close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్కరితో వూరు మారింది!

ఒక్కరితో వూరు మారింది! 

అందమైన బాల్యం, జీవితకాలపు స్నేహితులూ, ఆటుపోట్లను తట్టుకునే శక్తి సామర్థ్యాలూ, కలకాలం వీడిపోని జ్ఞాపకాలూ... సొంతూరు చాలా మందికి చాలా ఇస్తుంది. అన్ని ఇచ్చిన వూరికి ఎంతో కొంత తిరిగివ్వకపోవడం తప్పే కదా అనుకున్నారు చిట్టూరి జగపతిరావు. వ్యాపారంలో కోట్లు సంపాదించినా స్వగ్రామానికి చేసిన చిరుసాయం ముందు ఆ సంపద చిన్నబోతుంది అంటారాయన. ఇంతకీ ఆయనేం చేశారంటే...

తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం మండలంలోని అందమైన పల్లెటూరు కూళ్ల. ఏ వూరైనా చూడ్డానికి ఎలా ఉన్నా బతకడానికి బావుండాలి. పిల్లల భవిష్యత్తును నిర్మించడానికో బడి, పెద్దలు మొక్కుకోవడానికో గుడి, తాగడానికి స్వచ్ఛమైన నీరు, అక్కడే పుట్టి ఆ మట్టిలోనే కలిసిపోయిన వాళ్లను మరణానంతరమూ గౌరవించేందుకు మరు భూమి... ఇలాంటి కనీస వసతులున్న ఏ వూరిలోనైనా ప్రజలు హాయిగా బతకొచ్చు. కానీ పుట్టిపెరిగిన వూరు ఈ సదుపాయాలకూ దూరమవడం వ్యాపారవేత్త జగపతిరావును కలవరపెట్టింది. సొంతూరి కోసం తన వంతుగా ఎంతో కొంత చేయాలనుకున్నారు. కూళ్ల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆ క్రతువు ఫలాల్ని ఇప్పుడు గ్రామస్థులు ఆనందంగా అనుభవిస్తున్నారు.

చిన్నపుడే బడి నిర్మాణం
దేశంలోని ప్రముఖ పౌల్ట్రీరంగ వ్యాపార సంస్థల్లో ‘శ్రీనివాస హేచరీస్‌’ గ్రూప్‌ ఒకటి. దాని వ్యవస్థాపకులు జగపతిరావు వ్యాపారిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ సంస్థ విలువను కొన్ని కోట్ల రూపాయలకు పెంచారు. వ్యక్తిగతంగా ఎన్నో విజయాలు సాధించిన ఆయన వీలున్నప్పుడల్లా స్వగ్రామానికి వెళ్తూ అవసరాల్ని బట్టి చిన్నచిన్న సాయాలు చేస్తుండేవారు. కానీ అవేవీ క్రమ పద్ధతిలో సాగకపోవడంతో పూర్తిస్థాయిలో ఫలితాలివ్వలేదు. ఓసారి కుటుంబంతో కలిసి వూరెళ్లినప్పుడు గ్రామస్థులంతా వూళ్లొ ధ్వజస్తంభం కోసం సాయం చేయమని ఆయన్ని అడిగారు. అప్పుడే జగపతిరావుకు చిన్నప్పుడు స్కూల్‌ నిర్మాణం కోసం ఆయన కోరిన సాయం గుర్తొచ్చింది. వూళ్లొ బడి లేక చిన్నప్పుడు జగపతిరావు రోజూ కాకినాడ వెళ్లి చదువుకునేవారు. ఆ పరిస్థితి నచ్చక స్నేహితులతో కలిసి వూళ్లొ పాఠశాల నిర్మాణం కోసం విరాళాలు అడగడం మొదలుపెట్టారు.అక్కడన్నీ చాలీచాలని ఆదాయంతో నెట్టుకొచ్చే కుటుంబాలు కావడంతో ఆశించిన సాయం అందలేదు. అయినా నిరాశపడకుండా వరికుప్పల్ని నూర్చే సమయంలో వరి బస్తాలనే విరాళంగా అడిగారు. అలా సేకరించిన బస్తాల్ని అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల కోసం గదుల్ని నిర్మించారు. అప్పుడు డబ్బుల్లేక జగపతిరావు వూరందరి సాయం కోరాల్సి వచ్చింది. ఇప్పుడా అవసరం లేకుండా గ్రామాన్ని తానే అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. వూరిని దత్తత తీసుకొని దాని అభివృద్ధిలో భాగమయ్యారు.

సాయానికి ఎన్నో రూపాలు

చదువుకోవడం వల్లే జీవితంలో తన ఎదుగుదల సాధ్యమైందని జగపతిరావు నమ్ముతారు. వూళ్లొ పిల్లలకూ ఆ అవకాశం కల్పించే ఉద్దేశంతో సొంత నిధులతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను నిర్మించి దానికి అన్ని వసతులూ సమకూర్చారు. కుర్చీలూ, బెంచీలూ, ఇతర ఫర్నీచర్‌ను తయారు చేయించారు. పిల్లలను స్కూళ్లకు రప్పించడానికి పౌష్ఠికాహారాన్నీ అందించే ఏర్పాటు చేశారు. పాఠశాలకు చుట్టూ కొంత స్థలాన్ని కొనుగోలు చేసి ప్రహరీ నిర్మించి పిల్లలు ఆడుకోవడానికి అనువుగా మైదానాన్నీ తీర్చిదిద్దారు. ఫలితంగా ఒకప్పుడు వందకు అటుఇటుగా ఉండే విద్యార్థుల సంఖ్య 250 దాటింది. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు వారి భవిష్యత్తుకు ఉపయోగపడే కోర్సులపైన అవగాహన పెంచుతూ ప్రత్యేక వర్క్‌షాప్‌లనూ ఏర్పాటు చేశారు. కలుషిత నీటి నుంచీ, వాటి వల్ల వచ్చే వ్యాధుల నుంచీ గ్రామస్థులకు విముక్తి కల్పిస్తూ ఆర్‌వో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మసకబారిన శివాలయానికి కొత్త రూపు తీసుకొచ్చి ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. గ్రంథాలయాన్ని పునర్నిర్మించి అన్ని రకాల పుస్తకాలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. అపోలో ఆస్పత్రి వైద్యులతో కలిసి ఉచితంగా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసి గుండె, వూపిరితిత్తులు, కంటి సమస్యలకు సంబంధించి గ్రామస్థులకు పరీక్షలు నిర్వహించి వైద్యానికి సాయం చేశారు. గోదావరీ పరీవాహక పల్లె కావడంతో చుట్టుపక్కల వూళ్లవాళ్లూ పుణ్యమొస్తుందన్న నమ్మకంతో శవాలను కూళ్లలోనే ఖననం చేస్తుంటారు. అలాంటి వాళ్ల అవసరాల కోసం శ్మశానంలో భవనాన్ని నిర్మించడంతో పాటు ఆ ప్రాంగణాన్నీ అందంగా తీర్చిదిద్దారు. కొడుకు సురేష్‌ రాయుడు (ఆంధ్రప్రదేశ్‌ సీఐఐ ఛైర్మన్‌), కుమార్తె పద్మజల సాయంతో ఆయన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

 రసాయన ఎరువులు వాడకుండా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు శిక్షణ తరగతుల ఏర్పాటుతో పాటు కూళ్లను స్మార్ట్‌ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్మార్ట్‌ విలేజ్‌ అంటే గ్రామం ఆధునికంగా ఉంటే సరిపోదు, గ్రామంలోని కుర్రాళ్లూ ప్రపంచంతో పోటీ పడగలగాలనీ, దానికోసం అవసరమైన సాయం చేయడానికి తానెప్పుడూ సిద్ధమేననీ అంటారాయన.

