close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అలా ఎవరూ చనిపోకూడదని...

అలా ఎవరూ చనిపోకూడదని...

రోడ్డుపైన గుంతలు... నోళ్లు తెరిచిన యమ దూతలు. ఎన్నో ప్రమాదాలకూ, మరెన్నో మరణాలకూ కారణ భూతాలు. అందుకే ఆ గుంతల్ని పూడ్చుతూ సామాన్యుడి జీవనయానం సాఫీగా సాగేలా కృషి చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన కట్నం బాల గంగాధర్‌ తిలక్‌.

రైల్వేలో ఇంజినీర్‌గా పనిచేసి ఎనిమిదేళ్ల కిందట రిటైరయ్యాక విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చాను. తర్వాత ‘సైయెంట్‌’లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఓరోజు ఆఫీసుకి వెళ్తూ ఓ రోడ్డు ప్రమాదాన్ని చూశాను. బైక్‌పైన వెళ్తున్న కుర్రాడు ముందున్న గుంతను తప్పించే క్రమంలో సడన్‌ బ్రేక్‌ వేసేసరికి వెనకనుంచి వేగంగా వచ్చిన కారు అతణ్ని ఢీకొట్టింది. తలకి దెబ్బ తగిలి చనిపోయాడు. గుంతవల్లనే ప్రమాదం జరిగిందని ఎఫ్‌.ఐ.ఆర్‌.లో రాయమనీ, సంబంధిత ఇంజినీర్‌ని పిలిచి గుంతను పూడ్చేలా చూడమనీ పోలీసులకి చెబితే... ‘ఓ పక్క మనిషి చనిపోతే నువ్వు గుంతలంటావేంటి’ అని విసుక్కున్నారు. తర్వాత కూడా అలాగే ఆ దారిలో మరో ప్రమాదం జరిగింది. కాసేపు ఆలోచించాక ‘ఇకపైన అలా ఎవరూ చనిపోకూడద’ని అనుకున్నాను. పాత రోడ్లు తవ్వి పడేసిన అచ్చులు దూరంగా ఫుట్‌పాత్‌ పక్కన కనిపిస్తే వాటిని తెచ్చి గుంతని పూడ్చాను. నాలుగు కార్లు వెళ్లేసరికి అవి గట్టిపడిపోవడం, వాహనాలు చక్కగా వెళ్లిపోవడం చూసి చాలా ఆనందపడ్డాను. తర్వాత నుంచి రోడ్డు అచ్చులు ఎక్కడ కనిపించినా తవ్వి బస్తాల్లో నింపి కార్లో వేసుకుని నేనుండే లంగర్‌హౌస్‌ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో రోజుకో గొయ్యినైనా పూడ్చేవాణ్ని. వేరే పనిమీద వెళ్లినా ఇలానే చేసేవాణ్ని.

ఉద్యోగం వదిలి...
గుంతల్ని పూడ్చుతున్నపుడు... ‘ఈ గుంత వల్లే మొన్న ప్రమాదం జరిగింద’నీ చెబుతూ స్థానికులూ సాయపడేవారు. కొద్దిరోజులకి రోడ్డు అచ్చులు కనిపించకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్ల దగ్గర తారు-రాళ్ల మిశ్రమాన్ని కొనేవాణ్ని. ట్రక్కు లోడుకి రూ.10వేలు అయ్యేది. ఆర్థిక కష్టాలు, కుటుంబ సభ్యుల మనోవేదన, వికలాంగులుగా మారడం... రోడ్డు ప్రమాదాలతో ఇలాంటి సమస్యలెన్నో. అందుకే, ఇంకా ఎక్కువగా చేయాలని ఏడాదిన్నర తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి 2011 ఆగస్టు నుంచి పూర్తి సమయం కేటాయిస్తున్నాను. ‘శ్రమదాన్‌’ (shramadaan.org) పేరుతో ఓ సంస్థను కూడా మొదలుపెట్టాను. ఉదయం ఎనిమిది గంటలకు తారు మిశ్రమం, పలుగూ, పారతో కారులో బయటకు వెళ్తే తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు దాటేది. ఆ సమయంలో నా పెన్షన్‌ రూ.25వేలూ వాటికే ఖర్చయిపోయేవి. నేను చేస్తున్నదంతా చెప్పి, బీమా పాలసీలు కూడా కట్టడంలేదని అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన మా అబ్బాయి రవికిరణ్‌కి ఓరోజు ఫోన్‌చేసి చెప్పింది నా శ్రీమతి. వాడు వెంటనే వచ్చి... ‘ఈ వయసులో మీకెందుకు ఇవన్నీ’ అంటూనే, నాతో ఒకరోజు వచ్చి చూశాక... ‘మీరు గొప్ప పని చేస్తున్నారు. ఇంటి బాధ్యత నేను చూసుకుంటాను. మీరు కొనసాగించండి’ అని చెప్పాడు. అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబుని కలిసి తారు, రాళ్ల మిశ్రమం అందేలా మా అబ్బాయే మాట్లాడాడు. వీటితో మరింత ఉత్సాహం వచ్చి నా కారుకి ‘పాట్‌హోల్‌ అంబులెన్స్‌’ అని పేరు పెట్టి నగరమంతా తిరుగుతూ గుంతలు పూడ్చేవాణ్ని. ఆ తర్వాత అధికారులు మారుతున్నా వెళ్లి కలుస్తూ ఆ మిశ్రమం వచ్చేలా చూసుకుంటున్నాను. రోడ్లపైన నిల్చిపోయే నీటిని పక్కకి పోయేలా చేస్తాను. ఆ నీటివల్లే రోడ్లు దెబ్బతింటాయి. నా కారు ఆగిందంటే బాటసారులూ, బైకు-కార్లమీద వెళ్లేవాళ్లూ వచ్చి తలో చేయి వేస్తారు. ఓసారి ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ కూడా దారిన వెళ్తూ ఆగి సాయం చేశారు.

