close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భ్రమణం

భ్రమణం
- కన్నెగంటి అనసూయ

‘‘సరేనమ్మా..!’’ అన్నాడు రామం ఇక బయల్దేరనా అన్నట్టుగా తల్లివైపు చూస్తూ.
‘‘బయల్దేరు... మళ్ళీ వర్జ్యం వస్తుంది... వెళ్ళగానే ఫోన్‌ చెయ్‌’’ ముభావంగానే అంది రాఘవమ్మ.
అలాగేనంటూ తలూపాడు డ్రైవర్ని కారు పోనిమ్మంటూ.
అంతకుముందు రెండు రోజులే అయ్యింది ఇద్దరూ విజయవాడ నుంచి వచ్చి.

భర్త పోయాక గత ఏడాదిన్నరగా కొడుకు దగ్గరే ఉంటోంది రాఘవమ్మ. పొలాలన్నీ కౌలుకిచ్చేసి ఇల్లు మాత్రం అట్టే పెట్టాడు అద్దెకివ్వకుండా. ఖాళీగా ఉంటే పాడైపోతుందనీ, అద్దెకివ్వటమే మంచిదనీ వాళ్ళూ వీళ్ళూ చెప్పినా సెలవుల్లో వస్తే ఇబ్బందిపడాలని పట్టించుకోలేదు రామం.

చెదలు పట్టకుండా చెక్కలున్న చోటల్లా కిరసనాయిలు పోయించి, ఇంటికి తాళాలు వేసి తన దగ్గరుంచుకుని బయట గేటు తాళాలు మాత్రం జానకమ్మకి ఇచ్చి రోజూ వచ్చి చుట్టూ వూడ్చి ముగ్గులెయ్యమన్నాడు నెలకింతని మాట్లాడి.

అయిదార్నెల్లు గడిచాక ఇంటినీ వూరినీ వూళ్ళొవాళ్ళనీ ఒకసారి చూడాలనుందని రాఘవమ్మ అనేసరికి నాలుగు రోజులు సెలవులొస్తే తల్లి, భార్యాపిల్లలతో ఒకసారొచ్చి ఉండి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఇదే రావటం.

వచ్చారన్నమాటేగానీ... జానకమ్మ ప్రతిరోజూ వచ్చి ఇంటి చుట్టూ వూడుస్తున్నా, తాళాలేసి నెలల తరబడి తియ్యకపోవటంతో... లోపలంతా బూజు పట్టేసిందేమో... పనోళ్ళని పెట్టి వూళ్ళొ ఉన్న రెండు రోజులూ ఇల్లు బాగు చేయించటమే సరిపోయింది రామంకి.

వంటింట్లో జాడీలూ డబ్బాలూ సీసాలూ కడిగి తడి లేకుండా ఎండలో ఆరబెట్టడం, పప్పులూ ఉప్పుల్లాంటి పనులన్నీ జానకమ్మ చూసుకుంటే, పీకేసిన ఫోన్‌ రీకనెక్షన్‌ కోసం అప్లై చేసి, అది వచ్చేదాకా వచ్చేటప్పుడు తన కూడా తెచ్చిన సెల్‌ఫోన్‌ తల్లికిచ్చాడు దాన్ని ఎలా వాడాలో వివరంగా చెప్తూ.

అంతేకాదు, గ్రైండరూ ఫ్యాన్లూ లైట్లూ రాఘవమ్మ పడుకునే గదిలో ఏసీ అన్నీ పనిచేస్తున్నాయో లేవో ఎలక్ట్రీషియన్ని పిలిపించి చూపించి దగ్గరుండి బాగు చేయించటమే కాక, పాలవాడ్ని పిలిచి పాలు వెయ్యమని చెప్పి, చివరగా జానకమ్మతో... తల్లికేం కావాలంటే అవి సమయానికి వండిపెట్టమనీ, రాత్రుళ్ళు తల్లికి తోడు పడుకోమనీ ఆవిడకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా కనిపెట్టుకునుండమనీ ఏదైనా అవసరమైతే తనకి ఫోన్‌ చెయ్యమనీ చెప్పి ఇంకేం పనుల్లేవనుకున్నాక తిరుగు ప్రయాణమయ్యాడు రామం.

