close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇప్పటికీ సేల్స్‌మేన్‌గా పనిచేస్తాడు!

ఇప్పటికీ సేల్స్‌మేన్‌గా పనిచేస్తాడు!

రాహుల్‌ శర్మ... ఒకప్పుడు ఫోన్లను సరఫరా చేసేవాడు. ఇప్పుడు దేశంలో రెండో స్థానంలో, ప్రపంచంలో పదో స్థానంలో ఉన్న మైక్రోమాక్స్‌ కంపెనీని నడిపిస్తున్నాడు. ఆఫీసుకు డొక్కు బండి నుంచీ రోల్స్‌ రాయిస్‌లో వెళ్లే వరకూ, ల్యాండ్‌లైన్‌ ఫోన్లను సప్లై చేసే దశ నుంచీ స్మార్ట్‌ఫోన్లను తయారు చేసేవరకూ, నాలుగంకెల జీతం నుంచీ ఏటా పద్దెనిమిది వేల కోట్లు సంపాదిస్తోన్న సంస్థను స్థాపించే వరకూ... రాహుల్‌ ప్రయాణం నిజమైన విజయానికి కొలమానం.

ఇంజినీరింగ్‌ పూర్తిచేయడం, అమెరికా వెళ్లడం, ఏదో ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడటం... ఓ పది పదిహేనేళ్ల క్రితం దేశంలో చాలామంది కుర్రాళ్ల ఆలోచనలు ఇలానే ఉండేవి. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన రాహుల్‌ని కూడా అమెరికా పంపించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అతడు దానికి ఒప్పుకోలేదు. రాహుల్‌ తండ్రి ఓ సాధారణ స్కూల్‌ టీచర్‌. చాలీచాలని జీతంతో ముగ్గురు పిల్లల్ని చదివించడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో రాహుల్‌కి తెలుసు. అందుకే తండ్రికి అదనపు భారం కాకుండా భారత్‌లోనే ఉంటానని ఇంజినీరింగ్‌ పూర్తవగానే ఇంట్లో చెప్పాడు.

* కాలేజీ అయిపోగానే రాహుల్‌ ఓ కార్పొరేట్‌ సంస్థలో మెకానికల్‌ బ్రేక్స్‌ డిజైనర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఎన్నాళ్లు పనిచేసినా ఉద్యోగంలో ఎదుగుదలకు పరిమితులుంటాయనీ, అందుకే సొంతంగా ఏదైనా సంస్థను మొదలుపెట్టాలనీ అతడికి అనిపించింది. స్నేహితులు సుమీత్‌, వికాస్‌లతో పాటు పక్కింటి కుర్రాడు రాజేష్‌తో తన ఆలోచనను పంచుకున్నాడు. నలుగురూ ఇంజినీర్లే కాబట్టి సొంతంగా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామనీ, ఒకవేళ అది విఫలమైతే అప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చనీ ఒప్పించాడు. అలా రాహుల్‌ తండ్రి కొనిచ్చిన ఒక కంప్యూటర్‌తో నలుగురు స్నేహితులూ కలిసి ‘మైక్రోమాక్స్‌ ఇన్ఫర్మాటిక్స్‌’ పేరుతో ఓ చిన్న సంస్థను మొదలుపెట్టారు.

* ఆన్‌లైన్లో కంప్యూటర్‌ కోర్సుల సాఫ్ట్‌వేర్‌ల అమ్మకంతో సంస్థ పనులు మొదలయ్యాయి. తరవాత రాహుల్‌ బృందం నోకియా ఫోన్లకు డిస్ట్రిబ్యూటర్లుగా మారి ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాలకు ఫోన్లను మార్కెటింగ్‌ చేయడం మొదలుపెట్టింది. క్రమంగా హార్డ్‌వేర్‌ రంగంలోకీ ప్రవేశించీ నోకియా ఫోన్లకు కావాల్సిన కొన్ని విడి భాగాలను తయారు చేయసాగింది. కానీ నోకియా సంస్థ తమ టెక్నాలజీనంతా మరో సంస్థకు అమ్మేయడంతో మైక్రోమాక్స్‌ కాంట్రాక్టు కూడా చేజారింది. ఆ సమయంలో ఎయిర్‌టెల్‌తో కుదిరిన ఓ ఒప్పందం సంస్థ ముఖచిత్రాన్నే మార్చేసింది.

* బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ పే ఫోన్లు దేశాన్ని వూపేస్తోన్న రోజుల్లో ఎయిర్‌టెల్‌ కూడా ఆ రంగంలోకి ప్రవేశించింది. పశ్చిమబంగా, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో ఆ పే ఫోన్లను సరఫరా చేయడంతో పాటు వాటిని నిర్వహించే బాధ్యతను మైక్రోమాక్స్‌ సంస్థకే అప్పగించింది. ఆ పనిమీదే రాజేష్‌ ఒకసారి పశ్చిమ బంగాలోని చిన్న పల్లెటూరికి వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ సదుపాయం లేదు. దాంతో ఓ ఎస్టీడీ బూత్‌ నిర్వాహకుడు రోజూ రాత్రి పూట తన బూత్‌ నిర్వహణకు ఉపయోగపడే బ్యాటరీని పక్క వూరికి తీసుకెళ్లి రీఛార్జి చేయించి తీసుకొచ్చేవాడు. బిహార్‌లోనూ రాహుల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. విద్యుత్‌ సదుపాయం లేని గ్రామాల్లో కొంతమంది ఇరవై రూపాయలు చెల్లించి మరీ ఫోన్లను రీఛార్జ్‌ చేసుకోవడం గమనించాడు. ఈ రెండు సంఘటనలూ రాహుల్‌పైన బలమైన ముద్రవేశాయి.

* గుడ్‌గావ్‌లోని తన కార్యాలయానికి తిరిగొచ్చాక కూడా రాహుల్‌ను పల్లెవాసులు పడుతోన్న ఇబ్బందులు వేధించసాగాయి. ఆ బ్యాటరీ సమస్యకు పరిష్కారం చూపే సెల్‌ఫోన్లను తయారుచేస్తే తమకు తిరుగుండదని అతడు స్నేహితుల్ని ఒప్పించాడు. రాహుల్‌పైన నమ్మకంతో నలుగురూ కలిసి ఆ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 30రోజులపాటు పనిచేసే శక్తిమంతమైన బ్యాటరీలతో తొలుత బేసిక్‌ మోడల్‌ ఫోన్‌లను తయారుచేశారు. కొన్నవాళ్ల నోటిమాటే ప్రచార మంత్రమైంది. పదిహేను రోజుల వ్యవధిలో తొలి విడతగా తయారుచేసిన పదివేల ఫోన్లూ అమ్ముడై సంచలనం సృష్టించాయి. ఆ విజయంతో మైక్రోమాక్స్‌ పూర్తిస్థాయి ఫోన్ల తయారీ కంపెనీగా మారిపోయింది.

* రాహుల్‌ ఇంట్లో వంట మనిషి ఒకే ఫోన్లో మూడు నాలుగు సిమ్‌ కార్డులను మారుస్తూ వాడటాన్ని రాహుల్‌ గమనించాడు. ఆ సమస్యకు పరిష్కారంగా దేశంలోనే మొదటిసారి ‘డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌’ అనే సంచలన మోడల్‌కు అతడు తెరతీశాడు. అలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంచెలంచెలుగా ఎదిగిన మైక్రోమాక్స్‌ అన్ని రకాల ఫోన్లనూ ఇతర సంస్థలకంటే చాలా తక్కువ ధరకే ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలుపెట్టింది. క్రమంగా పన్నెండు దేశాలకు విస్తరించింది. నెలకు పద్దెనిమిది లక్షలకు పైగా సెల్‌ఫోన్లను అమ్ముతూ దేశంలో రెండో స్థానంలో, ప్రపంచంలో పదో స్థానంలో నిలిచింది. క్రమంగా ట్యాబ్లెట్లూ, ఎల్‌ఈడీ టీవీలూ, డేటా కార్డుల రంగంలోకీ విస్తరించింది. ఏటా పద్దెనిమిదివేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తూ దూసుకెళ్తొంది. ఇప్పటికీ తరచూ మొబైల్‌ దుకాణాల్లో సేల్స్‌మేన్‌ అవతారమెత్తి వినియోగదారుల అవసరాలు తెలుసుకుంటుంటాడు రాహుల్‌.

