close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తప్పు మనదే!

తప్పు మనదే!

సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల మనుషులు అభివృద్ధి చెందారు. కానీ ప్రకృతి సర్వ నాశనం అయింది. మనిషి చేసిన తప్పులకి ఎన్నో జీవజాతులు భూమ్మీద చోటు కోల్పోయాయి. రుతువులు గతి తప్పాయి. ప్రకృతి విపత్తులు పెరిగిపోయాయి. భూగ్రహం రోజురోజుకీ నిప్పుల కొలిమిలా మారుతోంది. ప్రకృతికి మనం చేస్తోన్న నష్టానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం.
ర్యావరణాన్ని వేధిస్తోన్న ప్రధాన సమస్య భూతాపం. దానికి ముఖ్యమైన కారణం కాలుష్యమే. పారిశ్రామిక విప్లవం, మోటారు వాహనాలూ, ఫ్రిజ్‌లూ, ఏసీల లాంటి ఆధునిక వస్తువుల వినియోగం పెరిగాక వాయు, జల, ధ్వని, భూ కాలుష్యం పెరిగిపోయింది. ఫలితంగా ఎండా కాలం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. వర్షాకాలంలో తగినన్ని వానలు కురవట్లేదు.

* గాలిని ఎక్కువగా కలుషితం చేసే దేశాల్లో చైనా, అమెరికా, రష్యా, భారత్‌, మెక్సికో తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. విపరీతమైన వాహన వినియోగమే దీనికి కారణం.

* ఐపీసీసీ (ఇంటర్నేషనల్‌ ప్యానెల్‌ ఫర్‌ క్లైమేట్‌ చేంజ్‌) నివేదిక ప్రకారం భూతాపం ఇదే స్థాయిలో కొనసాగితే ఎనభై ఏళ్లలో సముద్రమట్టం 7 నుంచి 24 అంగుళాల మేర పెరుగుతుంది. దాని వల్ల తీరప్రాంతాల్లో మనుగడ అసాధ్యం. ఇప్పటికే సముద్రాల్లో చాలా హిమానీ నదాలు కరిగిపోయి యాభై ఏళ్లలో నీటి మట్టాన్ని రెండు అంగుళాల మేర పెంచాయి.

* 1950 నుంచి పెరిగిన భూతాపం కారణంగా పది లక్షలకుపైగా జీవజాతులు అంతరించిపోయాయి. అప్పటివరకూ వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ 9 శాతం మేర పెరిగితే, ఆ తరవాత నుంచీ క్రమంగా 40 శాతానికి పైగా పెరుగుతూ వస్తోంది. చెట్లూ, సముద్రాలూ పీల్చుకునే స్థాయికంటే ఎంతో వేగంగా గాల్లోకి బొగ్గుపులుసు వాయువు విడుదలవుతోంది.

* భూతాపం పెరగడంలో ప్రధాన వాటా పెద్దన్న అమెరికాదే. వాతావరణంలోకి ఏటా 40కోట్ల మెట్రిక్‌ టన్నుల కాలుష్య కారకాలు విడుదలవుతుంటే, అందులో 25కోట్ల మెట్రిక్‌ టన్నుల్ని కేవలం అమెరికానే విడుదల చేస్తోంది. ప్రపంచ జనాభాలో అమెరికన్లు ఐదు శాతం కూడా లేరు. కానీ ఏటా విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌లో పాతిక శాతం వాటా వాళ్లదే.

* కాలుష్యం కారణంగా ఏటా 55లక్షల మంది చనిపోతున్నారు. ఆ మరణాల్లో సగానికిపైగా సంభవించేది చైనా, భారత్‌లలోనే. చైనాలో దాదాపు 16 లక్షల మంది కాలుష్యం కారణంగా సోకిన వ్యాధుల వల్ల చనిపోతుంటే, భారత్‌లో ఆ సంఖ్య 14లక్షలు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఎనిమిదేళ్లలో దిల్లీ ఏటా 33వేల కాలుష్య కారక మరణాలతో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటుందని యూఎస్‌, కెనడా, భారత్‌, చైనా శాస్త్రవేత్తల సంయుక్త బృందం తేల్చింది.

* నలుగురు మనుషులున్న కుటుంబం బతకడానికి కావల్సినంత ప్రాణవాయువుని ఒక చెట్టు విడుదల చేస్తుంది. అలానే ఒక వాహనం ఏడాదంతా విడుదల చేసే కార్బన్‌ మొనాక్సైడ్‌ను ఒక చెట్టు శుద్ధి చేస్తుంది. అంటే మనుషులకీ ఆరోగ్యం, ఆయువూ... రెంటినీ ఇచ్చేది చెట్టే.

