎన్నో రకాల గొలుసులూ, వేసుకుంటున్న విభిన్న డిజైన్ల బట్టలూ, ధరిస్తున్న రకరకాల యాక్సెసరీలూ. మట్టిగాజుకు దారాన్ని చుట్టి చూడముచ్చటగా చేయొచ్చన్న మనిషి ఆలోచనా అక్కడిదే. అది దుద్దు నుంచీ గొలుసుకు పాకి, ఆ దారాల అల్లికా రాళ్లూ, కుందన్లూ, పూసల్లాంటి బోలెడు జిలుగులద్దుకొని... సాఫ్ట్‌వేర్‌ వర్షన్‌ అప్‌డేట్‌ అయినట్టు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అప్‌డేటెడ్‌ సిల్క్‌ థ్రెడ్‌ జువెలరీ సెట్లు ముస్తాబయ్యాయి. మరి రంగురంగుల దారాలతో మనసుకి నచ్చే బోలెడు డిజైన్లలో వస్తున్న ఈ నగలను అమ్మాయిలు తెగ ఇష్టపడుతుండటంలో ఆశ్చర్యమేముందీ!

దుస్తులకు మ్యాచయ్యేలా...

 ఈ దారపు అల్లికల నగల్లో జుంకాలూ, గొలుసూ, దుద్దులతో కలిపిన సెట్లలో సంప్రదాయబద్ధంగా ఉండేవీ, ఫ్యాషన్‌ దుస్తుల మీదకి సరిపడేవీ కూడా వస్తున్నాయి. కేవలం ఒకే రంగు దారంతో చేసినవీ, రెండు మూడు రంగులు మొదలుకొని విభిన్న వర్ణాల కలబోతగా తయారవుతున్నవీ బజార్లో దొరుకుతున్నాయి. చూడచక్కని రాళ్లూ, కుందన్లూ, చిన్న చిన్న రాళ్ల బిళ్లలూ, లేసులూ, పూసలతో వీటిని అందంగా అలంకరిస్తున్నారు. అదే, ప్రత్యేకంగా మనకు ఇష్టమైన డ్రెస్సుకు నప్పేట్టూ, లేదా చీరకు సరిపడేట్టూ ఈ తరహా నగలు కావాలనుకునే వాళ్లకు ఫేస్‌బుక్‌లో ఎన్నో సంస్థలు సేవలందిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ పేజీలూ, లేదా వెబ్‌సైట్ల ద్వారా వారిని సంప్రదించి, మనం మ్యాచింగ్‌ నగలను తయారు చేయించుకోవాలనుకుంటున్న దుస్తుల చిత్రాలను పంపితే కేవలం ఆ దుస్తుల్లో ఉన్న దారాల రంగులతోనే మనకు నచ్చిన అందమైన నగలను తయారు చేసిస్తారు. వీటికి చాంద్‌బాలీ, హ్యాంగింగ్స్‌, బుట్టలతో ఉండే రకరకాల జుంకాలు మనమే తయారు చేయించుకోవచ్చు. గాజుల్లోనూ సెట్టుగా వచ్చేవీ, లేదా ఒకటీ రెండూ వచ్చే లావు గాజులూ, లేదా ఒక్కోగాజూ ఒక్కో రకంగా ఉండే స్టేక్డ్‌ గాజులూ ఎంచుకోవచ్చు. ఇక గొలుసుల్లోని లాకెట్ల మోడళ్లకైతే లెక్కేలేదు. పట్టు చీరకు నిండుగా, సల్వార్‌కు హుందాగా, ఫ్యాషన్‌ దుస్తులకు ఫంకీగా ఇలా విభిన్నంగా ఇవి రూపొందుతున్నాయి. ధరలు డిజైన్లను బట్టి నాలుగైదు వందల నుంచి వేల రూపాయల వరకూ ఉంటాయి. అలా కాకుండా మనమే వీటిని స్వయంగా తయారు చేసుకోవాలనుకుంటే ఇంటర్‌నెట్లో బోలెడు వీడియోలూ, సమాచారం ఉంటుంది. వస్తువులన్నీ ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. మనం పెట్టుకునేందుకే కాదు, ప్రియమైన వాళ్లకి కానుకగా ఇచ్చేందుకూ ఈ నగలు ఎంతో బాగుంటాయి. మీరూ ప్రయత్నిస్తారా మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.