close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మకిచ్చిన బహుమతి

అమ్మకిచ్చిన బహుమతి
- అనుపిండి శ్రీనివాసరావు

‘‘డాక్టర్‌...’’
‘హౌ టు ఎంజాయ్‌ లైఫ్‌ అండ్‌ జాబ్‌’ అన్న పుస్తకం చదువుకుంటున్న నేను తలెత్తి చూశాను. సిస్టర్‌ సుజాత. ఆమెలో ఏదో ఆత్రం, చెప్పాలన్న తాపత్రయం కనపడుతున్నాయి.
‘‘చెప్పండి సిస్టర్‌’’ అన్నాను నెమ్మదిగా.
‘‘యాక్సిడెంట్‌ కేస్‌... ఎమర్జెన్సీ’’ అంది కంగారుగా.
ఆమెలోని అలజడికి అది కారణం అయి ఉండదు. గవర్నమెంట్‌ హాస్పిటల్లో ఇలాటివన్నీ మామూలే. అందులోనూ ఆమె సీనియర్‌. ఇలాంటివి ఎన్నో చూసి ఉంటుంది.
‘‘ఎనీథింగ్‌ స్పెషల్‌?’’ అడిగాను.
ఆమె జవాబు చెప్పకుండా ‘‘రండి డాక్టర్‌, మీరే చూద్దురుగాని’’ అని నడవసాగింది. మాట్లాడకుండా ఆమెని అనుసరించాను. గవర్నమెంట్‌ ఆసుపత్రిని మనదేశ పరిస్థితులతో పోల్చాడు ఒక కవి. రెండూ పరమ అధ్వాన్నంగా ఉంటాయట. ఆ వాక్యం నాకు రోజుకొకసారి అయినా గుర్తొస్తోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం తప్పని తెలిసినా, ఆ వాక్యాన్ని మరవలేకపోతున్నాను.

‘‘యాక్సిడెంట్‌ డాక్టర్‌. గుర్తు తెలియని వాహనం గుద్దేసి, ఆపకుండా వెళ్ళిపోయింది. ఎవరో చూసి హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. చాలా దెబ్బలు తగిలాయి. సివియర్‌ హెడ్‌ ఇంజ్యురీ’’ సుజాత చెబుతోంది.

స్ట్రెచర్‌ మీద పూర్తి రక్తంతో తడిసిన బట్టలతో ఉన్నాడతను. ఎంత వయసు ఉంటుందో చూద్దామని మొహంలోకి చూసిన నేను- తుళ్ళిపడ్డాను, అవాక్కయిపోయాను. ఒక్క క్షణంపాటు మెదడు స్తంభించిపోయింది. నరనరాల్లో ఏదో వర్ణనాతీతమైన అలజడి, గందరగోళం. దానికి కారణం-

అతను- అ..చ్చం... నాలానే ఉన్నాడు.

నాకు మీసాలు తీసేసి, జుట్టుకి తెల్లరంగు వేసి, మొహం కొంచెం ముడతలు పడి వడిలితే ఎట్లా ఉంటానో, అచ్చు అలానే ఉన్నాడు. కళ్ళూ ముక్కూ చెవులూ నుదురూ నోరూ గడ్డం అంతా నాలానే!

సిస్టర్‌ నా మొహంలోకీ, అతని మొహంలోకీ మార్చిమార్చి చూస్తూ ‘‘ఇతను మీలానే ఉన్నాడు. సేమ్‌ టు సేమ్‌. జిరాక్స్‌ కాపీలా’’ అంటోంది. వార్డ్‌బాయ్‌లూ ఆయాలూ కూడా మా ఇద్దర్నీ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

నేను కూడా గందరగోళంలో పడ్డాను.

ఏమిటిది... ఎలా సాధ్యం? ఇతనికీ నాకూ ఏమిటీ సంబంధం?

జీవితంలో ఇతడిని మొదటిసారిగా చూస్తున్నాను.

రక్త సంబంధం లేకపోతే, ఇలా సాధ్యం కాదు. అంటే?

నా ఆలోచనలు పరిపరివిధాలా పోతున్నాయి.