* మైక్రోమాక్స్‌ తొలి టీవీ ప్రకటనలో నటించిన అక్షయ్‌కుమార్‌ ద్వారా రాహుల్‌కు సినీ నటి అసిన్‌తో పరిచయమైంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇటీవలే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ‘ఒకప్పుడు డబ్బుల్లేక అమెరికా వెళ్లడానికి ఆలోచించా. కానీ పెళ్లికి ముందు నా భార్యకు దాదాపు ఆరు కోట్లు ఖర్చుపెట్టి వజ్రపు ఉంగరం చేయించినప్పుడు నేను ఎక్కణ్ణుంచి ఏ స్థాయికి వచ్చానో అర్థమైంది’ అని గుర్తుచేసుకుంటాడు రాహుల్‌. అటు కెరీర్‌, ఇటు ప్రేమ... జీవితంలో ముఖ్యమైన రెండు విషయాల్లో రాహుల్‌వి తిరుగులేని విజయాలే..!


పాము రక్తం తాగాలి... గ్రెనేడ్‌తో ఆడాలి!

గ్రెనేడ్‌ పిన్ను పీకి చేతులు మార్చుకుంటూ ఆటాడాలి, తాచు పాము రక్తం తాగాలి, మొనదేలిన రాళ్లమీద చొక్కాలేకుండా పాకాలి, మంటల మధ్యలోంచి నడవాలి... కొంపదీసి ఇవన్నీ శిక్షలనుకుంటున్నారా... అస్సలు కాదు, కొన్ని దేశాల్లో మిలటరీ సైనికులకిచ్చే శిక్షణలు.

సైనికులంటే ధైర్యానికీ సాహసానికీ ప్రతీక. ప్రాణాలొడ్డి పోరాడి మరీ శత్రువుల బారినుంచి దేశాన్ని కాపాడతారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడతారు. అంతేకాదు, అంతటి ధైర్యసాహసాలు తమలో ఉన్నాయని నిరూపించుకోవడానికి ఎన్నో కష్టాలకోర్చి శిక్షణ కూడా తీసుకుంటారు. కొన్ని దేశాల్లో అయితే ఆ శిక్షణ మరీ కఠినంగా సామాన్యులకు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అలాంటివే... ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఈ సైనిక శిక్షణలు.

గ్రెనేడ్‌తో ఆటా...
బుర్ర ఉన్నవాళ్లెవరైనా గ్రెనేడ్‌ పిన్ను పీకి చేత్తో పట్టుకుంటారా... అస్సలు పట్టుకోరు. కానీ చైనా దేశపు ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ సైనికులు ఏకంగా దాంతో ఆటాడేస్తారు. పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న గ్రెనేడ్లూ బాంబులున్నప్పుడు ఎలా బయటపడాలో నేర్పించేందుకు నిజంగానే సైనికుల చేతుల్లో పిన్ను తీసిన గ్రెనేడ్‌ను పెడుతున్నారు అక్కడి ఆర్మీ అధికారులు. అంతేకాదు, సెకెన్లలో పేలే దాన్ని ఐదారుగురు సైనికులున్న బృందంలో మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకూ చేతులు మార్చుకోవాలి. ఆఖరి వ్యక్తి దాన్ని కొంచెం దూరంలో ఉన్న గుంతలోకి విసిరెయ్యాలి. అదే సమయంలో అందరూ దూరంగా దూకెయ్యాలి. ఈ మొత్తం కార్యక్రమంలో ఏమాత్రం ఆలస్యమైనా, గ్రెనేడ్‌ ఎవరి చేతుల్లోనుంచైనా జారినా అందరి ప్రాణాలకూ ముప్పే. చూసేవారిక్కూడా చెమటలు పట్టించే ఇలాంటి శిక్షణలు ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ శిక్షణలో చాలా సాధారణం. ఈ గ్రెనేడ్‌ శిక్షణా దృశ్యాలైతే యూట్యూబ్‌లోనూ ఎంతో ప్రాచుర్యం పొందాయి.

పాము రక్తం తాగాల్సిందే...
అమెరికా నావికాదళ సైనికులు శిక్షణలో భాగంగా కొన్ని రోజులు థాయ్‌లాండ్‌లోని అడవుల్లో ఉండాలి. నీరూ ఆహారం దొరకని సమయంలో సైనికులు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలిపే కార్యక్రమం ఇది. దీన్లో భాగంగా వాళ్లు తాచుపాముల రక్తాన్ని తాగాల్సి ఉంటుంది. పాముల తోకల్నీ, తేళ్లనూ, కోళ్ల తలల్నీ తినాల్సుంటుంది. అంటే అత్యవసర సమయంలో ఏది దొరికితే దాన్ని ప్రాణాలకు ముప్పు లేకుండా తినడం నేర్చుకుంటారన్నమాట.

