close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గింజల్లేని పండ్లు..!

గింజల్లేని పండ్లు..!

సీతాఫలం అంటే చాలామందికి ఇష్టం. కానీ అందులోని గింజల్ని మాటిమాటికీ వూయాల్సి ఉంటుందని తినడానికి తటపటాయిస్తారు. అదే అందులో ఒక్క గింజ కూడా లేకుంటే... అలాగే నిమ్మ, బత్తాయి, కమలా, పుచ్చకాయ... ఇలా పండ్లన్నింటిలో గింజలన్నీ మాయమైపోతే... ఎంత బాగుంటాయో కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. జన్యుశాస్త్రాన్నీ, జీవసాంకేతిక విజ్ఞానాన్నీ జోడించి మరీ విత్తుల్లేని పండ్లను సృష్టించేస్తున్నారు. ఎందుకంటే ఈమధ్య ఆ పండ్లే జనానికీ రుచిస్తున్నాయి మరి.

‘విత్తు ముందా... చెట్టు ముందా...’ అంటే ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే చెట్టుకి కాయ కాస్తేనే కదా విత్తనం వచ్చేది. నిజమే కానీ, విత్తనం వేస్తేనే కదా చెట్టొచ్చేది. అంటే ఈ రెండింట్లో ఏది ముందనేది ఎప్పటికీ తేలనిదే. ఆ సంగతెలా ఉన్నా ఇప్పుడు పండ్లూ కూరగాయలన్నీ విత్తనాలు లేకుండానే చెట్లకు కాసేస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నోరూరించేస్తున్నాయి.

సుమారు ముప్ఫై ఏళ్ల క్రితం గింజలున్న ద్రాక్షపండ్లు మాత్రమే అందరికీ తెలుసు. తినేటప్పుడు ఆ గింజలు అడ్డుగా తగిలేవి. ఆ గింజల బాధ లేకుండా ఉండేందుకే నలుపు, ఆకుపచ్చ, ఎరుపు... ఇలా అన్ని రకాల్లోనూ గింజల్లేని వాటిని రూపొందించారు. దాంతో ఇప్పుడు మార్కెట్లో గింజలున్నవే అరుదుగా కనిపిస్తున్నాయి. అంటే తినడానికి సౌలభ్యంగా ఉండేవే అందరికీ రుచిస్తున్నాయన్నమాట. ఆ కారణంతోనే ఇప్పుడు గింజలు అడ్డు తగిలే పండ్లన్నింటినీ అవి లేకుండా పండించగలుగుతున్నారు. ఇలాంటి వాటిల్లో టొమాటోలూ, పుచ్చకాయలూ, అరటిపండ్లూ, నిమ్మకాయలూ, కమలాలూ, బత్తాయిలూ... ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. కొత్తగా మామిడిపండునీ పండించేస్తున్నారు మన హార్టీకల్చరిస్టులు. బిహార్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలోని హార్టీకల్చర్‌ విభాగానికి చెందిన నిపుణులు రత్న, ఆల్ఫాన్సో రకాలను సంకరీకరించి టెంకె లేని మామిడి రకాన్ని సృష్టించారు. దీనికి సింధు అని పేరు పెట్టారు. సుమారు 200 గ్రా. బరువుండే ఈ పండు గుజ్జు పసుపు రంగులో ఎంతో రుచిగా ఉందట. అద్భుతమైన రుచితో నోరూరించే సీతాఫలం, హనుమాన్‌ ఫలాలను కూడా గింజల్లేకుండా రూపొందించారు అమెరికా, స్పెయిన్‌ నిపుణులు.

