close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ వూళ్లొ ఇళ్లకు తాళం వెయ్యరు

ఆ వూళ్లొ ఇళ్లకు తాళం వెయ్యరు

వూరెళ్లేటపుడు ఇంటికి తాళం వేసి, గేట్లు మూసేసి, పక్కింటి వాళ్లకు ఒకటికి నాలుగుసార్లు చూస్తుండమని చెప్పి బయల్దేరినా ఇంకా దొంగల భయం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ వూళ్లొవాళ్లు తలుపులకు అసలు తాళాలే వెయ్యరు. ఎక్కడికెళ్లినా ఎన్నిరోజులైనా అలా వదిలేసే వెళ్లిపోతారు. అయినా గత పాతికేళ్లుగా అక్కడ ఒక్క దొంగతనం కూడా జరగలేదు.

‘కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది... అని భగవద్గీత చెబుతోంది. అంటే మనం చేసిన పూజల్నే కాదు, పాప పుణ్యాలనూ దేవుడు చూస్తాడు. కాబట్టి, భక్తితో పాటు మంచితనం, నిజాయతీ, క్రమశిక్షణ, మంచి అలవాట్లు ఉన్నప్పుడే దేవుడికి ప్రీతిపాత్రం అవుతాం. మనకు మంచి జరుగుతుంది’ పాతికేళ్ల కిందట ఆ వూరు వచ్చిన గంగానంద మహరాజ్‌ చెప్పిన ఈ మాటల్ని గ్రామస్థులందరూ ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందుకే, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని శ్రీ గురుదేవ్‌ నగర్‌ ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. పేరుకిది మారుమూల పల్లెటూరు. అక్కడుండే వారందరూ గిరిజనులే. చదువుకున్నవాళ్లూ తక్కువే. కానీ ఆ వూరి ప్రజల జీవన విధానం చూస్తే పట్టణప్రాంతాల వాళ్లూ విద్యావంతులూ కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. స్థానిక బాబెర పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ పల్లె జనాభా 250. ఒకప్పుడు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి బతికే వీరికి గంగానంద మహరాజ్‌ శిల్పకళలోనూ శిక్షణ ఇప్పించారు. వీరు తయారు చేసే విగ్రహాలకు ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు, మహారాష్ట్రలోనూ మంచి గిరాకీ ఉంది. వూరూరా తిరిగి శిల్పాలను చెక్కి ప్రతిష్ఠించే గంగానంద మహారాజ్‌ బోధనలకు ఆకర్షితులైన కొందరితో 25 ఏళ్ల కిందట గురుదేవ్‌ నగర్‌ గ్రామం ఏర్పడింది. మొదట్నుంచీ ఆయన చెప్పిందే ఇక్కడి వారికి వేదం. వేరొకరి సొమ్ము కోసం ఆశపడకూడదు, నీతి నిజాయతీలతో ఉండాలి, కష్టపడి పనిచేసుకోవాలి, అనవసరంగా ఇతరులను నిందించకూడదు... అంటూ ఆయన చెప్పిన బోధనలను నిత్య జీవితంలోనూ అమలు చేస్తూ బతుకుతున్నారు. అందుకే, పొరపాటున కూడా ఒకరి వస్తువును వేరొకరు ముట్టుకోరు. ఆ నమ్మకంతోనే వూళ్లొ ఎవరూ తలుపులకు తాళాలు కూడా వేసుకోరు. బయటికెళ్లినా వూరెళ్లినా ఎన్నిరోజులైనా అలాగే వెళ్లిపోతారు. అయినా ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా దొంగతనం జరగలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. దురలవాట్లకూ ఈ గ్రామస్థులు ఆమడ దూరం. మద్యం, గుట్కా, జూదంలాంటి అలవాట్లేవీ ఇక్కడ కనిపించవు. జీవహింసనూ గురుదేవ్‌ నగర్‌ గ్రామస్థులు ప్రోత్సహించరు. వూరు వూరంతా శాకాహారులుగా ఉండడమే అందుకు ఉదాహరణ. పెద్దల మార్గంలోనే పిల్లలు కూడా. ఈ వూళ్లొని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు కోడిగుడ్డు పెట్టరు. దానికి బదులు అరటి పండు ఇస్తారు. ఇది తెలియక కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు ఓసారి గుడ్డును వడ్డించాడట. దాంతో రెండో రోజు నుంచి పిల్లలు బడికెళ్లమని మొండికెయ్యడంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఉపాధ్యాయుడికి అసలు సంగతి తెలియజేశారట.