 ఫొటోలు: ఎన్‌.ఎస్‌.పీ.ఎల్‌.సుభద్ర, న్యూస్‌టుడే, పామర్రు


 

నేనూ... ప్రధానిని మాట్లాడుతున్నా!

నెలనెలా ఓ ఆదివారం ఉదయం 11గం... రైతులూ, వ్యాపారులూ, విద్యార్థులూ, మహిళలూ, ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామీణ భారతమంతా రేడియోలకు అతుక్కుపోయి కూర్చుంటోంది. దేశ ప్రధాని మోదీ ఏం చెబుతారా, తమ పరిస్థితుల్ని బాగుచేయడానికి ఎలాంటి పథకాలు ప్రకటిస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తోంది. ‘మన్‌ కీ బాత్‌’... ప్రజలకు తన మనసులో మాట చెప్పేందుకూ, వాళ్ల మనసులోని మాటలను వినేందుకూ ప్రధాని మొదలుపెట్టిన ఈ రేడియో కార్యక్రమం ఎన్నో జీవితాల్ని మారుస్తోంది. మరెన్నో ఆలోచనల్ని వెలికితీస్తోంది.

పేరుకి అతిపెద్ద ప్రజాస్వామ్యమైనా ఓ ఎమ్మెల్యేని కలవడానికి కూడా కనీసం పది రోజులు ఇంటి ముందో, ఆఫీసు దగ్గరో పడిగాపులు పడాల్సిన పరిస్థితి మనది. అలాంటిది ‘మన్‌ కీ బాత్‌’ పేరుతో నేరుగా దేశ ప్రధానితోనే సామాన్య ప్రజలు మాట్లాడి తమ ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ పంచుకునే అరుదైన కార్యక్రమానికి తెరతీశారు మోదీ. ప్రతి నెలా ముందుగా నిర్దేశించిన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు మోదీ ఆలిండియా రేడియో ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తారు. దేశ పరిస్థితుల్ని బట్టి ఏదో ఒక అంశాన్ని ప్రధానంగా తీసుకొని దానికి సంబంధించి తన ఆలోచనల్ని పంచుకుంటారు. ఆ తరవాత ప్రజల నుంచి ప్రధాని కార్యాలయానికి చేరిన సలహాలూ, ఆలోచనలను రేడియోలో ప్రసారం చేస్తారు. వాటిని అమలు చేసే సాధ్యాసాధ్యాలను ఆయన వివరిస్తారు. సమయాన్ని బట్టి ఎంపిక చేసిన కొందరితో ప్రధాని ఫోన్‌లో మాట్లాడతారు. చివరగా మోదీ తన సందేశాన్ని తెలియజేస్తూ, తరవాతి కార్యక్రమంలో చర్చించబోయే విషయాని ప్రకటిస్తూ సంభాషణ ముగిస్తారు.

నేటితో ఇరవై
2014 అక్టోబరులో విజయదశమినాడు మొదలైన ‘మన్‌ కీ బాత్‌’లో నెలకొకటి చొప్పున ఇప్పటిదాకా పందొమ్మిది ఎపిసోడ్లను ప్రధాని నిర్వహించారు. నేటి కార్యక్రమంతో ఇరవై ఎపిసోడ్లు పూర్తికానున్నాయి. తొలి కార్యక్రమంలో ఖాదీ పరిశ్రమ గురించి చర్చించిన మోదీ, ఖాదీ దుస్తుల వాడకాన్ని అలవాటు చేసుకొని ఆ రంగంలోని కార్మికులకు పరోక్షంగా సాయపడమని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్‌, మార్స్‌ మిషన్‌, యువకుల నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అనేక విషయాలను ఆ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఆ తరవాత రెండు ఎపిసోడ్లలో స్కాలర్‌షిప్‌లూ, సరిహద్దులో సైనికుల సేవలూ, మాదకద్రవ్యాల లాంటి అంశాల గురించి మాట్లాడిన మోదీ జనవరిలో జరిగిన నాలుగో ఎపిసోడ్‌తో యావత్‌ ప్రపంచం దృష్టినీ ఈ కార్యక్రమం వైపు తిప్పారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో కలిసి ‘మన్‌ కీ బాత్‌’ నిర్వహించారు. ప్రజలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు మోదీతో కలిసి బదులిచ్చిన ఒబామా, తమ దేశంలోని పథకాల గురించీ వివరించారు. ఆ తరవాతి ఎపిసోడ్‌లో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి దూరం చేయడానికి సచిన్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌, ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు లాంటి ప్రముఖులతో సూచనలు ఇప్పించారు. ఎంత బిజీగా ఉన్నా నెలకో కార్యక్రమంతో వివిధ అంశాలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాన్ని ప్రధాని కొనసాగిస్తున్నారు.

