close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందం, ఆత్మవిశ్వాసం ఉచితం!

అందం, ఆత్మవిశ్వాసం ఉచితం!

రూపాయి తీసుకోకుండా గుండె ఆపరేషన్లూ, పైసా ఖర్చు లేకుండా పిల్లల సర్జరీలూ, నామమాత్రపు ధరకే పేదలకు చికిత్సలూ చేసే వైద్యులు దేశంలో చాలామంది ఉంటారు. కానీ ఏ యాసిడ్‌ దాడిలోనో ఆనవాళ్లు కోల్పోయిన అమ్మాయిలూ, ఏ అగ్నిప్రమాదంలోనో మొహాన్ని కాల్చుకున్న బాధితులూ, ఏ జన్యులోపం వల్లో ముఖాకృతి కోల్పోయిన చిన్నారుల గురించి పట్టించుకునేవాళ్లు చాలా తక్కువ. ‘ప్రాజెక్టు రివైవ్‌’ ఆ బాధ్యతను భుజాన వేసుకుంది. రకరకాల కారణాలతో రూపు కోల్పోయిన వందల మందికి ఉచిత సర్జరీలు చేస్తూ అందాన్నీ ఆత్మవిశ్వాసాన్నీ తిరిగిస్తోంది.

కంటికి కనిపించని ఆరోగ్య సమస్యలే కొంత మేలు... మందులు వాడుతూ, మనసును ఉత్సాహంగా ఉంచుకుంటూ రోజుల్ని ఎంతో కొంత సంతోషంగా వెళ్లదీయొచ్చు. కానీ యాసిడ్‌ దాడులూ, అగ్ని ప్రమాదాల వల్ల రూపాన్ని కోల్పోయిన వారూ, శరీరం కాలిపోయిన వాళ్ల పరిస్థితి మాత్రం చాలా దారుణం. అప్పటి వరకూ వీధిన వెళ్తుంటే పలకరించిన వాళ్లు మొహం చాటేస్తారు. చిన్నపిల్లలు భయంతో పక్కకు తప్పుకుంటారు. కాలేజీలూ, ఆఫీసుల్లో ప్రవేశానికి ఆంక్షలు పెడతారు. పోనీ ఆపరేషన్‌ చేయించుకుందామంటే లక్షల్లో ఖర్చు. బాధితుల్లో తొంభై శాతం మందికి ఆ ఖర్చుని భరించే శక్తి ఉండదు. దాంతో ఇంట్లో ఉండలేకా, బయటకు రాలేకా నరకయాతన అనుభవిస్తుంటారు. అమ్మాయంటే ముందు మొహాన్ని చూసి, ఆ తరవాత మిగతా విషయాల్ని గమనించే భారత్‌లాంటి దేశాల్లో ఇది తీవ్రమైన సమస్యే. దానికి ఎంతో కొంత పరిష్కారాన్ని చూపించాలనుకున్నారు విపిన్‌ సేత్‌, అరుణ్‌ కపూర్‌, విప్లవ్‌ అగర్వాల్‌ అనే వైద్యులు. ప్లాస్టిక్‌ సర్జరీల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ప్రపంచ ప్రఖ్యాత సర్జన్‌ డాక్టర్‌.చార్లెస్‌ వివాను గత నెలలో భారత్‌కు రప్పించారు. వందల మంది రోగులకు పరీక్షలు చేయించారు. ఆర్థిక స్థితిగతులూ, సమస్య తీవ్రత ఆధారంగా దాదాపు వందమంది మహిళలూ, చిన్నారులను జల్లెడ పట్టారు. వాళ్లకు గుడ్‌గావ్‌లో చార్లెస్‌ నేతృత్వంలోని పద్నాలుగు మంది వైద్యుల బృందం కరెక్టివ్‌ సర్జరీలను పూర్తి ఉచితంగా నిర్వహించింది. దేశంలో ఇలాంటి ప్రాజెక్టు రూపుదిద్దుకోవడం ఇదే తొలిసారి.