గింజల్లేని పండు ఎలా?
సాధారణంగా పండ్లన్నింటిలోనూ గింజలు ఉంటాయి. ఎందుకంటే పూలల్లోని అండాశయంమీద పుప్పొడి పడి అది విత్తుగా రూపుదిద్దుకుని పండుగా పెరుగుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే విత్తు ఉన్నదాన్నే పండు అనాలి. కానీ కొన్ని పండ్లు సహజంగానే విత్తనాల్లేకుండానే కాస్తాయి. అదెలా అంటే ఆయా మొక్కల పూలల్లో సంపర్కం జరగకపోవడంతో ఫలదీకరణం ఉండదు. దాంతో విత్తనాలూ ఏర్పడవు. పూలలోని అండాశయమే పండుగా మారుతుంది. ఇలా కొన్ని సందర్భాల్లో సంపర్కం లేకుండా కూడా పండ్లనిచ్చే జాతులు కొన్ని ఉన్నాయి. టొమాటో, పైనాపిల్‌, దోస రకాలు ఈ కోవకే చెందుతాయి. సంపర్కం జరగనప్పుడు గింజల్లేని పండ్లనీ జరిగినప్పుడు గింజలున్న వాటినీ సహజంగానే ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే కొన్ని జాతుల్లో కావాలనే ఎలాంటి సంపర్కమూ జరగకుండా చేసి, విత్తనాలు ఏర్పడకుండా చేస్తుంటారు హార్టీకల్చరిస్టులు. ఈ పద్ధతినే పార్థెనోకార్పీ అంటారు. దీనికి చక్కని ఉదాహరణ అరటి. మొదట్లో అరటి రకాల్లో చాలా పెద్ద సైజు గింజలు ఉండేవి. వాటిని రకరకాలుగా సంకరీకరించి ఎట్టకేలకు గింజల్లేని పండ్లు కాసేలా చేశారు. మరికొన్నింటిలో ఫలదీకరణం జరుగుతుంది. కానీ విత్తనం తయారవ్వదు. ఈ రకాన్ని స్టెనోస్పెర్మోకార్పీ అని పిలుస్తారు. ఇప్పుడు మనం తింటోన్న ద్రాక్ష రకాలన్నీ ఆ కోవకే చెందుతాయి. వాటిల్లో విత్తు ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అంటే విత్తనం పెరగకుండా నిరోధించారన్నమాట. ఇప్పుడు కొత్తగా వస్తోన్న సీడ్‌లెస్‌ పుచ్చ కూడా ఈ రకానికే చెందుతుంది.

సంతతి ఎలా?
గింజల్లేని పండ్లు వస్తున్నాయి, బాగున్నాయి. కానీ మళ్లీ అవే రకం కావాలంటే ఎలా అన్న సందేహం రావడం సహజమే. గింజలతో పనిలేకుండానే ఆయా మొక్కల సంతతిని వృద్ధి చేస్తుంటారు. అదెలా అంటే-

సాధారణంగా సీడ్‌లెస్‌ పండ్ల కోసం ముందుగా రెండు రకాలను సంకరీకరించి గింజల్లేని లేదా గింజకట్టని పండ్ల మొక్కల్ని సృష్టిస్తారు. ఆ తరవాత అంటు కట్టే విధానాల ద్వారా వాటి సంతతిని వృద్ధి చేస్తారు. ఉదాహరణకు ఫ్లేమ్‌ సీడ్‌లెస్‌ ద్రాక్షనే తీసుకుందాం... ఈ రకం కోసం పదివేల మొక్కలమీద ప్రయోగాలు చేశారు. ఐదు రకాలుగా సంకరీకరించారు. అలా దాన్ని పుట్టించగలిగారు. ఆ తరవాతి తరం మొక్కలకోసం ఎదిగిన మొక్క కాండాలను ముక్కలుగా కోసి, వాటికి వేళ్లు వచ్చేలా చేసే ఓ పోషక ద్రావణంలో ఉంచారు. అలా వచ్చిన ఆ కొత్తమొక్కలు అచ్చం తల్లిమొక్కల్లానే పెరిగి మళ్లీ విత్తుల్లేని ద్రాక్ష పండ్లని అందిస్తున్నాయి. నిజానికి ఈ పద్ధతి ఈనాటిది కాదు. పూర్వకాలంలోనే రోమన్లు ఈ విధానాన్ని వాడే థాంప్సన్‌ సీడ్‌లెస్‌ను వృద్ధిచేశారు. కొద్దిపాటి మార్పుచేర్పులతో ఇప్పడు కూడా ఆ పద్ధతిలోనే అన్ని ద్రాక్ష రకాల్నీ విత్తుల్లేకుండా పండిస్తున్నారు.