ఎందుకో తెలీదుగానీ, నా గురించి నాకు తెలియని ‘రహస్యం’ ఏదో తెలిసే ఘడియలు వచ్చాయనిపిస్తోంది. నాకు వూహ తెలిసినప్పటి నుంచీ - ఆ మాటకొస్తే - వూహ తెలియకముందు నుంచీ కూడా నేను అనుభవించిన క్షోభకీ కన్నీళ్ళకీ కష్టాలకీ ఇతనికీ ఏదో సంబంధం ఉందని నా మనస్సాక్షి ఘోషిస్తోంది.

‘‘డాక్టర్‌!’’

సిస్టర్‌ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. కర్తవ్యం గుర్తొచ్చింది.

‘‘డాక్టర్‌ సుధాకర్‌ని పిలవండి. ఆపరేషన్‌ చేయాలి’’ అన్నాను యాంత్రికంగా.

సుజాత వెళ్ళి సుధాకర్‌ని తీసుకొచ్చింది. సుధాకర్‌ వస్తూనే పేషెంట్‌ని చూసి షాక్‌ అయ్యాడు.

‘‘డిఎన్‌ఏ చేయించాలేమో మీ ఇద్దరికీ’’ అన్నాడు చిన్నగా.

అవసరం లేదు. ఏ టెస్టులూ అవసరంలేనట్లు సృష్టించాడు దేవుడు మా ఇద్దర్నీ!

‘‘నాకు కొంచెం తలపోటుగా ఉంది. ఇంటికెళ్ళి వస్తాను. ఏమీ అనుకోకుండా ఈ కేసు మీరు అటెండ్‌ అవుతారా?’’ అడిగాను సుధాకర్‌ని.

సుధాకర్‌ నా పరిస్థితి అర్థం చేసుకున్నట్లుంది ‘‘విత్‌ ప్లెజర్‌’’ అన్నాడు నవ్వుతూ.

నేను హాస్పిటల్లోంచి బయటకొచ్చాను.

నడిస్తే పది నిమిషాల్లో ఇల్లు చేరిపోవచ్చు. అర్ధరాత్రి కావడం వల్ల పెద్దగా సందడి లేదు. చిన్నగా అడుగులు వేస్తూ, నా గతం నెమరువేసుకోసాగాను. నా బాల్యం ఘోరంగా గడిచింది. ఆ మాటకొస్తే యవ్వనం కూడా దుర్భరంగానే గడుస్తోంది. పుట్టినపుడే తల్లిప్రేమకి దూరం అయ్యాను. అపార్థం చేసుకోకూడదు. అమ్మకి దూరమవలేదు- అమ్మ మమకారానికీ మమతకీ దూరమయ్యాను. ఒక సవతితల్లి కూడా తన పిల్లల్ని ఇంతలా చీదరించుకోదేమో అన్నట్లుగా అమ్మ నన్ను అసహ్యించుకుంటుంది.

కారణం తెలీదు. కానీ, అమ్మకి నేనంటే చిన్నప్పట్నుంచీ ఏవగింపు. ఏ చిన్న కారణం చూసి అయినా నన్ను విపరీతంగా కొట్టేస్తూ ఉండేది. కొడుతున్నప్పుడు ఏడిస్తే ఇంకా ఎక్కువ కొట్టేది. నాన్నగారు అడ్డుపడితే, ఆయనని అనరాని మాటలు అనేది. ఇక్కడ నాన్నగారి గురించి చెప్పుకోవాలి. మంచితనం, సహనం, సహృదయత, సౌశీల్యత మూర్తీభవిస్తే ఎలా ఉంటుందంటే- అచ్చం నాన్నగారిలా ఉంటుంది. మగ ‘మదర్‌ థెరిసా’లా ఉంటారు. నేను ఈరోజు జూనియర్‌ డాక్టర్‌ని అయ్యానంటే దానికి కారణం నాన్నగారు. నేను ఏడిస్తే ఆయన బాధపడేవారు. నేను బాధపడితే ఆయన ఆవేదన చెందేవారు. నన్ను ఓదార్చడంలో ఆయన దుఃఖపడేవారు. అమ్మ నన్ను ఎంతగా కొట్టినా, నాన్నగారు ప్రేమగా నా వీపు నిమిరేసరికి నా బాధ మాయమైపోయేది.

నా చదువు ఇంట్లో పెద్ద సమస్య అయింది.