అందరికీ ఉచితంగా...
డా.చార్లెస్‌ వివా యూకేలో స్థిరపడ్డ తమిళియన్‌. ప్లాస్టిక్‌ సర్జరీల్లో దశాబ్దాల అనుభవం, అత్యుత్తమ నైపుణ్యం ఆయన సొంతం. యూకేలో ‘ఇంటర్‌ ప్లాస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో క్రియాశీలకంగా పనిచేసే చార్లెస్‌ ఏటా ఆ దేశంలో కొన్ని వందల మందికి ఆ విభాగంలో సర్జరీలు చేస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా ఏటా రెండు వారాల పాటు ఏదో ఒక దేశాన్ని ఎంపిక చేసుకొని అక్కడికెళ్లి పేదవాళ్లకు ఉచితంగా ప్లాస్టిక్‌ సర్జరీలు చేస్తున్నారు. అలా నిత్యం బాంబు దాడులతో సతమతమయ్యే అఫ్గానిస్థాన్‌, ఆడవాళ్లపైన దాడులు ఎక్కువగా జరిగే పాకిస్థాన్‌, ఉగాండా లాంటి దేశాల్లో గతంలో ఆపరేషన్లు చేశారు. లండన్‌లో స్థిరపడ్డ భారతీయ వైద్యుడు విప్లవ్‌ అగర్వాల్‌ కోరికపైన ఆయన బృందం ఈ ఏడాది భారత్‌లో అడుగుపెట్టింది. గుడ్‌గావ్‌లోని ప్రతీక్ష ఆస్పత్రి ఆపరేషన్లకు ఉచితంగా థియేటర్లూ, రోగులకు గదులూ కేటాయించడానికి ముందుకొచ్చింది. ‘రితంజలి’ అనే స్వచ్ఛంద సంస్థ రోగుల ఇతర అవసరాలు చూడటం, కార్యక్రమంపైన అవగాహన కల్పించడంలో సహాయపడింది. వైద్యులు అరుణ్‌, విపిన్‌, విప్లవ్‌ల నేతృత్వంలో మొదట దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ ప్రాథమిక పరీక్షలను నిర్వహించారు. వాళ్లలోంచి ఎంపిక చేసిన నూటయాభై మందికిపైగా రోగులను డా.చార్లెస్‌ బృందం పరీక్షించి కొందరిని సర్జరీలకు ఎంపిక చేసింది.

అమ్మాయిలూ చిన్నారులకే...
గత నెలలో రెండు వారాలపాటు సగటున రోజుకు ఆరు చొప్పున చార్లెస్‌ బృందం సర్జరీలు నిర్వహించింది. వాళ్లలో యాసిడ్‌ దాడులూ, అగ్ని ప్రమాదాల బారిన పడ్డ అమ్మాయిలూ, గ్రహణం మొర్రి, కీలాయిడ్స్‌ లాంటి సమస్యలతో ముఖాకృతి కోల్పోయిన చిన్నారులూ ఉన్నారు. వీళ్లంతా జీవితంలో ఎప్పటికీ మామూలు వ్యక్తులం కాలేమనీ, ప్రపంచానికి తమ మొహాలను చూపించలేమనీ ఆత్మన్యూనతతో బతుకుతున్న వాళ్లే. అలాంటి వాళ్లందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించే ప్రయత్నం చేసింది ‘ప్రాజెక్ట్‌ రివైవ్‌’. ‘యూకే అయినా భారత్‌ అయినా యాసిడ్‌ దాడికి గురైన బాధితుల మనోవేదన ఒకేలా ఉంటుంది. అక్కడ యాసిడ్‌ దాడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దోషికి కనీసం పదిహేనేళ్ల శిక్ష పడుతుంది. భారత్‌లో అంత బలమైన వ్యవస్థ లేకపోవడం వల్లే ఇన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ రోగులను పరీక్షిస్తున్నప్పుడు వాళ్లు చెప్పిన కథలు విని నా కళ్లు చెమ్మగిల్లాయి. అందుకే మరో దశలో కూడా ఇక్కడే ఆపరేషన్లు చేయాలని నిర్ణయించుకున్నా. రాంచీ వాసులు నన్ను ఆహ్వానించారు. నా తరవాతి మజిలీ అక్కడికే ఉంటుంది’ అంటారు డాక్టర్‌.చార్లెస్‌.

‘అమ్మాయిలు అందంగా లేకపోయినా ఫర్వాలేదు కానీ వికృతంగా కనిపిస్తే మాత్రం ఆత్మవిశ్వాసాన్నీ, జీవించాలన్న ఆశనీ కోల్పోతారు. అలాంటి వాళ్ల జీవితాలను మార్చడానికి మా వంతు ప్రయత్నంగా భారత్‌కు ఈ ‘ప్రాజెక్ట్‌ రివైవ్‌’ను తీసుకొచ్చాం. డా.చార్లెస్‌ నేతృత్వంలోనే నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. మలి విడత ఆపరేషన్లు ఎప్పుడన్నది ఇంకా ఖరారు కాలేదు. వైద్యుల వీలుని బట్టి భవిష్యత్తు ప్రణాళిక ఆధారపడి ఉంటుంది’ అని ప్రాజెక్టు సమన్వయకర్తల్లో ఒకరైన ఇషా సింగ్‌ చెబుతారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం కావాలన్నా, సాయం చేయాలన్నా http://w-hospital.in/revive/ లో వివరాలు చూడొచ్చు.


