close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ డబ్బు మేం రప్పిస్తాం!

ఆ డబ్బు మేం రప్పిస్తాం!

షేర్లూ, డివిడెండ్లూ, మ్యూచువల్‌ ఫండ్లూ, పోస్టల్‌ సేవింగులూ, వాడని బ్యాంకు ఖాతాలూ... కొన్నేళ్ల క్రితం పెట్టుబడి పెట్టీ లేదా పొదుపు చేసీ దీర్ఘకాలంలో వాటిని మరచిపోయిన వాళ్లు చాలా మందే ఉంటారు. అందుకే అలా తిరిగి తీసుకోని ఖాతాల్లో జమపడ్డవి 64 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ జాబితాలో మన ఖాతాలూ ఉంటే అందులోని డబ్బు తిరిగి తీసుకొస్తుంది షేర్‌ సమాధాన్‌.బాగా పనిచేసినందుకు ఓ సంస్థ తన షేర్లలో కొన్నింటిని మనకు బహుమతిగా ఇస్తుంది. ఏళ్లు గడిచేకొద్దీ అధిక వడ్డీ జమవుతుందని చెబితే మనకే మంచిది కదా అని పోస్టాఫీసులో కాసిన్ని డబ్బులు జమ చేస్తాం. మ్యూచువల్‌ ఫండ్లూ, డివిడెండ్లూ దీర్ఘకాలానికి మంచి పెట్టుబడులే. వృద్ధాప్యంలోనో అత్యవసరంలోనో పనికొస్తాయని వాటినీ పక్కన పెడతాం. కానీ అలా చాలా కాలం గడిస్తేనే ఇబ్బంది. షేర్ల పరిస్థితి మనకు తెలీదు. ఏ ఇల్లు మారినప్పుడో, ఉద్యోగాలూ వూళ్లూ మారినప్పుడో బ్యాంకు డివిడెండ్ల కాగితాలు కనిపించవు. కాస్త ఫీజుతో, అలాంటి ఖాతాల్లోని మన డబ్బును మనకు తిరిగి తెచ్చేలా పనిచేస్తున్నదే దిల్లీకి చెందిన షేర్‌సమాధాన్‌ సంస్థ.

ఇలా వస్తాయ్‌...
షేర్ల నుంచి ప్రావిడెంట్‌ ఫండ్ల దాకా మన పెట్టుబడులూ పొదుపులేమైనా మరిచిపోయి ఉంటే దశాబ్దాలు గడచిన తరవాతవైనా సరే ఈ సంస్థవాళ్లు తిరిగి డబ్బుగా మార్చేందుకు సాయపడతారు. బాండ్‌ లేదా షేర్ల కాగితాలు పోయినా మనకు గుర్తున్న ఖాతాకు సంబంధించిన వివరాల నుంచి వాళ్లు ఆ ఖాతా తాలూకు సమాచారాన్ని కనుక్కొనేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకు వాళ్లు ఆయా సంస్థల డేటాబేస్‌లలో వెతుకుతారు. ఆ సమాచారంతో సంబంధిత సంస్థతో మంతనాలు జరిపి ఈ ఖాతా తాలూకు న్యాయబద్ధమైన డబ్బు వచ్చే మార్గాన్ని అన్వేషిస్తారు. మిగతా పనులనూ పూర్తి చేసి మనకు డబ్బు తిరిగి వచ్చేలా చేస్తారు. కాగితాలు ఉండీ సంతకాలు తేడా రావడం, పెట్టుబడికి సంబంధించిన వ్యక్తి మరణించడం, లేదా ఆ మొత్తాన్నీ వేరొకరి పేరుమీదకి బదలాయింపు చేయాల్సిరావడంలాంటి ఇతర సందర్భాల్లోనూ వాటి పరిష్కార దిశగా వీళ్లు పనిచేస్తారు. న్యాయపరమైన విషయాలూ, కాగితాలూ ఇతర లావాదేవీల్లో కూడా వీళ్ల సిబ్బందిదే బాధ్యత. కంపెనీల మెర్జింగుల్లాంటి సందర్భాల్లో బాండ్లు ఉన్నా డబ్బు పొందడం క్లిష్టతరమౌతుంది. అలాంటి సమయాల్లోనూ సంస్థ సేవలందిస్తుంది. ఇటీవల ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుటుంబానికి సంబంధించి చనిపోయిన వాళ్ల పేరున ఉన్న షేర్లూ, డివిడెండ్లలోని డబ్బును తిరిగి పొందేందుకు షేర్‌సమాధాన్‌ని సంప్రదించారు. షేర్‌హోల్డర్లులేక రావడం కష్టమైపోయిన దాదాపు 48లక్షల రూపాయలను తిరిగి వచ్చేలా చేసింది షేర్‌సమాధాన్‌. దిల్లీకి చెందిన అరవై అయిదేళ్ల భాటియా తన తండ్రికి చెందిన దశాబ్దాల నాటి షేర్లకు సంబంధించిన వివరాలను సంస్థకు తెలియజేయడం ద్వారా దాదాపు నాలుగున్నర లక్షల రూపాయలను తిరిగి పొందగలిగారు. వినియోగదారులు తాము దీర్ఘకాలంగా వదిలేసిన పెట్టుబడులూ, పొదుపులను సులభంగా తిరిగి పొందేందుకు సాయపడటమే తమ సంస్థ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకులూ, ఛార్టెర్డ్‌ అకౌంటెట్లూ అయిన అభయ్‌చందాలియా, వికాస్‌జైన్‌లు చెబుతారు. 2011లో ప్రారంభమైన వైటెనిక్‌ గ్రూప్‌కు సంబంధించిన ఈ సంస్థ ఇప్పటివరకూ 20 కోట్ల రూపాయలకు పైగా తమ వినియోగదారులకు తిరిగి ఇప్పించింది.

