close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
51 గ్రామాల్లో కరవును తరిమేశాడు!

51 గ్రామాల్లో కరవును తరిమేశాడు!

చిన్నారుల ఆకలి మంటలూ, రైతుల ఆకలి చావులతో ఒకప్పుడు వణికిపోయిన నేల ఇప్పుడు పంట పొలాలతో సుభిక్షంగా వర్థిల్లుతోంది. రోజుకి ఒక్కసారైనా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్తే చాలనుకున్న కుటుంబాలు, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలకు తమ ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిన 51గ్రామాలు, ఆ రాష్ట్రానికి నీటి సంరక్షణ పాఠాలు చెబుతున్నాయి. ఈ విజయాలన్నీ ఈ ఏడాది పద్మశ్రీ అందుకున్న సైమన్‌ ఒరేన్‌ అనే శ్రామికుడి కష్టానికి దక్కిన ఫలితమే.‘నేను పురస్కారాన్ని తీసుకోవాలంటే ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. ముఖ్యమంత్రి పల్లెల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కరించాలి’... తనకు దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించినప్పుడు సైమన్‌ అన్న మాటలివి. దిల్లీలో పురస్కారం అందుకోవడానికి వచ్చిన ప్రముఖల కోసం ఫైవ్‌ స్టార్‌ హోటల్లో గదులని కేటాయిస్తే, వాటిని వద్దని ఓ గిరిజన సంక్షేమ హాస్టల్లో బస చేశాడు సైమన్‌. ‘నా రాష్ట్రంలో రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే, నేను విలాసాలను అనుభవించలేను’ అన్నది ఆయనిచ్చిన సమాధానం. జార్ఖండ్‌లోని బీడో జిల్లా కక్సిటోలి గ్రామంలో పుట్టిన సైమన్‌, రాష్ట్రపతి భవనం దాకా రావడానికి మధ్యలో మార్చిన జీవితాలూ, సాధించిన విజయాలూ చాలా ఉన్నాయి.

నీటి కష్టాలు మొదలు...
సైమన్‌ స్వగ్రామం ఓ అటవీ ప్రాంతం. చిన్నప్పుడు దళారులు యంత్రాలతో చెట్లను నరుకుతుంటే చూడ్డానికి సైమన్‌ సరదా పడేవాడు. అంత భారీ యంత్రాలు ఒక్క దెబ్బకు చెట్లను నేలకూల్చడం అతడికి ఆశ్చర్యంగా అనిపించేది. కాస్త పెద్దయ్యాక కానీ అతడికి అర్థం కాలేదు, ఆ దళారులు నాశనం చేస్తోంది అడవుల్ని కాదు తమ జీవితాల్నీ అని. చెట్లను విపరీతంగా నరికేయడం వల్ల వర్షాలు పడినప్పుడు ఆ ప్రాంతంలో నేలపైన సారవంతమైన పైపొర కొట్టుకుపోయి, భూములన్నీ నిస్సారంగా మారాయి. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయానికి కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమైంది. నెమ్మదిగా వలసలూ, ఆకలి చావులూ, ఆత్మహత్యలూ మొదలయ్యాయి. దైవంలా చూసుకునే అడవిలోని చెట్లని కొట్టి అమ్ముకొని గ్రామస్థులు పొట్ట పోసుకోవడం మొదలుపెట్టారు. ఇరవై ఎనిమిదేళ్ల వయసులో సైమన్‌ ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. గ్రామంలో అన్ని ఇబ్బందులకూ కారణం నీటి కరవే. వర్షాకాలంలో కురిసే వానలే అక్కడ నీళ్లకు ఆధారం. వాటిని భద్రపరచుకోగలిగితే నీటి కొరతను కొంత వరకూ జయించొచ్చని అనుకున్నాడు.