ఇరవై నాలుగు భాషల్లో...
సునీల్‌ జగ్లాన్‌... దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘సెల్ఫీ విత్‌ డాటర్‌’ సృష్టికర్త ఆయనే. అప్పటికి ఎన్నో నెలల ముందు నుంచే హరియాణాలో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న సునీల్‌, ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ దాని గురించి ప్రస్తావించాకే వార్తల్లోని వ్యక్తిగా మారారు. ఎన్నో ఏళ్లుగా గంగా నది పరిశుభ్రత కోసం వలంటీర్లతో కలిసి పనిచేస్తోన్న టెమ్సుతులా ఇమ్సాంగ్‌ అనే నాగాలాండ్‌ యువతి ప్రస్తావన ఆ కార్యక్రమంలో వచ్చాకే, ఆమెకు నిధుల వర్షం కురిసింది. విద్యా విధానంలో మార్పులు తేవాలని విన్నవించిన మోనా కన్వాల్‌ అనే గృహిణి సందేశం రేడియోలో ప్రసారమయ్యాక, స్థానికులు ఆమెను ఆకాశానికెత్తేశారు. ఇలా మోదీ కార్యక్రమం ద్వారా సెలెబ్రిటీలుగా మారిన సామాన్యులు చాలామంది ఉన్నారు. ప్రధాని పుణ్యమా అని ఆలిండియా రేడియో ఆదాయం కూడా భారీగా పెరిగింది. సాధారణంగా రేడియోలో పది సెకన్ల ప్రకటనకు ఐదు నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చయితే, ‘మన్‌ కీ బాత్‌’ సమయంలో మాత్రం దాని ధర అక్షరాలా రెండు లక్షల రూపాయలు. ప్రజల ఆదరణ చూసి తెలుగు, తమిళం, కన్నడ, అస్సమీస్‌, మరాఠీ లాంటి రాష్ట్రాల భాషలతో పాటు, డోగ్రీ, గరో, ఖాసీ, బోడో లాంటి ఆదివాసీల భాషలతో కలిపి మొత్తంగా 24భాషల్లోకి ఈ కార్యక్రమాన్ని అనువదించి ప్రసారం చేస్తున్నారు.

ఒక్క మిస్డ్‌కాల్‌ చాలు...
మన్‌కీ బాత్‌ వెబ్‌సైట్‌(మై గవ్‌.ఇన్‌) ద్వారా ఇప్పటి దాకా 65వేల సూచనలు మోదీకి చేరాయి. దాదాపు లక్షన్నర మంది టోల్‌ ఫ్రీ నంబర్‌ (1800-11-7800)కి ఫోన్‌ చేసి ఆడియో సందేశాల రూపంలో తమ గొంతు వినిపించారు. వాటిలో నుంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నారు. ఆచరించదగ్గ సలహాలిచ్చిన వ్యక్తులతో కలిసి ప్రధాని కార్యాలయ అధికారులు వివిధ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఇంటర్నెట్‌, ఈమెయిల్‌, ఫోన్‌ ద్వారా రోజూ వందల సందేశాలు ప్రధాని కార్యాలయానికి చేరుతున్నాయి. వాటిలో సత్తా ఉన్న ఆలోచనలకు మన్‌ కీ బాత్‌లో చోటు దక్కుతోంది. ఏవైనా కారణాల వల్ల ప్రధాని మాటలను వినలేకపోయినవాళ్లు విచారించాల్సిన పనిలేదు. 8190881908 నంబరుకి ఒక్క మిస్డ్‌కాల్‌ ఇస్తే... వెంటనే తిరిగి ఒక ఫోన్‌ కాల్‌ వస్తుంది. అందులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌... ఇలా నచ్చిన భాషలో ఆ కార్యక్రమాన్ని వినొచ్చు. ఇంకెందుకాలస్యం... ప్రధానికి సలహా ఇవ్వాలన్నా, ఆయన సందేశం వినాలన్నా ఒక్కసారి ఫోన్‌ని చేతిలోకి తీసుకోండి చాలు.


ఈ ఆప్స్‌ అభిమానులకు మాత్రమే!

ఒకప్పుడు అభిమాన నటీనటుల సంగతుల్ని పత్రికలూ, టీవీలద్వారా తెలుసుకునేవారంతా. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లాంటివి వచ్చాక వాటిద్వారా అభిమానులకు నేరుగా చేరువయ్యారు సినిమా సెలెబ్రిటీలు. తాజాగా ‘సెలెబ్రిటీ ఆప్స్‌’తో నటీనటులు-అభిమానుల బంధం మరింత బలపడుతోంది!

సెలెబ్రిటీ ఆప్స్‌ ట్రెండ్‌కి ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో... రెండు చోట్లా కొబ్బరికాయ కొట్టేశారు! బాలీవుడ్‌ సోయగం సోనమ్‌ కపూర్‌ తాజాగా అఫీషియల్‌ మొబైల్‌ ఆప్‌ తీసుకొచ్చింది. సెలెబ్రిటీ ఆప్స్‌లో బాలీవుడ్‌ నుంచి ఆమెదే ఫస్ట్‌. అయితే, బాలీవుడ్‌కంటే ముందే టాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ మొదలైందని చెప్పాలి. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, కాజల్‌ అగర్వాల్‌లు తమ అఫీషియల్‌ మొబైల్‌ ఆప్స్‌తో ఇప్పటికే ఫ్యాన్స్‌కు చేరువైపోయారు.

రామ్‌ చరణ్‌ ఫస్ట్‌...
కొన్నేళ్లుగా సోషల్‌ మీడియా ద్వారా చాలామంది సినీ ప్రముఖులు అభిమానులకు దగ్గరయ్యారు. లైకులూ, ఫాలోయింగులతో ట్రెండ్‌ సృష్టించారు. అయితే, సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు పంచుకునేటపుడు అక్కడ అభిమానులతోపాటు మిగతావారూ కామెంట్లు రాస్తుంటారు. వందలూ, వేల సంఖ్యలో ఉండటంవల్ల వాటిలో విలువైనవి గుర్తించడం కష్టం. దానివల్ల అసలైన అభిమానుల మనసులోని మాట వారి దృష్టికి వెళ్లకపోయేది. అదే సొంత ఆప్‌లో అయితే అభిమానుల అభిప్రాయాలను ఒక పద్ధతిలో చూసుకునే వీలుంటుంది. ఆప్స్‌ కారణంగా సోషల్‌ మీడియాలో అభిమానులకు దూరం కాకుండా అక్కడ అప్‌డేట్స్‌నీ ఆప్‌నుంచే చూసుకునేలా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆప్షన్లు పరిమితంగా ఉంటాయి అదే ఆప్‌లలో అయితే, స్టార్లు తమకు నచ్చిన ఆప్షన్లు తయారుచేయించుకోవచ్చు. సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి చెప్పాల్సిన సంగతులు చెప్పేసి ఆప్‌ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు కూడా! బ్రూస్లీ సినిమా సమయంలోనే తన అఫీషియల్‌ ఆప్‌ను తీసుకొచ్చాడు రామ్‌ చరణ్‌. దీన్లో అతడికి సంబంధించిన వార్తలూ, సినిమాలూ, పాటలూ, ఫొటోలూ, ఇంటర్వ్యూలూ, సెల్ఫీక్యామ్‌లాంటి విభాగాలున్నాయి. ‘సెల్ఫీక్యామ్‌’ ఆప్షన్‌కి వెళ్తే ఆప్‌లో అప్పటికే ఉన్న చరణ్‌ స్టిల్స్‌ని జోడించి మన ఫోన్‌తో సెల్ఫీ దిగొచ్చు. చరణ్‌ సినిమాల సంగతులూ, పాటలూ, ప్రచార వీడియోల్ని అభిమానులు ఇక్కడే పొందొచ్చు. ‘సమోసా’ విభాగంలో ‘చిరుత’ నుంచీ ‘బ్రూస్లీ’ వరకూ తన సినిమాల్లోని సరదా సన్నివేశాలూ, పంచ్‌, పవర్‌ఫుల్‌ డైలాగుల వీడియో క్లిప్పుల్నీ పెట్టాడు. సినిమా విడుదల సమయంలో ఆప్‌ వేదికగా సరదా పోటీలు నిర్వహిస్తూ ఉచిత టికెట్లనీ అందిస్తున్నాడు. ఈ ఆప్‌ని ఇప్పటివరకూ 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

