close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సేవ వారి ‘రక్తం’ లోనే ఉంది!

సేవ వారి ‘రక్తం’ లోనే ఉంది!

రక్తం అవసరమైతే ఎవరైనా బ్లడ్‌బ్యాంకుల్ని సంప్రదిస్తారు. కానీ కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చే రోగుల బంధువులు మాత్రం స్థానిక పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీని సంప్రదిస్తారు. ఎందుకంటే, రక్తదానం చెయ్యడానికి అక్కడి విద్యార్థులు సదా సిద్ధంగా ఉంటారు. రక్తదానంలో ఆ కాలేజీ విద్యార్థులది పాతికేళ్ల ప్రస్థానం!ర్నూలులోని అబ్బాస్‌నగర్‌కు చెందిన భూవలక్ష్మికి ‘ఎ’ నెగెటివ్‌ రక్తం అవసరం పడింది. ఆమె భర్త నాలుగురోజులపాటు రక్తం కోసం చాలాచోట్ల తిరిగినా దొరకలేదు. ఆ సమయంలో ఎవరో చెప్పగా పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లి సంప్రదించాడు. అక్కడి అధ్యాపకుడు రక్తదాతల జాబితాను పరిశీలించడం, ఆ గ్రూపు ఉన్న విద్యార్థిని పిలవడం, విద్యార్థి వెళ్లి రక్తం ఇవ్వడం గంట వ్యవధిలోనే జరిగిపోయాయి. అనంతపురంలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి డయాలసిస్‌ సమయంలో ‘ఏబీ’ నెగెటివ్‌ రక్తం అవసరమైంది. ఆస్పత్రి ద్వారా సమాచారం తెలుకున్న రోగి బంధువులు పుల్లారెడ్డి కళాశాలను ఆశ్రయించారు. వెంటనే సాయిరితేష్‌ అనే విద్యార్థి అనంతపురం వెళ్లి రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడాడు. ఇలా ఎందరికో రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుతున్నారు పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు.