* ప్రపంచవ్యాప్తంగా నలబై శాతం విద్యుత్తు బొగ్గు నుంచే ఉత్పత్తవుతుంది. భూతాపం పెరగడంలో ప్రధాన వాటా ఆ బొగ్గు నుంచి విడుదలయ్యే విషయవాయువులదే. ఆ తరవాతి స్థానం వంట చెరకు, వాహన కాలుష్యం తదితరాలది.

* అడవుల నరికివేత, కాలుష్యం ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగితే మరో ఎనభై ఐదేళ్లలో భూమిపైన ఉష్ణోగ్రతల సగటు 6డిగ్రీల మేర పెరుగుతుంది. దానివల్ల వందలాది జీవజాతులు అంతరించడంతో పాటు మనుషుల మనుగడా ప్రమాదంలో పడుతుంది.

* భారత్‌లో ఏటా సంభవించే మరణాల కారకాల్లో కాలుష్యానిది నాలుగో స్థానం.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం గాలిలో కాలుష్య కారకాలు క్యూబిక్‌ మీటర్‌కి 25 మైక్రోగ్రాముల కంటే ఎక్కవ ఉండకూడదు. కానీ భారత్‌లోని చాలా నగరాల్లో దాని సంఖ్య 250 మైక్రోగాముల కంటే ఎక్కువ.

* గత యాభై ఏళ్లలో ఇజ్రాయెల్‌ తమ భూభాగంలో ఎడారి శాతాన్ని తగ్గించుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచడంలో అన్నింటికంటే ముందుంది. 21వ శతాబ్దంలో ఇప్పటివరకూ 25 కోట్ల చెట్లను పెంచి రికార్డు సృష్టించింది.

* చెట్లు ప్రాణికోటికి దాదాపు 20లక్షల రకాలుగా ఉపయోగపడతాయి. ఓ చెట్టు రోజుకి దాదాపు 380 లీటర్ల నీటిని వాతావరణంలోకి వదుల్తుంది. అదే చెట్టుని పెద్ద గదిలో ఉంచితే పది ఏసీలు ఇరవై గంటల పాటు పనిచేస్తే విడుదల చేసేంత చల్లదనాన్ని ఆ ఒక్క చెట్టే అందిస్తుంది.

* విస్తీర్ణంలో అత్యధిక భూభాగం చెట్లతో నిండిన దేశాల్లో బ్రెజిల్‌ది రెండో స్థానమైతే, అత్యంత వేగంగా చెట్లను నరికేస్తున్న దేశాల్లో దానిది మొదటి స్థానం. చేజేతులా వనరుల్ని నాశనం చేసుకుంటూ, వాతావరణ అసమతుల్యానికి కారణమవుతోందంటూ ఐరాస ఎన్నోసార్లు బ్రెజిల్‌ని హెచ్చరించింది.

* మన దేశంలో మనిషీ చెట్టూ నిష్పత్తి 1:28. అంటే ఒక మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. పొరుగుదేశం చైనాలో ఒకరికి 119, అమెరికాలో 716, కెనడాలో ఏకంగా ఒకరికి 9వేల చొప్పున చెట్లున్నాయి. భారత్‌లో ఉష్ణోగ్రతలు పెరగడానికీ, రుతువుల సమతుల్యం దెబ్బతినడానికీ ఇదే ప్రధాన కారణం.

 


 

హిమాలయాలు కరిగిపోతున్నాయ్‌!

మనిషి పెడుతున్న కాలుష్య కుంపటి రోజురోజుకీ మరింత రాజుకుంటోంది. ఆ సెగ వూరూ వాడా నదులూ సముద్రాలూ దాటి హిమాలయాలకూ తాకి అక్కడి మంచు కొండల్ని కరిగిస్తోంది. ఫలితంగా ఎన్నో జీవనదులకు పుట్టినిల్లైన హిమాలయాల ఉనికికే ముప్పు ఏర్పడింది!

 
హిమాలయాలు భారతదేశానికి ఉత్తర దిక్కున ఉన్నప్పటికీ... చాలా విషయాల్లో అవే మనకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నాయి. కట్టని గోడలా ఉంటూ సైబీరియా నుంచి వీచే చల్ల గాలుల నుంచి మనల్ని రక్షిస్తున్నాయి. శత్రు దుర్భేద్యంగా ఉంటూ సైన్యం పాత్ర పోషిస్తున్నాయి. రుతుపవన వ్యవస్థలోనూ వీటి పాత్ర ఉంది. దేశంలోని అతిపెద్దదైన గంగానదికి పుట్టినిల్లుగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా ఉన్నాయి. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాల్లో వీటిది విడదీయలేని బంధం. మనదేశంతోపాటు టిబెట్‌, అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌, చైనా, బంగ్లాదేశ్‌కూ హిమాలయాలు జీవనాధారంగా ఉంటున్నాయి.