అందాల చిట్కాలు...
మరో టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ కూడా ‘రేసు గుర్రం’ ఆడియో వేదికపైన అఫీషియల్‌ ఆప్‌ని ఆవిష్కరించాడు. ఈ ఆప్‌లో తన ప్రొఫైల్‌తోపాటు వ్యక్తిగత, సినిమాల ఫొటోలూ, వీడియోల్నీ పెడుతున్నాడు. వివిధ అంశాలపైన తన స్పందనల్నీ, తన గురించి తాజా సమాచారాన్నీ దీన్లో ఉంచుతున్నాడు. కాజల్‌ అగర్వాల్‌ది కూడా ఇదే బాట. తన ఆప్‌లో ఇష్టమైన వంటకాలూ, తన సినిమా స్టిల్స్‌, ఇంటర్వ్యూల్ని ఉంచుతోంది. బాలీవుడ్‌ నుంచి ఈ ట్రెండ్‌ని మొదలుపెట్టిన సోనమ్‌ అయితే వ్యాయామాలకు సంబంధించిన వీడియోల్నీ, ఫొటోల్నీ పెడుతోంది. ఇష్టమైన వంటకాల గురించే కాకుండా మేకప్‌ గురించీ చెబుతూ అందాల చిట్కాలను ఇస్తోంది. ‘నాకు సంబంధించిన అన్ని విషయాలూ దీన్లో ఉంటాయి. ఆప్‌లో నేను నేనుగానే ఉంటూ నాకు నచ్చే అంశాల గురించి చెబుతాను’ అంటోంది సోనమ్‌. అల్లు అర్జున్‌, సోనమ్‌ కపూర్‌, కాజల్‌ల ఆప్‌ల ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లు ఒక్కోటీ పదివేలు చొప్పున డౌన్‌లోడ్స్‌ పొందాయి. ఇవన్నీ ఉచితంగా లభించే ఆప్స్‌.

కొన్ని నిర్మాణ సంస్థలూ సినిమాలకి అఫీషియల్‌ ఆప్స్‌ని తెస్తున్నాయి. అధికారిక ఆప్స్‌ కాకుండా నాగార్జున, పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు, సమంతా, అనుష్కాశెట్టి, షారుఖ్‌ఖాన్‌ లాంటి స్టార్లపేరునా ఆప్స్‌ వచ్చాయి. వీటిలో ఎక్కువగా అభిమానులు తీసుకొచ్చినవే ఉంటాయి. స్టార్లు ప్రారంభించినా, అభిమానులు మొదలుపెట్టినా సెలెబ్రిటీ ఆప్స్‌ ఉద్దేశం... అభిమానాన్ని పంచుతూ ఆదరణని పెంచుకోవడమే!


వేడివేడిగా తింటుంటే.. వారెవ్వా!

అల్లరి పిల్లాడిని తనతో వంటగదిలో కూర్చోబెట్టుకొని మసాలా దట్టించే పని అప్పగించేదా తల్లి. సరదాగా దట్టించిన మసాలా ఘాటు ఆ పిల్లాడికి బాగా ఒంటబట్టింది. ఆ అల్లరి పిల్లాడు సంజయ్‌ ఇప్పుడు నలభీముడయ్యాడు. ‘వాహ్‌ షెఫ్‌’గా మారి వహ్వా అనిపించుకుంటున్న సంజయ్‌... షెఫ్‌గా తన ప్రస్థానం గురించి చెబుతున్నాడిలా!

చిన్నపుడు ఒక దగ్గర కుదురుగా ఉండక అల్లరి చేసేవాణ్ని. దాంతో అమ్మ నన్ను వంటగదిలో కూర్చోబెట్టి మసాలా దట్టించడం నుంచి కూరలో ఉప్పూకారం చూడటంవరకూ రకరకాల పనులు చెప్పేది. హైస్కూల్‌కి వెళ్లే వయసుకి టిఫిన్లు చేయడం నేర్చుకున్నాను. ఎప్పుడైనా ఆకలనిపిస్తే నేనే దోశెలూ ఆమ్లెట్లూ వేసుకొని తినేవాణ్ని. నాన్న హైదరాబాద్‌లోని ‘బీహెచ్‌ఈఎల్‌’లో ఉద్యోగి. అక్కడి కాలనీలో పిల్లలకి వంటలు చేయడం గురించి సరదాగా చెబుతుండేవాణ్ని. ఇంజినీరింగ్‌లో చేర్పించాలని ఇంట్లోవాళ్లు అనుకునేవారు. కానీ నాకు షెఫ్‌ అవ్వాలని ఉందని చెప్పి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి సంబంధించి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష రాసి హైదరాబాద్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రిషన్‌’లో చేరాను.

అమెరికాలో రెస్టరెంట్లు
డిగ్రీలోనే విద్యార్థులకు నిర్వహించే జాతీయస్థాయి వంటల పోటీలో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. డిగ్రీ తర్వాత ‘ఐటీసీ’ హోటళ్ల విభాగంలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా చేరాను. 21 ఏళ్లకి జూనియర్‌ మేనేజర్‌గా తర్వాత ఏడాదికి కిచెన్‌ హెడ్‌గా చేశాను. జైపూర్‌, చెన్నైలలోని ఐటీసీ హోటళ్లలో మూడేళ్లు పనిచేశాను. తర్వాత అమెరికా వెళ్లే అవకాశం రావడంతో ఐటీసీలో ఉద్యోగం వదులుకున్నాను. అమెరికాలో ఏడాదిపాటు షెఫ్‌గా పనిచేశాక ‘సిజల్‌ ఇండియా’ పేరుతో షికాగోలో సొంత రెస్టరెంట్‌ ప్రారంభించాను. భారతీయ వంటకాలు మాత్రమే ఉండేవక్కడ. మంచి స్పందన వచ్చింది. స్వల్ప వ్యవధిలోనే మరో మూడు రెస్టరెంట్లను ప్రారంభించాను. దాదాపు పదేళ్లు ఉన్నానక్కడ. నా చేతి వంట రుచి అందరికీ చూపిద్దామని హోటళ్లని ప్రారంభించాను. కానీ చివరికి నాపైన హోటళ్ల నిర్వహణ భారంపడి వంటగదికి దూరమైపోయాను. ఒకరోజు రాత్రి ఈ విషయమై బాగా ఆలోచించి మర్నాడు ఉదయమే రెస్టరెంట్లని అమ్మేశాను.

