close
ఈ స్థాయికొస్తానని వూహించలేదు!

ఈ స్థాయికొస్తానని వూహించలేదు!

హీరోలూ, హీరోయిన్లూ, డైరెక్టర్లే కాదు, సంగీత దర్శకులకు కూడా యాభై సినిమాలు చేయడం కష్టమైన పనే. సమకాలీన సంగీత దర్శకుల్లో ఆ ఘనత సాధించిన అతి కొద్ది మందిలో ఈ మధ్యే సాయి కార్తీక్‌ కూడా చేరాడు. ‘పైసా’, ‘రౌడీ’, ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’ లాంటి విజయవంతమైన సినిమాలకు పనిచేసిన కార్తీక్‌ తాజాగా ‘రాజా చెయ్యి వేస్తే’తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా హాఫ్‌ సెంచరీ కొట్టాడు. ఆర్కెస్ట్రా టు వెండితెర వయా ఎదురు చూపులూ, ఎదురు దెబ్బలూ... ఆ ప్రయాణంలో కూడా అతడి పాటలకున్నంత కిక్కుంటుంది...

‘అప్పుడే యాభై సినిమాలు అయిపోయాయా’... ఈ మధ్య కాలంలో చాలామంది ఆశ్చర్యంతో నన్నడిగిన ప్రశ్న ఇది. వాళ్లంతా అలా అవాక్కవడానికి చాలా కారణాలున్నాయి. అందరికీ నేను ఆర్కెస్ట్రాల్లో, లైవ్‌ షోల్లో మణిశర్మ, కోటీ, ఆర్పీ పట్నాయక్‌ లాంటి వాళ్ల దగ్గర రిథమ్‌ ప్యాడ్స్‌ వాయించే కార్తీక్‌గానే తెలుసు. సినిమాల్లోకి వచ్చాననీ, సంగీతం చేస్తున్నాననీ కూడా చాలా రోజుల పాటు ఎక్కువమందికి తెలీదు. అంతెందుకు... అసలు సినిమాల్లోకి వస్తానని నేనే ఎప్పుడూ వూహించలేదు. అలాంటిది ఓసారి అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దానికి నా కష్టం, నైపుణ్యం తోడయ్యాయి. అలా అలా నెమ్మదిగా మొదలైన ప్రయాణం ఏడాదికి సగటున ఆరేడు సినిమాలు చేసే స్థాయికి చేరింది. ఈ విజయాలకు పునాది నాకు వూహ కూడా తెలీని వయసులో పడింది. నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలులో. నాన్న శ్రీనివాస్‌, అమ్మ నాగమణీ, ఇద్దరూ సంగీత కళాకారులే. నాన్న తబలా వాయించేవారు, అమ్మ గాయని. మాకు సొంతంగా ఓ ఆర్కెస్ట్రా బృందం ఉంది. మా అక్క శిరీష కూడా బాగా పాడుతుంది. అలా నాతో పాటే పాటతో నా అనుబంధమూ పెరుగుతూ వచ్చింది..

అక్కినేని మెచ్చుకున్నారు...
నాకు ఏడెనిమిదేళ్ల వయసొచ్చేసరికి ఇంట్లో ఏదో ఒక వాద్యాన్ని వాయిస్తూ ఉండేవాణ్ణి. నా ఆసక్తిని చూసి మా కాంపౌండ్‌లోనే ఉండే చెల్లమ్మ అనే తమిళియన్‌ ఒకరు నాకు సంగీతం నేర్పిస్తానన్నారు. అలా ఆవిడ దగ్గర కొన్నాళ్లు క్లాసికల్‌, హార్మోనియం నేర్చుకున్నా. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి అమ్మానాన్నలతో కలిసి ఓ స్టేజీ షోలో పాల్గొన్నాను. అప్పట్నుంచీ క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనల్లో పాల్గొంటూ వచ్చా. రిథమ్‌ ప్యాడ్స్‌ కార్తీక్‌గా నాకు మంచి పేరొచ్చింది. చిన్నప్పుడోసారి రవీంద్రభారతిలో ఘంటసాల పాటల కచేరిలో వాయిస్తున్నప్పుడు, అక్కడికొచ్చిన అక్కినేని నాగశ్వేరరావుగారు నన్ను మెచ్చుకుంటూ, ‘వాడు కనిపించట్లేదు, ఒక స్టూల్‌ వేయించండి’ అనడం నేనెప్పటికీ మరచిపోలేను. నా పదో తరగతి పరీక్షలూ, శ్రీరామనవమీ ఒకేసారి వచ్చాయి. ఆ తొమ్మిది రోజులూ పొద్దున్న పరీక్ష రాసి సాయంత్రం ప్రదర్శనల్లో పాల్గొనేవాణ్ణి. దాంతో ఇంట్లో వాళ్లు నేను పాసైతే చాలనుకున్నారు. కానీ ఫస్ట్‌క్లాస్‌తోనే టెన్త్‌ పూర్తయింది.

