close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీటి చావులు చూడలేకే.. ఇక్కడిదాకా వచ్చా!

నీటి చావులు చూడలేకే..ఇక్కడిదాకా వచ్చా!

గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల కొద్దీ నడిచిన పిల్లాడు ఇప్పుడు 75లక్షల మంది దాహాన్ని తీరుస్తున్నాడు. ఫీజు కట్టలేక ఎంసెట్‌ రాయలేకపోయిన కుర్రాడు 33 దేశాల్లో కోట్ల విలువైన నీటి వ్యాపారాన్ని సృష్టించాడు. ఎం.కరుణాకర్‌ రెడ్డి... 6500 గ్రామాల్లో స్వచ్ఛమైన నీటితో సామాన్యుల గొంతు తడుపుతున్న ‘స్మాట్‌ ఇండియా’ సంస్థ వ్యవస్థాపకుడు. భూమ్మీద పడే ప్రతి నీటి చుక్కనూ ఎలా ఒడిసిపట్టాలో, మురికి కాల్వలోని నీటిని మినరల్‌ వాటర్‌లా ఎలా మార్చాలో, పాతాళంలోని జీవితాన్ని ఆకాశానికి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో..!

‘మిస్టర్‌ రెడ్డీ.. మీరు హైదరాబాద్‌ నుంచి వచ్చి ఇలాంటి పని చేయడం గొప్ప విషయమే. కానీ మీకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండలో ప్రజలు విషం తాగుతున్నారు. వాళ్ల కోసం ఏదైనా చేయండి. పేదవాడి అవసరాన్ని తీర్చలేని పరిజ్ఞానం ఎంత ఉన్నా వ్యర్థమే’... కొన్నేళ్ల క్రితం అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నన్ను దిల్లీకి పిలిపించి చెప్పిన మాటలివి. ఆ తరవాత నేను సృష్టించిన ప్రపంచానికీ సాగించిన ప్రయాణానికీ అవే స్ఫూర్తి. ఆయనప్పుడు రాష్ట్రపతి నిలయానికి పిలవడం, మంచినీటి రంగంలో నేనిప్పుడీ స్థాయిలో నిలవడం... ఇలాంటి ఎన్నో విజయాలకు పునాదులు ఎదిగే ప్రతి దశలో నాకు ఎదురైన కష్టాలే. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రంగాపురం అనే పల్లెటూరు మాది. కృష్ణా నది వూరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్నా కిలోమీటరు నడిచి దిగుడుబావిలో ఒక్కో కడవతో నీళ్లు తోడుకొని రావాల్సిన పరిస్థితి. రోజులో నాలుగైదు గంటలు నీళ్లకీ, ఖాళీ దొరికితే స్కూలుకీ, ఎప్పుడో ఒకసారి ఆటలకీ సమయం కేటాయిస్తూ నా బాల్యం గడిచింది. నీళ్లు మోసీ మోసీ భుజం పైనపడ్డ ముద్రలు ఇప్పటికీ ఆ రోజుల్ని గుర్తుచేస్తుంటాయి.

