close
ఒకనాటి యమలోకమే ఈనాటి అందాలలోకం..!

ఒకనాటి యమలోకమే ఈనాటి అందాలలోకం..!

అండమాన్‌ అనగానే అందరికీ ‘టెంపుల్‌ ఆఫ్‌ శాక్రిఫైస్‌’గా పేరొందిన సెల్యులార్‌ జైలే గుర్తుకొస్తుంది. కానీ ఆ దీవులు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. ఆదిమానవుల ఆవాసాలు... అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన తెలికచెర్ల యశోద.

బ్రిటిష్‌వారి కఠిన శిక్షలకూ భారత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకూ మూగసాక్ష్యంగా నిలిచే సెల్యులార్‌ జైలును చూడాలని అండమాన్‌కు బయలుదేరాం. అండమాన్‌కు కోల్‌కతా, వైజాగ్‌, చెన్నైల నుంచి నేరుగా విమానాలు ఉన్నాయి. మేం హైదరాబాద్‌ నుంచి ఉదయాన్నే చెన్నైకి వెళ్లి, అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాం. రెండు గంటలకల్లా పోర్ట్‌బ్లెయిర్‌లో ఉన్నాం. చెన్నై నుంచి ఉదయం, మధ్యాహ్నం కూడా విమానాలు ఉన్నాయి. విమానంలోంచి కిందకి దిగేటప్పుడు కిందకి చూస్తే చుట్టూ నీలి జలాలూ వాటిమధ్యలో దట్టమైన పచ్చని అడవులతో ఎంతో అందంగా కనిపిస్తాయి అండమాన్‌ నికోబార్‌ దీవులు. మేం పోర్ట్‌బ్లెయిర్‌లో దిగగానే లగేజీని హోటల్‌లో పెట్టి సెల్యులార్‌ జైలుకి వెళ్లాం. దీన్నే కాలాపానీ అంటారు. మిగిలిన సముద్రజలాలతో పోలిస్తే ఇక్కడ నీళ్లు కాస్త ముదురు నీలిరంగులో నల్లగా కనిపిస్తాయి. అందుకే వీటిని కాలాపానీ (నల్లని నీళ్లు)అని పిలుస్తారు. జైలుకీ ఆ పేరునే వాడతారు.

అది ఓ యమలోకం!
సెల్యులార్‌ జైలుని 1896-1906 మధ్యలో నిర్మించారు. చూడ్డానికి పద్మం ఆకారంలో ఏడు విభాగాలుగా ఉంటుంది. ఒక్కో విభాగంలో మూడు అంతస్తులు ఉంటాయి. వీటిల్లో మొత్తం 698 గదులు ఉంటాయి. ఒక్కో కారిడార్‌లో ఒక్కో గార్డు ఉంటాడు. ఏడు విభాగాలకూ మధ్యలో ఓ సెంట్రల్‌ టవర్‌ ఉంటుంది. ఇందులో ఓ గార్డు ఉండి ఏడు విభాగాలకూ ఒకేసారి కాపలా కాస్తుంటాడు. ప్రతీ గదికీ ఓ చిన్న వెంటిలేటరు ఉంటుంది. రాజకీయ ఖైదీల కోసమే ఈ గదులు(సెల్స్‌)కట్టారు కాబట్టి దీనికి సెల్యులార్‌ జైలు అనే పేరు వచ్చిందట. ఇనుప గొలుసులతో కాళ్లకూ చేతులకూ సంకెళ్లు వేయడమే కాదు, ఒళ్లంతా గొలుసులు వేసి ఉంచేవారు. వాటి కారణంగా ఖైదీలు కూర్చోవడానికి కుదిరేది కాదు. ఖైదీలతో ఎండుకొబ్బరి చిప్పల నుంచి నూనె తీయించడం, మండే ఎండలో రాళ్లు కొట్టించడం, అడవుల్ని నరికించడం, ఇటుకలు తయారుచేయించడం చేసేవారు. ఆహారం కొద్దిగానే పెట్టేవారట. సాయంత్రం 5 లేదా 6 గంటలకు ఖైదీలు గదిలోకి వెళ్లిన తరవాత మర్నాడు ఉదయం ఆరు గంటలకు తలుపు తెరిచేవరకూ మూత్రానికి వెళ్లాలన్నా అదే గదిలోని మట్టిపాత్రలో వెళ్లాల్సిందేతప్ప బయటకు రావడానికి ఉండేది కాదు. రాత్రిళ్లు విషసర్పాలూ దోమలూ ఏవి వచ్చినా పట్టించుకునేవారు కాదు. ఆ శిక్షలు తట్టుకోలేని ఖైదీలు కొందరు ఆత్మహత్య చేసుకుంటే మరికొందరికి పిచ్చెక్కేదట.

