close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పదేళ్లలో అడవి సిద్ధం!

పదేళ్లలో అడవి సిద్ధం!

చెట్లు కాయలూ పండ్లనిస్తాయి, నీడనిచ్చి సేదదీరుస్తాయి, ప్రాణవాయువునిస్తాయి. కానీ మనం... వాటి ఉనికే లేకుండా చేస్తున్నాం. చెట్లు కొట్టేస్తుండటంతో పర్యావరణానికి ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ‘సాధారణ వేగంతో మొక్కల్ని పెంచితే ఆ లోటుని పూడ్చలేం. అందుకే పది రెట్లు వేగంగా పెంచేద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం’ అంటోంది ‘అఫారెస్ట్‌.’

కార్ల తయారీ కంపెనీ టొయోటాలో ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు సుభేందు శర్మ. 2008లో తమ ప్రాంగణంలో జపాన్‌కు చెందిన పర్యావరణవేత్త అకీరా మియావాకీని మొక్కలు పెంచడానికి పిలిచిందా సంస్థ. మియావాకీ పద్ధతిలో చెట్లు పది రెట్లు వేగంగా పెరుగుతాయి. ఆ ప్రాజెక్టు సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన సుభేందు... మొక్కలు వూహించనంత వేగంగా పెరుగుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పట్నుంచి అతడి మనసు మొక్కల పెంపకంవైపు మళ్లింది. తన ఇంటి పెరడులో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో మియావాకీ పద్ధతిలో 42 రకాలకు చెందిన 300 మొక్కల్ని నాటాడు. వాటిలో 18 రకాలు పండ్లు ఇచ్చేవే. అంతకు ముందువరకూ ఆ ప్రాంతంలో నాలుగైదు రకాల పక్షులే కనిపించేవి. సుభేందు పెంచిన అడవితో రెండేళ్ల తర్వాత అక్కడికి 17 రకాల పక్షులు వచ్చి వాలడం, ఉష్ణోగ్రతలో నాలుగైదు డిగ్రీలు తగ్గుదల రావడం చూశాడు. తర్వాత ఉద్యోగం విడిచిపెట్టి బెంగళూరు కేంద్రంగా 2011లో ‘అఫారెస్ట్‌’ (afforestt.com)ని ఏర్పాటుచేసి మియావాకీ విధానాలకు మరికొన్ని మెరుగులు దిద్ది తనదైన శైలిని అవలంబిస్తున్నాడు.

ప్రత్యేకం ఎలా అంటే...
మొక్కలు పెంచడమంటే వాటిని తెచ్చి నాటడం నుంచి కాకుండా అంతకంటే ముందే నేలను అందుకు అనుకూలంగా తయారుచేయడం నుంచి మొదలవుతుంది వీరి ప్రక్రియ. ఎంపికచేసిన చోట ముందు భూపరీక్ష చేస్తారు. దాన్నిబట్టి ఆ నేలలో ఏ పోషకాలు లోపించాయో, వాటిని ఎలా జోడించాలో చూస్తారు. ఆ తర్వాత పెంచాల్సిన మొక్కల్ని ఎంపికచేస్తారు. సాధారణంగా స్థానిక వృక్షజాతుల్నే నాటతారు. మొక్కలు పెంచాల్సిన చోట మీటరు లోతున నేలను తవ్వి మట్టిలో కొబ్బరి పొట్టూ, వూక, పౌల్ట్రీ వ్యర్థాలూ ఇంకా స్థానికంగా అందుబాటులో ఉండే మరికొన్ని జీవవ్యర్థాలనీ కలుపుతారు. ఇలా చేయడంవల్ల మొక్కలకు పోషకాలు అంది వేళ్లు సులభంగా నేల లోపలికి చొచ్చుకుపోతాయి. నేలలో నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటుంది కూడా. రసాయన ఎరువుల్ని మాత్రం ఉపయోగించరు. మొక్కలు నాటాక నేలలో తేమ పోకుండా ఆ స్థలంలో మొక్కల మధ్యన వరి గడ్డిని వేస్తారు. సాధారణంగా ఏ అడవి అయినా నాలుగు దశల్లో ఉంటుంది... పొదలూ, తక్కువ ఎత్తుండే చెట్లూ, ఒక మాదిరి చెట్లూ, భారీ వృక్షాలూ. వీరు మొక్కలు నాటేటపుడు ఇదే అంశాన్ని పాటిస్తారు. మొక్కలు స్థలాన్నీ, సూర్యరశ్మినీ ఒకదానితో ఒకటి పోటీపడి తీసుకునేలా కాకుండా అన్నిటికీ సరిపోయేలా నాటతారు. ‘సూర్యరశ్మి బాగా అవసరమయ్యే చెట్టు నీడన ఎండల్ని తట్టుకోలేని రకాలు వచ్చేలా చూడొచ్చు’ అని చెబుతాడు సుభేందు. ఇలా చేయడంవల్లనే మామూలుగా మొక్కలు పెంచే పద్ధతితో పోల్చితే దీంట్లో 30 రెట్లు ఎక్కువ దట్టంగా ఉంటుంది. మొక్కలు బాగా పెరిగి ఎనిమిది నెలల్లోనే అక్కడ చిక్కటి పచ్చదనం వస్తుంది. దాంతో నేలలోని తేమ పోకుండా ఉంటుంది. మూడేళ్లలో మొక్కలతోపాటు పక్షులూ, చిన్న జంతువులతో అక్కడ అటవీ వాతావరణాన్ని చూడొచ్చు. మూడేళ్ల తర్వాత వాటి సంరక్షణకోసం శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే ఉండదు.

