close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకటి కాదు... ఐదు ద్వారకలు..!

ఒకటి కాదు...ఐదు ద్వారకలు..!

‘మధ్యప్రదేశ్‌ నర్మదాతీరంలోని ఓంకారేశ్వరుణ్ణీ ఉజ్జయినీ మహంకాళేశ్వరుణ్నీ రాజస్థాన్‌లోని చారిత్రక కోటల్నీ గుజరాత్‌లో కృష్ణభగవానుడు నడయాడిన ప్రదేశాలనూ ముఖ్యంగా పంచద్వారకలుగా చెప్పే ఐదు శ్రీకృష్ణ మందిరాల్నీ ఏకకాలంలో చూసొచ్చా’మంటూ ఆయా విశేషాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన మాఢభూషి అరవిందవల్లి.పంచద్వారకలైన మూల ద్వారక, బెట్‌ద్వారక, శ్రీనాథ్‌ద్వారక, కాంక్రోలి ద్వారక, డాకోర్‌ ద్వారకలకు వెళ్లాలని ఆలోచన. ఒకరోజు ఓ ప్రకటనలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ఇరవై రోజుల యాత్ర గురించి చదివి వెంటనే టిక్కెట్లు తీసుకున్నాం.

బెంగళూరు నుంచి దిల్లీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి రాత్రి 11.30కి భోపాల్‌కి చేరుకున్నాం. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది మాతోపాటు వచ్చారు. మా టూర్‌ ఆపరేటరు మరో 8 మందితోనూ వంటవాళ్లతోనూ సామాన్లతో ముందే భోపాల్‌ చేరుకుని మా అందర్నీ బస్సులో ఉజ్జయినీకి తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయినీకి చేరుకున్నాం.

భస్మ దర్శనం!
ఉదయం ఎనిమిది గంటలకే స్నానపానాదులూ కాఫీటిఫిన్లూ కానిచ్చి మర్నాడు మహాకాళేశ్వరుని భూరిదర్శనంకోసం మా గుర్తింపుకార్డులతో గుడిదగ్గర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. రోజుకి 300 మందిని మాత్రమే ఆ దర్శనానికి అనుమతిస్తారు. అక్కణ్ణించి ఓంకారేశ్వరుణ్ణి చూడ్డానికి బస్సులో ఇండోర్‌ మీదుగా వెళ్లాం. ఘాట్‌రోడ్డు ప్రయాణం ఆహ్లాదకరంగా అనిపించింది. సాయంత్రం నాలుగుగంటలకు ఓంకారేశ్వరుడి దర్శనానికి వెళ్లాం. అభిషేకాలు చేయించుకుని తిరిగి బస్సులో ఉజ్జయినీకి ప్రయాణమయ్యాం. రాత్రి పదకొండు గంటలకు ఉజ్జయినీకి వెళ్లాం. కానీ రెండు గంటలకే లేచి మహాకాళేశ్వరుని దర్శనం కోసం క్యూలో నిలబడ్డాం. అప్పటికే చాలామంది ఉన్నారు. నాలుగు గంటలకు దర్శనం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ శివలింగాన్ని అభిషేకించవచ్చు. జలాభిషేకం తరవాత అందర్నీ మూలవిగ్రహానికి ఎదురుగా పెద్ద హాలులో కూర్చోబెట్టి పంచామృత అభిషేకం చేసి తిరిగి నీటితో శుద్ధి చేసి లింగాన్ని వెన్నా పూలూ పండ్లతో అలంకరించి భూరి(కొన్ని గంటల ముందు కాల్చిన శవం తాలూకూ భస్మం)తో అభిషేకం చేస్తారు. ఈ సేవను స్త్రీలు చూడకూడదని ముఖంమీద కొంగు కప్పుకోమని చెబుతారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ చప్పట్లూ వాద్యాలూ తాళాలూ ఢమరుక ధ్వనులూ హరహరమహాదేవ అనే నినాదాలతో దద్దరిల్లిపోతుంది. ఆ అనుభూతిని వర్ణించలేం.రాజస్థాన్‌లో...
తరవాత ఉజ్జయినీలో ఉండే మహంకాళి, భైరవస్వామి, విష్ణాలయాలు అన్నీ చూసుకుని ఆ రోజు రాత్రి అక్కడ జైపూరుకి వెళ్లే రైలు ఎక్కి ఉదయానికి చేరుకున్నాం. అక్కడ భవంతులూ ఆఫీసులూ అన్నీ గులాబీరంగులోనే ఉన్నాయి. ముందుగా జంతర్‌మంతర్‌కు వెళ్లాం. ఇది ఖగోళశాస్త్రం, జ్యోతిషం నేర్చుకునేవాళ్లకి పాఠశాల లాంటిది. సూర్యుడి వెలుతురూ నీడలతోనే సమయమూ దినమూ తిథీ వారమూ నక్షత్రమూ రాశీ... వంటివన్నీ తెలుసుకునేందుకు వీలుగా కట్టిన సిమెంట్‌ కట్టడాలను అక్కడ చూడవచ్చు. పక్కనే ఉన్న సిటీప్యాలెస్‌లో రాజామాన్‌సింగ్‌ వాడిన వస్తువుల రాజకుటుంబీకుల ఫొటోలూ ఉన్నాయి. సిటీప్యాలెస్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాచీన జైపూర్‌ కోటను చూసి జలమహల్‌ చూడ్డానికి వెళ్లేటప్పటికి రాత్రి ఏడున్నర అయిపోయింది. చుట్టూ నీళ్లూ మధ్యలో దీపాలతో అది అందంగా ఉంది.

