close
ఉత్పలమాల

ఉత్పలమాల
- జ్యోతి సుంకరణం

‘‘క...క కు దీర్ఘమిస్తే కా... ‘క’కు గుడిస్తే కి...’’ నేను మా ఇంటి గుమ్మంలోకి రాగానే ‘క’ గుణింతం వినపడటంతో ఆశ్చర్యంగా లోపలికి చూశాను. నా శ్రీమతి ఉత్పల ఎవరో పాపని కూర్చోబెట్టుకుని క గుణింతం వల్లె వేయిస్తోంది. షూ విప్పి లోపలికి వెళ్ళి ‘ఏమిటిది’ అన్నట్లు సైగ చేశాను.
‘‘మన కింద ఫ్లాట్‌లోకి కొత్తగా వచ్చారు, బెంగాలీవాళ్ళు. వాళ్ళ పాపకి తెలుగు నేర్పించమంటే నేర్పిస్తున్నాను’’ అంది.
ఆ మాటని నేను వింటూనే ‘‘ఓహో, అయితే మళ్ళీ కథ మొదలన్నమాట’’ అన్నాను నవ్వుతూ.
దానికి ఒక్క నిమిషం ‘ఏమిటది?’ అన్నట్లు చూసి వెంటనే గుర్తు తెచ్చుకుని ‘‘ఓ... అదా’’ అని నవ్వేసి ‘‘వెళ్ళి ఫ్రెష్‌ అవ్వండీ, ఒక అరగంటలో ఈ పాపని పంపించేసి వస్తాను’’ అంది.
లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చున్నా ఇంకా ఉత్పల రాకపోవడంతో ఏం తోచక మా పెళ్ళి ఫొటోల ఆల్బమ్‌ చూస్తూ నాకు తెలియకుండానే నా గతంలోకి వెళ్ళిపోయాను.

***

అవి నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్‌ అయిన రోజులు. మేము తెలుగువారమే అయినా పెరిగిందీ చదివిందీ అంతా ఒరిస్సాలో అవడం వలన విని అర్థంచేసుకునీ దానికి సమాధానం ఇవ్వగలిగేంత వరకూ మాత్రమే తెలుగు వచ్చు. అయితే ఇప్పుడు ఉద్యోగరీత్యా నేను ఆంధ్రాకి రావాల్సివచ్చి తెలుగు రాకపోతే ఎంత ఇబ్బందో తెలిసింది. తెలుగు ఎలాగైనా బాగా నేర్చుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అదృష్టవశాత్తూ నేను ఉంటున్న రూమ్‌కి దగ్గరలోనే ఎవరో రిటైర్డ్‌ తెలుగు మాస్టారు ఉన్నారని తెలియడంతో ఒకరోజు ఉదయాన్నే ఆయన్ని కలవడానికి వెళ్ళాను. వెళ్ళి తలుపు కొట్టగానే ఆయనగారి భార్య వచ్చి తలుపు తీసింది. విషయం అడిగి ‘‘కూర్చో బాబూ, ఆయన పూజలో ఉన్నారు, వస్తారు’’ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.

మరొక పావుగంటకి ‘‘ఎవరా సన్నాసి, పొద్దున్నే అఘోరించాడు’’ అంటూ ధాటిగా మాట్లాడుతూ ఒక చేత్తో కాఫీగ్లాసూ మరొక చేత్తో పంచె పైకి మడిచిపెట్టి కట్టుకుంటూ బైటికి వచ్చాడాయన.

దబ్బపండులాంటి ఒంటి రంగు, ఎర్రటి మడి పంచె, నెత్తిమీద కచ్చితంగా లెక్కగట్టేటన్ని వెంట్రుకలు, చత్వారం కళ్ళజోడులోంచి పైకీ కిందకీ చూస్తూ దూరంనుండే నన్నెవరో అంచనా వేసెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడాయన.

ఆయన రాగానే లేచి నిలబడి నమస్కారం చేసి నన్ను నేను పరిచయం చేసుకుని విషయం చెప్పాను. అది వినగానే మరొకసారి నన్ను పైనుండి కిందిదాకా చూసి నేను కూర్చున్న కుర్చీని ఆయనకి వేయమన్నట్లుగా సైగ చేయడంతో ఆ కుర్చీని తీసి ఆయనకు వేశాను. ఆ ధాటికి నాకు తెలియకుండానే రెండు చేతులూ దండ కట్టుకుని ఆయన ఎదురుగా నిలబడి అడిగిన వివరాలన్నింటినీ అతి వినయంగా సమాధానం చెప్పాను- వచ్చీ రాని తెలుగులోనే.

