close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అదిగదిగో అంతరిక్ష కేంద్రం...

అదిగదిగో అంతరిక్ష కేంద్రం...

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం... అదో ప్రత్యేక లోకం. ఆ లోకానికి వెళ్లి రావడమనేది సాంకేతికంగా మానవ పురోగతికి గొప్ప నిదర్శనం. అంతరిక్షంలోకి ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్తారు, అక్కడెలా ఉంటారు.... లాంటి విషయాలు పిల్లల్లోనూ, పెద్దల్లోనూ ఒకే విధమైన ఉత్సుకతనీ, ఆసక్తినీ కలిగిస్తాయి. మీకూ దీని గురించి తెలుసుకోవాలని ఉంది కదూ!

ఎలా వెళ్తారు...


ష్యా నిర్మిత సోయజ్‌ అంతరిక్ష నౌకలు మాత్రమే వ్యోమగాముల్ని ఐ.ఎస్‌.ఎస్‌.కు తీసుకువెళ్తున్నాయి. ఈ యాత్రలకి కజకిస్థాన్‌లోని బైకనూర్‌ ప్రయోగ కేంద్రం వేదిక. ఐ.ఎస్‌.ఎస్‌.ను చేరడానికి కొన్ని గంటల నుంచి రోజులు పడుతుంది. అంతరిక్ష యానానికి ఎంపికైన వ్యోమగాములకు మూడేళ్లపాటు శిక్షణ ఉంటుంది. రష్యన్‌ భాష నేర్చుకోవడం తప్పనిసరి. ఐ.ఎస్‌.ఎస్‌.లో వ్యోమగాములు సాధారణంగా ఆర్నెల్లు ఉంటారు. ముగ్గురు నుంచి ఆరుగురు నిత్యం అక్కడ ఉంటారు. ఐ.ఎస్‌.ఎస్‌.పైకి ఇప్పటివరకూ 18 దేశాల నుంచి 222 మంది వెళ్లి వచ్చారు. వారిలో పర్యటకులు కూడా ఉన్నారు. తిరుగు ప్రయాణంలో అంతరిక్ష నౌకల్ని తక్కువ వేగంతో ప్రయాణింపజేస్తారు. కజకిస్థాన్‌లోనే ల్యాండింగ్‌ అవుతుంటారు. ఐ.ఎస్‌.ఎస్‌.పైకి ఏడాదికి పది సార్లయినా సరుకు రవాణా అంతరిక్ష నౌకలు వెళ్లి వస్తాయి.

స్పేస్‌ సూట్‌

అంతరిక్షంలోకి వెళ్లేవారు తప్పనిసరిగా స్పేస్‌సూట్‌ని ధరించాలి. ఎందుకంటే అక్కడికి చేరే సమయంలో, అక్కడ కూడా ఉష్ణోగ్రతలు మైనస్‌ 128 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 93 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటాయి. ఐఎస్‌ఎస్‌కు వెలుపల ఏదైనా సమస్య వస్తే మరమ్మతులు చేయడానికి వ్యోమగాములు బయటకు స్పేస్‌సూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు స్పేస్‌సూట్‌లో ఆక్సిజన్‌ నింపుకొని వెళ్తారు. కార్బన్‌డైఆక్సైడ్‌ చేరడానికీ దాన్లో చోటు ఉంటుంది. స్పేస్‌సూట్‌లో పరికరాలు పెట్టేందుకూ అమరిక ఉంటుంది. స్పేస్‌ సూట్‌ మామూలుగా 140 కిలోల బరువుంటుంది. అంతరిక్షంలో మాత్రం అస్సలు బరువుండదు. స్పేస్‌వాక్‌ సమయంలో వ్యోమగాముల్ని బొడ్డు తాడులాంటి నిర్మాణంతో అంతరిక్ష కేంద్రానికి కట్టి ఉంచుతారు. స్పేస్‌వాక్‌ అలవాటు కావడానికి వ్యోమగాములకి శిక్షణ సమయంలో స్పేస్‌సూట్‌తో ఈత కొట్టిస్తారు.

