close
కాంతిదూతలు

కాంతిదూతలు
- కటుకోజ్వల మనోహరాచారి

ల్లు చేరగానే ‘‘మీకో మాట చెప్పాలండీ’’ అంది శారద మంచినీళ్ళందిస్తూ.

సోఫాలో వెనక్కివాలి కళ్ళు మూసుకుంటూ ‘‘మళ్ళీ ఏదైనా పీకలమీదికొచ్చిందా’’ అన్నాను.

శ్రీమతి కాస్త తటపటాయిస్తూ ‘‘అలాంటిదేం లేదు. పిల్లలిద్దరూ ఫ్రెండ్స్‌తో కలిసి గోవా టూర్‌కెళ్ళారు... అంతే!’’ అంది నిర్లిప్తంగా.

నేను ఉలిక్కిపడ్డాను. సోఫాలో నిటారుగా కూర్చుంటూ ‘‘ఏంటీ... గోవా వెళ్ళారా? చెప్పాపెట్టకుండా ఇదేం టూర్‌? అయినా నువ్వెలా వెళ్ళనిచ్చావు’’ అన్నాను.

‘‘నేనొద్దంటే వింటేనా?’’

అదీ నిజమే! కన్నతండ్రిని నాకే చెప్పకుండా, నా అనుమతి లేకుండా వెళ్ళినవాళ్ళు ఇక తల్లిమాటేం వింటారు? దండనలేకే ఇలా అవుతున్నారా... డబ్బు ఎక్కువై చెడిపోతున్నారా... అర్థంకావడం లేదు. హైస్కూల్‌ చదువు కూడా పూర్తికాకుండా ఫ్రెండ్స్‌తో టూర్లేంటి? నాన్సెన్స్‌!!

నాలో పెల్లుబుకుతున్న అసహనాన్ని అణచుకుంటూ ‘‘రేపు కాళేశ్వరం దర్శనానికి వెళ్దామనుకున్నాం కదా...’’ అన్నాను.

‘‘వాళ్ళకు కాళేశ్వరంకన్నా గోవా బీచ్‌లే ఎక్కువిష్టంలా అనిపించినట్లుంది’’ అంది నిష్ఠూరంగా.

‘‘ఏడ్చావ్‌లే! పిల్లల్ని ఆ మాత్రం కట్టడి చేయని తల్లివెందుకు?’’ అన్నానేకానీ తప్పంతా ఆమె మీదకు తోయడం సరైంది కాదనిపించింది. తల్లిదండ్రులం ఇద్దరం పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, పిల్లలకు కావాలసినవన్నీ సమకూర్చిపెట్టినా వాళ్ళకు మాత్రం లెక్కలేనితనం పెరిగిపోతోంది. నేను ఫోన్‌ డయల్‌ చేశాను. ఇద్దరి ఫోన్లూ కవరేజ్‌లో లేవు. నాకెందుకో పిల్లలకు అతి సౌకర్యాలు కల్పించడం కూడా తప్పేమో అనిపిస్తుంది. వాహనాలూ, ఫోన్లూ, లాప్‌టాప్‌లూ, వాట్సప్‌లూ... మితిమీరిన స్వేచ్ఛ...ఛ! ఉద్యోగమూ వ్యాపారమూ అంటూ నిరంతర బిజీలో వాళ్ళకు నడవడిక నేర్పడంలో విఫలమవుతున్నామేమో అనిపిస్తుంది.

శారద మౌనంగా ఉండిపోయింది. ఆమెలోనూ ఇవే ఆలోచనలు తిరుగుతున్నట్లున్నాయి. అనవసరంగా ఆమెను నొప్పించానేమోనని ‘‘శారదా...’’ అంటూ దగ్గరకు తీసుకున్నాను.

‘‘కాళేశ్వరం వెళ్ళడం తప్పదంటారా..?’’

‘‘తప్పదు శారదా! నీకు తెలుసు కదా... ఈ వేసవిలో నేను మొక్కు తీర్చుకునేదుంది. అలాగే ఎన్నో రోజులుగా కలవాలనుకుంటున్న శ్రీనివాసశర్మ కుటుంబాన్ని కలిసినట్లుంటుంది. ఇప్పటికి ఎన్ని కార్యక్రమాలకు ఆహ్వానించినా వెళ్ళలేకపోయాం. ఇప్పుడు తప్పితే మళ్ళీ వీలుపడదు.’’

‘‘మరి పిల్లలు?’’

