close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ మంచినీళ్ల కన్నా బీరే చౌక..!

అక్కడ మంచినీళ్ల కన్నా బీరే చౌక..!

‘ప్రకృతి అందాలూ చారిత్రక కట్టడాలూ సంప్రదాయ వేడుకలూ వింత నమ్మకాలూ కలబోసిన సుందర సాంస్కృతిక నగరమే జర్మనీలోని మ్యూనిక్‌, బవేరియా రాష్ట్ర రాజధాని...’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు వైజాగ్‌వాసి మాదేటి ఉమ.

ర్మనీలో మ్యూనిక్‌ నగరంలో నివసిస్తోన్న మా అబ్బాయి దగ్గర కొన్నాళ్లు గడిపేందుకు మూడు నెలల వీసామీద బయలుదేరాం. మనదేశంలోని మహానగరాలన్నింటి నుంచీ నేరుగా మ్యూనిక్‌కు విమానం ద్వారా చేరుకోవచ్చు. మేం దిల్లీ నుంచి వెళ్లాం. సుమారు పది గంటల సమయం పట్టింది.

విగ్రహం లోపలకి వెళ్లొచ్చు!
ల్యాండ్‌స్కేపింగ్‌తోనూ నిశ్చలంగా ప్రవహిస్తున్న నదులతోనూ వాటి నుంచి నగరంలోకి చొచ్చుకువచ్చిన నీటిపాయలతోనూ కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది మ్యూనిక్‌ నగరం. ఇక్కడికొచ్చే సందర్శకుల్ని ప్రధానంగా ఆకర్షించేది బవేరియా స్టాచ్యూ. సుమారు 60 అడుగుల ఎత్తులో కంచుతో చేసిన ఈ విగ్రహాన్ని ‘ఫిమేల్‌ ఫిగర్‌ ఆఫ్‌ బవేరియా’గా పిలుస్తారు. 1850వ సంవత్సరంలో కింగ్‌ లుడ్‌విగ్‌ నెలకొల్పిన ఈ విగ్రహం లోపలికి వెళ్లేందుకు మెట్లు ఉంటాయి. తల భాగం దగ్గరకు వెళ్లి విగ్రహం రెండు కళ్ల నుంచీ చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ దగ్గర ఏటా అక్టోబర్‌ ఫెస్ట్‌ ఘనంగా జరుగుతుంది. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం 1810లో ప్రిన్స్‌ లుడ్‌విగ్‌ పెళ్లి ఇక్కడ ఎంతో ఘనంగా జరిగిందట. అప్పట్లో పెళ్లికి 15 రోజుల ముందు నుంచీ రాజుగారి చుట్టాలూ స్నేహితులూ ముఖ్యులూ అంతా బాజాభజంత్రీలతో బీరు బ్యారెల్స్‌తో గుర్రాలమీద వూరేగింపుగా వచ్చి వివాహాన్ని వైభవంగా జరిపించారట. అప్పటినుంచీ దీన్ని ఓ సంప్రదాయంగా మార్చుకుని ఏటా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అక్టోబర్‌ మొదటి ఆదివారానికి రెండు వారాల ముందే ఈ వేడుక ప్రారంభం అవుతుంది. ఆ పదిహేను రోజులూ స్థానికులంతా సంప్రదాయ దుస్తులే ధరించి, బంధుమిత్రులతో కలిసి వేడుకలో పాల్గొంటారు. రాజుల కాలం పోయినా నగరప్రముఖులంతా బ్యాండుమేళాలతోనూ బీరు బ్యారెల్సుతోనూ గుర్రపు బగ్గీలమీదా వూరేగింపుగా తరలివస్తారు. నగర మేయర్‌ పెద్ద బీరు బ్యారెల్‌ని ఓపెన్‌ చేసి వేడుక ప్రారంభిస్తారు. మ్యూనిక్‌ నగరవాసుల్ని బీరు ప్రియులుగా చెప్పవచ్చు. ఈ వేడుకకోసం ప్రత్యేక బీర్‌ టెంట్‌లు వెలుస్తాయి.

