close
ఋణాత్మకం

ఋణాత్మకం
- ఎమ్వీ రామిరెడ్డి

రోడ్డుకు రెండువైపులా నిన్న మొన్నటిదాకా పచ్చదనం పరవళ్ళు తొక్కేది.
తెల్లటి పూలకొప్పులతో పత్తిచేలు, ఎర్రటి కాయల గుత్తులతో మిర్చిపొలాలు.
ఇప్పుడు ఎకరాలూ సెంట్లుగా విడిపోయి వెంచర్లు వెలిశాయి. పసుపూ, ఎరుపురంగుల రాతికూసాలు మొలిచాయి.

పెట్లూరివారిపాలెం దాటి, అచ్చమ్మపాలెం వెళ్ళే డొంకరోడ్డులోకి మలుపు తిరిగింది కారు. కోటప్పకొండ చుట్టూ ఏర్పాటుచేసిన దేవుళ్ళ విగ్రహాలు క్రమంగా దగ్గరవుతున్నాయి. కారు నడుపుతున్న శివరామయ్య మనసులోనే త్రికోటేశ్వరస్వామికి మొక్కుకున్నాడు, తాను కొనబోయే భూమికి భవిష్యత్తులో భారీ డిమాండు రావాలని.

శివరామయ్య దగ్గర ఏళ్ళ తరబడి చేస్తున్న అప్పుల్ని ఎలా తీర్చాలో అర్థంకాని బాలరాజుకు మాత్రం దేవుడు స్ఫురణక్కూడా రాలేదు. ఎడమవైపు సీట్లో అసహనంగా కదుల్తున్నాడు.

‘‘మనం నర్సరావుపేట నుంచి ఇంకొంచెం ముందు బయల్దేరాల్సిందిరా’’ శివరామయ్య అన్నాడు.

‘‘అవునండీ’’ ముక్తసరిగా జవాబిచ్చాడు బాలరాజు.

కారు మరో కిలోమీటరు ప్రయాణించి, బాలరాజు సూచన మేరకు ఓ వేపచెట్టు పక్కగా నాలుగెకరాల భూమిలోకి చేరుకుంది. ఇద్దరూ కారు దిగారు.

‘‘ఇదేనా ఆ బిట్టు?’’ అడిగాడు శివరామయ్య.

‘‘అవునండీ. ఉత్తరాన ఆ ముళ్ళకంచె, దక్షిణం ఆ కనిపించే నిమ్మతోట, పడమట ఆ తుమ్మచెట్లు హద్దులు’’ వివరించాడు బాలరాజు తూర్పున ఉన్న డొంకరోడ్డుకు దగ్గరగా నిలబడి.

అరవై నిండిన శివరామయ్యది ఆరడుగుల భారీ విగ్రహం. దృఢంగా ఉంటాడు. మొహంలో గాంభీర్యం.

యాభైకి దగ్గర్లో ఉన్న బాలరాజు బక్కపలచగా ఉంటాడు. అయిదున్నర అడుగుల ఎత్తు. మొహంలో ఆందోళన.

శివరామయ్య గట్లు చూడటానికి చకచకా నడుస్తున్నాడు. బాలరాజు పరుగులాంటి నడకతో అనుసరిస్తున్నాడు.

***

తండ్రి హఠాన్మరణంతో చిన్నవయసులోనే కుటుంబ బాధ్యతలు బాలరాజు మీద పడ్డాయి. ఓ ఆసామి దగ్గర జీవితాంతం జీతగాడిగా పనిచేసిన తండ్రి సొంత ఇల్లు తప్ప, సెంటు పొలం కూడా సంపాదించలేకపోయాడు. తల్లి, ముగ్గురు చెల్లెళ్ళ కోసం పదో తరగతితోనే చదువు చాలించి, నాలుగెకరాలు కౌలుకు తీసుకుని, తలగుడ్డ చుట్టి నాగలి పట్టాడు. కాలం కలిసొచ్చి, పంటలు బాగా పండాయి. నాలుగేళ్ళు తిరక్కుండానే రెండెకరాల పొలం కొన్నాడు.

సొంత పనుల్లేని రోజు మరొకరి పొలంలో పనులకు వెళ్ళేవాడు బాలరాజు. అలా పరిచయమయ్యాడు పాతికెకరాల ఆసామి శివరామయ్య. ఇద్దరికీ పనిలో లయ కుదిరింది. క్రమంగా శివరామయ్యకు బాలరాజు కుడిభుజంగా మారాడు.

