close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అరవంకిలో ఎన్ని అందాలో..!

అరవంకిలో ఎన్ని అందాలో..!

సందర్భానికి తగ్గట్లుగా తయారవడం అనేది ఈ తరం అమ్మాయిలకు పుట్టుకతో వచ్చిన విద్య. ఓ నిమిషం వదిలేసిన జుట్టూ జీన్సూ టీషర్టుల్లో ఆధునికతకు ప్రతీకలా కనిపిస్తే, మరునిమిషం లంగా ఓణీలో ఒంటి నిండుగా నగలతో అచ్చ తెలుగుదనానికి ప్రతిబింబంలా తళుక్కుమంటారు. అందుకేనేమో సంప్రదాయ నగలు కూడా వాళ్లకు తగ్గట్లుగానే తీరు మార్చుకుని సరికొత్త డిజైన్లలో అందంగా మెరుస్తున్నాయి. అలాంటి వాటిల్లో అరవంకీ ఒకటి.

రవయ్యేళ్ల కిందటి మాట... ‘ఆ రవ్వల నెక్లెస్‌ పెట్టుకుని మువ్వల వడ్డాణం పెట్టుకుని చక్కగా తయారవ్వవే తల్లీ...’ అని అమ్మమ్మలో నానమ్మలో చెబితే విసుక్కునే అమ్మాయిలే ఎక్కువ. కానీ ఇప్పుడో... ఎవరూ పనిగట్టుకుని చెప్పాల్సిన పని లేదు. ఏదయినా ఫంక్షన్‌ ఉందంటే చాలు... దానికి సరిపోయే అలంకారంతో మెరిసిపోతుంటారు నేటి తరం అమ్మాయిలు. ఎన్ని రకాల హారాలు వేసుకోమన్నా వేసుకుంటారు విసుగన్నదే లేకుండా. అంటే అప్పటితో పోలిస్తే నగలమీద మక్కువ బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకే డిజైనర్లు సైతం రోజుకోరకం నగలు తీసుకొస్తున్నారు. సౌలభ్యంకోసం అవసరమైతే వాటి రూపురేఖల్ని సైతం మార్చేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది అరవంకీనే. ఎందుకంటే ఆ పేరు చెప్పగానే కెంపులూ పచ్చలూ పొదిగిన చూడచక్కని వంకీ ఆకారమే గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని బాజుబంధ్‌లు ఆక్రమించేశాయి. వీటినే బాహిచూడి, అనంత, అంగద అనీ పిలుస్తారు. అలాగని ఇది మరీ కొత్తదేం కాదు. శతాబ్దాల నుంచీ వాడుకలో ఉన్నదే. ముంజేతి కడి లేదా కంకణాల మాదిరిగానే వీటిని మోచేతికి పై భాగంలో ధరించేవారు. వీటివల్ల రక్త ప్రసరణ బాగుంటుందట. ఇంకా చెప్పాలంటే పూర్వం ఇది మగవాళ్ల ఆభరణమట. రకరకాల లోహాలతో చేసిన వాటిని యోధులు మోచేతి ఆభరణాలుగా ధరించేవారు. వీటిని యుద్ధాభరణాలు అనేవారు. వాళ్లను చూసి గ్రామీణులూ బాజుబంధ్‌లను పెళ్లి వేడుకల్లో ధరించేవారట. కాలక్రమంలో అది కాస్తా స్త్రీల నగగా మారింది. అయితే ఉత్తరాదిన అది పట్టీ మాదిరిగానే ఉంటే, దక్షిణాది కొచ్చేసరికి మాత్రం కాస్త వంపు తిరిగి అర్ధచంద్రాకృతిలోకి మారి అరవంకీగా స్థిరపడింది. ఏమయినా నగలన్నింటిలోకీ అరవంకీ అందమే వేరు. కానీ చిన్నప్పుడు చేసిన వంకీ పెద్దయ్యాక పెట్టాలన్నా లేదా కాస్త లావయినా వాటిని చేతిమీదుగా తొడగడం కష్టమే. అందుకే కావచ్చు... ఈ తరం డిజైనర్లు వంకీకి బదులు బాజుబంధ్‌నే రకరకాలుగా తయారుచేస్తున్నారు. కెంపులూ పచ్చలూ వజ్రాలూ అన్‌కట్‌ వజ్రాలూ ఇలా రత్నాలు పొదుగుతూ కుందన్‌కారి, మీనాకారి, పోల్కీ, నక్షీ, టెంపుల్‌, యాంటిక్‌... పనితనాన్ని చొప్పిస్తూ బాజుబంధ్‌ డిజైన్లు రూపొందిస్తున్నారు. మోచేతిపైన నెమలి పురివిప్పినట్లో చిలుక వాలినట్లో లక్ష్మీదేవి లేదా వినాయకుడు కొలువుదీరినట్లో రెమ్మకి పూలు విరిసినట్లో భిన్న డిజైన్లలో బాజుబంధ్‌ను చుట్టేస్తున్నారు.

ఒకటే... రకరకాలుగా..!
వీటిని తయారుచేసే పద్ధతిలోనూ బోలెడు వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. అచ్చంగా బాజుబంధ్‌గానే వాడుకోగలిగే డిజైన్లు కొన్నయితే, నెక్లెస్‌ మాదిరిగానో లేదా బ్రేస్‌లెట్‌గానో కూడా ధరించగలిగే డిజైన్లు ఇంకొన్ని. ఇలాంటి వాటిల్లో హుక్‌ దగ్గర వెడల్పు తగ్గించుకునేలానూ పెంచుకునేలానూ కూడా తయారుచేస్తున్నారు. ఇంకా రాజులూ, నవాబులూ వేసుకునే ముత్యాల పతకాల తరహాలో మధ్యలో వెడల్పాటి రాళ్ల పతకాల బాజుబంధ్‌ల్నీ తయారుచేస్తున్నారు. వీటిల్లో గొలుసు మార్చుకుంటూనో లేదా దాని పొడవు పెంచుకుంటూ తగ్గించుకుంటూనో మెడలో నెక్లెస్‌లానూ వేసుకోవచ్చు. చుట్టు రింగుల్లా ఉండే డిజైన్లయితే నేరుగా బ్రేస్‌లెట్ల మాదిరిగానూ వాడుకోవచ్చు. వీటిల్లో చిన్న చిన్న వేడుకల్లో కూడా ధరించేలా సింపుల్‌ డిజైన్లూ ఉంటున్నాయి. అంతేనా... బాజుబంద్‌ ఆభరణం లేకున్నా అలంకరించకోవచ్చు. అదెలా అంటే- చిన్న నెక్లెస్‌ల్నీ వెడల్పాటి బ్రేస్‌లెట్లనీ కూడా బాజుబంధ్‌ల్లా చుట్టేస్తూ చేతుల్ని మెరిపించేయవచ్చు. అందుకే ‘వంకీ పోయె... బాజుబంధ్‌ వచ్చె...’ అంటూ కొత్త పల్లవి అందుకుంటోంది నేటితరం..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.