నెట్‌ ప్రపంచంలోకి...
తర్వాత ఏంటన్న ఆలోచనా, ప్రణాళికా లేకుండానే రెస్టరెంట్లను అమ్మేశాను. అప్పట్లో నా స్నేహితులు చాలామంది తరచూ ఫోన్లు చేసి సాంబారు, బిర్యానీ లాంటివి ఎలా చేయాలని అడిగేవారు. ఒకే వంటకం గురించి పదిసార్లు చెప్పాల్సి వచ్చేది. దానికి పరిష్కారంగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టమని ఎవరో చెబితే 2007లో ఆ పనిచేశాను. ఆ వీడియోల్ని ఇంకా చాలామంది చూస్తుండేవారు. అందులో కొంతమందికి సందేహాలు ఉండేవి. అందుకే vahrevah.com వెబ్‌సైట్‌ మొదలుపెట్టి అందులో వివరంగా రాసేవాణ్ని. సందేహాలుంటే ఈమెయిల్‌ చేయమనేవాణ్ని. యూట్యూబ్‌లో vah chef పేరుతో ఛానెల్‌నీ ప్రారంభించాను. 20 వీడియోలు దాటాక యూట్యూబ్‌ వాళ్లు కూడా ప్రోత్సహించి దీనిద్వారా ఆదాయాన్నీ పొందొచ్చని చెప్పారు. అమెరికాలో ఉండగా 200 వీడియోల్ని పెట్టాను. తర్వాత ఇండియా వచ్చేశాను. ఇప్పటివరకూ 1500కుపైగా వీడియోల్ని యూట్యూబ్‌లో పెట్టాను. వాటికి 35 కోట్లకుపైగా వీక్షణలు వచ్చాయి. ఒక్క చికెన్‌ బిర్యానీ వీడియోకే దాదాపు డెబ్భై లక్షల వీక్షణలు వచ్చాయి. మొదట్లో మా ఆవిడ రాగిణి సాయంతో వంటలు చేయడం, వాటి వీడియోల్ని షూట్‌ చేసి యూట్యూబ్‌లో పెట్టడం చేసేవాణ్ని. క్రమంగా మా ఆవిడ కూడా షెఫ్‌గా మారిపోయింది. ఇప్పుడు రెండు మూడు టీవీ ఛానెళ్లలో ఇద్దరం కలిసే వంటల కార్యక్రమాలు చేస్తున్నాం. ఆవిడ యూట్యూబ్‌ ఛానెల్‌ ‘మిసెస్‌ వాహ్‌ షెఫ్‌’ వెయ్యి వీడియోలకు చేరువైంది. మా వీడియోల వీక్షకుల్లో ఎక్కువగా బ్రహ్మచారులూ, కొత్తగా పెళ్లైన అమ్మాయిలే ఉంటారు. ‘మీ వీడియోలు మమ్మల్ని ఆదుకుంటున్నాయ’ని కొందరూ, ‘మీవల్లనే మా ఇంట్లో రుచి పెరిగింద’ని మరి కొందరూ చెబుతుంటారు.

పావు గంటలో ఖాళీ
నాకు అన్ని రకాల వంటకాల్నీ రుచి చూడబుద్ధేస్తుంది. దేన్నైనా వేడివేడిగా పొయ్యి మీది గిన్నెలోంచే నోట్లో వేసుకుంటా. ఇంట్లో మాత్రం మా ఆవిడ చేతి వంటనే తింటాను. ఇంటికి వచ్చే అతిథులకు ఇద్దరమూ కలిసి వంట చేస్తాం. ఆదివారం ఇంట్లో దమ్‌ బిర్యానీ ఉండాల్సిందే. అందరం ఒకేసారి కూర్చొని, బిర్యానీపైన మూత తీసిన 15 నిమిషాల్లో ఖాళీ చేసేస్తాం. అప్పుడే బిర్యానీ బాగుంటుంది. విదేశీ వంటకాలను తెలుగు వాళ్లకి పరిచయం చేసే కార్యక్రమాన్ని త్వరలో చేస్తున్నాం. ‘ఇండీ బ్లేజ్‌’ పేరుతో హైదరాబాద్‌లో కొత్త రెస్టరెంట్‌ని స్నేహితులతో కలిసి ప్రారంభించాను. భవిష్యత్తు తరాలు ఎలాంటివి తింటారో ఆ రుచుల్ని ఇక్కడ పరిచయం చేస్తాం. పాత తరం వంటల్ని మళ్లీ వెలుగులోకి తెచ్చే ప్రాజెక్టు గురించీ ఆలోచిస్తున్నాను.

మా సంపాదనలో కొంత మొత్తాన్ని ‘ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌’ స్వచ్ఛంద సంస్థకు కేటాయిస్తున్నాం.

నాకంటే బాగా వంట చేయడం వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ టీవీ, యూట్యూబ్‌లలో వారంత సక్సెస్‌ కాలేదు. నేను వివరించే తీరు జనాలకి నచ్చుతుందనుకుంటా! సరదాగా కాసేపు నవ్వుకోవడానికీ నా వీడియోల్ని చూస్తామని చెప్పినవారూ ఉన్నారు. సక్సెస్‌ అనేది వృత్తిలో కాదూ వ్యక్తిలోనే ఉంటుందనేది నా నమ్మకం.


  ఆ తోటలో 300 రకాల మామిడిపండ్లు!

ఆ తోటలోకి వెళ్తే... ఒకచోట తియ్యని సచిన్‌ మామిడి కాయలు కాపుకొచ్చి ఉంటాయి. మరోచోట నమో ఆమ్‌లు నోరూరిస్తుంటాయి. ఇంకాస్త దూరం వెళ్తే నయనతార మామిడిపండ్లు అందంగా కనువిందు చేస్తుంటాయి. ఈ కొత్త రకం మామిడిపండ్లన్నీ ఒక వ్యక్తి సృష్టించినవే. ఆయనే లఖ్‌నవూ జిల్లాలోని మలీహాబాద్‌కు చెందిన కలీముల్లా ఖాన్‌. మామిడి మాంత్రికుడు.

