close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మార్పు కోసం ... ఓ సినిమా..!

మార్పు కోసం...ఓ సినిమా..!

లాభాలు గడించాలని సినిమాలు తీసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ సమస్యలను ఎత్తిచూపి సమాజాన్ని జాగృతి చేసే దిశగా సినిమాలు తీసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో ఒకడే హైదరాబాద్‌కు చెందిన అన్షూల్‌ సిన్హా. అందుకే అయిదేళ్ల ప్రస్థానంలో నూటరెండు అవార్డులు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి.చిన్నతనం నుంచీ అన్షూల్‌ ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆ ఆలోచనల్లో సమాజానికి ఏమైనా చేయాలనే తపన కనిపించేది. స్కూలు రోజుల్లోనే ఆ ఆలోచనలు ఒక రూపాన్నీ సంతరించుకున్నాయి. రోజూ తన క్లాసులోని పిల్లల నుంచి ఒక రూపాయి తీసుకుని అలా సేకరించిన మొత్తాన్ని నెలకోసారి తీసుకెళ్లి అంధుల పాఠశాలలో ఇచ్చేవాడు. అప్పుడే అక్కడ ఉన్న అరకొర సౌకర్యాలు అతడి చిట్టిబుర్రలో ఆలోచనలు రేకెత్తించాయి. ఆ స్కూల్లో ఒక్క కంప్యూటర్‌ కూడా లేకపోవడమూ అతడిని ఆలోచనల్లో పడేసింది. తర్వాత ఎంబీఏ చేస్తుండగానే డాక్యుమెంటరీ సినిమా తీయడం మొదలుపెట్టాడు. దానికీ అంధుల పాఠశాలే వేదికైంది. ఆ స్కూల్లోని సమస్యలనే సినిమాగా రూపొందించాడు. ఆ సినిమా చూసి స్పందించిన హైదరాబాద్‌ లయన్స్‌ క్లబ్‌ అంధుల పాఠశాలకు పన్నెండు కంప్యూటర్లను అందజేసింది.

ఆ ప్రేరణతోనే...
ఆ స్పందన అందించిన ప్రేరణతోనే మరిన్ని సినిమాలనూ రూపొందించాడు. భారతీయ విద్యాభవన్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేస్తూనే మరో చిత్రాన్నీ తీశాడు. ఈసారి ఒక వృద్ధాశ్రమాన్ని తెరకెక్కించాడు. ఆశ్రమంలో ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న ఒక పెద్దాయన అన్షూల్‌ దృష్టిని ఆకర్షించాడు. అతడి ఆవేదనను తెరకెక్కించి చిత్రాన్ని పెద్దాయన కొడుక్కే చూపించాడు. కొడుకు తన తప్పును తెలుసుకుని వెంటనే తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ‘తల్లిదండ్రులూ పిల్లల మధ్య మానసిక దూరం పెరిగిపోతోంది. పెద్దల మనసును పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు. వృద్ధాశ్రమాల్లో అత్యాధునిక సౌకర్యాలెన్ని ఉన్నా తల్లిదండ్రుల మనసంతా పిల్లల చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే సున్నితమైన ఈ అంశం మీద సినిమా తీసి ఒక్కరిలోనైనా మార్పు తీసుకురాగలిగాను’ అంటాడు అన్షూల్‌. ఏడాది కాలంలోనే తన డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా ఎన్నో మార్పులకూ కారణమయ్యాడు అన్షూల్‌. సుమారు యాభై కాలేజీలకు వెళ్లి వివిధ సమస్యల మీద డాక్యుమెంటరీ సినిమాలు ఎలా తీయవచ్చనే విషయం మీద విద్యార్థులకు అవగాహన కలిగించాడు. మరోపక్క డాక్యుమెంటరీ చిత్రాల పోటీల్లోనూ పాల్గొంటున్నాడు. అయిదేళ్లలో 41 సినిమాలను రూపొందించి 102 అవార్డులనూ గెలుచుకున్నాడు. ఇరవైరెండు సినిమాలు అంతర్జాతీయ ప్రదర్శనకూ ఎంపికయ్యాయి.