అన్నీ విని కాసేపు ఆలోచించి ‘‘వూ, పొట్ట విప్పితే అక్షరంముక్క లేనట్లుంది నీ వరస చూస్తే, తెలుగు నేర్చుకుంటానంటున్నావ్‌, సరే, రేపొద్దున్నుండి వచ్చి తగలడు. ఎంతవరకు నేర్చుకుంటావో చూస్తాను. ఇదిగో ఆరోగంటకల్లా నువ్విక్కడ ఉండాలి. ఒక్క క్షణం అటూ ఇటూ అయినా బైటికి గెంటేస్తాను... తెలిసిందా’’ అన్నాడాయన చూపుడువేలితోనే బెదిరించేస్తూ.

‘అలాగే’ అన్నట్లు బుర్ర వూపి ‘‘మీ ఫీజు...’’ అన్నాను నసుగుతూ భయంభయంగా.

దానికి ఆయన పేద్దగా వికటాట్టహాసం చేస్తూ ‘‘ముందు నాలుగు ముక్కలు నేర్చుకుని ఏడవ్వోయ్‌, అప్పుడు చూద్దాం’’ అన్నాడాయన వేళాకోళంగా.

బైటికి వచ్చాక చెమటలు తుడుచుకుంటూ ‘పాతికేళ్ళవాడినీ ఉద్యోగస్తుడినేనా నేను... లేక స్కూలు పిల్లాడిలా ఉన్నానా?’ అన్న అనుమానం కలిగింది నామీద నాకే. అరె, అయిదు నిమిషాల్లోనే ఇంత భయంకరంగా ఉంది, ఈయన దగ్గర నేను తెలుగు నేర్చుకోగలనా అనిపించింది. సరే, ఏదయినా కొద్దిరోజులు చూస్తేనే కానీ లాభంలేదనిపించి మర్నాడు ఉదయం నుంచీ వెళ్ళడం మొదలుపెట్టాను. మొదటి నాలుగైదు రోజులూ నాకేవో చిన్నపాటి పరీక్షలు పెట్టాడాయన. వాటి ద్వారా నాకున్న నాలెడ్జి ఎంతో తెలిసిపోయింది ఆయనకి. దాంతో నేనంటే ఇంకా చులకన భావం ఏర్పడిపోయింది. ఏదో పదిరోజుల్లో చదవడం, రాయడం నేర్చేసుకుందామనుకున్న నాతో ఓనమాలు దగ్గర నుంచీ దిద్దించడం మొదలుపెట్టేశారు. మధ్యమధ్యలో తిట్లూ, నన్ను వేళాకోళం చేయడం అవి అన్నీ చూసి మొదట్లో ఆయన దగ్గరకు వెళ్ళడం మానేద్దాం అనిపించేది. కానీ, ఎలాగైనా సరే, బాగా నేర్చుకుని నామీద ఉన్న చులకన భావం పోగొట్టించుకుని ‘శభాష్‌’ అనిపించుకుని అప్పుడు మానెయ్యాలన్న పంతం వచ్చింది నాకు. దాంతో ప్రతిరోజూ పట్టుదలగా వెళ్ళడం ప్రారంభించాను.

ఒకరోజు పాఠం నేర్చుకుంటుండగా మాస్టారి భార్య బకెట్‌లో పిండిన బట్టలు ఆరేయడానికి తీసుకువెళ్తొంది. ఆవిడ్ని చూసి ‘‘ఒసేవ్‌ పిండారీ, నాలుగుసార్లు అటూ ఇటూ తిరిగి ఆనక కాళ్ళు లాగేస్తున్నాయని పితూరీలొకటి. ఈ సన్నాసికియ్యి ఆరేసొస్తాడు’’ అని అరిచారు.

ఆ మాటకీ ఆవిడ కంగారుగా నావైపు తిరిగి ‘‘అయ్యో అదేంటండీ, ఆ అబ్బాయి ఏమనుకుంటాడూ?’’ అంది ఇబ్బందిగా.

‘‘వాడి మొహం, వాడేం అనుకుంటాడూ, ఏమీ అనుకోడు. ముందు ఆ బకెటü అలా పెట్టు’’ అని- నావైపు తిరిగి ‘‘వెళ్ళవోయ్‌ వెళ్ళు, ఆ నాలుగు బట్టలూ దండెంమీద వేసిరా’’ అని హుంకరించారు.

