close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భూటాన్‌ సాధించింది!

భూటాన్‌ సాధించింది!

భూతాపానికి కారణమయ్యే కార్బన్‌డయాక్సైడ్‌లాంటి విషవాయువులను విడుదల చేస్తూ వాటిని కట్టడి చేసే ప్రయత్నంలో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ తలలుపట్టుకు కూర్చున్న తరుణంలో పర్యావరణం పట్ల చిత్తశుద్ధి ఉంటే అదేమంత కష్టమైన పని కాదని చూపుతోంది భూటాన్‌. కేవలం కార్బన్‌ ఉద్గారాలకు అడ్డుకట్ట వేయడం కాదు కార్బన్‌ నెగెటివ్‌ కంట్రీగా విశ్వసమాజం ముందు సగర్వంగా నిలబడింది. ఒక దేశపు చెట్లు ఆ దేశం ఉత్పత్తిచేసే కార్బన్‌డయాక్సైడ్‌ మొత్తాన్నీ పీల్చేసుకున్నా ఇంకా మరింత కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునే శక్తికలిగి ఉంటే ఆ దేశాన్నే కార్బన్‌ నెగెటివ్‌ కంట్రీగా పిలుస్తారు. పరిశ్రమలూ వాహనాలూ ఇతరాల రూపంలో ఏటా భూటాన్‌ విడుదల చేస్తున్న కార్బన్‌డయాక్సైడ్‌ 15 లక్షల టన్నులు కాగా, అక్కడి చెట్లు 60లక్షల టన్నుల బొగ్గుపులుసు వాయువును పీల్చుకుంటున్నాయి

ఈ దారిలో వెళ్లారు...
ఓ పక్క భారత్‌. మరో సరిహద్దు చైనా. రెండూ ఆర్థిక బరిలో, ఆధునికీకరణ పరుగులో నువ్వానేనా అన్నట్టు ఉండే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు. వాటి మధ్య కేవలం ఏడున్నర లక్షల జనాభాతో ఉన్న చిన్న దేశం భూటాన్‌. బౌద్ధం అక్కడి ప్రజల జీవనగతి. బౌద్ధంలో చెట్లకు విశేష స్థానం ఉంది. ఆ ధర్మాన్ని మనసావాచా ఆచరిస్తారు అక్కడి వారంతా.

* భూటాన్‌ భూభాగంలో 72శాతం అడవే. దేశ మొత్తం వైశాల్యంలో అడవి 60 శాతం ఉండాలన్నది అక్కడి రాజ్యాంగ నిబంధన. కలప ఎగుమతులూ అక్కడ నిషిద్ధం.

* గ్రామాల్లోని రైతులందరికీ ఉచిత కరెంటునిస్తోంది. అందువల్ల వంట కోసం వాళ్లు చెట్లను నరకరు.

* పెట్రోల్‌ డీజిల్‌ వాడకాన్ని తగ్గించేలా ఎలక్ట్రిక్‌ పవర్‌తో నడిచే వాహనాల మీద దిగుమతి సుంకాన్ని ఎత్తేసింది. ఇప్పటికే ఈ తరహా వాహనాలను గ్రీన్‌టాక్సీ పేరిట రాజధానిలో వాడుతున్నారు. త్వరలో దేశం మొత్తం ఇవే వాహనాలు ఉండేలా గట్టి ప్రణాళికలు సిద్ధం చేసింది.

* తక్కువ కాలుష్యకారకాలైన ఎల్‌ఈడీ బల్బులను వాడేందుకు దేశప్రజలకు వాటిమీదా సబ్సిడీనిస్తోంది. దేశం మొత్తం మీదా 7 లక్షల సాధారణ బల్బులుండగా మొన్న ఫిబ్రవరిలో 26,500 బల్బులను మార్కెట రేటులో పావువంతు రేటుకే పంపిణీ చేశారు. మలి విడతలో మిగతా బల్బులనూ ఎల్‌ఈడీలుగా మార్చే ప్రణాళికలు రచించింది.

* ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కాగితం అవసరం లేకుండా నడపాలన్న సంకల్పంతో సాగుతోంది.
* ప్రపంచంలోనే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని ఏకైక నగరం భూటాన్‌ రాజధాని థింపు.

* భూటాన్‌లో ఎవరినైనా గౌరవించాలన్నా, బహుమతులు ఇవ్వాలన్నా చెట్లను నాటడం, మొక్కలనే బహుమతులుగా ఇవ్వడం సంప్రదాయం. ఫిబ్రవరిలో భూటాన్‌ యువరాజు జన్మించిన సందర్భంగా దేశంలో లక్షా ఎనిమిది వేల మొక్కలు నాటి సంబరాలు జరుపుకున్నారు.

* గత జూన్‌లో వంద మంది స్వచ్ఛంద కార్యకర్తలు భూటాన్‌ రాజధానిలో కేవలం ఒక గంటలో 49,672 చెట్లను నాటి ప్రపంచ రికార్డు సృష్టించారు.

