close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ చెత్త వేస్తే జరిమానా కట్టాలి!

అక్కడ చెత్త వేస్తే జరిమానా కట్టాలి!

హిమాలయ పర్వతసానువుల్లోని అందాలనీ అక్కడి జీవనసౌందర్యాన్నీ ఆసాంతం ఆస్వాదించాలంటే సిక్కింలోని గ్యాంగ్‌టక్‌, పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ పట్టణాలను తప్పక సందర్శించాల్సిందే’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు వైజాగ్‌కు చెందిన ఆర్‌.సుబ్బారావు.

కప్పుడు నేపాల్‌, భూటాన్‌ తరహాలో సిక్కిం కూడా స్వతంత్రదేశమే. 1975లో విదేశీయుల ఆక్రమణలకు తట్టుకోలేక ప్రజల అభిప్రాయ సేకరణను అనుసరించి భారత్‌లో 22వ రాష్ట్రంగా మారింది. అక్కడకు వెళ్లాలంటే పశ్చిమబెంగాల్‌మీదగానే వెళ్లాలి. అందుకే ముందుగా మేం కోల్‌కతా చేరి సాయంత్రం వరకూ విక్టోరియా మెమోరియల్‌నూ దక్షిణేశ్వర్‌లోని కాళీ మందిరాన్నీ చూశాం. అది చూశాక దగ్గరలో ఉన్న శీతలామాత ఆలయాన్ని సందర్శించాం. అందులో 1935లో బ్రిటిష్‌వారు జారీచేసిన తపాలాబిళ్ల నమూనాని జాగ్రత్తగా భద్రపరిచారు. ఆ మందిరాన్ని సర్వాంగసుందరంగా 150 సంవత్సరాలనుంచీ పరిరక్షిస్తుండటం విశేషం. అక్కడ నుంచి బిర్లా ప్లానెటోరియానికి వెళ్లి అది చూశాక, సియాల్డా స్టేషన్‌లో డార్జిలింగ్‌ మెయిల్‌ ఎక్కి న్యూజల్‌పాయ్‌గుడికి చేరుకున్నాం. అక్కడ మాకోసం ఉన్న ట్యాక్సీలో గ్యాంగ్‌టక్‌కు బయలుదేరాం. ఈ దారిలో కంచనజంగ పర్వతం అప్పుడప్పుడూ కనిపిస్తూ మాయమవుతూ మనతో దాగుడుమూతలాడుతున్నట్లే అనిపిస్తుంది. సిక్కిం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలను వేరు చేసే తీస్తానది ప్రవాహం కనువిందు చేస్తుంటుంది. ఐదు గంటలు ప్రయాణించాక గ్యాంగ్‌టక్‌ పొలిమేరలకు చేరుకున్నాం.

సముద్రమట్టానికి 5,410 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రాష్ట్ర జనాభా లక్ష దాటదు. నేపాలీ, సిక్కిమీస్‌, తమంగ్‌, లింబు, లెప్చా, గురుంగ్‌, మగర్‌, సున్వర్‌ రాయ్‌, నెవరీ... ఇలా సిక్కిం వాసులు పలు భాషలు మాట్లాడుతుంటారు. కానీ హిందీ, ఇంగ్లిష్‌ భాషల్ని చక్కగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ వాతావరణం ఏడాది పొడవునా 4 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. ఇక్కడ రోడ్లు ఇరుకుగా ఉండటంతో పెద్ద వాహనాలను ఉదయం నుంచి రాత్రి 8 గంటలవరకూ టౌనులో ప్రవేశించేందుకు అనుమతించరు. వూరి పొలిమేరల్లోని టాక్సీస్టాండులో ఆపి, చిన్న చిన్న ట్యాక్సీల్లో వాళ్లను హోటళ్లకు చేరుస్తారు. మేం బస చేసిన హోటల్‌ మాల్‌ రోడ్డులో ఉంది. అది ఓ విశాలమైన వీధి. ఇక్కడ పాదచారులకు మాత్రమే అనుమతి. ఈ వీధిలో గృహావసరాలకు కావలసినవన్నీ దొరకుతాయి. రోడ్డుమీద చెత్త వేసినా ఉమ్మి వేసినా జరిమానా కట్టాలి. రోడ్లను నిరంతరం శుభ్రం చేస్తూనే ఉంటారు. ప్రతీ షాపు ముందూ చెత్త డబ్బా తప్పక ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్‌ సంచులూ పొగాకు ఉత్పత్తుల అమ్మకమూ నిషిద్ధం. ఇక్కడ తిరుగుతూ ఉంటే విదేశాల్లో తిరుగుతున్న అనుభూతి కలిగింది. మనదేశంలోనూ ఇంత శుభ్రమైన వీధులు ఉన్నాయన్న విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆంగ్లేయుల కాలంలో ఈ ప్రాంతాన్ని స్విట్జర్లాండ్‌తో పోల్చేవారట.