ఆ హుంకరింపుకి నేను బిక్కచచ్చిపోయి మారుమాట్లాడకుండా ఆ బకెట్టు అందుకున్నాను. ‘హు... ఖర్మ, నా బట్టలే నేనేనాడూ ఆరేసుకోలేదు’ అని మనసులో అనుకుంటూ దండెంమీద బట్టలు వేస్తూండగా ‘‘ఇదిగో ఆరేస్తూ అక్కడే గుణింతాలు వల్లె వెయ్యి, నాకు ఇక్కడికి వినపడాలి’’ అని ఒక్క అరుపు అరిచారు.

‘ఏంటీ, ఇక్కడ నుంచి నేను గుణింతాలు వల్లె వెయ్యాలా’ అని ఆశ్చర్యపోతుండగా ‘‘ఏవోయ్‌ సన్నాసీ’’ అన్న అరుపు వినపడటంతో వల్లె వెయ్యడం మొదలుపెట్టాను- చుట్టూ ఎవరూ చూడటంలేదు కదా అని మొహమాటంగా చూస్తూ. ఇలాంటివే ఒకటి రెండు సంఘటనలతో నాకు చాలా ఇబ్బందిగా ఉండి ఈయన దగ్గర ఏదో నేర్చుకోవడం మాట అటుంచి, నామీద నాకున్న కాన్ఫిడెన్స్‌ కూడా పోయేటట్లు ఉందని వెళ్ళడం మానేద్దామా అనుకున్నాను. మళ్ళీ ఏ రోడ్డుమీదనైనా కనిపించి ‘ఏరా సన్నాసీ, చెప్పాపెట్టకుండా మానేశావేంరా’ అని అరిస్తే... ‘అమ్మ బాబోయ్‌, దానికన్నా ఇక ఈరోజు నుంచి నాకు రావడానికి కుదరదని ఇంటికి వెళ్ళి చెప్పేసి మానేద్దాం’ అని నిర్ణయించుకుని వెళ్ళాను.

నాకు ఆయన మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడంతో బుర్ర దించుకుని ఆయన చెప్పిందేదో రాసుకుంటున్న నాకు ‘‘నాన్నగారూ, కాఫీ’’ అన్న కోమలమైన గొంతు వినపడటంతో బుర్ర పైకెత్తి చూశాను. ఆశ్చర్యం!! ‘దివి నుండి భువికి దిగిన దేవకన్యలాగా ఉంది ఎవరీమె... ఇంతవరకు ఎప్పుడూ చూడలేదే’ అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాను.

‘‘ఏరోయ్‌, అలా మిడిగుడ్లు వేసుకుని ఉండిపోయావ్‌, నాకు ముగ్గురు ఆడ మలయాళీలు, ఇది మూడోది. పెద్ద సన్నాసికి ఒంట్లో బాగాలేకపోతే ఇది కొన్నాళ్ళు అక్కడ అఘోరించింది. ఈరోజే వచ్చింది’’ అన్నారాయన పుస్తకంతో నా బుర్రమీద ఒక్కటేస్తూ. ఒక్కసారి ఉలిక్కిపడి చూపు తిప్పుకున్నాను.

‘‘సారీ, మీరు ఉన్నారనుకోలేదు. మీకు కూడా కాఫీ పట్టుకొస్తానుండండీ’’ అంది ఆ అమ్మాయి మొహమాటపడుతూ.

‘‘ఏడిశావ్‌, వీడు రోజూ వచ్చే సన్నాసే. వీడికేం అలాటి మర్యాదలఖ్ఖర్లేదు, నువ్వు లోపలికి పో’’ అని కూతుర్ని కసిరాడాయన.