కొడుకుని సాగనంపి లోనికొచ్చిన రాఘవమ్మ నిస్సత్తువగా మంచంమీద కూలబడింది. అలా నడుం వాలుస్తూ... ఆ కాసేపట్లోనే ఇల్లంతా బోసిపోయినట్టుంది అనుకుంది మనసులో. భర్త పోయాక మూణ్ణెల్లపాటు కొడుకు తన దగ్గరే ఉండటం, అన్ని రోజులూ వాళ్ళూ వీళ్ళూ వచ్చి చూసిపోతూ ఉండటంతో పెద్ద వెలితిగా అనిపించలేదు. మూణ్ణెల్లయ్యాక కొడుకూ కోడలూ అన్నీ చక్కబెట్టి కార్లో కూడా తీసుకెళ్ళిపోయారు.

మధ్యలో అందరూ కలిసి ఒకసారొచ్చి నాలుగయిదు రోజులున్నా అప్పుడు కూడా చుట్టూ కొడుకూ కోడలూ పిల్లలూ అంతా ఉండేసరికి ఏమీ అనిపించలేదు.

భర్త పోయాక ఈ ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇదే మొదటిసారి. మనసంతా ఇతమిద్ధంగా ఇదీ అని బయటికి చెప్పుకోలేని ఏదో దిగులుగా ఉంది రాఘవమ్మకి.

తన ఇలాకాలోకి ఎవరో ప్రవేశించేస్తున్నట్టూ, తన సర్వస్వం ఎవరో దోచేయబోతున్నట్టూ... ఏదో దిగులు. ఆ అలజడితోనే, పడుకున్నదల్లా లేచి కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా కలయతిరిగింది. అలా తిరుగుతూ తిరుగుతూ... ‘ఇది తన సామ్రాజ్యం... అవును ఇది తన సామ్రాజ్యమే. తనున్నంత కాలం ఇది తనదే’ తన్లో తనే ఎన్నిసార్లనుకుందో లెక్కలేదు. తిరిగీ తిరిగీ ఆలసటొచ్చి మళ్ళీ మంచం మీద వాలిపోయింది.

మాటిమాటికీ కొడుకు కుటుంబమే కళ్ళముందు కదలాడుతుంటే చాలాసేపు అలాగే ఉండిపోయింది, ఏదేదో ఆలోచిస్తూ. చాలాసేపటిగ్గానీ ఆకలి సంగతి గుర్తుకురాలేదు రాఘవమ్మకి.

ఆరోజు ఉదయమే జానకమ్మ అన్నీ వండి టేబుల్‌ మీద పెట్టి వాటి పక్కగా పళ్ళెం, దానిమీద గ్లాసు బోర్లించి టీ టైముకి మళ్ళీ వస్తానని చెప్పి రామం కంటే ముందే వెళ్ళిపోయింది.

వంటింట్లోకెళ్ళి సింకులో చేతులు కడుక్కుని, డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకి వచ్చి కుర్చీ బయటికి లాగి కూర్చుని గ్లాసులో నీళ్ళు వంపుకుందామని పళ్ళెం మీద బోర్లించి ఉన్న గ్లాసు తియ్యబోతే, అప్పటికే ఫ్యాను ఫుల్‌ స్పీడులో తిరుగుతుందేమో... ఆ గాలికి అప్పటికే దానికింద పెట్టి ఉన్న ఏదో కాగితం గాలికి ఎగిరి అంత దూరంలోపడింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏదైనా పిట్టా ఏంటన్నట్టుగా చుట్టూ చూసింది. దూరంగా గాలికి కొంచెం కొంచెం జరుగుతూ ఏదో మడతపెట్టిన తెల్లకాగితం.