నేనొక్కడినే పాసయ్యా
నాన్న ఓ చిన్న రైతు. చదువు తిండిపెట్టదనీ, నన్ను కూడా వ్యవసాయ పనులే నేర్చుకోమనేవారు. దాంతో చదువూ అంతంత మాత్రంగానే సాగింది. మరోపక్క నీటి కష్టాలతో వూళ్లొ అందరూ ఉక్కిరిబిక్కిరయ్యేవాళ్లు. వర్షాకాలమొస్తే గ్రామస్థులు తరచూ కలరా, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడేవారు. వాళ్లను పక్క వూళ్లొని ఆస్పత్రిలో చేర్పించి, పెద్దలు పనులకు వెళ్లిపోయి మమ్మల్నే రోగులకు తోడుగా ఉంచేవారు. అలా నా కళ్ల ముందే కలుషిత నీటి వల్ల వచ్చిన వ్యాధులతో తెలిసినవాళ్లు ఐదారుగురు చనిపోయారు. ఆ పరిస్థితులు చూస్తూనే రోజులు గడుపుతూ పదో తరగతికి వచ్చా. అంతకుముందు రెండేళ్లు మా వూళ్లొ ఒక్కరు కూడా టెన్త్‌ పాసవ్వలేదు. మా తరగతిలో 38 మంది ఉంటే అందులో నేనొక్కణ్ణే పాసయ్యా. దాంతో అదో రికార్డులా పత్రికలో నా గురించి చిన్న వార్త రాశారు. కానీ నాన్నకు మాత్రం నేను పాసవడం నచ్చలేదు. ఇంటర్‌కి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని ఆయన భయం. కానీ నేను చదువుకుంటానని గట్టిగా చెప్పడంతో కాదనలేక వనపర్తిలో ఇంటర్‌లో చేర్పించారు. అక్కడ నాకు తెలిసిన ఓ ఆరెస్సెస్‌ కార్యకర్త సాయంతో సంఘ్‌ కార్యాలయంలోనే ఆశ్రయం పొందా. అక్కడే చిన్నచిన్న పనులు చేసుకుంటూ చదువుకునేవాణ్ణి.

డిగ్రీలో వ్యాపారం
ఇంటర్‌ సెకండియర్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఉన్న నాలుగెకరాల పొలంలో అమ్మే వ్యవసాయం చేస్తాననీ, నన్ను చదువుకోమనీ భరోసా ఇవ్వడంతో ఇంటర్‌ కొనసాగించా. స్నేహితులంతా ఎంసెట్‌కు సిద్ధమవుతున్న సమయంలో నాకు కనీసం ఎంట్రెన్సు ఫీజు కట్టే స్తోమత లేక తప్పనిసరై డిగ్రీలో చేరా. నా స్నేహితుడి నాన్నకు టీవీల వ్యాపారం ఉండేది. అప్పట్లో గ్రామాల్లో టీవీ ఏర్పాటు చేయాలంటే ముప్ఫయ్‌ నలభై అడుగుల ఎత్తున్న యాంటెనాలు బిగించాల్సి వచ్చేది. నేనూ నా స్నేహితుడూ కలిసి యాంటెనాలు బిగిస్తే వాళ్ల నాన్న డెబ్భై ఐదు రూపాయలిచ్చేవారు. అందులో వాడు పాతిక రూపాయలు పెట్టుకుని యాభై నాకిచ్చేవాడు. గద్వాల్‌లో ఉండే మా బావ సాయంతో అక్కడికెళ్లీ టీవీలు బిగించేవాణ్ణి. ఆర్డర్లు పెరగడంతో అమ్మ నగలమ్మి రూ.35వేల పెట్టుబడితో ‘సిందూజా ఎంటర్‌ప్రైజస్‌’ అనే వ్యాపారాన్ని మొదలుపెట్టా. అదృష్టం కొద్దీ పది టీవీలు బిగిస్తే మరో యాబై ఆర్డర్లు సిద్ధంగా ఉండేవి. దాంతో డిగ్రీ రెండో ఏడాదిలోనే ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నా. బతకడానికి వ్యాపారం, భవిష్యత్తు కోసం చదువునూ కొనసాగిస్తూ డిగ్రీ పూర్తి చేశా. పోలీసు కావాలన్న కోరిక ఉన్నా శారీరకంగా అంత దృఢంగా లేకపోవడంతో మరో రంగాన్ని ఎంచుకోవాలనుకున్నా. నాలుగు యూనివర్సిటీల ఎంట్రెన్సులు రాస్తే సింబయాసిస్‌లో ఎంబీఏ సీటొచ్చింది. నా జీవితంలో కాస్త మంచి రోజులు అప్పుడే మొదలయ్యాయి.