దెయ్యం పాదం!
మ్యూనిక్‌ నగరానికి ల్యాండ్‌మార్క్‌ ఫ్రావెన్‌కిర్చె కాథెడ్రల్‌ చర్చ్‌. 358 అడుగుల పొడవూ 130 అడుగుల వెడల్పూ 121 అడుగుల ఎత్తూ పైన రెండు టవర్లతో నిర్మించిన ఈ చర్చిలో 20 వేల మంది కూర్చోవచ్చు. నగరంలోని ఇతర కట్టడాలేవీ దీనికన్నా ఎత్తు ఉండకూడదనే నియమం ఉంది. దీన్ని సిటీ ల్యాండ్‌ మార్క్‌ విత్‌ మిస్టీరియస్‌ ఫుట్‌ ప్రింట్‌గానూ పిలుస్తారు. దీని గురించిన ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ చర్చ్‌ నిర్మాణం పూర్తయ్యేముందు ఓ దెయ్యం వచ్చి దీన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ప్రాంగణం లోపలకు ప్రవేశించిందట. అయితే కిటికీలు లేని చర్చికి ఎవరూ ప్రార్థన చేయడానికి రారని వూహించిన ఆ దెయ్యం, ముఖద్వారం దగ్గర మోపిన పాదాన్ని వెనక్కి తీసుకుని చర్చిని ఏమీ చేయకుండానే తిరిగి నరకానికి వెళ్లిపోయిందట. ఆ పాదం గుర్తు ఇప్పటికీ ఉంది. అదే ఈ చర్చికి ప్రధాన ఆకర్షణ. అయితే విషయం ఏమంటే ఈ చర్చికి కిటికీలు ఉన్నాయి. కానీ అవి ఆ దెయ్యానికి కనిపించలేదని చెప్పుకుంటారు.

ఇంటిని మార్చడానికి వీల్లేదు!
ఒక వారాంతంలో సిటీ సెంటర్‌లో ఉన్న మెరీన్‌ ప్లాజాకు వెళ్లాం. నగరానికి సెంట్రల్‌ స్క్వేర్‌ ఇదే. మేయర్‌ ఇక్కడి నుంచే తన విధుల్ని నిర్వర్తిస్తాడు. నగరంలోని వీధులన్నీ తీర్చిదిద్దినట్లు ఒకే క్రమంలో ఉంటాయి. ఎప్పుడో కట్టిన కట్టడాలయినా ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ ఇంటి నమూనాని మార్చడానికి లేదు. ఒకవేళ ఇంటిని పునర్నిర్మించాలనుకున్నా వెలుపలి నిర్మాణాన్ని అలాగే ఉంచి లోపల ఎంత ఆధునికంగా అయినా నిర్మించుకోవచ్చు. నగరంలో ప్రదర్శనశాలలు చాలా ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది డ్యూచెస్‌. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద టెక్నికల్‌ మ్యూజియంగా చెబుతారు. ఇందులో గాజూ మట్టి వస్తువుల తయారీ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ల పనితీరు వరకూ అనేక విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకోవచ్చు. బీఎండబ్ల్యూకి మ్యూనిక్‌ పుట్టిల్లు. ఇక్కడ ఈ కార్ల తయారీ టవర్‌ చాలా బాగుంటుంది. ఇక్కడే ఓ మ్యూజియం కూడా ఉంది. అందులో ఆ కంపెనీ కార్ల మోడల్స్‌ను ప్రదర్శిస్తారు.

మరోరోజు వెయ్యి ఎకరాల్లో ఉన్న ఇంగ్లిష్‌ ఉద్యానవనానికి వెళ్లాం. ప్రపంచంలోని అతిపెద్ద పార్కుల్లో ఇదొకటి. దీన్ని మ్యూనిక్‌ గ్రీన్‌ హార్ట్‌గా పిలుస్తారు. దీన్ని న్యూయార్క్‌లోని సెంట్రల్‌పార్కు, లండన్‌లోని హైడ్‌ పార్కులతో పోలుస్తారు. ఇందులోకి ప్రవేశం ఉచితం. ఇందులో సరస్సులూ బీర్‌ ఉద్యానవనాలూ అనేకం ఉంటాయి.

తరవాత చూడదగ్గది మ్యూనిక్‌ రెసిడెంజ్‌. ‘ద ట్రూ హార్ట్‌ ఆఫ్‌ బవేరియా’గా పిలిచే ఈ కోట రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతింది. ఎంతో వ్యయప్రయాసలతో మళ్లీ దానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారట. తరవాత నింఫెన్‌బర్గ్‌ ప్యాలెస్‌కి వెళ్లాం. గతకాలపు చక్రవర్తులు దీన్ని వేసవి విడిదిగా వాడుకునేవారట. ఇందులో రాజకుటుంబీకులు వాడిన వస్తువులూ దుస్తులూ అన్నీ ప్రదర్శనకు ఉంచారు. చనిపోయిన రాజకుటుంబీకుల అస్థికల్ని ఫ్రేముల్లో భద్రపరిచి ప్రజల సందర్శనార్థం ఉంచడం ఆశ్చర్యం కలిగించింది.