ముగ్గురు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసేసరికి, బాలరాజుకు ముప్ఫై నిండాయి. నిండా అప్పులయ్యాయి. అడిగినప్పుడల్లా కాదనకుండా అవసరానికి అప్పులిచ్చుకుంటూ వచ్చిన శివరామయ్యకు తాను సంపాదించిన రెండెకరాలూ కట్టబెట్టినా, ఇంకా నికరంగా నాలుగు లక్షల అప్పు తేలింది. దెబ్బతిన్న తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంలో అప్పు మరో రెండు లక్షలు పెరిగిందే తప్ప, తల్లి దక్కలేదు. ముప్ఫైరెండేళ్ళకు బాలరాజు పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లల్ని బాగా చదివించాలని నిశ్చయించుకున్నాడు.

కొడుకులిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడటంతో, శివరామయ్య పొలం మొత్తం కౌలుకిచ్చి, మకాం హైదరాబాదుకు మార్చాడు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించాడు. అప్పట్నుంచీ శివరామయ్యలో వచ్చిన మార్పుల్ని బాలరాజు గమనిస్తూనే ఉన్నాడు. అంతకుముందు రూపాయి వడ్డీ వసూలుచేసే శివరామయ్య, దాన్ని రెండు రూపాయలుగా మార్చి, ఎనిమిది లక్షల పైచిలుకు మొత్తానికి నోట్లు రాయించుకున్నాడు. ఎన్నోసార్లు పదివేలు, పాతికవేలు చేబదులుగా ఇచ్చి, వడ్డీ లేకుండా తిరిగి చెల్లించే అవకాశమిచ్చిన వ్యక్తి... ఇప్పుడు తన బాకీ చెల్లించమంటూ ఒత్తిడి చేస్తున్నాడు.

బాలరాజు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా ఏయేటికాయేడు పెట్టుబడులు వస్తున్నాయే తప్ప అప్పుగోతిని పూడ్చేటన్ని పైసలు మిగలటం లేదు. పైగా, మూడేళ్ళ నుంచీ ఏటా వడ్డీ తిరగరాసే కొత్త పనికి శ్రీకారం చుట్టాడు శివరామయ్య.

ఈమధ్యకాలంలో, పది రోజులకు ఒకసారి లింగంగుంట్లలోనే నివసించే శివరామయ్య బావమరిది వీరేంద్ర, పనిగట్టుకుని మరీ బాలరాజు ఇంటికొచ్చి బాకీ తీర్చమంటూ వేధించడం మొదలైంది.

నెలక్రితం శివరామయ్య బాలరాజుకు ఫోన్‌చేసి, కోటప్పకొండ సమీపంలో నాలుగెకరాల పొలం చూడమని చెప్పాడు. తనకు నచ్చే మంచి బిట్టు చూపిస్తే, ఆ మేరకు కమీషన్‌ మొత్తాన్ని అప్పులో చెల్లబెట్టుకుంటానన్నాడు. ఆ వ్యవహారంతో సంబంధం లేకపోయినప్పటికీ, సంబంధిత వ్యక్తుల్ని సంప్రదించి, అమ్మకానికి ఉన్న అనువైన భూమిని పట్టుకోగలిగాడు బాలరాజు.

***

‘‘కోటప్పకొండ ఎంత దూరం?’’ చేతిలోకి మట్టిని తీసుకుని, దాని నాణ్యతను పరిశీలిస్తూ అడిగాడు శివరామయ్య.

‘‘రెండు కిలోమీటర్లు. సరిగ్గా మనం కొండకు వెనకవైపు ఉన్నామన్న మాట’’ వివరణ ఇచ్చాడు బాలరాజు.

‘‘కొత్తగా ఏదో రోడ్డు వస్తుందని చెప్పావు?’’

‘‘కొండ చుట్టూ ప్రదక్షిణ కోసం ప్రత్యేకంగా రోడ్డు మంజూరయింది. అదుగో, ఆ కరెంటు స్తంభం పక్కనుంచే రోడ్డు పోతుంది. ఆ పనిగానీ మొదలైతే, ఇది సెంటు నాలుగు లక్షలు పలుకుద్ది’’ అలవాటులేని మాటలు చెబుతుంటే, బాలరాజు మనసుమూలలో కలుక్కుమంటోంది.

‘‘ఇప్పుడెంత చెబుతున్నారు?’’

