close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గులకరాళ్లతో గృహాలంకరణ!

సృజన అంటూ ఉండాలేగానీ దానికి హద్దులెక్కడ.. ఈ గులకరాళ్ల అందాలను చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ఎక్కడో సముద్ర తీరాల్లోనో నది ఒడ్డునో కనిపించే చిన్న చిన్న రాళ్లనే కాన్వాస్‌గా చేసుకుని ‘అవీ కళారూపాలే.. గృహాలంకరణ వస్తువులే’.. అంటున్నారు ఆధునిక ఇంటీరియల్‌ డిజైనర్లు.

‘శిలలపై శిల్పాలు చెక్కినారూ మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారూ’ అన్నారు ఆత్రేయ. కానీ ఉలీ సుత్తీ అవసరం లేకుండా కేవలం రాళ్లకు రంగులద్దడంతోనే వాటిని సజీవ శిల్పాలుగా మలుస్తున్నారు నేటి కళాకారులు. సైజుల వారీగా రాళ్లను ఎంచుకుని వాటిని చూడచక్కని చెట్లూ జంతువులూ కూరగాయలూ పండ్లూ పక్షులూ మనుషుల బొమ్మలుగా మలుస్తున్నారు. వీటిని చూస్తుంటే అసలివి నిజంగా రాళ్లా లేక ఏవైనా బొమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారా అనిపించేంత సహజంగా ఉంటున్నాయి. ఇలా రంగులతో రకరకాల బొమ్మల ఆకారంలో ఆకర్షణీయంగా మలిచిన రాళ్లకు చెక్కలను కూడా కలిపి గోడలమీద అద్భుత చిత్రపటాలను ఆవిష్కరిస్తున్నారు.

గులకరాళ్లే గోడలయితే...
రాళ్లకు రంగులద్దడం ఒక రకమైతే, వాటిని నేరుగా గృహాలంకరణలో వాడటం మరో పద్ధతి. ఇంటికి ప్రత్యేకమైన అందం తీసుకురావడంకోసం అక్కడక్కడా గోడలకు గులకరాళ్లను తాపడం చేస్తున్నారు. వంటిల్లు, హాలు, లివింగ్‌ రూమ్‌... ఇలా గదుల్లోని ఏదో ఒక గోడకు కేవలం గులకరాళ్ల పేర్పుతోనే కొత్త లుక్‌ను తీసుకొస్తున్నారు. అయితే అన్ని రాళ్లూ ఒకే ఆకారంలో దొరుకుతాయా అనే సందేహం సహజమే. సాధారణంగా సముద్రతీరాల్లో దొరికే రాళ్లు రకరకాల రంగుల్లో గుండ్రంగా నున్నగా మెరుస్తుంటాయి. అలాంటి వాటినే తీసుకొచ్చుకునేవాళ్లు కొందరయితే, సిమెంట్‌ కాంక్రీటుతో చేసిన గులకరాళ్లతో అలంకరించుకునేవాళ్లు మరికొందరు. ఇవి కూడా చూడ్డానికి సహజమైనవాటిలానే ఉంటాయి.

ఇక, కొవ్వొత్తుల స్టాండుల్లోనూ కుండీల్లోనూ కుండీల పక్కనా ముంగిట ఉద్యానవనాల్లోనూ గులకరాళ్లను అలంకరించడం ఎప్పటినుంచో ఉన్నదే. కొందరయితే సహజత్వం కోసం అన్నట్లు డైనింగ్‌ టేబుల్‌మ్యాట్స్‌ను కూడా గులకరాళ్లు అతికించి చేసినవే వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పారదర్శకంగా ఉండే గాజు సీసాలూ లేదా వేజ్‌ల్లో గులకరాళ్లను పోసి వాటిల్లో ఏదో ఒక అలంకరణ వస్తువులూ లేదా పూలకొమ్మల్నీ అమర్చితే ఆ అందమే వేరు.మెరిసే రాళ్లు!
సహజమైన గులకరాళ్ల అందాలకు తోడుగా రంగురంగుల్లో రాత్రిపూట మెరిసేవీ వస్తున్నాయి. అవే గ్లో పెబల్స్‌. చీకట్లో మెరిసే గుణం కలిగి ఉండే బయోల్యూమినిసెన్స్‌ పదార్థంతోనూ రెజిన్‌తోనూ చేసిన కృత్రిమ రాళ్లివి. వీటిని సూర్యకాంతిలో 10 - 20 నిమిషాలు ఉంచితే చాలు, అవి చీకట్లో పది పన్నెండు గంటలపాటు నిరంతరాయంగా వెలుగుతుంటాయి. వీటి నుంచి ఎలాంటి కర్బనమూ విడుదల కాదు కాబట్టి ఇవి పర్యావరణానికీ మంచివే. పైగా ఇవి నీళ్లలో వేసినా పాడవకుండా మెరుస్తుంటాయి. బ్యాటరీలూ కరెంటుతో పనిలేకుండా రంగురంగుల్లో మెరిసే ఈ గ్లో పెబల్స్‌ కుండీల్లో, ఆక్వేరియాల్లో, గాజు బౌల్స్‌లో, ఉద్యానవనాల్లో బాటకు ఇరువైపులా... ఎక్కడైనా అలంకరించుకోవచ్చు. ఇలా సహజమైన గులకరాళ్లతోనూ కృత్రిమరాళ్లతోనూ బొమ్మలుగా మలిచిన రాళ్లతోనూ ఇంటికో కొత్త అందాన్ని తీసుకొస్తున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ‘సృజన అనేది హాబీకోసం కాదు, అది జీవితంలో ఓ భాగం’ అన్నాడో పెద్దమనిషి. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు... మామూలు వ్యక్తులకు సామాన్యంగా కనిపించే గులకరాళ్లలోనూ ఎన్నెన్నో అందాలను ఆవిష్కరిస్తున్నారు ఆధునిక గృహాలంకరణ కళాకారులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.