ఒక ఏడాది గడువు!
పదో తరగతి అవగానే అమ్మానాన్నా నాకు రెండు దార్లు చూపించారు. ఒకటి పై చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడటం. రెండోది చెన్నై వెళ్లి కీబోర్డు నేర్చుకోవడం. నేను పుట్టకముందు అమ్మానాన్నా చెన్నైలోనే ఉండేవారు. అక్కడ సంగీతంలో పోటీ తట్టుకోలేక ఒంగోలుకి వచ్చేశారు. నాన్నగారికి మొదట్నుంచీ నన్ను కీబోర్డు ప్లేయర్‌గా చూడాలని ఉండేది. నాకెలాగూ సంగీతమంటే ఇష్టమే కాబట్టి, చెన్నై వెళ్లి బాగా పేరు తెచ్చుకుని అమ్మానాన్నలని మళ్లీ అక్కడికి తీసుకెళ్లాలని అనిపించింది. దాంతో ఒక ఏడాది చెన్నైలో సంగీతం నేర్చుకుంటాననీ, సరిగా నేర్చుకోలేకపోతే వచ్చి ఇంటర్‌లో చేరతాననీ చెప్పా. చెన్నైలో ఫ్లూటిస్ట్‌ కిరణ్‌ కుమార్‌, సింగర్‌ రామూగార్ల దగ్గర నన్ను చేర్పించారు. వాళ్లు నా రిథమ్‌ ప్యాడ్స్‌ నైపుణ్యాన్ని చూసి, చిన్న చిన్న షోలు చేసుకుంటూనే కీబోర్డు నేర్చుకోమని చెప్పారు. చెన్నైలో క్రమంగా రిథమ్‌ ప్యాడ్‌ ప్లేయర్‌గా బిజీ అవడంతో కీబోర్డు నేర్చుకోవడానికి సమయం కేటాయించలేకపోయా.

