close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోనేటిరాయుడి... కొత్తకాపురం ఇక్కడే!

కోనేటిరాయుడి... కొత్తకాపురం ఇక్కడే!

  పద్మావతీదేవిని పరిణయమాడిన శ్రీనివాసుడు ఇక్కడే, ఈ క్షేత్రంలోనే కొత్తకాపురం పెట్టాడట. పగలంతా అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో విడిది, రాత్రికేమో శ్రీనివాస మంగాపురంలో బస. ఈ ప్రాంతం ఆరునెలల పాటూ హరి వాసమైంది. చిత్తూరు జిల్లాలోని అగస్త్యేశ్వర క్షేత్ర వైభవాన్ని చూసి తీరాల్సిందే.

స్వర్ణముఖి, కల్యాణి, భీమా నదుల సంగమ స్థానంలో ఉంది... అగస్త్యేశ్వరస్వామి ఆలయం. అగస్త్యమహాముని లింగ ప్రతిష్ఠ చేసినచోటు కాబట్టి, ఆయన పేరు మీదే అగస్త్యేశ్వర క్షేత్రంగా ప్రఖ్యాతమైంది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఉందీ యాత్రాస్థలి. చంద్రగిరి రాజుల కాలంలో ఈ గ్రామంలో అతిగొప్ప గజదళం ఉండేదట. వీధులన్నీ ఏనుగు తొండాలతో కళకళలాడేవట. దీంతో తొండవాడ అన్న పేరు వచ్చింది. అగస్త్యేశ్వర ఆలయానికి సంబంధించి ఓ ఐతిహ్యం ప్రచారంలో ఉంది. భూలోకంలో పాపభారం పెరుగుతోందనీ, ఆ బరువును తగ్గించేందుకు దక్షిణ భారతానికి వెళ్లమనీ మహాశివుడు తన పరమభక్తుడైన అగస్త్యమహామునిని ఆజ్ఞాపించాడు. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు తీసుకుని, దక్షిణ భారతం వైపుగా ప్రయాణం సాగించాడు అగస్త్యుడు. పచ్చని ప్రకృతితో ఆహ్లాదంగా ఉన్న ఈ ప్రాంతాన్ని చూసి మహాముని సంతోషించాడు. అయితే, ఒకే ఒక్క కొరత ఆయన్ని కలతకు గురిచేసింది. ఇక్కడ చుక్కనీరు కూడా అందుబాటులో లేదు. ఒక్క జలాశయమూ కనిపించలేదు. దీంతో బ్రహ్మదేవుడి కటాక్షం కోసం తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. వెనువెంటనే గంగను ప్రసాదించాడు. దివి నుంచి భువికి దిగొస్తున్న ఆ గంగ...స్వర్ణ కాంతులతో ధగధగా వెలిగిపోతోందట. బంగారమే నీరై పారుతున్నట్టుగా అనిపించిందట. ఆ మహాద్భుత దృశ్యాన్ని చూసి మహర్షి తన్మయత్వం చెందాడు. ఆ ప్రవాహానికి స్వర్ణముఖిగా నామకరణం చేశాడు. నదీతీరంలో ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని శివుడిని ఉపాసించాడు. ఓరోజు స్వర్ణముఖిలో స్నానానికి వెళ్లినప్పుడు...నీటిలో శివలింగం లభ్యమైంది. ఆదిదేవుడు తనను అనుగ్రహించాడని సంతోషించాడు. నమక చమకాలతో అర్చించాడు. అభిషేక ప్రియుడైన దేవుడు కాబట్టి, స్వర్ణముఖి జలాలతో పూజించాడు. ప్రతిష్ఠితమైంది పరమశివుడి దివ్యలింగం. ప్రతిష్ఠించిందేమో అగస్త్య మహాముని. అంతకు మించిన మహాద్భుతమేం ఉంటుంది. ఆ మహోత్సవానికి ముక్కోటి దేవతలూ తరలివచ్చారు. అందుకే ఈ క్షేత్రానికి ‘ముక్కోటి’ అన్న పేరు వచ్చింది.