ఇంకో రోజు ఒలింపియా పార్క్‌కి వెళ్లాం. ఇక్కడ స్టేడియం, అందమైన ఉద్యానవనాలూ కలిసి ఉంటాయి. ముఖ్యంగా స్టేడియం రూఫ్‌ నిర్మాణం ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ నిర్మించిన పార్కుల్లో స్థానికులు నడుస్తూ సేదతీరతారు. ఈ నగరం ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌కీ ప్రసిద్ధి. అలియాంజ్‌ ఎరీనా ఫుట్‌బాల్‌ స్టేడియం కూడా చూడ్డానికి బాగుంటుంది.

సైక్లింగ్‌ ఎంతో ఇష్టం!
నగరవాసులు కార్లున్నా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుని ఉపయోగించుకోవడానికే ఇష్టపడతారు. ట్రామ్‌, బస్సు, అండర్‌ గ్రౌండ్‌ రైళ్లూ అన్నింటిలోనూ ప్రజలు ప్రయాణిస్తారు. అవి ఒక్క సెకను కూడా ఆలస్యం కావు. వేసవిలో అయితే నగరవాసులు సైకిల్‌మీదే ఎక్కువగా ప్రయాణిస్తారు. వేసవి రాగానే చాలామంది రోజుకి 50 నుంచి 60 కిలోమీటర్లుదాకా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తుంటారు. వీళ్లలో వృద్ధుల సంఖ్యే ఎక్కువ. బవేరియన్లకి ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువ. అందుకే సమయాన్ని పట్టించుకోకుండా ఎక్కువగా నడవడం, సైక్లింగ్‌ చేయడం చేస్తుంటారు. వారం రోజుల పసివాళ్లని సైతం స్ట్రోలర్‌లో వాకింగ్‌కి తీసుకువెళుతుంటారు. చిత్రంగా ఇక్కడ కవలలు ఎక్కువగా కనిపిస్తారు. పెద్దవాళ్లు కూడా వీల్‌ ఛెయిర్లలో తిరుగుతూ షాపింగ్‌ చేస్తుంటే మాకెంతో ఆశ్చర్యం కలిగింది.

ఇక్కడి ఇసార్‌ నది అందాల్ని ఆస్వాదించి తీరాల్సిందే. నగరమంతా పాయలుపాయలుగా ప్రవహించే ఈ నది ఒడ్డున పచ్చని ఉద్యానవనాల్నీ పిల్లలు ఆడుకునే పార్కుల్నీ ఏర్పాటుచేశారు. నడవడానికీ సైక్లింగ్‌ చేయడానికీ ఎంతో అనుకూలంగా ఉంటాయివి. ఇక్కడ రోడ్లను వేసేటప్పుడే రోడ్డుకి ఇరువైపులా నడకకీ సైక్లింగ్‌కీ వేర్వేరుగా రెండు సన్నని రోడ్లని కూడా నిర్మిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప హారన్‌ మోత వినిపించదు. ఎక్కడా వాయు కాలుష్యం ఉండదు. అందుకే ఎంత నడిచినా అలసట అనిపించదు.

మ్యూనిక్‌ నగరంలో ఏ మూలకు వెళ్లినా పచ్చని ప్రకృతి నవ్వుతూ పలకరిస్తుంది. ప్రజలు ప్రకృతి ప్రేమికులు. పర్యావరణాన్ని ఎంతో ప్రేమిస్తారు. అందుకే జాగ్రత్తగా కాపాడుకుంటారు.

