close
మారిన మనిషి

మారిన మనిషి
- లక్ష్మీహరిత ఇంద్రగంటి

ప్పని తెలిసినా కుతూహలాన్ని ఆపుకోలేని డాక్టర్‌ భరద్వాజ్‌ ఆ డైరీలను తిరగేస్తున్నాడు. అందులోని విషయాల్ని చదువుతూ ఒక్కసారిగా గుండెపగిలి కుప్పకూలిపోయాడు. అతని కళ్లనుంచి నీరు ధారాపాతంగా కారుతోంది... అచ్చం బయట కురుస్తున్న వర్షపు నీరులా...

***

ఉదయం పదకొండు గంటల సమయం. వానాకాలం కావడంతో ఎండవేడిమి ఇంకా పెరగలేదు. తెలుపురంగు స్కోడా కారు చల్లగాలిని చీల్చుకుంటూ ఎయిర్‌పోర్టువైపు పరుగులు తీస్తోంది. డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చుని సాలోచనగా బయటికి చూస్తున్నాడు డాక్టర్‌ భరద్వాజ్‌. అతని పక్కనే డాక్టర్‌ అంకుశ్‌, డ్రైవర్‌ పక్క సీట్లో డాక్టర్‌ చైతన్య ఉన్నారు. ప్రముఖ హృద్రోగ నిపుణుడైన డాక్టర్‌ భరద్వాజ్‌తో కలిసి ఓ ఆపరేషన్‌ పనిమీద బెంగళూరు బయలుదేరారు. నలభై-నలభైఅయిదు సంవత్సరాల మధ్య వయసూ, ఆరడుగుల ఎత్తూ, పసిమి మేనిఛాయతో, చదువూ డబ్బూ వృత్తి వల్ల వచ్చిన హుందాతనం డాక్టర్‌ భరద్వాజ్‌ ముఖంలో విస్పష్టంగా ఉన్నా ఏదో తెలీని వెలితి కనిపిస్తోంది డాక్టర్‌ అంకుశ్‌కు.

మామూలుగా అయితే ఇలాంటి ప్రయాణాల్లో వైద్యవృత్తీ - ఆదాయం, కార్పోరేట్‌ ఆసుపత్రులూ డాక్టర్లూ... ఆసుపత్రికి వచ్చేవారితో వ్యవహరించాల్సిన తీరూ, డబ్బు సంపాదన విషయంలో డాక్టర్లు అవలంబించాల్సిన విధానాలూ... ఇలా అన్నింటినీ కలుపుతూ ఆయన చెప్పే చాలా విషయాలు వైద్యాన్ని మంచి లాభదాయక వృత్తిగా భావించే చాలామంది యువ డాక్టర్లకు మంచి పాఠాలే. నిజానికి సర్జికల్‌ ప్రొఫెసర్‌గా ఆయనకు మంచి పేరుంది. అందుకే వివిధ వైద్యకళాశాలల వాళ్లు ఈయన్ని ప్రత్యేక అతిథిగా తరగతులకూ పిలుస్తారు. ఆయన పనిచేస్తూ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద హాస్పిటల్‌కు సంబంధించిన కాలేజీలో రెగ్యులర్‌ క్లాసులూ చెబుతుంటాడు. అయితే సబ్జెక్టు విషయాల్ని స్పష్టంగా, క్షుణ్ణంగా చెప్పడం, నేర్పించడంలో ఎంత నేర్పరో... ఆ వృత్తి అయిపోయిన తరువాత డబ్బు సంపాదించే విధానం, డాక్టరు ఆలోచించాల్సిన తీరూలాంటి విషయాలను వివరిస్తూ వృత్తిని సిరుల వర్షం కురిపించేదిగా ఎలా మార్చుకోవాలో చెప్పడంలోనూ అంతే సిద్ధహస్తుడు. ఆసుపత్రి ఎంత ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే అంత పెద్దదీ, పేరున్నదీ అని జనాలు ఫీలవుతున్నప్పుడు, అలాంటి ఆసుత్రులు నెలకొల్పడంలోనూ వారి దగ్గరి నుంచీ ఆ స్థాయిలోనే డబ్బు వసూలు చేసి పెద్ద పేరు తెచ్చుకోవడంలోనూ తప్పేమీ లేదనేది ఈయన లాజిక్‌. అందుకే ఆసుపత్రికి వచ్చే రోగుల్ని పేషెంట్‌ అనకుండా కస్టమర్లుగా పిలుస్తుంటాడు భరద్వాజ్‌. మొత్తానికి ఆయన లెక్చర్లు తెగనచ్చేసే యువడాక్టర్లు చాలామందే భరద్వాజ్‌ శిష్యరికంలో చేరిపోయారు. దానికి తగ్గట్టే ‘చాలా పెద్ద డాక్టర్‌, బట్‌ వెరీ కాస్ట్లీ’ అనే పేరూ తెచ్చేసుకున్నాడు. ఏదైతేనేం, ఆయన ముభావంగా ఉండటం వల్ల ఇవాళ మంచి ఫైనాన్షియల్‌ లెక్చర్‌ మిస్సయ్యామని ఫీలవుతున్నాడు డాక్టర్‌ అంకుశ్‌.