పుచ్చకాయల విషయానికొస్తే అదో చిత్రమైన పద్ధతి. సాధారణ పుచ్చమొక్కల్లో రెండుజతల క్రోమోజోములు ఉంటాయి. జన్యు విజ్ఞానంతో కొన్ని పుచ్చమొక్కల్లో నాలుగు జతల క్రోమోజోములు ఉండేలా చేశారు. ఇప్పుడు సాదా మొక్కల్ని ఈ జన్యుమార్పు చెందిన మొక్కలతో సంకరీకరించడంతో వచ్చిన హైబ్రిడ్‌ జాతిలో మూడు జతల క్రోమోజోములున్నాయి. ఈ కొత్త రకం మొక్కలు మాత్రం గింజల్లేని పండ్లని కాస్తుంటాయి. అంటే గింజల్లేని పుచ్చకోసం హైబ్రిడ్‌ రకం గింజలు వేయాల్సిందే. ప్రస్తుతం సీడ్‌లెస్‌ పుచ్చకోసం ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఎండోస్పెర్మ్‌ కల్చర్‌ అనే మరో పద్ధతిలోనూ సీడ్‌లెస్‌ వెరైటీలను సృష్టిస్తుంటారు హార్టీకల్చరిస్టులు.

కమలా, నారింజ, బత్తాయి, నిమ్మ... వంటి సిట్రస్‌ జాతులకయితే ఎక్కువగా అంటుకట్టే విధానం ద్వారానే గింజల్లేని పండ్లచెట్లనీ వాటి సంతతినీ పెంచుతున్నారు.

ఇప్పుడు కొత్తగా అసలు గింజ ఏర్పడకుండా చేసే జన్యువుని సీతాఫలంలో గుర్తించగలిగారు. దీని ఆధారంగా మరెన్నో పండ్ల రకాల్లో గింజల్లేకుండా చేయవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

అదీగాక విత్తనాల నుంచి మొలకెత్తిన చెట్లన్నీ ఒకే రకమైన కాయల్ని ఇవ్వవు. అదే అంటుకట్టిన మొక్కలన్నీ అచ్చం తల్లి చెట్లనే పోలి ఉంటాయి. అలాగే కాస్తాయి. అందుకే నర్సరీల్లో ఎక్కువగా మంచి పండ్లను కాసే చెట్టు కొమ్మల్నే అంటుకట్టి దాని సంతతిని వృద్ధి చేస్తుంటారు.

విత్తుల్లేని ఓ మంచి జాతిని పుట్టించేందుకు ఎంతో ఓపికా మరెంతో జాగ్రత్తా అవసరం. కనీసం పదేళ్లు పడుతుంది. ఈ ప్రక్రియలో సృష్టించిన కొన్ని పండ్లు రుచిగా ఉండకపోవచ్చు. కొన్ని మొక్కలు వ్యాధుల్ని తట్టుకోలేకపోవచ్చు. ఇలా అన్నీ చూసుకున్నాకనే ఓ మంచి రకం వాడుకలోకి వస్తుంది. మొత్తమ్మీద భవిష్యత్తులో జీవసాంకేతిక విజ్ఞానం సాయంతో మరెన్నో మంచి సీడ్‌లెస్‌ పండ్లూ కూరగాయల రకాలను మనం రుచి చూస్తాం అనడంలో సందేహం లేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.