* ఏటా ‘స్థూల జాతీయ ఆనంద’ సర్వే చేయించే ఏకైక దేశం భూటాన్‌. స్థూల జాతీయోత్పత్తి కన్నా ప్రజల సంతోషాన్ని లెక్కించడమే ముఖ్య విషయమని ఆ రాజ్యం నమ్ముతుంది.

* భూటాన్‌లో వైద్యం, విద్య పూర్తిగా ఉచితం. చివరికి అక్కడికి పర్యటన కోసం వెళ్లే వాళ్లకైనా వైద్యం ఉచితమే.

ప్రజల సంక్షేమం కోసం ఇంత చేస్తున్న భూటాన్‌ స్థూల జాతీయోత్పత్తి కేవలం 13వేల కోట్ల రూపాయలు మాత్రమే. అయినా సరే ప్రజలకు ముఖ్యావసరాలను తీరుస్తూ పర్యావరణాన్ని దెబ్బతీయని రీతిలో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. అంతేకాదు, 2030 నాటికి కర్బన వాయువుల్ని పూర్తి స్థాయిలో నియంత్రించగలమని ధీమాగా చెబుతున్న భూటాన్‌ నుంచి పెద్ద దేశాలు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదూ!


 


డబ్బుల్లేకపోయినా హోటల్లో తినొచ్చు

రండి... ఈ కూపన్లు తీసుకెళ్లండి. మీకు నచ్చిన హోటల్‌కి వెళ్లి కడుపునిండా తినండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదు. ఆకలితో ఉన్నవారు వినడానికి ఇంతకన్నా మంచి మాటా, తోటి వారికి సాయపడాలనుకునేవారు చెయ్యడానికి ఇంతకన్నా గొప్ప పనీ ఇంకేముంటాయి... అందుకే, ‘ఆపరేషన్‌ సులేమాణి’ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రశంసలు అందుకుంటోంది.

దువుకోసం వూరి నుంచి పట్టణానికొచ్చాడు ఆ కుర్రాడు. తండ్రి పంపించిన కొంత డబ్బూ నెల గడవక ముందే అయిపోయింది. కానీ ఆకలికి ఆ విషయం తెలియదుగా. రోజంతా కష్టపడినా ఇల్లు గడవని కూలీ అతడు. మరి పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలంటే... కూతురు ఆసుపత్రిలో ఉంది. ఆ ఖర్చులకే కష్టం. ఇక, ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ బయట భోజనం తినాలంటే...ఇలా... కడుపునిండా తినలేని పేదరికంలో బతుకుతున్నవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. అయినా వాళ్లు ఎవరి ముందూ చేయి చాచరు. ఎందుకంటే వారి దృష్టిలో పేదరికం కన్నా ఆత్మాభిమానమే గొప్పది. అందుకే, కష్టపడి పనిచేసుకుని తింటే తింటారు. లేదంటే పస్తులుండడానికి సిద్ధపడతారు. ఇలాంటి ఏ కారణంతోనూ ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేరళలోని కొజికోడ్‌ జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్నదే ‘ఆపరేషన్‌ సులేమాణి’ పథకం.

స్థానిక కలెక్టర్‌ ఎన్‌ ప్రశాంత్‌ నాయర్‌ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్నవారెవరైనా హోటల్‌కి వెళ్లి రూపాయి కూడా చెల్లించకుండా ఎంతో గౌరవంగా కడుపునిండా తిని రావొచ్చు. సులేమాణి అంటే సుగంధద్రవ్యాలు కలిపిన బ్లాక్‌ టీ అని అర్థం. దీన్ని కొజికోడ్‌ ప్రజలు భోజనం తర్వాత తాగుతారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ‘కాఫీ ఆన్‌ వాల్‌, ఫుడ్‌ ఆన్‌ ది వాల్‌’... సేవా కార్యక్రమాల మాదిరిగానే సులేమాణి కూడా నడుస్తోంది.

