close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ విమానంలో ప్రయాణం ఉచితం!

ఈ విమానంలో ప్రయాణం ఉచితం!

జీవితంలో ఒక్కసారైనా విమానం లోపల అడుగు పెట్టాలనీ, ఎయిర్‌ హోస్టెస్‌లు సీటు బెల్టు పెడుతుంటే... విమానం టేకాఫ్‌ అవుతుంటే... ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనీ కలలుగనే వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ల కోరికను నిజం చేస్తూ బహదూర్‌ గుప్తా ఎన్నో ఏళ్లుగా కొన్ని వేలమందికి విమాన ప్రయాణ అనుభూతిని కల్పిస్తున్నాడు... అదీ ఉచితంగా.

యిర్‌బస్‌ ఏ 300... దిల్లీ శివార్లలో కొలువైన ఈ విమానం తలుపు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు తెరుచుకుంటుంది. లోపలికి అడుగు పెడితే ఎకానమీ, బిజినెస్‌ క్లాసు సీట్లూ, బోర్డింగ్‌ పాస్‌లూ, సెక్యూరిటీ చెక్‌లూ, కాక్‌పిట్‌, ఎయిర్‌ హోస్టెస్‌, అత్యవసర అలారమ్‌లూ, ఫ్లయిట్‌లో పైలట్ల ఎనౌన్సుమెంట్లూ, స్నాక్స్‌... నిజమైన విమానంలో ఉండే ఏర్పాట్లన్నీ అచ్చుగుద్దినట్టు ఉంటాయి. కాకపోతే అసలైన వాటిలా ఈ విమానం ఎక్కడికీ ఎగరదు. కానీ ఎగురుతోన్న విమానంలోని వాతావరణం కనిపించడంతో పాటు అరగంట సేపు విమానంలో ప్రయాణిస్తే కలిగే అనుభూతి మాత్రం ఇందులోని ప్రయాణికులకు కలుగుతుంది. ప్రయాణికులకు ఫ్లయిట్‌ టేకాఫ్‌ అవుతున్న అనుభూతిని కలిగించేందుకు 4డీ సినిమా థియేటర్లలోలా సీట్లు పైకీ కిందకూ కదిలే ఏర్పాట్లూ చేశారు. విమానం వేగంగా ఎగురుతోన్న అనుభూతి కోసం ప్రత్యేక సౌండ్‌ సిస్టమ్‌ను అమర్చారు. జీవితంలో విమానంలో ప్రయాణించే అవకాశానికి నోచుకోలేమని బాధపడే పేదలకూ, ముఖ్యంగా పిల్లల కోసం బహదూర్‌ చాంద్‌ గుప్తా అనే మాజీ ఫ్లయిట్‌ ఇంజినీర్‌ ఈ ఫేక్‌ ఫ్లయిట్‌ను రూపొందించారు. పన్నెండేళ్లుగా కొన్ని వేలమందికి విమానమెక్కిన అనుభూతిని ఆయన ఉచితంగా కల్పించారు. 