నాథులాపాస్‌...
గ్యాంగ్‌టక్‌ ప్రజలకు పర్యటకరంగమే జీవనాధారం. ప్రజలు చట్టాలను గౌరవిస్తారు. పాటిస్తారు. పట్టణమంతా ఎత్తుపల్లాలతో ఉంటుంది. ఇక్కడ బౌద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన రమ్‌టెక్‌ మొనాస్టరీని దర్శించాం. ఇక్కడ బౌద్ధమతం గురించిన అతి ప్రాచీన గ్రంథాలను భద్రపరిచారు. ఆ మర్నాడు ఉదయాన్నే తయారై టిఫిన్‌ తిని, సిక్కింకు పశ్చిమదిశగా చైనాకు సరిహద్దుగా ఉన్న నాథులాకు బయలుదేరాం. కొండల మధ్య ఉన్న మార్గాన్నే పాస్‌ అంటారు. అందుకే అక్కడకు వెళ్లే దారికి నాథులా పాస్‌ అని పేరు. నాథులాకి వెళ్లడానికి ఆర్మీ వాళ్ల అనుమతి తప్పనిసరి. సోమ, మంగళవారాల్లో పర్యటకుల్ని అనుమతించరు. ఆ దారిలో తినడానికీ తాగడానికీ ఏమీ దొరకవని చెప్పడంతో అన్నీ వెంట తీసుకెళ్లాం. అక్కడ ప్రతిరోజూ మధ్యాహ్న సమయానికి ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ నుంచి వెనుతిరిగి రాలేం. కొండచరియలు విరిగిపడతాయట. అప్పుడు పర్యటకులకు భారత సైనికుల ఆతిథ్యమే శరణ్యం. మా ట్యాక్సీ అతివేగంగా దూసుకుపోతుంది. ఎప్పుడు పది వేల అడుగుల ఎత్తుకు చేరామో తెలియదు. ‘మార్గమధ్యంలో ఎక్కడా వాహనాలను ఆపకూడదు’, ‘మిమ్మల్ని మేం గమనిస్తున్నాం’ అన్న హిందీ, ఇంగ్లీషు బోర్డులను దాటుకుంటూ 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న నాథులాకి చేరుకున్నాం. దాన్ని చూడగానే మా మనసు ఏదో తెలియని అనుభూతితో నిండిపోయింది. ఇక్కడ ప్రాణవాయువు తక్కువ. చిన్న ఆక్సిజన్‌ సిలిండర్లను వెంట తీసుకెళ్లవచ్చు. మాతో వచ్చినవాళ్లలో వూపిరి తీసుకోవడం కష్టమైనవాళ్లు ఇన్‌హేలర్లూ కర్పూరం ముద్దల వాసన చూశారు. కాస్త కుదుటపడ్డాక మళ్లీ బయలుదేరాం. అక్కడ నుంచి వెనక్కి వచ్చేయొచ్చు కానీ, మేం సరిహద్దును చూడాలన్న కోరికతో ముందుకే వెళ్లాం. అక్కడకు సుమారు 200 అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. అది అమరజవాన్లకి నివాళులు అర్పించే ప్రదేశం. దాని పక్కనే ఆర్మీ క్యాంటీను ఉంది. అది దాటి ఇంకాస్త పైకి వెళితే ఆర్మీ ఆఫీసర్ల మెస్‌ వస్తుంది. రెండో వైపున ఐదు అడుగుల ఎత్తులో రెండు అడుగుల వెడల్పున తెల్లని సిమెంట్‌ గోడ కనిపించింది. అదే భారత్‌-చైనా దేశాల అంతర్జాతీయ సరిహద్దు. ఆ గోడకి రెండోవైపున చైనా జవాన్లు తిరుగుతూ మన పర్యటకులతో కరచాలనం చేస్తూ ఫొటోలకి పోజులు ఇస్తుంటారు. మేం ఫొటోలు తీసుకుని కొంచెం కిందకి వచ్చేసరికి పక్కనే ఉన్న క్యాంటీన్‌లో కాఫీ, టీ తాగి సేదతీరమని చెప్పారు అక్కడి రక్షణ అధికారులు. అక్కడే నాథులాపాస్‌కు సంబంధించిన వివరాలను చదివాం. చైనా నుంచి భారత్‌కు నాథులా దగ్గర ఉన్న పూర్వకాలం నాటి వ్యాపార మార్గాన్ని ‘ఓల్డ్‌ సిల్కు రూట్‌’ అని పిలిచేవారు. ఇది గ్యాంగ్‌టక్‌కి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం టిబెట్‌ నుంచి వ్యాపారులు ఈ దారిలోనే యాక్‌లూ, కంచరగాడిదలమీద సిల్కు వస్త్రాలూ, బంగారం వంటివి తీసుకొచ్చి దైనందిన అవసరాలకు కావలసినవి తీసుకెళ్లేవారట. 1962లో చైనాతో జరిగిన యుద్ధ సమయంలో ఈ దారిని మూసివేశారు. మళ్లీ 2006లో తెరిచారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వ్యాపారానికి కావలసిన సదుపాయాలతో పెద్ద మార్కెట్‌ యార్డు, దానికి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. ఈ దారిలోనే దలైలామా, అప్పటి భారత ప్రధాని నెహ్రూ, ఇందిర వంటి ప్రముఖులు భూటాన్‌ యాత్రకు వెళ్లేవారట.