గాయనితో పెళ్లి...
చెన్నైలో ఉన్నప్పుడు ఒక షోకి రెండొందల దాకా ఇచ్చేవారు. నాన్నను అడిగే అవసరం రాకుండా వాటిలోనే జాగ్రత్తగా ఖర్చుపెట్టేవాణ్ణి. ఒక్కోసారి ఏ ప్రోగ్రాంలూ లేనప్పుడు డబ్బులుండేవి కాదు. ఆ విషయం చెబితే నన్ను ఇంటికి రప్పిస్తారని భయపడి అమ్మావాళ్లకు చెప్పేవాణ్ణి కాదు. కొన్నాళ్లకు షోల్లో అవకాశాలు పెరగడం, నాకూ పేరు రావడంతో సినీ సంగీత దర్శకుల దృష్టిలోనూ పడ్డా. జి.ఆనంద్‌, వాసూ రావు, కోటీ, మణిశర్మ లాంటి మ్యూజిక్‌ డైరెక్టర్ల లైవ్‌ షోలకు రిథమ్‌ ప్యాడ్స్‌ వాయించడం మొదలుపెట్టా. వాళ్లందరికీ నా వేగం నచ్చడంతో వాళ్ల బృందాల్లో శాశ్వత సభ్యుడిలా మారిపోయా. మరోపక్క నాన్నకు నేను కీబోర్డు ప్లేయర్‌ని అవ్వట్లేదన్న టెన్షన్‌ ఉండేది. దాంతో ఓసారి కోటీగారు ‘ఏ వాద్యమైతే ఏంటీ, మీ వాడు రాణిస్తున్నాడుగా’ అని నాన్నకు నచ్చజెప్పారు. తరవాత మొత్తం లైవ్‌ షోలే నా ప్రపంచంగా మారిపోయాయి. శంకర్‌ మహదేవన్‌, బాలూగారు, వందేమాతరం శ్రీనివాస్‌, ఆర్పీ పట్నాయక్‌, దేవీ శ్రీ ప్రసాద్‌ లాంటి ప్రముఖ సంగీత దర్శకులందరి ప్రదర్శనల్లో రిథమ్‌ ప్యాడ్స్‌ ప్లేయర్‌గా పనిచేశా. దేశవ్యాప్తంగా దాదాపు మూడు వేల స్టేజీ షోలు చేశా. అలా బిజీగా ఉన్నప్పుడే గాయని దివిజతో నాకు పెళ్లయింది. మణిశర్మ, కోటీ లాంటి సంగీత దర్శకుల ప్రదర్శనల్లో దివిజ కచ్చితంగా పాడేది. అలా మా ఇద్దరికీ పరిచయం పెరిగి, అది ప్రేమగా మారింది. తను కూడా చిన్నప్పట్నుంచీ స్టేజీ షోల్లో పాడుతూనే వచ్చింది. మా ఇద్దరి నేపథ్యమూ దాదాపుగా ఒకటే. దాంతో మా పెళ్లికి ఎవర్నుంచీ ఎలాంటి అభ్యంతరమూ రాలేదు.

అవకాశం వెతుక్కుంటూ...
మా పెళ్లయ్యాక ఓసారి ఆర్పీ పట్నాయక్‌గారు దివిజను అమెరికాలో ఓ షోలో పాడటానికి రమ్మని అడిగారు. కొత్తగా పెళ్లయిందనీ, ఒంటరిగా అంత దూరం ఇంట్లో వాళ్లు పంపించరనీ తను చెప్పింది. ఆ తరవాత దివిజ నా భార్యే అని తెలుసుకున్న ఆర్పీగారు, నన్ను కూడా బృందంలో సభ్యుడిగా యూఎస్‌ రమ్మన్నారు. అలా తొలిసారి నేనూ, దివిజా అమెరికాలో అడుగుపెట్టాం. నిజానికి తనవల్లే నాకా అవకాశం వచ్చింది. ఆ తరవాత ఎనిమిదేళ్లు వివిధ సంగీత దర్శకులతో కలిసి వరసగా విదేశాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాం. అలాంటి సమయంలోనే అనుకోకుండా నాకు ఓ సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఒకసారి లైవ్‌ షోలో నా వేగం, పక్కవాళ్లకి నేను నోట్స్‌ చెప్పే తీరూ ఇద్దరు వ్యక్తులకు బాగా నచ్చింది. నెల రోజుల తరవాత ఆ ఇద్దరూ నన్ను వెతుక్కుంటూ వచ్చి, ‘మేమొక సినిమా తీస్తున్నాం, దానికి నువ్వు సంగీత దర్శకత్వం చేస్తావా’ అని అడిగారు. వాళ్లలో రవిరాజు అనే ఆయన ఆ సినిమాకు దర్శకుడు, జగన్నాథ రెడ్డిగారు నిర్మాత. నాకు సంగీతం చేయడం రాదనీ, అసలా ఆలోచన కూడా లేదనీ వాళ్లకు నచ్చజెప్పా. నెల రోజుల తరవాత ఏదో తెలీని నమ్మకంతో నా దగ్గరికి వాళ్లు మళ్లీ వచ్చారు. వచ్చిన అవకాశం వదులుకోకూడదనిపించి ఆ సినిమాకు సంగీతం అందించాలని నిర్ణయించుకున్నా. పాటల రికార్డింగ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేశారు. తొలి పాటను కంపోజ్‌ చేసి బాలూగారితో పాడించా. కానీ నా దురదృష్టం కొద్దీ ఆ సినిమా విడుదలవ్వలేదు. కేవలం నాలోని ప్రతిభను బయటికి తీయడానికే వాళ్లిద్దరినీ ఎవరో పంపించినట్లుగా నాకనిపించింది.

