close
గోడ గడియారానికి చాలా...

  గోడ గడియారానికి చాలా సీనుంది..!

 గోడకి గడియారం పెట్టాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం... ఏదో ఒకటి కొని తగిలించేయడం అనేది పాత కథ. ఇప్పుడు అది కేవలం సమయాన్ని చూపించే ఓ వస్తువు మాత్రమే కాదు, ఇంటి అందాన్ని పెంచే సరికొత్త అలంకారం.

గోడ గడియారం... అనగానే వెనకటివాళ్లకయితే గంటగంటకీ గంటలు కొట్టే చెక్కతో చేసిన పెండ్యులమ్‌ లేదా కుకూ క్లాక్స్‌ గుర్తుకొస్తాయి. ఆ తరవాతి తరానికయితే గుండ్రంగానో లేదా నలు పలకలగానో చేసిన లోహపు లేదా ప్లాస్టిక్‌ గోడ గడియారాలు స్ఫురిస్తాయి. కానీ ఇప్పుడు వాటికంత సీన్‌ లేదు. గోడగడియారం అనేది ఓ అద్భుతమైన ప్రకృతిచిత్రంగానో సుందర అలంకారంగానో మారిపోయింది. ఎందుకంటే గోడల్నే కాదు, గోడకు అమర్చే గడియారాల్నీ వినూత్నంగా అలంకరించడమే గృహాలంకరణలో సరికొత్త ట్రెండ్‌.

కాలంతోపాటు పరిగెత్తే నేటి తరం మనిషికి అసలు గడియారంతోనే పని లేదన్నది నిజం. ఎందుకంటే గోడమీదకి చూసే సమయం కూడా ఉండట్లేదు కాబట్టి. అదీగాక సమయం తెలుసుకోవడానికి చేతికున్న వాచీనో లేదా గోడకున్న గడియారాన్నో చూడాల్సిన అవసరం అస్సలు లేదు. చేతిలోని సెల్‌ఫోనులోకి ఓ సెకను అలా తొంగి చూస్తే చాలు... ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం అరిచేతిలో ఉంటే గోడకి పెట్టే గడియారాన్ని కేవలం సమయం చూసేందుకో తేదీనీ వారాన్నీ తెలుసుకునేందుకో పరిమితం చేస్తే ఎలా, దాన్ని మేకోవర్‌ చేయాల్సిందే అనుకున్నారు తయారీదారులు. అందుకే రకరకాలుగా ఆలోచించి దాన్నో అందమైన గృహాలంకారంగా మార్చేశారు.

గోడకి ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్నో లేదా పెయింటింగునో అమర్చినట్లుగా వచ్చేవి కొన్నయితే, గోడమీద త్రీడీ బొమ్మని అలంకరించినట్లుగా వచ్చేవి ఇంకొన్ని. పైగా ఈ బొమ్మ లేదా పెయింటింగ్‌ అనేది అంతా ఒక ప్యానెల్‌లోనే లేకుండా రెండు మూడు ప్యానెల్స్‌లో ఉంటుంది. ఒకదాంట్లో మాత్రం వాల్‌క్లాక్‌ ఉంటుంది. వీటిని చెక్కతోనూ లోహంతోనూ ప్లాస్టిక్‌తోనూ ఆక్రిలిక్‌తోనూ కూడా తయారుచేస్తున్నారు. ఖరీదైన వెండిలోహంతోనూ రంగులరాళ్లతోనూ క్రిస్టల్స్‌తోనూ కూడా గోడ గడియారాలను రూపొందిస్తుండడం విశేషం.

గోడమీద ఓ అందమైన చిత్రాన్ని చేత్తో గీసినట్లో లేదా స్టిక్కర్లు అంటించినట్లో ఉండే గడియారాలు మరో రకం. ఇలాంటి వాటిల్లో కేవలం వాటి మధ్యలోని ముళ్లు మాత్రమే లోహంతో చేసినవి ఉంటున్నాయి. గడియారానికి చుట్టూ దానికి సంబంధించిన పెయింటింగ్‌ స్టిక్కర్లు ఉంటాయి. దూరం నుంచి చూస్తే అది మొత్తంగా గీసిన బొమ్మేమో అనిపిస్తుంది. వీటిల్లోనూ పిల్లల పడకగదులూ పెద్దవాళ్ల పడకగదులూ వంటగదీ, హాలూ... ఇలా అలంకరించే గదిని బట్టి ఆయా బొమ్మలూ చిత్రాలూ కూడా మారిపోతుంటాయి. ఉదాహరణకి పిల్లల గదుల్లో అయితే స్పైడర్‌మ్యాన్‌, జంతువుల బొమ్మలూ ఉన్న వాల్‌క్లాక్‌లను చిత్రించడం, అంటించడం చేస్తున్నారు. వీటిల్లో కొన్ని నేరుగా తగిలించే బొమ్మల్లాంటివీ ఉంటున్నాయి. పైగా ఇవన్నీ నియాన్‌ రంగుల్లో చూడగానే కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. నాన్‌స్టిక్‌ పాన్‌లూ, పండ్లూ, కూరగాయలూ, స్పూన్లూ, ఫోర్కుల రూపాల్లో తయారుచేసినవయితే వంటింటి సామాన్లలో అందంగా ఇమిడిపోతూ దానికో కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి.

మధ్యలో గడియారం ఉండి చుట్టూ బోలెడు ఫొటో ఫ్రేములున్న వాల్‌క్లాక్‌లూ వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో మనకిష్టమైనవాళ్ల ఫొటోలూ లేదా కుటుంబ చిత్రాలూ అన్నీ పెట్టుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, గోడకు ఓ అందమైన బొమ్మను తగిలించినట్లుగా పువ్వులూ పక్షులూ కొమ్మలబొమ్మలతో రూపొందించినవీ వస్తున్నాయి. మరికొన్ని మోడ్రన్‌ ఆర్ట్‌ మాదిరిగా ఇదీ అన్న ఆకారం లేకుండా ఉండేవీ ఉంటున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే వీటిని చూడగానే ఇవసలు గడియారాలేనా అనిపిస్తున్నాయి. పైగా ఈ రకమైనవి గోడకో ఫ్యాషన్‌లుక్‌నీ తీసుకొస్తున్నాయండోయ్‌. మొత్తమ్మీద గోడ గడియారం అనేది సమయం చూసుకోవడం కన్నా అందమైన గృహాలంకారంగా మారిపోయిందనడంలో సందేహం లేదు... ఏమంటారు?

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.