close
రెండోవాడు

రెండోవాడు
- తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం

సుభద్రమ్మ గారికి జ్వరం వస్తోందని తెలిసి వాళ్ళింటికి వెళ్ళాను. తన గదిలో మంచం మీద నీరసంగా పడుకుని ఉందావిడ. వయసు ఎనభై పైమాటే. అలాగని ఆవిడ ‘వుస్సు’ ‘అస్సు’ అంటూ మూలుగుతూ ముక్కుతూ ఒకచోట కూర్చునే మనిషి కాదు.

పొద్దున్నే ఆరింటికల్లా లేచి, దంతధావనాది పనులు ముగించుకుని, స్నానం చేసి వచ్చి ఇంటి ముందర ఉన్న మందార, నందివర్ధనం, గన్నేరు మొక్కల మధ్యన తిరుగుతూ సుప్రభాతం, లింగాష్టకం, ఆదిత్య హృదయం పఠిస్తూ దేవుడి పూజకు పూలు కోసుకుంటుంది.

అత్తగారి గొంతులో మధురంగా ధ్వనించే స్తోత్రాలు వింటూ నిద్రలేచి రోజువారీ పనులలో పడుతుంది ఆమె పెద్దకోడలు రమ. రమ కాఫీ డికాక్షను దింపి, పాలు కాచి కాఫీ కలిపి తెచ్చేసరికి సుభద్రమ్మ గారి పూజ పూర్తవుతుంది.

వాళ్ళ ఇల్లూ మా ఇల్లూ పక్కపక్కనే ఉండబట్టి కొన్నేళ్ళుగా వాళ్ళ దినచర్య నాకు సుపరిచితం.

కాఫీ తాగడం ముగించాక చాలామంది ముసలివాళ్ళు చేసేపని కాసేపు నడుము వాల్చడం. కానీ సుభద్రమ్మ గారు అందరిలాటి వారు కాదు. కొడుకుకంటే ముందు ఆవిడ పేపరు చదివేస్తుంది.

ఆవిడ పెద్దకొడుకు శేషఫణి, స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాడు. అతను స్కూలుకు బయల్దేరేలోపు వంట ముగిస్తుంది రమ. తొమ్మిదిన్నరకు నాలుగు మెతుకులు తిని స్కూలుకు వెళ్తే మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చాకే శేషఫణి ఏమైనా తినేది. మధ్యలో స్కూల్లో కాఫీ మాత్రం తాగుతాడట. మావారూ అదే స్కూల్లో పని చేస్తుండబట్టి ఈ విషయం నాకు తెలిసింది.

సుభద్రమ్మ గారు కూడా కొడుకుతోబాటే అన్నం తినేస్తుంది. ఆవిడా అంతే మధ్యాహ్నం కాఫీ తప్ప ఇంకేమీ ముట్టుకోదు.

ఆ రోజుల్లోనే అంటే ముప్ఫై నలభై ఏళ్ళకిందటే ఆవిడ ఉద్యోగం చేసేదిట. ఆడపిల్లల హాస్టల్లో మేట్రనుగా చేసిందట. అంతమంది గడుగ్గాయిలను అజమాయిషీ చేసి అలవాటైపోయి ఇంట్లో కూడా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలి మీద క్రమశిక్షణ రుద్దుతుంటుంది.

నిజం చెప్పాలంటే ఆవిడ కోడలు రమ ఈ కాలం మహిళ కాదు. హక్కులు, సమానత్వం, అణచివేత లాటి వూతపదాలు తనకు నచ్చవు. నేనెప్పుడైనా కాస్త దూకుడుగా ఏ విషయమైనా మాట్లాడితే చాలా సౌమ్యమైన పరిష్కారం చూపిస్తుంది.

తను అలా మెతగ్గా ఉండబట్టే తన మంచితనం ఎవరూ గుర్తించడం లేదంటాను నేను.

ఇంతకీ సుభద్రమ్మ గారిని పరామర్శించడానికి వచ్చినా నిజానికి సానుభూతి చూపాల్సింది రమకని నా అభిప్రాయం.