వందల కోట్లు
కారణాలేవైనా ఇలా మరచిపోయిన డబ్బులు కోట్ల రూపాయల్లోనే పోగై ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఇన్యూరెన్స్‌ పాలసీలు, క్లెయిమ్‌ చేసుకోని షేర్లూ, వాడని బ్యాంకు ఖాతాలూ, డీమ్యాట్‌ ఖాతాలూ, మ్యూచువల్‌ ఫండ్స్‌, తిరిగి తీసుకోని చిన్నమొత్తాల పొదుపులూ మొత్తం కలిపితే దాదాపు 37,300 కోట్లరూపాయల వరకూ ఉంటాయని ఓ అంచనా. నిజానికి వీటిలో దేనికి సంబంధించిన ఖాతానైనా ఏడు సంవత్సరాల పాటు తిరిగి క్లెయిమ్‌ చేసుకోకుండా ఉంటే ఆ డబ్బులు సెబీ చేపట్టే ‘ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌’ కిందకి వెళతాయి. ఇక తిరిగి తీసుకోకుండా అకౌంట్లలో మిగిలిపోయిన ప్రావిడెంట్‌ ఫండ్ల మొత్తం విలువ దాదాపు 26,497 కోట్ల రూపాయల దాకా ఉంది. ఇలా అన్‌క్లెయిమ్డ్‌ అకౌంట్లలోని డబ్బును తిరిగిచ్చేందుకు సంస్థవాళ్లు 25వేల రూపాయలు లేదా బాండ్ల విలువలో 10 నుంచి 25 శాతం దాకా డబ్బును ఫీజుగా తీసుకుంటారు. ఒకవేళ మన డబ్బులు మనకు తిరిగి తెచ్చివ్వలేకపోతే సంస్థవాళ్లు ముందస్తుగా తీసుకునే కొంత సొమ్మును కూడా తిరిగిచ్చేస్తారు. ఇంకేం, కాలం చెల్లిపోయిన డివిడెండ్లూ, మూలన పడ్డ షేర్లూ మీ దగ్గర కూడా ఉంటే వాటి దుమ్ముదులిపి డబ్బులు రాలేలా చేసుకోవచ్చు... ఏమంటారు?!


ఓటేస్కో... పండగ చేస్కో!