1992లో మొదలు...
విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో 1992లో సాయి మనోహర్‌ అనే అధ్యాపకుడు కాలేజీ విద్యార్థులతో ‘వివేకానంద స్టడీ సర్కిల్‌’ను ఏర్పాటుచేశారు. నిరుపేదల్ని ఆర్థికంగా ఆదుకోవడం, జిల్లాలో ఏవైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినపుడు విద్యార్థి బృందాలు వెళ్లి సాయపడటం, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయడం, రక్తదానం... ఇలా వివిధ మార్గాల్లో సేవలు అందించేవారు. తర్వాత మనోహర్‌ ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో స్టడీ సర్కిల్‌ నిర్వహణ బాధ్యతల్ని మరో అధ్యాపకుడు నాగఫణిశాస్త్రి తీసుకున్నారు. కర్నూలు పెద్దాస్పత్రికి అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాలతోపాటు కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన రోగులూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఏటా ఆరువేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. వీరిలో కొందరికి అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులూ, నిరుపేదలూ కావడంతో రక్తం ఎక్కడ దొరుకుతుందో తెలియకపోవడం, తెలిసినా డబ్బు పెట్టి కొనలేకపోవడం లాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే రక్తదానాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దామన్న ప్రతిపాదనను విద్యార్థులతో పంచుకున్నారు నాగఫణి. ఇది విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బంది కాదు కూడా. అలా మొదటిసారి ఒకేరోజున 50మంది వెళ్లి పెద్దాస్పత్రిలో రక్తదానం చేశారు. తర్వాత కూడా వివిధ సందర్భాల్లో ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేసేవారు విద్యార్థులు. తరచూ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేయడంకంటే కళాశాలలోనే శిబిరం ఏర్పాటుచేస్తే బాగుంటుందని భావించి కొన్నేళ్లుగా కాలేజీలోనే శిబిరాలు నిర్వహిస్తూ రక్తం సేకరిస్తున్నారు.ఏడాదికి మూడుసార్లు
అరుదైన గ్రూపులవారు రక్తదానం చేసే సమయంలో బాధితుల నుంచి వచ్చే కృతజ్ఞతలను విద్యార్థులు ఒకరితో ఒకరు పంచుకోవడంతో వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీరు మొదట్లో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు రక్తం ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని పెద్దాస్పత్రులకు అందిస్తున్నారు. నెగెటివ్‌, అరుదైన గ్రూపుల వరకూ మాత్రం అప్పటికప్పుడు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. అరుదైన బ్లడ్‌ గ్రూపు కలిగిన వారి ఫోన్‌ నంబర్లను కూడా స్థానిక ఆస్పత్రులకు ఇస్తున్నారు. ‘రక్తం ఇచ్చేందుకు పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపినపుడు వాళ్లు తిరిగొచ్చేంతవరకూ కొంత ఒత్తిడి ఉంటుంది. పేదలకు సాయం చేస్తున్నామనే ఆనందం మాత్రం ఆత్మ సంతృప్తినిస్తోంది. పరీక్షల సమయంలో మాత్రమే విద్యార్థులను బయటకు పంపించేందుకు ఆలోచిస్తాం’ అని చెబుతారు నాగఫణిశర్మ. కళాశాలలో ప్రస్తుతం చదువుతున్నవారే కాదు, చదువు పూర్తిచేసి వెళ్లిన విద్యార్థులు సైతం రక్తదానానికి ముందుకు వస్తుంటారు. 2004 నుంచి రక్తదాతల వివరాలతో డైరక్టరీని తయారుచేస్తున్నారు వీరు. ప్రస్తుతం 1500 మంది రక్తదాతల వివరాలు ఉన్నాయి. స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఏడాదికి మూడుసార్లు కాలేజీలోనే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో శిబిరంలో 120 మంది రక్తదానం చేస్తూ ఉంటారు. బాంబే బ్లడ్‌ గ్రూపు మినహా అన్ని రకాల గ్రూపుల వారూ స్టడీ సర్కిల్‌లో ఉన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు దూర ప్రాంతాలకూ వెళ్తుంటారు. ‘‘నాది ‘బి’ నెగెటివ్‌ గ్రూపు. ఇప్పటివరకూ ఆరుసార్లు రక్తం ఇచ్చాను. దూర ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చినా వెళ్లి ఇచ్చి వస్తుంటాను. గతేడాది పత్తికొండకు చెందిన ఒకరు హృదయ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు రక్తం అవసరమని కాలేజీకి ఫోన్‌ చేశారు. హైదరాబాద్‌ వెళ్లి రక్తం ఇచ్చి వచ్చాను. ఆ సమయంలో రోగి బంధువులు నాకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు. ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నానన్న ఆనందం ముందు దూర ప్రయాణం భారమనిపించలేదు’’ అని చెబుతాడు స్టడీసర్కిల్‌ సమన్వయకర్త డి.సురేష్‌. రక్తదానంతోపాటు కళాశాల విద్యార్థులు ఏటా ఉగాది సమయంలో కర్ణాటక నుంచి కాలినడకన శ్రీశైలానికి వచ్చే శివ స్వాములకు సొంత డబ్బుతో మంచినీళ్లూ, మజ్జిగా అందిస్తారు. చలికాలంలో దుప్పట్లు కొని రోడ్డు పక్కన నిద్రించే యాచకులకు అందిస్తూ మానవతావాదాన్ని చాటుతుంటారు.
విద్యార్థులూ అందుకోండి ఓ సలాం!

- ఎం.శ్రీనివాసరావు, ఈనాడు కర్నూలు

ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ ఆడేస్తున్నారు!

