close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముగ్ధసోయగం... అందాల కాశ్మీరం..!

ముగ్ధసోయగం... అందాల కాశ్మీరం..!

‘తెల్లని మంచుకొండల మధ్యలో పచ్చని మైదానాలూ ఎత్తైన వృక్షాలూ గలగలపారే నదులూ నీలి సరస్సులూ వాటిమధ్యలో బొమ్మరిళ్లలాంటి ఇళ్లతో ముగ్ధమనోహరంగా శోభిల్లే కాశ్మీరు అందాలను ఎంత చూసినా తనివి తీరదు’ అంటున్నారు ఆ సుందర ప్రకృతిలో విహరించి వచ్చిన వైజాగ్‌ వాసి ఆర్‌.సుబ్బారావు.

భూతల స్వర్గంగా భావించే కాశ్మీర్‌ గురించి టీవీలో చూసినప్పుడల్లా అక్కడకు వెళ్లాలని మనసు వూగేది. కానీ సరిహద్దుల్లో జరిగే గొడవలు మమ్మల్ని వెనక్కి లాగేవి. అయినా మిత్రుల ప్రోత్సాహంతో ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా కాట్రాలో ఉన్న మాతా వైష్ణోదేవి దర్శనంతో సహా ఎనిమిది రోజుల పర్యటనకు బయలుదేరాం. అందరం వేర్వేరు ప్రాంతాల నుంచి దిల్లీ చేరి అక్కడ కలుసుకుని జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి జమ్మూకి బయలుదేరాం.కాశ్మీర్‌ యాత్రకి అనువైన సమయం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది పర్యటకుల వయసును బట్టి మారుతూ ఉంటుంది. విద్యార్థులకీ కొత్తగా పెళ్లయిన జంటలకీ పర్వతారోహకులకీ మార్చి 15 నుంచి మే వరకూ మంచి సమయం.

ఎందుకంటే వసంత రుతువులో కాశ్మీర్‌ మనోహరంగా కనిపిస్తుంది. కొండలమీద నుంచి మంచు కరిగి ప్రవహించే నదీప్రవాహాలు చల్లని పిల్లగాలులని మోసుకొస్తూ ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఆ సమయంలో విరిసే రంగురంగుల పూలూ, దూరంగా పర్వతశ్రేణులమీద కనిపించే మంచు సరస్సులూ పర్యటకుల్ని కళ్లు తిప్పుకోనీయవు. నవంబరు నుంచి మార్చి వరకూ శీతాకాలం. ఆ సమయంలో లోయ అంతా మంచుతో కప్పబడిపోయి పర్వతాలపై తెల్లని దుప్పటి పరచినట్లుగా ఉంటుంది. చెట్లూ మైదానాలూ రోడ్లూ అన్నీ మంచుతో నిండిపోతాయి. అప్పుడు వింటర్‌ స్పోర్ట్స్‌లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. చలికి తట్టుకోగలిగినవాళ్లకీ మంచులో ఆడుకోవాలనుకునేవాళ్లకీ ఇది మంచి సమయం. పోతే, మే నెల నుంచి ఆగస్టు వరకూ ఎండాకాలం. ఆ సమయంలో కాశ్మీర్‌లోనూ పగటివేళలో చెమటలు పట్టేస్తాయి. ఈ సీజన్లో ఉన్ని దుస్తుల అవసరం ఉండదు. చలికి తట్టుకోలేనివాళ్లకి ఇదే మంచి కాలం. అందుకే మేం ఆగస్టులో బయలుదేరాం.

వైష్ణోదేవి..!
జమ్మూలో దిగగానే మా ట్రావెల్‌ ఏజెన్సీవాళ్లు ఏర్పాటుచేసిన మినీబస్‌లో కాట్రా చేరుకున్నాం. హోటల్‌ మేనేజర్‌ సాయంతో వైష్ణోదేవి యాత్రకు కావలసిన డోలీలను ఏర్పాటు చేసుకున్నాం. అక్కడకు కాలి నడకనగానీ గుర్రాలమీద కానీ డోలీల్లోగానీ వెళ్లాలి. రాత్రీపగలూ తేడా లేకుండా 24 గంటలూ ప్రయాణమే. ఐదేళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ 14 కిలోమీటర్లు ప్రయాణించి 5,200 అడుగుల ఎత్తులోని త్రికూట పర్వతం పైన ఉన్న ఆ మందిరాన్ని చేరుకుని అమ్మవారిని పూజిస్తారు. యాత్రకు బయలుదేరేముందు కాట్రాలో ఉన్న ఆఫీసుకి వెళ్లి స్వయంగా అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ సుమారు లక్ష మంది భక్తులు దేవి దర్శనం చేసుకుంటారు. వేసవిలో అయితే మూడునాలుగు లక్షల వరకూ ఉంటారట. అనుమతి పత్రంమీద బ్యాచ్‌ నంబరు ఉంటుంది. దర్శనానికి ఒక్కోసారి రెండుమూడురోజులు కూడా పడుతుంది. డోలీలను మోసేవాళ్లు పగలు బాగా ఎండగా ఉందని సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరదామన్నారు. ఈలోగా కాట్రాలో ఉన్న మరో రెండు మందిరాలను దర్శించి వచ్చాం. అనుమతి పత్రాలు తీసుకుని వూరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రాస్థలానికి బయలుదేరాం.

