close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇడ్లీ బాబాయ్‌

ఇడ్లీ బాబాయ్‌
- రాయపెద్ది వివేకానంద్‌

‘‘బాబాయ్‌ బాగా చితికిపోయాడట’’ చెప్పాను నేను.

‘‘అవును, నాకూ నిన్ననే తెలిసింది. ఈలోగా నీవు కబురుపెట్టావు’’ సాలోచనగా చెప్పాడు స్వరూప్‌.

‘‘మనం పూనుకుని ఏదయినా చేయాలి’’ కృష్ణ చెప్పాడు.

మేం ముగ్గురం ఒకేలాగా ఆలోచించటం, ఒకేలాగా స్పందించటం విశేషం. అందుకే మా స్నేహం చిన్నప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది.

‘‘కృతజ్ఞత అనేది చాలా పెద్దమాట. ఆయన పట్ల మనం చూపేది కృతజ్ఞత అవదు. అది మన నైతిక ధర్మం’’ తిరిగి కృష్ణే చెప్పాడు.

మా ముగ్గురిలో కృష్ణ మంచి ‘కమ్యూనికేటర్‌’. ఇటీవల చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు బాగా వింటున్నాడల్లే ఉంది. మేం ముగ్గురం చిన్నప్పటి నుంచి మిత్రులం. చిన్న వూర్లో పుట్టి పెరగడం మొదలు... ఇంజినీరింగ్‌ కలిసి ఒకే నగరంలో చదువుకోవటం వరకూ ఎలాంటి ఎడబాటూ లేకుండా కొనసాగింది జీవితం. ఇంకా చిత్రమేమిటంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ముగ్గురం బెంగుళూరులోనే స్థిరపడ్డాం. అందరూ అసూయపడే లాంటి జీతభత్యాలతో, అత్యాధునిక సౌకర్యాలూ వసతులతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నాం. దేవుడి దయ అనండీ, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ భారతదేశంలో అభివృద్ధి చెందడం వల్ల అనండీ, పెద్దల ఆశీర్వాదం అనండీ... మేమైతే ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం.

గిట్టనివాళ్ళు మమ్మల్ని ‘వైట్‌కాలర్‌ లేబర్‌’ అని హేళన చేసినా సరే- జీతభత్యాలు, విదేశాల్లో ప్రాజెక్టు అవకాశాలు... ఇలా హాయిగా మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగిపోతున్నాయి మా జీవితాలు.

ఉద్యోగంలో చేరి దాదాపు పదేళ్ళు అవుతోంది. ఈ పదేళ్ళలో సొంత ఫ్లాట్లూ, కార్లూ, షేర్లూ సంపాదించాను. ఉద్యోగిని అయిన అందమైన భార్య సరేసరి. సోడాబుడ్డి కళ్ళజోడు, వినాయకుడి బొజ్జలాంటి ఉదరం, బట్టతలా అదనంగా నేను సంపాయించుకున్న ఆస్తులు. ముప్ఫైఅయిదేళ్ళకే బీపీ, మధుమేహం అదనంగా సంపాయించుకున్న కొలీగ్స్‌ కూడా ఉన్నారు నాకు. పిల్లలు లేరు నాకింకా. కలుగుతారనే ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి రాన్రాను. మా మిత్రబంధం పరిస్థితి కూడా ఇంచుమించు నాలాంటి పరిస్థితే.

అయిదో అంతస్తులో బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం నేనూ, కృష్ణ, స్వరూప్‌. సమయం దాదాపు రాత్రి పదవుతోంది.

ప్రతీ వారాంతంలో అలా కలవటం సరదా మాకు. మా సంభాషణలలో చోటుచేసుకోని అంశమే ఉండదు. అన్నమయ్య నుంచి అణుబాంబు దాకా, తిక్కన నుండి టెట్రాసైక్లిన్‌ దాకా మా సంభాషణల్లో చోటుచేసుకుంటాయి.