పెప్సీలో లక్షన్నర జీతం
పదో తరగతి పూర్తి చేస్తే చాలనుకున్న నేను ఎంబీఏ దాకా వచ్చా. అక్కడే మొదటిసారి ఇంగ్లిష్‌ నేర్చుకోవడం మొదలుపెట్టా. ఎంబీఏ ప్రాజెక్టు వర్కులో భాగంగా పెప్సీ సంస్థ కోసం పనిచేశా. ఆ సంస్థ అమ్మకాలపైన సర్వే చేసి నాకున్న వ్యాపార అనుభవంతో కొన్ని సూచనలు చేస్తూ ప్రాజెక్టు వర్కును అందజేశా. అదృష్టం కొద్దీ దాన్ని పెప్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చూశారు. నా సూచనలు నచ్చడంతో పెప్సీలోనే ఉద్యోగ అవకాశం ఇచ్చారు. అలా క్యాంపస్‌ నుంచి బయటకు రాకముందే కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌గా నా కెరీర్‌ మొదలైంది. టీవీల వ్యాపారం చేసినప్పుడు మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఒంటబట్టాయి. అవి పెప్సీలో బాగా ఉపయోగపడ్డాయి. రెండు నెలల్లో నేను పనిచేసిన ప్రాంతంలో అమ్మకాలు పెరిగాయి. క్రమంగా ఏరియా ఎగ్జిక్యూటివ్‌, టెరిటరీ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతులు లభించాయి. నెలకు లక్షన్నర సంపాదించే దశకు చేరుకున్నా. అప్పటివరకు లక్షాధికారి అని వినడమే తప్ప అంత డబ్బు చూసింది లేదు.

ఉద్యోగం మానేశా...
పెప్సీలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సచిన్‌, అమితాబ్‌, షారుక్‌ లాంటి ఎంతో మంది ప్రముఖులను కలిశా. కానీ నేను చేసే పని వల్ల నాకు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదూ, దాని బదులు నలుగురికీ పనికొచ్చే పని చేస్తే బావుంటుందన్న ఆలోచన నన్నెప్పుడూ వేధించేది. దాంతో నేను సంస్థలో కొనసాగలేనని మా బాస్‌కి చెప్పా. పెప్సీ అప్పుడే భారత్‌లో కొత్తగా మంచినీటి వ్యాపారాన్నీ మొదలుపెడుతోందనీ, కొన్నాళ్లు ఆ విభాగంలో పనిచేసి ఆసక్తి ఉంటే అక్కడే కొనసాగమనీ ఆయన మరో అవకాశమిచ్చారు. ఆ ప్రాజెక్టు కోసం అమెరికాలోని మెటిటో కంపెనీ నుంచి వచ్చిన ఇంజినీర్లు నాకు స్నేహితులయ్యారు. అందరం కలిసి ‘ఆక్వాఫినా’ నీళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఎవరైనా చురుకైన వ్యక్తులుంటే శిక్షణ ఇచ్చి నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తామనీ మెటిటో ప్రతినిధులు నాతో అన్నారు. ఎవరో ఎందుకు, నాకే శిక్షణ ఇస్తే ఆ ప్లాంట్లను నేనే చూసుకుంటానని చెప్పా. ఇంట్లో వాళ్లు వద్దన్నా, పెప్సీలో ఉద్యోగానికి రాజీనామా చేశా. నా దగ్గర పనిచేసిన ఒక డ్రైవరే తొలి ఉద్యోగిగా ‘స్మాట్‌ ఇండియా’ సంస్థను చిన్న గదిలో మొదలుపెట్టా. మెటిటో మొదట నాలుగైదు నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసే బాధ్యతను నాకప్పగించింది. సాంకేతికతంతా వాళ్లదీ, ఆ ప్లాంట్లను నిర్వహించే బాధ్యత నాది. ఆ పనిలో భాగంగా అనేక పరిశ్రమలకు వెళ్లి భారీ వాటర్‌ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసేవాణ్ణి. క్రమంగా ఉద్యోగులను నియమించుకుంటూ, ప్రాజెక్టులను సంపాదిస్తూ సొంతంగా సంస్థను విస్తరించడం మొదలుపెట్టా. నెలకు లక్షన్నర వదులుకొని, యాబై అరవై వేలు సంపాదిస్తున్నా అదే సంతృప్తిగా అనిపించేది.