సర్ఫరాజ్‌ ఖాన్‌... మొన్నటి అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడు. పృథ్వీ షా... ముంబయి అండర్‌-16 జట్టు కెప్టెన్‌. పాఠశాల స్థాయి క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 546(నాటౌట్‌) పరుగులు చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. వీరిద్దరితోపాటు నటరాజన్‌, రూపేష్‌, దివ్య ప్రకాష్‌... కూడా ఇంగ్లాండ్‌లో తమ క్రికెట్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకొని వచ్చారు. వారికా అవకాశాన్నిచ్చిన సంస్థ ‘క్రికెట్‌ బియాండ్‌ బౌండరీస్‌’.మీర్‌ పాథక్‌ లండన్‌లో స్థిరపడ్డ భారత సంతతి వైద్యుడు. ఇంగ్లాండ్‌లోనే యూనివర్సిటీ స్థాయిలో వికెట్‌కీపర్‌గానూ ఆడాడు. క్రికెట్‌పైన తనకున్న అభిమానంతో ‘క్రికెట్‌ బియాండ్‌ బౌండరీస్‌(సీబీబీ)’ పేరుతో 2011లో ఓ సంస్థని ప్రారంభించాడు సమీర్‌. దీనిద్వారా మనదేశంలో అసాధారణ ప్రతిభను చూపించే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన టీనేజ్‌ ఆటగాళ్లకు ఇంగ్లండ్‌లో ఉచితంగా క్రికెట్‌లో శిక్షణ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. తన మిత్రుల సాయంతో విరాళాలు సేకరించి ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ వచ్చేందుకూ, ఉండేందుకూ ఏర్పాట్లు చేస్తున్నాడు సమీర్‌. సీబీబీ తరఫున మొదటసారి 2012లో నలుగురు ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లారు. అందులో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఒకడు. అప్పటికి అతడికి 14 ఏళ్లు. అక్కడ నెల రోజులుండి ‘హల్‌ క్రికెట్‌ క్లబ్‌’ తరఫున యార్క్‌షైర్‌ లీగ్‌ ఆడాడు. ఆ తర్వాత నుంచి అతడు కెరీర్‌లో వెనుదిరిగి చూడలేదు. 18 ఏళ్ల సర్ఫరాజ్‌ ప్రస్తుత ఐపీఎల్‌లోనూ బ్యాట్‌ని ఝుళిపిస్తున్నాడు. సర్ఫరాజ్‌తోపాటు అప్పుడు ఇంగ్లాండ్‌ వెళ్లాడు 12 ఏళ్ల పృథ్వీ షా. అక్కడి హల్మ్‌ స్కూల్‌ తరఫున రెండు నెలలు ఆడాడు. అక్కణ్నుంచి వచ్చాక 2013లో ముంబయిలో జరిగే ప్రఖ్యాత ‘హారిస్‌ షీల్డ్‌ క్రికెట్‌ కప్‌’లో ఒక ఇన్నింగ్స్‌లో 546 పరుగులతో అజేయంగా నిలిచి రికార్డు సృష్టించాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆరేళ్ల వయసు నుంచీ ముంబయిలోని ‘చెంబూర్‌ చిల్డ్రన్స్‌ హోమ్‌’లో ఉంటున్నాడు రూపేష్‌ బోరాడే. ఆ అనాథాశ్రమ పిల్లలకు నాలుగేళ్లుగా క్రికెట్‌లో శిక్షణ ఇస్తున్న ముంబయి ఆటగాడు సాహిల్‌ కుక్రేజా... రూపేష్‌ ప్రతిభను చూసి ‘సీబీబీ’కి అతడిని ప్రతిపాదించాడు. గతేడాది రూపేష్‌ ఇంగ్లండ్‌లోని డర్హమ్‌ స్కూల్‌ తరఫున మూడు వారాలపాటు క్రికెట్‌ ఆడి వచ్చాడు. అతడి నేపథ్యం గురించి తెలుసుకున్న స్కూల్‌ యాజమాన్యం అనాథాశ్రమానికి రూ.2లక్షల విరాళం ఇచ్చింది కూడా.

దిగ్గజాల మద్దతు...