‘ఇదెవరు పెట్టారిక్కడ?’ అనుకుంటూ, కుర్చీలో కూర్చున్నదల్లా గబుక్కున లేచెళ్ళి మడతపెట్టిన కాగితాన్ని చేతుల్లోకి తీసుకుని తెరిచి చూసింది. తను దిద్దించిన అక్షరాలు... తనకెందుకు తెలియవు! కొడుకు చేతిరాత... ఒక్కసారిగా ఉలిక్కిపడింది రాఘవమ్మ. ఎప్పుడూలేంది కొడుకేంటి ఇలా రాశాడూ అని.

విజయవాడలో కొడుకింట్లో ఉండగా ‘వూరెళ్ళిపోవాలనుందిరా’ అని కొడుకుతో చెప్పినప్పుడు... మరోమాట మాట్లాడకుండా ఒప్పుకున్నప్పుడే రాఘవమ్మకి మనసేం బాగాలేదు. తన మాట కాదనడని తెలుసు కానీ, తన మనసులోని భావం కనిపెట్టి వద్దంటాడనుకుంది. ముభావంగానే కూడా వచ్చి దిగబెట్టి, రెండు రోజులుండి అన్నీ చక్కబెట్టి మరీ వెళ్ళాడు.
కొడుకు మౌనం మనసులో బాధిస్తూనే ఉంది రాఘవమ్మని. దానికి తోడు ఏదో ఉత్తరం...
వణుకుతున్న చేతుల్తో తెరిచింది ఉత్తరాన్ని.

అమ్మా!
ఏనాడు పసుపూ కుంకుమలతో నాన్నతో కలిసి కోడలిగా ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టావో... అప్పట్నుంచీ ఆ ఇంటిలోని అణువణువుతో నీకెంతటి అనుబంధం ఉంటుందో నేనెరుగనిది కాదమ్మా... అందుకే ఇల్లంతా కలయతిరుగుతూ, ఆ ఇంటి గోడల్తో, తలుపులతో, ఇటుక ఇటుకతో పెనవేసుకున్న నీ తలపుల్ని బహుశా నెమరు వేసుకుంటూ ఉండి ఉంటావు.

నాన్న ఉన్నప్పుడు ఒకలా, నాన్న లేనప్పుడు ఒకలా ఉండరమ్మా బిడ్డలు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా నువ్వు అడిగింది ఏదీ నేను కాదనలేదు... కాదనను కూడా..! కానీ...

కౌలురైతు కౌలురొక్కం, మినహాయింపు పంటా తీసుకుని ఇవ్వటానికి మనింటికి వస్తే ఎప్పట్లా మనిద్దరమే కాకుండా ఈసారి అరుణని కూడా కూర్చోమని చెప్పి తన ఎదురుగా కౌలురైతుతో మాట్లాడేసరికి... ‘తనెందుకు మన మధ్యలో... తనకేం పనిక్కడ’ అన్నట్టుగా అరుణ వైపు నువ్వు చూసిన చూపూ చూపించిన అసహనం నేను గమనించానమ్మా.

అరుణ వచ్చి అక్కడ కూర్చోవటం నీకెంత మాత్రం ఇష్టంలేదని నాకు తెలుసు. అందుకే వాస్తవ పరిస్థితుల పట్ల నీక్కొంత అవగాహన అవసరమని ఇలా ఉత్తరం రాస్తున్నాను.

అరుణ తనంతట తనే అక్కడికి రాలేదు... నేను పిలిస్తేనే వచ్చింది. తను ఆ సమావేశంలో భాగమయ్యేసరికి నీదనుకున్నదేదో నీకు కాకుండా పోతుందేమోనని నువ్వు భావించావు. అంతేకదమ్మా!