ఆ పొలం రైతులకు విశ్వవిద్యాలయం!

130 ఎకరాల వ్యవసాయ క్షేత్రం... అందులో ఒక్క బోరు కూడా వేయకుండా రకరకాల పంటలు పండిస్తూ లాభాల్ని అందుకుంటున్నారు మల్లికార్జున గుప్తా అనే రైతు. రసాయన ఎరువులు వాడకుండా, ఒక్క వర్షపు నీటి చుక్కనూ పాడిపశువుల విసర్జితాలనూ చివరికి చెట్టు నుంచి రాలిన ఆకులను కూడా వృథా పోనివ్వకుండా, సమీకృత విధానంలో ఆయన సాగిస్తోన్న సేద్యం ఎంతో మంది రైతులకు కొత్త పాఠాలు నేర్పిస్తోంది.డవిని తలపించే సుబాబుల్‌ చెట్లూ, ఏపుగా పెరిగిన వాణిజ్య పంటలూ, చుట్టూ పరచుకున్న చెరువులూ, సందడి చేసే లేగ దూడలూ పాడి పశువులూ... మొత్తంగా మల్లికార్జున గుప్తా క్షేత్రం ఓ మినీ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తలపిస్తుంది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురంలోని ఆయన పొలం ఒకప్పుడు కరవుకు విలవిల్లాడిన బంజరు భూమి. అలాంటి నేలమీద ప్రకృతిహిత విధానాల్లో సేద్యం చేస్తూ లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గుప్తా. ఆయన ఒకప్పుడు మిల్లు వ్యాపారి. రోజూ ఆయన దగ్గరకు వచ్చే రైతుల సమస్యలూ, పంటలు పండించడానికి వాళ్లు పడే ఇబ్బందులూ చూసి చలించిపోయేవారు. క్రమంగా వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవడంతో దాన్నుంచి తప్పుకొని వ్యవసాయం చేయాలనుకున్నారు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయినా ఇతరులకంటే భిన్నంగా వ్యవసాయం చేసి పంటలు పండిస్తానని స్నేహితులూ, బంధువులతో ఆయన నమ్మకంగా చెప్పేవారు. వాళ్ల సాయంతోనే ఆరేళ్ల క్రితం 130 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పటికే చుట్టుపక్కల లెక్కలేనన్ని బోర్లతో భూగర్భ జలాలు దాదాపు ఎండిపోయాయి. దాంతో బోర్ల మీద ఆధారపడకుండానే పంటలు పండించాలనుకున్నారు.