కష్టాలకు ‘చెక్‌’డ్యామ్‌లు...
వానాకాలంలో నీటిపాయలు కొండల నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయేవి. సైమన్‌ ఆ నీటిధార ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడానికి కొన్ని మైళ్ల దూరం నడిచాడు. వర్షపు నీళ్లు అడవిలో, కొండలపైన ఎక్కువగా నిలుస్తోన్న ప్రాంతాలను గుర్తించాడు. వాటి పరిసరాల్లో చెక్‌ డ్యామ్‌లు నిర్మించి, ఆ నీటిని కుంటల్లోకీ, పొలాల్లోకీ మళ్లిస్తే నీటి సమస్య తగ్గుతుంది అనిపించింది. కానీ దానికోసం గ్రామస్థుల పొలాల్లో కొంత భాగం మునిగిపోతుంది. దాంతో చాలామంది డ్యామ్‌ల నిర్మాణానికి ఒప్పుకోకపోవడంతో, సైమన్‌ తన పదెకరాల పొలాన్నీ ముంపు బాధిత రైతులకు ఇచ్చేశాడు. కొందరు కుర్రాళ్ల సాయంతో వర్షపు నీటి ప్రవాహాలకు అడ్డంగా మట్టితో చెక్‌ డ్యామ్‌లు నిర్మించి ఆ నీటిని బావులవైపు మళ్లించాడు. తొలి రెండేళ్లూ వర్షాల ధాటికి ఆ డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. దాంతో మూడో ఏడాదికి అధికారుల కాళ్లావేళ్లా పడి కాంక్రీట్‌ డ్యామ్‌లు నిర్మించాడు. వాటి ఆధారంగా గ్రామ చుట్టుపక్కలున్న బావులూ కుంటల్లోకి వర్షపు నీరు చేరేలా కాల్వలు ఏర్పాటు చేశాడు. కొత్తగా చెరువులు తవ్వించాడు. క్రమంగా భూగర్భ జల మట్టం పెరిగింది. పొలాలు వ్యవసాయానికి అనువుగా మారాయి. ఆ విజయం ఇతర గ్రామాలనూ ఆకర్షించి వాళ్లూ సైమన్‌ను ఆశ్రయించారు. అలా ఒక్కో గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టిన సైమన్‌, కొన్నేళ్ల వ్యవధిలో ఆ జిల్లాలోని 51 గ్రామాల్లో నీటి కరవును దూరం చేశాడు.గ్రామాలు మారిపోయాయి
అడవుల్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టమేనని సైమన్‌కి తెలుసు. అందుకే కుర్రాళ్లను ఏకం చేసి అటవీ సంరక్షణ దళాలను ఏర్పాటు చేశాడు. గతంలో చెట్లను నరికేసిన ప్రాంతంలో 35వేలకు పైగా చెట్లను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను చూసుకుంటున్నాడు. ఫలితంగా నేల సారవంతమైంది. కరవుతో కటకటలాడిన గ్రామాలన్నీ సైమన్‌ పుణ్యమా అని సుభిక్షంగా మారాయి. జార్ఖండ్‌ వ్యాప్తంగా ఏడాదికి సాధారణంగా ఒక పంటే వేస్తే, ఈ 51 గ్రామాల్లో మాత్రం నీరు సమృద్ధిగా ఉండటంతో వరితో సహా ఏటా నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి. ఆత్మహత్యలూ, వలసలూ తగ్గి చాలా కాలమైంది. తొలిసారి పిల్లలు మంచి స్కూళ్లకెళ్లి చదువుకుంటున్నారు. ఈ గ్రామాల నుంచి లక్షలు విలువ చేసే 20వేల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు ఏటా గుజరాత్‌, పశ్చిమబంగా, బిహార్‌, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దాంతో బీడోని అక్కడి ప్రభుత్వం ‘అగ్రికల్చరల్‌ హబ్‌ ఆఫ్‌ జార్ఖండ్‌’గా గుర్తించింది. సైమన్‌ను వాటర్‌ షెడ్ల కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. అతడి ప్రస్థానంపైన సారా అనే కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థిని పీహెచ్‌డీ చేసింది. వృద్ధాప్యం మీదపడినా ఇప్పటికీ సైమన్‌ ఏటా వెయ్యి మొక్కలను నాటడంతో పాటు వాటి బాగోగులనూ చూసుకుంటున్నాడు

సైమన్‌లా ఇబ్బందులు ఎదుర్కొన్నాక పరిష్కారాన్ని వెతుకుతామా, లేక అజాగ్రత్త వల్ల ఎదురయ్యే సమస్యలను ముందే వూహించి వాటిని నివారించడానికి మనవంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తామా అన్నది మన చేతుల్లో పనే కదా..!