వీర్‌ వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను 1910 జూలై 4న అండమాన్‌ జైలుకి పంపించారు. అక్కడకు వచ్చిన ఓ ఏడాదికి అతని అన్న గణేశ్‌ సావర్కర్‌ కూడా అదే జైలులో ఉన్నాడని తెలిసింది. సావర్కర్‌ రాసిన పుస్తకం ద్వారానే ఆ జైలు పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలిశాయి. పది సంవత్సరాల శిక్ష పూర్తయ్యాక 1921లో ఆయన్ని దేశంలోని వేరే జైలుకి పంపించారట. ఇప్పటికీ ఆయన ఫొటోనూ, వాడిన మంచినీటి పాత్రలనూ గదిలో ఉంచారు. ఆయన గదిలో దీపం కూడా పెట్టి ఉంటుంది. అక్కడి ఎయిర్‌పోర్టుకి వీర్‌ సావర్కర్‌ పేరే పెట్టారు. ఆయన పేరున నెలకొల్పిన పార్కులో ఆయనతోబాటు మరో ఏడుగురు స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి. జైలులో ఉన్న ఖైదీల నిరాహార దీక్షలవల్ల ప్రభుత్వం పీనల్‌ సెటిల్‌మెంట్‌ చేసి అందరినీ 1938లో దేశంలోని ఇతర జైళ్లకు పంపించి వేశారు.

ప్రస్తుతం ఇక్కడ ఉన్న జైలులో మూడు విభాగాలు మాత్రమే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాంబుల దాడికీ భూకంపాలకీ మిగిలిన నాలుగు విభాగాలూ ధ్వంసం అయ్యాయి. 1979లో ఈ జైలును నేషనల్‌ మెమోరియల్‌గా అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ డిక్లేర్‌ చేశారు. ఈ జైలులో రోజూ రాత్రివేళలో లైట్‌ అండ్‌ మ్యూజిక్‌ షో హిందీలోనూ ఇంగ్లిష్‌లోనూ ఉంటుంది. అందులో స్వాతంత్రయోధుల గురించీ జైలు గురించీ చెబుతారు. ఆ సమయంలో అక్కడ ఉంటే మనం కూడా ఆ కాలంలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ ఆవరణలో స్వాతంత్య్ర జ్యోతి 24 గంటలూ వెలుగుతూ ఉంటుంది.

ప్రైవేటు బీచ్‌లు!
జైలంతా తిరిగి చూశాక సాయంత్రం ఇక్కడకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బిన్స్‌ కోవ్‌ బీచ్‌కి వెళ్లాం. అక్కడ ఇసుక మెత్తగా తెల్లగా ఉంటుంది. రెండోరోజు ఉదయాన్నే పోర్ట్‌బ్లెయిర్‌ నుంచి ప్రైవేటు ఫెర్రీలో హావ్‌లాక్‌ దీవికి బయలుదేరాం. అందులో కుదుపులు ఎక్కువగా ఉన్నాయి. తిరిగి వచ్చేటప్పుడు ప్రభుత్వ ఫెర్రీలో వచ్చాం. ఇది బాగా బరువుగా ఉండటంతో కుదుపులు తక్కువ. ప్రైవేటు ఫెర్రీలో చాలామందికి వాంతులు అయ్యాయి. అయినా దానికి పైభాగంలో స్థలం ఎక్కువ ఉండటంతో అక్కడ నిలబడి అంతా సరదాగా గడిపారు. ప్రభుత్వ ఫెర్రీలో పైన నిల్చునేందుకు స్థలం ఉండదు.

