close
భూం... భూం... తివాచీ..!

భూం... భూం... తివాచీ..!

బెడ్‌రూమ్‌లో గొర్రెల మందలా.. హాల్లో మురికి కాలువా...అదేంటీ ఆ సుడిగుండం, అడుగేస్తే అంతే సంగతులా...బాబోయ్‌ ఇదేంటిదీ, ఇల్లా మయసభా... అనిపిస్తోంది కదూ.అదే తివాచీ మహిమ. ఇంట్లోనివారినీ ఇంటికి వచ్చేవారినీ ఆశ్చర్యంలో ముంచెత్తివేసే సరికొత్త గృహాలంకరణ.

కాశీమజిలీ కథలు వినే ఉంటారు. వాటిల్లోని రాజులూ రాజకుమారులతోబాటు మంత్రతంత్రాలు నేర్చిన మాంత్రికుడి పాత్రా సుపరిచితమే. ఆ మాంత్రికుడి దగ్గర మంత్రదండంతోబాటు చాపలా చుట్టిన ఓ తివాచీ కూడా ఉంటుంది. దానికి చాలా జిమ్మిక్కులు తెలుసన్నమాట. ‘ఛూ... మంత్రకాళీ’ అనగానే అది గాల్లో ఎగురుతుంది. రాజకుమారిని బంధించి తెచ్చేస్తుంది. ఆ స్థాయిలో కాకున్నా ఆధునిక తివాచీలు కూడా మనుషుల్ని మాయ చేసేస్తున్నాయి. ఉన్నది లేనట్లూ లేనిది ఉన్నట్లూ భ్రమను కలిగిస్తున్నాయి. అయితే ఇక్కడ మాంత్రికుడు ఎవరో తెలుసా... త్రీడీ కళ. అవునండీ... దీనంతటికీ కారణం త్రీడైమన్షన్‌లో చిత్రించిన బొమ్మల్నీ చిత్రాల్నీ ఆ తివాచీల మీద ముద్రించడమే. గోడలకు అతికించే వాల్‌పేపర్లూ అలంకరించే వస్తువులూ ఫ్లోరింగూ సీలింగులను దాటి ఇప్పుడు తివాచీని సైతం త్రీడీ కళతో కళకళలాడించేస్తున్నారు నేటి గృహాలంకరణ డిజైనర్లు.

ఒకప్పుడు తివాచీ అనేది విలాసవంతమైన రాచకోటలూ లేదా పబ్లిక్‌ భవంతులూ ప్రార్థనాస్థలాల్లో మాత్రమే కనిపించేది. కాలం మారింది. ఇప్పుడు గృహాలంకరణలోనూ తివాచీ భాగంగా మారింది. చలిదేశాల్లో నేల చల్లదనం నుంచి పాదాలను కాపాడుకునేందుకూ, గరుకు నేలలు గుచ్చుకోకుండానూ నేలమీద నేరుగా కూర్చునేందుకూ, అందం కోసమూ... ఇలా తివాచీని ఒక్కోచోట ఒక్కో అవసరం కోసం వాడటం ప్రారంభించారు. ముఖ్యంగా ఇస్లాం సంస్కృతిలో తివాచీ తప్పనిసరి. ప్రార్థన చేసే చోట ఎవరి అడుగుల శబ్దాలూ వినిపించకుండా ఉండేందుకు వీటిని పరుస్తుంటారు. అపార్టమెంట్ల సంస్కృతి పెరగడంతో పిల్లలు ఆడుకున్నా గట్టిగా నడిచినా కిందివాళ్లకు వినిపించకుండా ఉండేందుకు ఈ కార్పెట్ల వాడకం మరింత పెరిగింది. అదీగాక, అద్భుతమైన ఎంబ్రాయిడరీలతో చేసిన ఖరీదైన తివాచీలతోపాటు కాటన్‌, పాలీప్రొపిలీన్‌, నైలాన్‌, పాలియెస్టర్‌... వంటి కృత్రిమదారాలతో చేసిన రకరకాల కార్పెట్లూ తక్కువ ధరలకే మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు కొత్తగా త్రీడీ కళనూ తివాచీల్లో చొప్పించేస్తున్నారు.

లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేయడమే త్రీడీ కళలోని గొప్పదనం. ఈ కళ ద్వారా గోతులూ లోయలూ అగాథాలూ రాళ్లూ సముద్రాలూ జంతువుల బొమ్మలూ అడవులూ ఇలా రకరకాల దృశ్యాలను సహజాతి సహజంగా చిత్రించేస్తుంటారు. అయితే త్రీడీ కళలో ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు గురిచేసే రేఖాగణిత డిజైన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. గీతలూ చతురస్రాలూ చదరాలూ ఘనాలూ ఇలా రేఖాగణిత ఆకారాలను విభిన్న డిజైన్లలో గీయడం వల్లనూ రంగుల్లో వ్యత్యాసం చూపించడం ద్వారానూ కంటిచూపుని ఒకలాంటి భ్రమకు గురిచేస్తారు కళాకారులు. కేవలం కొన్ని వంకర గీతల ద్వారానే ఎత్తుపల్లాలు సృష్టిస్తారు. ఆ డిజైన్లను ఇప్పుడు కార్పెట్ల తయారీలోనూ వాడేస్తూ మాయ చేసేస్తున్నారు. కళ్ల ముందు ఉన్నది నిజం కాదని తెలిసినా, నిజమే సుమా అని నమ్మేంత అద్భుతమైన డిజైన్లతో ఈ త్రీడీ కార్పెట్లు రూపుదిద్దుకుంటున్నాయి. కేవలం త్రీడీ కళలో చిత్రించినవే కాదు, ఎంతో సహజంగా అనిపించే దృశ్యాలను సైతం- అంటే, బొరియలో నుంచి చూస్తోన్న జంతువునీ సాగరగర్భంలోని జీవజాతుల్నీ మ్యాన్‌హోల్స్‌నీ అడవుల అందాల్నీ గులకరాళ్ల సౌందర్యాన్నీ... అన్నింటినీ ఈ డిజిటల్‌ ఫొటో ప్రింటింగ్‌ ద్వారా ఇంట్లోకి తీసుకొచ్చేస్తున్నారు. వాటిమీద మనల్ని నడిపించేస్తూ మాయ చేసేస్తున్నారు. అంతా మాయ... త్రీడీ కళకళలాడినంతకాలం ఇలాంటి మాయలూ భ్రమలూ ఎన్నో..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.