ఒకటి అడుగుతాను చెప్పు... నువ్వూ ఆ ఇంటి కోడలివే కదా... పొలాలూ కౌలు గురించి నీకింత తెలివిడి ఎలా వచ్చింది? నాయనమ్మా, తాతయ్యా, నాన్నా మాట్లాడుకునేటప్పుడు వినటం వల్లే కదా. మరి ఆ జ్ఞానం అరుణకీ కావాలి కదమ్మా! ఎందుకంటే నీ తర్వాతి తరానికి- అంటే నా పిల్లలికి ఇవన్నీ తెలియచెప్పాల్సింది అరుణే కదా.

ఇలాగేకదమ్మా సంస్కృతీ సంప్రదాయాలతోపాటు వ్యవహారాలూ బాధ్యతలూ ఒక తరం నుంచి ఇంకొక తరానికి తెలిసేది.

చిన్నప్పటి నుంచీ నువ్వేది చెప్తే అదే చేశాను. ‘ఈ స్కూల్లో చేరు’ అని నన్నో స్కూల్లో చేర్చారు. అక్కడే చదువుకున్నాను. బట్టలు చూపించి ‘ఇవి కట్టుకో’ అన్నారు- కట్టుకున్నాను. ‘ఇది తిను’ అన్నారు- తిన్నాను.

చివరికి అరుణని పెళ్ళిచూపుల్లో చూసొచ్చాక ‘మన కుటుంబానికి తగ్గ పేరూ ప్రతిష్ఠా ఉన్న కుటుంబం. అమ్మాయి బాగుంది, చదువుకుంది, సంస్కారవంతురాలు, కాపురాన్ని చక్కబెట్టుకునే సామర్థ్యం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది’ అని నువ్వు చెప్తేనే కదమ్మా అరుణని నేను పెళ్ళి చేసుకున్నాను.

ఆ సందర్భంగా నువ్వన్న కుటుంబమూ పరువూ ప్రతిష్ఠా... అవి కేవలం మన వంశానికి నీతోనే మొదలవ్వలేదు కదమ్మా... తాత ముత్తాతల దగ్గర్నుంచీ వచ్చింది. దాన్ని నీ తరవాత ముందు తరాలవాళ్ళకి చేరవెయ్యాల్సింది మేమే కదా. అంటే అందులో సగభాగం అరుణే కదా.

మరి మన ఆస్తుల వ్యవహారాలకి సంబంధించిన వ్యవహారాలు తనెందుకు తెలుసుకోకూడదు..?

అరుణ పట్ల నీ ప్రవర్తన నేను గమనిస్తున్నందుకే ఇలా అడుగుతున్నానమ్మా. ఒకటి చెప్పు... పెళ్ళయ్యేదాకా మంచి అయిన అమ్మాయి పెళ్ళయ్యాక కాకుండా పోయిందా? పరాయి తల్లి కన్నపిల్లనే కదా అరుణ పట్ల ఇంత వివక్ష నీకు. తనకు అర్థంచేసుకోగల మనసుంది కాబట్టి సరిపోయింది... లేదంటే రోజూ గొడవలే కదా ఇంట్లో.

సహజంగానే వయసు పెరిగేకొద్దీ ఇతరుల సానుభూతి కోరుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. పెట్టింది తినరు. వాళ్ళు తినాలనుకున్నది అరగదు. తినొద్దని చెబితే వినరు. అడిగితే పెట్టలేదంటారు.

ఎదుటివాళ్ళ సానుభూతి కావాలి. కొంతమందైతే కడుపునిండా ఆకలి ఉన్నా, పెట్టింది తినకుండా దీనంగా, జాలిగొలిపేలా ముఖంపెట్టి ‘అరగటం లేదనటమో, లేదంటే ఎందుకో హితవు కావటం లేదనో, తినబుద్ధి కావటం లేదనో’ చెప్పి ఎదురుగా ఏమీ తినకుండా చాటున దొంగతనంగా తింటూ ఉంటారు. స్నేహితులం నలుగురం కల్సినప్పుడు పిచ్చాపాటీ మాటల్లో ఇదంతా చాలాసార్లే అనుకున్నాం. కానీ, నువ్విందుకు మినహాయింపనుకున్నానమ్మా...