ముగ్గురం శుద్ధ శాకాహారులమే. ముగ్గురం భోజనప్రియులమే. ఏ దురలవాట్లూ లేవు మాకు. ‘బాబాయి’ అని- స్వరూప్‌ ఇందాక పేర్కొన వ్యక్తి మాకు బంధువేం కాదు, అంతకన్నా ఎక్కువే. మా భోజన ప్రియత్వమే ఆయన్ని మాకు చేరువ చేసింది.

ఆయన మానవత్వం, మంచితనం, హృదయ వైశాల్యం ఆయన్ని ఎన్నటికీ మరువకుండా ఉండేలా చేశాయి.

ఇంతలో శర్వాణి- అంటే నా శ్రీమతి మా ముగ్గురికీ రాత్రి భోజనం సర్వ్‌ చేసింది.

టీవీలో వస్తున్న ఏదో మలయాళ సంప్రదాయ గీతం మమ్మల్ని మాకు తెలియకుండానే గతంలోకి లాక్కెళ్ళింది.

* * *

బాబాయ్‌ అసలు పేరు- సుందరం నంబూద్రి. వారి పూర్వీకులు పాలక్కాడు- కేరళ నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారట.

అందరూ ఆయన్ని ‘బాబాయ్‌’ అనే పిలుస్తారు.

మేము ఇంజినీరింగ్‌ చేస్తున్న రోజులవి. చిన్న వూరినుంచి వచ్చి నగరంలో రూమ్‌ తీసుకుని ఉండేవాళ్ళం. మా రూమ్‌కి దగ్గరగా మెయిన్‌రోడ్‌పైన ఓ సందు మొదట్లో చిన్న మెస్‌ నడిపేవాడు సుందరం నంబూద్రి.

నగరమింకా విస్తరించని కాలంలో వారి పెద్దలు కొని ఉంచిన స్థలంలో నడిపేవాడు ఆ మెస్‌. చాలా చిన్న స్థలమది. అందులోనే ఓ మూల చిన్నగది, అందులో ఆయన నివాసం. మిగతా ఖాళీ స్థలంలో వెదురు బొంగులు పాతి, తడికెలతో పందిరిలాగా ఏర్పాటుచేసి అందరికీ ఇడ్లీ-సాంబార్‌, వడ-సాంబార్‌ సర్వ్‌ చేస్తూ హడావుడిగా అటూ ఇటూ తిరిగేవాడు.

‘ఇడ్లీ సుందరం చేతిలో అమృతం ఉందబ్బా’, ‘వింటే భారతం వినాలో వద్దో తెలియదు కానీ గారెలు తింటే మాత్రం సుందరం గారెలే తినాలయ్యా’.

ఇడ్లీ, వడలు కాక అరుదుగా దోసెలు, ఉప్మా, బోండాలు చేసేవాడు. ఆయన సాక్షాత్తూ అమృతం తెచ్చి వడ్డిస్తానన్నా, ‘ఆ వద్దులే బాబాయ్‌- ఇడ్లీ, వడ ఇంకో రెండెయ్యి’ అనేలా ఉండేవారు జనం.

వేడివేడి ఇడ్లీ పొగలు చిమ్ముకుంటూ ఆకులో దర్శనం ఇచ్చిందంటే జనాలు ఇహపరాలు కూడా మరిచిపోయి లొట్టలేసుకుంటూ, డజన్లకొద్దీ లాగించేవారు.

తెల్లవారుజామున నాలుగింటికల్లా హడావుడి మొదలయిపోయేది బాబాయ్‌ కాంపౌండ్‌లో. ఆయనే అన్ని పనులూ చూసుకునేవాడు. పాత్రలు కడగటానికీ, గ్లాసులు కడగటానికీ, టేబుళ్ళు తుడవటానికీ మనిషి ఉండేవాడు.

ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే- ఆయన మెస్‌లో ప్లేట్లు ఉండవు. సర్వకాల సర్వావస్థలలో పచ్చటి అరటాకుల్లో కమ్మగా వడ్డించేవాడు. వేడివేడి ఇడ్లీ, వడ ఆకులో పడగానే కమిలిపోయిన ఆకు, ఆవునెయ్యి, చక్కటి సాంబారు, కొబ్బరిచట్నీ... ఇవన్నీ కలిసి ఓ మధురమైన సువాసన సృష్టించేవి.

అంతకన్నా మధురమైనది బాబాయి మనసు.

‘‘ఇంకోటిదా తిను, బాగా చదువుకోవాలి కదప్పా, డైటింగ్‌ చేస్తువా ఏమి?’’ అంటూ కొసరి కొసరి వడ్డించేవాడు.

అడిగినవాడికి అడిగినంత సాంబారు పడిపోయేది ఆకులో.

వడ్డించటంలో చూపిన సునిశితత్వం, డబ్బులు తీసుకోవటంలో ఉండేదికాదు.

ప్రత్యేకంగా ఓ కౌంటర్‌ అనిగానీ, గల్లాపెట్టెగానీ, టోకెన్లుగానీ ఏవీ లేవు. అంతా నోటి మాటల్లో ఉజ్జాయింపు లెక్కలే.

‘‘బాబాయి, పది ఇడ్లీలు తిన్నాను. ఇంద పదిహేను రూపాయలు’’ అని వెళ్ళబోయే ముందు ఇచ్చి వెళ్ళేవారు.

తిన్నంత తిని, కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయి ఇవ్వటం మర్చిపోయి వెళ్ళిపోయేవారు కొందరు. ఇంకొందరు సందు చివరిదాకా వెళ్ళి, వెనక్కు వచ్చి ‘‘సారీ బాబాయ్‌, మర్చిపోయాం’’ అంటూ పదో పాతికో ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయేవారు.

ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయిన వారి గురించి ఆందోళనపడి, చింతించి, శాపనార్థాలు పెట్టింది నేనెన్నడూ చూడలేదు. ‘ఉదాసీనో గత వ్యధః’ అన్నట్టు ఉండేవాడు. మొదట మొదట్లో అక్కడి అవ్యవస్థని చూసి నాకు గుండె బేజారెత్తిపోయేది.

‘‘అదేంటి బాబాయ్‌’’ అని ఎవరైనా అడిగితే, ‘‘పిల్లకాయలు ఏదో హడావుడిలో పూడ్సింటార్లేప్పా, వాళ్ళు నాళైకి కండిప్పాగా వస్తురు’’ అని తమిళం కలిపి, మలయాళం యాసలో తెలుగుశ్రోతలకు నింపాదిగా చెప్పేవాడు.

తొంభైతొమ్మిది శాతం ఆయన చెప్పినట్టే అయ్యేది. ఆయనను ఎవరూ మోసం చేయలేదు నాకు తెలిసినంత వరకూ. అక్కడి వాతావరణం ఒక దేవాలయాన్ని తలపించేది. మలయాళంలో భక్తిగీతాలు నిరంతరం స్పీకర్లో మోగుతుండేవి.

ఆయన చొక్కా ధరించి ఉండగా నేను చూసింది లేదింతవరకు. మలయాళీలు ధరించే అంచుపంచె, గంధం బొట్టు, యజ్ఞొపవీతం ఇవన్నీ కలిపి ఓ విధమైన పవిత్రతని ఆపాదించేవి ఆ వాతావరణానికి.

కాంపౌండ్‌లో మిగిలిన కాస్త స్థలంలో మామిడిచెట్టు, వేపచెట్టు, అరటిచెట్లు ఉండేవి. మధ్యాహ్నాలు భోజనాలు కూడా ఇంతే ప్రేమపూరిత వాతావరణంలో సాగిపోయేవి.