లేక్‌ కోమో!
మరో వారాంతంలో మేం మ్యూనిక్‌ నుంచి ఇటలీలోని లేక్‌ కోమో అందాలు చూడ్డానికి కారులో బయల్దేరాం. దారి పొడవునా ప్రకృతి అందాలు చూస్తూ పులకించిపోయాం. మ్యూనిక్‌ దాటి ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ మీదుగా లేక్‌ కోమోకి ఆరుగంటల్లో చేరుకున్నాం. ఇది స్విట్జర్లాండ్‌, ఇటలీ సరిహద్దుల్లో ఉంది. మేం అక్కడికి చేరేసరికి భారీ వర్షం. సరస్సు చుట్టూ ఎత్తయిన కొండలు. ఆ కొండల్లోని మలుపుల్లో ఘాట్‌రోడ్డుమీద వర్షంలో వెళుతుంటే గుండె జారినంత పనయింది. మేం బస చేసిన చోట కిచెన్‌లో సామగ్రి అన్నీ ఉన్నాయి. సరుకులు తీసుకెళ్లి కావలసినవి వండుకోవచ్చు. కొండమీద మేం బస చేసిన ఇంటినుంచి సరస్సు అందాలు చూస్తూ మైమరిచిపోయాం. కొండ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ఫెర్రీల్లో వెళ్లేవాళ్లం. బోట్‌ ట్యాక్సీలు కూడా ఉంటాయి. ఫెర్రీల్లోకి కార్లతోనే ఎక్కేయవచ్చు. మేం మా కారుతోనే కోమో నగరానికి వెళ్లాం. ఈ సరస్సు ఒడ్డున ఉన్న పెద్ద నగరం ఇదే కాబట్టి దీన్ని ఆ పేరుతో పిలుస్తారు. అక్కడ చాలా పెద్ద చర్చి ఉంది. పూర్వం సంపన్నులు ఈ సరస్సు దగ్గరకి వచ్చి గడిపేవారట. దీని అందాలను చూసేందుకే ఇక్కడ కొందరు విల్లాలూ కట్టించుకున్నారు. అవే ఇప్పుడు పర్యటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిల్లో గడపాలంటే రోజుకి పది లక్షల రూపాయల పైనే. ఈ సరస్సు వై ఆకారంలో ఉంటుంది. నాలుగు రోజులపాటు ఆ సరస్సు అందాలను తనివితీరా ఆస్వాదించాం.

ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు...
జర్మనీలో పర్యటించడానికి మూడునెలల వీసా ఉంటుంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ అనుకూలం. అది వాళ్లకు వేసవి. మనకు చూడ్డానికి బాగుంటుంది. మిగిలిన కాలాల్లో వర్షాలూ చలీ రెండూ ఎక్కువే. అవి ఎంత విపరీతంగా ఉన్నా దైనందిన జీవనానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాగిపోయేలా వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడకు వెళ్లినా జర్మన్లు చీరలో ఉన్న నన్ను చూసి ఆప్యాయంగా పలకరించేవారు. మనదేశం అంటే వాళ్లకు చాలా ఇష్టమని చెప్పేవారు. మీకు మ్యూనిక్‌ నచ్చిందా అని అడిగేవారు. వాళ్లు అలా అడగడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

శనివారం ఐదారుగంటలకే షాపులు మూసేస్తారు. ఆదివారం అస్సలు తెరవరు. అక్కడివాళ్లు ఎక్కువగా బేక్‌ చేసిన ఆహారాన్నే తింటారు. అందుకే వాళ్ల షాపుల్లో అవే ఎక్కువగా ఉంటాయి. అయితే మన ఇండియన్‌ దుకాణాల్లో చీపురుకట్ట నుంచి వేపాకుల వరకూ ప్రతీదీ దొరుకుతుంది. జర్మన్లు సైతం మన భారతీయ రెస్టారెంట్లకి ఎక్కువగా వస్తుంటారు. ఇష్టంగా తింటుంటారు. వాళ్ల ప్రధాన పంటలు మొక్కజొన్న, బంగాళాదుంప, గోధుమలు, బార్లీ. మనకి మంచినీళ్లు ఎలాగో వాళ్లకి బీర్‌ అలాగన్నమాట. నీళ్లకన్నా అదే అక్కడ చౌక. అక్కడ మేం గమనించిన మరో ముఖ్యవిషయమేమంటే భయం, దొంగతనం అనేవి అస్సలు ఉండవు. ఆఫీసులో మహిళలకు అనుకోకుండా ఆలస్యమైనా అర్ధరాత్రి దాటినా భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా ప్రయాణిస్తారు. అక్కడ డే కేర్‌ నుంచే పిల్లలకి విజ్ఞాన, వినోదయాత్రలు నిర్వహిస్తుంటారు. మేం పదేళ్ల క్రితం జర్మనీకి వెళ్లినప్పుడు భాష సమస్య ఎక్కువగా ఉండేది. విమానాశ్రయాల్లో షాపుల్లో ఎక్కడా జర్మన్‌ తప్ప ఇంగ్లిష్‌ అస్సలు మాట్లాడేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు చాలాచోట్ల ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందీ లేకుండా హాయిగా విహరించి రావచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.