close
పథకం

పథకం
- వలివేటి నాగచంద్రావతి

గొప్ప ఇరకాటంలో పడిపోయింది మాణిక్యాంబ. ‘ఎగదీస్తే బ్రహ్మహత్యా దోషం, దిగదీస్తే గోహత్యా పాతకమనీ’- ఎవళ్ళని మెప్పించినా రెండోవాళ్ళతో నిష్ఠూరపడక తప్పని పరిస్థితి. ఎలా ఈ సమస్యకి పరిష్కారం..? మెదడుకి పదునుపెట్టి మరీ ఆలోచిస్తోంది మాణిక్యాంబ. ‘అదిగో, ఆ కౌలు రైతు అనువుగాని వేళలో వచ్చి నాకీ తలనొప్పి తెచ్చిపెట్టాడు’ విసుక్కుంటోంది లోపల్లోపల.

నిజమే... తప్పంతా ఆ రైతు రాజన్నదే. లేకపోతే ఇంటిల్లిపాదీ చూస్తూండగా, ముఖ్యంగా ఇద్దరు కోడళ్ళూ అక్కడే ఉండగా- కౌలు డబ్బు తెచ్చి ఆవిడ చేతిలో పెట్టడమేమిటి- కాస్త కనుమరుగు ఉండవద్దా? ఇప్పుడు చూడు, కోడళ్ళిద్దరికీ ‘అత్తగారు ఆ డబ్బుతో ఏం చేస్తుందా...’ అన్న ఆరానే గదా.

నిజం చెప్పాలంటే ఆవిడకు తప్ప ఆ డబ్బు మీద ఎవరికీ అధికారం లేదు. మాణిక్యాంబకి పుట్టింటివాళ్ళు పసుపు, కుంకం కింద ఇచ్చిన అయిదెకరాల మామిడితోట మీది అయివేజు అది.

మొట్టమొదట్లో అయిదువేలో పదివేలో వచ్చేవి. రానురానూ రాబడి పెరిగింది. ఈసారి ఏకంగా లక్ష రూపాయలు వచ్చినయ్‌. భర్తకీ కొడుకులకీ తోటమీదొచ్చే దానిమీద చూపుపడదు. అది ఆవిడది. అంటే స్త్రీ ధనం. ‘అది ఆశించటం తప్పు’ అనే కాన్సెప్టుకి మైండ్‌సెట్‌ అయిపోయింది వాళ్ళకి ఎప్పుడో.

అసలా డబ్బుతో అవసరం కూడా లేదు వాళ్ళకు. మాణిక్యాంబ భర్త పద్మనాభంగారిది మెడికల్‌ షాపు. మితిమీరిన రాబడి కాకపోయినా భార్య సొమ్ము వాడుకోవలసిన పరిస్థితి రాలేదెప్పుడూ. పెద్దకొడుకు వంశీకృష్ణ తండ్రి నడిచిన బాటలోనే డి.ఫార్మా చేసి తండ్రి షాపుకి లింకుగా ఇంకోచోట మరో బ్రాంచి తెరిచేశాడు. చిన్నకొడుకు రాధాకృష్ణ బ్యాంకు ఉద్యోగి. రెండేళ్ళు వేరే డిస్ట్రిక్టులో చేసి ఈమధ్యనే సొంతూరికి ట్రాన్స్‌ఫరయి వచ్చాడు. దానాదీనా వాళ్ళే చీర కొనుక్కోమనో, చేతిఖర్చుకి ఉంచుకోమనో తల్లిచేతికి డబ్బిస్తుంటారు. మరంచేత వాళ్ళతో ఆవిడ సొంత డబ్బుకే ప్రమాదం లేదు.

ఇక ఆ రొఖ్ఖం ఏం చేసుకుంటుందీ అంటారా- ఉందిగా సీతామహాలక్ష్మి... ఆ పిల్లకి ఏ నగో నట్రో చేయించి పెడుతుంది. కోరిందల్లా కొనిపెడుతుంది. ఇంతకీ సీతామహాలక్ష్మి అంటే ఎవరో అనుకునేరు- ఆవిడ చిట్టచివరి సంతానం. గారాబాల కూతురు. ప్రాణంలో ప్రాణం. తన సొంత ఆస్తికి వారసురాలు. కుదిరితే కూతురు అత్తవారింటికి వెళ్ళేలోగా ఏడువారాల నగలూ చేయించి ఉంచాలని మాణిక్యాంబ సంకల్పం. ఇప్పటివరకూ అలాగే కొద్దికొద్దిగా కూడుస్తూ వస్తోంది కూడా- ఒకళ్ళనడిగే పనిలేకుండా తన డబ్బుతోనే.

