close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మ దర్శనంతో... సంతాన ప్రాప్తి..!

అమ్మ దర్శనంతో... సంతాన ప్రాప్తి..!

‘ఏదైనా కష్టం వస్తే దాన్నుంచి గట్టెక్కించమని భగవంతుణ్ని ప్రార్థించడం అంతటా ఉన్నదే. అయితే ఒక్కో రకమైన సమస్యకి ఒక్కో దేవుడికి మొక్కుకునే సంప్రదాయం ఎక్కువగా హైందవ సంస్కృతిలోనే కనిపిస్తుంది. ఆ కోవకు చెందినదే తమిళనాడులోని గర్భరక్షాంబిగై అమ్మన్‌ దేవాలయం. గర్భస్థ సమస్యలతో బాధపడేవాళ్లు ఆ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన కె.వి.ఎస్‌.జగదీశ్వరి.మా పాపకు గర్భంతో ఉన్నప్పుడు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా గర్భరక్షాంబిక దేవాలయానికి వెళ్లాలని అనుకున్నాం. అందులో భాగంగా ఆ ఆలయాన్ని దర్శించేందుకు తమిళనాడుకు బయలుదేరాం. ఆ ఆలయం తంజావూరు జిల్లా పాపనాశం తాలూకా తిరుకరుకవురు గ్రామంలో ఉంది. కుంభకోణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం చేరడానికి రవాణా సౌకర్యాలు చాలానే ఉన్నాయి.

‘తిరుకరుకవురు’ అంటే గర్భస్థపిండం రక్షించబడే ప్రదేశం అని అర్థం. కావేరీనది ఉపనది అయిన వెట్టార్‌ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలోని అమ్మవారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం పొందింది. ప్రవేశద్వారం దగ్గర ఐదు అంతస్తుల రాజగోపురం ఉంది. దాని ఎదురుగా పెద్ద కోనేరు ఉంది. పదో శతాబ్దంనాటి చోళుల శాసనాలు దేవాలయంలో నేటికీ కనిపిస్తాయి. దేవాలయంలోని దేవతామూర్తులన్నీ స్వయంభూలే. గర్భరక్షాంబిక, ముల్లైవననాథస్వామి... ప్రధాన దేవతామూర్తులు. వినాయకుడు, నంది, షణ్ముఖుడు, చండికేశ్వరుడు, లక్ష్మి, బ్రహ్మ, దుర్గ, అర్ధనారీశ్వర మూర్తులు కూడా దేవాలయంలో దర్శనమిస్తాయి. గర్భాలయంలో ఏడడుగుల ఎత్తు గర్భరక్షాంబికను చూడగానే మనసు ఆరాధనతో పులకించిపోతుంది. తమిళంలో అప్పార్‌, సుందరరాజన్‌...వంటి ప్రముఖులు ఈ దేవతలమీద పద్యాలు రాశారు. అమ్మను కొలిచారు.ముల్లైవననాథార్‌ స్వామిని చూడగానే మన శ్రీశైల మల్లిఖార్జునుడు గుర్తుకు వస్తాడు. ముల్లై వనం అంటే మల్లె తోట అని అర్థం. ఆయనకు మల్లెలంటే ఇష్టం. అందుకే ఆయన లింగంమీద మల్లె తీగ గుర్తు ఉంటుంది. పుట్టమన్నుతో ఏర్పడిన స్వయంభూ లింగం కావడం దీని ప్రత్యేకత. అందుకే ఇక్కడి శివుణ్ణి నీటితో అభిషేకించరు. ఈ స్వామి చర్మవ్యాధుల్ని తగ్గిస్తాడని భక్తుల నమ్మకం. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చంద్రుని వెన్నెల శివలింగంమీద పడటం ఈ లింగానికున్న మరో ప్రత్యేకత.