ఉన్నట్టుండి... ‘‘డ్రైవర్‌, స్టాప్‌ ద కార్‌’’ అన్నాడు కంగారుగా భరద్వాజ్‌.

రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్న పెద్ద భవంతి. అక్కడి ఓ కూలీ గుండెను పట్టుకుంటూ నేలకు ఒరుగుతుండటం కార్లోని వారందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. విషయం అర్థం చేసుకునేలోపే తన బ్రీఫ్‌కేస్‌తో సహా అక్కడికి చేరిపోయాడు భరద్వాజ్‌. ఒక్కసారి నాడి పరిశీలించి రెండు చేతులూ బిగించి అతని గుండెల మీద బలంగా కొడుతున్నాడు. బ్రీఫ్‌కేసులోని మందేదో అతనికిస్తున్న విషయమూ...కూలీ కాస్త వూపిరి తీసుకోగలిగే సమయానికల్లా వచ్చిన అంబులెన్సువాళ్లకి అతన్ని జాగ్రత్తగా అప్పగిస్తున్న విషయమూ డాక్టర్‌ అంకుశ్‌ గమనించాడు. కానీ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.

‘‘వాట్‌ ఎ వండర్‌... వాట్‌ హాపెండ్‌ టు మిస్టర్‌ భరద్వాజ్‌’’ అంటూ చైతన్య వైపు ఆశ్చర్యంగా చూశాడు.‘‘అవును ఈమధ్య భరద్వాజ్‌లో చాలా మార్పు వచ్చింది. నేను విన్న ప్రకారం ఆయనీమధ్య వాళ్లనాన్నగారి డైరీలను చదివారనీ, అప్పటి నుంచీ డల్‌ అవటమేకాక, ఆలోచనల్లోనూ ఎంతో మార్పు కనిపిస్తోందనీ చాలామంది అన్నారు. ఇవాళ చూస్తే అది నిజమే అనిపిస్తోంది డాక్టర్‌ అంకుశ్‌’’ అన్నాడు చైతన్య.

***

చీకటిలా కనిపిస్తున్న నల్లటి రోడ్డు పక్కన... అప్పుడే స్నానం చేసినట్టు తడీపొడిగా నీటి చుక్కలతో కనిపిస్తోంది పచ్చగడ్డి. దానిమీదే ఎర్రజరీ అంచున్న తెల్లటి పంచె, మల్లెపువ్వులా కనిపిస్తున్న ఖద్దరు చొక్కా, ముక్కు మీదకి జారిన కళ్లద్దాలతో ఓ పెద్దాయన... ఉదయపు నడకలో వడివడిగా అడుగులేస్తున్నాడు. అంత వయసున్నా మోకాళ్ల నొప్పులేమీ లేనట్టుంది... అడుగులు చాలా వేగంగా పడుతున్నాయి. ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ మొహం మీద చెరగని చిరునవ్వుతో ఆయన నడక చూసేవారికీ ఉత్సాహాన్నిచ్చేలా ఉంది. రోడ్డు మలుపు దగ్గరికి వచ్చేసరికి ఎందుకో ఆ నడకలో వేగం తగ్గింది. ఎడమచేయి లాగుతున్న భావన కలుగుతుండటంతో దాన్ని విదిలించే ప్రయత్నం చేస్తున్నాడాయన. అంతలోపే గుండెల్లో నొప్పి వస్తున్నట్టు అనిపించడంతో రెండు చేతులనూ గుండెల మీద పెట్టుకుని పక్కన పేవ్‌మెంట్‌ మీద కూలబడ్డాడు. చుట్టూ జనం కనిపించలేదు. కాసేపటికే కళ్లు బైర్లు కమ్మాయి.