నన్ను చూడగానే మంచంమీద లేచి కూర్చున్నారు సుభద్రమ్మగారు.

‘‘ఒంట్లో ఎలా ఉంది పిన్నీ, జ్వరం తగ్గిందా, నీరసం రాకుండా కాస్త పళ్ళరసం లాటివి తీసుకుంటున్నారా?’’ అంటూ కుశలప్రశ్నలు వేసి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను.

పది నిమిషాల్లో రమ నాకోసం కాఫీ తీసుకువచ్చింది.

‘‘తగ్గినట్టే ఉందమ్మా... వయసుతోబాటు వచ్చే మార్పులు అంగీకరించక తప్పదు కదా! బీపీ కాస్త ఎక్కువగానే ఉంటోంది, మాత్రలు వేసుకుంటున్నాను. వచ్చే నెలలో మా రెండోవాడు బొంబాయి నుండి వస్తాడు కదా... దగ్గరుండి అన్ని పరీక్షలూ చేయిస్తాడు. ఇదిగో ఈసారి మోకాళ్ళ నొప్పికి ఆపరేషను కూడా చేయిస్తానన్నాడు’’ అన్నదావిడ, రమ అందించిన పళ్ళరసం గ్లాసు అందుకుంటూ.

నేను రమ ముఖంలోకి చూశాను- తను నొచ్చుకుందేమో అని. అన్ని విషయాల్లో ఆధునికంగా ఆలోచించే సుభద్రమ్మగారు ఎందుకో మరి అచ్చమైన అత్తగారిలాగే ప్రవర్తిస్తారు ఒక్కోసారి.

ఇన్నేళ్ళుగా ఆవిడను దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నది పెద్దకొడుకూ, కోడలూ అయినా దూరంగా ఉన్న రెండోవాడి గురించే ఆవిడ పొగడ్తలు.

‘‘ఈ ఇల్లు వాళ్ళ తాతగారిది. దీంట్లో మా రెండోవాడికీ హక్కు ఉంది కదా! ‘అమ్మేసి చెరి సగం తీసుకోండి’ అని నేనే అన్నా కూడా రెండోవాడు ఒప్పుకోలేదు. ‘అన్నయ్యా, నువ్వూ ఉంటున్నారు కదా... ఇందులో నాకేమీ వాటా వద్దు. దేవుడు నాకు మంచి సంపాదన ఇచ్చాడు చాలు’ అన్నాడు. ఈ కాలంలో ఎందరు అన్నదమ్ములు ఇంత మంచితనం చూపిస్తారు చెప్పు. ఆస్తి కోసం తల్లిదండ్రులు బతికి ఉండగానే కొట్టుకు చస్తున్నారు కదా... ఎంతైనా మా రెండోవాడి తీరే వేరు’’ అని నా దగ్గరే చెప్పుకుంది ఇదివరకోసారి- అదీ రమ ముందరే.

రమ నేరుగా నాతో ఏమీ చెప్పకపోయినా నేను మా అత్తయ్య ద్వారా విన్నదేమంటే సుభద్రమ్మగారి రెండోకొడుకు చదువు కోసం వాళ్ళ పిత్రార్జితం రెండెకరాల భూమి అమ్మేశారట. నిజానికి తమ్ముడి పైచదువులు సజావుగా సాగాలనే శేషఫణి గారు డిగ్రీతో ఆపేసి, టీచరు ట్రైనింగ్‌ చేశారట.

రమ, అత్తగారి మాటల గురించి ఎప్పుడూ ఏమీ అనగా వినలేదు నేను. మా అత్తయ్యా, నేనూ గొడవలు లేకుండా ఉన్నామంటే మా విషయం వేరు. ఆవిడ మా మేనత్తే. అదే అభిమానం చూపిస్తుంది ఇప్పటికీ. పైగా మా ఆయన ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఇంకొకరితో పోలికలూ, తేడాల గురించి మాటపడాల్సిన పనిలేదు నాకు.