మంచు కొండలు కరిగితే...
ప్రపంచం మొత్తంమీద లభించే స్వచ్ఛమైన నీటిలో 14 శాతం హిమాలయాల్లోనే దొరుకుతుంది. ఈ ప్రత్యేకతకు కారణం హిమాలయాల్లోని హిమనీనదులే. ఈ హిమనీనదులు(మంచు కొండలు) గడ్డకట్టిన జలాశయాలుగా ఉంటూ చుట్టుపక్కల దేశాలకు తాగు, సాగునీటిని అందిస్తున్నాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యాంగ్జీ సహా దాదాపు పది పెద్ద నదులకు హిమాలయాలే పుట్టినిల్లు. ఈ నదులే కాకుండా వాటి ఉపనదులు అనేకం. మనదేశలో 50 కోట్ల మంది, చైనాలో 45 కోట్ల మంది ప్రత్యక్షంగా, మరెంతో మంది పరోక్షంగా హిమాలయాలపైనే ఆధారపడి బతుకుతున్నారు. వేసవిలో ఈ హిమనీనదులు కరగడంవల్ల అక్కడ పుట్టే నదుల్లో ఆ సమయంలోనూ నీరు ప్రవహిస్తుంది. దానివల్ల వర్షాకాలం ఆరంభానికి ముందు నీటి అవసరాల్ని అవి తీరుస్తున్నాయి. సాగునీరు, తాగునీరే కాదు, విద్యుదుత్పత్తి, పర్యాటక రంగాల అభివృద్ధికీ ఈ హిమనీనదులే కారణం. అందుకే హిమాలయాలు కేవలం పర్వతాలు మాత్రమే కాదు ఓ అద్భుత వ్యవస్థ. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ మంచు కొండల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. హిమాలయ శ్రేణుల్లో 40 వేల చ.కి.మీ. విస్తీర్ణంలో, 50 వేల మంచుకొండలున్నాయి. సమస్యంతా అవి అవసరానికంటే ఎక్కువగా కరిగిపోతుండడం. ఫలితంగా ఈ మంచు కొండల విస్తీర్ణం ఏటా నాలుగు శాతం తగ్గిపోతోంది. హిమనీనదుల్లోని మంచు వేసవిలో మాత్రమే కాకుండా ఏడాది పొడుగునా కరిగి నీరుగా మారిపోయి ఎక్కడికక్కడ సరస్సులు ఏర్పడుతున్నాయి. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండటంవల్ల పర్వతాల కుదుళ్లు డొల్లబారుతున్నాయి. ఈ సరస్సుల్లో కొత్త నీరు చేరేసరికి ఆ తాకిడికి నిలవలేక కుంగి వరదలు సృష్టిస్తున్నాయి. పక్కపక్కనే ఉండే ఇలాంటి సరస్సులు రెండు, మూడు కలిస్తే ముప్పు ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఆ సమయంలో పైనుంచి నీటితోపాటు బురద, బండరాళ్లూ కొట్టుకొస్తున్నాయి. ఫలితంగా వూళ్లూ, దారులూ, వంతెనలూ, జంతువులూ కొట్టుకుపోయి ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంటోంది.

మరో కారణమూ ఉంది!
హిమాలయాల్లో వేడి పెరగడానికి మొదటి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంకాగా, రెండోది శిలాజ ఇంధనాల వినియోగంతో వచ్చే బ్లాక్‌ కార్బన్‌. హిమాలయాల ప్రాంతంలో పెరుగుతున్న జనాభా తమ అవసరాలకు కట్టెలు, బొగ్గు, కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాంతో గాలిలో ధూళి కణాలూ, పొగా పెరుగుతున్నాయి. ఇవి సూర్యరశ్మిని గ్రహించి వాతావరణంలో వేడిని మరింత పెంచుతాయి. ఈ వేడివల్ల కూడా హిమనీనదులు కరిగిపోతున్నాయి. గంగా పుట్టినిల్లు ‘గంగోత్రి’ కూడా ఓ హిమనీనది. దీని పొడవు ఏటా 15 మీటర్లు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ మంచు కొండల్లో పెరిగే ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రతా సమీప భవిష్యత్తులో వరదల్నీ, ఆ తర్వాత కరవునీ తెస్తాయని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు. వరదలతో నదుల్లో ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరిగి స్వచ్ఛమైన నీటి లభ్యత తగ్గుతుంది. ఫలితంగా వ్యవసాయం, జీవవైవిధ్యం దెబ్బతిని నదీ పరీవాహక ప్రాంత వాతావరణంలో మార్పులు వస్తాయి. మన దేశ సరిహద్దు పొడుగునా హిమాలయాల్లో 9000 హిమనీనదులు సరస్సులుగా మారడాన్ని గుర్తించారు. 60 ఏళ్లుగా ఈ సరస్సుల్ని పరిశీలిస్తున్నారు కూడా. వాటిలో 200 సరస్సుల నుంచి తీవ్ర ప్రమాదం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అవి విస్తీర్ణం పెంచుకోవడంలో వేగాన్ని ఇప్పుడు మరింత పెంచాయంటున్నారు. ధృవ ప్రాంతాల్లో మంచు కరగడంవల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. కానీ హిమాలయాల్లో మంచు కరగడంవల్ల దాని ప్రభావం పరిసర ప్రాంతాలపైన మంచు తుఫానులూ, భూకంపాల రూపంలో స్వల్ప వ్యవధిలో పడుతుంది. హిమాలయాల్లో మార్పుల ప్రభావం బంగాళాఖాతంపైనా పడనుంది. అంటే దక్షిణ భారతావనిపైనా ఆ ప్రభావం ఉంటుందన్నమాట.