మర్నాడు ఉదయం మూడు గంటలకు జైపూరు నుంచి బికనీరుకి ప్రయాణమయ్యాం. సాయంత్రం నాలుగు గంటలకు బికనీరు చేరుకున్నాం. కనకమహల్‌, మేఘమహల్‌ చూశాక సభామండపంమీద చిత్రపటాలనూ పాలరాతి శిల్పాలనూ వీక్షించాం. అవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. అక్కణ్ణుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్‌నాక్‌ గ్రామంలోని మూషికాలయంలోని ప్రాంగణమంతా ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కాళ్లతో ఎక్కడ వాటిని తొక్కేస్తామేమోనని భయం కలుగుతుంది. గుడిలోపల వేలకొద్దీ ఎలుకలు ఉన్నాయి. గుడి బయట ఒక్క ఎలుకా లేదు. ఎలుక విగ్రహానికి రోజూ సాయంత్రం హారతినిస్తారట. తిరిగి బికనీరుకి చేరుకున్నాం. ఉదయాన్నే బస్సులో జైసల్మేరు వెళ్లాం. జనవరి నెల కావడంతో చలి బాగా ఉంది. దారంతా పొగమంచు... డ్రైవరు జాగ్రత్తగా నడిపాడు. మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌దేవ్‌ బాబా సమాధి ఉన్న వూరు చేరుకున్నాం. రాజస్థానీలకు ఆరాధ్యదైవం రామ్‌దేవ్‌ బాబా. ప్రజలు తమ కోరికలను బాబాకు చెప్పుకుని అవి తీరాక బట్టతో తయారుచేసిన గుర్రపు బొమ్మలూ, తీపి వంటకాలను మేళతాళాలతో తీసుకొచ్చి బాబాకు నివేదన చేస్తారు.