‘‘సెంటు లక్షన్నర చెబుతున్నారు. కూర్చుంటే ఒకటీ ఇరవైకి రావచ్చు.’’

సూర్యుడు అస్తమించినా పూర్తిగా చీకటి పరుచుకోలేదు. నాలుగెకరాల్లోనూ నలుమూలలా తిరిగి, సంతృప్తిగా తలాడించాడు శివరామయ్య. ప్రస్తుతానికి సపోటా మొక్కలు వేసి, అయిదారేళ్ళలో ప్లాట్లుగా మార్చి భారీ లాభాలకు అమ్మొచ్చన్న పథకం అతని మనసులో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంది.

‘‘ఇంకో బిట్టు కూడా ఉందని చెప్పావు?’’

‘‘అవును సార్‌. అదుగో ఆ నిమ్మతోటకు పడమటి పక్క.’’

‘‘అది కూడా చూద్దామా?’’

‘‘చీకటి పడుతుందేమో సార్‌.’’

‘‘జస్ట్‌, కారులో వెళ్తూ అలా చూద్దాం’’ అంటూనే కారెక్కాడు శివరామయ్య. బాలరాజు కూడా పక్కనే కూచున్నాడు.

నిమ్మతోట దాటాక, ఎడమవైపు తిరుగుతుండగా పెద్ద గుంటలో పడి, పల్టీలు కొట్టి, పక్కనే ఉన్న కుంటలో పడిపోయింది కారు. కన్నుమూసి తెరిచేంతలో జరిగిపోయింది. ఎడమవైపు డోర్‌ వూడిపోవడంతో, బాలరాజు దూరంగా వెళ్ళి పడ్డాడు. రెండు నిమిషాలపాటు ఏం జరిగిందో అర్థంకాలేదు. మెల్లగా పైకి లేచాడు. కాళ్ళూ, చేతులూ దోక్కుపోయాయి తప్ప పెద్దగా దెబ్బలు తగల్లేదు. కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు. కుంకుతున్న పొద్దుమాటున తలకిందులైన కారు కనిపించింది.

శివరామయ్య జాడలేదు. గబగబా కారుకు దగ్గరగా వెళ్ళాడు. డ్రైవర్‌ సీట్లోంచి మూలుగు వినిపిస్తోంది. గుండె దిటవు చేసుకుని, పెద్దరాయి తీసుకుని అద్దం పగలగొట్టాడు. అతి కష్టంమీద శివరామయ్యను బయటికి లాగాడు.

‘‘సార్‌, సార్‌... లేవండి...’’ అరుస్తున్నాడు బాలరాజు.

పైకి లేవడానికి ప్రయత్నించి కుప్పకూలిపోయాడు శివరామయ్య. అతని కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. చేతులు రక్తమోడుతున్నాయి. కళ్ళు మూతలుపడుతున్నాయి. ఏదో మాట్లాడాలని విఫలయత్నం చేస్తున్నాడు.

బాలరాజు కారు డోరుకు దగ్గరగా వెళ్ళి లోపలికి తల దూర్చి, వాటర్‌బాటిల్‌ సంపాదించాడు. కాసిని మంచినీళ్ళు గొంతులోకి జారాక, శివరామయ్య స్పృహలోకి వచ్చాడు.

‘‘రే బాల్రాజూ... కాపాడరా... నన్ను కాపాడరా... నీకు దండం పెడతా...’’ శివరామయ్య బతిమాలుతున్నాడు.

‘‘మీకేం కాదు సార్‌. నేనున్నాగా. రండి, మెల్లగా ముందు ఈ కుంటలోంచి పైకి వెళ్దాం’’ అంటూ మెడకింద చేతులు వేసి పైకి లేపాడు. అతనికి మోకాళ్ళలో మంటలు లేస్తున్నాయి. క్షణం కూడా నిలబడలేక దబ్బున కిందపడ్డాడు. బాలరాజు శక్తినంతా కూడదీసుకుని అతన్ని భుజాలమీద వేసుకుని కుంటపైకి చేర్చాడు. ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చూశాడు. చీకటి చిక్కబడుతోంది. పదెకరాల అవతల డొంకరోడ్డులో ద్విచక్ర వాహనం వెళుతోంది. బాలరాజు గొంతు చించుకుని అరిచాడు. స్పందన లేదు.

