close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందం... పగలూ రాత్రీ!

కొత్తగా...

అందం... పగలూ రాత్రీ!

హాల్లో అయినా పడకగదిలో అయినా పగలూ రాత్రీ అని తేడా లేకుండా కిటికీలోంచి పచ్చని చెట్లూ, ఆకట్టుకునే దృశ్యాలూ కనిపిస్తుంటే మనసుకు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. కానీ అపార్ట్‌మెంట్లు పెరిగిపోయిన ఈ రోజుల్లో గదుల్లోనుంచి అలాంటి పచ్చదనం చూడాలనుకోవడం దురాశే. ఆలోటును తీర్చేందుకి వచ్చినవే ఈ ‘ద స్టార్‌ టు నైట్‌ గ్లో ఇన్‌ ద డార్క్‌ విండో వాల్‌ మ్యూరల్స్‌’. కిటికీల్లానూ గది మధ్యలో ఉండే ఆర్చ్‌ల్లానూ రూపొందించిన ఈ వాల్‌పేపర్లు పగలేకాదు, చీకట్లో కూడా కనిపిస్తాయి. అంతేకాదు, చీకట్లో చూసినపుడు ఇందులోని చిత్రాలు రాత్రిపూట వెన్నెల్లోని దృశ్యాల్లానే ఉంటాయి. ప్రత్యేకమైన లేటెక్స్‌ ప్రింట్‌ వెయ్యడం వల్ల ఈ వాల్‌పేపర్‌ ఇలా చీకట్లో ఎనిమిది గంటలపాటు మెరుస్తుంది. ప్రకృతి నట్టింట్లోకి వచ్చినట్లుంది కదూ!

కుండీకి నాలుకొస్తే..!

చాలా ఇష్టంగా మొక్కల్ని పెంచుకుంటాం. కానీ ఏదో హడావుడిలో పడి, రెండు రోజులు నీళ్లు పొయ్యడం మర్చిపోతే ఎండిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే ఈ ‘పెరొపన్‌ డ్రింకింగ్‌ యానిమల్‌ ప్లాంటర్లు’. జంతువుల బొమ్మల్లా ఉండే ఈ కుండీలకు ముందుభాగంలో స్పాంజిలాంటి పదార్థంతో చేసిన నాలుక వేలాడుతుంది. కుండీకి దగ్గర్లో గిన్నెపెట్టి, నీళ్లుపోసి ఈ నాలుక అందులో వేలాడేలా పెడితే చాలు, అది గిన్నెలోని నీళ్లను మెల్లగా పీల్చుకుంటూ కుండీలోని మట్టిని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మామూలు కుండీల్లో ఎన్ని నీళ్లుపోసినా కిందికి కారిపోతాయి కాబట్టి, ఏ రోజుకారోజు నీళ్లు పోసుకోవాలి. అదే ఈ కుండీలైతే గిన్నెనిండా నీళ్లుపోస్తే అవి అయ్యేవరకూ చూసుకునే పనిలేదు. పైగా ఇవి చూడ్డానికీ వెరైటీగా ఉంటాయి. మట్టికూడా కారదు, కాబట్టి ఇంట్లో ఎండ తగిలే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

మెషీన్‌తో కాఫీ చిత్రాలు  

వీలైతే నాలుగు మాటలూ కుదిరితే కప్పు కాఫీ... అంటూ కాఫీని కబుర్లకు ముడిపెట్టేస్తాం. మరలాంటి కాఫీతోనే ప్రియమైన వారికి సందేశాలు చేరవేస్తే... అవును, ఈ ‘రిపుల్‌ మేకర్‌’ కాఫీ మెషీన్‌ ఉంటే ఇష్టమైనవారి ఫొటోనో చిరునవ్వు తెప్పించే మెసేజ్‌నో చిటికెలో కాఫీ మీద ముద్రించి ఆత్మీయులకు అందివ్వొచ్చు. ఆప్‌తో పనిచేసే ఈ కాఫీ మెషీన్‌ సహాయంతో మన ఫోన్‌లో ఉన్న ఏ ఫొటోనైనా మెసేజ్‌నైనా కాఫీమీద ముద్రించొచ్చు. కాబట్టి, ఇంటికొచ్చిన అతిథులు కూడా మనమిచ్చే కాఫీ చూసి కళ్లప్పగించేయాల్సిందే.

పుచ్చకాయను కోసేద్దామిలా

నీటిశాతం ఎక్కువగా ఉండి, తియ్యగా రుచిగా ఉండే పుచ్చకాయను వేసవిలో తిననివారుండరు. కానీ సమస్యేంటంటే ఆ నీరు సగం దాన్ని కోసేటపుడే కారిపోతుంటుంది. ఏం పర్లేదు. ఈ ‘ఈజెడ్‌ స్లైస్‌ రైట్‌’ ఉంటే నేరుగా పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని మాత్రం చిన్నచిన్న ముక్కలుగా కోసేయొచ్చు. శాండ్‌విచ్‌ హోల్డర్‌లా ఉండే ఈ స్లైస్‌రైడ్‌ రెండువైపులా పదునుగా ఉండడంతో పాటు ఆ రెండు అంచుల్నీ కలిపే చివరిభాగం కూడా పదునుగా ఉంటుంది. దాంతో కోసినపుడు కాయ కింది నుంచీ ఒక్కో ముక్కా వేరవుతూ వస్తుంది.