ఆధ్యాత్మికమే మూలం
గురుదేవ్‌ నగర్‌లోని ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు. అందరూ కలసి గుళ్లొ పూజలూ భజనలూ నిర్వహిస్తారు. తర్వాత ఎవరి పనికి వాళ్లు వెళ్లిపోతారు. పండుగలొస్తే కలసి చేసుకుంటారు. అందుకే, ఆ వూళ్లొ భక్తి భావన తప్ప ఎలాంటి గొడవలూ కనిపించవు. వూరంతా పచ్చగా ప్రశాంతంగా ఉంటుంది. అందమైన విగ్రహాలతోనూ రకరకాల పూల మొక్కలతోనూ కనువిందు చేస్తుంది. అన్నట్లూ గురుదేవ్‌ నగర్‌లో ఎవరూ మొక్కలకున్న పూలను కొయ్యరు. కొత్తవాళ్లక్కూడా తెలిసేలా ఎక్కడికక్కడ పూలను కొయ్యకూడదనీ కోస్తే రూ.500 జరిమానా అనీ రాసున్న చిన్న చిన్న బోర్డుల్ని మొక్కల మధ్య పెడుతుంటారు. ‘మా వూళ్లొ పూసిన ప్రతి పువ్వూ దేవుడికే చెందాలి అనేది మేం పెట్టుకున్న కట్టుబాటు. ఇన్నేళ్లలో మా ఆడవాళ్లుగానీ పిల్లలుగానీ ఎప్పుడూ పూలను కోసింది లేదు. గురువుగారి మాటంటే మాకంత గురి. నిండా పూలున్న మొక్కల్ని చూస్తే మనసుకీ ఆనందమే. పూవుల్లోనూ మేం దేవుడిని చూస్తాం’ అంటాడు స్థానికంగా ఉండే గంగాదాస్‌. ఈ గ్రామస్థులు పెళ్లిలాంటి వేడుకల్ని కూడా కలిసే నిర్వహిస్తారు. దీనివల్ల ఖర్చులూ తగ్గుతాయి, అందరూ కలసి పనులు చేసుకునేందుకూ వీలుంటుందన్నది వీరి భావన. అంతేకాదు, గ్రామంలోని వారందరూ తలో కొంత వేసుకుని జిల్లాలోని పేద గిరిజన జంటలకూ సామూహిక వివాహాల్ని జరిపిస్తున్నారు. ఆర్థికంగా తమ పరిస్థితీ అంతంత మాత్రమే అయినా ఇప్పటి వరకూ 40 జంటలకు మంగళ సూత్రాలూ బట్టలతో పాటు కొత్త కాపురానికి అవసరమైన వంట సామాగ్రిని అందించి పెళ్లిళ్లు చేశారు. రెండేళ్ల కిందటి వరకూ గంగానంద మహారాజ్‌ ఆధ్వర్యంలోనే ఈ సామూహిక వివాహాలూ ఇతర కార్యక్రమాలన్నీ జరిగేవి. ఆయన చనిపోయిన తర్వాత కూడా గ్రామస్థులు అదే మార్గంలో నడుస్తున్నారు. గురుదేవ్‌ నగర్‌ వాసుల ఆధ్యాత్మిక చింతనా, ఆదర్శనీయమైన వూరి కట్టుబాట్లూ నచ్చడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా ఇక్కడికొచ్చి ఇళ్లు కట్టుకుని స్థిరపడుతున్నారు. అలాంటి వూళ్లొ ఉండాలని కోరుకోని వారెవరుంటారు..?