‘ఈ వెధవ (ఇది అమ్మ నాకిచ్చిన బిరుదు)కి చదువెందుకు? ఏ గొడ్ల చావిడిలోనో పారేస్తే, వాటితోపాటు ఈ దరిద్రుడు (ఇది నాకున్న మరో బిరుదు) కూడా బతుకుతాడు. అసలు ఛస్తే పీడా పోతుంది. వీడు బతికి ఉద్ధరించేది ఏంటట?’

ఇవీ మచ్చుకి అమ్మ మాటలు.

ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఒక తల్లి ఇంతలా ఎందుకు ద్వేషిస్తుంది?

మనసంతా బాధ. సంవత్సరాలుగా నాలో పేరుకుపోయిన ఆవేదనకి ద్రవరూపం వస్తున్నట్లు, అప్రయత్నంగానే నా కంటివెంట నీళ్ళు కారుతున్నాయి. నాకు తెలియని ‘రహస్యం’ ఏదో ఉందని ఈరోజు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చూస్తే తెలుస్తోంది. లీలగా ఏదో అనుమానం పెనుభూతమవుతున్న శంక. కళ్ళు తుడుచుకుని భారంగా, గాఢంగా వూపిరితీసుకున్నాను.

ఇంటి దగ్గరికి వచ్చేశాను. మామూలుగా ఉండాలన్న విశ్వప్రయత్నం విఫలమవుతోంది.

నైట్‌షిఫ్ట్‌ కావడం వల్ల ఉదయం వరకూ రాననుకుని అమ్మా నాన్నా తలుపులు వేసుకుని పడుకున్నారు.

ఇపుడు బెల్‌ కొడితే అమ్మ ఏమంటుందో నేనూహించగలను. ‘దరిద్రపు సంత. వేళాపాళా లేదు వెధవకి. ఏళ్ళు వచ్చాయి, జ్ఞానం రాలేదు’... ఇలా ఉంటుంది. అయినా చేసేదేంలేక గంట కొట్టాను. కొంతసేపటికి నాన్నగారు తలుపు తీసి, ఆ సమయంలో నన్ను చూసి ఆశ్చర్యపోయారు.

‘‘ఏమయిందిరా?’’ నా వంక తేరిపార చూస్తూ అడిగారు.

నేను ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాను. ‘‘దరిద్రపు వెధవ. వేళాపాళా లేదు...’’ అమ్మ లోపల్నుంచి సణుగుతోంది.

‘‘మీతో కొంచెం మాట్లాడాలి’’ నేను నెమ్మదిగా నాన్నగారితో అన్నాను.

‘‘వెళ్ళి పడుకో. రేప్పొద్దున మాట్లాడుకుందాం’’ నాన్నగారు అనునయంగా అన్నారు.

‘‘లేదు నాన్నగారూ! అర్జెంట్‌. మేడమీద మాట్లాడుకుందాం’’ అని ఆయన సమాధానం కోసం ఎదురుచూడకుండా మేడ మీదకి నడిచాను.

‘‘ఏమయింది బాబూ’’ అంటూ నాన్నగారు నా వెనకే వచ్చారు.

మేడ మీద వెలుగుతున్న బల్బు వెలుతురులో నాన్నగారి వంక తదేకంగా చూడసాగాను. శాంతం, సహనం నాన్నగారికి దేవుడిచ్చిన గుణాలు. ఎటువంటి సమయంలోనూ కంగారుపడటం, కోపం తెచ్చుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మ గయ్యాళితనంలో ఆయనని ఎన్ని అనరాని మాటలు అన్నా చిరునవ్వే సమాధానంగా ఇస్తారు. అలాంటి ఆయనని నేను ఎలా అడగాలి.

‘‘చెప్పరా!’’ ప్రేమగా నా భుజం చుట్టూ చేయివేసి నన్ను దగ్గరికి తీసుకుంటూ ఆప్యాయంగా అడిగారు.

అల్లకల్లోలంగా ఉన్న నా మనస్సు ఆ మమతానురాగాన్ని తట్టుకోలేకపోయింది.

ఒక్క ఉదుటున భోరున ఏడ్చేశాను. నాన్నగారు ఆశ్చర్యపోయారు.

‘‘ఏమయిందిరా... ఎందుకా ఏడుపు?’’

ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఎలా అడగాలో అర్థంకావటం లేదు. కానీ, తప్పదు. ‘రహస్యం’ ఛేదించాలంటే, తప్పదు.

‘‘నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పండి’’ అన్నాను తేరుకుని.