అది చూశాక మూడు గంటలకు జై సల్మేర్‌ చేరుకున్నాం. ఆ వూళ్లొ అన్ని ఇళ్లూ ఆఫీసులూ బంగారురంగులో ఉన్నాయి. దీన్ని గోల్డెన్‌ సిటీ అంటారు. ఇక్కణ్ణించి గోబీ ఎడారి, థార్‌ ఎడారులకు వెళ్లొచ్చు. మమ్మల్ని సాయంత్రం నాలుగు గంటలకల్లా గోబీ ఎడారిలో వదిలారు. అక్కడ ఒంటెలమీద ఇద్దరం చొప్పున కూర్చుని ఎడారిలో ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించాం. ఎడారిలో కూర్చుని సూర్యాస్తమయం దృశ్యాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభవం. ఉదయాన్నే కోట చూడ్డానికి వెళ్లాం. ఇందులో రెండు గుడులు ఉన్నాయి. ఒకటి శీతలామాత ఆలయం, రెండోది జైనమందిరం. దీన్నే శ్వేత మందిరం అని కూడా అంటారు. రాజస్థాన్‌లోని ప్రతీ కోటా చూడదగ్గదే. మధ్యాహ్నం భోజనం చేశాక రాత్రి పది గంటలకు బయలుదేరి జోధ్‌పూర్‌కి చేరుకున్నాం. జోథ్‌పూర్‌ను సన్‌సిటీ అంటారు. ఈ కోటను ముగ్గురు చక్రవర్తుల హయాంలో కట్టించారు. ఇది పూర్తయ్యేసరికి మూడువందల సంవత్సరాలు పట్టింది. యుద్ధాల్లో శిథిలమైన కోటను పునర్నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టిందనీ ఇది సుమారు 600 ఏళ్ల నాటిదనీ గైడు చెప్పాడు. కోట పైకి చేరుకుని చూస్తే వూరంతా కనిపిస్తుంది. నీలం రంగు ఇళ్లు ఎక్కువగా కనిపించాయి. ఎండ నుంచి రక్షిస్తుందన్న కారణంతో నీలిరంగు వేస్తారనీ అందుకే దీన్ని నీలినగరం అంటారనీ గైడు చెప్పాడు. అక్కణ్ణుంచి పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్నీ ఆ తరవాత చిత్తౌడ్‌గఢ్‌లోని కోటల్నీ చూసి పంచద్వారకల్లో ఒకటైన శ్రీనాథ్‌ ద్వారకకు చేరుకున్నాం.

నాథ్‌ ద్వారక!
నాథ్‌ద్వారానే శ్రీనాథ్‌ ద్వారక అంటారు. ఇక్కడ కృష్ణుడు ఏడేళ్ల పిల్లాడిగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఇక్కడున్న విగ్రహాన్ని 17వ శతాబ్దంలో మధుర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉదయాన్నే హారతి ఇస్తూ స్వామిని మేలుకొలుపుతారు. తరవాత కాసేపు గుడి మూసి స్వామిని అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. దీన్నే శింగార్‌ సేవ అని పిలుస్తారు. ఇక్కడ అభిషేకానికి భక్తులు పాలే కొని ఇస్తారు. తరవాత అక్కణ్ణుంచి కాంక్రోలి ద్వారకకు వెళ్లాం. ఉదయ్‌పూర్‌ సమీపంలోని రాజసమండ్‌ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని కృష్ణుణ్ణి ద్వారకాధీశ్‌గా కొలుస్తారు. ఇక్కడి విగ్రహం కూడా మధుర నుంచే వచ్చిందట. ఈ ఆలయాన్ని దర్శిస్తే చింతలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇవన్నీ ఆయన నడయాడిన స్థలాలే. అక్కణ్ణుంచి ఉదయపూర్‌కి చేరుకుని కోట చూడ్డానికి వెళ్లాం. అది చాలా అందంగా ఉంది. ఆ రాత్రికి అక్కడే ఉండి మౌంట్‌ అబూకి చేరుకున్నాం. అక్కడ బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్లాం. అది చాలా పెద్దది. హాల్లో 2000 మంది కూర్చునే స్థలం ఉంది. ఇక్కడకు వెళ్లినవాళ్లంతా రెండు నిమిషాలైనా ధ్యానం చేస్తారు. తరవాత ఆబ్రూ దేవాలయానికి వెళ్లాం. 500 మెట్లు ఎక్కి పెదవి ఆకారంలో ఉన్న గుహలోని దేవీమాతను దర్శించుకున్నాం. రాజస్థానీ భాషలో ఆబ్రూ అంటే పెదవి అని అర్థం. ఇది క్రమేణా ఆబూగా మారింది. ఎర్రచలువరాతితో కట్టిన దిల్‌వారా మందిరాలను చూసి ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. మధ్యాహ్నం భోజనం చేసి రాజస్థాన్‌ సరిహద్దుల్లో నుంచి గుజరాత్‌లోకి ప్రయాణించాం.