ఆ అమ్మాయి మాటలకి ‘సరే’ అని బుర్ర వూపాలో, ఈయన మాటలకి ‘వద్దు’ అని బుర్ర వూపాలో తెలీక అలా వెర్రినవ్వు నవ్వి ఉండిపోయాన్నేను. కానీ, ఆ రోజుతో అక్కడికి వెళ్ళడం మానెయ్యాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆ అమ్మాయిని చూడటంతో వెనక్కి తీసేసుకున్నాను. ప్రతిరోజూ ఇంకా శ్రద్ధగా వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయితో పరిచయం పెంచుకోవడం కోసం వాళ్ళ ఇంటి పనులలో కూడా సహాయపడటం మొదలుపెట్టాను. ఇన్నాళ్ళూ బిగుసుకు ఉండిపోయిన నేను కాస్త చనువుగా ఉండటంతో అతికొద్ది కాలంలో నేను వారి కుటుంబసభ్యులలో ఒకడిగా మారిపోయాను. మాస్టారి ధోరణి నన్ను మునుపటిలా ఇబ్బంది పెట్టడం లేదు. ఇటు తెలుగులో కూడా కాస్తో కూస్తో ప్రావీణ్యం సంపాదించాను. మాస్టారి భార్య వారి అమ్మాయి కూడా నన్ను పిలిచి వారికి కావలసిన పనులు చేయించుకుంటున్నారు. ఒకవేళ వారు పిలవకపోతే నేనే వెళ్ళి వారికి ఏమైనా సహాయం కావాలేమో అడిగి వచ్చేటంత చనువు ఏర్పడిపోవడంతో నేను మాస్టారి అమ్మాయిపై విపరీతమైన ప్రేమాభిమానాలు పెంచేసుకున్నాను. ఏదో ఒక మంచి సందర్భంలో మా అమ్మానాన్నలకి చెప్పి మాస్టారితో మాట్లాడించాలనుకున్నాను. ఆ మంచిరోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్న నాకు ఒకరోజు మాస్టారు ‘‘ఒరేయ్‌ బడుద్ధాయ్‌, మా మూడోదానికి పెళ్ళి కుదిరింది, వచ్చే నెల్లోనే ముహూర్తం. అంచేత నువ్వు పెందరాళే ఆఫీసు నుంచి తగలడి అమ్మగారికి కనిపిస్తూ ఉండు. ఈ నెలరోజులూ పెళ్ళిపనులు చాలా ఉన్నాయ్‌’’ అన్నారు.

ఆ మాటకి నేను షాక్‌ అయ్యాను. కాలం స్తంభించినట్లయింది. నా నవనాడులూ తెగి నా హృదయాన్నెవరో ముక్కలు కోసినట్లు బాధ కలిగింది. ‘‘ఏవిరా, అలా ఆముదం తాగిన మొహం పెట్టుకున్నావ్‌. ఆఫీసుకేం సెలవు పెట్టమన్లేదు కదా, సాయంకాలం పూట అలా బలాదూర్‌గా తిరిగే టైమ్‌లో చేసిపెట్టు చాలు’’ అన్నారాయన.

ఇక అక్కడ ఎలా ఉన్నానో, నా రూమ్‌కి ఎలా వచ్చానో నాకే తెలియదు. ఏనాడూ బాధంటే ఏంటో, కష్టమంటే ఏంటో తెలియని నేను విపరీతంగా ఏడ్చాను. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను... ఎంత ప్రేమించాను, తనే నా జీవిత భాగస్వామి అని మానసికంగా పూర్తిగా నిర్ణయించేసుకున్నానే. ఇప్పుడేంటీ... ఇలా... తనుకాక ఇంకొకర్ని నా జీవితంలో వూహించుకోగలనా..? నాలో ఎన్నో ఆశలు రేపి నన్నెంత మోసం చేసింది. ఎంత అభిమానంగా మాట్లాడింది. ఆ తల్లీ కూతురూ నాచేత ఎన్ని పనులు చేయించుకున్నారూ. ఇంత పెద్ద ఉద్యోగస్తుడినీ, అందగాడ్నీ పనివాడిలాగా వాడుకున్నారు. పైగా ఆ ముసలాడు రోజూ సాయంత్రం వచ్చి పెళ్ళిపనులు చేయమని పురమాయిస్తాడా? జీతంభత్యం లేని నౌకరుని అనుకుంటునట్లున్నారు. ఎందుకిలా జరిగింది, ఏం చేయాలిప్పుడు... నా బుర్ర తిరిగిపోతోంది. ఏదో తెలియని కోపం, ఆవేశం, ఉక్రోషం రెండురోజులు గదిలోనే ఉండిపోయాను. బైటికి కూడా రావాలనిపించలేదు. ఈ బాధలో కష్టంలో అమ్మా నాన్నా గుర్తొచ్చారు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఒళ్ళొ తల పెట్టుకుని ఏడవాలనిపించింది. ఒక్క నిమిషం వాళ్ళంతా గుర్తుకురాగానే నా వివేకం నన్ను తట్టిలేపింది. ఇన్నాళ్ళూ వాళ్ళు నేర్పించిన నా చదువూ సంస్కారం నా చెంపమీద ఒక దెబ్బవేసి నన్ను స్పృహలోకి వచ్చేటట్లు చేశాయి. నెమ్మదిగా నా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ఛ! ఏమిటిది. నేను ఎందుకంత అసహ్యంగా మాస్టారివాళ్ళ గురించి ఆలోచించాను. నేను ప్రేమించి ఏవేవో వూహించుకుని ఆశపడ్డాను కానీ, ఆ అమ్మాయికి ఆ ఆలోచన ఉందో లేదో తెలుసుకోకపోవడం నాదే తప్పు. తనకి నాపట్ల అలాంటి భావన ఉంటే ఈ పెళ్ళికి ఒప్పుకునేది కాదు కదా! ఏ ఒక్కరి ఇష్టమో ప్రేమ కాబోదు. ఇద్దరి మనసులలోంచి పుట్టే ఇష్టమే ప్రేమ. నాపై అటువంటి ఏ ఆలోచనాలేని, త్వరలో మరొకరిని పెళ్ళి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన అమ్మాయి గురించి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా అనుకోకూడదని నిర్ణయించుకుని, మర్నాడు తలారా స్నానం చేసి, మనసులో ఉన్న కుళ్ళుని కూడా కడిగేసుకుని తేలికైన మనసుతో మాస్టారి ఇంటికి వెళ్ళాను. పెళ్ళి పనులన్నీ అడిగి తెలుసుకుని మరీ అన్నీ చేయడం మొదలుపెట్టాను. ఇక పదిరోజుల్లో పెళ్ళి ఉందనగా... ఒకరోజు ఉదయాన్నే మాస్టారి దగ్గరకు వెళ్ళి- చేసిన పెళ్ళిపనులూ, ఇంకా చేయాల్సినవీ లిస్ట్‌నుబట్టి అన్నీ చెప్పబోయాను.