ఫోన్‌ని తొడిగేద్దాం

  కపక్కేమో ఫోన్‌ చేతిలో లేకుండా ఉండలేం. మరోపక్కేమో అరచేతిని మించి ఉండే ఆ ఫోన్లను అంతంతసేపు జారిపోకుండా పట్టుకోలేం. ఈ సమస్యకు దొరికిన అందమైన పరిష్కారమే ‘జెమ్‌స్టోన్‌ రింగ్‌ ఫోన్‌కేస్‌లు’. పైభాగంలో ఉంగరాల్లాంటి అమరికతో ఉండే ఈ కేస్‌ని ఫోన్‌కి పెట్టి, ఆ ఉంగరాల్లో వేళ్లను దూర్చితే చాలు, ఫోన్‌ని పట్టుకోవడానికి సౌకర్యంగానూ ఉంటుంది. చేతికి అందమైన ఉంగరాలున్నట్లూ కనిపిస్తుంది. ఐడియా అదిరింది కదూ!

అరల్ని మడిచేయొచ్చు

ద్దె ఇళ్లలో సరిపడినన్ని అరలు ఉండకపోవచ్చు. అలాఅని బీరువాలూ ఇనుము, చెక్కతో చేసిన షెల్ఫుల్ని తెచ్చిపెట్టుకోవాలంటే ధర ఎక్కువా, మళ్లీ వేరేచోటికి మారినపుడు వాటిని తీసుకెళ్లడమూ ఇబ్బంది. పైగా మరోచోట వాటి అవసరం కూడా ఉండకపోవచ్చు. ఈ ‘జిగ్‌జాగ్‌ షెల్ఫు’లతో అయితే అలాంటి ఇబ్బందే ఉండదు. వీటిని కావల్సినపుడు బీరువా సైజులో అరల్లా మార్చుకోవచ్చు. అవసరంలేనపుడు మడిచి, చిన్నసైజు బ్యాగులో పెట్టేసుకోవచ్చు. బ్యాచిలర్లు, హాస్టళ్లలో ఉండేవారిక్కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఏమంటారు..?

ఈ గ్లాస్‌ పడిపోదు

ఇంటికి బంధువులు రావడం చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం మామూలే. ఆ పార్టీల్లో కూల్‌డ్రింకులూ జ్యూసుల్ని అందించేటపుడో, తాగుదామని పక్కన పెట్టినపుడో అనుకోకుండా ఏదో తగిలి గ్లాసులు పక్కకి పడిపోవడమూ కొత్త డ్రెస్సు పాడైపోవడం లాంటివీ జరుగుతూనే ఉంటాయి. పిల్లలు కూడా అలాగే పాలగ్లాసుని పక్కన పెట్టి ఆడుతూ పడేస్తుంటారు. మరేం చెయ్యాలీ అంటారా... ఈ ‘మైటీ పింట్‌’ గ్లాసుల్ని తెచ్చుకోవాలి. ఈ గ్లాసుల అడుగుభాగంలో రంధ్రాలున్న పలుచటి రబ్బరు నిర్మాణం ఉంటుంది. దాంతో గ్లాసుని ఎక్కడైనా పెట్టినపుడు వ్యాక్యూమ్‌ ట్యూబ్‌లా అతుక్కుంటుంది. కాబట్టి, ఇది మామూలు గ్లాసుల్లా త్వరగా పక్కకు పడిపోదు. మీకూ కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.

సూపర్‌ సూట్‌కేస్‌

ఫ్లొవొట్టి... ప్రపంచంలోనే స్మార్ట్‌ సూట్‌కేస్‌ ఇదేనట. అవునుమరి, దీన్లో ఉన్న ఫీచర్లు అన్నీ ఇన్నీ కావు. ఈ హైటెక్‌ సూట్‌కేస్‌లో బట్టలన్నీ సర్దేసి హ్యాండిల్‌ను కొంచెం పైకి లేపితే చాలు, దాని పక్కనే ఉన్న డిజిటల్‌ స్కేలు మీద అది ఎంత బరువు తూగుతుందన్నది చూపిస్తుంది. కాబట్టి, ఎయిర్‌పోర్టులకు వెళ్లేటపుడు ఎంత బరువు తీసుకెళ్లాలంటే అంతే తీసుకెళ్లొచ్చు. ఫ్లొవొట్టితో ల్యాప్‌టాప్‌కూ ఫోన్‌కీ ప్రయాణాల్లో ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు. అంతేకాదు, ఆప్‌తో పనిచేసే ఈ సూట్‌కేస్‌లో పాస్‌పోర్ట్‌లూ కెమెరాల్లాంటి ముఖ్యమైన వస్తువులు పెట్టుకునేందుకు ప్రత్యేకమైన అరలుంటాయి. అందులో నుంచి తీసిన వస్తువుల్ని తిరిగి వాటిలో పెట్టుకోవడం మర్చిపోతే మనం కొన్ని అడుగులు దూరం వెళ్లగానే మర్చిపోయిన వాటి గురించిన సమాచారంతో మెసేజ్‌ ఫోన్‌కు వస్తుంది. కాబట్టి, బయటికెళ్లినపుడు దేన్నీ పోగొట్టుకుంటాం అనే భయం ఉండదు. ఇక, ఈ సూట్‌కేస్‌ పైభాగంలో ఉండే బెల్టు సహాయంతో హ్యాండ్‌బ్యాగ్‌ లాంటివాటిని విడిగా పట్టుకునే పనిలేకుండా సూట్‌కేస్‌కి బిగించి సులభంగా తీసుకెళ్లిపోవచ్చు. అంతేనా దీనికున్న జీపీఎస్‌ ద్వారా మన సూట్‌కేస్‌ని ఎవరైనా కొంచెం కదిలించినా వెంటనే ఫోన్‌కి మెసేజ్‌ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటారా ఇది సూపర్‌ సూట్‌కేస్‌ అని.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.