అమెరికా నేవీ సీల్‌లోనూ ఇలాంటిదే మరోరకం శిక్షణ ఉంది. దీన్లో భాగంగా గడ్డకట్టేంత చల్లటి సముద్రపు నీళ్లలో ఎనిమిది నిమిషాల పాటు తలను పెట్టి ఉంచాలి. తర్వాత కొద్ది సమయం ఇసుకలో పొర్లి శరీరం వేడెక్కగానే మళ్లీ రెండో రౌండ్‌ కోసం సన్నద్ధమవ్వాలి.

కడుపులో కాల్పులు
రష్యాకు చెందిన స్పెషల్‌ ఫోర్సులో అయితే మరో అడుగు ముందుకేసి తుపాకీతో సైనికుల కడుపులో కాలుస్తారు. ఆ సమయంలో వాళ్లు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకుని ఉంటారు గానీ ఒక్కోసారి అది ఉన్నా తుపాకీ గుండు శరీరానికి తాకుతుంటుంది. శత్రువు తుపాకీతో ఎదురుగా నిలబడినా భయపడకుండా ఉండాలన్న విషయాన్ని ఇంత ప్రయోగాత్మకంగా నేర్పిస్తున్నారు.

రక్తమోడేలా...
తైవాన్‌ నావికాదళానికిచ్చే శిక్షణ చూస్తే ఇదొకరకమైన హింసేమో అనిపించకమానదు. ‘రోడ్‌ టు హెవెన్‌’ పేరుతో 50 మీటర్ల పొడవున మొనదేలిన అరచేయంత రాళ్లను పోసి చొక్కా లేకుండా వాటిమీద పాకమంటారు. మామూలు నేలమీదే అలా పాకడం కష్టం. అలాంటిది రాళ్లమీదంటే ఇంకెలా ఉంటుందో వూహించొచ్చు.

మంటల మీద నడక
ఐరోపాలోని బెలారస్‌ దేశంలో సైనికులను మంటల మీద కట్టిన ఇనుప చెయిన్ల మీద నడిపిస్తారు. ఏమాత్రం అటూ ఇటూ అయినా ఆ మంటల్లో పడటం ఖాయం.

కన్నీళ్లు పెట్టాల్సిందే
అల్లర్లు జరిగినపుడు ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌ గ్యాసుని వారిమీదకు వదులుతారు. ఆ వాయువు ధాటికి కళ్లు మండి ఎవరైనా దూరంగా పారిపోవాల్సిందే. కానీ బ్రిటిష్‌ ఆర్‌ఏఎఫ్‌ సైన్యానికి మాత్రం పారిపోయే వీలు కూడా ఉండదు. అవును, శిక్షణ సమయంలో వారిని టియర్‌ గ్యాస్‌తో నింపిన గదిలోకి పంపి తమ పేరూ బ్యాచ్‌ నంబర్లనూ గట్టిగా స్పష్టంగా చెప్పమంటారు. ఆ తర్వాతే బయటికి రానిస్తారు.

చొక్కా లేకుండా మంచులో...
దక్షిణ కొరియాలోని పియాంగ్‌చంగ్‌ ప్రాంతంలో చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్‌ 30 డిగ్రీలకు పడిపోతుంది. అలాంటి వాతావరణంలో మందపాటి ఉన్ని దుస్తులు వేసుకున్నా ఉండలేం. కానీ స్థానిక స్పెషల్‌ ఫోర్స్‌ సైనికులు అంత మంచులో అసలు చొక్కానే లేకుండా పరిగెత్తాలి, కుస్తీలు పట్టాలి, ఆ మంచుతో ఆటలాడాలి. ‘ఆట సంగతేమోగానీ అసలు ప్రాణాలతో ఉంటారా’ అని సందేహం కలుగుతోందికదా...ఇన్ని కష్టాలకోర్చి శిక్షణపొందుతున్న ఆ సైనికులకు నిజంగా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.


ఈ రోడ్లు నీళ్లని పీల్చేస్తాయి!