ఆసమయంలో అటువచ్చిన ఓ ఆటోడ్రైవర్‌ ఆయన్ని అతి కష్టం మీద తన ఆటోలోకి ఎక్కించుకున్నాడు. కాసిన్ని నీళ్లు ముఖం మీద చిలకరించి, మరికొన్ని నోట్లోపోసి ‘‘సార్‌ ఏమైంది?’’ అని అడిగాడు.

‘‘గుండెల్లో ఎందుకో నొప్పిగా ఉందయ్యా...!’’ ఆయాసంగా అన్నాడు ఆ పెద్దమనిషి.

‘అయ్యో హార్ట్‌ఎటాక్‌ ఏమో’ అనుకున్న ఆటోవాడు వీలైనంత వేగంగా దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెళ్లడం వెళ్లడమే అప్పుడే అక్కడికి వస్తున్న ఓ డాక్టరు దగ్గరికి వెళ్లి ‘‘సార్‌, గుండెనొప్పి అనుకుంటా... కాస్త చూడండి’’ అంటూ పిలిచాడు.

‘‘తప్పకుండా...’’ అని ఆటో డ్రైవర్‌కు భరోసా ఇచ్చి, ‘‘వీరయ్యా... అతన్ని స్ట్రెచర్‌ మీద లోపలికి తీసుకురండి’’ అన్నాడు ఆ డాక్టర్‌.

‘‘సార్‌, ఎవరో పెద్దాయన ఎలాగైనా మీరే కాపాడాలి’’ అంటున్న ఆటోడ్రైవర్‌తో-

‘‘మీరేమీ కంగారు పడకండి, మా దగ్గరికి తీసుకొచ్చారు కదా... అంతా మేం చూసుకుంటాం’’ అన్నాడు శాంతంగా.

‘‘మీరు దేవుడండీ...’’ అని అతను చేతులెత్తుతుంటే... ఎడమ చేతిని పైకెత్తి వద్దన్నట్టు వారించి-

‘‘ముందు ఓ యాభైవేలు కట్టండి... ఇమ్మీడియట్‌గా ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌చేస్తాం’’ అంటూ వెళ్లబోయాడు.

‘‘అమ్మో యాభైవేలా... నా దగ్గర రెండొందలే ఉన్నాయి డాక్టరు గారూ... రోడ్డు పక్కన పడిపోయి ఉంటే సాయం చేద్దామని తీసుకొచ్చాను. అంత డబ్బు నేను కట్టలేను సార్‌... ముందు మీరు చేర్చుకోండి. తరువాత వాళ్లవాళ్లొచ్చి ఆ డబ్బు కట్టి ఈయన్ని తీసుకెళతారు’’ అంటూ స్ట్రెచర్‌ మీద ఉన్న పెద్దాయన వైపు చేయి చూపిస్తూ అభ్యర్థించాడు ఆటో డ్రైవర్‌.

‘‘ఇక్కడ అలా కుదరదయ్యా... మీరు వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండి’’ అంటూ ఆ డాక్టర్‌ ముందుకు కదలబోయాడు.

‘‘టైం లేదు కదండీ... ఆయనకు ఒంట్లో ఎలా ఉందో ఒక్కసారి చూడండి’’ అన్నాడు డ్రైవర్‌.

‘‘నువ్వు చెప్పే డబ్బులకి గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో మంచి వైద్యం చేస్తారు తీసుకెళ్లు’’ అంటుండగానే,

డ్రైవర్‌ కంగారుగా... ‘‘పాపం సార్‌, నాక్కూడా ఈయనెవరో తెలీదు. ఒక్కసారి చేయిపట్టుకొని చూడండి సార్‌’’ అంటూ వెళ్లిపోబోతున్న డాక్టర్‌ రెండు చేతులనూ పట్టుకొని ఆపబోయాడు.