ప్లాస్టిక్‌ కుర్చీలను ప్రత్యేకంగా తయారుచేసిన ఇనుపచట్రాల్లో బిగించి డోలీలను తయారుచేస్తారు. వీటిని పల్లకీల్లా ఇద్దరు ముగ్గురు మోసుకుని వెళ్తారు. ఇక్కడ డోలీలు మోసేవాళ్లంతా ముస్లింలే అయినా జై మాతాదీ అని దేవిని తలచుకుంటూ యాత్రను మొదలుపెట్టడం ఓ చిత్రమైన అనుభూతిని కలిగించింది. రాక్షసుల క్రూరత్వం నుంచి దేవతలను రక్షించడానికి త్రిమూర్తులవారి అంశతో ఓ బాలికను సృష్టించారట. ఆమె భూలోకంలో ఓ వైష్ణవుని ఇంట జన్మించిందట. ఆమె ఎప్పుడూ భగవధ్యానంలో సమయం గడుపుతూ ఉండేది. ఆమె అందచందాలకు ఆకర్షితుడైన భైరవుడు అనే రాక్షసుడు, తనను పెళ్లాడమని వేధించసాగాడట. అతన్నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక త్రికూట పర్వతంపైన ఉన్న ఓ గుహలో దాగి తపస్సు చేయసాగిందట. ఆమె మానవ గర్భం ఆకారంలో ఉన్న ప్రదేశంలో తపస్సు చేసిందట. దాన్నే గర్భజూన్‌ అంటారు. భక్తులు అందులోకి పాకుతూ ప్రవేశించి బయటకు రావడాన్ని ఆచారంగా పాటిస్తారు.

అక్కడ తొమ్మిది నెలలుగా తపస్సు చేసుకుంటున్న వైష్ణవిని గమనించి భైరవుడు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమె అదే పర్వతంమీద ఉన్న మరో గుహలోకి పరిగెడుతుంది. తనను వెంబడిస్తున్న భైరవుడు ఆ గుహలోకి ప్రవేశించగానే శక్తినంతా ప్రయోగించి శిరస్సుని ఖండిస్తుంది. ఆ శిరస్సు దూరంగా పోయి మరో కొండమీద పడుతుంది. అదే ప్రస్తుతం భైరవమందిరం ఉన్న ప్రదేశం. అంతట భైరవుడు ఆమెను సర్వశక్తిమంతమైన దుర్గగా గ్రహించి తన తప్పును మన్నించమని వేడుకోగా దానికి ఆమె సంతసించి తన దగ్గరే ఉండమని అనుమతినిస్తుంది. తనను దర్శించడానికి వచ్చిన భక్తులు భైరవుడిని చూడకపోతే యాత్రాఫలం దక్కదని అతనికి వరమిస్తుంది. ఆ తరవాత ఆమె తన శరీరాన్ని విడిచి మూడు శిలలుగా మారిపోతుంది. వాటినే దుర్గ, పార్వతి, సరస్వతీదేవులుగా భక్తులు ఆరాధిస్తారు.