‘మర్యాదగా పెట్టినప్పుడు తీసుకోకుండా తిరక్కొట్టి, జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక దొంగతనంగా తింటూ తిన్నట్టు తెలియకుండా, లెక్కకి తక్కువ కాకుండా, ముక్క తుంపుకుని తినటం గ్రహించిన అరుణ, నీ గురించి తక్కువగా అనుకోలేక, నీమీద గౌరవంకొద్దీ, నువ్వు తింటే అంతేచాలని అప్పట్నుంచీ ‘చిన్నచిన్న ముక్కలుగా చేసేస్తే తిన్నట్టుండదమ్మా’ అని పిల్లలు విసుక్కున్నా లెక్కచేయక, ఎన్ని తిన్నా తెలియకుండా అన్నింటినీ ముక్కలు ముక్కలుగా తుంచి మరీ డబ్బాల్లో పోసి నీకు అందుబాటులో ఉంచుతున్న సంస్కారి నీ కోడలు...

నీకింకో విషయం తెలియదు... బావ ఏమీ సంపాదించకపోవటంతో అక్క ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదని నువ్వంటే నీ సలహా మీద నాకు భారమైనా అక్క ముగ్గురు పిల్లల్లో ఒకడ్ని నేను చదివిస్తున్నాను. వాడు సెటిల్‌ అయ్యేవరకూ ఆ భారం నాదేనని కూడా చెప్పాను. అయినా నీకు తృప్తిలేని సంగతి నాకు తెలుసు.

అందుకేగా నువ్వు నా దగ్గరే ఉంటున్నా... నీకంటూ ప్రత్యేకంగా ఖర్చంటూ ఏమీ లేకపోయినా... ‘నాకంటూ కొంత డబ్బు కావాలని మనవల పుట్టిన రోజులైనా, బాగా మార్కులు తెచ్చుకున్నా, కానుకగా సంతోషంకొద్దీ వాళ్ళ చేతుల్లో అప్పటికప్పుడు అయిదొందలో, వెయ్యో ఎంతోకొంత పెట్టుకోవటానికి, మా నానమ్మ ఇచ్చిందనో, మా అమ్మమ్మ ఇచ్చిందనో వాళ్ళూ చెప్పుకుంటూంటే నాకూ సంతోషంగా ఉంటుంద’ని నువ్వన్నావ్‌, గుర్తుందా అమ్మా...

దానికి అరుణ ఏమందో తెలుసా... ‘నిజమే సుమండీ... ఇప్పటిదాకా మనకెందుకు తట్టలేదండీ ఈ విషయం... పెద్దావిడ, ఆవిడకి మాత్రం ఉండదా- మనవలు వచ్చినప్పుడు ఏదైనా ఇచ్చుకోవాలని. మీరు వెంటనే ఆ పని చెయ్యండి. అత్తయ్య నోరు తెరిచి అడగాల్సి వచ్చిందీ అంటే అది నిజంగా మనం తల వంచుకోవాల్సిన విషయమే’ అని.

నిజమేనమ్మా... నువ్వడిగేదాకా నాకా విషయం తట్టకపోవటం నా తప్పే. అందుకే వెంటనే నీ పేరుతో బ్యాంకు అకౌంట్‌ తెరిచి పొలం కౌలుకివ్వగా వచ్చిన చేను చిత్తంతా ప్రతి ఏటా నీ పేరుమీద వేస్తూ వస్తున్నాను.

అయినా...