నిద్ర-ఆహారం

ఐ.ఎస్‌.ఎస్‌.పైకి ఇది వరకు ట్యూబ్‌లూ, డీహైడ్రేటెడ్‌ ప్యాకెట్ల రూపంలో ఆహారాన్ని తీసుకెళ్లేవారు. ఇప్పుడు మాత్రం చపాతీల ప్యాకెట్లూ, వెన్న ప్యాకెట్లూ, తేనె సీసాలూ పట్టుకువెళ్తున్నారు. ఈ మధ్య పండ్లనీ పంపిస్తున్నారు. తినేటప్పుడు చెల్లాచెదురుగా పడే బ్రెడ్‌లాంటివి తీసుకువెళ్లరు. ఉప్పు, కారంతో పాటు దాదాపు పదార్థాలన్నీ పేస్టుల్లా ఉంటాయి. నీళ్లను చాలా పొదుపుగా వాడతారు. తిన్న తర్వాత టిష్యూ పేపర్‌లాంటి వాటితో శుభ్రంచేసుకుంటారు. కొన్ని చుక్కల నీటితోనే బ్రష్‌ చేసుకోవడం పూర్తవుతుంది. స్నానానికి టిష్యూ పేపర్‌ని తడిచేసి తుడుచుకుంటారు. చెమటా, మూత్రం శుద్ధి చేసి మంచినీటిగా వాడతారు. దీన్లో నిత్యం లైట్లు వెలుగుతూ ఉంటాయి కాబట్టి రాత్రీ పగలూ అన్న తేడా ఉండదు. నిద్రకోసం మనిషికి సరిగ్గా సరిపోయే పడక గదులు ఉంటాయి. అందులో రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోతారు.

‘అంతర్జాతీయం’ ఎందుకైందంటే...

అంతరిక్షంలో ఉన్న అతిపెద్ద కృత్రిమ పదార్థం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌-ఐ.ఎస్‌.ఎస్‌.). దీనికంటే ముందు రష్యాకు చెందిన అల్మాజ్‌, మిర్‌, అమెరికాకు చెందిన స్కైలాబ్‌ లాంటి అంతరిక్ష కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం ఐ.ఎస్‌.ఎస్‌. మాత్రమే వినియోగంలో ఉంది. నాసా(అమెరికా), రాస్‌కాస్మోస్‌(రష్యా), జాక్సా(జపాన్‌), సీఎస్‌ఏ(కెనడా), యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, మరికొన్ని దేశాల అంతరిక్ష అధ్యయన సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. వీరికి అక్కడ వేర్వేరు పరిశోధనా విభాగాలున్నాయి. అంతరిక్షంలోకి ఐ.ఎస్‌.ఎస్‌. ప్రధాన భాగం ‘జర్యా’ని 1998లో పంపారు. మిగతా భాగాల్ని ఒక్కొక్కటిగా 2010 వరకూ చేర్చుతూ అమర్చారు. దీని నిర్మాణానికి సుమారు రూ.7-8లక్షల కోట్లు ఖర్చుచేశారు. ఇదే అత్యంత ఖరీదైన మానవ నిర్మిత ప్రాజెక్టు. ఐ.ఎస్‌.ఎస్‌.పైన 2000 నవంబరు రెండు నుంచీ నిరంతరాయంగా వ్యోమగాములు ఉంటున్నారు.

గాల్లో తేలినట్టుందే...

ఐ..ఎస్‌.ఎస్‌.లోగానీ అంతరిక్షంలోగానీ వ్యోమగాములు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తారు. దీనికి కారణం సూక్ష్మ గురుత్వాకర్షణ బలం. గురుత్వాకర్షణవల్ల తనకి దగ్గరగా ఉండే వస్తువుల్ని భూమి తనవైపు ఆకర్షించుకుంటుంది. ఐ.ఎస్‌.ఎస్‌. భూమికి 350-400 కి.మీ. ఎత్తులో ఒక కక్ష్యలో తిరుగుతుంటుంది. భూ ఉపరితలంపైన ఉండే గురుత్వాకర్షణబలంలో 90 శాతం అక్కడ ఉంటుంది. దానివల్ల అది కూడా భూమివైపు ఆకర్షింపబడుతుంది. అయితే, దాన్ని తగినంత వేగంతో ఒక స్థిర కక్ష్యలో ప్రయాణించేట్టు చేయడంవల్ల అది కిందకి పడదు. అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ గంటకు 27,700 కి.మీ. పలాయన వేగంతో తిరుగుతుంటుంది. ఇలా వెళ్లేందుకు దానికి ఎలాంటి ఇంధనమూ అవసరం ఉండదు. అందులోని వ్యోమగాములు కూడా అంతే వేగంతో తిరగడంవల్ల ఐ.ఎస్‌.ఎస్‌. మాదిరిగానే వాళ్లూ భూమివైపు నిత్యం లాగబడతారు కానీ స్థిర కక్ష్యలో ఉండటంవల్ల పడిపోరు. ఫలితంగా వారు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తారు. అంతరిక్షంలో వారు కదలడానికి బలం అవసరం ఉండదు. దీనివల్ల వారి ఎముకలూ, కండరాలకు పని ఉండదు. ఫలితంగా అవి పటుత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కదలకుండా తాళ్లతో కట్టుకొని మరీ రోజూ రెండు గంటలపాటు సైక్లింగ్‌ చేస్తూ, ట్రెడ్‌మిల్‌పైన పరుగుతీస్తూ, బరువులు ఎత్తుతూ వ్యాయామాలు చేస్తారు. స్థిరంగా కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా తాళ్లతో కట్టుకోవాలి.