వర్షం పడిందంటే చాలు రోడ్డుమీద నీరు నిల్చిపోతుంది. కాసేపటికి ట్రాఫిక్‌ పెరిగి అక్కడికక్కడే నరకం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉండే సమస్యే ఇది. ‘మేం వేసే రోడ్లపైన అలాంటి పరిస్థితి ఉండద’ంటోంది ‘టార్మాక్‌’ కంపెనీ. ఎందుకని అడిగితే ఈ వివరాలు చెబుతోంది...

నీరు పల్లమెరుగు... అన్నది వాస్తవం. కానీ ఇంగ్లండ్‌కు చెందిన ్మ్చr్ఝ్చ్ఞ సంస్థ నిర్మించే రోడ్లపైన నీళ్లు పల్లంవైపు కాకుండా ఉన్నచోటే భూమిలోకి ఇంకిపోతాయి. ‘రోడ్డుపైన నీళ్లు ఎలా ఇంకిపోతాయబ్బా అంటారా’... అందుకోసం ప్రత్యేకమైన ‘టాప్‌మిక్స్‌ పెర్మియబుల్‌ కాంక్రీటు’ని అభివృద్ధి చేసిందా సంస్థ. దీనిపైన పడిన నీటిని శోషించుకునే లక్షణం ఈ కాంక్రీటుకి ఉంటుంది. కుండపోత వర్షం పడినా కొన్ని నిమిషాల్లోనే నీళ్లు అందులోకి ఇంకిపోతాయి. ఒక మోస్తరు వర్షమైతే సెకన్లలోనే నీరు లోపలికి ఇంకిపోతుంది. చదరపు మీటరు విస్తీర్ణంలో నిమిషానికి వెయ్యి లీటర్లు ఇంకుతుంది. అంటే, నాలుగు వేల లీటర్ల ట్యాంకర్‌ నుంచి ఈ రోడ్లపైన నీరు పోస్తే నాలుగే నిమిషాల్లో అవి ఇంకిపోతాయి.

ఎలా నిర్మిస్తారంటే...
పెర్మియబుల్‌ కాంక్రీటుతో రోడ్ల నిర్మాణం ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. వాటిలో పెర్మియబుల్‌ కాంక్రీట్‌ పైపొరగా ఉంటుంది. దానికింద రాళ్లతో వేసిన పొరా, దానికింద మట్టీ ఉంటాయి. ఈ మట్టి పొర గట్టిగా ఉంటుంది. ప్రతి పొరకీ నీటిని శోషించుకునే గుణం ఉంటుంది. పై రెండు పొరల నిర్మాణానికి ప్రత్యేకంగా తయారుచేసిన రాళ్లని వాడతారు. గ్రానైట్‌ రాళ్లని పిండిగా చేసి తిరిగి ఆ పిండిని ముద్దలుగా చుట్టి రాళ్లని తయారుచేస్తారు. కొన్ని 

రసాయనాలు కలపడంతో ఈ రాళ్లకు నీటిని పీల్చుకునే స్వభావం వస్తుంది. పై పొరలో రాళ్లను 15 సెం.మీ. ఎత్తున వేస్తారు. మధ్య పొరలో 20 సెం.మీ. ఎత్తున వాటికంటే కొద్దిగా తక్కువ పరిమాణంలో ఉండే రాళ్లను పరుస్తారు. దానికింద మట్టి ఉంటుంది.

నేల స్వభావం, నీటి అవసరాలనుబట్టి ప్రతి చోటా నిర్మాణంలో కాస్త మార్పులు చేస్తారు. నీరు అక్కడికక్కడే నేలలోనే పూర్తిగా ఇంకాలంటే ఒకలా, పాక్షికంగా ఇంకాలంటే మరోలా, ఆ నీటిని మొత్తంగా అక్కడ సేకరించుకోవాలనుకుంటే వేరొకలా... చిన్న చిన్న మార్పులు చేసి రోడ్లని నిర్మిస్తారు. వర్షం నీరు పట్టుకోవాల్సిన అవసరంలేదనుకుంటే ఈ రోడ్డుపైన పడిన నీరు దానికదే పూర్తిగా ఇంకిపోయేలా చేస్తారు. నీటిని సేకరించాలనుకుంటే రెండో పొరలో డ్రైనేజీ పైపుల్ని ఏర్పాటుచేస్తారు. వాటికి తోడు రెండు పొరల దిగువన ఒక ప్రత్యేకమైన కవరుని ఏర్పాటుచేస్తారు. దీనిద్వారా నీరు అంత త్వరగా ఇంకదు. ఫలితంగా ఆ నీటిని లోపల అమర్చిన డ్రైనేజీ పైపుల ద్వారా సేకరించి నిల్వ చేసుకోవచ్చు. నీరు త్వరగా నేలలోకి ఇంకే స్వభావంలేని చోట పైపుల సాయంతో నీటిని సమీపంలోని జలవనరుల దగ్గరకి సులభంగా చేర్చుకోవచ్చు. ఈ రోడ్ల నిర్మాణ సమయంలో- ఆ ప్రాంతంలో భూగర్భ జలం లోతు, నేలలో నీరు ఇంకే గుణం తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.