తెల్లటి శరీర ఛాయ, రివట లాంటి సన్నటి కాయం, నలభై దాకా ఉంటుంది- అప్పట్లో ఆయన వయసు. అప్పటికే ఆయన భార్య చనిపోయిందట. మళ్ళీ పెళ్ళి చేసుకునే ప్రయత్నమేదీ చేయలేదాయన. ‘పెళ్ళి చేసుకోరాదా ఎవర్నయినా’ అనడిగినవారి వంక అభావంగా చూసి ‘‘వద్దు, తప్పు’’ అని అనేసి మిన్నకుండిపోయేవాడు. వాళ్ళావిడ ఫొటో ఒకటి వేళ్ళాడేది ఓ వెదురు గుంజ పైభాగంలో మేకుకి. దానికి ప్రతిరోజూ పూలదండ మార్చేవాడు. దండ వేసేటప్పుడు ఎంతో శ్రద్ధగా నిలబడి కుర్చీలో, ఆ ఫొటోలోని కళ్ళతో కళ్ళు కలిపి తాదాత్మ్యతకి గురయ్యేవాడు.

ప్రతి పండక్కీ అందరి ఇళ్ళూ తిరిగి కాలనీలోని ప్రతి ఇంటికీ మావిడాకులు పంచి వచ్చేవాడు. ఉగాదికి వేపపూత అదనం.

ఆయన ప్రేమకి ఎల్లలు లేవు. ఆకలికి అలమటిస్తున్న బిక్షగాళ్ళని పిలిచి కడుపునిండా భోజనం పెట్టేవాడు. కళ్ళనిండా ఆకలి నింపుకున్న కుక్కలకి కూడా కడుపునిండా అన్నంపెట్టి ‘దొంగ మొహమా! ముద్దపప్పు పెట్టాడు ఈ బాపనయ్య’ అని తిట్టుకుంటివా ఏమి... తిను తిను’ అని తొందరించేవాడు.

డబ్బులిచ్చే కస్టమర్‌కి ఎంత శ్రద్ధగా పెట్టేవాడో అంతే శ్రద్ధగా ప్రతి జీవికీ తినిపించేవాడు.

నీళ్ళు పోస్తూ చెట్లతో కూడా సంభాషించేవాడు. అతని ప్రేమకి హద్దులు లేవు. హద్దులుంటే అది ప్రేమెందుకవుతుంది- అని ఎదురు ప్రశ్నిస్తాడు. నాకు బాగా గుర్తు- ఓసారి నాకు తీవ్రంగా జ్వరం వస్తే రాత్రంతా రూమ్‌లోనే ఉండి, నాకు సేవలు చేశాడు. నిద్రే పోలేదాయన ఆ రాత్రి. వూరి నుంచి ఓసారి చెక్‌ రావటం ఆలస్యమై, కాలేజీ ఫీజు కట్టడంలో నాకు కాస్త ఇబ్బంది ఎదురైంది. నేనున్నానంటూ బాబాయే సాయం చేశాడు అప్పుడు కూడా.

కుల మతాలకూ, ప్రాంతీయ బేధాలకూ అతీతం ఆయన ప్రేమ. అదొక జీవనది. ప్రవహించినంతమేరా సస్యశ్యామలం చేస్తూ వెళ్ళే నదిలా, తనకు తారసపడే ప్రతి వ్యక్తినీ, వూహు, ప్రతి జీవినీ తన ప్రేమామృతంలో ఓలలాడించటమే బాబాయికి తెలిసిన జీవన విధానం. దానం చేయటమే తప్ప దాచుకోవటం రాదు.

ఈలోగా కాలచక్రం తన పని తాను చేసుకుని పోయింది ఎవరికోసం ఆగకుండా.

మాకు ముగ్గురికీ బెంగుళూరులో ఉద్యోగాలు రావటంతో నగరం విడిచి, ముఖ్యంగా బాబాయిని విడిచి మేము బెంగుళూరు వచ్చేశాం. కాకపోతే ముగ్గురికీ వేరేవేరే కంపెనీల్లో దొరికాయి ఉద్యోగాలు. అంతా ఓ పది కిలోమీటర్ల పరిధిలో ఉంటున్నాం. క్రమంగా ఆయన మా జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోయారు. మళ్ళీ వెళ్ళి కలవలేదెప్పుడూ. అవకాశం రాలేదు అని చెప్పటం సులభం. ‘గుర్తుంచుకుని ఆయనని కలవటానికి వెళ్ళలేదు అదేపనిగా పెట్టుకుని’ అని చెప్పటానికి అహం అడ్డొస్తుంది. అయినా అది వాస్తవం.