క మామిడిచెట్టు నుంచి ఎవరైనా ఎన్ని రకాల పండ్లు అభివృద్ధి చేయగలరు. మహా అయితే పది రకాలేమో. కానీ దశహరీ గ్రామంలోని కలీముల్లా ఖాన్‌ మామిడి తోటలో ఏకంగా 300 రకాల మామిడిపండ్లు కనిపిస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. ఆ రకాలన్నింటినీ ఒకే చెట్టు నుంచి సృష్టించడం విశేషం. కాకరకాయ ఆకారంలో ఉండే కరేలా, గుండె ఆకారంలో ఉండే అశ్రూర్‌ ముఖరార్‌, ఎర్రని ‘హస్నే ఇ అరా’లతోబాటు పుష్యరాజ్‌, ఖాస్‌ ఉల్‌ ఖాస్‌, మఖాన్‌, శ్యామ్‌ సుందర్‌, ప్రిన్స్‌, హిమ్‌సాగర్‌... ఇలా ఆయన సృష్టించిన రకాలన్నింటికీ ఆ చెట్టే మూలం. అది మనదేశంలోకెల్లా ప్రాచీనమైన మామిడిచెట్టు కావడం మరో విశేషం. దీని వయసు వందేళ్లకు పైబడే. ఇది 16వ శతాబ్దంనాటి బీహార్‌లోని లాఖీబాగ్‌లోని చెట్లకు వారసురాలు కూడా. అప్పట్లో అక్బర్‌ అక్కడ లక్ష మామిడిచెట్లను నాటించాడట. ఆ తరవాత కాలంలో వాటి నుంచి అంటుకట్టిన మొక్కల్ని మలీహాబాద్‌కు తీసుకొచ్చారట ఖాన్‌ పూర్వికులు. ఆనాడు నాటిన వాటిల్లో మిగిలి ఉన్నది ఇదేననీ నా గురువూ దైవం అన్నీ ఈ చెట్టే అనీ దీన్ని చూసినప్పుడల్లా నాకు ఓ అద్భుతాన్ని చూసినట్లుగా ఉంటుందనీ చెబుతుంటాడు ఖాన్‌. కేవలం ఆయన సృష్టించిన కొత్త రకాలకే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న దశహరీ రకాలన్నింటికీ ఆ చెట్టే మూలం అని స్థానికులూ అంటుంటారు.

సెలెబ్రిటీ మామిడి..!
అలాగని ఖాన్‌ ఉద్యానవన నిపుణుడూ కాదు, వ్యవసాయ నిపుణుడు అంతకన్నా కాదు. ఏడో తరగతి ఫెయిలవడంతో చదువు మానేసి, తరతరాలనుంచీ వారసత్వంగా వస్తోన్న తన 14 ఎకరాల మామిడితోటనే ఓ ప్రయోగశాలగా మార్చి వందల రకాల మామిళ్లను సృష్టిస్తున్నాడు. అందుకే అంతా ఆయన్ని ‘ఫాదర్‌ ఆఫ్‌ మ్యాంగో గ్రాఫ్టింగ్‌’ అనీ పిలుస్తారు. తాను సృష్టించిన రకాలకు తనదైన శైలిలో పేర్లనూ పెడుతుంటాడు. మొదట్లో కుటుంబసభ్యుల పేర్లు పెట్టేవాడు. తరవాత సెలెబ్రిటీల పేర్లు పెట్టడం ప్రారంభించాడు. సచిన్‌, సోనియా, నర్గీస్‌, నమో ఆమ్‌, అఖిలేష్‌... ఇలా సినీ, రాజకీయ నాయకుల పేర్లతో వచ్చిన మామిడిపండ్లన్నీ ఆ కోవకు చెందినవే. అంతేకాదు, జులై 7వ తేదీని ‘ప్రపంచ మామిడి దినోత్సవం’గా ప్రారంభించిందీ ఈయనే. మామిడిపండ్ల గురించిన ఆసక్తితో విదేశాల నుంచి ఎవరు వచ్చినా వాళ్లకి తన తోటంతా తిప్పి చూపిస్తూ మ్యాంగో టూరిజాన్నీ ప్రోత్సహిస్తుంటాడాయన. ఆమధ్య 14 దేశాల నుంచి వచ్చిన అంబాసిడర్లు ఆయన నర్సరీని సందర్శించారు. ఖాన్‌ కూడా దేశవిదేశాలు తిరుగుతూ మామిడిపండ్ల గురించి ఆసక్తి ఉన్నవాళ్లకి అవగాహన కలిగిస్తుంటాడు. మామిడి రకాలకోసం ఆయన చేస్తున్న ఈ కృషి కారణంగానే మూడొందలకు పైగా అవార్డుల్ని అందుకున్నాడు. లిమ్కా బుక్‌లోనూ చోటు సంపాదించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యాన్‌ పండిట్‌ అనీ సత్కరించింది. మాజీ ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ తేజేశ్వర్‌ ఆయన సృష్టించిన మామిడిపండ్ల రకాలకు వీరాభిమాని. అందుకే ఖాన్‌ సృష్టించిన వాటిల్లో ఓ మూడు రకాలకు అనార్కలి, జహాన్‌ అరా, నయనతార పేర్లను పెట్టి వాటిమీద తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు, 54 రకాలు కాసే ఓ మామిడి చెట్టును గతంలో దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ ఉద్యానవనానికి బహుమతిగా అందించాడు. పది అడుగుల పొడవున్న ఈ చెట్టు వేళ్లే ఆరు అడుగుల పొడవున్నాయి. అందుకే ఆ చెట్టుని సుమారు 5 క్వింటాళ్ల మట్టితో సహా తవ్వి తీసుకెళ్లి దిల్లీలో నాటారట. కేవలం మామిడిలోనే కాదు, ఇతర పండ్ల మీదా ప్రయోగాలు చేస్తుంటారీయన. ఆపిల్‌ మాదిరిగా ఉండే ఎరుపు రంగు జామని సృష్టించి దానికి ‘ఐశ్వర్య’ అనే పేరు పెట్టాడీ గ్రాఫ్టింగ్‌ మ్యాన్‌.

ఆ మామిడి ఎంతో రుచి!
దశహరీ మామిడి రకానికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. అందుకే జియోగ్రాఫికల్‌ ఇండెక్సునూ దక్కించుకుంది. నిజానికి ఈ ప్రాంతంలోని దశహరీ అనే గ్రామంలో పెరగడం వల్లే ఆ మామిడి రకానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ పండే దశహరీ రకం అద్భుతమైన రుచితో చవులూరిస్తుంటుంది. అందుకే ఇక్కడ పండేవాటిల్లో ఎక్కువగా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ‘కానీ ఈ ప్రాంతం తన పూర్వ వైభవాన్ని కోల్పోతుందనే చెప్పాలి. చాలామంది చెట్లు నరికించేసి స్థలాన్ని రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లకు విక్రయించేస్తున్నారు. ఇది దురదృష్టకర పరిణామం. గతంలో ఇక్కడ 1300 మామిడి రకాలు కాసేవి. ప్రస్తుతం ఏడు వందలకు మించడం లేదు. అంతెందుకు... నా తరవాత నా చెట్టూ తోటా ఏమై పోతాయో నాకు తెలీదు. నా కుటుంబీకులు దీన్ని వృత్తిగా స్వీకరిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే మామిడితోటల వల్ల పెద్దగా లాభం ఉండకపోవడంతో నేటి తరం పట్టణాలకూ నగరాలకూ తరలిపోతున్నారు’ అంటున్నాడు ఆమ్‌ ఆద్మీ కలీముల్లా ఖాన్‌. అలా జరగకూడదనీ ఆయన చేతిచలువతో మరెన్నో రకాలు పండాలనీ కోరుకుందాం..!