33దేశాల్లో వ్యాపారం
రెండు మూడేళ్లు భారత్‌లో ప్రాజెక్టులు చేశాక, మెటిటో సాయంతో తొలిసారి సౌదీ అరేబియాలో ఓ నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఓ సమావేశంలో అక్కడ రాచ కుటుంబానికి చెందిన అల్‌ హాదీ అనే షేక్‌ పరిచయమయ్యారు. ఆయన నన్నో ఏడారికి తీసుకెళ్లి అక్కడ పచ్చదనం సృష్టించొచ్చా అని అడిగారు. తప్పకుండా చేయొచ్చన్నా. ఆయన దగ్గర డబ్బులున్నాయి. నా దగ్గర సాంకేతికత ఉంది. మొదట బోరు వేస్తే మొత్తం నల్ల రంగులో నీళ్లు పడ్డాయి. మా టెక్నాలజీ సాయంతో వాటిని శుద్ధి చేశాం. ఆ నీటితోనే గడ్డి పెంచి ఓ పెద్ద క్రికెట్‌ మైదానాన్నే సృష్టించాం. పెద్ద మంచినీటి ప్లాంట్‌ ఏర్పాటు చేశాం. ఆయన మా సాంకేతికతకు ఆశ్చర్యపోయి తరవాత చాలా ప్రాజెక్టుల కోసం నన్ను సౌదీ పిలిపించారు. క్రమంగా అల్జీరియా, ట్యునీషియా, మొరాకో, చైనా లాంటి 33 దేశాల్లో 12వేలకు పైగా నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశా.


నగదు బహుమతులు 2.3కోట్లు!

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 185 పురస్కారాలు దక్కాయి. వరసగా మూడేళ్లు రాష్ట్రపతి నుంచి జాతీయ ఉత్తమ ఎంఎస్‌ఎంఈ అవార్డు అందుకున్నా. నాబార్డ్‌ వాళ్లు 30 సంవత్సరాల తరవాత ఇచ్చిన రూరల్‌ ఇన్నొవేషన్‌ పురస్కారం, ఇంగ్లండ్‌ నుంచి ప్రతిష్ఠాత్మక క్వాలిటీ క్రౌన్‌ అవార్డూ ఆ జాబితాలో ఉన్నాయి. ఇన్నేళ్లలో నాకు లభించిన నగదు బహుమతుల విలువ రెండు కోట్ల ముప్ఫయ్‌ లక్షల రూపాయలకు పైమాటే.

* ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ వరదల లాంటి విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వమే మంచి నీటి కోసం మా సాయం కోరింది. ఉత్తరాఖండ్‌ వరదలప్పుడు సంచార వాహనాల్లో అప్పటికప్పుడు మురుగు నీటిని శుద్ధి చేసి అందించాం. సైనికుల నుంచీ సామాన్యుల వరకూ అందరూ అవే తాగారు.

* నేచురల్‌ వాటర్‌ కండిషనర్‌ పేరుతో విద్యుత్తూ, రసాయనాలూ వాడకుండా నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని మేం తయారు చేశాం. నాసా కూడా దాన్ని వినియోగించింది. 43 దేశాలకు ఆ పరికరాన్ని ఎగుమతి చేశాం.

* హైదరాబాద్‌లోని మా కార్యాలయంలో దాదాపు వంద మంది పనిచేస్తారు. అయినా మా భవనానికి డ్రైనేజీ కనెక్షన్‌ లేదు. వాన నీటిని వంద శాతం సేకరించడంతో పాటు మురుగు నీటిని కూడా శుద్ధి చేసుకుని అన్ని అవసరాలకూ వాటినే వినియోగిస్తున్నాం.ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ వరదల లాంటి విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వమే మంచి నీటి కోసం మా సాయం కోరింది. ఉత్తరాఖండ్‌ వరదలప్పుడు సంచార వాహనాల్లో అప్పటికప్పుడు మురుగు నీటిని శుద్ధి చేసి అందించాం. సైనికుల నుంచీ సామాన్యుల వరకూ అందరూ అవే తాగారు.

* నేచురల్‌ వాటర్‌ కండిషనర్‌ పేరుతో విద్యుత్తూ, రసాయనాలూ వాడకుండా నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని మేం తయారు చేశాం. నాసా కూడా దాన్ని వినియోగించింది. 43 దేశాలకు ఆ పరికరాన్ని ఎగుమతి చేశాం.