ఇటీవల నగరంలో మెట్రోరైలు నిర్మాణానికి స్థల సేకరణలో భాగంగా బాబాయికున్న కాస్త స్థలం పోయిందట. వచ్చిన నామమాత్ర నష్టపరిహారం ఈయన మిగుల్చుకోలేకపోయాడట.

పూలమ్మిన చోట కట్టెలమ్మిన చందంగా... చిన్నతోపుడు బండిపై ఇడ్లీల మెస్‌ నడుపుతున్నాడట.

ఇటీవలే వూరెళ్ళి వచ్చిన మిత్రుడొకరు నా చెవిన ఈ వార్త వేశాడు.

ఏదయినా సాయం చేస్తే ఎలా ఉంటుంది బాబాయికి అని అనిపించింది.

అందుకే మిత్రులతో ఈ సమావేశం.

* * *

అప్పటికే చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరి ఫోన్లూ ఉండుండి రింగ్‌ అవుతున్నాయి. వాళ్ళ శ్రీమతులు కంగారుపడుతున్నారల్లే ఉంది. ఇంత ఆలస్యం ఇటీవల ఎప్పుడూ అవలేదు మరి.

‘‘ఓకే ఫ్రెండ్స్‌, మనం తిరిగి రేపు కలుసుకుందాం. మనం ఏదో రూపంలో బాబాయికి సాయం చేయాలి, సరేనా! మీకేదయినా మంచి ఆలోచన వస్తే మనం దానికి ఓ రూపం ఇద్దాం.’’

‘‘ఓకే’’ వాళ్ళు కార్లలో వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళిపోయాక కూడా నేను అలానే ఆలోచిస్తూ బాల్కనీలో ఉండిపోయాను. ఏపీజే కలాం గారి పలుకులు గుర్తొచ్చాయి. తన ఆత్మకథ ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’లో రాసుకున్నారాయన - తన తల్లిని ఉద్దేశించి- ‘‘అమ్మా, నేను లాంతరు వెలుగులో చదువుకుని, పాఠాలన్నీ వల్లె వేసుకుని, ఆపై లేచి ఆకలితో నీ దగ్గరకొస్తే నా పళ్ళెంలో నీవు వడ్డించిన రొట్టెముక్కలు నా క్షుద్బాధని తీర్చాయి. అవే నా ఆత్మారాముడ్ని శాంతింపజేసి, నాలో ప్రజ్ఞ, మేధస్సు, యోచనాజ్ఞానం వృద్ధి అయ్యేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడింతటి వాడినయ్యాను. నీవు ప్రేమతో పంచిన ఆ ఆహారం లేకుండా ఇంతటి వాడినయ్యేవాడినా?

అమ్మా కృతజ్ఞతలు చెల్లించుకుందామంటే, నీవీ ప్రపంచంలో లేవు...’’

ఆ వాక్యాలు గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది. వూరుగాని వూర్లో మమ్మల్ని అన్నేళ్ళు ప్రేమతో చూసుకున్న బాబాయి మా కృతజ్ఞతలకి పూర్తిగా అర్హుడు. మీదు మిక్కిలి ఆయనకు మా సహాయ సహకారాలు ఇప్పుడు నిజంగా అవసరం. అడగకనే చేసేది నిజమైన సాయం.

తమిళనాడు, కేరళలలో ఒక చక్కటి సంప్రదాయం ఉంది. కాలేజీ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఫేర్‌వెల్‌ పార్టీకి బదులుగా ‘బస్‌ డే’ అని ఒక కార్యక్రమం నిర్వహించుకుంటారు. వీలైనంత ఉదారంగా తామే చందాలు వసూలు చేసుకుని, తమకు సహాయం చేసిన చిన్నచిన్న ఉద్యోగులకు మంచి కానుకలూ, దుస్తులూ కొనివ్వటం, ఐదు నక్షత్రాల స్థాయి హోటల్లో విందు ఏర్పాటుచేయటం ఈ ‘బస్‌ డే’లోని ప్రత్యేకత.