బీబీసీ బహుమతి...
ఈమధ్యనే బీబీసీ జర్నలిస్టు నన్ను ఇంటర్వ్యూ చేశారు. బీబీసీ తరఫున విరాళం ఇస్తానంటే వద్దన్నాను. అమితాబ్‌ బచ్చన్‌కి నా గురించి ఆయన చెప్పడంతో తాను చేసే టీవీ షోకి పిలిపించారు బిగ్‌బీ. నా కారు నిండా తారు మరకల్ని చూసిన ఆ జర్నలిస్టు బీబీసీ తరఫున కారు కొనిస్తామని ఆ షోలో ప్రకటించి తర్వాత కొనిచ్చారు. ఆరోగ్యం సహకరించక ఈమధ్య వారంలో రెండ్రోజులే బయటకు వెళ్తున్నా. ఇప్పుడు నెలకు రూ.10-12 వేలు ఖర్చవుతుంది. దీనివల్ల కలుగుతున్న లాభంతో పోల్చితే నేను ఖర్చుచేస్తున్నది ఏమంత ఎక్కువ కాదు. ఎందుకంటే ఒక గుంత బతుకుని కుదేలు చేస్తుంది. గతుకుల రోడ్డుమీద ప్రయాణంతో వచ్చే వెన్ను నొప్పి, మెడనొప్పి లాంటివి ఒక్కోసారి ఎంత ఖర్చుచేసినా తగ్గవు. నాకు అంతుబట్టనిదల్లా రహదారులకు సంబంధించి ఒక పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉన్నాకూడా గుంతలు తగ్గకపోవడం!

మాది పశ్చిమ గోదావరి జిల్లా, దేవరపల్లి మండలంలోని ఎర్నగూడెం. మా తాత జమీందారు. ఆయన నలుగురికీ సాయపడటం చిన్నపుడు చూశాను. ఆయనే నాకు స్ఫూర్తి. నా శ్రీమతి వెంకటేశ్వరి మద్దతు లేకున్నా ఇవన్నీ చేయలేను. ప్రతి ఒక్కరూ వారంలో లేదంటే నెలలో ఒకరోజైనా సమాజ సేవకు కేటాయించాలనేది నా కోరిక!


 

అందుకే ఒలింపిక్స్‌కి వెళ్లట్లేదు! 

విజేందర్‌ సింగ్‌... భారత్‌కు తొలి ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ పతకాన్ని అందించాడు. దేశం నుంచి తొలిసారి ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించాడు. ఈ మధ్యే అధికారిక పోటీల నుంచి బయటికొచ్చి ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారాడు. దాని వల్ల 2016 ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయినా, వరుసగా దిగ్గజాలను మట్టికరిపిస్తూ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఒక్కో మెట్టూ ఎక్కుతున్నాడు. తన పాత జీవితం, ఈ కొత్త జీవితం గురించి అతడి మాటల్లోనే...

ఎప్పట్నుంచీ ఆలోచన?