‘‘అసలు విషయం చెప్పు’’ అన్నారు నాన్నగారు కంగారుగా.

కొద్దిసేపు మౌనంగా ఉండి, అతి ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకుంటూ ‘‘మీరు నిజంగా నా...’’ అంటూ ఆగిపోయాను. సంస్కారం అడ్డొస్తోంది. సందర్భం అడగమంటోంది. ధైర్యం చేసి ‘‘నా తండ్రి మీరేనా?’’ అని భారంగా ప్రశ్నించాను.

ఆ ప్రశ్న వినగానే నాన్నగారి మొహంలో ఒక్క క్షణంపాటు కలిగిన తొట్రుపాటు, కలవరం నా అనుమానాన్ని నిజం చేసింది. ఆయన ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయకుండా బాధగా ఉండిపోయారు. మౌనం పూర్ణాంగీకారం.

‘‘ఇవాళ ఆసుపత్రికి యాక్సిడెంట్‌ కేస్‌ వచ్చింది. ఆ వ్యక్తికి మీకన్నా కొంచెం ఎక్కువ వయస్సే ఉంటుంది. కానీ, అతను అచ్చు నాలానే ఉన్నాడు. ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతోంది అతనే నా...’’

‘‘ఆపరా, ఇక చెప్పకు...’’ నాన్నగారు కోపంగా చిన్నగా అరుస్తున్నట్లు అన్నారు. నేను ఆగిపోయాను. మౌనం మా ఇద్దరిమధ్య చాలాసేపు రాజ్యం చేసింది.

‘‘నీకు చెప్పవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ విధిలీల వల్ల చెప్పాల్సి వస్తోంది. అంతా చెబుతాను’’ అని నాన్నగారు నేలమీద కూర్చున్నారు. ఆయన మొహంలో ఆవేదన, ఓటమిని అంగీకరిస్తున్న భావన కదలాడుతున్నాయి. నేను ఆయన పక్కన కూర్చున్నాను.

‘‘మాకు పెళ్ళి అయిన రెండేళ్ళ వరకూ పిల్లలు కలగలేదు. అప్పట్లో నేను మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవాడిని. అమ్మకి ఎవరూ లేరు, అనాథ. ఆశ్రమంలో పెరిగింది. నేను ఏరికోరి ఇంట్లో వాళ్ళందర్నీ ఎదిరించి, వాళ్ళందరికీ దూరంగా వచ్చేసి అమ్మని పెళ్ళి చేసుకున్నాను. అమ్మ పిల్లల కోసం బాధపడుతూ ఉండేది. డాక్టర్లు మా ఇద్దరిలోనూ ఏ లోపం లేదన్నారు.’’

నాన్నగారు వూపిరి తీసుకునేందుకు ఆగారు.

నేను శ్రద్ధగా వింటున్నాను. నా జన్మ రహస్యం, అమ్మ నన్ను చిన్నప్పటి నుంచీ ద్వేషించటానికిగల కారణం తెలియబోతోంది. ఉత్సాహం లేదుగానీ ఉద్విగ్నంగా ఉంది.

‘‘నేను టూర్స్‌కి వెళుతూ ఉండేవాడిని. అమ్మ ఒక్కతే ఇంట్లో ఉండేది. ఒకసారి నేను ఉదయం వచ్చేసరికి ఇంట్లో దొంగపడ్డాడు. కిటికీ అద్దం పగలగొట్టుకుని లోపలికెళ్ళి, అమ్మ నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి ఉన్నదంతా వూడ్చుకెళ్ళిపోయాడు. పోతూపోతూ...’’ అని దీర్ఘంగా నిట్టూర్చి ‘‘అమ్మ మీద అఘాయిత్యం చేశాడు’’ అన్నారు నాన్నగారు భారంగా.

నాకు లీలగా అర్థమవుతోంది.

‘‘జరిగినదంతా ఒక ప్రమాదం, దుర్ఘటన అని అనుకున్నాను. పోలీసులకి చెబితే పరువు పోతుందని చెప్పలేదు. స్థల మార్పిడి మంచిదనిపించి, ఈ పట్టణానికి వచ్చి మందుల షాపు పెట్టుకున్నాను. కానీ, అమ్మకి తగిలిన గాయం ఎంతకీ మానలేదు. ఆ మాటకొస్తే ఇప్పటికీ మానలేదు. ఎంత అనునయించినా, ఓదార్చినా జరిగినది తలచుకుని బాధపడుతూ ఉండేది. విపరీతంగా ఏడ్చేది. సమస్తం కోల్పోయినట్లు తయారయింది. ఒకటి రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. నేను సమయానికి చూసి అడ్డుకున్నాను. ఇది జరిగిన మూడు నెలలకి అమ్మ గర్భవతి అయింది.’’