సరైన జీతాలు లేని ఆయాలూ, క్లీనర్లూ, బస్‌క్లీనర్లూ, గార్డెనర్లూ, లాబ్‌ అసిస్టెంట్లూ, వాచ్‌మెన్లూ లాంటి చిన్న ఉద్యోగులను గౌరవించటం ఈ ‘బస్‌ డే’ ముఖ్యోద్దేశం. తిరువళ్ళువార్‌ రాసిన తిరుక్కురళ్‌లో ‘కృతజ్ఞత’ అనే భావాన్ని ఎంతో ఉదాత్తమైనదిగా చెప్పారు. దాన్ననుసరించి వారు ఇలా నిర్వహించుకుంటారు.

అన్ని పండగలూ క్రమంగా విచ్చలవిడిగా మారినట్టే ఈ ‘బస్‌ డే’లు కూడా భ్రష్టుపట్టి ఈవ్‌ టీజింగ్‌లకూ, తాగి తందనాలాడి రోడ్లపై ముష్ఠి యుద్ధాలకూ వేదికలుగా మారాయి. అసెంబ్లీలో ‘బస్‌ డే’లను రద్దు చేయాలని డిమాండ్‌ చేసేవరకూ పరిస్థితులు దిగజారాయి అక్కడిప్పుడు.

నాకెందుకో చప్పున ఓ ఐడియా వచ్చింది. ‘బస్‌ డే’ జరుపుకునే విద్యార్థులు సంపాదనాపరులు కారు. వారే అంత ఉదారంగా విరాళాలు వసూలు చేసుకోగలిగినప్పుడు, ఉద్యోగులందరిని కదిలించి ఒక మంచి పనికోసం నేనెందుకు ఒక పెద్ద మొత్తంలో ఒక నిధిని ఏర్పాటు చేయకూడదు? అంతే! నా అనిశ్చితి తొలగిపోయింది.

మరుసటి ఉదయం నేను చేసిన మొదటి పని, ‘ఒక మంచిమనిషి కోసం సహాయ నిధి’ అని ఒక హుండీ లాంటి పెద్ద డబ్బా తయారుచేశాను. బ్యాంకులో అకౌంట్‌ ఒకటి ప్రత్యేక నిధిగా ఏర్పాటుచేశాను.

నా వంతుగా అందులో ఒక లక్ష జమ చేశాను. మరుసటిరోజు లంచ్‌ టైమ్‌లో మా డిపార్టుమెంట్‌ కొలీగ్స్‌ నందరినీ సమావేశపరిచి విషయాన్ని వివరంగా చెప్పాను. వీలైనంత సహాయం చేయమని అర్థించాను. నా అభ్యర్థనని వీడియో చిత్రీకరణ చేసి ‘యూట్యూబ్‌’లో అప్‌లోడ్‌ చేశాను. వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వీలైనంత విస్తృత ప్రచారం చేశాను. నా చర్యలన్నింటికీ కృష్ణ, స్వరూప్‌లు అడుగడుగునా సహాయపడ్డారు.

సరిగ్గా నెలరోజుల్లో మేము కళ్ళు తిరిగే మొత్తాన్ని జమ చేయగలిగాం. మేమసలు వూహించలేదు అంత మొత్తం సమకూరుతుందని. ఇరవై లక్షలు... మా కళ్ళు చమర్చాయి.

ఒక అవ్యక్తమైన అనుభూతికి గురయ్యాం. ఒక మంచిమనిషిని కాపాడటానికి ఎన్ని చేతులు ముందుకు వచ్చాయి కదా అనిపించింది.

‘ఒక దారి ఉంటేనే మరోదారి పుడుతుంది.