హావ్‌లాక్‌ దీవికి వెళ్లగానే డాల్ఫిన్‌ రిసార్ట్‌లో బ్యాగులు పెట్టి రాధానగర్‌ బీచ్‌ చూడ్డానికి బయలుదేరాం. ఇది ఆసియాలోకెల్లా పెద్దదైన తెల్లని ఇసుక బీచ్‌. నీళ్లు చాలా తేటగా ఉంటాయి. అక్కడి వాళ్లు పడిపోయిన చెట్టును ఉపయోగించి సిట్‌అవుట్స్‌ తయారుచేశారు. వాళ్లు కలపను ఎక్కడా వృథా చేయరు. చెత్త డబ్బాలు కూడా వీటితోనే చేశారు. ఆ రోజు రాత్రికి మా రిసార్ట్‌ ఉన్న బీచ్‌లోకి వెళ్లాం. ఆ రోజు అమావాస్య కావడంతో రాత్రిపూట అలలు విపరీతమైన వేగంతో వచ్చాయి. ఆ సమయంలో నాలుగైదు పాములు కూడా ఒడ్డుకు వచ్చాయి. పగటివేళలో సముద్రం దూరంగా ఉన్నట్లే ఉండేది. రాత్రికి మాత్రం దగ్గరకు వచ్చేసేది. హావ్‌లాక్‌ దీవిలో అన్ని రిసార్టులూ సముద్రం పక్కనే ఉంటాయి. దాంతో ఎవరికి వాళ్లు ప్రైవేటు బీచ్‌లుగా చేసుకుని వాడుకుంటారు.

 

మూడోరోజు ఎలిఫెంటా బీచ్‌కు వెళ్లాం. మేం అక్కడకు వెళ్లేసరికి రెండు ఏనుగులు చెట్లమధ్యలోంచి నీటిపక్కగా వస్తున్నాయి. అక్కడ చాలా బీచ్‌ల్లో స్కూబా, స్నార్కెలింగ్‌, సీ వాక్‌ ఉంటాయి. మేం నలుగురం సీ వాక్‌ చేశాం. ఓ పెద్ద బోటును ఒడ్డుకు కాస్త దూరంలో లోతు ఉండేటట్లు చూసుకుని అక్కడ ఉంచుతారు. దానికి వెనక వైపున కిందకు సముద్రం లోపలకు మెట్ల ద్వారా దిగాలి. తలకు హెల్మెట్లు ఇస్తారు. అందులో నుంచే ఆక్సిజన్‌ పైపును అమరుస్తారు. ఇద్దరు గార్డ్‌లు మనల్ని కింద చూస్తూ ఉంటారు. నిదానంగా మెట్ల నుంచి నీళ్లలోకి దిగిపోవడమే సీ వాక్‌. మనకు ఇబ్బందిగా అనిపిస్తే సంజ్ఞల ద్వారా గార్డ్‌కు చెబితే బయటకు తీసుకొచ్చేస్తాడు. లేదంటే లోపల పది నిమిషాలు ఉండొచ్చు. ఆ సమయంలో సముద్రగర్భంలో ఉన్న కోరల్సూ చేపలూ చూస్తూ ఆనందించవచ్చు. థ్రిల్లింగ్‌గా అనిపించింది.

ఆ తరవాత కాలాపత్తర్‌ బీచ్‌ చూశాం. దీనికి పక్కనే ఉన్న గ్రామం పేరు కాలా పత్తర్‌. అందుకే దీనికా పేరు. ఇది డాల్ఫిన్‌ రిసార్టుకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ సముద్రంలో నీరు ముదురునీలం, ఆకుపచ్చ, లేత నీలం, తెలుపు ఇలా నాలుగు రంగుల్లో కనిపించింది. హావ్‌లాక్‌ దీవికి వచ్చినవాళ్లంతా ఎక్కువగా రాధానగర్‌ బీచ్‌ చూసి వెళ్లిపోతుంటారు. దాంతో ఈ బీచ్‌కి సందర్శకుల రాక తక్కువ. కానీ ఇది చాలా చిన్నగా అందంగా ఉంది. అది చూసి మేం పోర్ట్‌ బ్లెయిర్‌కి తిరిగి వచ్చాం.