నాన్నగారు చెప్పడం ఆపి, నా మొహంలోకి చూశారు. నేను అర్థం చేసుకోగలిగాను.

‘‘అమ్మ పిచ్చిదానిలా అయిపోయింది. నేను ఓదార్చేవాడిని. గర్భం తీయించేసుకుంటానని గోల పెట్టేది. నేను ఒప్పుకోలేదు. చివరికి అమ్మ శంకే నిజం అయింది. అప్పుడే పుట్టిన నిన్ను చూసీచూడగానే ‘ఛీ... వాడే’ అని అరిచి గీపెట్టింది.’’

దేవుడు చిత్రమైన ఆటలు ఆడతాడు. పిల్లలు లేరని బాధపడే స్త్రీ చేత ‘ఛీ’ అనిపించేలా నన్ను ‘వాడి’లాగా పుట్టించాడు. అమ్మ నన్ను చిన్నప్పట్నుంచీ ద్వేషించడానికి గల కారణం తెలిసింది. ఏ రూపమైతే అమ్మ మీద దుర్మార్గం చేసిందో, అదే రూపంలో నేను జన్మించాను. సహజంగానే నన్ను చూసిన వెంటనే అమ్మకి ఆ దుర్ఘటన గుర్తుకొస్తూ ఉండి ఉంటుంది. అసహ్యం కలుగుతుంది. ద్వేషం పెరుగుతుంది. నా మీద కోపం పదింతలు అవుతుంది. ‘అమ్మా, నన్ను క్షమించు. నన్ను నువ్వు ద్వేషించటం సమంజసమే. దేవుని లీలలో నేను పావుని’ అనుకున్నాను.

‘‘అమ్మ నిన్ను చూస్తేనే భయంతో అరిచేసేది. దగ్గరికి తీసుకునేది కాదు. నువ్వు అమ్మకి అక్కరలేని బిడ్డవి. నువ్వు పోతే పీడాపోతుంది అనేది. ఒకసారి నీ పాలలో ఏదో కలుపుతూంటే నేను అడ్డుకున్నాను. ‘వీడుండగా మనకింక పిల్లలు పుట్టరు, మీరు నా దగ్గరికి రావద్దు’ అని పిచ్చిపిచ్చిగా అరిచేది. అన్నీ భరించాను. నిన్ను ఇరవైనాలుగ్గంటలూ కంటికి రెప్పలా కాపాడుకున్నాను...’’ నాన్నగారి గొంతు గద్గదమైంది.

నాన్నగారు ఎప్పుడూ నన్ను ‘నాన్నగారు’ అని పిలవకురా, ‘నాన్నా’ అని పిలవమనేవారు. చిన్నప్పట్నుంచీ ఎందుకో నాకు అలా పిలవాలనిపించేది కాదు. ఒకవైపు మహోగ్రమైన అమ్మ ద్వేషం, మరోవైపు ఉన్నత శిఖరమైన నాన్నగారి ప్రేమ.

ఇప్పటివరకు ‘నాన్నగారు’ అనే అనుకున్నాను. కాదు... దేవుడు!

అమ్మ నన్నే కాకుండా, ఆయననీ ఎంతలా ఈసడిస్తూ మాట్లాడుతుందో నాకు తెలుసు. నన్ను ఆయన బలపరిచారంటే, ఆయనని కూడా నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేస్తుంది. పాతికేళ్ళబట్టీ చిరునవ్వే ఆయన సమాధానం. ‘మీరు నిజంగా దేవుడు నాన్నగారూ. పాతికేళ్ళబట్టీ సహనానికే అసహనం వచ్చేలా చిరునవ్వుతో ఉంటున్నారంటే, మిమ్మల్ని ఎలా పొగడాలో నాకు అర్థం కావటం లేదు.’

‘‘అర్ధరాత్రి అంకమ్మ సివాలు అన్నట్లు... ఈ చర్చలేంటి?’’