‘‘వాళ్ళొచ్చేలోపు వెళ్ళొస్తాంలే! ఎవరి ఆనందం వాళ్ళది.’’

శారద లేచి వెళ్ళి బ్యాగు సర్దడానికి సిద్ధమైంది.

* * *

కారు కాళేశ్వరం చేరింది.

కాళేశ్వర ముక్తేశ్వరుడిని దర్శించుకునే భాగ్యంతోపాటు నా చిరకాల మిత్రుడు శ్రీనివాసశర్మ కుటుంబంతో రెండు రోజులు గడిపే యోగ్యం దక్కింది.

శర్మ నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో మిత్రుడు. బాగా ఆత్మీయుడు. పెళ్ళై, పిల్లలు పుట్టాక మేము కలుసుకోవడమే తగ్గింది. తనూ అంతే! కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ ఇంటి దగ్గర పౌరోహిత్యం చేస్తూంటాడు. అప్పుడెప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చాం. చాలా రోజులుగా కలుసుకోవాలనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది.

శర్మ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. ఆయన భార్య స్రవంతి అంటే మా ఆవిడకు వల్లమాలిన అభిమానం. తనక్కూడా శారద అంటే అంతే ఇష్టం. శర్మకు ఇద్దరు మగపిల్లలు, తర్వాత ఒక ఆడపిల్ల. వాళ్ళకీ మా పిల్లల వయసే.

‘‘నమస్కారం అంకుల్‌... నమస్తే ఆంటీ’’ అంటూ వినయంగా చేతులు జోడించి నమస్కరించారు పిల్లలు. ‘‘అన్నయ్యల్ని ఎందుకు తీసుకురాలేదు ఆంటీ’’ అడిగింది శర్మ కూతురు శ్రీజ. నేనూ, మా ఆవిడా ముగ్ధులమైపోయాం వాళ్ళ వినయ సౌశీల్యానికి.

కాళ్ళూ చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగాక ఓ పది నిమిషాలు ఉభయపక్షాల క్షేమ సమాచారాలు ముచ్చటించుకున్నాం. ముందు గోదావరి స్నానం, దైవదర్శనం కావాలి. ఇంటి వెనుక మామిడిచెట్టు కింద పడక్కుర్చీలో కూర్చొని భాగవతం చదువుకుంటున్న వాళ్ళ నాన్న నారాయణశర్మగారినీ, పక్కనే పీట మీద కూర్చుని వత్తులు చేసుకుంటున్న వాళ్ళమ్మగారినీ పలకరించి వచ్చాక గోదావరి స్నానానికి కదిలాం. శర్మతోపాటు వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా మాతో బయలుదేరారు.

‘‘తాతయ్యా, గోదావరి స్నానానికి వస్తారా?’’ అన్నాడు శర్మ పెద్దకొడుకు శ్రవణ్‌.

‘‘నేను చదువుకుంటాన్లే నాన్నా... మీరు వెళ్ళిరండి’’ అన్నాడు నారాయణశర్మ.

‘‘ఆంటీ, నాకు ఈత కొట్టడం వచ్చు తెల్సా?’’ అంది శ్రీజ బయలుదేరుతుంటే. ఆమె ఆరో తరగతి చదువుతోంది.

‘‘ఔనా!’’ మా ఆవిడ ఆశ్చర్యపోయింది.

‘‘అసలు మాకు ఈదడం ఎవరు నేర్పారో తెల్సా... మా తాతయ్య. తాతయ్య గోదావరిలో ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకూ ఈదుతారు’’ అన్నాడు చిన్నకొడుకు శ్రీకర్‌.

ఈసారి ఆశ్చర్యపోవడం నావంతైంది. ‘‘తాతగారు మీకు ఈ వయసులో గోదావరిలో ఈత నేర్పడం చాలా గొప్ప విషయం.’’

‘‘అంకుల్‌, మేం ముగ్గురం ‘మంత్రపుష్పం’ అప్పజెబుతాం. అన్నయ్య అయితే మంత్రాలన్నీ చదువుతాడు. అది కూడా తాతయ్యే నేర్పారు’’ అంది శ్రీజ.

‘‘సర్లే, ఏం విసిగిస్తారు’’ అంటున్నాడు శర్మ.

మాకు మాత్రం ముచ్చటేసింది వాళ్ళను చూస్తుంటే. ఈ వయసులోనే ఎంత వినయం... ఎంత గౌరవం... ఎంత బుద్ధి కుశలత. మా ఆవిడైతే పిల్లల్ని క్షణం వదలడం లేదు. వాళ్ళుకూడా మా ఆవిడతో కలిసిపోయి దారెంటా ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నారు.