‘‘దయచేసి రచ్చ చేయకండి. మీలాంటి వాళ్లను పాపం అంటే మేం ఇబ్బందిపడాలి. నిన్ననే ఎవరో తీసుకొస్తే పాపమని వైద్యం చేశాం. యాభైవేల బిల్లు ఎగ్గొట్టిందికాక, ఆసుపత్రిలో జాతరచేసి వెళ్లిపోయారు ఓ పల్లెటూరివాళ్లు. మళ్లీ ఇదో తలకాయ నొప్పి. మీరు టైం వేస్ట్‌ చేసుకోవద్దు’’ అంటూ వడివడిగా లోపలికి వెళ్లిపోయాడు.

ఈ చర్చనంతా గమనిస్తున్న పెద్దాయన కళ్లు డాక్టరును అలా నిర్వేదంగా చూస్తున్నాయి. నొప్పికి మించిన బాధేదో ఆయన మొహంలో కదలాడింది. డాక్టరో తెల్లటి భూతంలా, ఆయన మెడలోని స్టెతస్కోపు ఓ విషపు పాములా కనిపిస్తున్నాయాయనకు. పెద్దాయన కళ్లలోనుంచి నీళ్లు... ధారలా ప్రవహించి గుండెతోపాటు ఒక్కసారిగా ఆగిపోయాయి.

***

డాక్టర్‌ భరద్వాజ్‌ వాళ్లనాన్నగారి పెన్షన్‌ విషయానికి సంబంధించి ఏవో కాగితాల కోసం అలమర్లు వెతుకుతున్నాడు. అక్కడే కనిపించింది ఎర్ర అట్టమీద మిలమిల మెరుస్తున్న బంగారు రంగు అక్షరాలతో ఓ డైరీ. సాలోచనగా ఓ పేజీని తెరిచాడు... ‘ఇవాళ భరద్వాజ్‌కు ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. నా కల త్వరలో నెరవేరబోతోంది. నా కొడుకు డాక్టరవబోతున్నాడు. వాణ్ని డాక్టరును చేసేందుకు ఇక నుంచి బట్టలూ, ఖరీదైన తిండితో సహా చాలా ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంది. డాక్టరంటే సాక్షాత్తూ భగవంతుడు. నేను ప్రాణం పోసిన బిడ్డ ఎంతోమందికి ప్రాణం పోయబోతున్నాడు. ఇవాళ నా గుండె ఆనందంతో మరింత వేగంగా కొట్టుకుంటోంది...’ అని రాసి ఉంది. చాలా పేజీలు తిరగేశాడు. ఆయన రాసిన అన్ని విషయాలూ కొడుకూ చదువూ చుట్టూనే తిరుతున్నాయి. తప్పని తెలిసినా ఆసక్తి చంపుకోలేక వాళ్ల నాన్న పాతడైరీలను కూడా బయటకు తీసి చదవడం ప్రారంభించాడు. భరద్వాజ్‌ పుట్టకముందు నుంచీ జరిగిన ఎన్నో విషయాలున్నాయి అందులో. మధ్యతరగతి జీవిగా నాన్నపడ్డ కష్టాలున్నాయి. వాటిలోనే ఒక పేజీ ప్రత్యేకంగా మధ్యకు మడిచి ఉంది. ‘గత నాలుగు రోజుల నుంచీ చాలా జ్వరంగా ఉంది. డాక్టరుకు చూపించుకునేందుకు నా దగ్గర కానీ, అమ్మ దగ్గర కానీ పెద్దగా డబ్బులు లేవు. కానీ అమ్మ మాట మీద మా ఇంటి దగ్గర ఉన్న డాక్టరు విశ్వేశ్వరయ్యగారు నన్ను చూసేందుకు వచ్చారు. జ్వరం ఎక్కువగా ఉండటం చూసి ఆయనే నన్ను వాళ్ల క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఏవో పరీక్షలు చేశారు. సెరిబ్రల్‌ మలేరియా అట... అది మెదడుకు వస్తుందట. మందుల ఖర్చు కూడా ఆయనే పెట్టుకొని నాకు వైద్యంచేశారు. నిజానికి డాక్టరు ఇంటికి వచ్చినరోజు నాకు స్పృహ కూడా లేదు. వైద్యం పూర్తయి నేను లేచేప్పటికి ఎదురుగా తెల్లకోటుతో, స్టెతస్కోపుతో అచ్చం దేవదూతలా ఉన్న డాక్టరుగారు నా నుదుటి మీద చేయివేసి నిలుచుని ఉన్నారు. ‘అమ్మా ఒక్కరోజు లేటై ఉంటే బిడ్డ దక్కేవాడు కాదు. వీడు చిరంజీవి... తీసుకుపోండి’ అంటూ అమ్మకు చెబుతున్నారు. ఆయనకు ఫీజుగా ఇవ్వడానికి మా దగ్గర పట్టుమని పదిరూపాయల డబ్బులు కూడా లేవు. అమ్మ కృతజ్ఞతతో ఆయన కాళ్లకు దండం పెట్టింది. ఈసారి పంటసొమ్ము రాగానే మీ ఫీజు ఇచ్చేస్తానంటూ చెప్పింది. ఆయన చిరునవ్వుతో ‘ఇద్దువులేమ్మా... ముందు బిడ్డ బతికాడు... నా కదే సంతృప్తి... వాణ్ని బాగా చదివించండి’ అన్నాడు. నిజంగానే విశ్వేశ్వరయ్యగారి చేతుల మీద చుట్టుపక్కల గ్రామాల్లోని ఎన్ని ప్రాణాలు బతికాయో! అందుకే ఆ ప్రాంతమంతా ఆయనకు పెద్ద పేరు. నా స్తోమతకు నేను డాక్టరు చదవలేను. కానీ నా బిడ్డను అచ్చం ఇలాగే వందలమంది ప్రాణాలు కాపాడేలా పెద్ద డాక్టరును చేస్తా. దానికోసం ఎంత కష్టమైనా పడతా...’ అని రాసి ఉంది. ఇవన్నీ చదువుతున్న భరద్వాజ్‌ మనసులోంచి అపరాధ భావం పొంగుకొస్తోంది. ఎన్ని పేజీలు తిరగేసినా... ‘డాక్టరంటే మహానుభావుడు, డాక్టరంటే దేవుడు, వైద్యుడు సృష్టికర్తతో సమానం, అతని సేవలకు వెల కట్టాలంటే జన్మసరిపోదు...’ ఇవే విషయాలు. ఇక మీద తిప్పే పేజీలన్నీ భరద్వాజ్‌ కన్నీటి చుక్కలతో తడిసి పోతున్నాయి. ‘నాన్నా...’ అంటూ ఆ డైరీలను గుండెలకు హత్తుకున్నాడు.