కాసేపే ఉండండి... కొంచమే ఇవ్వండి!

‘చిన్న చిన్న అవసరాలకు చిన్న మొత్తంలోనే డబ్బు చెల్లించొచ్చు!’ ఇదేం ప్రకటన కాదు. హోటల్‌ గదుల అద్దె చెల్లింపుల్లో వస్తున్న సరికొత్త మార్పుకు ట్యాగ్‌లైన్‌. కొత్త వూళ్లలో వసతి కోసం మనకు గదులు కొన్ని గంటలే అవసరముంటాయి. అలాంటప్పుడు రోజు మొత్తానికీ అద్దెచెల్లించే అవసరం లేకుండా... వాడినన్ని గంటలకే సొమ్ము కట్టడం కొత్త కాలపు సరికొత్త ట్రెండ్‌. అదే ‘మైక్రోస్టేస్‌’ కాన్‌సెప్ట్‌. గంటల లెక్కన అద్దె గదులన్నమాట!మాజంలో, సాంకేతికతలో, సౌకర్యాల్లో... వస్తున్న ఎన్నో మార్పులకు కారణం అవసరాలే. వాటిని బట్టే కట్టూ బొట్టూ భాషా వస్తువులూ పద్ధతులూ అన్నీ మారుతుంటాయి. మరి ఆ అవసరాల జాబితాలో చిన్న చిన్న అవసరాలూ వాటికి సంబంధించిన మార్పులూ కూడా ఉంటాయి కదూ! ఉదాహరణకు ఓ పరీక్షకో ఇంటర్వ్యూకో సమావేశానికో హాజరవ్వాలి. దానికి ముందు ఉదయాన్నే స్నానం ముగించి తయారై వెళ్లాలంటే వూరుకాని వూళ్లొ హోటల్‌గదే ఆశ్రయం. కేవలం గంటా రెండు గంటల సమయం సరిపడే ఆ కొంచెం పనికోసం ఇంతకు ముందైతే ఆ గదులకు రోజు మొత్తం అద్దె చెల్లించాల్సి వచ్చేది. అలా డబ్బు కట్టేందుకు ఇబ్బంది పడేవాళ్లూ, కాసేపటి కోసం హోటల్‌ గదుల్నే ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నవాళ్లూ చాలా మందే ఉంటున్నారు కాబట్టే... మైక్రోస్టేస్‌ పేరిట గంటల లెక్కన గదిని అద్దెకిస్తున్న హోటళ్లు బాగానే పెరుగుతున్నాయి. ఈ సౌకర్యాన్ని కల్పించే వెబ్‌సైట్ల సంఖ్యా దినదినాభివృద్ధి చెందుతోంది.

ఏమిటీ మైక్రోస్టేస్‌...
హోటల్‌ గది మనకు అవసరమున్న సమయానికి మాత్రమే అంటే రెండు గంటలు, మూడు గంటలు, ఒకపూట ఇలా... బుక్‌చేసుకోవడాన్నే మైక్రోస్టే అంటారు. అంటే ఆంగ్లంలో - ‘కాసేపు నివసించడం’ అన్నమాట! ఇది 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తరువాతి కాలంలో అమెరికా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఇలా అవసరాల మేరకే అద్దె చెల్లించే గదుల పద్ధతి విస్తరించింది. ప్రస్తుతం దాదాపు రెండేళ్లుగా భారతదేశంలోని పెద్దనగరాల్లో ఈ విధానం వూపందుకుంది. ఫైవ్‌స్టార్‌ హోటళ్లు మొదలు త్రీస్టార్‌, టూస్టార్‌, సాధారణ హోటళ్ల దాకా ఈ వసతినందించేవాటి సంఖ్య పెరుగుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి చోట్లా ఈ తరహా వసతి గదులు అందుబాటులోకి వస్తున్నాయి. చతుర్‌ ముసాఫిర్‌, 6 అవర్లీ, స్టే అంకుల్‌, హోటల్స్‌ ఎరౌండ్‌యూ, అవర్లీహోటల్స్‌నియర్‌మీ తదితర వెబ్‌సైట్లూ ఆప్‌ల ద్వారా ఈ తరహా గదులని బుక్‌ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో గదిని వినియోగించుకున్న సమయాన్ని బట్టి మొత్తం అద్దెలో కొంతశాతం చెల్లిస్తే సరిపోతుంది.