 

ఆరు వారాల్లో జీవితం మారింది!

  బ్యాటుతో బౌండరీలు సాధిస్తూ, బంతితో వికెట్లను పడగొడితే చాలు... క్రికెట్లో ఆల్‌రౌండర్‌ అన్న ముద్ర పడుతుంది. ఆ రెంటికీ అద్భుతమైన ఫీల్డింగ్‌ నైపుణ్యాన్నీ జోడించి అసలైన ఆల్‌రౌండర్‌గా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు హార్దిక్‌ పాండ్యా. తినడానికి డబ్బుల్లేక నెలల తరబడి ఐదు రూపాయల మ్యాగీతో నెట్టుకొచ్చిన పసివాడూ, రెండేళ్ల క్రితం వరకూ రోజుకు నాలుగు వందల రూపాయలకు క్రికెట్‌ ఆడిన కుర్రాడూ... సచిన్‌, పాంటింగ్‌లాంటి దిగ్గజాలతో కలిసి ఎలా ఆడగలిగాడో, వందల మంది ప్రతిభావంతుల్ని దాటుకొని జాతీయ జట్టుకు ఎలా ఎంపికయ్యాడో తెలుసా..!

2015, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌...ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. అప్పటికే ముంబయి 79పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. రోహిత్‌ శర్మ అవుటై పెవిలియన్‌వైపు నడిచాడు. ఎదురుగా హర్బజన్‌ సింగ్‌ ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు రావడానికి సిద్ధమయ్యాడు. కానీ రోహిత్‌ అతడిని ఆపి, హార్దిక్‌ పాండ్యాను బ్యాటింగ్‌కు వెళ్లమని సైగ చేశాడు. డగౌట్‌లో కూర్చున్న రికీ పాంటింగ్‌, సచిన్‌తో పాటు జట్టు సభ్యులంతా ఆ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. పాండ్యా మాత్రం సారథి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎదురుగా ప్రపంచ టీ20 నంబర్‌ వన్‌ బౌలర్‌ సునీల్‌ నరైన్‌, మార్కెల్‌, ఉమేష్‌ యాదవ్‌ లాంటి బౌలర్లున్నా తడబడకుండా బంతుల్ని బౌండరీకి పంపించాడు. మరో పక్క భీకర హిట్టర్‌ పొలార్డ్‌ పరుగులు రాబట్టడానికి కష్టపడుతున్న సమయంలో పాండ్యా ఎనిమిది ఫోర్లూ, రెండు సిక్సర్లతో 61పరుగులు(45బంతుల్లో) చేశాడు. బంతితోనూ పొదుపుగా బౌలింగ్‌చేసి జట్టుకి విజయాన్ని అందించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. పాండ్యా కెరీర్‌ను మార్చిందీ, అతడిని భారత జట్టులోకి తీసుకొచ్చిందీ ఓ రకంగా ఆ ఇన్నింగ్సే. ఆ మ్యాచ్‌ తరవాత ‘మరో ఏడాదిలో నువ్వు భారత్‌కు ఆడతావు’ అని సచిన్‌ పాండ్యాతో అన్నాడు. కానీ అంతకంటే ముందుగానే ఆ అవకాశం పాండ్యాను వెతుక్కుంటూ వచ్చింది.

ఐదేళ్లకు మొదలు
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ చాలామంది కుర్రాళ్లు ఆడారు. కానీ వాళ్లందరికీ పాండ్యాకు వచ్చినంత వేగంగా అవకాశాలు రాలేదు. దాని వెనక పాండ్యా ప్రతిభా, నైపుణ్యం, క్రికెట్‌ పైన ఇష్టం, అంతకుమించి భారత్‌కు ఆడేందుకు పడ్డ కష్టం లాంటి చాలా కారణాలున్నాయి. పాండ్యా తండ్రి హిమాన్షు... సూరత్‌లో బతుకు తెరువు కోసం ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవాడు. కొడుకులిద్దరినీ క్రికెటర్లుగా చూడాలన్నది అతడి కల. దానికోసం అన్నదమ్ములిద్దరికీ వూహ తెలిసినప్పట్నుంచీ క్రికెట్‌ ఆడించడం మొదలుపెట్టాడు. హార్దిక్‌కు ఐదేళ్లూ, అతడి అన్న క్రునాల్‌కు ఏడేళ్ల వయసున్నప్పుడు తండ్రి ఇద్దరినీ వడోదరలోని భారత మాజీ స్టార్‌ కిరణ్‌ మోరె క్రికెట్‌ అకాడమీకి తీసుకెళ్లాడు. అకాడమీలో చేరాలంటే కనీస వయసు పన్నెండేళ్లు ఉండాలన్నది నిబంధన. దాంతో వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి మోరె మొదట ఒప్పుకోలేదు. కానీ తన పిల్లలిద్దరూ బాగా ఆడతారనీ, ఒకసారి పరీక్షించి పనికిరారనిపిస్తే పంపించేయమనీ హిమాన్షు అతడిని బతిమాలాడు. దాంతో మోరె అయిష్టంగానే కోచ్‌ని పిలిచి చెరో రెండు ఓవర్లు వేయించాడు. ఇద్దరి బ్యాటింగ్‌ శైలిలోనూ మోరెకి వయసుకు మించిన పరిణతి కనిపించింది. శిక్షణ ఇస్తే వాళ్లు మరింత బాగా ఆడగలరన్న నమ్మకం కుదిరింది. దాంతో అకాడమీలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నాడు. ప్రతిభకు వయసుతో పని లేదని అర్థం చేసుకున్న మోరె, అప్పట్నుంచీ అకాడమీలో వయసుకు సంబంధించిన నిబంధనలనూ తొలగించాడు. ఏడాదంతా మ్యాగీతోనే రోజూ ఉదయం ఐదింటికి బయల్దేరి అకాడమీకి వెళ్లడం, సాయంత్రం ఏడింటికి ఇంటికొచ్చి మళ్లీ ట్యూషన్‌కు వెళ్లడంతోనే హార్దిక్‌ బాల్యం చాలావరకూ గడిచిపోయింది. రోజూ స్కూటర్‌ మీదే తండ్రి పాతిక కిలోమీటర్ల దూరంలోని అకాడమీకి పాండ్య సోదరులను తీసుకెళ్లేవాడు. అలసట ఎక్కువై, నిద్ర సరిపోక హార్దిక్‌ స్కూటర్‌ మీద నుంచి తూలి పడిపోయి దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో, అప్పులపాలై వ్యాపారాన్ని వదిలేసి పాస్‌పోర్టు ఏజెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ పరిణామాలు హార్దిక్‌కు ఆటపైన ఇష్టాన్నీ, భారత జట్టుకు ఆడాలన్న కసినీ మరింత పెంచాయి. ఆశించిన స్థాయిలోనే హార్దిక్‌తో పాటు అతడి అన్న క్రునాల్‌ కూడా ఆటలో బాగా రాణించేవారు. స్కూలు జట్టుతో మొదలుపెట్టి బరోడా అండర్‌-15, అండర్‌-17 జట్లలో కీలక సభ్యులుగా ఎదిగారు. కానీ పేదరికం ఆ సోదరుల పురోగతికి అడ్డంకిలా మారింది. అకాడమీ తరఫున టాప్‌ ఆటగాళ్లన్న పేరుంది కాబట్టి, మోరె వాళ్ల శిక్షణకు అయ్యే ఖర్చును రద్దు చేశాడు. కానీ ఇంట్లో తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. దాంతో అన్నదమ్ములిద్దరూ చెరో ఐదు రూపాయల మ్యాగీ కొనుక్కుని, మైదానంలో వంట మనిషి దగ్గర వేడినీళ్లు తీసుకుని ఆ మ్యాగీనే ఉడికించుకుని తినేవారు. అలా ఒకటీ, రెండు రోజులు కాదు, దాదాపు ఏడాది పాటు మ్యాగీనే ఆ సోదరుల కడుపునింపింది. ఇంట్లో చెబితే అమ్మానాన్నా బాధపడతారని, అకాడమీలోనే భోజనం పెడుతున్నారని అబద్ధం చెప్పేవారు.