చాంగూ సరస్సు!
మా తిరుగు ప్రయాణంలో బాబా మందిర్‌ దగ్గర ఆగాం. 1967లో జరిగిన చైనా యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్‌ హర్‌భజన్‌సింగ్‌ను సైనికాధికారులు ఓ సెయింట్‌లా భావించి పూజిస్తారు. అక్కడ ప్రతిరోజూ పూజాకార్యక్రమాలు జరుగుతుంటాయి. బాబాకి నమస్కరించి చాంగూ సరస్సుకి చేరుకున్నాం. ఇది గ్యాంగ్‌టక్‌కి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులోని నీళ్లు నీలంగా ఉంటాయి. శీతాకాలంలో ఇది పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. ఇక్కడ పర్యటకులకోసం చిన్న హోటళ్లు ఉన్నాయి. పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్థానికులకు స్థలాన్ని ఉచితంగా ఇచ్చిందట. పర్యటకులంతా సిక్కిం సంప్రదాయ దుస్తులు ధరించి యాక్‌లమీద ఎక్కి తిరుగుతూ ఫొటోలు తీసుకుంటారు. మేం ఆ రాత్రికి అక్కడే సేదతీరాం.

మర్నాడు దగ్గరలోని హనుమాన్‌ మందిర్‌కి వెళ్లాం. సంజీవని పర్వతం తీసుకువస్తూ మారుతి ఇక్కడే విశ్రమించాడన్నది పురాణ కథనం. ఈ గుడి నిర్వహణ పూర్తిగా సైనికాధికారుల చేతుల్లో ఉంటుంది. రకరకాల పూల మొక్కలతో పచ్చని మైదానాలతో ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం అనుకూలిస్తే ఇక్కడి నుంచి హిమాలయ శిఖరాల్లోని ఎత్తైన కంచనజంగ శిఖరాన్ని దర్శించవచ్చు. అక్కడకి కొంచెం దూరంలో మరో చిన్న కొండమీద గణేశ్‌ మందిర్‌ ఉంది. సమీపంలో ఉన్న జలపాతాలనూ చూసి మధ్యాహ్నానికి డార్జిలింగ్‌కు చేరుకున్నాం.