ఈ ఏడాది పరిస్థితి అదికాదు. ఈ ఏడే ఆరునెలలు అటూఇటుగా ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళూ చేశారు. కోడళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్ళకెదురుగా అత్త చేతికి అంత డబ్బొచ్చిపడితే వాళ్ళు చూస్తూండగా ఆ మొత్తమంతా తీసుకెళ్ళి కూతురికే కట్టబెట్టేస్తే ఏం బావుంటుంది... కోడళ్ళేమనుకుంటారు. కొడుకులకి కూడా తన చర్య బాధ కలిగించదా. అమ్మకి వలపక్షమనుకోరా. కొత్తగా వాళ్ళ మనసుల్ని కూడా చెడగొట్టినదవదా. ఇప్పటివరకూ అందరి మధ్యనా ఉన్న సద్భావం, సామరస్యం సన్నగిల్లిపోవా..!

అలా అని కూతురితో సమానంగా వాళ్ళకీ ఎలా పంచి ఇవ్వటం..? ‘ఈ ఏడాది కాపు బాగుందమ్మా. మామూలుకంటే పదివేలు ఎక్కువే వస్తాయి’ అని కాయ కోసేటప్పుడు తోటమాలి అంటే ఎంత సంతోషపడ్డదో మాణిక్యాంబ. కిందటేడాది సీత చెవులకి ఎర్రరాళ్ళు పొదిగిన బుట్ట లోలాకులు కొన్నది. ఈసారి ఇంకాస్త పెద్ద వస్తువే తీసుకోవచ్చును- అని.

సీత ముందే చెప్పేసింది కూడా- ‘ఈసారి తోట డబ్బుతో నాకు నెక్లెస్సో, గాజులో కొనిపెట్టాలి సుమా’ అని. ఇప్పుడు కోడళ్ళిద్దరికీ వాటా పెడితే సీతకేమి మిగులుతుంది - ముక్కుపుడక తప్ప...ప్చ్‌!

ఇన్నేళ్ళూ ఎదురుకాని ధర్మసంకటం. పాపం మాణిక్యాంబ... ఎంత మథనపడినా, ఎంతగా బుర్రకి పరీక్షపెట్టినా కోడళ్ళని ఏమార్చి సీతని సంతృప్తిపరిచే మార్గం దొరకందే..!

* * *

షాపుకి వెళ్ళేముందు జేబులోంచి తీసి పదివేల రూపాయలు భార్య చేతికిచ్చారు పద్మనాభంగారు. ‘‘శ్రావణమాసం కదా, వ్రతం రోజుకి మీ నలుగురూ బట్టలు తెచ్చుకోండి’’ అని. ‘‘కోడళ్ళకిది తొలి పూజ. కొంచెం మంచి చీరలు తీసుకో వాళ్ళకు’’ అన్నారు లోగొంతుతో.

ఆ అదను దొరకబుచ్చుకుంది మాణిక్యాంబ. ‘‘చీరలు కాదండీ, కొత్త కోడళ్ళకి పూజలో బంగారం పెడితే బాగుంటుంది. వాళ్ళ మెడలోకి ఏమన్నా నగ చేయించకూడదూ’’ అన్జెప్పి భర్త మొహంలోకి చూసింది. అప్పటికప్పుడు ఆవిడకు తట్టిన ఉపాయం ఏమిటంటే, భర్తచేత కోడళ్ళిద్దరికీ- చిన్నవో చితకవో ఆభరణాలు కొనిపించేసి, కంటికి నదరుగా పళ్ళెంలో పట్టుచీరల మీద వాటిని పెట్టించేసి, వాళ్ళతో ఆర్భాటంగా పూజ జరిపించేసి, ఆ చేత్తోనే తను కొనే వస్తువు ఏ ఆడంబరమూ లేకుండా మామూలుగా కూతురికిచ్చేసి, కంట్లో కనుమాయ చేసేయాలి... అదీ ప్లాను. అప్పుడయితే కోడళ్ళకంతగా తనమీద నిష్ఠూరం వేసే అవకాశం ఉండదని ఆవిడ ఆలోచన.