గోదావరి నిండుగా ఏమీ లేదు. దాదాపు ఓ గంటసేపు అందులో ఈదాక గుడికి బయలుదేరాం. వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది దేవాలయం. అంతా కల్సి దైవదర్శనం చేసుకున్నాం.

‘‘కాళేశ్వర ముక్తేశ్వర దర్శనం... సకల గ్రహదోష పీఢా నివారణం’’ అన్నాడు శ్రీకర్‌ గర్భగుడి నుండి బయటకొస్తుంటే.

‘‘ఔనా... ఎలా తెలుసుకున్నావ్‌?’’ అంది శారద విభ్రమంగా.

‘‘మా ఇంట్లో క్షేత్ర పురాణం పుస్తకం ఉంది కదా... అందులో చదివాను. తాతయ్య రోజూ మాతో ఆ పుస్తకాలన్నీ చదివిస్తుంటారు.’’

మంటపం బయటకొచ్చి ప్రాంగణంలో ఎడమవైపున రాతి నేలపై కూర్చున్నాం. శర్మ ప్రసాదం తేవడానికి వెళ్ళాడు. భక్తుల రద్దీ పెద్దగా లేదు. దూరంగా ఆలయ ముఖద్వారం దగ్గర రాతిమెట్లు ఎక్కుతున్న ఓ వృద్ధురాలు కాలు పట్టు తప్పి బోర్లా పడింది. ఆ ముసలమ్మ తాలూకు బంధువులెవరూ పక్కన లేరు.

అప్పటికే శర్మ పెద్దకొడుకు పరుగెత్తుకెళ్ళాడు. ఆమెను రెండు చేతుల్తో లేపే ప్రయత్నం చేశాడు. వెనుకే రెండో కొడుకు పరుగెత్తాడు. ఇద్దరూ సాయంపట్టి లేపి పక్కనే ఉన్న గద్దెపైన కూర్చోబెట్టారు. మా చేతిలో ఉన్న నీళ్ళ బాటిల్‌ తీసుకుని శ్రీజ పరుగెత్తింది. ముగ్గురూ కలిసి ఆమెకు నీళ్ళు తాగించారు. పెదవి చిట్లి రక్తం కారుతుంటే... ముఖంపై నీళ్ళు చిలకరించి తన దగ్గరున్న టవల్‌తో ముఖం తుడిచాడు శ్రవణ్‌.

వాతావరణం వేడిగా ఉండటంతో శ్రీజ కర్చీఫ్‌తో విసురుతోంది. ముగ్గురు పిల్లలు చుట్టూ చేరి ఆ వృద్ధురాలికి ఆత్మీయుల్లా సేవలు చేస్తుంటే దూరంనుండే మేము విస్తుబోయి చూస్తున్నాం. ఇంతలో శ్రీకర్‌ ఆలయంలోకి వెళ్ళి రెండు నిమిషాల్లో ఆ వృద్ధురాలి తాలూకు వ్యక్తితో వచ్చాడు. పిల్లలు చేస్తున్న సేవ చూసి అతనూ ముగ్ధుడైనట్లున్నాడు. చెయ్యెత్తి ఆశీర్వదించినట్లుగా ముగ్గురి తల నిమిరి ఆ ‘అమ్మ’ను తీసుకుని లోనికి నడిచాడు.

అంతా చూస్తున్న మా హృదయాలు ఆర్ధ్రంతో తడిశాయి. తిరిగి వస్తున్న పిల్లల్ని చూస్తుంటే శారద కళ్ళలో నీళ్ళు తిరిగాయి. శ్రీజను దగ్గరకు తీసుకుంది. ‘‘ఎవరమ్మా... ఆవిడ?’’

‘‘తెలీదాంటీ. చూసుకోకుండా వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు. అన్నయ్య వెళ్ళి చెప్పగానే వాళ్ళబ్బాయి వెనక్కి వచ్చాడు’’ అంది శ్రీజ.