నేను కాపురానికి వచ్చిన ఈ పన్నెండేళ్ళుగా పక్కనే ఉండి చూస్తున్నాను నేను. రమ తన పిల్లలతో సమంగా ఆవిడనూ ఆదరిస్తుంది. సుభద్రమ్మగారికి అప్పుడప్పుడూ ఉన్నట్టుండి బీపీ ఎక్కువైపోవడం, అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా శేషఫణిగారూ, రమా ఆవిడను డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళడం చూస్తూనే ఉన్నాను.

ఒక్కోసారి రెండుమూడు రోజులు ఆస్పత్రిలో ఆవిడను ఉంచాల్సి వచ్చినప్పుడు రమ పడేపాట్లు నాకు తెలుసు. ‘‘దూరాభారం వలన రెండోవాడు రాలేడు పాపం’’ అంటుందావిడ. సుభద్రమ్మగారు ఎక్కడో ముంబైలో ఉండి, ఏడాదికోసారి వచ్చి చూసివెళ్ళే రెండోవాడికి తనమీద ఎక్కడలేని ప్రేమాభిమానాలు ఉన్నట్టూ, అతనే తనకు అన్నీ చేస్తున్నట్టూ మాట్లాడుతుంటారు.

‘‘సరే నేను వస్తానండీ’’ అంటూ లేచాను.

‘‘ఆ బల్లమీద నా కళ్ళద్దాలున్నాయి ఇలా ఇచ్చిపోమ్మా. పడుకుని విసుగుపుడుతోంది. కాసేపు టీవీ చూస్తాను’’ అన్నారు సుభద్రమ్మగారు.

అద్దాలు ఆవిడకందించగానే ‘‘కంటిచూపు పవరు మారినట్టుంది... ఈసారి మా రెండోవాడు వచ్చినప్పుడు కంటి డాక్టరు దగ్గరకు కూడా తీసుకువెళ్ళమంటాను’’ అన్నదావిడ.

ఇంట్లో ఉన్న రెండుగదుల్లో ఒకటి సుభద్రమ్మగారిది. అందులో టీవీ ఉంది. పక్కనే ఆనుకుని స్నానాలగది కట్టించారు. మరోగది రమ దంపతులది. పెరుగుతున్న పిల్లల కోసం మరొక గది వేయించాలని రమ ఎంతగానో అనుకుంటున్న విషయం మాకు తెలుసు. ఆ ఆలోచన సాకారం కాకపోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమనీ తెలుసు.

ఈసారి చూద్దామనుకుంది. కానీ పైనెలలో మరిదీ, తోటికోడలూ, పిల్లలూ వస్తున్నారని పక్కకు పెట్టింది ఆ తలపు. వచ్చిన వాళ్ళకు మర్యాదలూ, బట్టలు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి మరి.

అనుకున్నట్టుగానే మరో నెల్లాళ్ళకు సుభద్రమ్మగారి రెండోకొడుకు భార్యా పిల్లలతో దిగాడు. అతని భార్య రమకంటే ఎక్కువ చదువుకున్నదే కాదు గడుసుది కూడా. అత్తగారికి పట్నం కోడలు ఇబ్బందిపడకూడదన్న ఆరాటం.

‘‘ఇదిగో రమా, ఈ పదిరోజులూ మీ గది వాళ్ళకిస్తావేమో కదా... కాస్త కిటికీలకు వట్టివేళ్ళ పరదా కట్టించు. ఇక్కడి వుడకపోత సుధ తట్టుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఏసీలు ఉన్నాయి అన్ని గదులకీ’’ అనీ ‘‘ఆ పిల్లలకి అస్తమానం ఇడ్లీలూ, ఉప్మాలూ పెట్టకమ్మా... వాళ్ళకు నచ్చవు. ఆ పీజాలు, బర్గర్లూ లాటివి తెప్పించు’’ అనీ రమకు సూచనలు ఇస్తూ ఉంటుందావిడ.

ఇవన్నీ పక్కనే ఉన్న నాకు రమ ద్వారా మాత్రం తెలియవు. ఎందుకంటే ఇంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడదు తను. పిల్లల మాటల వలన మాదాకా విషయాలు వస్తాయి. చిన్నన్నయ్య వచ్చాడని సుభద్రమ్మగారి కూతురు ఆదోని నుండి వచ్చింది.