డార్జిలింగ్‌ కూడా 19వ శతాబ్దానికి ముందు గ్యాంగ్‌టక్‌లానే పక్కదేశాల ఆధిపత్యానికి తలొగ్గింది. తరవాత సిక్కిం రాజ్యంలో భాగమైంది. ఆ తరవాత ఈస్టిండియా కంపెనీ దీన్ని ఆక్రమించుకుని వేసవి విడిదిగా మార్చింది. స్వాతంత్య్రం తరవాత ఇది పశ్చిమబెంగాల్‌లో భాగమైంది. ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 9 నుంచి 16 డిగ్రీల సెంటీగ్రేడుల మధ్యే ఉంటుంది. అందుకే ఇక్కడ ఫ్యాన్లూ ఏసీలూ ఉండవు. ఇక్కడ కూడా గ్యాంగ్‌టక్‌ మాదిరిగానే భారీ వాహనాలమీద ఆంక్షలు ఉన్నాయి. రాత్రివేళలోనే అవి నడుస్తాయి. రహదార్లు వేర్వేరు ఎత్తుల్లో ఉండటంవల్ల పాదచారులకు మెట్ల మార్గాలు ఉన్నాయి. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే గొడుగుని ఎప్పుడూ వెంట ఉంచుకుంటారు. వూరు చాలా ఇరుకు. పచారీ దుకాణాలు రైల్వే లైన్లకి ఆనుకునే ఉంటాయి. రైలు వస్తుందని తెలియగానే సామాన్లు వెనక్కి తీసుకుని రైలుకి దారి ఇస్తుంటారు.

డార్జిలింగ్‌లో చూడదగ్గ పర్యటక స్థలం టైగర్‌ హిల్‌. ఇక్కడి నుంచి సూర్యోదయం చూడటం ఈ పర్యటనలో ముఖ్యమైన ఘట్టం. దానికోసమే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ట్యాక్సీలో బయలుదేరాం. నాలుగు గంటలకే పర్వత శిఖరాలు రంగులు మారుతూ కనువిందు చేస్తాయట. వాటిని దర్శించడానికి నాలుగు అంతస్తుల భవనాన్ని ఏర్పాటుచేశారు. మేం వెళ్లి నిలబడ్డాం కానీ ఆ రోజు ఆకాశం మేఘావృతమై ఉండటంతో రంగురంగుల హిమపర్వత శిఖర సౌందర్యాన్ని చూడలేకపోయాం. అక్కడ నుంచి నేరుగా ప్రఖ్యాత బౌద్ధారామం ఘూమ్‌ మోనాస్టరీని చూసి, బటాసియా లూప్‌ అన్న ప్రదేశంలో అమర జవాన్ల స్థూపాన్ని సందర్శించి నమస్కరించాం. ఆ తరవాత జంతుప్రదర్శనశాలనీ, హిమాలయ పర్వతారోహణ సంస్థనీ చూశాం. మొట్టమొదట ఎవరెస్ట్‌ను అధిరోహించిన టెన్జింగ్‌ నార్గె, ఎడ్మండ్‌ హిల్లరీలు ఈ పర్వతారోహణ సంస్థని ఏర్పాటుచేశారట. అందులో హిమాలయాల నైసర్గిక స్వరూపాన్ని త్రీడీ నమూనాలో ఉంచారు. హిమాలయాల్లో శిఖరాలను విద్యుత్‌ బల్బుల సహాయంతో గుర్తుపట్టవచ్చు. ఇక్కడి వస్తు ప్రదర్శనశాలలో మమ్మల్ని ప్రత్యేకంగా ఆకర్షించినవి కాకి, గద్ద, ఉడుతల నమూనాలు. హిమాలయాల్లో ఎగిరే కాకి, మనం చూసే కాకికి రెండు రెట్ల పరిమాణంలో ఉంది. ఎవరెస్టు శిఖరం దగ్గర ఎగిరే గద్ద కూడా వూహించలేనంత సైజులో ఉంది. హిమాలయాల్లో కనిపించే ఉడత పిల్లి పరిమాణంలో ఉంది. ఈ సంస్థకి సమీపంలోనే టెన్జింగ్‌ రాక్‌ అని ఓ పెద్ద బండరాతిని అమర్చారు. పర్వతారోహణలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు అది ఎక్కి ప్రాక్టీసు చేస్తుంటారు. తరవాత జపనీస్‌ టెంపుల్‌, పీస్‌ పగోడాలను చూసి, టీ షాపుల దగ్గరకు వెళ్లాం. అక్కడ రకరకాల టీల గురించి తెలుసుకున్నాం. రుచి చూసి నచ్చిన టీ పొడిని కొనుక్కోవడం ఈ షాపుల ప్రత్యేకత. మేం కూడా ఓ రకం టీపొడి కొన్నాం. దాని ధర కిలో రూ. 4,500. మర్నాడు ఉదయాన్నే అల్పాహారం తినేందుకు బయల్దేరగా ఆకాశంలో మబ్బులుపోయి హిమశిఖర దర్శనం అయింది. అది చూసి ఆనందంతో మా మనసులు నిండిపోయాయి. ఫొటోలు తీసుకుని సంతృప్తిగా వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.