నాన్న అనుకున్నట్టు నేను డాక్టరునయ్యాను. నిజమే, కానీ దేవుడినీ? విశ్వేశ్వరయ్యగారి లాంటి మనిషినీ? నాన్న కష్టానికీ, కలలకూ ఫలితం ఇదేనా...?! భరద్వాజ్‌కి మనసు మనసులో లేదు. కళ్లలో సుడులు తిరిగే నీళ్లను అదుముతూ కుర్చీలో వెనకకు జారగిలపడ్డాడు.

ఇంతలో బయటి నుంచీ ‘‘సార్‌...’’ అంటూ పిలుపు... ‘‘నేను లోపలికి రావచ్చా’’ అంటూ తలుపులో నుంచి చూస్తున్నాడు డాక్టర్‌ ప్రతాప్‌.

భరద్వాజ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసిన వ్యక్తుల్లో ప్రతాప్‌ ఒకరు. చెప్పాలంటే చాలా విషయాల్లో భరద్వాజ్‌కు జిరాక్స్‌ కాపీ.

‘‘యా... కమ్‌ ఇన్‌ మిస్టర్‌ ప్రతాప్‌! హౌ ఆర్‌ యూ...’’ అంటూ కుర్చీలోంచి ముందుకు వంగాడు భరద్వాజ్‌.

రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌కు సంబంధించి ఓ కేసులో తన డౌట్‌ క్లియర్‌ చేసుకునేందుకు వచ్చాడు ప్రతాప్‌. తనతో తెచ్చిన కేస్‌షీట్స్‌, పుస్తకాలూ తెరిచి చూపిస్తూ అతనికున్న అనుమానాలు అడుగుతూ వాటిని వివరిస్తున్న భరద్వాజ్‌వైపు చూస్తున్నాడు. ఇంతలో ప్రతాప్‌ దృష్టి అక్కడి గోడమీద ఉన్న ఓ ఫొటో మీద పడింది.