దానికి మధ్యలోనే నన్ను ఆపేసి ‘‘ఇంక ఆపు ఆ నస. పెళ్ళి లేదూ గిళ్ళీ లేదూ, ఆ పెళ్ళి ఆగిపోయింది. అడ్వాన్సులు తీసుకున్న వెధవలందరినీ ఎంతోకొంత తిరిగి ఇచ్చి ఏడవమను. వెధవలు, డబ్బు మనుషులు... కట్నం డబ్బులు తక్కువొచ్చాయనీ బంగారం లాంటి పిల్లను కాదంటారా? కక్కుర్తి వెధవలు, పోనీ... ఆ సంబంధం పోతే నా కూతురికి ఎవరూ దొరకరనుకుంటున్నారు. ఇంతకంటే మంచి సంబంధం పైసా కట్నం లేకుండా చేస్తాను. ఏమనుకుంటున్నారో కక్కుర్తి మనుషులు’’ అని ధుమధుమలాడిపోయారు.

ఒక్క నిమిషం నాకు విచారించాలో, ఆనందించాలో తెలియలేదు. వెంటనే మాస్టారి అమ్మాయి మనసులో మెదిలింది. నెమ్మదిగా మాస్టారికి మాత్రమే వినపడేటట్లు ‘‘ఆ పైసా కట్నం లేకుండా చేసుకోబోయేవాడిని నేను కాకూడదా గురువుగారూ’’ అని అడిగాను.

ఆ మాటకి ఆయన విస్తుపోయి ఒక్క నిమిషం అలాగే ఉండిపోయి ఆ తర్వాత కళ్ళజోడు సవరించుకుని నన్ను పైనుండి కిందవరకూ చూస్తూ ‘‘ఏమేవ్‌ ఏడుప్పీనుగా, ఆ ఏడుపులు ఆపి ఇలా బైటికి తగలడండి. పెళ్ళి ఆగిపోలేదు, అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లే అవుతుంది. కాకపోతే, ఇంకా పెద్ద ఉద్యోగస్తుడూ, మంచి మనసున్నవాడితోనూ’’ అన్నారు.

ఆయన కళ్ళలో సంభ్రమాశ్చర్యాలున్నా, నోటికి మాత్రం ఎప్పటిలా దురుసుతనమే.

***

‘‘ఏంటీ, ఫ్లాష్‌బ్యాక్‌లో నుంచి ఇంకా బైటికి రాలేదా?’’ అంటూ నా భార్య ఉత్పల రావడంతో ఇహలోకంలోకి వచ్చాను.

‘అందుకే మనం ఆశ నిరాశలు పడకూడదు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మనకు ఏది రాసిపెట్టి ఉంటే అది తప్పక జరుగుతుంది’ అని మనసులో అనుకుంటుండగా- ‘‘హలో... ఏంటీ, ఇంకా మా నాన్నగారి తిట్ల బాధనుంచి బైటికి రాలేకపోతున్నారా’’ అంటూ భుజాలు రెండూ పట్టుకు కుదిపింది ఉత్పల.

‘‘మామయ్యగారి తిట్లకి బాధపడటమా... అస్సలు లేదు. వాటివల్లనే కదా నాకు తెలుగులో చంధస్సూ ఒంటబట్టింది, ఈ ఉత్పలమాలా సొంతమయింది’’ అన్నాను ఆనందంగా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.