శ్రీనివాసుడి కాపురం...
‘శ్రీనివాస కల్యాణ’ ఘట్టం మనకు తెలిసిందే. విష్ణు స్వరూపుడైన వేంకటేశ్వరుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని నారాయణవనంలో పరిణయమాడాడు. ఆతర్వాత, సతీసమేతంగా తిరుమలకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అగస్త్యమహాముని ఆశ్రమాన్ని సందర్శించాడు. ‘శ్రీనివాసా! పసుపుబట్టలతో శేషాచలం కొండ ఎక్కడం సబబు కాదేమో. ఆలోచించు’ అని సూచించాడు మునీశ్వరుడు. దీంతో పద్మావతీ శ్రీనివాసులు ఇక్కడే, ఈ క్షేత్రంలోనే ఆరు మాసాలు నివాసమున్నారు. ఆ జంట పగలు మక్కోటిలో, రాత్రి శ్రీనివాసమంగాపురంలో కాలం గడిపింది. ఈ సమయంలోనే మామ ఆకాశరాజు మరణించాడు. రాజ్యం కోసం ఆకాశరాజు తమ్ముడు తొండమానుడికీ, కుమారుడు వసుధామునికీ మధ్య గొడవలు మొదలయ్యాయి. అగస్త్యమహాముని సలహా మేరకు శ్రీనివాసుడు ఆ వివాదాన్ని పరిష్కరించాడు. అందుకు కృతజ్ఞతగా తొండమానుడు తిరుమలలో ఆనందనిలయాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆరుమాసాల అనంతరం, అగస్త్యమహాముని అనుమతితో తిరుమలకు బయలు దేరాడు వేంకటేశ్వరుడు. అందువల్లే ఈ క్షేత్రానికి ‘అగస్త్య పూజిత విష్ణుపాదం’ అన్నపేరూ వచ్చింది.

సకల దేవతలూ...
ఆలయానికి మూడువైపులా మూడు ద్వారాలున్నాయి. గర్భాలయానికి ముందు ద్వారపాలకుల విగ్రహాల్ని రమణీయంగా చెక్కారు. మూలవిరాట్టు అగస్త్యేశ్వరస్వామి లింగాకారంలో భక్తులను అనుగ్రహిస్తాడు. దేవేరి ఆనంద వల్లీదేవి ఆలయాన్ని దక్షిణాభిముఖంగా నిర్మించారు. చండీశ్వరుడు కూడా ఇక్కడ కొలువయ్యాడు. వినాయక, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీదేవి, కాలభైరవ మూర్తులు ఉన్నాయి. నవగ్రహ మండపాన్నీ నిర్మించారు. ఇక్కడ ఆరుమాసాల కాలం నివాసం ఉన్నందుకు గుర్తుగా... నదిలోని ఓ రాతి బండ మీద స్వామివారు తన కాలిముద్రను వదిలి వెళ్లారని ఓ కథనం. ఈ బండ పైనే హరిహరులు ఒకే విగ్రహంలో దర్శనమిస్తారు. ఆలయ ప్రారంభంలో ఉన్న లింగద్వారం యాత్రికులను అమితంగా ఆకర్షిస్తుంది. ప్రాంగణంలోని అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని ఓ నమ్మకం. విజయనగర రాజుల కాలం నాటి ఈ దేవాలయాన్ని తమిళనాడుకు చెందిన నాటుకోటి శెట్టియార్లు జీర్ణోద్ధరణచేసి, ప్రాంతీయ పాలకులైన మొగిలిరెడ్లకు అప్పగించారు. శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతకంలోని... 105వ నామంలో సువర్ణముఖి ప్రస్తావన ఉంది. ఈ నదిలో స్నానం చేసినవారి మనోవాంఛల్ని శ్రీనివాసుడే తీరుస్తాడని కీర్తించారు. స్వర్ణముఖి స్నానం, శివుడి ధ్యానం, శ్రీనివాసుడి కటాక్షం...ముచ్చటగా మూడు ప్రత్యేకతలున్న క్షేత్రం ముక్కోటి!

- ఈరళ్ల శివరామ ప్రసాదు, ఈనాడు, చిత్తూరు
ఫొటోలు: కె.రమేష్‌ కుమార్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.