‘‘సార్‌... ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు...?’’ అన్నాడు చాలా కంగారుగా.

‘‘మా నాన్నగారు... ఈ మధ్యే చనిపోయారు...’’ అన్నాడు భరద్వాజ్‌ నిర్లిప్తంగా.

కానీ ప్రతాప్‌ మొహంలోని కంగారును మాత్రం గమనించాడు. ప్రతాప్‌ కర్చీఫ్‌తో మొహం తుడుచుకుంటున్నాడు.

‘‘వాట్‌ హ్యాపెండ్‌ ప్రతాప్‌... ఎందుకలా కంగారు పడుతున్నారు... ఆయన మీకు తెలుసా?’’ అంటూ ఆతృతగా అడిగారు డాక్టర్‌ భరద్వాజ్‌.

‘‘సర్‌... అంటే... యాక్చువల్‌గా ఆయన్ని నేను చూశాను... అప్పటికి యాక్చువల్‌గా ఆయన మీ నాన్నగారని నాకు తెలీదు...’’ అంటూ నీళ్లు నములుతున్నాడు.

‘‘ఏమైంది ప్రతాప్‌, సరిగ్గా చెప్పండి’’ అన్నాడు కాస్తంత బిగ్గరగా...భరద్వాజ్‌ గొంతుకు ఆతృతతోపాటూ అసహనం కూడా తోడైంది.

‘‘సర్‌, యాక్చువల్లీ వాట్‌ హ్యాపెండ్‌ ఈజ్‌... ఐ థింక్‌ టూ మంత్స్‌ బ్యాక్‌... ఓ ఆటో డ్రైవర్‌ ఈయన్ని తీసుకుని చెస్ట్‌పెయిన్‌ అంటూ మా హాస్పిటల్‌కి వచ్చాడు. బట్‌ హి డోంట్‌ హావ్‌ ఈవెన్‌ వన్‌ థౌజండ్‌ రూపీస్‌ విత్‌హిమ్‌. మన హాస్పిటల్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ మీకు తెలిసినవే. వాటినే నేను ఫాలో అయ్యాను. ఆయన్ని గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి త్వరగా తీసుకెళ్లమని సలహాకూడా ఇచ్చాను...’’ అంటూ ఆరోజు ఆసుపత్రిలో జరిగిన విషయాలన్నింటినీ చెబుతున్న ప్రతాప్‌ మాటలకు డాక్టర్‌ భరద్వాజ్‌ కోపం నషాళానికంటింది.

దవడ పగలకొట్టాలన్నంత కోపం వచ్చినా, ఆపుకుని ‘‘ప్రతాప్‌ మీరు డాక్టర్‌కన్నా ముందు మనిషి. ఆటోడ్రైవర్‌కు ఉన్నంత జాలి కూడా చదువుకున్న మీకు లేకుండా ఎలా పోయింది? ఆయనెంత సౌమ్యుడో మీకు తెలుసా... అంత ఎక్విప్‌మెంట్‌, అంతమంది డాక్టర్లూ ఉండి... ఆసుపత్రికి తెచ్చాక కూడా ఓ మనిషిని మీరు బతికించలేకపోయారు. హౌ ఇన్‌ఎఫీషియంట్‌ యూ ఆర్‌... హౌ ఇన్‌హ్యూమన్‌ థింగ్‌ ఇట్‌ ఈజ్‌...’’ అంటూ పట్టరాని కోపంతో అరిచేశాడు.

‘‘సర్‌, పేషెంట్లను అడ్మిట్‌ చేసుకోవడం, ట్రీట్‌మెంట్‌ విషయాల్లో- ఇవన్నీ మీరు చెప్పిన పద్ధతులే కదా! ఈరోజు మీ నాన్నగారు అయ్యేసరికి మీరంత ఎగ్జయిట్‌ అవుతున్నారు. పైగా ఆయన మీ నాన్నగారని నాకు తెలీదు కదా. సో... అందరినీ మనం ఎలా ట్రీట్‌ చేస్తామో ఈయన్నీ అలాగే చూశాను. దెన్‌ వాట్స్‌ రాంగ్‌ విత్‌మీ సర్‌...’’ అంటున్న ప్రతాప్‌ మాటలకు తట్టుకోలేక-

‘‘ప్లీజ్‌ గెట్‌ లాస్ట్‌ ఫ్రం హియర్‌...’’ అంటూ గట్టిగా అరిచాడు భరద్వాజ.