ఇప్పుడున్న మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరిగితే వందేళ్లలో హిమాలయాల్లో 5-6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి ఇప్పటికే చుట్టుపక్కల దేశాలు చర్యలు మొదలుపెట్టాయి. అయితే అవి ఏమేరకూ సరిపోవడంలేదు. మరింత వేగంతో, ఇంకెంతో నిబద్ధతతో చర్యలు చేపడితేకానీ హిమాలయాల్ని రక్షించుకోలేం!


 

వీళ్ల చేతులు అద్భుతాన్ని చేశాయి!

అందంగా ఉంటాయని ఇంట్లో పూలమొక్కలు పెంచుతాం. అవసరానికి పనికొస్తాయని పెరట్లో కాయగూరలు పండిస్తాం. ఆ కొద్దిపాటి పచ్చదనానికి కూడా ఎంతో కొంత సొంత ప్రయోజనాన్ని ముడిపెడతాం. కానీ కొందరుంటారు... ప్రపంచమంతా తమ కుటుంబమే అనుకుంటారు. పచ్చదనం ఆ కుటుంబానికిచ్చే బహుమతిగా భావిస్తారు. ప్రతిఫలం ఆశించకుండా చెట్లను పెంచడమే పనిగా బతుకుతారు. వాళ్ల జీవితాలు చాలా నిస్వార్థమైనవి... అచ్చం చెట్టులా.

పుట్టిన రోజుకి ఒక మొక్క నాటినా పోయేలోపు మహా అయితే వంద పూర్తవుతాయి. పోనీ రోజుకి ఒకటి నాటినా వందేళ్ల నిండు జీవితంలో ఆ సంఖ్య 36వేలు దాటదు. అలాంటిది గత ఐదు దశాబ్దాల్లో కోటికి పైగా మొక్కలు నాటి, ఇప్పటికీ అదే పనిలో ఆనందాన్ని పొందుతోన్న వ్యక్తి దరిపల్లి రామయ్య. సొంత జిల్లా ఖమ్మం వాసులు ఆయన్ని ప్రేమగా చెట్ల రామయ్య అని పిలుచుకుంటారు. పద్దెనిమిదేళ్ల వయసు నుంచి మొక్కలు పెంచడమే పనిగా పెట్టుకున్న రామయ్య, ఆ అలవాటు తన తల్లి నుంచి వచ్చిందంటాడు. ‘చిన్నప్పుడు మా అమ్మ పెరట్లో రకరకాల మొక్కలు నాటేది. సరదాగా అనిపించి నేను కూడా వీధిలో ఖాళీ ఉన్న చోటల్లా ఏదో ఒక మొక్క నాటేవాణ్ణి. క్రమంగా అదో అలవాటుగా, వ్యసనంగా, జీవితంగా మారిపోయింది’ అంటాడు రామయ్య. యాభై ఏళ్లుగా ఖాళీ ప్రాంతం కనిపించిన చోటల్లా విత్తనాలు జల్లడం, మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్నాడు. అలా ఎనభయ్యో దశకంలో ఖమ్మంలో ఆయన నాటిన చెట్లు ఇప్పుడు మహా వృక్షాలై, రహదార్లమీద, చెరువు గట్ల దగ్గర, గోదారి పక్కన, నడి వీధుల్లో వేలాది మందికి ప్రాణ వాయువును అందిస్తున్నాయి. ఏవి పడితే అవి కాకుండా, ప్రజలకూ, ప్రకృతికీ ఉపయోగపడేలా కానుగ, వేప, మామిడి, సీతాఫలం, నిద్ర గన్నేరులాంటి రకరకాల చెట్లకు ఆయన ప్రాణం పోశాడు. ఎంచుకున్న మార్గం వల్ల రామయ్య పేదరికంలోనే చిక్కుకుపోయినా, ప్రకృతికి ఆయనిచ్చిన సంపదను మరే శ్రీమంతుడూ ఇవ్వలేడన్నది నిజం.