 

మీరెప్పుడైనా చూశారా!

కాశంలో ఐ.ఎస్‌.ఎస్‌.ని ఎప్పుడైనా చూశారా... చూసే ఉంటారు! కాకపోతే అది అంతరిక్ష కేంద్రమని తెలియకపోవచ్చు. సూర్యచంద్రుల తర్వాత ఆకాశంలో కనిపించే అత్యంత ప్రకాశవంతమైనది ఇదే! సూర్యోదయం, సూర్యాస్తమయాలకి కాస్త ముందూ వెనుక ఐ.ఎస్‌.ఎస్‌. కనిపిస్తుంటుంది! అది ఎప్పుడు, ఏ దిశలో కనిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటే నాసా వెబ్‌సైట్‌ (spotthestation.nasa.gov/ sightings/) లోకి వెళ్లి చూడండి.

ఫుట్‌బాల్‌ మైదానమంత...

ది సెకెనుకి 8కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ 90 నిమిషాలకోసారి భూమిని చుట్టి వస్తుంది. దీని పైనుంచి చూస్తే భూమిపైన 45 నిమిషాలు వెలుతురూ, 45 నిమిషాలు చీకటీ ఉంటుంది. రోజూ 15 సూర్యోదయాలుంటాయి. ఎకరా విస్తీర్ణం ఉండే సౌరపలకలు దీనికి విద్యుత్తునిస్తాయి.

* పొడవు 357 అడుగులు. విస్తీర్ణం ఫుట్‌బాల్‌ మైదానం అంత ఉంటుంది. లోపల స్థలం ఆరు బెడ్‌రూమ్‌ల ఇంటికంటే పెద్ద సైజులో ఉంటుంది. రెండు బాత్రూములున్నాయి. ఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలూ ఉన్నాయి. బరువు 4,19,455 కిలోలు. లక్ష కిలోల్ని మోయగలదు.

* స్కాట్‌ కెల్లీ(అమెరికా) దీనిపైకి మూడుసార్లు వెళ్లి రికార్డు స్థాయిలో 520 రోజులు ఉన్నాడు.

ఎన్నో పరిశోధనలు...

ఐ.ఎస్‌.ఎస్‌.లో వ్యోమగాములు వారంలో 35 గంటలపాటు పరిశోధనలు చేస్తుంటారు. రోజూ ఐ.ఎస్‌.ఎస్‌.ను శుభ్రపరుస్తూ, వివిధ భాగాల పనితీరుని పరీక్షిస్తుంటారు. వీటితోపాటు భూమిపైన వాతావరణంలో మార్పుల్నీ, అంతరిక్షంలో జరిగే సంఘటనల్నీ గమనించి ఏదైనా ప్రమాదం ఉందనుకుంటే ఆ సమాచారాన్ని వెంటనే కిందకు చేరవేస్తారు. జీవశాస్త్ర అంశాలపైనా అధ్యయనాలు చేస్తారు. మొత్తంగా భవిష్యత్తులో చంద్రుడూ, అంగారకుడి మీదకు మానవ సహిత అంతరిక్ష నౌకల్ని పంపేందుకు ఈ ప్రయోగాలు ఎలా ఉపయోగపడవచ్చో చూస్తారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుకోవచ్చు, ల్యాప్‌టాప్‌తో కాలక్షేపం చేయొచ్చు. కానీ ఎక్కువగా కిటికీ లోంచి భూమిని చూస్తూ, ఫొటోలూ తీయడానికి ఆసక్తి చూపుతారు. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.