అక్కడికి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న వండూరులో మహాత్మాగాంధీ నేషనల్‌ పార్కు ఉంది. ఇక్కడ 50 రకాల కోరల్స్‌ ఉన్నాయి. అందుకుగల కారణాలను శాస్త్రవేత్తలు కూడా అన్వేషిస్తున్నారట. అక్కడ నుంచి చిడియటపులో ముండాపహాడ్‌ పార్కుకి వెళ్లి, తరవాత సూర్యాస్తమయ ప్రదేశానికి వెళ్లాం. సూర్యుడు సముద్రంలోకి దిగిపోయే ఆ దృశ్యం ఎక్కడైనా అద్భుతంగానే ఉంటుంది. అయితే చిడియటపులో కూడా సూర్యుడు సముద్రంలోకే అస్తమిస్తుంటాడు. ఓ కొండ వెనక నుంచీ కిందికి దిగుతుంటాడు. దాంతో ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది.

మట్టి అగ్నిపర్వతాలు!

ఐదోరోజు పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి భారతాంగ్‌ దీవికి బయలుదేరాం. మూడు గంటల ప్రయాణం. ఉదయాన్నే నాలుగు గంటలకు బయలుదేరి చెక్‌పోస్టుకి చేరుకుంటే అక్కడి నుంచి అన్ని కార్లూ పోలీసు ఎస్కార్టుతో బయలుదేరతాయి. ఎందుకంటే మధ్యలో ఆటవిక తెగలు కనిపిస్తే వాళ్ల భాష మనకు అర్థం కాదు కాబట్టి సెక్యూరిటీ తోడుగా ఉంటుంది. భారతాంగ్‌ జెట్టీ నుంచి స్పీడు బోటులో దట్టమైన మడ అడవుల నుంచి ప్రయాణించడం చాలా బాగుంది. అక్కడ నుంచి కాస్త దూరంలో సున్నపురాతి గుహలు ఉన్నాయి. ఇవి సముద్రపు నీరూ సున్నం కలిసి సహజంగా ఏర్పడ్డాయి. ఆ తరవాత వాటికి దగ్గరలోనే ఉన్న మట్టి అగ్నిపర్వతాలను చూశాం. ఈ ప్రాంతం మట్టి అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. అండమాన్‌లో 11 మట్టి అగ్నిపర్వతాలు చొచ్చుకు వస్తే వాటిలో 8 భారతాంగ్‌లోనూ మూడు ఉత్తర అండమాన్‌లోనూ వచ్చాయట.

 

తరవాతి రోజు రాస్‌ ఐల్యాండ్‌కు వెళ్లాం. బ్రిటిష్‌, జపాన్‌ వాళ్ల పాలనలో ఇది రాజధానిగా ఉంది. ఆ సమయంలో వాళ్లు ఇక్కడ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు సొరంగ మార్గం తవ్వించారట. ఇక్కడ అప్పట్లో భూకంపం రావడంతో రాజధానిని పోర్ట్‌బ్లెయిర్‌కు మార్చారట. ఇప్పుడు ఆ దీవిని భారత నౌకాదళం నిర్వహిస్తోంది. ప్రస్తుతం అక్కడ నెమళ్లూ జింకలూ రకరకాల పక్షులూ ఉన్నాయి. ఇక్కడ కూడా లైట్‌ అండ్‌ మ్యూజికల్‌ షోను ఏర్పాటుచేశారు.

అక్కడ నుంచి నార్త్‌ బే ఐల్యాండ్‌కు వెళ్లాం. ఈ ద్వీప చిత్రం మన 20 రూపాయల నోటు మీద ఉంటుంది. ఇక్కడ సముద్రజీవులు చాలా ఉంటాయి. వాటిని చూపించేందుకు అడుగున గాజుతో చేసిన పడవలో తీసుకెళతారు నిర్వాహకులు. అందులోనుంచి కోరల్స్‌ను చూడవచ్చు. దానికి భూతద్దాలు బిగించడం వల్ల 20 అడుగుల లోతులో ఉన్నవి కూడా చక్కగా కనిపిస్తాయి. అండమాన్‌కి వెళ్లేవాళ్లు ఎవరైనా ముందుగానే అక్కడి ట్రావెల్స్‌ వాళ్లతో మాట్లాడి అన్ని విషయాలూ తెలుసుకుని వెళితే మంచిది. ఎందుకంటే అక్కడ దీవుల నిర్వహణ కోసం ఒక్కోదీవికీ ఒక్కోరోజు సెలవు ఉంటుంది. ఆ రోజు సందర్శకులను రానివ్వరు. అందుకే ముందే ప్రణాళికతో వెళితే మరిన్ని ప్రదేశాలను చుట్టి రావచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.