శుద్ధి చేస్తాయి కూడా...
వరదల సమయంలో నీరు భూమిఉపరితలం పైనుంచి ప్రవాహంగా వెళ్తే చెరువులూ సరస్సుల కట్టలు తెగే ప్రమాదం ఉంటుంది. ఈ రోడ్డు ఉన్నచోట ఒక ఇంకుడుగుంతలా మారి నీటిని ఇంకించుకుంటుంది. తర్వాత ఆ నీరు భూగర్భం నుంచి నెమ్మదిగా దగ్గర్లోని చెరువులూ, సరస్సుల్లోకి చేరుతుంది. రోడ్డుమీద చెత్తా చెదారం చేరినా తొలగిపోవడానికి ఈ కాంక్రీటులో ఒక పేస్టు కలుపుతారు. అది చెత్తని నిల్వకుండా చేస్తుంది. నీటిలో కలిసే పెట్రోలియం మలినాల్ని పైపొరలోనే వడకట్టేస్తాయి ఈ రోడ్లు. ఫలితంగా ఏ విధమైన కాలుష్యం లేకుండానే నీరు భూగర్భంలోకి వెళ్తుంది. అంతేకాదు, ఎండలు బాగా ఉన్నపుడు ఈ రోడ్లు పెద్దగా వేడెక్కవు కూడా. ఇలాంటి సాంకేతికతను 50-60 ఏళ్ల కిందట నుంచీ ఫుట్‌పాత్‌ల పక్కన పడే నీటిని ఇంకడానికి కొన్ని దేశాల్లో వాడుతున్నారు. దాన్ని కొన్నేళ్లుగా ఇంకాస్త అభివృద్ధిచేసి రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగించే స్థాయికి తీసుకెళ్లింది టార్మాక్‌ సంస్థ. ఈ రోడ్లను బూడిద, నలుపు, పసుపు, లేత ఎరుపు రంగుల్లో నిర్మించుకోవచ్చు. మామూలు తారు రోడ్లూ, సిమెంట్‌ రోడ్లతో పోల్చితే వీటి నిర్మాణ, నిర్వాహణ ఖర్చూ తక్కువేనంటారు కంపెనీ ఇంజినీర్లు.

ప్రస్తుతానికి ఈ తరహా రోడ్ల వినియోగానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. గంటకు 50కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాల వల్ల ఇబ్బంది కావొచ్చు. అలాగే ఏడున్నర టన్నుల బరువుని మాత్రమే తట్టుకొని నిలబడగలదు. అంతకుమించి బరువున్న వాహనాలకు ఈ రోడ్లు ఇంకా అనువైనవి కాదు. అయితే ఎక్కువ విస్తీర్ణంలో కాంక్రీటుని ఉపయోగించేచోట నీరు ఇంకడం ఒక సమస్య అవుతుంది. ముఖ్యంగా పార్కింగ్‌ అవసరముండే దుకాణాలూ, బస్‌ స్టేషన్లూ, స్టేడియాలూ, సినిమా హాళ్లూ, పార్కుల దగ్గర ఈ సమస్య కనిపిస్తుంది. అలాంటిచోట పెర్మియబుల్‌ కాంక్రీటుని ఉపయోగిస్తే అక్కడ నీరు త్వరగా ఇంకిపోతుంది. ఇప్పటికే వీరు ఐరోపాలో కారు పార్కింగ్‌ ప్రదేశాల్నీ, గోల్ఫ్‌ కోర్సు వర్క్‌షాపునీ ఈ కాంక్రీటుతో నిర్మించారు.
ఈ రోడ్లు మనదేశంలో ఎప్పటికి వస్తాయో మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.