గవాస్కర్‌, సచిన్‌, వెంగసర్కార్‌, సాబా కరీమ్‌, అశ్విన్‌, ఫరూక్‌ ఇంజినీర్‌, నీలేష్‌ కులకర్ణి లాంటి మాజీ, ప్రస్తుత భారతీయ ఆటగాళ్లతోపాటు గోర్డన్‌ గ్రీనిజ్‌, మాంటీ పనేసర్‌లాంటి విదేశీ ఆటగాళ్లూ సమీర్‌కు నిధుల సమీకరణలో, క్రికెటర్ల ఎంపికలో సాయంగా ఉంటున్నారు. ఇప్పటివరకూ 18 మంది సీబీబీ తరఫున ఇంగ్లాండ్‌ వెళ్లారు. వీరంతా ముంబయి, పుణెలలోని వెంగసర్కార్‌ క్రికెట్‌ అకాడమీ, చెన్నైలోని అశ్విన్‌ తండ్రి నిర్వహిస్తోన్న ‘జెన్‌-నెక్స్ట్‌’ క్రికెట్‌ అకాడమీ, చెంబూర్‌ అనాథాశ్రమానికి చెందిన ఆటగాళ్లే. ప్రస్తుతానికి ఈ అకాడమీల నుంచే విద్యార్థుల్ని ఎంపిక చేస్తున్నారు. భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రాంతాలవారికీ, మహిళా క్రికెటర్లకీ ఆపైన ప్రపంచవ్యాప్తంగా యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామంటోంది సీబీబీ. జెన్‌-నెక్స్ట్‌ నుంచి వెళ్లిన ఆర్‌.నటరాజన్‌, దివ్య ప్రకాశ్‌లు టాంటన్‌లోని కింగ్స్‌ కాలేజీ తరఫున ఆడారు. సీబీబీ పథకంతో వెళ్లే ఆటగాళ్లంతా ఉదయంపూట స్కూల్‌, కాలేజీల్లో తరగతులకు హాజరవుతూ, సాయంత్రం క్రికెట్‌ ఆడతారు. మాంచెస్టర్‌లోని ‘షెడల్‌ హల్మ్‌ స్కూల్‌’ శిక్షణ శిబిరానికి వెళ్లిన పృథ్వీ షా అక్కడ ఆ రెండు నెలలూ చదువుకున్నాడు కూడా. వీరు వెళ్లే డర్హమ్‌, షీడెల్‌ స్కూళ్లూ, డెన్‌స్టోన్‌ కాలేజీ, కింగ్స్‌ కాలేజ్‌ టాంటన్‌లకు చదువుల పరంగానూ పేరుంది. అక్కడకి విదేశీ ఆటగాళ్లూ వస్తుంటారు. అందువల్ల క్రికెట్‌ మాత్రమే కాకుండా విద్య, వివిధ సంస్కృతుల గురించీ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈసారి నలుగురు...


‘పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్లో క్రికెట్‌, చదువు చెప్పలేనంత మార్పు తీసుకొస్తాయి. ఆ దిశగా మావంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’ అని చెబుతారు ‘సీబీబీ’ వ్యవస్థాపక ఛైర్మన్‌ సమీర్‌. సీబీబీ నిర్వహణలో అతడికి ఇంగ్లాండ్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసే జాన్‌ విల్సన్‌ సహాయంగా ఉంటున్నాడు. ఈ ఏడాది నలుగురు ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. గతేడాది చదువు, ఆటలో మంచి గ్రేడు సంపాదించిన రూపేష్‌కి మరోసారి ఆహ్వానం వచ్చింది. ఈసారి రెండు నెలలపైనే ఉండబోతున్నాడు. రూపేష్‌తోపాటు చెంబూర్‌ చిల్డ్రన్స్‌ హోమ్‌కి చెందిన ప్రదీప్‌, పుణెలోని వెంగసర్కార్‌ అకాడమీ, జెన్‌-నెక్స్ట్‌ల నుంచి చెరో విద్యార్థీ వెళ్లనున్నారు. ‘మాకు ఎంతో ఇచ్చిన క్రికెట్‌ కోసం మేం కొంతైనా చెయ్యాలి. అవకాశాలూ, సదుపాయాలూ లేని కారణంగా యువ ఆటగాళ్ల నైపుణ్యం వృథా కాకూడదు. భవిష్యత్తులో ఇంగ్లాండ్‌ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చేలా చూస్తాం’ అని చెబుతాడు అశ్విన్‌.
క్రికెట్‌ సరిహద్దుల్ని చెరిపేస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా!


 

ఆ షాప్‌లో ఎవరూ ఉండరు!