తనని పలుకరించడానికి నేను వెళ్ళానోరోజు- పనిలోపని మిగతా చుట్టాలనీ చూసి రావొచ్చని. ఇంట్లో అత్తయ్య చేసిన బేసన్‌ లడ్డు తీసుకెళ్ళాను పిల్లల కోసం.

‘‘రామ్మా... మీ అత్తయ్య ఇంకా ఓపికగా వండుతోంది. పాపం మా రెండోవాడు ఏడాదికోసారి వస్తాడు. వాడికి ఇష్టమైనవి చేసిపెడదామంటే నాకు ఓపిక ఉండొద్దూ? ఇదిగో నా రెండో కోడలు సుధ... కొత్తకొత్త వంటలు నిమిషాల్లో చేస్తుంది. ఈ వయసులో ఇంత జరీచీరలు నాకెందుకు చెప్పు? వద్దంటే వినరు. ప్రతిసారీ తీసుకువస్తారు’’ సుభద్రమ్మగారు చీర తీసి చూపించారు.

రమ వచ్చి అత్తగారి బట్టలూ, ఉతికి మడతపెట్టినవీ మంచం పక్కనే ఉన్న అలమారలో పెట్టింది. ఆవిడ కాళ్ళ దగ్గర కుప్పగా పడి ఉన్న దుప్పటి తీసి మడిచిపెట్టింది.

‘‘పిల్లలకు మీరు తెచ్చిన లడ్డూలు భలే నచ్చాయి’’ అంది సుధ లోపలికి వచ్చి.

రమ, సుధ మధ్యాహ్నం కాఫీ, ఫలహారం చేయడానికి వంటింట్లోకి వెళ్ళాక గదిలోకి వచ్చింది శేషఫణిగారి చెల్లెలు శోభ. ఇంటి ఆడబడుచునని మర్యాదలూ పెట్టుపోతలూ ఆశించదు శోభ. పెద్దన్నగారి ఆర్థిక పరిస్థితి తెలుసు. ఇంకా తనే పిల్లలకి బట్టలు అవీ తెస్తుంది. వదిన రమ అంటే తనకు ఇష్టమని ఆమె మాటల్లో అర్థమైపోతుంది.

లోపలికి రాగానే గది తలుపు దగ్గరగా వేసింది శోభ.

నేను వెళ్ళడానికని లేచాను. ‘‘ఫరవాలేదు కూర్చో అక్కయ్యా... నువ్వూ మాకు పరాయిదానివి కావులే’’ అంది శోభ. తల్లి దగ్గరగా వెళ్ళి ఆవిడ పక్కనే కూర్చుంది.

‘‘అమ్మా, నేనొక మాట అడుగుతాను. ఏమీ అనుకోకు. ఎందుకమ్మా ఎప్పుడూ పెద్దన్నయ్య, రమ వదిన ముందు మా ‘రెండోవాడు’ అంటూ చిన్నన్నయ్యను పొగుడుతుంటావు? పాపం, పెద్దన్నయ్య నీకేం తక్కువ చేశాడు? రమ వదిన నిన్ను తల్లిలా ఆదరిస్తుంది. నీకు ఏ విషయంలోనైనా తక్కువ చేశారా వాళ్ళు? నీ ఆరోగ్యం గురించి తాత్సారం చేశారా? నీకు అన్నీ చిన్నన్నయ్యే చేస్తున్నట్టు అందరిముందు మాట్లాడతావు, వదిన మంచిది గనుక పైకి ఏమీ అనదుగానీ, మనసులోనైనా నొచ్చుకోదూ? నువ్వు చిన్నన్నయ్య ఇంట్లో ఉన్నదెన్నాళ్ళు? వాళ్ళు నిన్ను చూసిందెంత? ఎన్నో ఏళ్ళుగా... నాన్న పోయినప్పటి నుండీ నిన్ను దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నది పెద్దన్నయ్యే కదా! తనకి డబ్బు ఇబ్బందులున్నా నువ్వే ఇస్తానన్నా నీ పెన్షను డబ్బు ముట్టుకోడు. దాంతో నువ్వు నాకూ, చిన్నన్నయ్యకూ ఏవో కొనిపెడతావు. ఒక్కసారి ఆలోచించమ్మా... నిన్ను నొప్పిస్తే క్షమించు. మా అందరికన్నా ఎంతో లోకం చూసినదానివి. నీకు చెప్పేంతదాన్ని కాదు’’ గుక్క తిప్పుకోకుండా ఎన్నాళ్ళుగానో తన మనసులో మెదులుతున్న బాధను కక్కేసింది శోభ.