నలభై ఎకరాల్లో చెరువులు
నీటి కోసం బావులూ బోర్లను కాకుండా గుప్తా వర్షపు నీటినే నమ్ముకున్నారు. తన పొలం చుట్టుపక్కల పడే ఒక్క వర్షపు నీటి చుక్కను కూడా వృథా చేయకూడదనుకున్నారు. దాని కోసం నలభై ఎకరాల విస్తీర్ణంలో ఏడు చెరువులను తవ్వించారు. ఒకదానితో మరొకటి అనుసంధానం చేస్తూ పైపులైన్లు వేయించారు. చెరువులు నిండితే మిగతా నీరు వృథా పోకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి చెరువుకు ఆనుకొని ఓ చిన్న డ్యామ్‌ నిర్మించి దానికి షట్టర్లు ఏర్పాటు చేశారు. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఆ నీళ్లను దిగువ ప్రాంతానికి పంపేలా మార్గం రూపొందించారు. ఆ వరద నీటిని పూర్తిస్థాయిలో ఒడిసి పట్టేందుకు నీరు వెళ్లే మార్గానికి అటూ ఇటూ వూట బావులు తవ్వించారు. అదృష్టం కొద్దీ వ్యవసాయం మొదలుపెట్టిన కొత్తల్లో వర్షాలు బాగా కురవడంతో ఆ చెరువులు నిండాయి. దాంతో భద్రపరచుకున్న నీటితోనే వ్యవసాయాన్ని కొనసాగించారు. గుప్తా పుణ్యమా అని చుట్టుపక్కలా భూగర్భ జలాల మట్టం పెరిగింది. ఒకప్పుడు పక్క పొలంలో రైతులు మోటారు వేస్తే గంటపాటు నీళ్లు రావడం కూడా గగనమయ్యేది. కానీ ఇప్పుడు ఏకధాటిగా ఐదు గంటలు వస్తుండటం విశేషం.వ్యర్థాలే ఎరువులు
పంటలకు అనుబంధంగా పాడి పశువులనూ పెంచితే ఆదాయంతోపాటు ఎక్కువ ప్రయోజనాలూ, ఎక్కువ మందికి ఉపాధీ దక్కుతాయని గుప్తాకి అనిపించింది. దాంతో 45 మేలు జాతి ఆవులతో పాడి పరిశ్రమ నెలకొల్పారు. 400 పైచిలుకు గొర్రెలూ, మేకలనూ పెంచుతున్నారు. వీటికి మేత కోసం 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. మరోపక్క ఎనభై ఎకరాల్లో పంటలకు బిందు సేద్యం పద్ధతిలోనే నీరందిస్తున్నారు. దాని వల్ల చాలా నీరు ఆదా అవుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలుండే సుబాబుల్‌ తోటను 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వాటి ఆకులు పశువులకు మేతగా పనికొస్తున్నాయి. టన్ను సుబాబుల్‌ కర్ర ధర సుమారు రూ.3500 పలుకుతుంది. దాంతో ఎకరాకు 30 టన్నులు వచ్చినా పాతిక లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందంటారు గుప్తా. ఆయన క్షేత్రంలో పశువుల విసర్జితాలు కూడా వృథా కావు. పశువుల పాకలోపడ్డ పేడనూ, మూత్రాన్నీ కాలువ ద్వారా నేరుగా ఓ చెరువులోకి వెళ్లేలా ఏర్పాటుచేశారు. ఆ నీటిని రెండు వారాలకోసారి పంటలకు పెట్టడంతో అవే సేంద్రియ ఎరువుల్లా పనిచేస్తున్నాయి. దాంతో ఇతర ఎరువుల అవసరం రాలేదు. ఆ చెరువుల్లో చేప పిల్లలనూ పెంచుతూ తాను ఆదాయం పొందడంతో పాటు గంగపుత్రులకూ ఉపాధి కల్పిస్తున్నారు.విద్యార్థులకూ పాఠాలు
గుప్తా తాను సొంతంగా నేర్చుకున్న విధానాలకు తోడు నీటి పారుదల శాఖ సహాయ ఇంజినీరు నాగేశ్వరరావు సూచనలూ, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల సహకారంతో వ్యవసాయ క్షేత్రంలో ఇన్ని ఫలితాలు రాబట్టారు. గుప్తా పద్ధతులు తెలుసుకునేందుకు రైతులతో పాటు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి నిత్యం విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. కేవలం వర్షపు నీటిని నమ్ముకొని నూట ముప్ఫయ్‌ ఎకరాల్లో గుప్తా సృష్టిస్తోన్న అద్భుతాలకు గుర్తింపుగా ప్రభుత్వం గతేడాది జిల్లా ఉత్తమ రైతు పురస్కారం అందించింది. ‘భవిష్యత్తులో దీన్ని వ్యవసాయ పర్యటక క్షేత్రంగా మార్చాలన్నది నా లక్ష్యం. నా పొలంలోకి వచ్చే వర్షపు నీటితో చెరువులు నిండిపోయి, ఇంకొంత నీరు గోదావరిలో కలుస్తోంది. వాటిని కూడా అడ్డుకుని అందరం ఉపయోగించుకోగలిగితే ఎవరికీ బోర్లపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు’ అంటారు గుప్తా. ప్రకృతి వనరులను అందరికీ సమానంగా ఇస్తుంది. వాటిని ఎవరు ఎలా వాడుకుంటున్నారనే దానిపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి. గుప్తా కథే అందుకు ఉదాహరణ.

- జూపల్లి రమేష్‌, ఈటీవీ, వరంగల్‌

ప్రాజెక్టులో దమ్ముంటే రూ.15లక్షలు!