- తేరాల రంజిత్‌, ఈనాడు, ఆదిలాబాద్‌ డెస్క్‌
ఫొటోలు: సూది నరేశ్‌

లోపాన్ని కనిపెడితే లక్షలు బహుమతి!

ఏదైనా వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేయడం, పరాయి వాళ్ల ఆన్‌లైన్‌ ఖాతాలోకి అక్రమంగా ప్రవేశించడం కచ్చితంగా తప్పే. కానీ ఆ తప్పు చేస్తే కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తామంటున్నాయి ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఉబర్‌, స్నాప్‌చాట్‌, అమెరికా డిఫెన్స్‌ అకాడమీ లాంటి అనేక భారీ సంస్థలు. తమ లోపాల్ని సరిదిద్దుకునేందుకు ప్రముఖ సంస్థలు చేస్తోన్న ఇలాంటి ప్రకటనలు కొందరు కుర్రాళ్లకు కోట్లు కురిపిస్తున్నాయి.

మంచితో పాటు చెడు, లాభానికి తోడు నష్టం పక్క పక్కనే ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో మంచి మార్పులకు పునాది వేసిన ఫేస్‌బుక్‌ను అణగ తొక్కాలనీ, భూగోళాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిన గూగుల్‌ను చావు దెబ్బ కొట్టాలనీ, అమెరికా రక్షణ వ్యవస్థను నియంత్రించే వెబ్‌సైట్‌ను అతలాకుతలం చేయాలనీ... ఇలా ప్రపంచాన్ని శాసిస్తోన్న అనేక వెబ్‌సైట్ల పైన దాడి చేయడానికి ప్రయత్నించేవాళ్లు చాలామంది ఉంటారు. ఎంత పటిష్ఠంగా సైట్లను తయారు చేసినా, హ్యాకర్లు ఏదో ఒక రూపంలో వాటిలోకి ప్రవేశించి సమాచారాన్ని దొంగిలించడమో, అవాంఛనీయ మార్పులకు తెరతీయడమో చేస్తున్నారు. అందుకే ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఉబర్‌, స్నాప్‌చాట్‌, సామ్‌సంగ్‌, యాహూ లాంటి దాదాపు అన్ని ప్రముఖ సంస్థలూ తమ వెబ్‌సైట్లు ఎంత భద్రమైనవో తెలుసుకోవడానికీ, తమ దృష్టికి రాని లోపాలేవైనా ఉన్నాయేమో కనుక్కోవడానికీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా మొదలైనవే బగ్‌ బౌంటీ ప్రోగ్రామ్‌లు. ఎవరైనా సరే తమ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసినా, అందులో లోపాలూ, తప్పులూ ఉన్నాయని గుర్తించినా లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తున్నాయి. అలా వచ్చిన సమాచారం ఆధారంగా వెబ్‌సైట్లను మరింత బలంగా తయారు చేసుకుంటున్నాయి.

