close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నట్టింట్లో నెట్టిల్లు

నట్టింట్లో నెట్టిల్లు
- ఉషాబాల

రుగెట్టి పాలు తాగేకంటే నిలబడి తాపీగా నీళ్ళు తాగడంలోనే ఆనందం ఉందని గట్టిగా నమ్మేవాళ్ళలో చలపతి మొదటివాడు. ట్విట్టర్‌, బ్లాగ్స్‌, వాట్సాపుల జనరేషన్‌వాడే అయినా వాటిపై పెద్దగా ఆసక్తి లేనివాడు. అతని దగ్గర ఇంకా పదేళ్ళక్రితం బేసిక్‌ మోడల్‌ నోకియా ఫోనే వాడకంలో ఉంది. ‘ఈ స్మార్ట్‌ యుగంలో కూడా ఇంకా ఈ ఫోనేంట్రా’ అంటూ వేళాకోళం చేసే మిత్రులకి ‘నేను మీ అంత స్మార్ట్‌ కాదు, నాది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమూ కాదు’ అంటూ నవ్వుతూ తప్పించుకుంటాడు.

ఓ నేషనలైజ్డ్‌ బ్యాంకులో ఉద్యోగిగా ఈమధ్యనే చేరాడు చలపతి. ఇక పెళ్ళి విషయంలోనూ అతనికి పెద్దగా ఆశలు లేవు. ఇంటిని చక్కదిద్దుకోగల అమ్మాయైతే చాలనుకున్నాడు. అతని కోరిక మేరకే బియస్సీ కంప్యూటర్స్‌ చదివిన ‘అచల కుమారి’తో వారంక్రితమే వివాహం అయింది. సంబంధం కూడా చలపతి బామ్మ చూసి ఓకే చేసిందే. పెళ్ళి ముచ్చట్లన్నీ అయ్యాక భార్యని తీసుకుని హైదరాబాద్‌లో తను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో కాపురం పెట్టాడు చలపతి. అద్గదిగో అప్పటినుంచే మొదలయ్యాయి మన చలపతి పాట్లు.

అచల పుట్టింటి వారిచ్చిన చీరా సారెలతోపాటుగా అమెరికాలో ఉన్న తన అన్న మురిపెంగా కొనిపెట్టిన లాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌లతో కాపురానికొచ్చింది. తనకు వాటిమీద పెద్దగా అవగాహన లేకపోయినా తన భార్యకి ఇంట్లో ఒంటరితనం పోగొట్టడానికి సాయపడతాయిలే అని సంతోషించాడు. ఇంకా కొత్త కాపురానికి కావాల్సిన పచారీ సామాన్లూ అవీ లేకపోవడంతో ఆ రోజుకి ఉదయం అల్పాహారం దగ్గరలోని ఉడిపి హోటల్‌ నుంచి తెచ్చాడు చలపతి. ఆఫీసుకు బయలుదేరుతూ ‘‘కావాల్సిన సామాన్ల లిస్టు రాసుంచు. సాయంత్రం ఇద్దరం సూపర్‌ మార్కెట్‌కి వెళ్ళి తెచ్చుకుందాం’’ అంటూ ఆమె బుగ్గమీద చిటికేసి హుషారుగా ఈల వేసుకుంటూ కిందకొచ్చి బైక్‌ స్టార్ట్‌ చేశాడు.

ఆరోజు సోమవారం కావడంతో బ్యాంకులో కస్టమర్లు క్యూ కట్టి ఉన్నారు. పనిచేస్తున్నాడన్నమాటేగానీ చలపతి మనసు ఇంటి దగ్గర ఉన్న అచల దగ్గరే ఉండిపోయింది. కాస్త భోజనప్రియుడు కావడంతో ‘రాత్రికి ఏం వంట చేస్తుందో... కమ్మని ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళయింది? అందునా అప్సరస లాంటి అచల చేతివంట ఇంకెంత రుచిగా ఉంటుందో...’ అనుకుంటూ గడియారం ఆరు కొట్టగానే ఇంటిముఖం పట్టాడు. కాలింగ్‌బెల్‌ కొట్టగా కొట్టగా తాపీగా వచ్చి తలుపు తీసింది అచల.