ఏటా లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారు. వారిలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ప్రాజెక్టు వర్కు చేస్తారు. కానీ వాటిలో కనీసం వంద ప్రాజెక్టులైనా ఉత్పత్తి రూపంలోకి మారి అందుబాటులోకిరావు. ఈ సమస్యకు పరిష్కారంగా యువ ఇంజినీర్లను ప్రోత్సహించేదే ‘గాంధీ యంగ్‌ టెక్నలాజికల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు’.సామాజిక, పర్యావరణ, సాంకేతిక పరమైన అంశాల్లో సామాన్యుడికి ఎదురయ్యే సమస్యలకు తమ ఆవిష్కరణలద్వారా పరిష్కారం చూపించే విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ‘గాంధీ యంగ్‌ టెక్నలాజికల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు’లను తీసుకొచ్చింది నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌. ఈ ఆవిష్కరణలు వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య-ఆరోగ్యవిభాగం... ఇలా వివిధ రంగాల్లోని అవరోధాల్ని అధిగమించేవిగా, ముఖ్యంగా మనదేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేవిగా ఉండాలి. వివిధ ఇంజినీరింగ్‌ కాలేజీలూ, యూనివర్సిటీలకు చెందిన ప్రస్తుత, పూర్వ విద్యార్థులు తమ ప్రాజెక్టుల్ని ఈ అవార్డులకు ప్రతిపాదించవచ్చు. విద్యాసంస్థని సదరు విద్యార్థి విడిచి వెళ్లినా ఆ ప్రాజెక్టుని పర్యవేక్షించిన, మార్గనిర్దేశం చేసిన అధ్యాపకులైనా దాన్ని అవార్డుకి ప్రతిపాదించవచ్చు.