ఆకలేస్తే అన్నం ఫ్రీ, అలుపొస్తే ఆయిల్‌ ఫ్రీ, దాహమేస్తే నీళ్లు ఫ్రీ, ఉక్కపోస్తే గాలి ఫ్రీ... ఏది కావాలంటే అది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. పొరుగు రాష్ట్రం తమిళనాడులో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పౌరుడూ ఇంచుమించు ఇలాంటి ఉచిత వరాల జల్లులోనే తడిసి ముద్దయ్యాడు. పాలూ, గేదెలూ, తువ్వాళ్లూ, సెల్‌ఫోన్లూ... పళ్లు తోముకునే బ్రష్‌ నుంచి పడుకునేందుకు వాడే దుప్పట్ల వరకూ అన్నీ ఉచితం అంటూ పార్టీలు ప్రకటిస్తున్న హామీలను చూసి పక్క రాష్ట్రాలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి.చితంగా చదువు చెప్తాం, రోడ్లేస్తాం, నీళ్లిస్తాం, బతుకుల్ని బాగు చేస్తాం... ప్రపంచంలో ఎక్కడైనా పాలకులు ప్రజలకిచ్చే హామీలు ఇలానే ఉంటాయి. నిజానికి జనాలు ఆశించేది కూడా ఇలాంటి అభివృద్ధే. కానీ తమిళనాడులో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ అభివృద్ధి హామీలకంటే అప్పటికప్పుడు ప్రజల్ని సంతోషపెట్టే బహుమతులవైపే అన్ని పార్టీలూ మొగ్గు చూపిస్తున్నాయి. 2006లో డీఎంకే మొదలుపెట్టిన ఉచిత కలర్‌ టీవీల పథకంతో తమిళనాట ఈ తంతు మొదలైంది. అప్పట్లో అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా టీవీలను ఇస్తాం అంటూ డీఎంకే అధినేత కరుణానిధి చేసిన ప్రకటన మధ్యతరగతి కుటుంబాలను అనూహ్యంగా ఆకట్టుకుంది. ఆ ఎన్నికల్లో పార్టీకి ఓట్ల వర్షం కురిసింది. ఆ దెబ్బతో ఎన్నికల ప్రకటనల సమీకరణాలు మారిపోయాయి. అభివృద్ధి హామీల కంటే ఉచిత పథకాలే ఓట్లని రాలుస్తాయని పార్టీలు అర్థం చేసుకున్నాయి. అప్పట్నుంచీ అన్ని పార్టీలూ ఇలా ఉచితాల వైపే మొగ్గుచూపాయి.

అమ్మ దారే వేరు...
ప్రజల్ని బుట్టలో వేయడానికి ఉచిత పథకాలను మొదట ప్రకటించింది కరుణానిధి అయినా, ఆ విషయంలో దూసుకెళ్లింది మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి జయలలితే. గత ఎన్నికల్లో ఓటేసిన వాళ్లకు ఉచితంగా టీవీలూ, మిక్సీలూ, గ్రైండర్లూ, ఫ్యాన్లూ, సైకిళ్లూ, ల్యాప్‌టాప్‌లూ, బ్యాగులూ, జామెట్రీ బాక్సులూ, పుస్తకాలూ, క్రికెట్‌, వాలీబాల కిట్లూ... తండ్రి పిల్లలకిచ్చేవీ, స్కూళ్లు విద్యార్థులకిచ్చేవన్నీ ప్రభుత్వమే ఇస్తుందని జయ ప్రకటించారు. గెలిచాక చెప్పినట్టుగానే అన్నీ ఇచ్చారు కూడా. కొన్ని లక్షల కుటుంబాలకు గృహోపకరణాలతో పాటు లక్షల సంఖ్యలో మేకలూ, గొర్రెలూ, గేదెలనూ ఇచ్చారు. ఇప్పటి ఎన్నికల్లో ఈ జాబితా మరింత పెరిగింది. ప్రస్తుతం ‘సెల్‌ఫోన్‌ మూలం ఇదం జగత్‌’ అన్నట్టుగ్గా ఉంది పరిస్థితి. దానికి తగ్గట్టే పాత హామీలకు అదనంగా రేషన్‌ కార్డున్న ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్లూ, వాటికి ఇంటర్నెట్‌ కనెక్షన్లు కూడా ఇస్తానని అమ్మ ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తే ఇంటికి లీటరు పాలూ, ల్యాప్‌టాప్‌లూ, ఇంటర్నెట్‌, రద్దీ ప్రదేశాల్లో వైఫై కేంద్రాలూ, సెట్‌ టాప్‌ బాక్సులూ, ఆడవాళ్లు బండి కొనుక్కుంటే యాభై శాతం రాయితీ, పెళ్లి చేసుకుంటే ఎనిమిది గ్రాముల బంగారం, మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌లూ, పొంగల్‌కి ప్రభుత్వ టెక్స్‌టైల్‌ దుకాణాల్లో బట్టలు కొనుక్కోవడానికి ఐదొందల రూపాయల కూపన్లూ... ఇలా అమ్మ ప్రకటించిన ఉచితాల జాబితా కొత్త కోడలు తీసుకొచ్చే సారె కంటే పెద్దగా ఉంది.