తొలి ఆలోచన...
ఈ తరహా గదుల బుకింగ్‌కు సంబంధించి తొలినాళ్ల నుంచీ ఉండి, ఈ గదుల బుకింగ్‌లో ప్రాచుర్యం పొందిన వెబ్‌సైట్‌ చతుర్‌ ముసాఫిర్‌. దాదాపు రెండేళ్ల క్రితం యాడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రీతిజైన్‌, ఆమె భర్త మనీష్‌లు ఓసారి కోయంబత్తూరు నుంచి జోధ్‌పూర్‌కు వెళ్లాల్సి వచ్చింది. మొదట ఫ్లైట్‌లోనూ ఆ తర్వాత రైల్లోనూ ప్రయాణం. రెండు ప్రయాణాలకూ మధ్య 9 గంటల సమయం. కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి తయారై వెళ్లేందుకు వాళ్లకు ఓ ఆరుగంటల కోసం గది కావాల్సి వచ్చింది. కానీ 24 గంటల అద్దె చెల్లించారు. అప్పుడే వాళ్లకు ఓ ఐడియా వచ్చింది. ‘గంటల లెక్కన గదులు అద్దెకు దొరికితే....’ ఆ ఆలోచన నుంచే చతుర్‌ ముసాఫిర్‌ (స్మార్ట్‌ ట్రావెలర్‌) వెబ్‌సైట్‌ పుట్టింది. గంటల లెక్కన హోటల్‌ గదులు బుక్‌చేసుకునే వీలు కల్పించే ఈ వెబ్‌సైట్‌ ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలతో పాటూ యాత్రా స్థలాలైన షిరిడీ, అమృత్‌సర్‌, జైపూర్‌, కొచ్చి తదితర 20 వూళ్లలో పనిచేస్తోంది. మొదలు పెట్టిన రెండేళ్లలో ఈ ఒక్క వెబ్‌సైట్‌కే దేశవ్యాప్తంగా 14000 బుకింగ్స్‌ వచ్చాయంటే మైక్రోస్టేస్‌కు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత మొదలైన ‘హోటల్స్‌ ఎరౌండ్‌యూ’, ‘6 అవర్లీ’ తదితర వెబ్‌సైట్లు కూడా బాగా ప్రజాదరణ పొందుతున్నవే. ఎక్కువగా వ్యాపారాల మీద ప్రయాణాలు చేస్తుండేవాళ్లూ, యాత్రికులూ, దూర ప్రయాణాలు చేసే ప్రయాణీకులూ, ఆటలూ పరీక్షల కోసం వూళ్లకు వచ్చే వాళ్లూ ఇలా విభిన్న వర్గాల వాళ్లు ఈ తరహా గదులను బుక్‌ చేసుకుంటున్నారు. పార్క్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌, తాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌, మారియట్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌లాంటి ప్రఖ్యాత హోటళ్లు కూడా ఈ వసతిని కల్పిస్తున్నాయి. హోటళ్లలో సాధారణంగా రాత్రిపూట ఎక్కువమంది బస చేస్తుంటారు. అలాంటప్పుడు పగటిపూట గంటల లెక్కన గది అద్దెకివ్వడం హోటళ్ల వాళ్లకూ లాభదాయకంగా ఉంటోందట. ఇక కావలసిన సమయం మేరకే అద్దె చెల్లించడం మనకూ ఆనందకరమైన విషయమే! మొత్తానికి మైక్రోస్టేస్‌ మంచి మార్పే కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.