అతను కూలిన విగ్రహంలా నేలమీద పడి ఉన్నాడు. పైకీ కిందికీ ఎగురుతున్న పొట్ట అతను సజీవంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాలరాజు గుండెల్నిండా గాలి పీల్చి, మళ్ళీ తన భుజాలమీదికి ఎత్తుకున్నాడు. ఆరోజు పౌర్ణమి కావడంతో, చందమామ వెన్నెల కాగడా పట్టింది. బేతాళుణ్ణి భుజాన వేసుకున్న విక్రమార్కుడిలా నడుస్తున్నాడు బాలరాజు. క్షణక్షణానికీ బరువు పెరిగిపోతోంది. గస పెడుతున్నాడు. ప్రాణం అన్ను పడుతోంది. రెండెకరాలైనా దాటాడో లేదో కాళ్ళు చచ్చుబడిపోయాయి. మెల్లగా అతన్ని నేలమీద పడుకోబెట్టాడు. అలుపు తీర్చుకోవడానికి కింద చతికిలపడ్డాడు.

అతన్ని తేలిగ్గా తరలించే మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. కొద్దిదూరంలో పేడకళ్ళు ఎత్తే సిబ్బులు పాతవి కనిపించాయి. వాటిపక్కనే కొబ్బరితాడు పడి ఉంది. ఏదో స్ఫురించింది. చకచకా వెళ్ళి వాటిని అతని వద్దకు తీసుకొచ్చాడు. తాడును రెండు ముక్కలు చేసి, చిన్నముక్కతో రెండు సిబ్బుల్నీ కలిపి కట్టాడు. పొడవాటి తాడును అయిదారు పేటలు కలిపి ఒక సిబ్బికి ఆ చివర్న కట్టాడు. అతన్ని లేపి ఒక సిబ్బిలో కూచోబెట్టాడు. వాచిపోయి, ప్యాంటులో ప్యాక్‌ అయినట్లుగా ఉన్న కాళ్ళను రెండో సిబ్బిలో ఉంచాడు. అతను అలా కూచోగలిగితే తాడుతో లాక్కుపోవాలని బాలరాజు ఆలోచన. కానీ అతను స్పృహలోకి రావడం లేదు.

‘‘సార్‌, సార్‌... చూడండీ... కళ్ళు తెరవండీ... కొద్దిసేపు అలా కూర్చోండి’’ శివరామయ్య చెంపల మీద కొడుతూ అరుస్తున్నాడు. అయిదు నిమిషాల అనంతరం అతనికి స్పృహ వచ్చింది.

‘‘సార్‌, వింటున్నారా... నా మాట వినిపిస్తుందా... కళ్ళు తెరిచి చూడండీ...’’

‘‘బాల్రాజూ, నేను బతకనురా... ఈ బాధ భరించలేనురా...’’ ఏడుస్తున్నాడు అతను.

‘‘అట్లా అనకండి. నేనున్నాగా... కొద్దిగా... కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిసేపు అలా కూర్చుంటే, నేను తీసుకెళ్తాను. ఆ డొంకదాకా వెళ్తే చాలు... ఎవరో ఒకరు కనిపిస్తారు’’ ధైర్యం చెప్పాడు బాలరాజు.

‘‘సరే బాల్రాజూ...’’ నరాల్లో నిప్పులకొలిమి మండుతున్నంత బాధను భరిస్తూ శివరామయ్య అలా కూచున్నాడు.

కొబ్బరితాడును రెండు చేతులకూ తగిలించుకుని ముందుకు లాక్కెళుతున్నాడు బాలరాజు. ఎగుడుదిగుడు నేలమీద అదేమంత తేలిగ్గాదని అర్థమైనా, పంటిబిగువున అడుగులేస్తున్నాడు. మరో రెండెకరాలు దాటారో లేదో అతను మళ్ళీ స్పృహ కోల్పోయి, వెనక్కి వాలిపోయాడు. నిరాశగా కింద కూచొని, చేతులు వెనక్కిపెట్టి, ఆకాశం వంక చూశాడు బాలరాజు. అలాంటి స్థితిలోనూ అతని అప్పు తాలూకు నిర్వేదభావన మనసును తొలుస్తోంది.