మీరూ నాటొచ్చు...
స్కూళ్లూ, ఇళ్లూ, కార్పొరేట్‌ కంపెనీలూ, తయారీ పరిశ్రమలు తమ ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశంలో ఈ తరహాలో మొక్కల్ని పెంచుకోవచ్చంటాడు సుభేందు. ‘ఒక కార్పొరేట్‌ కంపెనీ ఎండీ నన్ను పిలిచి వారి కార్యాలయ ప్రాంగణంలో 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడవిని పెంచమన్నారు. వారి బోర్డు సమావేశాలు దాని మధ్యలో పెట్టడానికి స్థలం కూడా ఉంచమన్నారు. 1500 మొక్కలు నాటి వారు కోరిన విధంగా అడవిని పెంచాం’ అని చెబుతున్నారు శర్మ. టొయోటా, జీఎంఆర్‌, శాంసోనేట్‌, సిస్కో లాంటి సంస్థలు వీరి ఖాతాదారుల జాబితాలో ఉన్నాయి. అఫారెస్ట్‌ రెండు విధాలుగా పనిచేస్తుంది. సంస్థ ప్రతినిధులు వచ్చి నేలను చదునుచేసి, మొక్కలు నాటి మూడేళ్లపాటు వాటి సంరక్షణను చూడటం, లేదంటే నేల చదును చేయడం, మొక్కలు నాటడం వరకూ చూసుకొని నిర్వహణను ఆయా వ్యక్తులూ, సంస్థలకు అప్పగించడం. అఫారెస్ట్‌ మనదేశంలో 80కిపైగా ప్రాజెక్టులు చేపట్టింది. అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, మలేషియా, ఒమన్‌లలోనూ ప్రాజెక్టులు చేపట్టారు. ఒక పెద్ద అడవి పెరగాలంటే వందల ఏళ్లు పడుతుంది. అదే ఈ పద్ధతిలో పదేళ్లకే మనం ఆ స్థాయి అడవిని చూడొచ్చంటారు సుబేంధు. పట్టణాలూ, నగరాల్లో ఈ అడవుల్ని పెంచితే వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు జీవవైవిధ్యాన్నీ కాపాడొచ్చంటారాయన.

తరిగిపోతున్న పచ్చదనాన్ని తిరిగి పెంచాలంటే ఈ ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతి అవసరమే కదా! లేకుంటే మంచి గాలిని కొనుక్కోవాల్సిన రోజుల్ని త్వరలోనే చూడాల్సి వస్తుంది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.