close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముందున్నది మొసళ్ళ పండగే

ముందున్నది మొసళ్ళ పండగే
- మీనాక్షి శ్రీనివాస్‌

‘‘మేడం...కాస్త వాటర్‌ ఇప్పించండమ్మా, మూడు రోజులైంది గొంతు తడుపుకుని... దాహంతో ప్రాణం పోయేలా ఉంది... ప్లీజ్‌’’ గేటు దగ్గర ఓ బిచ్చగాడు తడారిపోయిన గొంతుతో పిలుస్తున్నాడు. అది అడుక్కుంటున్నట్టులేదు...ప్రాణభిక్ష కోసం వేడుకుంటున్నట్లుంది.

‘‘సార్‌, ప్లీజ్‌ సేవ్‌ మీ... నాలుగు చుక్కలు నీళ్ళు పొయ్యండి... గొంతు ఎండి చచ్చిపోయేలా ఉన్నాను’’ ఈసారి మరింత దీనంగా... నిజంగానే ప్రాణభీతి వినిపించింది అతని గొంతులో. లాన్‌లో కూర్చుని టేబ్లెట్‌లో ‘ఈ-వార్తలు’ చదువుకుంటున్న కార్తికేయ... కొంచెం కదిలాడు- అంతరాయం కలగడంతో.

‘‘శ్రేయా, అతనికి కొంచెం వాటర్‌ ఇవ్వు. లేకపోతే పోయేటట్టున్నాడు... పొద్దున్నే వెధవ న్యూసెన్స్‌.’’

‘‘అమ్మా, కొంచెం నీళ్ళు...’’ ఈసారి సొంత భాషలోకి మారిపోయింది. గొంతు మరింత దీనంగా ఉంది.

‘‘సార్‌, నీళ్ళు’’ దబ్బుమని పడిపోయిన శబ్దం.

‘‘అరే శ్రే... పిలుస్తుంటే వినబడటం లేదా... పొద్దున్నే ఈ రెచెడ్‌ ఫెలో మన ఇంటిముందే అయిపోయేటట్టున్నాడు’’ విసుగ్గా అంటూ లేచాడు- ఇక తప్పదన్నట్టు.

ఇంట్లో శ్రేయ అలికిడి వినబడలేదు. ఏమయింది? ఆలోచిస్తున్న అతనికి సడెన్‌గా గుర్తుకొచ్చింది. ఈవేళ... నో వాటర్‌... నో పవర్‌... పైన టెర్రెస్‌ మీద సోలార్‌ సిస్టంతో టిఫిన్‌, లంచ్‌ తయారుచేసే పనిలో ఉంది. ఇప్పుడుగానీ కదిపామా... అమ్మో చచ్చేమన్నమాటే. గబగబా అక్కడ ఒక అలమారులో తాళం వేసి జాగ్రత్తగా ఉంచిన ఓ సీసాలోంచి ఆ పక్కనే నీరు తాగడానికి ఉపయోగించే చిన్న మూతలోకి నీళ్ళు వంపి జాగ్రత్తగా పట్టుకెళ్ళబోయాడు గేట్‌ వైపు.

‘‘ఏమిటి, మీరు చేస్తున్న పని... ఆ నీళ్ళు మనం ఈ నెలంతా తాగడానికి. పెద్ద దానకర్ణుడిలా బయలుదేరారు... పెట్టండి లోపల’’ ఒక్క ఉరుకులో మెట్లన్నీ దిగి గబగబా వస్తూ అరిచింది శ్రేయ.

‘‘అదికాదు డియర్‌, పాపం అతను దాహంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కొంచెం...’’

‘‘చాల్లెండి, బయల్దేరారు అపరకర్ణులు. ఈ దాతృత్వంతో కాదూ, మీ పూర్వీకులు మనకీ దుస్థితి కల్పించింది. ఇంకా బుద్ధిరాలేదు మీకు. అతను కాదు... ఆ సీసా నీళ్ళూ మళ్ళీ రేషన్‌ రోజువరకూ సరిపెట్టుకోకపోతే...మనం...మనకి పడుతుంది ఆ గతి. పోనీ అంటే, ఇంత పెద్ద బిజినెస్‌ టైకూన్‌ కుటుంబం... ‘ఆ’ పని కూడా చేయలేం. పెట్టండి లోపల జాగ్రత్తగా - చుక్క కూడా పోనివ్వకుండా’’ అపరకాళిలా వచ్చింది.

‘‘పాపం శ్రే...అతను దాహంతో చనిపోయేలా ఉన్నాడు. ఎలాగో సర్దుకుందాం... ఈ నీరు అతనికి పట్టనీ’’ ముందుకు కదిలాడు కార్తికేయ.

‘‘అక్కడికి మీరే మహా దాతలయినట్లూ, నేను కసాయినయినట్లూ. ఆ నీళ్ళు మర్యాదగా, జాగ్రత్తగా లోపలపెట్టి... ఓ మింట్‌ అతని నోట్లో వేసి... కావాలంటే ఓ వెయ్యి రూపాయలిచ్చి పంపండి. అంతేకానీ, ఆ నీళ్ళు ఇవ్వొద్దు. నేనే గొంతు ఎండిపోయినా ఓ మింట్‌ నోట్లో వేసుకు వూరుకుంటున్నాను చేసేదేంలేక’’ మళ్ళీ విసవిసా టెర్రెస్‌ పైకి వెళ్ళిపోయింది. ఆ మాట ఇక శిలాశాసనమే. ఆ మాడ్యులేషన్లో వచ్చిందంటే ఇక ఫైనల్‌ జడ్జిమెంట్‌ అయినట్టే.