బంగారు ద్వారక!
దారిలో గబ్బర్‌ అనే వూరిలో అంజేమాత గుడికి వెళ్లాం. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి. ఇక్కడే సతీదేవి గుండె పడిందని చెబుతారు. అది చాలా పెద్ద గుడి. రాత్రికి సిద్ధాపూరులో విశ్రమించి ఉదయాన్నే మాతృగయకు వెళ్లాం. అక్కడ తల్లికి పిండప్రదానాలు చేసేవాళ్లు చేసుకున్నారు. ఎందుకంటే తల్లికి పిండప్రదానం చేసే చోటు ఇదొక్కటేనట. ఇక్కడి బిందుసరోవరంలో స్నానం చేసి పిండప్రదానం చేస్తే మంచిదని భాగవతంలో ఉన్నట్లు పూజారులు చెప్పారు. తరవాత మూల ద్వారకకు చేరుకున్నాం. అరేబియా సముద్రతీరంలోని ఈ నగరాన్ని ఒకప్పుడు గోల్డెన్‌సిటీగా పిలిచేవారు. క్రీ.పూ. 1500నాటి పురాతన నగరమే ద్వారక. తప్పక చూడాల్సిన సప్త పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ప్రధాన ఆలయంలో సాయంత్రం హారతి దర్శనం చేసుకుని మళ్లీ ఉదయాన్నే గోమతీనదిలో స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకుని వెన్న ప్రసాదాలు స్వీకరించాం. తరవాత సముద్రంలో ఉన్న బెట్‌ ద్వారకకు మరబోటులో వెళ్లాం. సముద్రపు పక్షులు మా తలమీదుగా ఎగురుతూ మేం వేసే మరమరాలు తింటూ ఆలయం వరకూ వచ్చి మళ్లీ మాతో ద్వారకకు వచ్చాయి. బెట్‌ద్వారకలో కృష్ణుడి పరివారం ఉండేదట. అక్కడి స్వామిని దర్శించుకుని నాగేశం చేరుకున్నాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ పార్వతీపరమేశ్వరులు నాగ్‌, నాగిని రూపాల్లో ఉంటారు. పిల్లలు లేనివాళ్లు ఇక్కడ అమ్మే జంటపాముల బొమ్మలు పెట్టి ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

డాకోర్‌ రణ్‌ఛోడ్‌రాయ్‌!
తరవాత సోమనాథ్‌ ఆలయాన్నీ కృష్ణుడు నిర్యాణం పొందిన స్థలాన్నీ బోయవాడు బాణం వేసిన చోటునీ చూసి భావనగర్‌కు బయలుదేరాం. అక్కడ సముద్రం ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న రాయి మీద పాండవులు శివలింగాలు పెట్టి పూజ చేశారట. సముద్రంలో నీళ్లు వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ ఐదు శివలింగాలు కనిపిస్తాయి. సాధారణంగా ఉదయం పదిగంటలలోపే ఇది సాధ్యం. ఆ తరవాత నీళ్లు వచ్చి ఏమీ కనిపించవు. కానీ మేం ధైర్యం చేసి బురదలో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకుని గంటన్నరలో వెనక్కి వచ్చాం. సాయంత్రానికి డాకోర్‌ ద్వారకకు చేరుకున్నాం. ఇక్కడ కృష్ణుణ్ని రణ్‌ఛోడ్‌రాయ్‌జీగా కొలుస్తారు. బోడన అనే భక్తుడి కోరిక మేరకు నిండుపౌర్ణమినాడు కృష్ణుడు ఇక్కడకు వచ్చాడట. అందుకే పున్నమినాడే ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడి ఆలయనిర్మాణం ఎంతో బాగుంది. అక్కడ కృష్ణుణ్ణి దర్శించుకున్నాక రుక్మిణీదేవి ఆలయాన్నీ చూసొచ్చాం. ఇక్కడితో మా పంచద్వారకలు పూర్తయ్యాయి. మర్నాడు గాంధీనగర్‌, అహ్మదాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసి వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.