నా మనసు ఎక్కడో ఉంది. మోటార్‌సైకిల్‌తో డాషిచ్చి, అయ్యో పాపం అనకపోగా, ఎందుకు అడ్డొచ్చావంటూ పడిపోయిన ముసలతన్ని లేపి మరీ పిడిగుద్దులు గుద్ది వచ్చిన నా పెద్దకొడుకూ, ఇంటిముందు అడుక్కోవడానికి వచ్చిన బిచ్చగాడిపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పిన నా చిన్నకొడుకూ గుర్తుకొచ్చారు. బాధ్యతాయుత జీవితంగానీ, పెద్దలపట్ల గౌరవభావంగానీ మచ్చుకైనా కనిపించని వాళ్ళ వ్యక్తిత్వం గుర్తుకొచ్చింది. కన్నతల్లి మంచానపడ్డా కాసిని నీళ్ళు తెచ్చీయని నా బిడ్డల వ్యక్తిత్వానికీ, ఈ బిడ్డల ఔదార్యానికీ పొంతనే లేదు.

దూరం నుండి శర్మ వస్తూ కనిపించాడు. ‘ఆణిముత్యాల్లాంటి బిడ్డల్ని కన్నావు. ధన్యుడివి శర్మా’ అనుకున్నాను.

వస్తూనే భోజనాలవేళ దాటిపోతుందని శర్మ తొందర చేయడంతో అందరం లేచి కదిలాం ఇంటివైపు.

* * *

పండువెన్నెల వెలుగులో అల్లంత దూరాన పాలనురగల ధారలా గోదారి కదలాడుతోంది.

ఇంటి వెనకాల పెరట్లో మామిడిచెట్ల కింద పట్టెమంచాలు వేసుకుని పడుకున్న మాకు గోదారి హొయలు మరింత వగలుపోతోన్నట్లుగా తోస్తోంది. రాత్రి భోజనాలయ్యాక అంతా అక్కడే మేను వాల్చాం. పిల్లలు ఒకరు తాతయ్య దగ్గరా, ఒకరు నానమ్మ పక్కనా వాలిపోయారు. పెద్దబ్బాయి వాళ్ళిద్దరి మధ్యన పడక వేసుకున్నాడు. పక్కపక్కనే పడుకుని శర్మా, నేనూ పిల్లల విషయమే మాట్లాడుకుంటున్నాం. కాస్త దూరంలో పడుకుని శారదా, స్రవంతీ వాళ్ళ విషయాలేవో వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు.

‘‘పిల్లల్ని తీర్చిదిద్దడంలో చాలా శ్రద్ధ వహిస్తున్నట్లున్నావ్‌ శర్మా’’ అన్నాన్నేను.

‘‘శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరే! కానీ చూస్తున్నావుగా... నాకంత సమయం ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే మనలాంటి కుటుంబాల్లో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం కష్టమైన పనే’’ అన్నాడు శర్మ.

అదీ నిజమే!

నేనాలోచిస్తున్నాను. శర్మ అంతగా శ్రద్ధ కనబరచకున్నా అతని పిల్లలు క్రమశిక్షణ విషయంలో, నడవడిక విషయంలో ఎన్నో విలువలు గ్రహించినట్లున్నారు. ఇదెలా సాధ్యమైంది? నా ఆలోచనలు నారాయణశర్మ వైపు మళ్ళాయి.

శ్రీజను పక్కన పడుకోబెట్టుకుని ఏదో కథ చెబుతున్నాడాయన. కథ పూర్తిచేసి ‘‘అందుకే... కష్టాల్లో ఉన్నవాళ్ళను మనం ఆదుకుంటే మనల్ని ఇతరులు ఆదుకుంటారు...’’ అంటున్నాడు.

‘‘మేము ఈరోజు ఒక ముసలమ్మ కష్టాల్లో ఉంటే కాసేపు సేవ చేశాం... తెల్సా తాతయ్యా?’’ అంది శ్రీజ.

‘‘తెల్సు తల్లీ... గుళ్ళొ అందరూ మీ గురించే చెప్పుకుంటున్నారు. దాని ఫలితం వూరికే పోదమ్మా. మీక్కూడా ఇంకెవరైనా సాయపడతారు. ఇక పడుకో తల్లీ’’ నెమ్మదిగా శ్రీజను నిద్రపుచ్చాడు నారాయణశర్మ.

ఈలోపు నానమ్మ పక్కన పడుకున్న శ్రీకర్‌ అంటున్నాడు ‘‘నానమ్మా, సెలవులే కదా... రోజూ గోదావరిలో ఈదుతామంటే నాన్న వద్దంటున్నాడు. నువ్వు చెప్పు నానమ్మా...’’

‘‘నాన్న చెప్పాడు కదా... వద్దులే.’’

‘‘అదేంటి నానమ్మా, నువ్వూ అట్లాగే అంటావు. సెలవులే కదా...ఈతకెళ్తే తప్పేంటి?’’