ఆ దేవిని దర్శించుకున్నాక భక్తులు ఒకలాంటి అలౌకిక ఆనందానికి లోనవుతారు. మిగిలిన పుణ్యక్షేత్రాల్లో మాదిరిగా ఇక్కడ తోపులాటలు ఉండవు. తనివితీరా తల్లి దర్శనానికి అనుమతిని ఇస్తారు. రాత్రి 12.30 గంటలకి భోజనం పూర్తి చేసి తిరుగు ప్రయాణమయ్యాం. సుమారు గంటన్నర తరవాత డోలీలవాళ్లు టీ తాగడానికి ఆగారు. ఆ తరవాత మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఈసారి రోడ్డు మార్గం నుంచి నేరుగా మెట్లమార్గానికి మారి అతివేగంగా దిగడం మొదలుపెట్టారు. ఓ అరగంటలోనే కిందకి చేర్చారు. బసకు చేరుకుని విశ్రాంతి తీసుకుని మర్నాడు ఎనిమిది గంటలు ప్రయాణించి పహల్‌గావ్‌కి చేరుకున్నాం. ఇక్కడ ఉన్న శివాలయం నుంచే అమర్‌నాథ్‌ యాత్ర మొదలవుతుంది. ఇది శివుడు అమర్‌నాథ్‌ గుహకు వెళ్లేటప్పుడు నందిని వదిలి వెళ్లిన స్థలమని ప్రతీతి. అందుకే దీన్ని మొదట్లో భైరవ్‌గావ్‌ అనేవారట. మేం బసకోసం ఓ హోటల్‌లో దిగాం. ఆ హోటల్‌ని ఒకే కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. వాళ్ల ఆతిథ్యం మరువలేనిది. మేం గదిలోకి వెళ్లగానే కెహువా అన్న కాశ్మీర్‌ పానీయాన్ని ఇచ్చారు. అది ఓ చెట్టు బెరడు నుంచి తయారుచేసిన పానీయం. దాల్చినచెక్కతో చేసిన టీలా

అనిపించింది. వేడివేడి భోజనం పెట్టి కొసరి కొసరి తినిపించారు. ఇక్కడి ప్రజలు నిరాడంబరులు. శ్రమజీవులు. పర్యటకులే వాళ్ల జీవనాధారం. మర్నాడు ఉదయం దగ్గరలో ఉన్న కొన్ని మందిరాలూ మైదానాలూ చూశాం. అందులో ఆరువ్యాలీ, బేతాబ్‌వ్యాలీ ముఖ్యమైనవి. ఇక్కడ ఎప్పుడూ ఏవో సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించలేం.

ఆపిల్‌ తోటలు!
పహల్‌గావ్‌ నుంచి గుల్‌మార్గ్‌ వెళ్లాం. ఆ దారిలో అన్నీ ఆపిల్‌ తోటలే అక్కడ ఆగి కొనుక్కోవచ్చు. గుల్‌మార్గ్‌లో ఎటు చూసినా విశాలమైన మైదానాలే. అక్కడే పోలో గ్రౌండు ఉంది. చలికాలంలో ఇది స్కేటింగ్‌ కేంద్రంగా మారిపోతుందట. ఇక్కడ ఉన్న రెండు కొండలను కలుపుతూ రోప్‌ వే ఏర్పాటుచేశారు. పర్యటకులు గుర్రాలమీద తిరుగుతూ కాశ్మీర్‌ అందాల్ని ఆస్వాదించవచ్చు. మర్నాడు 90 కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీనగర్‌ చేరుకున్నాం. అక్కడ అన్నీ పూలవనాలే. అందులో ప్రధానంగా మొఘల్‌, షాలిమార్‌, నిశాంత్‌ ఉద్యానవనాలు ముఖ్యమైనవి. మొఘల్‌ గార్డెన్స్‌లో అందరూ కాశ్మీర్‌ డ్రెస్సు వేసుకుని ఫొటోలు తీయించుకుంటారు.

నీటిపట్టణం!
కాశ్మీర్‌ వెళ్లినవాళ్లు దాల్‌సరస్సులోని హౌస్‌బోటులో బస చేయకుండా వెనుతిరగలేరు. పైన్‌, దేవదారు చెక్కతో చేసి ఆ బోట్లు చాలా అందంగా ఉన్నాయి. వాటిని నిర్మించడంలోనే కాశ్మీరీల పనితనం కనిపిస్తుంది. వాటిమీద లతలూ పువ్వుల డిజైన్లే ఎక్కువ. 22 చ.కి.మీ మేర విస్తరించిన దాల్‌ లేక్‌లో వందలకొద్దీ హౌస్‌బోట్లు ఉన్నాయి. వేసవిలో వీటిల్లో గది దొరకడం కష్టం. అద్దె రోజుకి సుమారు ఏడు నుంచి పది వేల రూపాయల వరకూ ఉంటుంది. ఈ పడవలు సుమారు ఐదువందల సంవత్సరాల నుంచీ ఉన్నాయట. ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూ చక్రవర్తులూ మహ్మదీయ సుల్తానులూ బ్రిటిష్‌ పాలకులూ వీటిని వేసవి విడిదిగా వాడుకునేవారట.