శ్రీమతి ఇచ్చిన ధైర్యమే...
తొలి సినిమా విడుదలవకపోవడం నిరాశపరిచినా, నేనూ మంచి సంగీతాన్ని అందించగలనన్న నమ్మకమైతే వచ్చింది. కీబోర్డు నేర్చుకుని ఉంటే బావుండేది అని తొలిసారి అప్పుడనిపించింది. ఆ సమయంలోనే రోజూ దాదాపు పది గంటలు సొంతంగా కీబోర్డు సాధన మొదలుపెట్టా. అప్పటివరకూ బయటి షోల్లో వాయించడమే తప్ప సినిమాలకు వాయించింది లేదు. చాలా రోజులుగా పని చేస్తుండటంతో మణిశర్మగారు ‘స్టాలిన్‌’ సినిమా కోసం నన్ను బ్యాక్‌గ్రౌండ్‌ వాయించే బృందంలో సభ్యుడిగా తీసుకున్నారు. ఆ తరవాత ‘అశోక్‌’ సినిమాలో కూడా రెండు పాటలకు వాయించా. అక్కడున్నప్పుడే తమన్‌ నాకు బాగా దగ్గరయ్యాడు. మణిగారి షోస్‌ అన్నింటికీ తమన్‌ డ్రమ్స్‌, నేను రిథమ్‌ ప్యాడ్స్‌ వాయించేవాళ్లం. కొన్నాళ్ల తరవాత మరోసారి సంగీత దర్శకుడిగా ప్రయత్నించాలనిపించి చెన్నై నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చా. ఆ సమయంలో నా భార్య దివిజే నాకు అండగా నిలబడింది. ‘ఓ ఏడాది పాటు ఇంటి బాధ్యత నేను తీసుకుంటా, నువ్వు అవకాశాల కోసం ప్రయత్నించు’ అంటూ ధైర్యం చెప్పింది. అలా నేను మొదట పనిచేసిన సినిమా సీడీ చేతిలో పట్టుకొని అవకాశాల కోసం ప్రయత్నించా. ‘కాల్‌ సెంటర్‌’ అనే సినిమాకి సంగీత దర్శకుల కోసం వెతుకుతున్నారని తెలిసి, ఆ సినిమా దర్శక నిర్మాతలకు నా పాటలు వినిపించా. దర్శకుడు కణ్మణిగారికి అవి నచ్చడంతో రెండు మూడు సందర్భాలు చెప్పి ట్యూన్‌లు కంపోజ్‌ చేసి తీసుకురమ్మన్నారు. అవి కూడా నచ్చడంతో నా రెండో సినిమా ‘కాల్‌ సెంటర్‌’ తొలి చిత్రంగా విడుదలైంది.

ఎనిమిదేళ్లలో యాభై!
‘కాల్‌సెంటర్‌’లో పాటలు ఎఫ్‌¶ఎంలో బాగా పాపులర్‌ అవడంతో క్రమంగా ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’, ‘అధ్యక్ష’, ‘మంగళ’, ‘లక్కీ’, ‘రొమాన్స్‌’ లాంటి కొన్ని మినిమమ్‌ గ్యారంటీ సినిమాల్లో వరసగా అవకాశాలొచ్చాయి. ఆ తరవాత నానీ-కృష్ణవంశీగార్ల సినిమా ‘పైసా’ నా కెరీర్‌కు పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. కృష్ణవంశీగారు అంత త్వరగా సంగీతం విషయంలో సంతృప్తి చెందరు అన్న పేరుంది. కానీ నేను చేసిన ఐదు ట్యూన్‌లలో మూడింటిని ఫస్ట్‌ టేక్‌లోనే ఒప్పుకున్నారు. ఆ ఆడియో మంచి హిట్టయింది. తరవాత ఆనంద్‌ రవి అనే రచయిత ‘ప్రతినిధి’ సినిమాలో డైలాగుల్ని రామ్‌గోపాల్‌ వర్మగారికి వినిపించడానికి వెళ్లారు. అక్కడ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని చూసిన రామూగారు దానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరని అడిగి, నన్ను పిలిపించారు. అలా వూహించని విధంగా ఆయన తీసిన ‘రౌడీ’ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చింది. అందులోని పాటలూ హిట్టవడం, వరసగా ఇద్దరు పెద్ద దర్శకులకు పనిచేయడంతో అవకాశాలూ పెరిగాయి. నానీ సినిమా ‘జెండాపై కపిరాజు’కి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కీ మంచి పేరొచ్చింది. గతేడాది నేను పని చేసిన పన్నెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘పటాస్‌’ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ‘రాజుగారి గది’, ‘దొంగాట’, ‘జేమ్స్‌ బాండ్‌’, ‘అసుర’, ‘శంకర’ లాంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చాయి.

