close
సినిమాలకు పనికిరాడని పంపించేశారు!

సినిమాలకు పనికిరాడని పంపించేశారు!

సంజయ్‌ లీలా భన్సాలీ... ఆయన సినిమాల నిండా జనం ఉంటారు. ఆయనకు మాత్రం జనాల మధ్య ఉండాలంటే భయం. అతడి సినిమాల్లో బోలెడంత ప్రేమ ఉంటుంది. జీవితంలో మాత్రం అతడో భగ్న ప్రేమికుడు. సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. కానీ రోడ్డు పక్కన ఇరానీ ఛాయ్‌ తాగడానికే ఇష్టపడతాడు. ఒకప్పుడు సినిమాలకు పనికిరాడని భన్సాలీని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పంపించేశారు. కానీ ఇప్పుడతడు తాజా అవార్డుతో కలిపి నాలుగు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు.

బాజీరావ్‌ మస్తానీ సినిమా విడుదల కాకముందు చరిత్రను తప్పుదోవ పట్టించాడంటూ సంజయ్‌ లీలా భన్సాలీపైన ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ సినిమా థియేటర్లలోకి వచ్చాక విమర్శించిన వాళ్లే అద్భుత దృశ్య కావ్యం తీశాడంటూ కీర్తించారు. అంత భారీ సినిమాలో చిన్న చిన్న సన్నివేశాలపైన కూడా అతడు పెట్టిన శ్రద్ధను చూసి ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులకు ఆ పనితనం నచ్చి రూ.350 కోట్ల కలెక్షన్లను కానుకగా ఇచ్చారు. నిర్ణేతలూ చిత్రీకరణకు ముగ్ధులై ఈ ఏడాది ‘జాతీయ ఉత్తమ దర్శకుడి’ పురస్కారంతో సత్కరించారు. అంత భారీ విజయాన్ని అందుకున్న సినిమా పన్నెండేళ్ల క్రితమే సల్మాన్‌, కరీనా జంటగా కొంత చిత్రీకరణ జరుపుకుంది. కానీ రకరకాల కారణాలవల్ల ఇప్పుడు రణ్‌వీర్‌, దీపికల జోడీతో విడుదలైంది.

* ‘బాజీరావ్‌ మస్తానీ’కి ముందు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’, ‘దేవ్‌దాస్‌’, ‘బ్లాక్‌’, ‘రామ్‌లీలా’ లాంటి భారీ చిత్రాలను భన్సాలీ తీశాడు. బాలీవుడ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాల జాబితాలో దాదాపు వాటన్నింటికీ చోటు దక్కింది. నిర్మాతగా మారి ‘రౌడీ రాథోడ్‌’, ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’, ‘మేరీ కోమ్‌’ లాంటి సినిమాలు తీశాడు. దర్శకుడిగా మూడు చిత్రాలకూ, నిర్మాతగా ఒక చిత్రానికీ జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఆయన తీసిన ఎనిమిది చిత్రాల్లో నాలుగు నూటయాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.

* సినిమాల్లో భారీతనానికి భన్సాలీ పెట్టింది పేరు. కానీ నిజ జీవితంలో ఆయన స్వభావం దానికి విరుద్ధం. ఎక్కువ మంది మధ్యలో తిరగాలంటే భయమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే షూటింగు లేకపోతే ఇంట్లోనో, ఆఫీసులోనో కనిపిస్తారు. గత మూడేళ్లలో ఆయన ఒక్కసారి కూడా సినిమాకూ, రెస్టరెంట్‌కూ వెళ్లలేదట. ఇతర దర్శకుల్లా ఎక్కడెక్కడికో వెళ్లి కథలు రాసుకోవడం ఆయనకు అలవాటు లేదు. తీసిన కథలన్నీ ఇంట్లో తన బెడ్‌రూమ్‌లో కూర్చొని రాసుకున్నవే.

* కోట్ల రూపాయలు విలువైన సెట్లతో భన్సాలీ సినిమాలు కళాత్మకంగా కనిపిస్తాయి. కానీ ఆయన పెరిగిన పరిస్థితులు మాత్రం చాలా భిన్నం. భన్సాలీ తండ్రి నవీన్‌ బాలీవుడ్‌లో చితికిపోయిన నిర్మాత. భన్సాలీకి వూహ తెలిసే నాటికి ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇంట్లో మాత్రం సినిమా కబుర్లకు కొదవుండేది కాదు. భన్సాలీ ఓసారి తండ్రి స్నేహితుడు తీస్తోన్న సినిమా షూటింగ్‌కు వెళ్లాడు. అక్కడ సెట్టింగుల మధ్య జరుగుతోన్న హడావుడి అతడిపైన బలంగా ముద్రవేసింది. తానుకూడా పెద్దయ్యాక ఆ రంగుల ప్రపంచంలోకే వెళ్లాలని అప్పుడే అనుకున్నాడు.