హౌస్‌బోటు స్టార్‌ హోటల్‌కి ఏమాత్రం తీసిపోదు. ఇందులో ఓ డ్రాయింగ్‌రూమూ, డైనింగు హాలూ, ఐదు పెద్ద పడకగదులూ ఉంటాయి. గదుల్లోని హస్తకళాకృతులన్నింటిమీదా చీనార్‌ ఆకుల డిజైన్లే. కాశ్మీరీలకు ఈ చెట్లే ప్రాణదాతలు. ఇవి ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అందుకే ఒక్క చీనార్‌ ఆకుని తుంచినా అక్కడి ప్రజలు వూరుకోరు. ఈ బోటులోని ప్రతి బెడ్‌ రూముకీ ఓ బాత్‌రూము ఉంటుంది. ఇది అధునాతన హంగులతో ఉంటుంది. స్నానానికి పెద్ద బాత్‌ టబ్‌ కూడా ఉంది. కేరళలో మాదిరిగా ఇవి నీళ్లలో కదలాడవు. వీటిని ఒడ్డుకి తీగలతో కట్టి ఉంచుతారు. మనం భోజన, ఫలహారాలకు ఆర్డరు ఇస్తే బయట తయారుచేసి తీసుకువచ్చి ఇక్కడ వడ్డిస్తారు. కిచెన్‌ ఉంటుంది కానీ సామాన్లు భద్రపరచడానికి మాత్రమే వాడతారు. తెల్లవారగానే రకరకాల పండ్లూ కూరగాయలూ ఉన్న పడవలు ఈ బోటు దగ్గరకే వస్తాయి. వాటిల్లో నుంచి కుంకుమపువ్వూ, రకరకాల డ్రై నట్స్‌ లాంటివి కొనుక్కోవచ్చు. ఇళ్లూ మార్కెట్లూ ఆసుపత్రులూ అన్నీ నీళ్లమీదే. సరస్సులోనే నెహ్రూ పార్క్‌, చినార్‌గేట్‌, హోటల్‌, వాటర్‌ సర్ఫింగ్‌... వంటివన్నీ ఉన్నాయి. మొత్తమ్మీద ఈ సరస్సు ఓ నీటిపట్టణాన్ని తలపిస్తుంది.

జోజిలా పాస్‌లో...
మర్నాడు ఉదయం బయల్దేరి సోనామార్గ్‌కు వెళ్లాం. ఇది సుమారు 85 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 9200 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రత -20 డిగ్రీలు ఉంటుంది. అప్పుడు వాహనాలని నియంత్రించి ముందుకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఈ రోడ్డుమీదనే ప్రయాణించి లద్దాఖ్‌ చేరుకోవచ్చు. మేం సోనామార్గ్‌లో సాయంత్రం వరకూ విహరించాం. ఇక్కడ అన్నింటిలోకీ చూడదగ్గది జోజిలా పాస్‌. ఇది సుమారు 11,600 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడకు వెళ్లడానికి మన వాహనాలని అనుమతించరు. స్థానిక ఆపరేటర్లు వాళ్ల వాహనాల్లోనే తీసుకువెళ్తారు. ఈ ప్రయాణం ఓ మరువలేని అనుభూతిని అందించింది. ఎత్తైన పర్వతాల నడుమ సన్ననిదారిలో వాహనాలను నడపడం కత్తిమీద సాములాంటిదే. రెండు గంటల ప్రయాణం తరవాత మేం అక్కడకు చేరుకున్నాం. అక్కడ గ్లేసియర్లను దగ్గరగా చూడటం, వాటిమీద నడవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ నుంచే పవిత్ర అమర్‌నాథ్‌ గుహకి హెలీకాఫ్టర్లు బయల్దేరతాయి. నిజానికి జోజిలాపాస్‌ అమర్‌నాథ్‌ గుహకి వెనకవైపు ఉంటుంది. ట్రెక్కింగ్‌ చేస్తూ వెళ్తే నాలుగైదు గంటల్లో చేరుకోవచ్చు. కానీ అక్కడకు వెళ్లడానికి ముందే అనుమతులూ రిజిస్ట్రేషన్లూ కావాలి. మేం ఆ రాత్రికి అక్కడే ఉండి మర్నాడు ఉదయం ఎనిమిది గంటలు ప్రయాణించి జమ్మూ చేరుకున్నాం. అక్కడ ప్రముఖ దేవాలయాలైన రఘునాథ్‌మందిర్‌, కాళీమాతా మందిర్‌, నవదుర్గ మందిర్‌, జాంబవంత్‌గుహ... అన్నీ చూసి తిరిగివచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.