‘గుళ్ళకెళ్ళినప్పుడో, ప్రవచనాలు వినటానికి వెళ్ళినప్పుడో ఖర్చుల కోసం ఎంతోకొంత చేతుల్లో ఉంటే బాగుంటుంది. ఆ బ్యాంకులకదీ నేనెలా వెళ్ళగలను’ అనేసరికి, అవునుగదా అనుకుని నెలనెలా ఐదువేలు క్రమం తప్పకుండా నీ ఖర్చులకని ఇస్తూనే ఉన్నాను. నాకు తెలుసు... దాచిదాచి వాటిని కూడా అక్కకే ఇస్తున్నావని. నాకేం బాధలేదు. ఒక్కసారి నీకు ఇచ్చేశాక అవి నీవే. నువ్వేం చేసుకున్నా నాకు సంబంధం లేదు. కానీ, నీ దృష్టిలో ఏమీ సంపాదించక బలాదూర్‌ తిరిగే బావకి ఉన్నపాటి గౌరవం కూడా అరుణకి లేదని నాకు తెలుసమ్మా.

అయినా, అరుణ అరుణే!

వ్యాపారంలో ఆటుపోట్ల వల్ల ఆర్నెల్లపాటు చేతిలో పైసా లేకపోతే ఆర్థికంగా ఎంత ఇబ్బందిపడ్డానో... అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నా పిల్లల స్కూలు ఫీజుల సంగతిగానీ, నా కారు పెట్రోలు సంగతిగానీ ఆలోచించలేదు. ప్రతి నెలా నీకిచ్చే ఐదువేల సంగతి తప్ప!

అప్పుడేం చేసిందో తెల్సా పరాయిదని నువ్వు భావిస్తున్న నీ కోడలు... ‘మీరు నిశ్చింతగా ఉండండి. అత్తయ్య సంగతి నేను చూసుకుంటాను’ అని తన చేతిగాజుల్లో రెండు గాజులు బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి ఇస్తూ నాకెన్నిసార్లు చెప్పిందో నీకీ విషయం తెలియనియ్యొద్దని, తెలిస్తే నువ్వు బాధపడతావని.

‘పెద్దల సమక్షంలో మెడలో మంగళ సూత్రం కట్టినందుకుగానూ ఇంటిపేరు మార్చుకుంది, గోత్రం మార్చుకుంది, చిన్నప్పట్నించీ తాను పెరిగిన ఇంటిని వదులుకుని మనింటికొచ్చింది. నాకు సుఖాన్నిచ్చింది, కొడుకునిచ్చింది, కూతుర్నిచ్చింది. వాళ్ళ ఆటపాటల్ని వింటూ మైమరచిపోయేలా ముద్దుమురిపాలనిచ్చింది. వంశాభివృద్ధి చేసింది. అహర్నిశలూ శ్రమిస్తూ కుటుంబసభ్యులందరి అవసరాలను తీరుస్తూ మనమంతా హాయిగా సంతోషంగా ఉంటే అంతేచాలని తాపత్రయపడింది. అందరి ఆరోగ్యాలనూ దృష్టిలో పెట్టుకుని ఎవరికేది అవసరమో గమనిస్తూ సమయానికి అన్నీ అమరుస్తుంది. ఇన్ని చేస్తూ కూడా ఏనాడూ ఇన్ని చేస్తున్నానని నోరెత్తి అనలేదే!

నోరెత్తి ఇది కావాలి అని ఒక భార్యగా నన్నెప్పుడూ అడగలేదే!’ అని చెప్పారు చాగంటివారు.

ప్రవచనాలు వింటున్నావుగా... మరి ఆ విన్నదంతా గాలికి వదిలేసి...