10జీబీ డేటా ఉచితం!
ఉచిత పథకాలకు ప్రాణం పోసిన కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా కోటీ అరవై లక్షలకు పైగా కలర్‌ టీవీలూ, సైకిళ్లను జనాలకు ఉచితంగా ఇవ్వడం విశేషం. ఈసారి ఎన్నికల్లో టెలిఫోన్‌ సంస్థల ప్రకటనలను మరిపిస్తూ విద్యార్థులకు యూనిఫామ్‌, చెప్పులూ, ట్యాబ్లెట్లూ, ల్యాప్‌టాప్‌లకూ తోడు ఉచితంగా 3జీ, 4జీ ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు 10జీబీ ఉచిత డౌన్‌లోడ్లను అందిస్తానంటూ ప్రకటించింది. పేదలకు స్మార్ట్‌ఫోన్లనూ ఇవ్వనున్నట్టు చెప్పింది.

ముందే రాజీనామా!
సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే లాంటి పార్టీల కలయికతో ఏర్పడ్డ పీడబ్లు్యఎఫ్‌ ప్రతి ఇంటికీ ఉదయాన్నే అరలీటరు పాలు ఉచితంగా ఇస్తానంది. డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌, పార్టీని గెలిపిస్తే పొంగల్‌ పండగకు వారం రోజులు సెలవిచ్చి అధికారికంగా వేడుకలు నిర్వహిస్తానని చెప్పాడు. పెట్రోలును ఎప్పటికీ లీటరు రూ.45కే అందిస్తానన్నాడు. అన్నిటికీ మించి ఏటా ఐదు వేల మంది రైతుల్ని విదేశాలకు పంపిస్తానని చెప్పడం విశేషం. గ్రామాల్లోని అన్ని కుటుంబాలకూ పాతికవేలకు తగ్గకుండా ఆదాయం వచ్చే మార్గాల్నీ చూపిస్తానని ప్రమాణం చేశారు విజయ్‌కాంత్‌. పీఎంకే పార్టీకి చెందిన వినోద్‌ అనే అభ్యర్థి ఎన్నికలు కాకముందే తన రాజీనామా పత్రాన్నీ తయారు చేసి, రెండేళ్లలో తాను చెప్పిన పనులు చేయకపోతే ఆ లేఖలను ప్రజల్నే అసెంబ్లీలో అందించమంటూ ఆ పత్రాల్ని పాంప్లెట్లలా పంచి పెట్టాడు.

గత పదేళ్లలో ఉచిత పథకాలను అమలు చేయడానికే అక్కడి ప్రభుత్వాలు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేశాయని అంచనా. ఆ డబ్బంతా ప్రజలకే చేరింది కదా అనుకుంటే, ప్రభుత్వం ఇచ్చిన వస్తువులను మార్కెట్లో తిరిగి అమ్ముకునే వారి సంఖ్యే ఎక్కువ. ప్రజలు అల్ప సంతోషాలకు ఆశ పడినంత కాలం, పార్టీలు వరాలు కుమ్మరిస్తూనే ఉంటాయనీ, దాని వల్ల ఏదో ఒకరోజు రాష్ట్రం అప్పుల వూబిలో, ప్రజలు పన్నుల వలలో చిక్కుకుపోతారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈసారి ఈ ఉచిత పథకాలు ప్రజలను ఏస్థాయిలో ఆకర్షించాయో చూడాలంటే రేపు జరిగే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.