పౌరాణిక నేపథ్యం!
పురాణాల్లోని గౌతముడు, గార్గేయుడు అనే మహర్షులు గర్భరక్షాంబికను కొలిచారన్నది స్థానికుల కథనం. నిధ్రువముని భార్య వేదిక. పిల్లలకోసం ఆమె చేయని పూజలు లేవట. అప్పుడు అటుగా వచ్చిన గౌతమ, గార్గేయులు ఆ దంపతులకు గర్భరక్షాంబిక అయిన పార్వతీదేవిని కొలిస్తే తప్పక సంతానం కలుగుతుందని చెప్పారట.

నాటి నుంచీ వారిద్దరూ అమ్మవారిని కొలవడం మొదలుపెట్టారు. ఒకరోజు ధ్రువుడు లేని సమయంలో వూర్థ్వపడ అనే సాధువు ఆశ్రమానికి వచ్చాడు. పనులతో అలసి నడుం వాల్చిన వేదిక ఆయన్ని గమనించలేదు. దాంతో ఆ సాధువు ఆమెను శపించాడు. ఫలితంగా ఆమె గర్భంలోని పిండం కృశించిపోసాగింది. నిధ్రువుడు, వేదికలిద్దరూ గర్భరక్షాంబిక శరణుకై తపస్సు చేశారు. అమ్మ ప్రత్యక్షమై ఆమెను ఆశీర్వదించి శిశువు పిండాన్ని ఓ పాత్రలో భద్రపరిచి పిల్లవాణ్ణి రూపొందించి, వేదికకు అందించిందట. కామధేనువు ఆ బిడ్డకు పాలిచ్చింది. నైధ్రువుడనే పేరుతో ఆ పిల్లవాడు వర్థిల్లాడు. నిధ్రువుడు, వేదికలు ప్రార్థించగా అమ్మ పార్వతీదేవి అక్కడ గర్భరక్షాంబికగా వెలసి, స్త్రీలకు కడుపు పంట పండించే కల్పవల్లిగా విరాజిల్లుతోంది.

గండాల నుంచి రక్షణ
గర్భం వచ్చిన స్త్రీలకు ఏవైనా గండాలు వచ్చినా గర్భస్రావం కాకుండా కాపాడే తల్లి గర్భరక్షాంబిక అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ చేసే పూజలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. గర్భం రావడం ఆలస్యమైనవాళ్లకీ, గర్భం కావాలి అనుకున్నవాళ్లకీ ఇక్కడ కుంకుమ, నెయ్యి ప్రసాదంగా ఇస్తారు. నలభైరోజులపాటు దంపతులు రాత్రివేళల్లో ఆ బొట్టు పెట్టుకుని కొద్దిగా నెయ్యి నోట్లో వేసుకోవాలట. ఇలా కోరుకునేవాళ్లు ఆలయానికి స్వయంగా వస్తే అమ్మవారి గర్భాలయం గడపకు వాళ్ల చేత్తో వెన్న పూయిస్తారు. ఇక గర్భం వచ్చి, క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొనేవాళ్లకి కుంకుమ, ఆముదం ప్రసాదంగా ఇస్తారు. రోజూ కుంకుమబొట్టు పెట్టుకుని ఆముదాన్ని ఉదరానికి రాసుకోవాలి. అలా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమె ప్రసాదం స్వీకరిస్తే పండంటి పిల్లలు పుడతారన్నది విశ్వాసం. సంతాన సాఫల్య కేంద్రాల్లో సఫలీకృతం కాని వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి వెళ్లాక పండంటిబిడ్డను కన్నట్లు స్థానికులు చెబుతారు. అలాంటి ప్రాశస్త్యం ఉన్న గర్భరక్షాంబికను సందర్శించుకున్నాక కుంభకోణంలోని ప్రసిద్ధ దేవాలయాలైన కుంబేశ్వరుడు, పార్థసారధి దేవాలయాలనూ సందర్శించుకున్నాం. ఆ తరవాత దగ్గరలోనే ఉన్న తంజావూరులోని బృహదీశ్వరాలయం, రాజభవనం, బంగారు కామాక్షి దేవాలయాలనూ; తిరుచునాపల్లిలోని శ్రీరంగనాథుడి దేవాలయం, జంబుకేశుని గుడి, ఇతర దేవాలయాలనూ కూడా చూసి వచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.