అమ్మ ఎప్పుడు వచ్చిందో, మా ఇద్దర్నీ చూస్తూ ప్రశ్నించింది.

అప్పటి వరకూ అమ్మని ఎప్పుడు చూసినా నాకు కోపం, భయం, బాధ, కొండొకచో అసహ్యం కలిగేవి. మొదటిసారిగా అమ్మని చూస్తే జాలివేసింది.

ఒక దుర్మార్గుడి అఘాయిత్యానికి బలి అయిపోయి, జీవితాంతం ఆ బాధని అనుభవిస్తున్న అభాగ్యురాలు. ప్రకృతి సహజమైన గర్భధారణ దుర్మార్గంగా జరిగిన దైవలీలలో ఆడించబడుతున్న కీలుబొమ్మ. అబలత్వంతో అలుసైన బతుకుబండిని భారంగా ఈడుస్తూ, ఆక్రోశిస్తూ తట్టుకోలేక తన బాధని వేరేవాళ్ళ మీద వెళ్ళగక్కుతున్న అతివ.

అమ్మని చూసి నాన్నగారూ, నేనూ కొద్దిగా తొట్రుపడ్డాం.

నేను తేరుకుని ‘‘ఆసుపత్రికి వెళ్తున్నాను’’ అన్నాను క్లుప్తంగా.

‘‘ఇప్పుడు ఎందుకు? ఉండిపో’’ అన్నారు నాన్నగారు.

‘‘చిన్న పనుంది’’ అంటూ సమాధానం కోసం చూడకుండా మేడ మెట్లు దిగి, ఇంటి బయటకొచ్చి రోడ్డు బాట పట్టాను.

నా మనసులో, ఎందుకో, ఇందాకటి అలజడీ ఆందోళనా లేవు. గుప్పిట మూసి ఉంచినంత వరకే రహస్యం! బట్టబయలు అయిన తర్వాత ఉండదు. నా దృష్టి అంతా ఇప్పుడు నేను ఏమి చేయాలన్నదానిమీదే ఉంది. దుర్భరమైన నా బాల్యానికి కారణభూతుడైన వ్యక్తి నా కళ్ళెదురుగానే ఉన్నాడు. నా జీవితం అస్తవ్యస్తం, అమ్మ బతుకు అంధకారం చేసిన వాడిని ఏదో ఒకటి చేయాలి.

ప్రతీకారం కాదు. కానీ, ప్రతి నేరానికీ ఒక శిక్ష ఉండాలి. అప్పుడే ధర్మం రెండు పాదాలతో నడుస్తుంది. వృత్తికి అన్యాయం చేసి అయినా, ఎందరి జీవితాలతోనో ఆడుకుని వాటిని ఛిన్నాభిన్నం చేసిన వ్యక్తిని శిక్షించి తీరాలి. నెమ్మదిగా ఆసుపత్రి చేరాను.

‘‘పరిస్థితి కాస్త స్టేబుల్‌గా ఉంది’’ నన్ను చూసి చెప్పాడు సుధాకర్‌.

‘‘నేను చూస్తాను డాక్టర్‌’’ అన్నాను. సుధాకర్‌ వెళ్ళిపోయాడు.

ఆక్సిజన్‌ కొంచెం ఎక్కువ చేసినా, తక్కువ చేసినా- చాలు!

ఆలోచన ఆచరణలో పెట్టేముందు మరోసారి ఆలోచించాను. నేను చేస్తున్నది తప్పు కాదని మనస్సాక్షి ఘోషిస్తోంది.

మెల్లగా నా దుర్మార్గపు తండ్రి (ఆ మాట అనుకుంటేనే అసహ్యం వేస్తోంది) ఉన్న గదిలోకి వెళ్ళాను. ఈ లోకంలో లేడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వీడి మూలంగా కుమిలిపోతున్న స్త్రీల కన్నీటిధారల నివారణార్థం, కన్నుమిన్ను కానక దుర్మార్గాలకి పాల్పడ్డ చేష్ఠల ప్రతిఫలం అందించాను! ఆలస్యంగా అయినా- శిక్షించాను, న్యాయబద్ధంగా.

నా డ్యూటీ అయిపోయింది.