ఈ ఏడాది విడుదలైన ‘రాజా చెయ్యి వేస్తే’తో సంగీత దర్శకుడిగా యాభై సినిమాలు పూర్తయ్యాయి. ఇటీవలే ‘ఈడో రకం ఆడో రకం’, ‘సుప్రీమ్‌’ సినిమాలు సూపర్‌ హిట్టయ్యాయి. నేను కీబోర్డు ప్లేయర్‌గా స్థిరపడితే చాలని మా నాన్న అనుకున్నారు. లైవ్‌ షోలు చేస్తూ రాణిస్తే చాలని నేననుకున్నా. అలాంటిది సంగీత దర్శకుడిగా మారి యాభై సినిమాలు ఎలా చేశానా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ఆర్కెస్ట్రాల నుంచి లైవ్‌ షోలూ, అక్కడి నుంచి చిన్న సినిమాలూ, తరవాత పెద్ద సినిమాల దాకా నా ప్రయాణం సాగింది. పరిశ్రమలోని రకరకాల సమీకరణాల వల్ల భారీ సినిమాలు ఇప్పటిదాకా చేయలేకపోయా. ఇప్పుడు చేస్తున్న సినిమాలూ, సాధిస్తున్న విజయాల వల్ల ఆ కోరికా తీరుతుందన్న నమ్మకం ఉంది.


అందరం పాడతాం!

నా సినిమాల్లో నేను చాలా పాటలు పాడా. నా భార్య దివిజ కూడా ‘పటాస్‌’, ‘అసుర’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘సుప్రీమ్‌’ లాంటి సినిమాల్లో పాటలు పాడింది. మా పెద్దమ్మాయి శరచ్చంద్రిక ‘ప్రతినిధి’లో ఒక పాట పాడింది. చిన్నమ్మాయి సాయిగీతిక ‘రాజుగారి గది’లో సినిమా అంతా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే హమ్మింగ్‌ పాడింది.

* చెన్నైలో ఓసారి కర్ణాటిక్‌ సంగీత విద్వాంసులు మృదంగం శ్రీనివాస్‌, పుణ్యా శ్రీనివాస్‌గార్ల షోలో ఫ్యూజన్‌ వాయించే అవకాశమొచ్చింది. శాస్త్రీయ సంగీతంలో నాకు ప్రవేశం లేకపోయినా నా గ్రాహణ శక్తిపైన నమ్మకంతో అంత గొప్ప అవకాశాన్ని వాళ్లివడం ఎప్పటికీ మరచిపోలేను.

* సినిమాలు కాకుండా అల్లుఅర్జున్‌-సుకుమార్‌ కలయికలో వచ్చిన ‘ఐ యామ్‌ ది ఛేంజ్‌’ లఘుచిత్రానికీ సంగీతం అందించా.

* నారా రోహిత్‌తో వరసగా ఏడు సినిమాలు చేశా. దాదాపు ప్రతి దర్శక నిర్మాతతో ఒకటి కంటే ఎక్కువసార్లే పని చేశా. నా పనితీరు వాళ్లకు నచ్చుతుందనడానికి ఆ అవకాశాల్నే కొలమానంగా భావిస్తా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.