close
కొండగట్టు రామాయణం!

కొండగట్టు రామాయణం!

అక్కడ, హనుమంతుడు తన భక్తుడికి దర్శనమిచ్చాడు.అక్కడ, సీతమ్మతల్లి కన్నీళ్లు ప్రవహించాయి. అక్కడ, మునులు ఘోర తపస్సు చేశారు. అక్కడ, ఓ వీరుడు రణక్షేత్రంలో నేలకూలాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన క్షేత్రం... కరీంనగర్‌ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం.

శోకవనంలో శోకదేవతలా విలపిస్తున్న సీతాదేవిని హనుమంతుడు దర్శించుకున్నాడు. తాను రామదూతగా వచ్చానని చెప్పాడు. అయినా సీతమ్మ నమ్మలేదు. ఇదేదో రాక్షసమాయ అనుకుంది. సూక్ష్మరూపంలో ఉన్న హనుమ అమ్మవారికి తన విరాట్‌ రూపాన్ని చూపించాడు. అలా పెరుగుతూ పెరుగుతూ నక్షత్రమండలం దాకా విస్తరించాడు. అంతెత్తు మీదున్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని చూస్తున్నప్పుడు ఆ ఘట్టమే గుర్తుకొస్తుంది. కరీంనగర్‌ జిల్లా, మల్యాల మండలంలోని ముత్యంపేట శివారులో ఉందీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఐదు వందల ఏళ్ల క్రితం దట్టమైన అడవుల్లో నారసింహ వక్త్రం(ముఖం)తో ఈ మూర్తి వెలుగుచూసింది.

సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు పరిసరాల్లో పశువుల్ని మేపేవాడు. ఓ రోజు ఆవు తప్పిపోయింది. ఎంత గాలించినా ప్రయోజనం కనిపించలేదు. అలసిసొలసి ఓ చెట్టు కింద సేదతీరాడు. సంజీవుడి కలలో ఆంజనేయుడు ప్రత్యక్షమై ‘బాధపడొద్దు. నీ ఆవు కోరంత పొదల దగ్గర ఉంది’ అని చెప్పడంతో, ఆశగా అటువైపు వెళ్లాడు. కల నిజమైంది. ఆవు కనిపించింది. అదే పొదల మధ్య ఆంజనేయస్వామి విగ్రహమూ దర్శనమిచ్చింది. ఆ మూర్తి చుట్టూ దివ్యతేజస్సు. పల్లె ప్రజల సాయంతో ఆలయాన్ని నిర్మించాడు. స్వామి రూపం మహా అరుదైందని చెబుతారు. ఉత్తరం వైపుగా ఉంటాడు దేవుడు. హనుమంతుడికి ఇరువైపులా శంఖం, చక్రం ఉంటాయి. వక్షస్థలంలో సీతారాముడు కొలువై ఉంటాడు. ఆలయానికి రెండుపక్కలా వేంకటేశ్వరస్వామి, అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడి వెంకన్నను తిరుపతి దేవుడి ప్రతిరూపంగా భావిస్తారు. అంతదూరం వెళ్లలేని భక్తులు ఇక్కడే మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారిని స్వయంభూ మూర్తిగా భావిస్తారు. ఆలయానికి పశ్చిమం వైపున భూతనాథుడైన భేతాళస్వామి క్షేత్రపాలకునిగా పూజలందుకుంటున్నాడు.

రామాయణ గాథలో..
క్షేత్ర పరిసరాల్లో రామాయణంతో ముడిపడిన అనేక ఐతిహ్యాల ఆనవాళ్లున్నాయి. అరణ్యవాసం చేస్తున్న సీతారాములు ఈ ప్రాంతంలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలం నివసించారట. నవరత్న ఖచిత సింహాసనం మీద ఆసీనుడై అయోధ్యను పాలించాల్సిన రాముడు...కటిక నేలమీద కూర్చోవాల్సి రావడం సీతమ్మను కలవరపెట్టింది. కన్నీళ్లు ఏరై ప్రవహించాయి. ఆ ధారతో తడిసిన ఈ ప్రాంతం ‘సీతమ్మ కన్నీరు’గా ప్రసిద్ధమైనట్టు స్థానిక ఐతిహ్యం. ఆలయానికి సమీపంలోనే శ్రీరాముడి పాదుకలతో వెలసిన ఓ గుడి ఉంది. ఆగ్నేయ భాగంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన ధర్మకుండంలో పంచకుండాలు ఉన్నట్టు ఆలయ ఆచార్యులు తిరుక్కోవెల మారుతి చెబుతారు. ముప్ఫై అడుగుల లోతున్న ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ పరిసరాల్లో పురాతన గుహలున్నాయి. పూర్వం ఇక్కడ తాపసులు ఆధ్యాత్మిక సాధన చేసుకునేవారని అంటారు.

అనగనగా...
మూడొందల సంవత్సరాల క్రితం...మానాల గ్రామానికి చెందిన బల్మూరి రఘుపతిరావు, దమ్మక్క దంపతులు సంతాన భాగ్యం కోసం అంజన్నను ప్రార్థించారు. స్వామి కలలో కనిపించి ‘నా అంశగా మీకో బిడ్డ పుడతాడు’ అని వరం ఇచ్చాడు. కొండగట్టు స్వామి ఆశీస్సులతో పుట్టాడు కాబట్టి, కొండలరావు అని పేరు పెట్టారు. పసివాడు చిన్నతనం నుంచీ క్షత్రియ విద్యల్లో ఆరితేరాడు. కత్తి యుద్ధంలో, గుర్రపు స్వారీలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. గుట్ట మీదో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని...జనరంజకమైన పాలన అందించాడు. ఆ ఘన విజయాన్ని చూసి...శత్రువుల కన్ను కుట్టింది. అంతా ఏకమై..దాడికి దిగారు. ఆ పోరాటంలో కొండలరావు సైన్యమంతా నశించిపోయింది. అయినా, ఆ వీరుడు వెనుకంజ వేయలేదు. ఒంటరిగానే యుద్ధం చేశాడు. రానురానూ శత్రువులదే పైచేయిగా మారింది. ఓటమి తప్పదని అర్థమైపోయింది. ఆత్మార్పణకు సిద్ధమయ్యాడు. ప్రాణానికి ప్రాణమైన అశ్వాన్ని అధిరోహించి... కొండ పైనుంచి లోయలోకి దూకాడు. ఆ వీరుడి గురించి స్థానికులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. కొండలరావు దూకిన లోయలోని బండరాయి మీద అశ్వపు డెక్కల గుర్తులు కనిపిస్తాయి.

నిత్యపూజలు..
శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం, కొండగట్టులో నిత్య పూజలు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్‌ జయంతిని చిన్న జయంతిగా పిలుస్తారు. ఆ సందర్భంగా దాదాపు మూడు లక్షల మంది హనుమాన్‌ దీక్షాపరులు స్వామిని దర్శించుకుంటారు. వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే జయంతిని పెద్ద జయంతిగా పిలుస్తారు. ఈ సందర్భంగా భక్తులు దీక్షా విరమణ చేస్తారు, మూడు రోజుల పాటూ యజ్ఞాలు నిర్వహిస్తారు. అనారోగ్య పీడితులూ సంతానం లేనివారూ దేవుడి సన్నిధిలో వ్రతాలు చేస్తారు. ఎక్కడెక్కడి భక్తులో వాహన పూజల కోసం ఇక్కడికొస్తారు.

- జి.చంద్రశేఖర్‌, న్యూస్‌టుడే, మల్యాల

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.