రూ.15 లక్షల ప్రోత్సాహకం
ఈ అవార్డుల్లో ముఖ్యంగా నాలుగు విభాగాలున్నాయి. ‘మోర్‌ ఫ్రమ్‌ లెస్‌ ఫ్రమ్‌ మెనీ’... తక్కువ మెటీరియల్‌, ఇంధనం ఉపయోగించి ఎక్కువ మొత్తంలో లాభం చేకూర్చే ఆవిష్కరణల్ని ఈ అవార్డుకి ఎంపికచేస్తారు. ఉత్పత్తిని ఎక్కువ మందికి ఉపయోగపడేలా రూపొందించడం దీన్లో ప్రధానం. రెండోది ‘సోషల్‌ టెక్నలాజికల్‌ అవార్డు’. సామాజికంగా మార్పు తీసుకురాగలిగే ప్రాజెక్టులకు ఈ అవార్డు అందిస్తారు. మూడోది ‘టెక్నలాజికల్‌ ఎడ్జ్‌ అవార్డు’. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వైద్యం, వ్యవసాయం మొదలైన రంగాల్లో సాంకేతికంగా కీలకమైన, చెప్పుకోదగ్గ మార్పుగా భావించే ఆవిష్కరణను చేపట్టేవారికి ఈ అవార్డు అందుతుంది. నాలుగోది ‘బిరాక్‌ సృష్టి అవార్డు’. బయోటెక్నాలజీ, వైద్యం, ఆరోగ్య విభాగాల్లో చికిత్స ఖర్చు తగ్గించే, తక్కువ ఖర్చుతో వ్యాధి నిర్ధారించే ఉత్పత్తుల్ని తీసుకొచ్చేవారికి అందుతుంది. ఈ విభాగాలన్నింటిలోనూ కలిపి పది వరకూ అత్యుత్తమ ఆవిష్కరణల్లో/నమూనాల్లో ఒక్కో దానికి రూ.15 లక్షల చొప్పున గ్రాంటు అందిస్తారు. తర్వాత 100 స్థానాల్లో నిలిచే ఉత్పత్తులకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు. కొన్ని సందర్భాల్లో కంపెనీ ప్రారంభానికి అవసరమైన సహకారాన్నీ అందిస్తారు.పోటీ మొదలైంది...
2017 సంవత్సరానికి గానూ అవార్డుల ప్రతిపాదనలకి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివరివరకూ ప్రతిపాదనలు పంపొచ్చు. కానీ ముందు పంపేవారి ప్రాజెక్టుల్ని మరింత క్షుణ్నంగా పరిశీలించే అవకాశం ఉంటుందని మరచిపోకూడదు. ఈ ప్రాజెక్టుల్ని ప్రతిపాదించాలనుకుంటున్నవారు techpedia.in వెబ్‌సైట్లోని జీవైటీఐ అవార్డుల విభాగంలో అప్‌లోడ్‌ చెయ్యాలి. ఒకవేళ ఆ ప్రాజెక్టుకి ఇంక్యుబేషన్‌ మద్దతు కావాలనుకుంటే అదీ తెలియజేయాలి. తుది జాబితాకి ఎంపికైనవారి ఉత్పత్తుల్ని/నమూనాల్ని 2017 మార్చిలో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’ సమయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. వారం రోజులపాటు జరిగే ఆ ఉత్సవాల సమయంలోనే అవార్డుల్నీ అందిస్తారు. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులు హాజరవుతారు. జీవైటీఐ అవార్డుల్ని 2012 నుంచి ఇస్తున్నారు. ఇప్పటివరకూ రెండొందలకు పైగా విశ్వవిద్యాలయాలూ, ఐదొందలకు పైగా కాలేజీలకు చెందిన ఏడువేల ప్రాజెక్టులు వచ్చాయి. 50కిపైగా విభాగాల్లో 180 మందికి ఈ అవార్డులు అందాయి. 2016లో 2363 ప్రతిపాదనలు వచ్చాయి. 125 మందితో కూడిన న్యాయనిర్ణేతల బృందం వాటిని పరిశీలించి తుది జాబితాలోకి 60 ప్రాజెక్టుల్ని ఎంపికచేసింది. ఈ అవార్డు విజేతల్లో ఐఐటీ దిల్లీ పరిశోధక విద్యార్థి ‘ప్రశాంత కలిత’ ఒకరు. ప్రాణాంతకమైన సెప్సిస్‌ ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడానికి పరికరాల్ని కనిపెట్టాడు ప్రశాంత. ఇది వరకు సెప్సిన్‌ను గుర్తించే పరీక్షలకు రూ.10వేలకు పైనే ఖర్చయ్యేది. ప్రయోగ పరీక్ష ఫలితం రావడానికి ఆరేడు గంటలు పట్టేది కానీ ప్రశాంత అభివృద్ధి చేసిన పరికరాలతో రూ.50 ఖర్చుతోనే అయిదే నిమిషాల్లో పరీక్ష పూర్తిచేసి ఫలితాన్ని తెలుసుకోవచ్చు. క్యాప్సూల్స్‌పైన తొడుగులా ఉండే బయోడీగ్రేడబుల్‌ పాలిమర్స్‌ స్థానంలో సోయా గుళికల్ని వాడే సాంకేతికతను అభివృద్ధిచేసిన ఐఐటీ- హైదరాబాద్‌ విద్యార్థి ఉత్కర్ష్‌ భుటానీ, పేలుడు పదార్థాల్ని గుర్తించే ‘ఎక్స్‌-నిఫ్‌’ పరికరాన్ని అభివృద్ధిచేసిన ఐఐటీ- బోంబే విద్యార్థి గౌరవ్‌ గుప్తా అవార్డు విజేతల్లో ఉన్నారు.తక్కువ ఖర్చుతో, పరిమిత శ్రమతో ఎక్కువ దారాన్ని తీయగలిగే చరఖాని అభివృద్ధి చేయమని గాంధీజీ 1930లో ‘అఖిల భారతీయ చరఖా సంఘం’ తరఫున పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడివారైనా ఈ చరఖాని అభివృద్ధి చేయవచ్చనీ అలాంటి వారికి రూ.లక్ష బహుమతి ఉంటుందనీ ప్రకటించారు. సామాన్యుడి సమస్యకు పరిష్కారం కోసం గాంధీజీ ఆరోజు ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా ఆయన పేరున ఈ అవార్డుల్ని మొదలుపెట్టినట్టు చెబుతారు ‘హనీ బీ నెట్‌వర్క్‌’ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ అనీల్‌ గుప్తా. ‘ఈరోజుల్లో డబ్బుకు కొరతలేదు. మరెందుకు సమస్యలతోనే బతకాలి’ అంటారు గుప్తా. మన యువ ఇంజనీర్లు ఏమంటారో!


ఆస్కార్‌ అందుకున్నా, నోబెల్‌ సాధించినా రానంత ప్రచారం టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఒక మైనపు బొమ్మ పెడితే వచ్చేస్తుంది. నిమిషం కూడా ఖాళీగా కూర్చోకుండా, పక్కవాళ్లనూ కూర్చోనివ్వకుండా చురుగ్గా కదిలే ప్రధాని మోదీ కూడా ఆ మైనపు ప్రతిమ కోసం చాలాసేపు కొయ్యలా కూర్చున్నారు. అంతలా ఆ బొమ్మల్లో ఏముందంటే...

బొమ్మకు మోదీ ఒప్పుకోలేదు!