గతేడాది రూ.18కోట్లు!
ఈ మధ్యే ఫేస్‌బుక్‌ సంస్థ నుంచి కేరళ కుర్రాడు అరుల్‌ కుమార్‌కు ఎనిమిది లక్షల రూపాయల చెక్కు అందింది. అతడు చేసిందల్లా ఫేస్‌బుక్‌లో ఓ చిన్న పొరబాటు ఉందంటూ ఆ సంస్థకు సమాచారం ఇవ్వడమే. ఫేస్‌బుక్‌లో సాధారణంగా ఎవరు పెట్టిన ఫొటోను వాళ్లు మాత్రమే తొలగించగలరు. కానీ అరుల్‌ ఫేస్‌బుక్‌లో ఉన్న ఒక్కో ఆప్షన్‌ను పరీక్షిస్తూ వెళ్లినప్పుడు ఎవరు పెట్టిన ఫొటోనైనా వాళ్ల స్నేహితుల జాబితాలో ఉన్న మరో వ్యక్తి తొలగించే అవకాశం ఉందని గుర్తించాడు. ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌ సిబ్బందికి చెబితే మొదట వాళ్లు నమ్మలేదు. దాంతో అతడు నేరుగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు జుకెర్‌బర్గ్‌ ఖాతాలోకే వెళ్లి అక్కడున్న ఓ ఫొటోను తొలగించడమెలాగో చూపిస్తూ, ఆ ప్రక్రియనంతా వీడియోలో బంధించాడు. ఆ వీడియోతో పాటు ‘నేను ఫొటో ఎలా తొలగించొచ్చన్నది మాత్రమే చూపించాను తప్ప, ఆయన పెట్టిన ఫొటోను తొలగించడం అనైతికం అనిపించి దాన్ని తీసేయలేదు. నేను వివరించిన పద్ధతిలో వెళ్లి చూడండి, ఫొటోను ఎలా తీయొచ్చో తెలుస్తుంది’ అన్న సందేశాన్నీ ఫేస్‌బుక్‌ సిబ్బందికి పంపించాడు. నిమిషాల్లో వాళ్లనుంచి ‘మీరు చెప్పింది నిజమే, ఆ లోపాన్ని సవరిస్తున్నాం’ అంటూ సందేశం అందింది. పది రోజుల తరవాత ఎనిమిది లక్షల రూపాయల చెక్కు కూడా దక్కింది. ఫేస్‌బుక్‌ లాగిన్‌లో ఉన్న లోపాల్ని గుర్తించినందుకు ఇటీవలే బెంగళూరు కుర్రాడు ఆనంద్‌ ప్రకాష్‌ పది లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకున్నాడు. ఇలా గతేడాది తమ వెబ్‌సైట్‌లో ఉన్న లోపాల్ని గుర్తించిన వాళ్లందరికీ కలిపి ఫేస్‌బుక్‌ దాదాపు ఏడు కోట్ల రూపాయలను ఇవ్వడం విశేషం. ఇదే పని చేసినందుకు గూగుల్‌ తన వినియోగదారులకు గతేడాది పద్దెనిమిది కోట్ల రూపాయలు అందించింది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సామ్‌సంగ్‌, ఉబర్‌, హెచ్‌పీ, ఆపిల్‌... ఇలా దాదాపు అన్ని సంస్థలూ నిత్యం లక్షలూ, కోట్ల రూపాయల బహుమతులతో వూరిస్తూ ప్రజలను తమ వెబ్‌సైట్ల పైన దాడి చేయమని ఆహ్వానిస్తున్నాయి.

కొంతమందికి అదే ఉపాధి

అమెరికా రక్షణ విభాగం ఈ నెలలోనే ‘హ్యాక్‌ ది పెంటగాన్‌’ పేరుతో ఓ సవాలు విసిరింది. తమ వెబ్‌సైట్‌లోని లోపాలను కనిపెట్టి చెప్పిన వాళ్లకు అక్షరాలా కోటి రూపాయల బహుమతిని ప్రకటించింది. అదే దేశానికి చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తమ వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేస్తే పది లక్షల మైళ్ల దూరం ప్రయాణాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పింది. గుర్తించిన సమస్య స్థాయిని బట్టి ఐదు లక్షల నుంచి పది కోట్ల రూపాయల వరకూ చాలా సంస్థలు అందిస్తున్నాయి. లోపాల్ని వెతికే పనినే ఉపాధిగా ఎంచుకుని లక్షల రూపాయలు సంపాదిస్తున్న కుర్రాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లలో భారతీయుల సంఖ్యే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. దీని కోసం హ్యాకింగ్‌, ప్రోగ్రామింగ్‌ కోర్సులని చేసేవాళ్ల సంఖ్యా దేశంలో బాగా పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో ‘వైట్‌ హ్యాట్‌ ప్రోగ్రాం, గూగుల్‌లో ‘వల్నరబిలిటీ రివార్డ్‌ ప్రోగ్రాం’, యాహూలో ‘బగ్‌ బౌంటీ ప్రోగ్రాం’... ఇలా ఒక్కో సంస్థ ఒక్కో పేరుతో హ్యాకర్లను ఆహ్వానిస్తోంది. ఎలాంటి సమస్యను కనిపెడితే ఎంత నగదు బహుమతిగా వస్తుందన్న సమాచారాన్ని అన్ని సంస్థలూ తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతున్నాయి. ఎవరైనా సరే ఆ నిబంధనలకు అనుగుణంగా ఎప్పుడంటే అప్పుడు సైబర్‌ దాడిచేయొచ్చు. కోట్ల రూపాయలు కొల్లగొట్టొచ్చు. డబ్బులకూ మీకూ మధ్య కొంత నైపుణ్యం, ఇంకొంత అదృష్టమే అడ్డుగోడ. వాటిని దాటుకొని పోటీని గెలవగలరా మరి..?