ఆ షాప్‌లో సరుకులు మాత్రమే ఉంటాయి. యజమాని ఉండడు. నమ్మశక్యంగా లేదు కదూ... బెంగళూరులోని ‘ఐడీ ట్రస్ట్‌ షాప్‌’కి వెళితే అంతేమరి. మనకు కావాల్సిన వస్తువులను తీసుకుని డబ్బును అక్కడే ఉన్న బాక్స్‌లో వేయాలి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే...బెంగళూరులోని కొన్ని అపార్ట్‌మెంట్లూ సాఫ్ట్‌వేర్‌ పార్కులూ కార్పొరేట్‌ ఆఫీసుల్లో మనుషుల్లేని షాప్‌లను ఏర్పాటుచేశాడు ముస్తఫా. తన నలుగురు అన్నదమ్ములతో కలిసి ‘ఐడీ ట్రస్ట్‌ షాప్‌’ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఫ్రిజ్‌లో ఇడ్లీ పిండీ దోశ పిండీ, చపాతీల పిండీ లాంటి వాటిని భద్రపరుస్తారు. అంతేకాదు అల్పాహారాన్నీ ప్యాకెట్లలో పెడతారు. ఎవరికి కావాల్సిన దాన్ని వారు తీసుకుని, డబ్బును అక్కడ ఉన్న బాక్సులో వేసేయాలి. కొనుక్కోడానికి వచ్చినవాళ్ల దగ్గర సరిపడినంత డబ్బు లేకపోతే ఇబ్బంది పడాల్సిన పనే లేదు, రెండోసారి వెళ్లినపుడు చెల్లించవచ్చు. దరిదాపుల్లో ఎక్కడా యజమాని ఉండడు. అంతేకాదు సీసీ కెమేరాలూ ఉండవు. బెంగళూరులో ఇప్పటికే పదిహేడుచోట్ల ‘ఐడీ ట్రస్ట్‌ షాప్‌’లను ఏర్పాటుచేశారు. ఈ సేవలు వినియోగదారుల ఆదరణనూ అందుకున్నాయి. త్వరలోనే మరో నాలుగు నగరాలకూ వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నారు.

‘ఐడీ ఫ్రెష్‌’తో మొదలైంది...