‘కతలు చెప్పడం మానేసి, ముందు డబ్బివ్వమ్మా. నీ కొడుకుని కాలేజీలో చేర్పించడానికీ, నీ పెళ్ళాంకి నగలు కొనడానికీ, చెల్లెళ్ళకు సరుకులు పంపడానికీ డబ్బుంటుందిగానీ, మా అప్పు తీర్చడానికి ఉండదు. మా బావ కాబట్టి వూరుకుంటున్నాడుగానీ నేనైతే ఎప్పుడో నీ ఇల్లు వేలం వేసేవాణ్ణి...’ పదిరోజులక్రితం వీరేంద్ర ఇంటికొచ్చి గొడవ చేయడం ఆ స్థితిలోనూ గుర్తుకొస్తోంది.

ఇవాళకాదు, మూడేళ్ళనుంచీ అదే వరస. శివరామయ్య తెలివిగా బాధ్యతను బావమరిదిపై మోపాడు. రౌడీషీటర్‌ లాంటి అతగాడు తరచూ వేధిస్తున్నాడు. ఈమధ్యనే బాలరాజు వీరేంద్ర అరాచకాన్ని శివరామయ్య దృష్టికి తీసుకెళ్ళాడు.

ఆయన ‘మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. మరి నీకెన్ని మాటలు చెప్పినా లాభం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు?’ అనడంతో బాలరాజు డీలా పడిపోయాడు.

‘...ఇప్పుడితనికి ఏదైనా జరిగితే..?’ చలనం లేకుండా పడి ఉన్న శివరామయ్యను చూస్తూ అనుకున్నాడు బాలరాజు.

ఛఛ, తనేమిటీ... అలా ఆలోచిస్తున్నాడు. మనిషి ప్రాణంకంటే విలువైంది ఏదీలేదు. ఎలాగైనా కాపాడాలి. అవసరమైతే తన ప్రాణాన్ని అడ్డుపెట్టయినా సరే!

కాకతాళీయంగా చొక్కాజేబు వంక చూసుకున్నాడు. సెల్‌ఫోన్‌ గుర్తొచ్చింది. ఠక్కున లేచి, కుంటలోకి పరుగుతీశాడు. కారు చుట్టూ వెతికాడు. తన సెల్‌తోపాటు ఖరీదైన అతని ఐఫోన్‌ కూడా ముక్కలై కనిపించాయి. నిస్సత్తువగా మళ్ళీ అతని దగ్గరకు చేరుకున్నాడు. దగ్గర్లో ఉన్న బండరాయిపైకి ఎక్కి చుట్టూ చూశాడు. అయిదెకరాల దూరంలో ఏదో పడి ఉంది. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని బాలరాజు అటువైపు పరిగెత్తాడు.

‘డ్రీమ్‌ రియల్‌ ఎస్టేట్స్‌’ అని రాసి ఉన్న సైన్‌బోర్డు కిందపడి ఉంది. అయిదడుగుల వెడల్పూ, మూడడుగుల ఎత్తూ ఉన్న ఆ బోర్డుకు రెండువైపులా గట్టి కర్రలు కట్టి ఉన్నాయి. మెదడులో ఏదో స్ఫురించింది. కిందికి వంగి, రెండుచేతుల్తో రెండు కర్రల్ని ఎత్తి పట్టుకుని, దాన్ని శివరామయ్య వద్దకు లాక్కొచ్చాడు.

సైన్‌బోర్డును తిరగేసి, అతన్ని చేతుల్తో ఎత్తి, దానిమీద పడుకోబెట్టాడు. బోర్డును దాటి బయటికొచ్చిన కాళ్ళను లోపలికి మడిచాడు. మూడంకె వేసినట్లుగా అతను పడుకోగానే, మరో చివర రెండు కర్రల్నీ ఎత్తిపట్టుకుని లాక్కుపోసాగాడు. రెండడుగులు కూడా పోకముందే, ఏటవాలు కారణంగా అతను కిందికి జారిపోయాడు. గబగబా వచ్చి, మళ్ళీ బోర్డు మీద పడుకోబెట్టి, ఈసారి కర్రల్ని తక్కువ ఎత్తులో పట్టుకుని ముందుకు నడిపించాడు. మరో రెండెకరాలు దాటాడో లేదో మళ్ళీ అతను జారిపోయాడు.

కర్రలు కిందపడేసి ఆలోచనలోపడ్డాడు బాలరాజు.