* చదువుపైన పెట్టాల్సిన శ్రద్ధనూ సినిమాపైనే పెడుతూ పెరిగాడు భన్సాలీ. ఇంటరుతో చదువాపేసి ‘ఐఐఎఫ్‌టీ’(ఇండియన్‌ ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ)లో డైరెక్షన్‌ కోర్సులో చేరాడు. చిన్నప్పట్నుంచీ అతడు ఒంటరితనాన్నే ఇష్టపడుతూ వచ్చాడు. స్నేహితులూ, బంధువులతో సరిగా మాట్లాడేవాడు కాదు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రాజ్‌కుమార్‌ హిరానీ, శ్రీరామ్‌ రాఘవ లాంటి వాళ్లు అతడి సీనియర్లు. వాళ్లు పలకరించినా భన్సాలీ ముభావంగానే ఉండేవాడట. అతడి వ్యవహార శైలితో పాటు ఇన్‌స్టిట్యూట్‌లో ప్రదర్శన కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో కోర్సు మధ్యలోనే అతడిని బయటకు పంపించారు. దాంతో ఎలాగైనా ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న వాళ్లకంటే ముందుగా తానే దర్శకుడిగా మారాలన్న కసి పెంచుకున్నాడు భన్సాలీ.

* మొదట దర్శకుడు విధూ వినోద్‌ చోప్రా దగ్గర సహాయకుడిగా చేరిన భన్సాలీ, అతడు తీసిన ‘పరిందా’ సినిమాలో ఓ పాటను చిత్రీకరించాడు. కానీ థియేటర్లో ఆ పాట రాగానే ప్రేక్షకులు లేచి బయటకు వెళ్లిపోవడం చూసి అతడి మనసు చివుక్కుమంది. భవిష్యత్తులో తాను తీయబోయే సినిమాల్లో పాటలకు ప్రతి ఒక్కర్నీ కదలకుండా కూర్చోబెట్టాలని అనుకున్నాడు. ‘దేవ్‌దాస్‌’, ‘సావరియా’, ‘రామ్‌లీలా’ లాంటి సినిమా వీడియోసాంగ్స్‌కు యూట్యూబ్‌లో కోట్లలో వచ్చిన హిట్‌లను చూస్తేనే పాటల చిత్రీకరణలో అతడు అనుకున్న లక్ష్యాన్ని ఎంతవరకూ చేరుకున్నాడో అర్థమవుతుంది.

* భన్సాలీ తొలి సినిమా ‘ఖామోషి’ విడుదల రోజు నిర్మాత నుంచి ‘సినిమా పోయింది’ అంటూ తొలి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అప్పట్నుంచీ తన సినిమా విడుదల రోజున ఫోన్లను ఎత్తడం మానేశాడు. రెండో సినిమా ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ను సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, ఐశ్వర్యరాయ్‌ లాంటి స్టార్‌లతో తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరవాత ‘దేవ్‌దాస్‌’తో హిందీ సినిమాల్లో ‘ఆల్‌టైం బెస్ట్‌’ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఆ సినిమా దర్శకుడిగా తొలి జాతీయ అవార్డును అందుకున్నాడు భన్సాలీ. తరవాత తీసిన ‘బ్లాక్‌’ చిత్రంతో మరోసారి అదే అవార్డును కైవసం చేసుకున్నాడు. నిర్మాతగా మారి ప్రియాంక చోప్రాతో తీసిన ‘మేరీ కోమ్‌’కు ఉత్తమ నిర్మాత పురస్కారం దక్కింది. ‘బాజీరావ్‌ మస్తానీ’తో మరో అవార్డు ఖాతాలో పడింది.

ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునేప్పుడు భన్సాలీ ఆ కోర్సుకు పనికిరాడని తేల్చి బయటకు పంపించారు. అసిస్టెంటుగా పనిచేసేప్పుడు ఎనిమిదేళ్లపాటు తొలి అవకాశం కోసం ఎదురుచూస్తూ గడిపాడు. ఈ రెండు పరిణామాలకూ కుంగిపోయుంటే భన్సాలీ కథ కూడా తండ్రిలానే బాలీవుడ్‌ చరిత్రలో కలిసిపోయేదే. కానీ పరిస్థితులపైన కసిగా పోరాడబట్టే ఇప్పుడు అతడి విజయాలు చరిత్రలో నిలిచిపోయాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.