‘‘పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళడం తప్పే! అదీగాక నాన్న చెప్పిన మాటను గౌరవించడం పిల్లల ధర్మం. నీకు శ్రీరాముడు తెలుసు కదా! తండ్రి చెప్పాడని మరో ఆలోచన చేయకుండా పద్నాలుగేళ్ళు అరణ్యాలకు వెళ్ళాడు. ఆ కథ తెలుసు కదా!’’

‘‘తెల్సు తెల్సు... కానీ మళ్ళీ చెప్పు నానమ్మా’’

ఆవిడ చెప్పడం మొదలెట్టింది. అతడు ‘వూ’ కొడుతున్నాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాల్సి వచ్చిన గాథంతా చెప్పి ‘‘అదీ తల్లిదండ్రుల పట్ల రామునికున్న గౌరవాభిమానాలు’’ అని ముగించింది. అప్పటికే శ్రీకర్‌ నిద్రలోకి జారుకున్నాడు.

నేను నిద్రపోకుండా అవలోకిస్తున్నాను.

ఇంతలో పక్కనుండి శర్మ మాటలు వినిపించాయి. ‘‘మా పిల్లల్లో ఆ మాత్రం వ్యక్తిత్వ నిర్మాణానికి కారణమిదే!’’

నేను పడకమీదే సావధాన చిత్తుణ్ణయ్యాను. శర్మ కొనసాగించాడు.

‘‘ఒకనాడు ఉమ్మడి కుటుంబాల్లో సాయంకాలాలు- తాతలూ, నాయనమ్మలూ చిన్నపిల్లల్ని ఒళ్ళలో పడుకోబెట్టుకుని కథలూ గేయాలూ పురాణేతిహాస గాథలూ వాళ్ళ భాషలో చెప్పేవారు. విలువలూ నడవడికలూ నేర్పేవారు. ఒకరకంగా వాళ్ళు సంస్కృతీ భాండాగారాలు. పాఠశాల దశ కొచ్చేసరికి సంస్కృతీపరమైన చాలా అంశాల మీద పట్టు ఉండేది. ఇప్పుడు తల్లిదండ్రులు పట్టణాల్లో ఉంటుంటే, తాతలూ నాయనమ్మలూ పల్లెలకు పరిమితమవుతున్నారు. లేదంటే వృద్ధాశ్రమాలకు తరలుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సమయం వెచ్చించలేకపోతున్నారు. దానికి ఫలితం అనుభవిస్తున్నారు కూడా. అయితే, అందుబాటులోకొచ్చిన టీవీలూ సినిమాలూ కూడా ఆ పాత్ర పోషించలేకపోతున్నాయి’’ ఆయన చెప్పడం ఆపాడు.

నిజమే! నాకు మా తాతగారు గుర్తుకొచ్చారు. ఒకనాడు నేనూ మా తాతగారి పక్కలో పడుకుని కథలూ గాథలూ విన్నది గుర్తుకొచ్చింది. ఈరోజు నాకున్న సంస్కృతీ పరిజ్ఞానం వెనక మా తాతగారి పాత్ర ఎంతగా ఉందన్నది నాకు మాత్రమే తెలిసిన సత్యం.

అయితే... ఇదే అదృష్టం నేను మా పిల్లలకు కల్పించలేకపోయాను.

ఎందుకు?

తాతగారు అందుబాటులో లేకనా?

అమ్మ పోయాక నాన్నను నిర్లక్ష్యం చేసిన ఫలితం నా పిల్లల మీద పడుతోందా?!

సకల శాస్త్రాలూ చదివిన తాతగారు ఉండి కూడా నా పిల్లలు ఏం కోల్పోతున్నారో అర్థమవుతుంటే నా మనసు విచలితమవుతోంది. ఆలోచనలతో సతమతమవుతున్న మెదడు నిద్రకు దూరం చేస్తోంది.

క్రమంగా... అల్లకల్లోలంగా ఉన్న నా మనసులో ఓ నిర్ణయం రూపుదిద్దుకుంటోంది. నిర్ణయం బలపడగానే ప్రశాంతత ఆవరించి నిద్రలోకి జారుకున్నాను.

* * *

మర్నాడు...

మా కారు వృద్ధాశ్రమం వైపు పరుగు తీస్తోంది... ఆశ్రమంలో భారత భాగవత రామాయణాది పురాణేతిహాసాలతో కాలక్షేపం చేస్తున్న మా నాన్నగారి పాదాలని కన్నీళ్ళతో అభిషేకించి ఆహ్వానించడానికి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.