ఆలోచన ఆయనదే
కాఫీ ఆన్‌ వాల్‌ అంటే... హోటల్‌లో ఒక కప్పు కాఫీ తాగినవాళ్లు రెండు కప్పులకు బిల్లు కడితే అదనంగా చెల్లించిన ఆ డబ్బులతో లేని వారికి ఉచితంగా కాఫీ ఇస్తారు. ‘ఫుడ్‌ ఆన్‌ ది వాల్‌’లో భాగంగా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలనుకున్నవారు దానికి సరిపోయే డబ్బును చెల్లించొచ్చు. ఆపరేషన్‌ సులేమాణి కూడా ఈతరహాదే. కాకపోతే కలెక్టర్‌ ప్రశాంత్‌ దీన్ని ఇంకాస్త భారీ స్థాయిలో చెయ్యాలనుకున్నారు. అందుకే, ‘కేరళ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్స్‌’ అసోసియేషన్‌తో మాట్లాడి 25కు పైగా హోటళ్లను ఇందులో భాగంగా చేశారు. ఐఏఎస్‌ అధికారే ముందుండి నడిపించడంతో హోటళ్లూ రెస్టారెంట్లకు వెళ్లిన జనం కూడా అక్కడున్న విరాళాల బాక్సుల్లో డబ్బులు వెయ్యడం మొదలుపెట్టారు. ఇలా ప్రభుత్వాఫీసుల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ విరాళాల బాక్సులు పెట్టి ఆ డబ్బుతో భోజనం కూపన్లు కొంటారు సులేమాణి నిర్వహకులు. ఈ కూపన్లను హాస్టళ్లు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కలెక్టర్‌ ఆఫీస్‌, పంచాయతీ, తాలూకా ఆఫీసుల దగ్గర పంచుతారు. పేదలూ అవసరార్థులెవరైనా ఆయా చోట్ల కూపన్లు తీసుకుని సులేమాణి పథకంలో భాగంగా ఉన్న ఏ హోటల్‌కైనా వెళ్లి కూపన్‌ చూపిస్తే చాలు, ఎవరూ ఏమీ అడగరు, అతిథి మర్యాదలతో భోజనం వడ్డిస్తారు. 2015 జూన్‌ 14న మొదలైన ఈ సేవా కార్యక్రమం ద్వారా ప్రస్తుతం కొజికోడ్‌లో రోజుకు వెయ్యిమంది పేదలు కడుపు నిండా తింటున్నారు. మామూలుగా విరాళాలు సేకరించి ఒకచోట వండి అన్నదానం చేస్తే ఆ చుట్టు పక్కల ప్రాంతాల వారికి మాత్రమే ఉపయోగం. పైగా రోజూ ఎంతమంది తినడానికి వస్తారో తెలియదు కాబట్టి, ఆహారం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఇలా దగ్గర్లో ఉన్న హోటల్‌కి వెళ్లి తినే వీలుంటే అన్ని ప్రాంతాల వారికీ ఉపయోగంగా ఉంటుంది. విద్యార్థులూ చిన్న చిన్న పనులు చేసుకునే వారెవరైనా మొహమాట పడకుండా తిని రావొచ్చు. వంటకాలు రుచిగానూ శుభ్రంగానూ ఉంటాయన్న సంతృప్తీ మిగులుతుంది. కూపన్ల మీద తినేవారిని హోటల్‌ సిబ్బంది ఎలా చూస్తున్నారో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో వలంటీర్లు కూడా కూపన్లు తీసుకుని వెళ్తుంటారు. ఎక్కడైనా తేడా వస్తే వెంటనే తగిన చర్యలు తీసుకునేలా చూస్తారు. ఇక, అవసరం లేని వారు పదే పదే తినకుండా కూపన్‌ ఇచ్చేటపుడు వారి పూర్తి వివరాలూ చిరునామాను నమోదు చేసుకుంటారు సిబ్బంది. అందుకే, ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఆపరేషన్‌ సులేమాణి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ‘ఎవరైనా ఎక్కువమందికి అన్నదానం చెయ్యాలనుకుంటే కలెక్టర్‌ ఆఫీసులో కూపన్లను కొని పంచొచ్చు. పెళ్లిరోజులూ పుట్టినరోజుల్లాంటి కార్యక్రమాలకూ విరాళాలు ఇవ్వొచ్చు...’ అని ప్రచారం చెయ్యడంతో సామాన్యులతో పాటు మలయాళీ సినిమా, రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతు సాయం చెయ్యడానికి ముందుకొచ్చారు.

దమ్మున్న ఆఫీసర్‌
నిజానికి ఈ ఘనతంతా 35ఏళ్ల ప్రశాంత్‌దే. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలంలోనే ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలనే ఆశయంతో ఈ మంచి పనికి రూపకల్పన చేశారాయన. ఇదేకాదు, వృత్తిలో భాగంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు వస్తున్న స్పందన అంతా ఇంతాకాదు. ఆ మధ్య స్థానికంగా ఉన్న 14 ఎకరాల చెరువు పూడికతీత కోసం ‘మంచి పనిలో పాల్గొనండి... రుచికరమైన బిర్యానీ తినండి’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో 750మందికి పైగా చెరువును శుభ్రం చెయ్యడానికి వచ్చారు. వారికి చెరువు పక్కనే బిర్యానీ వండించి పెట్టారు ప్రశాంత్‌. ఇలాంటివాటి గురించే కాదు, ప్రజల సమస్యల గురించి కూడా ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. అందుకే, కేవలం రెండేళ్లలో ఆయన ఫేస్‌బుక్‌ పేజీకీ దాదాపు రెండులక్షల మంది ఫాలోవర్లు అయ్యారట. మంచిపనికి ఎందరో తోడొస్తారు. అందరు ఆఫీసర్లూ ఇలా ఉంటే బాగుండనిపిస్తోంది కదూ!


 

 

గోడమీద పుస్తకం చిన్నారుల నేస్తం

ఎన్నిసార్లయినా తెరిచిచూసుకోగలిగే బహుమతి పుస్తకం, మంచి పుస్తకం గొప్ప స్నేహితుడితో సమానం... పుస్తకాల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే నోటిమాటగా చెప్పడమే కాకుండా వేల మంది చిన్నారులకు పుస్తకాలు చదివే అవకాశాన్ని కల్పిస్తున్నారు ‘వాల్‌ ఓ బుక్స్‌’ గ్రంథాలయాల నిర్వాహకులు.