అంతే, కొన్నాళ్లపాటు భరద్వాజ ఎవరితోనూ మాట్లాడలేదు. హత్యాపాతకం అంటినవాడిలా కళావిహీనంగా తయారయ్యాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఆలోచనలతో ఘోర తపస్సే చేస్తున్నాడు. హాస్పిటల్‌కి రెగ్యులర్‌గా వెళ్లడమూ కొన్నాళ్లు మానేశాడు. ఆరుబయట ఇంటి లాన్‌లో ఆలోచనగా ఆకాశంలోకి చూస్తూ కూర్చున్న భరద్వాజ్‌ దగ్గరికి ఓ ఆరేడేళ్ల పాప ‘అంకుల్‌’ అంటూ వచ్చింది.

భరద్వాజ్‌ చూసేలోపే ‘‘ఇవాళ నా హ్యాపీబర్త్‌డే’’ అంటూ ఓ ఎర్ర గులాబీ పువ్వూ, చాకొలేట్‌ చేతిలో పెట్టింది.

ఆ పాప అమ్మానాన్నా వెనకే వచ్చారు. ‘‘డాక్టర్‌గారూ, మీరు మూణ్ణెల్లక్రితం ఉచిత గుండె ఆపరేషన్ల క్యాంపులో మా పాపకు ఆపరేషన్‌ చేశారు. అప్పుడు మిమ్మల్ని చూసింది. ‘నాన్నా, ఆ అంకులేనా నన్ను బతికించింది’ అని అప్పుడే అడిగింది. కానీ మిమ్మల్నంత గుర్తు పెట్టుకుంటుందనుకోలేదండీ... ఇవాళ ముందు మీకే చాక్లెట్‌ ఇవ్వాలని గోల’’ అని రెండు చేతులూ కట్టుకొని ఓ పక్కగా నిలుచుని చెబుతున్నారు.

నిజానికి ఓ రాజకీయ పార్టీకీ, వీళ్ల ఆసుపత్రికీ మధ్య ఉన్న ఓ డీల్‌ కారణంగా ఆ ఆపరేషన్లు చేశాడు భరద్వాజ్‌.

అందుకే ‘‘అయ్యో, ఆ ఆపరేషన్‌ నేను జస్ట్‌ చేశానంతే... చేయించిన వాళ్లు వేరే’’ అని చెబుతున్నా వినకుండా ముగ్గురూ ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. వాళ్లను లేపి టిఫిన్‌ పెట్టించి పంపించాడు భరద్వాజ్‌.

ఆ క్షణమే... తాను ప్రయాణించాల్సిన మార్గం స్పష్టమైంది భరద్వాజ్‌కు. ‘సేవ, పనిలో సేవాభావం’ ఇవే నాన్నకు నేనిచ్చే ప్రతిఫలాలు అనుకున్నాడు. యథాలాపంగా ఆ ఎర్రగులాబీని తండ్రి ఫొటో దగ్గర ఉంచాడు. అప్పటినుంచే సెలవు రోజుల్లో పేదవాళ్లకు చికిత్స అందించేలా తన షెడ్యూల్‌ తయారుచేసుకున్నాడు. మారుమూల గ్రామాలూ, మురికివాడల ప్రజలకు ఉచిత గుండె ఆపరేషన్లూ చేయడం మొదలుపెట్టాడు. భరద్వాజ్‌ లెక్చర్ల తీరు డబ్బుతత్వం నుంచి మానవత్వంవైపు మళ్లింది. పాప ఇచ్చిన ఎర్రగులాబీల్లాంటివి ఎన్నో ఆయన చేతినుంచీ నాన్న ఫొటో దగ్గరికి ఒద్దికగా చేరుతున్నాయి. మార్పు మనిషిలో భాగం... మనిషి మారతాడు... కాకపోతే అది ఎప్పుడన్నది చెప్పలేం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.