మేడం టుస్సాడ్స్‌ మ్యూజియాన్ని స్థాపించిన మహిళ అసలు పేరు మేరీ టుస్సాడ్స్‌. ఆవిడ తల్లి మైనంతో బొమ్మలు తయారు చేసే ఫిలిప్‌ అనే ఫ్రెంచ్‌ వ్యక్తి ఇంట్లో పనిమనిషి.
టుస్సాడ్స్‌కు బొమ్మల తయారీ నేర్పించింది ఆయనే. ఫిలిప్‌కు వారసులు లేకపోవడంతో ఆయన చనిపోయాక బొమ్మలన్నిటినీ టుస్సాడ్స్‌ చేజిక్కించుకుంది. తరవాత ఆమె కూడా ఫిలిప్స్‌ బాటలోనే మైనపు ప్రతిమల్ని తయారు చేయడం మొదలుపెట్టింది. పద్దెనిమిదో శతాబ్దంలో ఫ్రెంచ్‌ విప్లవం సమయంలో హత్యకు గురైన తిరుగుబాటుదార్ల సమాధుల్ని తవ్వి మరీ, వాళ్ల తలల అచ్చుల్ని తీసుకొని టుస్సాడ్స్‌ బొమ్మలు తయారు చేసేది. ప్రజలు వాటినే వీధుల్లో వూరేగిస్తూ ఉద్యమాలు చేసేవారు. అలా మొదట ఫ్రాన్స్‌లో ఆమె బొమ్మలు ప్రాచుర్యం పొందాయి. తరవాత ఆమె ఒక్కో దేశంలో ప్రదర్శన నిర్వహిస్తూ చివరికి ఆ బొమ్మల్ని బ్రిటన్‌కు తీసుకొచ్చింది. ఆ సమయంలో ఫ్రాన్స్‌లో గొడవల కారణంగా టుస్సాడ్స్‌కు ఆ దేశంలోకి అనుమతి లభించకపోవడంతో ఆమె లండన్‌లోనే స్థిరపడపోయింది. అలా 1835లో లండన్‌లో ప్రస్తుతం ఉన్న మేడం టుస్సాడ్స్‌ మ్యూజియాన్ని మొదలుపెట్టింది.


టుస్సాడ్స్‌లో భారత్‌

టుస్సాడ్స్‌లో మొట్టమొదట చోటు సంపాదించిన భారతీయుడు గాంధీ.
* నటుల్లో తొలిసారి ఆ ఘనత సాధించింది అమితాబ్‌ బచ్చన్‌. తరవాత కరీనా కపూర్‌, షారుక్‌, సల్మాన్‌, ఐశ్వర్యారాయ్‌, మాధురీ దీక్షిత్‌, హృతిక్‌ల ప్రతిమలూ కొలువుదీరాయి.
* టూస్సాడ్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు సచిన్‌ తెందూల్కర్‌.
* రాజకీయ నేతల్లో మోదీకి ముందు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రతిమను మాత్రమే అక్కడ ఏర్పాటు చేశారు.


అందుకే మోదీ!

ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న అన్ని రంగాల ప్రముఖులకూ టుస్సాడ్స్‌ మ్యూజియంలో చోటుంటుంది. అ ఆదరణ చూసే మోదీని టుస్సాడ్స్‌ ఎంపిక చేసింది. కానీ మోదీ దగ్గరికి తన ప్రతిమ ఏర్పాటు చేసే ప్రతిపాదన వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకోలేదట. ‘అంతమంది ప్రముఖుల మధ్య నిల్చునే స్థాయికి నేనింకా చేరుకోలేదు’ అన్నారట. కానీ సర్వేలు నిర్వహించి, ప్రజాభిప్రాయం సేకరించాకే బొమ్మల తయారీ కోసం మనుషుల్ని ఎంపిక చేసుకుంటామని టుస్సాడ్స్‌ యాజమాన్యం నచ్చజెప్పడంతో ఆయన అంగీకరించారు. ఈ వారంలోనే ఆ బొమ్మ లండన్‌లో ప్రముఖుల సరసన చేరింది. ఆ బొమ్మను చూసుకున్నాక ‘పైన బ్రహ్మ, కింద టుస్సాడ్స్‌ వాళ్లు మాత్రమే ఇంత నైపుణ్యంతో ప్రతిమల్ని తయారు చేయగలరు’ అంటూ కీర్తించారు మోదీ.


మదర్‌ వద్దన్నారు

చరిత్రలో టుస్సాడ్స్‌ మ్యూజియంలో కొలువుదీరే అవకాశాన్ని తిరస్కరించిన ఒకే ఒక్క వ్యక్తి మదర్‌ థెరిసా. టుస్సాడ్స్‌ వాళ్లు ఆమెను కలిసినప్పుడు ‘నా రూపానికి నేను ప్రాధాన్యమివ్వను, మీరూ ఇవ్వకండి’ అని చెప్పారట.