పద్మనాభంగారు ఆ ఆశని ఇట్టే నీరుగార్చేశారు. ‘‘అబ్బే, ఇప్పుడవేం లాభంలేదు. ఇన్‌కమ్‌టాక్స్‌ గొడవల్లో ఉన్నాను. ఎక్కువ మొత్తం పెనాల్టీ కట్టాల్సొచ్చేలా ఉంది ఈ నెల. నా తలమీదికి నీ బిల్లు కూడా పెట్టకిప్పుడు’’ అన్నారు విసుగ్గా. అంతలోనే చల్లబడిపోయి ‘‘గ్రాము బంగారంలో వచ్చేలా - రూపు అనో ఏదో అంటావుగా - తేలికలో అవి తెచ్చేసి కార్యం జరిపించెయ్యి ఈసారికి’’ అనేశారు.

సమస్య భేతాళ శవంలా మళ్ళీ చెట్టెక్కి వెక్కిరించింది.

చివరిగా ఓ ప్రయత్నం... ఆ రాత్రి పద్మనాభంగారు బిల్లు పుస్తకాలు ముందేసుకుని పనిచేసుకుంటుంటే పక్కన కూర్చుని తన గోడు వెళ్ళబోసుకుంది మాణిక్యాంబ. దాచుకోకుండా మనసు విప్పింది. ‘‘ఏం చేయమంటారండీ’’ అనడిగింది చివరికి- ఆయన సలహా మీద నమ్మకం లేకపోయినా- మరోదారిలేక.

ఆయనో ధర్మరాజు. ‘‘తప్పు మణీ. నువ్వు చేయాలనుకునేది చాలా తప్పు. ఏ ఇంట్లోనో పుట్టి... ఎల్లకాలం మనతోపాటు ఉండిపోవాలనొచ్చిన కోడళ్ళు మనకి సొంత పిల్లలతో సమానమే. నన్నడిగితే ఇంకా ఎక్కువే. నువ్వలా పక్షపాతబుద్ధితో ఆలోచించటం నాకేమీ బాగోలా. నువ్వే మళ్ళొకసారి నిదానంగా ఆలోచించు’’ అంటూ న్యాయశాస్త్రం విప్పారు.

‘బుద్ధితక్కువై ఈయన్నడిగాను’ అనుకుంది మాణిక్యాంబ. ‘ఈయనేదో తనకు వత్తాసుగా ఏదన్నా యుక్తిగా గట్టెక్కే విధానం చెబుతారనుకుంటే... హ్హు... గత్యంతరమేముంది. ఇష్టమున్నా లేకపోయినా ఆయన చెప్పినట్టే చేయాలిక’ ఓడిపోయినట్టు నీరసంగా నిట్టూర్చింది మాణిక్యాంబ.

* * *

కల్యాణ్‌ జ్యూయలరీ- శ్రావణలక్ష్మికి స్వర్ణంతో స్వాగతం చెప్పాలనుకునేవాళ్ళతో కిటకిటలాడుతోంది.

అంతమంది జనంలోంచీ విజయవంతంగా పని ముగించుకుని ఇద్దరు కోడళ్ళతో ఇవతలకు వచ్చింది మాణిక్యాంబ. కోడళ్ళు సంపూర్ణ, సంయుక్తల మొహాలు సంతోషంతో కళకళలాడ్తున్నాయ్‌. అత్తగారు వాళ్ళకు ముత్యాల లాకెట్‌ ఉన్న హారాలు కొన్నది. అంతకుముందే చందనాలో వాళ్ళు కోరుకున్న రంగుల్లో డిజైనర్‌ చీరలు తీసుకుంది. ఆ చీరల మీదికి బ్లౌజులు కూడా. ‘‘చిన్న పిల్లలు మీరు. చక్కగా జాకెట్లు మోడల్‌గా కుట్టించుకోండి, బావుంటుంది’’ అన్జెప్పి పేరున్న టైలరింగు షాపు దగ్గరికి తీసుకువెళ్ళింది. ఓపిగ్గా వెతికివెతికి మ్యాచింగ్‌ గాజులూ, బిందీలూ కొన్నది. వచ్చేసేటప్పుడు ఐస్‌క్రీమ్‌ ఇప్పించింది.

అత్తగారి హృదయ వైశాల్యానికి ఉక్కిరిబిక్కిరి అయిపోయారు కోడళ్ళు. ‘‘ఎందుకిప్పుడు ఇంత ఖర్చు’’ అని వాళ్ళిద్దరూ వారించినా, మొహమాటపడినా కూడా ఆవిడ వినిపించుకోలేదు.