అన్షూల్‌ తన మొదటి డాక్యుమెంటరీ సినిమాను మన దేశంలోని పేదరికం మీద నిర్మించాడు. కాలేజీ, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి పోటీల్లో పదిహేను అవార్డులను తెచ్చిపెట్టిన ఆ సినిమా ఈ రంగంలో కొనసాగవచ్చనే నమ్మకాన్ని కలిగించింది. దాంతో వెంటనే రెండో సినిమా తీశాడు. దాన్నీ అవార్డులు వరించాయి. నాలుగేళ్ల కిందట చదువు పూర్తయిన తర్వాత ‘లపెట్‌’ అనే సినిమా తీశాడు. అది అంతర్జాతీయ అవార్డును గెలుపొందింది. లాస్‌ ఏంజలస్‌లో జరిగిన ‘మై హీరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో దాన్ని ప్రదర్శించారు. అరవైఅయిదు దేశాల సినిమాల మధ్య జరిగిన ఆ పోటీలో అన్షూల్‌ సినిమా అవార్డును గెలుచుకోవడం విశేషం. అయితే ఆ సినిమాను మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించి తీయడం మరో విశేషం. సినిమాలు తీయడానికి మొబైల్‌ ఫోన్‌నే ఉపయోగించేవాడు అన్షూల్‌. ఆ తర్వాత నగదు బహుమతిగా అందుకున్న మొత్తాలను దాచిపెట్టి వాటితో వీడియో కెమెరా కొన్నాడు.

మూలసూత్రం అదే...
అన్షూల్‌ చిత్రాల నిర్మాణం వెనక ఉన్న మూలసూత్రం తన చిత్రాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయాలనే తపనే. ఆసుపత్రుల వాళ్లు నిబంధనలకు వ్యతిరేకంగా పారేసే వ్యర్థ పదార్థాల వల్ల ఎంత కీడు జరుగుతుందో చెప్పడానికి ‘ది అన్‌సీన్‌ డిజాస్టర్‌’ అనే చిత్రాన్ని నిర్మించాడు. బయో మెడికల్‌ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారేయడం వెనుక ప్రముఖుల హస్తం ఉండటంతో చిత్రీకరణ సమయంలోనే అన్షూల్‌ ఎన్నో బెదిరింపులను ఎదుర్కొన్నాడు. చిత్రం విడుదల సమయంలో అన్షూల్‌ మీద అసాంఘిక శక్తుల దాడులూ జరిగాయి. కానీ అవన్నీ అన్షూల్‌ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం మార్చలేకపోయాయి. ఆ చిత్రం మన దేశంలో జరిగిన పోటీల్లో పద్నాలుగు అవార్డులను గెలుచుకోవడమే కాకుండా అంతర్జాతీయ ప్రదర్శనలకూ ఎంపికైంది.

‘గేట్‌ వే టు హెవెన్‌’ అనే చిత్ర నిర్మాణం వెనుకా ఆసక్తికరమైన కథ ఉంది. హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వరరావు ఇరవైఏళ్లలో పన్నెండువేల మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. అతడి జీవితం మీద తీసిన సినిమానే ‘గేట్‌ వే’. ఈ చిత్రాన్ని రెండేళ్లపాటు కష్టపడి నిర్మించారు. అయితే దీన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో హైదరాబాద్‌లో వంద రోడ్‌షోలు వేసి మరీ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

‘సమాజంలో మార్పు తీసుకురావడానికి మనందరం కృషిచేయాలి. స్ఫూర్తిమంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే రకరకాల సమస్యల మీద చర్చించి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా కొనసాగడం కాస్త కష్టమే. కానీ సమాజానికి ఏమైనా చేయాలనే తపనే నన్ను ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం ఒక వ్యాపార ప్రకటనకు పనిచేస్తున్నాను. ఆ తర్వాత రైతుల ఆత్మహత్యల మీద చిత్రాన్ని నిర్మిస్తా’ అంటాడు అన్షూల్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.