దేశవాళీల్లో ఆల్‌రౌండర్‌గా
హార్దిక్‌ ఆటలో రాటుదేలుతూ ముందుకెళ్లాడుకానీ చదువులో మాత్రం వెనకబడిపోయాడు. తొమ్మిదో తరగతి పరీక్షల్లో ఫెయిలవడంతో ఆపైన చదవకూడదని నిర్ణయించుకున్నాడు. చదువుకు దూరమవడంతో క్రికెట్లో హార్దిక్‌ కచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి. లేకపోతే అటు ఆటకీ, ఇటు ఉద్యోగానికీ కాకుండా మిగిలిపోతాడన్న విషయం అతనికి తెలుసు. భారత్‌లో క్రికెట్‌కి పోటీ ఏస్థాయిలో ఉంటుందన్న విషయంపైనా హార్దిక్‌కు అవగాహన ఉంది. వాళ్లందరికీ భిన్నంగా ఉంటూ జట్టులో చోటు దక్కించుకోవాలంటే బంతితో, బ్యాటుతోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ మెరుగవ్వాలని నిర్ణయించుకున్నాడు. పేస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగల అల్‌రౌండర్ల కొరత భారత జట్టులోనే కాదు, దేశవాళీ జట్లలోనూ ఉంది. ఆ విభాగంలో హార్దిక్‌ రాణిస్తుండటంతో బరోడా అండర్‌-17, అండర్‌-19 జట్లలో చోటు దక్కింది. ఆ తరవాత కొన్నాళ్లకు బరోడా రంజీ జట్టుకు ఎంపికయ్యాడు.

ఆ ఒక్క మ్యాచ్‌...
రంజీల్లో ఆడటం మొదలుపెట్టాకే హార్దిక్‌కు కొద్దో గొప్పో డబ్బులు వచ్చేవి. అవి కూడా కుటుంబానికున్న అప్పులు తీర్చడానికే సరిపోయేవి. అదే సమయంలో తండ్రికి ఆరు నెలల వ్యవధిలోనే మూడు సార్లు గుండెపోటు రావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దాంతో కుటుంబ భారం అన్నదమ్ముల మీదే పడింది. రంజీల్లో వచ్చే డబ్బులు సరిపోక పాండ్యా గ్రామాల తరఫున, వివిధ క్లబ్బుల తరఫున డబ్బులకు నిర్వహించే ప్రతి టోర్నీలోనూ ఆడేవాడు. అలాంటి సమయంలో దేశవాళీ ప్రఖ్యాత పోటీల్లో ఒకటైన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ హార్దిక్‌ కెరీర్‌నే మార్చేసింది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో బరోడా 20కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్‌ కేవలం 57 బంతుల్లో 82 పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ జట్టు కోచ్‌ జాన్‌ రైట్‌ కూడా హాజరవడం హార్దిక్‌కు కలిసొచ్చింది. ఒత్తిడిలోనూ జహీర్‌ఖాన్‌, ప్రవీణ్‌ తాంబే, ధవళ్‌ కులకర్ణి లాంటి బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేసిన తీరు రైట్‌ని ఆకర్షించింది. దాంతో తరవాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ ఆటను చూడ్డానికి మళ్లీ రైట్‌ మైదానానికి వచ్చాడు. అతడి బ్యాటింగ్‌ కోసం వచ్చిన రైట్‌కు, హార్దిక్‌ బౌలర్‌గా తొలి ఓవర్‌ వేయడం చూసి మరింత ఆశ్చర్యమేసింది. ఆ మ్యాచ్‌లో అతడు కేవలం ఏడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయడంతోపాటు నలభై పరుగులు కూడా చేసి ఆల్‌రౌండర్‌గా రైట్‌పైన బలంగా ముద్ర వేశాడు. దాంతో హార్దిక్‌ తరవాతి మ్యాచుల్లో ప్రదర్శననూ రైట్‌ గమనిస్తూ వచ్చాడు. బ్యాటు, బంతితో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా రాణించడం, అన్ని విభాగాల్లోనూ తక్కిన ఆటగాళ్లకు అందనంత ఎత్తులో నిలవడంతో 2014లో ఐపీఎల్‌కి ముంబయ్‌ ఇండియన్స్‌ బ్యాకప్‌ ఆటగాడిగా హార్దిక్‌కు పిలుపొచ్చింది. కానీ తుది జట్టులో చోటు దక్కలేదు.

జాతీయజట్టులో చోటు
రెండేళ్ల క్రితం త్రుటిలో చేజారిన ఐపీఎల్‌ అవకాశం గతేడాది హార్దిక్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ముంబై ఇండియన్స్‌ జట్టు అతడిని పదిలక్షల రూపాయల బేస్‌ప్రైస్‌ చెల్లించి దక్కించుకుంది.