‘‘మీరు మా ఇంట్లో కాలు మోపాక తోటమీద నాకొచ్చిన ఆదాయం ఇది. దీంతో మా ఇంటి మహాలక్ష్ములకి పర్సనల్‌గా ప్రజెంటేషన్‌ ఇస్తున్నాను. మీరు తృప్తిపడితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. మాట్లాడకండి మరి’’ ఆధునిక అత్తగారిలా హుందాగా అంది మాణిక్యాంబ.

‘ఎంత మంచిదో మా అత్తగారు. తనకని పైసా ఉంచుకోకుండా మాకోసం ఖర్చు పెట్టేసింది.’ ఆ క్షణంలోనే అత్తగారికి ‘ఫిదా’ అయిపోయారు కోడళ్ళిద్దరూ.

కొద్దోగొప్పో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలే వాళ్ళు. కానీ, పుట్టింట్లో పొందిన వైభోగంకంటే అత్తింట్లో దొరికిన ఆదరణే కదా అమ్మాయికి గొప్ప పురస్కారం.

అత్తగారు పాత తరం గయ్యాళి, సూర్యకాంతంలా ఆరళ్ళు పెట్టే తరహా కాదని కాపురానికి వచ్చిన కొత్తల్లోనే అర్థమయిపోయింది వాళ్ళకు. తమతో సాయిలా, పాయిలాగా ఉంటుంది. పనిచెప్పినా పెత్తనం చెలాయిస్తున్నట్టుగా కాకుండా సాయపడమని అడుగుతున్నట్టుగా చెబుతుంది. అంచేత అత్తగారంటే ముందే ఓ మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకి. ఈ రోజయితే ఆ సుహృద్భావం పరాకాష్ఠకు చేరిందనుకోవాల్సిందే.

అత్తగారి ఔదార్యం రవ్వంత శృతిమించి పోయిందనిపించిందెప్పుడంటే- ఇంటికి రాగానే సీతామహాలక్ష్మి ఎదురొచ్చి ‘‘ఏం తెచ్చారు, ఏం తెచ్చారు’’ అంటూ ఆరాటంగా బ్యాగులన్నీ వెతికేసి, ‘‘నాకేం తేలేదా?’’ అని బిక్కమొహం పెట్టిందే - అప్పుడనిపించింది.

తెల్లబోయారు వాళ్ళు. ‘ఇదేమిటి, ముద్దుల ఆడబిడ్డనెలా మర్చిపోయాం. తాము సరే, అత్తగారో...’

మాణిక్యాంబ మాత్రం పట్టించుకున్నట్టే లేదు. ‘‘నీకెందుకే, మొన్నమొన్ననే కదా కాలేజీలో జాయినయ్యేటప్పుడు పది డ్రెస్సులదాకా కుట్టించాను. వాటిల్లో కొత్తవి ఒకటి రెండు మిగిలే ఉన్నాయ్‌, అవేసుకుందువుగాని’’ అంది నిర్లక్ష్యంగా తేల్చేస్తూ.

‘‘అదికాదు, నువ్వేమని మాటిచ్చావ్‌... తోట డబ్బు రాగానే చేతులకి... ...’’

ఇంకా ఆ పిల్ల మాటలు పూర్తికాకుండానే- ‘‘నోర్ముయ్‌, ప్రతిదీ నువ్వనుకున్నట్టే జరగాలంటావ్‌. మరీ మంకుతనమెక్కువవుతోంది నీకు’’ అంటూ చెయ్యి పట్టుకుని బిరబిరా లాక్కెడుతున్నట్టే కూతుర్ని అక్కణ్ణుంచి తీసుకెళ్ళిపోయింది మాణిక్యాంబ.

ఎందుకోగానీ అపరాధం చేసిన ఫీలింగు. చేయని తప్పుకు చిన్నబోయి చూస్తూండిపోయారు సంపూర్ణ, సంయుక్తలు.

నాలుగు రోజుల్లో వరలక్ష్మీ వ్రతం. ఈ నాలుగురోజులూ కాలేజీ టైము మినహాయించి ఇంట్లో ఉన్నంతసేపూ మొహం ముడుచుకునే ఉంది సీత. మాణిక్యాంబ సముదాయిస్తూనే ఉంది. ఎవరూ వినకూడదన్నట్టుగా గుసగుసగా మందలిస్తూనే ఉంది. కానీ అదేం రాజభవనమా వినిపించకపోవటానికి.