‘ఐడీ ట్రస్ట్‌ షాప్‌’ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు ఇడ్లీ-దోశల పిండిని ప్యాకెట్లలో అందించే ‘ఐడీ ఫ్రెష్‌’ వ్యాపారం చేసేవాడు ముస్తఫా. ఆ వ్యాపారంలో నాణ్యమైన సరుకును అందిస్తున్నాడనే పేరుతోపాటు లాభాలూ గడించాడు. దాంట్లో గడించిన అనుభవంతోనే ‘ఐడీ ట్రస్ట్‌ షాప్‌’లను మొదలుపెట్టాడు. కేరళలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ముస్తఫా బెంగళూరు ఐఐఎంలో ఎంబీయే చేశాడు. వెంటనే ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగంలోనూ స్థిరపడ్డాడు. కానీ అతడిలోని ఆహార ప్రియుడు ఉద్యోగంలో ఎంతోకాలం కొనసాగనివ్వలేదు. అందుకే ఆహార పదార్థాల తయారీ దిశగా సరికొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచించాడు. అయితే అంతకుముందు ఎలాంటి వ్యాపార అనుభవం లేకపోవడంతో ఏ వ్యాపారం చేయాలో అతడికి అర్థంకాలేదు. అప్పుడే ఇడ్లీ దోశల తయారీకి వాడే పిండిని ప్లాస్టిక్‌ సంచుల్లో పోసి రబ్బర్‌ బ్యాండ్‌తో ముడివేసి కొందరు అమ్మడాన్ని గమనించాడు. చాలామంది ఆ పిండినే కొనుక్కుని ఇళ్లల్లో ఇడ్లీ-దోశలను వేసుకోడానికి వాడేవారు. అప్పుడే అతడికి లక్షలమంది వినియోగించే ఈ పిండిని ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేసి పరిశుభ్రంగా వినియోగదారులకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని తన అన్నదమ్ములతో కలిసి ఆలోచించాడు. ఆ ఆలోచన వారికీ నచ్చడంతో ‘ఐడీ ఫ్రెష్‌’ అనే స్టార్ట్‌ అప్‌ను ప్రారంభించాడు.పిండి రుబ్బడానికి మొదట్లో రెండు చిన్న గ్రైండర్‌లను మాత్రమే కొనుగోలు చేశారు. రుబ్బిన పిండిని ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసి అమ్మడం మొదలుపెట్టారు. కొన్ని వారాల్లోనే దానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో ‘హీలియన్‌ వెంచర్‌’ నుంచి సమారు ముప్పైఅయిదుకోట్ల రూపాయల ఆర్థిక సాయంతో వ్యాపారాన్ని విస్తరించారు. ఆ తర్వాత ఫ్యాక్టరీని స్థాపించి రోజూ యాభైవేల కేజీల ఇడ్లీ-దోశల పిండిని విక్రయించేవారు. బెంగళూరులోనే రెండు యూనిట్లను ఏర్పాటుచేశారు. తర్వాత మెల్లగా ఈ యూనిట్లను ఆరు నగరాలకూ విస్తరించారు. దుబాయ్‌లోనూ యూనిట్‌ను ఏర్పాటుచేసి భారతీయులతోపాటు అక్కడివారికీ ఇడ్లీ-దోశల పిండిని రుచి చూపించారు. మొత్తం ఎనిమిది నగరాల్లో పిండిని విక్రయిస్తూ నెలకు సుమారు ఏడు కోట్ల రూపాయల సరుకును విక్రయిస్తున్నారు. రెండేళ్ల కిందటివరకూ దాదాపు ఆరు వందలమంది ‘ఐడీ ఫ్రెష్‌’ యూనిట్లలో పనిచేసేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరిగి వెయ్యికి చేరుకుంది. మరో అయిదేళ్లలో ఈ సంస్థ ముప్పై నగరాలకు తమ ఉత్పత్తులను విస్తరించే పనిలో ఉంది. ముఖ్యంగా దుబాయ్‌తోపాటుగా ఇతర దేశాల్లోనూ తమ యూనిట్లను ప్రారంభించాలనుకుటున్నారు. ఈ ‘ఐడీ ఫ్రెష్‌’ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి కూడా తెప్పించుకోవచ్చు. ఉదయం అయిదు గంటలకే నగరంలోని వివిధ ప్రాంతాలకు వ్యాన్లలో పిండిని సప్లయ్‌ చేయడం మొదలుపెడతారు. వందల సంఖ్యలోని రిటైల్‌ షాప్‌లతోపాటుగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని రెస్టారెంట్లకూ మధ్యాహ్నం రెండు గంటలవరకూ పిండిని పంపిణీ చేస్తారు. నమ్మకమే పెట్టుబడి‘మనుషుల మీద మాకున్న నమ్మకమే ‘ఐడీ ట్రస్ట్‌ షాప్‌’లను ప్రారంభించడానికి కారణం. మా చిన్నతనం నుంచీ ఎదుటివారి కష్టాలకు స్పందించి సాయపడిన ఎంతోమందిని చూశాం. నాన్న రోజు కూలీ. మధ్యలో ఆగిపోతుందనుకున్న నా చదువు మాథ్యూస్‌ మాస్టారి సాయం వల్లే కొనసాగింది. ఆయన రోజూ ఇంటి దగ్గర లెక్కలూ, సైన్సూ, ఇంగ్లిష్‌ ట్యూషన్‌ చెప్పేవారు. అలాంటివారి వల్ల మనుషుల్లోని మంచితనాన్ని కళ్లారా చూడగలిగాను. అందుకే నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేసీ లాభాలు గడించవచ్చని ప్రపంచానికి చెప్పడానికే ఈ ప్రయత్నం. గతేడాది వందకోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకున్నాం. వచ్చే ఏడాది మా ఆదాయాన్ని రెండువందల యాభైకోట్ల రూపాయలకు పెంచే పనిలో ఉన్నాం’ అంటాడు ముస్తఫా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.