వచ్చే ఏడాది దిల్లీకి

ప్రపంచ వ్యాప్తంగా టుస్సాడ్స్‌కు 21 శాఖలున్నాయి. వచ్చే ఏడాది దిల్లీలో కూడా మేడం టుస్సాడ్స్‌ అడుగుపెట్టనుంది. దాంట్లో మొదట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిమే కొలువుదీరనుండటం విశేషం.


ఇవీ ప్రత్యేకతలు...

టుస్సాడ్స్‌లో కొలువుదీరే ఒక వ్యక్తి ప్రతిమ తయారు చేయాలంటే అన్ని కోణాల్లో కనీసం 250 కొలతలూ, 180 వరకూ ఫొటోలూ అవసరమవుతాయి.
* సగటున ఒక బొమ్మ తయారీకి నాలుగు నెలలు పడుతుంది. తలలో సుమారు లక్ష వెంట్రుకలను దేనికదే విడివిడిగా చేత్తో అమరుస్తారు.
* ఒక బొమ్మ పూర్తవడానికి నూటయాభై కిలోల మైనం అవసరమవుతుంది. ఎంపికచేసిన జాతుల తేనెటీగల తుట్టెల నుంచి సేకరించిన నాణ్యమైన మైనంతో మాత్రమే బొమ్మను తయారు చేస్తారు.
* కనుగుడ్లూ, నరాలూ సహజంగా కనిపించేందుకు ఆయా రంగుల దారాలను అమరుస్తారు. ప్రత్యేకమైన రసాయనాలతో చెమటనూ, జిడ్డునూ, మొహంలో నవ్వునూ, హావభావాలనూ తీసుకొస్తారు.
* ఒకబొమ్మకు సరిపడా మైనాన్ని తేనెటీగలు ఉత్పత్తి చేయాలంటే కొన్ని కోట్ల పువ్వులపైన వాలాల్సి ఉంటుంది. ఒక్కో బొమ్మ తయారీకి దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతుంది.
* ఇప్పటిదాకా యాభై కోట్ల మందికి పైగా ఆ మ్యూజియంను వీక్షించారు. అత్యధికంగా 23సార్లు ఎలిజబెత్‌ రాణి ప్రతిమను తయారు చేశారు.
* ప్రతి బొమ్మనూ ఆయా వ్యక్తుల కొలతల కంటే రెండు శాతం పెద్దగా తయారు చేస్తారు. కాలక్రమంలో మైనం ఆ మేరకు కుంచించుకుపోవడమే దానికి కారణం.
* మేరీ టుస్సాడ్స్‌ స్వయంగా తయారు చేసుకున్న ఆమె మైనపు ప్రతిమ మ్యూజియం ప్రధాన ద్వారంలో వీక్షకులకు ఇప్పటికీ స్వాగతం పలుకుతుంది.
* నిజమైన రూపాన్ని 99శాతం పోలిన బొమ్మల్ని తయారు చేస్తారన్న పేరు ఆ మ్యూజియానికుంది. జుట్టూ, గెడ్డం కోసం నిజమైన వెంట్రుకలనే ఉపయోగిస్తారు.


సుగంధ ద్రవ్యాల చిరునామా!

ఇరుకిరుకు సందులూ వాటి బారునా కొలువుదీరిన దుకాణాలూ రొద పెట్టే తోపుడుబండ్లూ కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. కొత్తగా వెళ్లినవాళ్లకు కాస్త గందరగోళంగానూ అనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అచ్చంగా రూ. 300 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఇక, అక్కడ జరిగే వ్యాపారానికి ఓ పట్టానా వెలకట్టలేం. ఎందుకంటే అది ఆసియాలోకెల్లా అతిపెద్ద స్పైస్‌ మార్కెట్టు... అదే పాత దిల్లీలోని ఖారీ బావలీ.

క్కడ అడుగుపెట్టగానే రకరకాల సుగంధ ద్రవ్యాలూ ఎండు పండ్లూ గింజలూ ఉప్పులూ పప్పులూ ధాన్యాలూ ఔషధమూలికలూ... ఇలా దినుసులన్నీ కలగలిసిపోయిన ఒకలాంటి వాసన సందర్శకుల్ని చుట్టేస్తుంది. కుంకుడుకాయల నుంచి కాలిఫోర్నియా బాదం వరకూ అన్ని రకాలూ దొరుకుతాయక్కడ.