ప్పట్నుంచో ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని లోలోపల ఉండేది. ఇంకొన్నాళ్లు పోతే నా సామర్థ్యం ఆ రంగానికి సరిపోకపోవచ్చు. అందుకే చాలా మథన పడ్డాకే దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని సైతం వదులుకొని ఈవైపు వచ్చాను.


ఎందుకీ మార్పు?

సాధారణ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కొడుకుగా చిన్నప్పుడు కోచింగ్‌కి కూడా డబ్బుల్లేక ఎన్నో ఇబ్బందులు పడ్డా. అందుకే డబ్బు విలువ నాకు బాగా తెలుసు. నేను దేశానికి పదిహేనేళ్లు ప్రాతినిథ్యం వహించి చాలా అరుదైన విజయాలతో పాటూ పేరూ సంపాదించాను. అందుకే ఇప్పుడు వ్యక్తిగత ఆసక్తి కొద్దీ ప్రొఫెషనల్‌గా మారా.


ఎటువంటి ఆహారం?

విదేశీయులతో పోలిస్తే మనం తీసుకునే ఆహారం అంత ఆరోగ్యకరమైంది కాదు. మన భోజనంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ. అందుకే నేను కేవలం ప్రొటీన్‌ నిండిన మాంసంతో పాటు, సప్లిమెంట్ల రూపంలోనే ఐరన్‌, కాల్షియం లాంటి ఖనిజాలను ఎక్కువగా తీసుకుంటా.


ఎందుకంత స్టయిల్‌గా...

నేను పెరిగింది హరియాణాలోని ఓ చిన్న గ్రామంలో. అక్కడ ఫ్యాషన్ల గురించి ఎవరూ పట్టించుకోరు. నేను బాక్సింగ్‌లో విజయాలు సాధించి సెలెబ్రిటీగా మారాకే ఎదుటివాళ్లు ఆహార్యానికి ఎంత విలువిస్తారో తెలిసింది. ఒలింపిక్స్‌ పతకం గెలిచాక వరసగా టీవీ ప్రకటనల్లో అవకాశాలు మొదలైనప్పట్నుంచే ఆటతో పాటు నా స్టయిల్‌పైనా దృష్టిపెట్టా.


ఎవరేమన్నారు?

కేవలం డబ్బుకోసమే ఈవైపు వచ్చానని చాలామంది విమర్శిస్తున్నారు. కానీ ప్రొఫెషనల్‌ టైటిల్‌ సాధించినా ‘ఓ భారతీయుడు గెలిచాడు’ అనే ప్రపంచం అంటుంది. కాబట్టి భారత్‌ తరఫున నేనింకా ఆడుతున్నట్లే లెక్క.


ఏంటీ తేడా?

ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో డబ్బే ప్రధానం. బహుమతులు ఎంత భారీగా ఉంటాయో రిస్కు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. రక్షణ కోసం హెడ్‌ గేర్‌ కూడా పెట్టుకోకూడదు. ఓ రకంగా అది ప్రాణాలతో చెలగాటమే. కానీ నిజంగా ఆటగాడి సామర్థ్యం బయట పడేది ఇందులోనే.


ఎలా సన్నద్ధం?

ప్రొఫెష్‌నల్‌ బాక్సింగ్‌లో నా ప్రత్యర్థులంతా ప్రపంచ స్థాయి ఛాంపియన్లే. మ్యాచ్‌కు ముందు ఒకరు ‘విజేందర్‌కు హారర్‌ సినిమా చూపిస్తా’ అని ప్రకటిస్తే మరొకరు నేను ‘విజేందర్‌ రక్తం తాగుతా’ అని హెచ్చరించారు. అలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే శారరీక సామర్థ్యం కంటే మానసిక ధైర్యం ఎక్కువ కావాలి. అందుకే ఈమధ్యే యోగా, ధ్యానంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టా.


ఎప్పుడూ ఆలోచించేది...

  నేనిప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మ్యాచూ నా భవిష్యత్తును నిర్ణయించేదే. కాబట్టి ఎల్లప్పుడూ నా దృష్టంతా తదుపరి మ్యాచ్‌పైనే. ఇప్పటిదాకా ఐదుగుర్ని ఓడించా. ఆరో మ్యాచ్‌ తొలిసారి దిల్లీలో నా సొంత ప్రజల మధ్య జరగనుంది. అది గెలిస్తే ‘వరల్డ్‌ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ ఆసియా’ టైటిల్‌ దక్కుతుంది.