ఒక అడుగు పడితేనే మరో అడుగు పడుతుంది.’

ఎంత చక్కగా చెప్పాడు కవి!

* * *

మొదట బాబాయి మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత గుర్తువచ్చి ఆనందభాష్పాలు రాల్చాడు.

పేరుపేరునా మా బ్యాచ్‌మేట్సందరినీ గుర్తు తెచ్చుకున్నాడు.

అప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే ఆనందంగా ఉన్నాడు ఆయన.

అప్పుడు ఎలా దానాలు చేస్తున్నాడో ఇప్పుడూ అలానే చేస్తున్నాడు. సమస్యలు మనఃస్థితి వల్ల, పరిస్థితి వల్ల కాదు.

అప్పుడు వేలాది రూపాయలు దానం చేసేవాడు. ఇప్పుడు వందల్లో- అంతే తేడా.

‘‘బాబాయ్‌, మాతో వస్తావా?’’ కారు డోరు తెరిచి ఆహ్వానించాం.

‘‘ఎక్కడికప్పా?’’ అంటూ కారెక్కాడు.

అయిదు నిమిషాల డ్రైవ్‌ తర్వాత బాగా రద్దీగా ఉన్న జంక్షన్‌లో ఓ హోటల్‌ ముందు కారాపాం.

ఇంకా ప్రారంభోత్సవం కావటానికి పది నిమిషాలే టైమ్‌ ఉంది. అన్ని హంగులతో, డెకరేషన్‌తో, పూల తోరణాలతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మా క్లాస్‌మేట్స్‌ చాలామందే వచ్చి ఉన్నారప్పటికే. ఇంచుమించు ‘ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌’ లాగుంది.

‘‘ఏమి, మీరు హోటల్‌ దా దీస్తిరా?’’ అన్నాడు బాబాయ్‌.

మేము మౌనంగా తలెత్తి బోర్‌ü్డ చూపించాం.

‘సుందరం నంబూద్రి శాకాహార భోజన ఫలహారశాల’ అని అందమైన అక్షరాలతో రాసి ఉంది.

‘‘అరెరె, వీడెవడో నా పేరుదా పెట్టినాడే. చరి చరి. టీ తాగి పూడుస్తుమా’’ అని అడిగాడు.

మేమంతా ఆయన చుట్టూ చేరి సగౌరవంగా ద్వారం దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన చేతికి కత్తెర ఇచ్చి రిబ్బన్‌ కట్‌ చేయమన్నాం.

ఆయనకేం అర్థంకాలేదు.

లోపలికి తీసుకెళ్ళి కౌంటర్‌లో కూర్చోబెట్టి ‘‘ఇది నీదే బాబాయ్‌’’ అని చెప్పాం.

కౌంటర్‌ టేబుల్‌పైన గ్లాసుపలక కింద భార్య ఫొటో చూసి అప్పుడు ఏడ్చాడు ఆయన. మేమెవ్వరం ఆపలేదు ఆయన్ని. చాలాసేపు ఏడ్చి తెప్పరిల్లి ‘‘గురువాయూరప్పనే! ఎన్నయ్యా ఇదంతా’’ అని ఒకేమాట అన్నాడు.

* * *

ఆయన పేరుతో పెట్టిన ‘సహాయనిధి’కి విరాళాల వెల్లువ ఆగనూ లేదు, బాబాయి దయాగుణం ఆగిపోనూ లేదు.

హోటల్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి వచ్చే ఇన్‌పేషెంట్ల బంధువులందరికీ భోజనం ఉచితం.

ఇలా తన సేవా గుణాన్ని కొత్త పుంతలు తొక్కించాడు బాబాయ్‌.

* * *

‘ధర్మో రక్షిత రక్షితః’

ఇది జరిగిన మూడు నెలలకు మా ఆవిడ అంది ‘‘ఏమండీ, ఇప్పుడు నాకు మూడో నెల.’’

‘గురువాయూరప్పనే’ అనుకోవటం నా వంతయింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.