‘‘ఏంటోయ్‌, ఇంతసేపు చేశావ్‌... ఏం చేస్తున్నావ్‌’’ అంటూ నవ్వుతూ ఇల్లంతా పరికించి చూశాడు. పొద్దున తను వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అంతే. వూరినుంచి తెచ్చిన లగేజ్‌ అలాగే హాల్లో ఉంది. అత్తగారిచ్చిన స్వీట్లూ, పచ్చడి ప్యాకెట్లన్నీ డైనింగ్‌టేబుల్‌ మీద అలాగే పరిచి ఉన్నాయి. అచల మాత్రం మంచం మీద బోర్లా పడుకుని దిండు మీద లాప్‌టాప్‌ పెట్టుకుని ఏదో సీరియస్‌గా టైప్‌ చేస్తోంది. కాఫీ టీలు తాగే అలవాటులేని చలపతి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్ళు తీసుకుని తాగి, హాల్లో లగేజీ అంతా బెడ్‌రూమ్‌లో ఓ మూలకి చేర్చి డైనింగ్‌ టేబుల్‌ మీద ప్యాకెట్లన్నీ వంటింట్లోపెట్టి కాస్త ఫ్రెష్‌ అయి ‘‘ఏంటి శ్రీమతిగారూ, భర్త వేంచేసినా పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్టు’’ అన్నాడు నాటకీయంగా అచల పక్కనే కూర్చుంటూ. ‘‘లేచి తయారవ్వు, బయటికి వెడదాం. సరుకులు తెచ్చుకోవాలి కదా’’ అన్నాడు ఆమె వీపు సున్నితంగా నిమురుతూ.

‘‘ఏంటీ, అప్పుడే వచ్చేశారా?’’ అంది అచల బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ.

అదిరిపడ్డాడు చలపతి. ఎంత త్వరగా ఇంటికి వచ్చినా ‘ఇంతాలస్యమా?’ అని బుంగమూతి పెట్టే పెళ్ళాలను గురించి విన్నాడుగానీ ‘అప్పుడే వచ్చేశారా’ అని అడిగే పెళ్ళాలు కూడా ఉంటారని అప్పుడే బోధపడిందతనికి. అయినా ముఖం మీద ఏ భావాలూ కనబడకుండా ప్రయత్నిస్తూ ‘‘లేచి తయారవ్వవోయ్‌. హాయిగా నడుచుకుంటూ మన వీధి చివరనున్న సూపర్‌ మార్కెట్లో సరుకులు కొనుక్కుని, పోనీ ఈ పూటకి వంట చేయడం ఆలస్యమవుతుందనుకుంటే అయ్యర్‌ హోటల్లో రాత్రి ఫలహారం కానిచ్చి, వస్తూవస్తూ మిఠాయి కిళ్ళీ కట్టించుకుని, చిట్టెమ్మ పూలకొట్లో మల్లెపూలు కొనుక్కుని...’’ ఇంకా చలపతి ఏదో చెప్పబోయేంతలోపే-

‘‘బాబోయ్‌ ఇన్ని ప్రోగ్రామ్‌లా... నేను రాను బాబూ. నాకెక్కడికీ రావాలని లేదు’’ అంది ఆవులిస్తూ అచల.

‘‘అదేమిటోయ్‌, కొత్తగా పెళ్ళయినవాళ్ళం. అలా బద్ధకంగా ఉంటే ఎలా? లే, లేచి ఆ లాప్‌టాప్‌ మూసెయ్‌. వెళ్ళకపోతే ఇంటికి కావాల్సిన షాపింగ్‌ అంతా ఎలా? వంటింటి సామాన్ల గురించి నాకేం తెలుస్తుంది చెప్పు’’ అన్నాడు- ఆమె ధోరణికి వస్తున్న కోపాన్ని అణచుకుంటూ.

‘‘అయ్యో మహానుభావా, ఇలా అన్నిటికీ తగుదునమ్మాని మనమే బజార్లవెంట తిరగక్కరలేదండీ. ఇవన్నీ ఎందుకట?’’ అంటూ ఎదురుగా ఉన్న లాప్‌టాప్‌ చూపించి ‘‘చూడండి, ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లూ, కూరగాయలూ, పళ్ళూ, వంటకి కావాల్సిన గిన్నెలూ, గెరిటలూ, మూకుళ్ళూ, పెనాలూ... సమస్తం ఇందులో దొరుకుతాయి. నేను మనకి కావాల్సినవన్నీ బడాబాస్కెట్‌.కామ్‌లో బుక్‌ చేశాను. ఇదిగో పేమెంట్‌ టైమ్‌లో కరెక్ట్‌గా మీరొచ్చారు. ఏదీ మీ క్రెడిట్‌కార్డ్‌ ఓసారిలా ఇవ్వండి’’ అంటూ చనువుగా చలపతి జేబులోంచి కార్డు తీసుకుని పేమెంట్‌ క్లిక్‌ చేసింది అచల.

బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు చలపతి. అక్షరాలా పదివేలా ఐదువందల రూపాయలు జర్రున లాగేసింది. ‘ఇంత సామగ్రి ఏం బుక్‌ చేసిందా’ అని చూస్తే, అందులో చాలా వస్తువుల పేర్లు చలపతి విని ఉండలేదు. అజినమోటో, కాలోంజి, పిజ్జాబేస్‌, ఇంకా నోరుతిరగని పేర్లు ఎన్నో. వంటకి కావాల్సినవి ఉప్పూ, పప్పూ, చింతపండూ లాంటి వస్తువులే అనుకునే చలపతికి, పనీర్‌ అంటే పెళ్ళిళ్ళలో, సన్మానసభల్లో చల్లేది మాత్రమే అని అనుకునే చలపతికి ఇవన్నీ మింగుడుపడని వస్తువులే. ఇంకా ఆ జాబితాలో రెడీ టూ కుక్‌, రెడీ టూ ఈట్‌ లాంటివి చాలానే ఉన్నాయి. అచలతో షాపింగ్‌ ప్రోగ్రామ్‌ ఇలా అట్టర్‌ప్లాప్‌ అయ్యేసరికి ఏమీ చేయలేక వూరుకున్నాడు చలపతి.

ఆరోజూ చలపతి సాయంత్రం త్వరగానే ఇంటికొచ్చేశాడు. భార్యతో కలిసి అలా ఏ ట్యాంక్‌బండ్‌కో వెళ్ళి కాస్త చల్లగాలి పీల్చుకుని సెకండ్‌షో సినిమా చూసి రావాలని అతని ప్లాన్‌. ఉత్సాహంగా ఈ సంగతి అచలతో చెప్పాడు. ఆమె రియాక్షన్‌ షరా మామూలే.

‘‘అబ్బా, ఎక్కడికి వెళతామండీ... సాయంత్రం మా అన్నయ్య స్కైప్‌లో మాట్లాడతానన్నాడు. మనం చూద్దామనుకున్న సినిమా ఆన్‌లైన్‌లో హాయిగా ఇంట్లోనే చూసెయ్యొచ్చు. డబ్బు ఖర్చు కూడా ఉండదు’’ అంది అతని ఉత్సాహం మీద నీళ్ళు చల్లుతూ.

‘‘అదికాదు డార్లింగ్‌, అలా చెట్టాపట్టాలేసుకుని బయటికి వెళితే ఎంత బావుంటుంది చెప్పూ’’ అంటూ ఏదో చెప్పబోయేంతలోనే-

‘‘ఆగండి. అదిగో మా అన్నయ్య నుంచి స్కైప్‌ కాలొస్తోంది’’ అంటూ చలపతి మాటలు పట్టించుకోకుండా లాప్‌టాప్‌ ముందు కూలబడింది.

పిచ్చి కోపం వచ్చింది అతనికి. అయినా తమాయించుకుంటూ ‘‘నువ్వసలు నాతో ఎక్కడికీ రావా. నీకు సరిగ్గా సరిపోయే పేరే పెట్టినట్టున్నారు మీవాళ్ళు కదలకుండా ఇంట్లోనే కూర్చోడానికి’’ అన్నాడు అక్కసుగా.

‘‘ఇదిగో ఏదైనా అనాలనుకుంటే నన్ననండి. అంతేగానీ, మా బామ్మ ముచ్చటగా పెట్టుకున్న నా పేరుని కాదు. అయినా మీవాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా... ఎప్పుడెప్పుడు వూరేగివద్దామా అనుకునే మీకు తగ్గట్టే మీ పేరూ పెట్టారుగా.’’

‘‘అదిగో, అది మా తాతగారి పేరు. నన్నంటే ఆయన్నన్నట్టే’’ అంటూ ఇంకా వాదన పెంచుకోవడం ఇష్టంలేక బయటికి వెళ్ళిపోయాడు చలపతి. అలా ఓ గంటసేపు బయట తిరిగి ఇంటికొచ్చాడు. అతను అలిగాడని గ్రహించిన అచల ఆన్‌లైన్‌లో అన్నతో మాట్లాడుతున్నదల్లా కాసేపు పాజ్‌లో పెట్టి నవ్వుతూ, స్నాక్‌ ప్లేట్‌ చలపతి ముందుంచింది.

‘‘ఏమిటివి?’’ అన్నాడు నుదురు చిట్లిస్తూ.

‘‘అయ్యో, మీ కోసమే చేశానండీ. తమలపాకు పకోడీ, పచ్చిమిర్చి పాయసమూ’’ అంది ప్రేమగా. ఆ పేర్లు వింటూనే ఉలిక్కిపడ్డాడు చలపతి.

‘‘తమలపాకు తాంబూలంలో వాడతారు. పచ్చిమిరపని కారం కోసం వంటల్లో వాడతారు. వాటితో ఇలా...’’ అన్నాడు ముఖం అదోలాపెట్టి.

‘‘అయ్యో, మీకు తెలీదు కానీ, ఇప్పుడంతా వెరైటీదే ట్రెండ్‌. వీటికోసం నేనెన్ని వెబ్‌సైట్స్‌ సెర్చ్‌ చేయాల్సి వచ్చిందో తెలుసా! మీకోసం ప్రేమగా చేశానండీ’’ అంది గోముగా. అదిగో, అక్కడే మన చలపతి ఫ్లాట్‌ అయిపోయి గుడ్లనీరు కుక్కుకుంటూ మరీ వాటిని తినేశాడు.