నేను బిత్తరపోయి చూస్తున్నాను. ఇదంతా నాముందు మాట్లాడ్డం నాకు చాలా మొహమాటంగా ఉంది. కానీ ఒకవైపు ఇన్నాళ్ళకైనా కూతురి ద్వారా ఆవిడ తప్పు తెలుసుకుంటే మంచిదే అన్న సంతోషమూ కలిగింది.

సుభద్రమ్మగారు కాసేపు మాట్లాడలేదు. తరవాత నెమ్మదిగా అన్నారు- ‘‘నిజమే శోభా, మొదటి నుండీ ఇంటి బాధ్యతలూ బరువులూ నెత్తిన వేసుకుని మోస్తున్నది మీ పెద్దన్నయ్యే. ఆ బాధ్యత వలనే వాడు పెద్ద చదువులు చదువుకోలేకపోయాడు. నువ్వన్నట్టు... ఇన్నేళ్ళుగా ఏనాడూ నా మనసు నొచ్చుకునే ఒక మాట కూడా అనకుండా నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు మీ పెద్దన్నా, వదినా. ఈ మాట నీకూ నాకే కాదు, చుట్టుపక్కల అందరికీ, మన బంధువులకూ కూడా తెలుసు. వాళ్ళంతా రెండోవాడి గురించి ఏమనుకుంటారో అని నా భయం. వాడు అందరికీ దూరంగా తన బతుకు తాను బతుకుతున్నాడు. తల్లినీ చెల్లినీ పట్టించుకోడనీ, పెళ్ళాం పిల్లలే తన లోకమనుకునే స్వార్థపరుడనీ వాడిని గురించి ఎవరైనా అనుకోవడం నేను భరించలేను. అందుకే పదేపదే వాడు చేసిన గోరంత సేవ అయినా గొప్పగా చెప్తుంటాను. నేను గొప్పగా చెప్పినా చెప్పకపోయినా మనవాళ్ళందరికీ మీ పెద్దన్నయ్య ఎంత మంచివాడో తెలుసు. కానీ, రెండోవాడిని బాధ్యత లేనివాడనీ, అక్కరకు రానివాడనీ అనుకోకూడదనే నేను వాడిని పొగడడానికి కారణం. నేను రెండోవాడి గురించి గొప్పగా మాట్లాడితే అందరూ నా గురించి చెడ్డగా అనుకుంటే అనుకోవచ్చుగానీ... మీ పెద్దన్నయ్యా, వదినా గురించి ఇంకా మంచిగా అనుకుంటారు... ‘ఈవిడ ఇంత పక్షపాతం చూపిస్తున్నా వాళ్ళిద్దరూ పాపం నోరెత్తరు’ అని, అంతేగా. తల్లిగా నాకు మీ ముగ్గురూ సమానమే. మీలో ఎవరి గురించీ ఇరుగుపొరుగూ, బంధువులూ చెడుగా అనుకోకూడదనే నా తాపత్రయం. అంతేగానీ, నాకు రెండోవాడు ఎక్కువా కాదు, పెద్దవాడు తక్కువా కాదు’’ అంది. గుండెభారం కళ్ళలో నీళ్ళై ఉబికింది ఆమెకు.

అమ్మ అంటే ఏమిటో అర్థమైనట్టు సుభద్రమ్మగారి వైపు చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాం నేనూ, శోభా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.