చేదు అనుభవం వల్లే...
గుప్తా హరియాణాలోని ఓ మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టినా కష్టపడి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఆ తరవాత ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లయిట్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. గుప్తా ఎప్పుడు వూరెళ్లినా ఒక్కసారైనా తమని విమానాశ్రయానికి తీసుకెళ్లమనీ, విమానం లోపల ఎలా ఉంటుందో చూపించమనీ బంధువులూ, చుట్టుపక్కలవాళ్లూ అడిగేవారు. కానీ భద్రతా కారణాల వల్ల అది కుదిరేది కాదు. ఓసారి ధైర్యం చేసి తెలిసిన వ్యక్తిని ఎయిర్‌పోర్టులోని తన స్నేహితుల సాయంతో విమానంలోకి తీసుకెళ్లారు. కానీ విషయం అధికారులకు తెలిసి గుప్తాను మందలించారు. అప్పట్నుంచీ గుప్తా అలాంటి పని చేయకపోయినా, తనలాంటి వాళ్లు రోజూ పనిచేసే విమానాల్ని చూడటం కొంతమందికి మాత్రం జీవితకాలపు కలలా మిగిలిపోవడం బాధగా అనిపించింది. ఎలాగైనా నిరుపేదలకు విమానమెక్కిన అనుభూతిని కల్పించాలనుకున్నారు. ఫ్లయిట్‌ ఇంజినీర్‌గా రిటైరైన మరుక్షణం నుంచీ అదే పనిలో ఉన్నాడు. దిల్లీ విమానాశ్రయం అధికారులను కలిసి మూలన పడ్డ ఎయిర్‌బస్‌ ఏ 300 విమానాన్ని తనకి అమ్మమని కోరాడు. వాళ్లు మొదట ఒప్పుకోకపోయినా, గుప్తా ఉద్దేశం నచ్చి అంగీకరించారు. కానీ దానికోసం గుప్తా అప్పటివరకూ దాచుకున్న సొమ్ముకు తోడు, తన భూమిని కూడా అమ్మి డబ్బు చెల్లించాల్సి వచ్చింది. అంత భారీ విమానాన్ని తరలించడం కష్టమవడంతో దాన్ని కొన్ని వందల విడిభాగాలుగా విభజించి, దిల్లీ శివార్లలోని ద్వారక ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడే దాన్ని స్థిరంగా ఉంచి రంగులు వేసి, ఏసీలూ, ఇతర భాగాలకు మరమ్మతులు చేసి కొత్త రూపునిచ్చారు. 

పేదలకు ఉచితం
కేవలం విమానం లోపలికి తీసుకెళ్లి చూపిస్తే పదినిమిషాలకే పిల్లలకు బోరు కొట్టేస్తుంది. అందుకే పూర్తిగా ఓ విమాన ప్రయాణం అనుభవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లనూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎయిర్‌హోస్టెస్‌లను నియమించారు. సెక్యూరిటీ చెక్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. బోర్డింగ్‌ పాసులు ఇస్తున్నారు. ఇక ఒక్కసారి లోపలికెళ్లి తలుపు మూసుకున్నాక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మొదటకాసేపు సౌండ్‌ ఎఫెక్టులూ, సీట్ల కదలికతో కృత్రిమంగా టేకాఫ్‌ ఎఫెక్టు సృష్టించాక కాక్‌పిట్‌లో పైలట్‌ సీటులో కూర్చున్న గుప్తా బయటికొచ్చి సేఫ్టీ డ్రిల్‌ నిర్వహించి, పిల్లలకు విమాన నిర్మాణ వ్యవస్థ, సిగ్నళ్లూ, విమానంలో వసతులకు సంబంధించిన విశేషాలను వివరిస్తారు. లోపల అమర్చిన టీవీలో ఆధునిక విమానాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. తరవాత ఎయిర్‌ హోస్టెస్‌లు పిల్లలకు మినీ మీల్స్‌ అందిస్తారు. చివరగా, ఫ్లయిట్‌ ప్రమాదంలో చిక్కుకున్నట్టు ప్రకటించి, వెనకున్న అత్యవసర ద్వారంగుండా వాళ్లని కిందకి పంపిస్తారు. మొదట్లో అందరికీ ఉచితంగానే ఈ విమాన ప్రయాణ అనుభూతిని కలిగించేవారు. రానురానూ ఖర్చులు పెరగడంతో పేద పిల్లలూ, ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు టికెట్టు కోసం కొంత డబ్బు తీసుకొని విమానంలోకి అనుమతిస్తున్నారు. అలా గత పన్నెండేళ్లలో కొన్ని వేలమంది గుప్తా విమానం ఎక్కారు.

‘విమానంలో ప్రయాణించాలన్నది నా చిన్ననాటి కల. కానీ ఉద్యోగం వచ్చేవరకూ అది తీరలేదు. నాలాంటి వాళ్లు ఇప్పటికీ చాలామంది ఉంటారు. నాకు వీలైనంతలో కనీసం విమానంలో ప్రయాణించిన అనుభూతినైనా కల్పిస్తూ, వాళ్ల కోరికను కొంతైనా తీర్చగలుగుతున్నా’ అంటారు గుప్తా. నిజమే, ‘కిక్‌’ సినిమాలో చెప్పినట్లు... ఎవరి కోరికను వాళ్లు తీర్చుకుంటే ఏముంటుంది? పక్కవాళ్ల కోరికల్ని తీర్చినప్పుడే కదా కిక్కు..

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.