అనుక్షణం మనల్ని కనిపెడుతూ మనకోసం ఇన్ని వదులుకుని ఇంతగా తాపత్రయపడుతున్న వ్యక్తి నీకు పరాయి మనిషిగా ఎందుకు అనిపిస్తోంది... ఇదెక్కడి న్యాయమమ్మా. అరుణ పట్ల నీ అయిష్టత నాకు తెల్సు. అరుణ నోరెత్తి ఒక్కమాటా నాతో చెప్పకపోయినా నేను గమనించగలను. ఎందుకంటే, తల్లీ పిల్లలూ సమానాంతరంగా పెరుగుతూ వస్తారమ్మా. ఆ ప్రక్రియలో పిల్లల మనస్తత్వం తల్లులే కాదు, తల్లుల మనస్తత్వం పిల్లలూ గమనిస్తూ ఉంటారు. అందుకే నాకివన్నీ తెలుసు.

నీకింకో విషయం చెప్పనా... అరుణకి చిత్తశుద్ధి ఉంది. స్పందించే హృదయం ఉంది. పంచే గుణం పుష్కలంగా ఉంది. పైగా వ్యవహారాలను చక్కదిద్దుకోగల చాతుర్యమూ, నేర్పూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన వూరికి వెళ్ళి ఏదైనా చేయాలనే తపనా తాపత్రయమూ ఉన్నాయి.

తనవల్లా, తన చర్యలవల్లా మన వంశానికే కాదు, మొత్తం మన వూరికే మరింత పేరొస్తుందని గ్యారంటీగా చెప్పగలను. అది కేవలం పేరు కోసం చెయ్యటంవల్ల వచ్చేది కాదు. తన నైజమే అది.

అలాంటివాళ్ళకి వూరు గురించీ వూళ్ళొ జరిగే వ్యవహారాల గురించీ తెలుసుకోవటం ఎంతో అవసరం అమ్మా. పిల్లలు పెద్దవాళ్ళయి ఇంటి వాళ్ళయ్యాక అరుణతో కలిసి వూరికే సేవ చెయ్యాలనుకుంటున్నాను.

అందుకే ఎప్పుడూ లేనిది మన పొలం చేస్తున్న కౌలురైతు సుబ్బారావుగారు, మరో రెండేళ్ళపాటు మన పొలాన్ని తనకే ఇవ్వమని అడగటానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే విని అవగాహన ఏర్పరుచుకుంటుందని తననీ వచ్చి కూర్చోమన్నాను.

ఇలాంటి విషయాలన్నీ అరుణకి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే తనకీ అనుభవం వస్తుంది.

తప్పదమ్మా... నీకు నచ్చనంత మాత్రాన అరుణ నా భార్యా, నా పిల్లలకి తల్లీ కాకుండా పోదు. నాయనమ్మ తర్వాత నువ్వొచ్చినట్టే నీ తర్వాత అరుణ. తాత, ముత్తాతల దగ్గర్నుంచీ వస్తున్న మన కుటుంబ ఆచార వ్యవహారాలూ సంస్కృతీ సాంప్రదాయాలూ పరువూ ప్రతిష్ఠలూ ముందుతరానికి అందించే వాహకం అమ్మా అరుణ.

కాబట్టి నువ్వు మానసికంగా సిద్ధపడాల్సిందే.

నీకిదంతా ఇష్టం ఉండదని తెలుసు... కానీ ఇలా నీ సర్వహక్కులూ ఎవరో బలవంతంగా లాగేసుకున్నట్టుగా భావించి ఉన్నట్టుండి ఇలా వూరికి వెళ్ళిపోతానంటావని మాత్రం వూహించలేకపోయాను. నువ్విలా వెళ్ళిపోతాననటం వెనుక నీ ఉద్దేశ్యం నేను అర్థంచేసుకోలేననుకున్నావా..!

కానియ్యమ్మా, నీకెలా ఇష్టం ఉంటే అలాగే చెయ్యి. కానీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ ఇష్టంలో కాస్తంత విశాలత్వాన్ని చూపించమ్మా!

