close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చందన రూపుడు...వాడపల్లి దేవుడు

చందన రూపుడు...వాడపల్లి దేవుడు

అక్కడ, స్వామి చందన స్వరూపుడు. సాక్షాత్తూ నారద మహర్షే ఆ మహిమాన్విత మూర్తిని ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లిలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు కల్యాణోత్సవ శోభతో కళకళలాడుతున్నాడు.

క్తజన వరదుడు కోనసీమలో వెలసిన వేంకటేశ్వరుడు. తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి... స్వామి ఎర్రచందనం కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం. రాజమహేంద్రవరానికి 30 కిలోమీటర్ల దూరంలో, గౌతమీ తీరాన, పచ్చని ప్రకృతి ఒడిలో నెలకొందీ ఆలయం. అటు శ్రీదేవీ, ఇటు భూదేవీ...మధ్యలో మంగళమూర్తి శ్రీనివాసుడు! స్వామికి సంకల్ప సిద్ధిదాతగా పేరు. వాడపల్లి దేవుడిని తలచుకుని, ఏదైనా సంకల్పం చేసుకుంటే తప్పక నెరవేరుతుందని అంటారు. ప్రతి శనివారం వేలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఏప్రిల్‌ 17న జరుగనున్న కల్యాణానికైతే...నానా దిక్కుల నరులతో పాటూ ముక్కోటి దేవతలూ విచ్చేస్తారని ఐతిహ్యం.

దివ్యగాథ...
వాడపల్లి దేవాలయం వెనుక ఓ ప్రాచీన గాథ ఉంది. పవిత్ర గౌతమీ గోదావరి తీరాన దేవర్షి నారదుడు స్వామివారిని ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. సనకసనందాది మహర్షులంతా మహావిష్ణువును దర్శించుకుని... కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో నడుస్తోందనీ, ప్రజలు అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారనీ విచారం వ్యక్తం చేశారట. సామాన్యులకు ఉన్నతమైన ఆలోచనలను ఇవ్వమని శ్రీహరిని ప్రార్థించారు. ఆ విన్నపానికి ప్రసన్నుడైన మహావిష్ణువు, తాను అర్చాస్వరూపుడిగా భూలోకంలో అవతరించి... సముద్రంలోని నౌకలా, మనుషుల్ని సంసార బాధల నుంచి ఒడ్డుకు చేరుస్తాననీ, అందుకు నౌకాపురం (వాడపల్లి) వేదిక అవుతుందనీ మాటిచ్చాడు. నారద మహర్షి వాడపల్లి వాసులకు ఆ వృత్తాంతాన్ని చెప్పాడు. కొంతకాలానికి గోదావరి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించింది. తీసుకొద్దామని వెళ్లేటప్పటికి అదృశ్యమయ్యేది. ఒకరోజు వాడపల్లిలోని ఓ వృద్ధుడికి స్వామి కలలో కనిపించి, కృష్ణ గరుడపక్షి వాలినచోట చందన పేటిక దొరుకుతుందని ఆనవాలు చెప్పాడు. ఆ ఆదేశం ప్రకారం మంగళవాద్యాలతో వెళ్లి శిల్పితో పేటికను తెరిపించారు. అందులో శంఖ, చక్ర, గదలతో స్వామి దివ్య మంగళమూర్తి కనిపించింది. ‘వేం’ అంటే పాపాలను, ‘కట’ అంటే పోగొట్టేవాడని...అర్థం. స్వామికి వేంకటేశ్వరుడని నారదుడే నామకరణం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. స్వామి అశ్వారూఢుడై తిరుపతి నుంచి బయలుదేరి మార్గ మధ్యంలో ద్వారకా తిరుమలలో ఒక అంశనూ, వాడపల్లి క్షేత్రంలో ఒక అంశనూ, విశాఖ జిల్లా ఉపమాకలోని గరుడాద్రి మీద ఒక అంశనూ స్థాపించినట్టు పురాణ కథనం. ఆ రోజుల్లో పెనుబోతుల గజేంద్రుడనే అగ్నికుల క్షత్రియుడు కొన్ని ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి భీకరమైన తుపాను వచ్చి, అతడి ఓడలన్నీ సముద్రంలో అదృశ్యం అయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే, గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు. తుపాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు వచ్చాయి. మొక్కుబడి ప్రకారం స్వామివారికి ఆలయాన్ని కట్టించాడు. ఆ లీలలు తెలుసుకున్న పెద్దాపురం సంస్థానాధీశుడు వత్సవాయి తిమ్మజగపతి మహారాజు సుమారు 375 ఎకరాల భూమిని నిత్య ధూప నైవేద్యాల నిమిత్తం సమర్పించారు. ఏటా చైత్రశుద్ధ ఏకాదశి రోజున ఈ క్షేత్రంలో స్వామివారి కల్యాణం, తీర్థం, తెప్పోత్సవం జరుగుతాయి. కల్యాణం జరుగుతున్నంతసేపూ మండపం సమీపంలో కర్పూర దీపాలు వెలుగుతుంటాయి. భక్తులు వందల కిలోల కర్పూరాన్ని వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ఆ సమయంలో గోవిందనామ స్మరణతో పరిసరాలు మారుమోగుతాయి. కల్యాణోత్సవం అనంతరం, బాణసంచా నడుమ తెప్పోత్సవాన్ని వైభవంగా జరుపుతారు.

అన్నదాన క్షేత్రం..
ఆలయంలో వేలాదిమందికి అన్నదానం జరుగుతుంది. ప్రస్తుతం శని, ఆదివారాలూ ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే సంతర్పణ చేస్తున్నారు. ఇటీవల ఈ పథకానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ రూ.కోటి సమకూరాయి. త్వరలో నిత్యాన్నదాన ట్రస్టును ఏర్పాటు చేసి రోజూ అన్నదానం నిర్వహిస్తారు. 1931లో రథోత్సవం జరుగుతుండగా...దేశభక్తులు రథం మీద ఉంచిన గాంధీజీ చిత్రపటాన్నీ, త్రివర్ణ పతాకాన్నీ బ్రిటిషు పాలకులు తొలగించారు. దీంతో ప్రజలు ఆగ్రహంతో వూగిపోయారు. అధికారులను ఎదిరించి, చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టారు. వేలాదిగా వచ్చిన జనాన్ని భయభ్రాంతుల్ని చేస్తూ...పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పులలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ పోరాటం భవిష్యత్తు తరాలకు తెలిసేలా ఇక్కడ ఓ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి కూడా దర్శనమిస్తాడు. విశిష్టాద్వైత ఆచార్యులైన పన్నెండుమంది ఆళ్వార్ల మూర్తులూ ఉన్నాయి. ఆలయానికి దక్షిణాన క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి కొలువుదీరాడు.

- ఆత్మాల వెంకట రామారావు, న్యూస్‌టుడే, ఆత్రేయపురం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.