వ్రతం రోజు- పూజ పూర్తయింది. ‘‘ఇక నైవేద్యాల పని మీదే’’ పూజ చేయించిన పురోహితులవారు దక్షిణ తాంబూలాదులు స్వీకరించి నిష్క్రమించారు.

చేసిన పిండి వంటలతోపాటు వెండి పళ్ళాలలో కోడళ్ళకు తెచ్చిన చీరలూ, హారాలున్న జ్యూయలరీ బాక్సులూ మనసులో రేగుతున్న తత్తరపాటు పైకగుపడనీకుండా పరమ శాంతంగా అమ్మవారి ముందర పెట్టింది మాణిక్యాంబ.

‘మరి నీకూ, నాకో?’ సీత మహా కోపంగా పైకెగరేసిన నొసలు వేసే ఆందోళనతో కూడిన ప్రశ్న.

భార్య వేసిన పథకమేమిటో తెలీక ‘ఏం కథ?’ అన్నట్టు పద్మనాభంగారు చిట్లించిన కళ్ళతో సందేహం నిండిన ప్రశ్న.

ప్రశాంతత నటిస్తోన్న మాణిక్యాంబ గుండె గుబగుబలాడిందో క్షణం. పల్చటి మబ్బుతెర వెనకాలున్నట్టున్న కూతురి మొహం ముల్లులా గుచ్చుతోంది ఆమె మనసులో. ‘కొంపతీసి తన అతి తెలివి కొంప ముంచదు కదా!’

‘‘చూడు సీతా, నా బీరువా పక్క అలమరలో నీ కాటన్‌ డ్రస్సూ, నా కొత్త నేతచీరా ఉన్నాయ్‌... అవి తీసుకురా, పసుపు పెడతాను’’ బింకం చెడనీయకుండా సీతకి చెప్పింది మాణిక్యాంబ.

‘‘ఒక్క నిమిషం ఆగు సీతా’’ ఎదురుగా కోడళ్ళు సంపూర్ణ, సంయుక్తలు. వాళ్ళ చేతుల్లో ప్యాకెట్లు.

సంపూర్ణ- సీత రెండు చేతులూ పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. బొట్టుపెట్టి ప్యాకెట్‌ అందిస్తూ ‘‘మా ప్రకాష్‌ అన్నయ్య దుబాయ్‌ నుంచి పూజ కోసమని నాకీ డైమండ్‌ గాజుల జత పంపించాడు. ఎడంచేతికి వాచీ పెట్టుకుంటే కుడిచేతికి వేసుకునేది ఒకటే గాజు కదా. అందుకని మిగతా గాజు మా చిట్టి ఆడపడుచుకి’’ వెడల్పుగా ధగధగలాడుతోన్న గాజు సీత చేతికి తొడుగుతూ ఆప్యాయంగా నవ్వింది. ‘‘ఈ చీర కూడా వాడు పంపిందే అత్తయ్యా, వాడికి అస్సలు సెలెక్షన్‌ తెలీదు... చూడండి, పెద్దవాళ్ళు కట్టుకునేలాగా ఉంది. నాకు మీరు కొన్నదే బావుంది. ఇది మీరు కట్టుకోండి అత్తయ్యా. ఆ పెద్ద బోర్డరు మీకు చాలా బావుంటుంది’’ అంటూ ఇంకో ప్యాకెట్‌ మాణిక్యాంబకీ అందించింది.

ఇప్పుడు సంయుక్త వంతు- ‘‘ఈ డ్రస్సులు నాలుగూ కొత్తవి సీతా. అమ్మావాళ్ళిచ్చిన సారెలో ఈ నాలుగూ ఉన్నయ్‌. నేనెటూ డ్రస్సులు వేసుకోవటం మానేశాను గదా... ఈ చుడీదార్లు నువ్వు వేసుకో, ఈ వాచీ కూడా నీకే... నచ్చిందా’’ అంది అభిమానం వెదజల్లుతూ.

మాణిక్యాంబ మొహంలో మెరుపు- విజయదరహాసంతో. ‘అమ్మయ్య, తన అంచనా తప్పవలేదు. తన వ్యూహం ఫలించింది.’

‘హమ్మ మాణిక్యాంబా’- ముక్కున వేలేసుకుంది పీఠం మీదున్న అమ్మవారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.