పుస్తకమేదైనా ఇక్కడుంటుంది

కలకత్తా మహానగరమనగానే మనకు గుర్తొచ్చేది రవీంద్రుడూ, గీతాంజలీ, హౌరా వంతెన... ఇవేకాదు వాటికి సరితూగే మరో గొప్ప స్థలమూ ఉంది. అదే కాలేజ్‌ స్ట్రీట్‌. రొనాల్డ్‌ భావాలూ, మిల్టన్‌ ఆలోచనలూ, షేక్స్‌పియర్‌ నవలలూ, అరబిందో రచనలూ ఒక్కటనేమిటి... ప్రపంచ సాహిత్యాన్నంతటినీ ఒక్కచోట రాశిపోస్తే అదే ఈ కాలేజ్‌ స్ట్రీట్‌. ప్రపంచంలోనే అతి పొడవైన సెకండ్‌హ్యాండ్‌ పుస్తకాల అమ్మకపు వీధి.

చిన్న స్థాయి పుస్తక ప్రదర్శన పెడితేనే పుస్తక ప్రియులకు పండగలా ఉంటుంది. అదే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ తదితర భారతీయ భాషలూ ఫ్రెంచ్‌, జర్మన్‌, లాటిన్‌లాంటి విదేశీ భాషలన్నింటిలోని పుస్తకాలూ - వందా నూటయాభై ఏళ్ల క్రితం అచ్చేసినవి మొదలు నిన్న మొన్న వెలువడ్డ సంచికలదాకా ఒక్కచోట చేరితే ఇక అది షడ్రసోపేతమైన విందే. కలకత్తా బవు బజార్‌ మొదలుకొని మహాత్మా గాంధీ రోడ్డు వరకూ ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున పరచుకుని ఉన్న ఈ పుస్తక వనం సందర్శన సాహిత్యం పట్ల ఏకాస్త ఇష్టమున్న చదువరులకైనా మరపురాని అనుభూతే!