* హైదరాబాద్‌లోని మా కార్యాలయంలో దాదాపు వంద మంది పనిచేస్తారు. అయినా మా భవనానికి డ్రైనేజీ కనెక్షన్‌ లేదు. వాన నీటిని వంద శాతం సేకరించడంతో పాటు మురుగు నీటిని కూడా శుద్ధి చేసుకుని అన్ని అవసరాలకూ వాటినే వినియోగిస్తున్నాం.


ఆరున్నరవేల నీటి కేంద్రాలు...
ఓసారి రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌లో మురికినీటిని మేము శుద్ధి చేస్తోన్న తీరు అబ్దుల్‌ కలాంగారికి నచ్చి నన్ను పిలిపించారు. నా పనులను అభినందిస్తూనే, పేదలకు నేను ఎలా ఉపయోగపడగలనో ఆలోచించమన్నారు. ఆ ప్రభావంతోనే కమ్యూనిటీ వాటర్‌ సెంటర్స్‌ ఆలోచన మొదలైంది. రసాయనాలు ఉపయోగించకుండా స్థానికంగా దొరికే నీటిని శుద్ధి చేసి నామ మాత్రపు ధరకే ప్రజలకు మంచి నీళ్లు అందించడం దాని ఉద్దేశం. కలాంగారి సూచన మేరకు తొలి ప్లాంట్‌ను నల్గొండలోనే ఏర్పాటు చేశా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రెండు వేలకుపైగా, దేశవ్యాప్తంగా ఆరున్నర వేలకు పైగా సామాజిక నీటి కేంద్రాలను నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా రోజూ డెబ్భై ఐదు లక్షలమంది సురక్షిత నీరు తాగుతున్నారు. ఇంకుడు గుంతలూ, బోర్‌ వెల్‌ రీఛార్జింగ్‌ పద్ధతులను అనుసరించడం వల్ల ఈ కేంద్రాలకు మండు వేసవిలోనూ నీటి సరఫరా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు నా ప్రగతిని తెలుసుకుంటూ వచ్చిన కలాం ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇన్నొవేషన్స్‌ అండ్‌ ఐడియాస్‌’లో స్వయంగా నన్ను సభ్యుణ్ణి చేశారు.

పొదుపు కోసం ఉద్యమం
శుద్ధి చేసిన నీరు ఇవ్వాలంటే ముందసలు నీరంటూ ఉండాలిగా. ఆ విషయంపైన జనంలో చైతన్యం తీసుకొచ్చేందుకు మేం మొదలు పెట్టిందే ‘వాక్‌ ఫర్‌ వాటర్‌’. ఈ ఏడాది ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో మేం నిర్వహించిన మార్చ్‌లో ఉన్నతాధికారులూ, సినీ తారలతో పాటు లక్షల మంది సామాన్యులు పాల్గొని నీటి పొదుపు కోసం ప్రతిజ్ఞ చేశారు. మా స్ఫూర్తితో 42దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాసా మా ఉద్దేశాన్ని అభినందిస్తూ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఆ కార్యక్రమానికి మూడు గిన్నిస్‌ రికార్డులూ దక్కాయి. నీటిని భద్రపరిచేందుకు కొన్ని వేల ఇంకుడు గుంతలు తవ్వాం. బోర్లను రీఛార్జ్‌ చేశాం. భవిష్యత్తులో ‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ తరఫున భారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నాం.

సమాజంలో ఏదైనా మార్పు తీసుకొచ్చే రంగంలో ఉండాలనే ఉద్దేశంతో ఒకప్పుడు ఉద్యోగాన్ని వదిలేశా. ఇప్పటిదాకా అందుకున్న విజయాలతో ఆ లక్ష్యాన్ని కొంతవరకూ చేరుకున్నాననిపిస్తుంది. కలుషిత నీటితో, నీటి కొరతతో ఎవరూ చనిపోకూడదన్నది నా కోరిక. దాని కోసం నా వంతుగా ఏం చేయాలో ఇప్పటికే చేస్తున్నా. ఇకపైనా చేస్తుంటా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.