నెమ్మదిగా ఇంటికొచ్చేశాను. తలుపు దగ్గరికేసి నాన్నగారు మార్నింగ్‌వాక్‌కి వెళ్ళినట్టున్నారు. లోపలికి వెళ్ళాను. అమ్మ పూజ గదిలో పూజ చేసుకుంటోంది. అమ్మ మొహం ప్రశాంతంగా, నిర్మలంగా ఉండేది అప్పుడే! అమ్మని తదేకంగా చూస్తూ అలా ఉండిపోయాను. నేను చెప్పేది అమ్మ ఎలా స్వీకరిస్తుందో అని ఆలోచించసాగాను.

‘‘ఏం కావాలి?’’ అమ్మ కళ్ళు తెరిచి ప్రశ్నించింది.

‘‘నీతో ఓ విషయం చెప్పాలి’’ అన్నాను నిదానంగా. చెప్పమన్నట్టు చూసింది. భారంగా వూపిరి తీసి ‘‘నేను వాడిని చంపేశానమ్మా’’ అన్నాను.

అమ్మ ఆశ్చర్యపోలేదు సరికదా ‘‘మంచి పని చేశావు’’ అంది.

నేను అదిరిపడ్డాను. అది గమనించి ‘‘నిన్న రాత్రి నువ్వూ నాన్నగారూ మాట్లాడుకున్నది మొత్తం విన్నాను. నువ్వు నా కొడుకువి అయితే ఇలాగే చేస్తావనుకున్నాను. అలాగే చేశావు. ఆ రాక్షసుడి పీడ విరగడ అయింది’’ అంది అమ్మ గంభీరంగా.

నేను అమ్మలో అంతవరకూ గమనించని కోణాన్ని చూస్తున్నాను.

‘‘నీకు ఏమీ కాదు కదా!’’ అమ్మ ఒకింత ఆందోళనగా అడిగింది.

‘‘ఎవరికీ తెలీదమ్మా... నీకూ నాకూ తప్ప!’’ అన్నాను.

‘‘మరో విషయం... ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకు. చీమకి కూడా హాని తలపెట్టని దేవుడు ఆయన. రోజూ నేను పూజలు చేసేది... ఈ కళ్ళకి కనపడని దేవుళ్ళకి కాదు, నాన్నగారికి! నా గయ్యాళితనం తట్టుకోలేక అయినా ఆయన నన్ను వదిలేసి సుఖపడతారని ఆయన్ని తిడుతూ ఉంటాను. ఆయన సహనం ముందు ఓడిపోతూ, ఆ అక్కసుతో మరింత రెచ్చిపోయి ఇంకా ఎక్కువగా తిడుతూ ఉంటాను. కానీ నా పిచ్చికానీ ఆయన మనిషి అయితే కదా... ఆయన దేవుడు!’’

నాన్నగారిని అనరాని మాటలు అంటుందని అమ్మని నేను ఎప్పుడూ ద్వేషించేవాడిని.

ఇదీ కారణం. అసహ్యమేసి తనని వదిలేస్తే, భర్త ఆనందంగా ఉంటాడన్న ఆలోచన ఒక్క స్త్రీకి మాత్రమే రాగలదు. సముద్రగర్భమంత లోతు అయిన అమ్మని నేను పూర్తిగా అపార్థం చేసుకున్నాను.

‘‘నన్ను ఒక్కసారి ‘బాబూ’ అని పిలవ్వా అమ్మా!’’ అన్నాను ఆశగా.

‘‘అలాగే బాబూ, ఇలారా...’’ అని నా చేయిపట్టి దగ్గరికి తీసుకుని, నన్ను తనకేసి హత్తుకుని, నా నుదుటి మీద చిన్నగా ముద్దుపెట్టింది అమ్మ.

అప్పటివరకూ ఎన్నోసార్లు చదివిన, ఎన్నోసార్లు విన్న తల్లీకొడుకుల అనుబంధం స్వానుభవంలోకి వచ్చింది. చాలా ఆలస్యంగా వచ్చినా, చాలా ఆప్యాయంగా వచ్చింది.

బహుమతి ఇచ్చి నేను మా అమ్మ మనసూ ప్రేమా గెలుచుకున్నాను.

గతం గతః!

నేనింత కాలం పరితపించిన తల్లిప్రేమ ఇకపై నాకు ఇబ్బడిముబ్బడిగా లభించబోతోంది. ఈ ఆనందం చాలు నాకు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.