ఆరోజు రాత్రి చలపతి ‘‘అచలా మనమధ్య ఈ లాప్‌టాప్‌లూ సెల్‌ఫోన్లూ ఎందుకు చెప్పు- మన మధ్య లవ్‌ ఉండాలిగాని. నిద్ర కూడా సరిగాపోకుండా అర్ధరాత్రి వరకూ వాట్సాప్‌లో మెసేజ్‌లు చూసీచూసీ నీ మీనాల్లాంటి కళ్ళు ఎలా వెలాతెలాబోతున్నాయో చూడు. పొద్దస్తమానూ ఇంట్లోనే ఉండి సరైన వ్యాయామం లేక నీ ఒళ్ళు ఎలా వడిలిపోయిందో’’ అంటూ అటునుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అబ్బే, ఆ ప్రయత్నమూ ఫలించలేదు. దేనికైనా రెడీగానీ ఇంట్లో వైఫై లేకపోతే నీకసలు వైఫే కాను పొమ్మంది. పోనీ కాలక్షేపానికి ఏదైనా ఉద్యోగం చేస్తావా అంటే- ఆన్‌లైన్‌లో ‘వర్క్‌ ఫ్రం హోం’ అయితే ఓకే అంది. ఇదేం ఆన్‌లైన్‌ కాపురంరా బాబూ- అనుకుంటూ జట్టు పీక్కోవడం చలపతి వంతయింది.

ముచ్చటగా పండక్కి స్వయంగా సెలక్ట్‌ చేసి భార్యకి చీర కొందామనుకున్న చలపతికి అక్కడా నిరాశే ఎదురైంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి కొనేసుకున్నానంది అచల. ఒకసారి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అంటూ చలపతి కోసం ఆర్డర్‌ చేసిన టీషర్టులో ఇద్దరు చలపతులు పడతారు. పాపం, ఆ మానవుడు అవి వేసుకుని ఏడవలేక నవ్వాడు.

ఇక లాభంలేదనుకుని దీనికేదో ఒక మార్గం ఆలోచించాలి అనుకుంటూ చలపతి సెల్‌ సిగ్నల్స్‌ అందని- లంబసింగికి ఎక్కువ, శంకరగిరి మాన్యాలకి తక్కువగానూ ఉన్న ఓ ఏజెన్సీ ఏరియాకి రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. ‘అక్కడికి వెళ్ళడమేమిటి?’ అంటూ ముక్కుతూ మూలుగుతూనే చలపతితో వెళ్ళింది అచల. అతనికి మాత్రం పరమానందంగా ఉంది. సెల్‌ఫోన్‌, లాప్‌టాప్‌ పనిచేయడంలేదు. సాయంత్రాలు అలా జంటగా ప్రకృతి అందాలను చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఎరువులు వాడని కూరగాయలతో తనకిష్టమైన వంటలన్నీ వండించుకుని తింటున్నాడు. ‘ఆహా... ఏమి నా భాగ్యమూ’ అనుకుంటూ తెగ మురిసిపోతున్నాడు చలపతి.

పాపం చలపతి ఆనందం ఎన్నోనాళ్ళు నిలవలేదు. ఏ దేవుడికో అతని సంతోషం చూసి కన్ను కుట్టినట్లుంది. ఓరోజు ఉదయాన్నే అచల ‘‘ఏవండీ లేవండీ’’ అంటూ సంతోషంగా అరవడంతో ఏమైందబ్బా అనుకుంటూ దుప్పటిలోంచి తల బయటికి పెట్టి ‘‘ఏమిటోయ్‌, అంతానందం’’ అన్నాడు బద్ధకంగా.

‘‘అబ్బా లేవండీ’’ అంటూ అతని ఒంటిమీద దుప్పటి బరబరా లాగేసి అతన్ని పెరట్లోకి లాక్కెళ్ళింది. ‘‘అదిగో, అటు చూడండీ’’ అంటూ చూపుడువేలు నేలమీంచి అలా ఆకాశం వరకూ పైకి ఎత్తుతూ చూపించింది.

కళ్ళు నులుముకుంటూ మెల్లగా కళ్ళు విప్పి చూసిన చలపతి కళ్ళముందు ఇంతింతై వటుడింతై అన్నట్టు- సెల్‌టవర్‌. దాన్ని చూసిన అతనికి స్పృహ తప్పినంత పనయింది. కానీ, అచల మాత్రం వాళ్ళింటిముందు ‘ఈఫిల్‌ టవర్‌’ కట్టినంత ఆనందంగా గంతులు వేస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.