సిబ్బి దగ్గరకు వెళ్ళి, దానికి కట్టిన కొబ్బరితాడు తీసుకొచ్చాడు. దాంతో అతని శరీరాన్ని బోర్డుకు కట్టేశాడు. రక్తస్రావం పెరిగి అతని దుస్తులన్నీ తడిసిపోయాయి. అసలతను ప్రాణంతో ఉన్నాడో లేడో నిర్ధరించుకోవాలనే విషయాన్ని కూడా విస్మరించాడు. అతన్ని ఎలాగైనా ఆసుపత్రికి చేర్చడమే లక్ష్యంగా పూనుకున్నాడు. తాడుతో బిగించి కట్టినా, ఆ భారీకాయం మళ్ళీమళ్ళీ కిందికి జారుతూనే ఉండటంతో, ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

ఒక్క నిమిషం అలా నిలబడిపోయాడు. ఆకాశంలో చుక్కలవైపు చూసి, సమయం ఏడు అవుతూండవచ్చని అనుకున్నాడు. మరో నాలుగెకరాల దూరం వెళ్ళగలిగితే డొంకరోడ్డు వస్తుంది. అక్కడిదాకా వెళ్తే ఎవరో ఒకరు కలుస్తారు. కానీ ఎలా!? మళ్ళీ చుట్టూ చూశాడు. పక్క పొలంలో పాడుబడిన గుడిసె కనిపించింది. అక్కడికి పరిగెత్తాడు. వెదురు తడికెలతో ఏర్పాటుచేసిన ఆ గుడిసె శిథిలావస్థలో ఉంది. చకచకా రెండు తడికెల్ని వూడదీసి, అతనున్న దగ్గరకి తీసుకొచ్చాడు.

తాడుతో రెండు తడికెల్నీ కలిపి గట్టిగా కట్టాడు. అతన్ని వాటిమీద పడుకోబెట్టాడు. పొడవాటి తాడును మరో చివర్న కట్టి, దాన్ని తన నడుముకు కట్టుకుని ముందడుగు వేశాడు. ఆ ప్రయత్నం ఫలించింది. సాఫీగా ముందుకు నడవగలుగుతున్నాడు. మందపాటి తడికెల మీద పడుకున్న అతని శరీరానికి కూడా ఘర్షణ లేకుండా ఉంది. పది నిమిషాల వ్యవధిలో నాలుగెకరాలూ దాటి డొంకరోడ్డు మీదకి చేరుకున్నాడు.

బాలరాజు శరీరంలో బలం సన్నగిల్లుతోంది. నీరసం ఆవహిస్తోంది. నాలుక పిడచ కట్టుకుపోతోంది. తలలోంచి చెమట్లు కారుతున్నాయి. చెమటతో చొక్కా తడిసిపోయింది. కనుచూపుమేర మనిషి జాడలేదు. అప్పుడు కలిగింది శివరామయ్యను పరిశీలించాలన్న స్పృహ. రక్తసిక్తమైన శరీరం నిశ్చలనంగా పడి ఉంది. ముక్కు దగ్గర చేయిపెట్టి శ్వాసను ధ్రువీకరించుకున్నాడు.

సుదీర్ఘమైన అయిదు నిమిషాలు గడిచాయి. దూరంగా ఓ ఆడమనిషి నడిచి వస్తూ కనిపించింది. బాలరాజుకు ప్రాణం లేచివచ్చింది. దగ్గరగా రాగానే ఆమె... కిందపడి ఉన్న అతడి శరీరాన్నీ, బాలరాజునీ మార్చిమార్చి చూసింది అనుమానంగా. బాలరాజు అది గ్రహించాడు.

‘‘అమ్మా, పొలం చూడ్డానికొస్తే కారు యాక్సిడెంట్‌ జరిగింది. ఈయన్ని ఎలాగైనా ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. కాస్త సాయం పడతారా’’ ఏం జరిగిందో వివరిస్తూనే అభ్యర్థన కూడా విడుదల చేశాడు బాలరాజు. ప్రమాదం ఎక్కడ జరిగిందీ... ఇక్కడదాకా ఎలా వచ్చిందీ వివరించాక ఆమెకు నమ్మకం కుదిరింది.

ధాన్యపుకళ్ళం దగ్గర నుంచి అచ్చమ్మపాలెం వెళుతున్న ఆమె చేతిలో పెద్ద పరదాపట్ట ఉంది. ఆమె ఒక్క క్షణం ఆలోచించి ‘‘ఆ తార్రోడ్డు దాకా పోతే, మడుసులు కనిపిత్తారు, పద మోసుకెళ్దాం’’ అంది.