పుస్తక భాండాగారం
దాదాపు పద్దెనిమిదో శతాబ్దం నుంచే ఇక్కడ పుస్తకాల దుకాణాలు వెలిశాయి. కేవలం వ్యాపారంగా కాదు, పుస్తకాల పట్లా సాహిత్యం పట్లా ఎంతో ఇష్టమున్న వ్యక్తులు ఈ దుకాణాలను తెరిచారు. అందుకే భాష, సాహిత్యం, కవిత్వం, విప్లవాలు, థ్రిల్లర్లు, కాల్పనిక సాహిత్యం, దెయ్యాల కథలూ, ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, నిర్మాణశాస్త్రం, కథలూ, నవలలూ, రాజవంశాలూ, చరిత్ర ఇలా విభిన్న వర్గాలకు చెందిన దాదాపు అన్ని ప్రచురణలూ వీటిలో ఉంటాయి. నేషనల్‌ బుక్‌స్టోర్‌, శ్రీ అరబిందో పఠ్‌ మందిర్‌, దాస్‌గుప్తా అండ్‌కో, చక్రవర్తీ అండ్‌ ఛటర్జీ, బానీ లైబ్రరీలాంటి ప్రఖ్యాత పాత పుస్తకాల దుకాణాలు ఈ వీధిలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని నాలుగో తరం వారూ, మరి కొన్నింటిని ఐదో తరం వారూ నడుపుతున్నారు. వీటిలో శ్రీ అరబిందో పఠ్‌ మందిర్‌ను ప్రత్యేకించి అరబిందో రచనలకు ప్రాచుర్యం కల్పించేందుకే ఉద్దేశించి నడుపుతున్నారు. 1950ల్లో ఆయన సగంలో ఆపిన సావిత్రి రచనా వీళ్ల దగ్గర ఉంది. రవీంద్రనాథ్‌ తొలికాలం నాటి రచనలనూ ఈ వీధిలో పొందొచ్చు. ఫ్రెంచ్‌ తత్త్వవేత్త రొనాల్డ్‌ బార్తెస్‌ రచనలూ, మావో సాంస్కృతికోద్యమ కాలంలో వాటిని పొగుడుతూ బెంగాలీలు ముద్రించుకున్న కరపత్రాలూ, బాల్టిక్‌ జానపద సాహిత్యం ఇలా ఎన్నో రచనలు ఇక్కడ దొరుకుతాయి. నెదర్లాండ్స్‌, దక్షిణాసియా దేశాల్లో సంస్కృతంలో రాసి ఉన్న ఆయుర్వేద పుస్తకాలకు గిరాకీ ఎక్కువ. అమెరికా వాళ్లూ భారతదేశ రాజకుటుంబాలూ, జమీందారుల గురించిన పుస్తకాల కోసం అడుగుతారట. డీహెచ్‌ లారెన్స్‌ రాసిన ‘లేడీ ఛాటర్లేస్‌ లవర్‌’ అనే పుస్తకాన్ని అమ్మకానికి ఉంచినందుకు ఇక్కడి కొన్ని దుకాణాల మీద దాడులు జరిగాయట. అంతేకాదు వాళ్లు దుకాణాల్లోని అమ్మకం దారులను బాగా కొట్టారట కూడా. పుస్తకం మంచిదైనా వివాదాస్పదమైనదైనా పాఠకుల అభిరుచిని బట్టి వాటిని అందుబాటులో ఉంచాల్సిందేనంటారు అక్కడి దుకాణాదారులు. అందుకే ఒక పుస్తకం కోసం కాలేజ్‌స్ట్రీట్‌కు వెళ్లిన ఏ పాఠకుడూ నిరాశతో వెనుదిరిగే అవకాశం ఉండదు.

చదువుల కొలువు
యూనివర్సిటీ ఆఫ్‌ కలకత్తా, కలకత్తా మెడికల్‌ కాలేజ్‌, ప్రెసిడెన్సీ కాలేజ్‌, సంస్కృత కళాశాల, హేర్‌ స్కూల్‌, హిందూ స్కూల్‌లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాలన్నీ ఈ వీధిలోనే ఉన్నాయి. అందుకే పాఠశాల పుస్తకాలు మొదలు వైద్యవిద్యలో అధునాతన పుస్తకాల వరకూ అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. పాఠకులకు సౌకర్యంగా ఉండేలా ‘వర్ణపరిచయ్‌’ పేరిట ఓ పెద్ద పుస్తకాల మాల్‌ నిర్మాణమూ జరుగుతోంది. ఈ వీధిలోని మరో ప్రఖ్యాత స్థలం కలకత్తా కాఫీ హౌస్‌. మేధోపరమైన చర్చలెన్నో ఇక్కడ చోటుచేసుకుంటుంటాయి. ఈసారి కలకత్తా వెళితే ఓ కప్పు కాఫీ, మరో మంచి పుస్తకం... పుస్తకాల గని హౌరానగరిని ఎప్పటికీ తలచుకుంటూనే ఉండేలా... మన పుస్తకంలోనూ ఓ పేజీ రాసుకోవాలి కదూ!