మన దొడ్లో బంగినపల్లి మామిడిచెట్టు విరగకాసి, కోతకి సిద్ధంగా ఉంది. మామిడిపళ్ళంటే ఉన్న ఇష్టంకొద్దీ ఒక కాయ కోసి తెచ్చుకుని తిన్నాను. తినొద్దు, షుగర్‌ పెరిగిపోతుంది అన్నావ్‌. షుగర్‌ వ్యాధితో నేను ఎలాగూ తినకూడదనేకదమ్మా... చెట్లకి అన్ని కాయలున్నా... అరుణకి ఎంతో ఇష్టమని తెలిసినా పట్టుకెళ్ళమని ఒక్క పాతిక్కాయలన్నా ఇవ్వలేకపోయావ్‌. నేను తినకూడదు కాబట్టి నాకు కాయలు అవసరంలేదని నువ్వనుకున్నావ్‌ తప్ప, అదే ప్రేమ నాకూ ఉందనీ, నా భార్య తింటే బాగుండునని నేననుకుంటాననీ నువ్వనుకోలేకపోయావ్‌.

అయినా అవన్నీ నువ్వేం చేసుకుంటావ్‌... నువ్వయినా పంచిపెట్టేవేకదా! బయటివాళ్ళపాటి కూడా చెయ్యలేదామ్మా... అరుణ.

అనుక్షణం నా ఇష్టాయిష్టాలనీ, నా ఆరోగ్యాన్నీ పట్టించుకునే నువ్వు నాకెంతో ఇష్టమైన నా భార్యని ఎందుకు అయిష్టంగా చూస్తావ్‌..?

నేను మానునైతే... నా విత్తనం నువ్వేనమ్మా! నా నీళ్ళూ వేళ్ళూ అరుణ అయితే, నా ఆకులూ కొమ్మలూ పూలూ ఫలాలూ నా పిల్లలు... మీరంతా నావాళ్ళు. అన్నీ సవ్యంగా జరిగితేనేకదమ్మా వృక్షం ఏపుగా ఎదిగేదీ, సమాజానికి మేలైన విత్తులనిచ్చేదీ... మీలో ఏ ఒక్కరు లేకపోయినా నేను లేనమ్మా..!

* * *

కారు వేగంగా పోతోంది.
‘అమ్మా, నిన్నొక్కదాన్నీ వదిలి వస్తున్నందుకు నాకు బాధలేదు. నువ్వుండగలవు. నాకు తెలుసు. కాకపోతే అలా ఉండాలనుకున్న సందర్భం గురించే నాకు బాధగా ఉంది. కానీ, నువ్వు ఆలోచిస్తావు. తప్పొప్పుల్ని గుర్తిస్తావు, మారతావు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా...’ సీటు వెనక్కి జారబడి కదులుతున్న కారు అద్దాల్లోంచి వేగంగా కదులుతున్న చెట్లవైపు చూస్తూ మనసులో అనుకున్నాడు రామం.

అతని ఆలోచనల్ని భగ్నం చేస్తూ ఫోన్‌ మోగింది.

‘అయ్యో, దార్లో అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తానని అమ్మతో చెప్పాను. ఇంతవరకూ చెయ్యకపోయేసరికి కంగారుపడి ఉంటుంది, ఫోన్‌ చేసింది’ సర్దుకుని కూర్చుంటూ కాల్‌ బటన్‌ నొక్కాడు.

అరుణ దగ్గర్నుంచి ఫోన్‌... ‘‘ఏమండీ, ఎక్కడిదాకా వచ్చారు?’’ హుషారుగా ఉంది అరుణ గొంతు.

సమాధానం చెప్పేలోపే మళ్ళీ అరుణే అంది ‘‘ఇప్పుడే అత్తయ్య ఫోన్‌ చేశారు. వెనక్కి వచ్చేస్తారట.’’

అంతే, కారును వెనక్కు తిప్పమని చెబుతూ హుషారుగా డ్రైవర్‌ భుజం తట్టాడు రామం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.