బాలరాజు ఆమె చేయి చూపిన దిశగా చూశాడు. సుమారు మూడొందల మీటర్ల దూరంలో తార్రోడ్డు, దానికి అవతల దీపాల వెలుగులో అచ్చమ్మపాలెం కనిపిస్తున్నాయి. ఆమెను తేరిపార చూశాడు. వయసు నలభై పైనే ఉండొచ్చు. నల్లగా, పొట్టిగా ఉంది. వెన్నెల వెలుగులో ఆమె కళ్ళల్లో మెరుపు కనిపిస్తోంది.

ఆమె తన దగ్గరున్న పట్టను మూడు మడతలుగా రోడ్డుమీద పరిచింది. ఇద్దరూ కలిసి అతన్ని పట్టమీద పడుకోబెట్టారు. ముందువైపు పట్ట రెండుచెంగులూ కలిపి, తాడు పేనినట్లుగా మెలేసి, చేతుల్తో పట్టుకున్నాడు బాలరాజు. వెనకవైపు ఆమె కూడా అలాగే చేసి, భుజాలకెత్తుకోవడానికి సిద్ధంగా నిలబడింది.

‘‘ఏమ్మా, లేపమంటారా?’’ అడిగాడు బాలరాజు వెనక్కి తిరిగి చూస్తూ.

‘‘నేను సిద్ధవేనండీ. అద్గో... ఎత్తండీ...’’ ఆమె పెద్దగా శబ్దం చేస్తూ బాలరాజును ఉత్సాహపరిచింది.

ముందువైపు బాలరాజు, వెనకవైపు ఆమె తమ కుడిభుజాల మీద వేసుకోవడంతో... అతను పట్ట మధ్యలో ఉయ్యాలలా వేలాడుతున్నాడు. ఈ పద్ధతిలో శ్రమ అనిపించలేదు బాలరాజుకు. ఇద్దరూ సమానవేగంతో నడిచారు. పావుగంట గడిచేసరికి తార్రోడ్డు చేరుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా రోడ్డు పక్కనే ఉన్న చప్టాపై అతన్ని కిందికి దించారు.

దూరంగా ఓ ట్రాక్టరు వస్తూ కనిపించింది. ఆమె రోడ్డుకు అడ్డంగా నిలబడి చేతులు పైకెత్తింది. దగ్గరగా వచ్చి కీచుమంటూ బ్రేక్‌ వేసి, కుడివైపు ఒంగి ‘‘ఏమైంది?’’ అనడిగాడు ట్రాక్టరు డ్రైవర్‌.

బాలరాజు జరిగిందంతా చెప్పాడు. వెంటనే డ్రైవర్‌ తన జేబులోంచి సెల్‌ఫోన్‌ తీసి 108కి ఫోన్‌ చేశాడు.

‘‘అదొచ్చేసరికి ఆలస్యం కావచ్చు. ఈలోగా మనం కొంతదూరం తీసుకెళ్తే మేలు’’ అభ్యర్థించాడు బాలరాజు. డ్రైవర్‌ ఒప్పుకొన్నాడు. ముగ్గురూ కలిసి అతన్ని ట్రక్కులోకి తరలించారు.

‘‘అయ్యా, మరి నే వస్తా, పొద్దుపోతంది’’ బాలరాజు వంక చూస్తూ అందామె.

బాలరాజు రెండు చేతులూ జోడించి, ఆమెకు నమస్కరిస్తూ ‘‘థ్యాంక్సమ్మా’’ అన్నాడు నీళ్ళు నిండిన కళ్ళతో.

‘‘అయ్యో, అంత ఇదైపోమాకండి. మడిసికి మడిసి సాయం సేసుకోకపోతే ఎట్టా’’ అంటూ అచ్చమ్మపాలెం వైపు అడుగులు వేసిందామె.

బాలరాజు ట్రాక్టరు పైకి ఎక్కాడు. ఇంజిన్‌ స్టార్ట్‌ చేసి, ట్రాక్టర్ని నరసరావుపేట రోడ్డులోకి పోనిచ్చాడు డ్రైవరు. రెండు కిలోమీటర్లయినా పోకముందే, సైరన్‌ మోగించుకుంటూ 108 ఎదురొచ్చింది.

సిబ్బంది సాయంతో అతన్ని 108లోకి మార్చారు. బాలరాజు ట్రాక్టరు డ్రైవరుకు వంద రూపాయల నోటు ఇవ్వబోయాడు. ‘‘ఏందన్నా, నువ్వు మరీనూ. డబ్బు కోసం సాయం చేశానా! ఉంచుకో. పెద్దాయన్ని జాగ్రత్తగా చూసుకో’’ అనేసి ట్రాక్టరు ఎక్కాడు. బాలరాజు 108లోకి ఎక్కాడు. అప్పటికే స్టాఫ్‌ శివరామయ్య దుస్తులు తొలగించి, ప్రథమ చికిత్స మొదలుపెట్టారు.

మరుసటిరోజు సాయంత్రం... నరసరావుపేటలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి.

‘‘ప్రాణాలకేమీ ప్రమాదం లేదన్నారు. కాళ్ళకు మల్టిపుల్‌ ఫ్రాక్చర్స్‌ అయ్యాయట. ఆపరేషన్‌ చేసి రాడ్లు వేశారు. వీపుమీద, చేతులకు కూడా బాగానే తగిలినా పెద్ద ప్రాబ్లమ్‌ లేదన్నారు’’ బెంచీ మీద కూచున్న బాలరాజుకు ఎదురుగా నిలబడి వివరించాడు వీరేంద్ర. రాత్రి పదిగంటల సమయంలో ఫోన్‌ ద్వారా విషయం తెలుసుకున్న వీరేంద్ర వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాడు. బాలరాజు కూడా అతనితోపాటు రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఒకటికి పదిసార్లు వీరేంద్ర బాలరాజుకు థ్యాంక్స్‌ చెప్పాడు.

***

మూడు నెలల తర్వాత... ఓరోజు ఉదయం పదిగంటల వేళ... బాలరాజు ఇంటికి వచ్చాడు వీరేంద్ర.

‘‘కూర్చోండి బాబూ’’ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు బాలరాజు. వీరేంద్ర చేతిలో ప్రామిసరీ నోట్లున్నాయి.

‘‘బాల్రాజూ, బావ పంపించాడు. ఈరోజుకి మళ్ళీ సంవత్సరం పూర్తయింది. కానీ, ఈసారి వడ్డీ తిరగ్గట్టడంలేదని చెప్పమన్నాడు’’ గొప్ప శుభవార్త చెబుతున్నట్లు మొహం నిండా ప్రసన్నత నింపుకొన్నాడు వీరేంద్ర.

బాలరాజు మౌనంగా చూస్తూండిపోయాడు.

‘‘నువ్వు ఆయన ప్రాణం కాపాడావని ఆయనకు నీపట్ల ఎంతో కృతజ్ఞత ఉంది. నిజంగా బావది వెన్నలాంటి మనసు. దేవుడిలాంటి మనిషి. అందుకే ఆయనకు ఏ హానీ జరగలేదు.’’

బాలరాజు పెద్దగా నిట్టూర్చి ‘‘ఇక మాటిమాటికీ మీరిలా రావాల్సిన అవసరం లేదు బాబూ’’ అన్నాడు.

అర్థంకాలేదు వీరేంద్రకు.

‘‘ఒక్క వారంలోగా మీ డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తా’’ స్థిరంగా చెప్పాడు బాలరాజు.

‘‘లేదు, లేదు... నువ్వేం హైరానా పడనక్కర్లేదు’’ జాలి చూపించాడు వీరేంద్ర.

‘‘హైరానా కాదు బాబూ. దేనికైనా బాకీ పడొచ్చుగానీ కృతజ్ఞతలకి బాకీ పడకూడదు. అయినా ఎప్పటికైనా కట్టాల్సిందేగా’’ అన్నాడు వీరేంద్రకు నమస్కరిస్తూ. ఇక మాట్లాడ్డానికేమీ లేదన్నట్లు ఇంట్లోకి నడిచాడు బాలరాజు. వీరేంద్ర వెళ్ళిపోయాడు.

అరగంట తర్వాత...

‘‘ఇదుగో, నేనో ముఖ్యమైన పనిమీద బయటికెళ్తున్నా, రావడం ఆలస్యం కావచ్చు’’ భార్యతో చెప్పి గడప దాటాడు బాలరాజు.

ఇంట్లోంచి బయటకొచ్చిన బాలరాజు పదేపదే వెనక్కి తిరుగుతూ... నీళ్ళు నిండిన కళ్ళతో సొంత ఇంటిని మురిపెంగా చూసుకుంటూ వీధిలోని మనుషుల్లో కలిసిపోయాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.