‘‘సార్‌, సార్‌... అ... మ్మా...’’ ప్రాణం కడగట్టిపోతోంది అతనిలో.

ఏమయితే అయిందని ఒక్క ఉదుటున అతనిని చేరి చేతిలో ఉన్న ఉద్ధరిణెడు నీళ్ళూ అతని నోరు తెరిచి నోట్లో పోశాడు గబగబా. ఆ తరవాత మింట్‌ ఒకటి నోట్లో వేశాడు ఎందుకైనా మంచిదని.

నిమిషాల వ్యవధిలో అతనిలో జీవకళ తొణికిసలాడింది. పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది. ‘‘సార్‌, ప్రాణదానం చేశారు. చచ్చి... మీ కడుపున...’’

‘‘సరె, సరె... లేచి త్వరగా వెళ్ళు.’’

ఎక్కడ శ్రేయ వచ్చి అతని ఎదురుగా తనని తిడుతుందో అన్న కలవరంతో అన్నాడు కార్తికేయ.

‘‘సార్‌, మీరు దేవుడు. ఈ రోజుల్లో ఎవరూ చుక్క నీరు కూడా ఇంకొకరికి ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా... మీరు నాలాంటి ముక్కూ మొఖం తెలియనివాడికి నీరిచ్చి, ప్రాణదానం చేశారంటే...’’

‘‘చూడూ, ఇప్పుడు నువ్వు అనవసరంగా మాట్లాడి, పొగిడి... మళ్ళీ నోరెండి నీళ్ళడిగితే ఇవ్వడానికి నా దగ్గర నీళ్ళు లేవు. విసిగించక వెళ్ళు’’ తెచ్చిపెట్టుకున్న కోపంతో అతన్ని కసిరాడు.

అతను తన ప్రాణదాతకి మరోమారు మనసా వాచా కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుండి నీరసంగా కదిలాడు.

‘అమ్మయ్యా, గండం గడిచింది. ఎక్కడ అతని ఎదురుగా తనని ఉతికి ఆరేస్తుందో అని హడలి చచ్చా. వెళ్ళిపోయాడుగా, ఇక ఇప్పుడేమన్నా నో ప్రాబ్లం. తిట్టితిట్టి అలసిపోయి తనే వూరుకుంటుంది’ మనసులో అనుకున్నాడు కార్తికేయ.

అంతలో గబగబా రానే వచ్చింది శ్రేయ. ‘‘అయిందా, సేవ... ఈవేళ మీ కోటా... కట్‌. చేశారుగా దానధర్మం... ఆ ఆనందంతో నోరు చప్పరించుకోండి. తనకుమాలిన ధర్మం మీ వంశంలోనే ఉంది. అందుకే ఈ పరిస్థితి దాపురించింది’’ అక్కసుగా అంది.

అప్పటికే తెచ్చిపెట్టుకున్న సహనం అంతరించిపోగా నోరు జారాడు కార్తికేయ.

‘‘ఈ పరిస్థితి మా వంశంలో ఉన్న దాతృత్వం వలన రాలేదు. మీ వంశంలో ఉన్న దుబారా వలన వచ్చింది. చెబుతావుగా పెద్ద గొప్పగా- మా బామ్మ స్నానం చేసేందుకు నాలుగు బకెట్ల వేడివేడి నీళ్ళు వాడేది... మా తాత- వాకిట్లో మొక్కలకు పెద్ద ట్యూబుతో నీళ్ళు పెట్టేవాడూ, వాకిలి కడగడానికి కూడా మోటర్‌ ఆన్‌ చేసి ట్యూబు పెట్టేసేవాళ్ళం - అంటూ. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం, అలా లెక్కా పత్రం లేకుండా దుబారా చేయడం వలనే ఇప్పుడీ దశ పట్టింది’’ ఎకసెక్కెంగా అన్నాడు.

‘‘అబ్బో, అక్కడికేదో మీవాళ్ళు తక్కువ తిన్నట్లు... మీ ఇంట్లో కుళాయిలు విప్పి వదిలేసేవారటగా... ఎన్ని నీళ్ళు వృథాగా పోయేవో’’ మూతి మూడు వంకరలు తిప్పింది శ్రేయ.

‘‘ఇదిగో, మావాళ్ళనంటే నేనూరుకోను. అసలు...’’

‘‘అబ్బా... మొదలుపెట్టారా? ఏదో దానికి గొడవేసుకోకపోతే మీకు టైమ్‌ గడవదా? మామ్‌... నాకు ఆఫీస్‌ టైమ్‌ అయిపోయింది. ఈవేళ పవర్‌ కూడా ఉండదు. నేను త్వరగా వెళ్ళాలి. ఐదో అంతస్తులో ఉన్న ఆఫీస్‌ మెట్లెక్కి వెళ్ళాలంటే- కనీసం గంట ముందుగా వెళ్ళాలి. నాకు ఫుడ్‌ పెట్టేది ఉందా లేదా?’’ విసుక్కున్నాడు, అప్పుడే అక్కడకు వచ్చిన ‘టో’వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు.

‘‘ఎందుకు పెట్టనూ... రా నాన్నా... నేనూ ఆఫీసుకి వెళ్ళాలి. లక్కీగా నాది మొదటి అంతస్తే. ఇదిగో, మీ నాన్నలాంటి వాళ్ళు దూరదృష్టి లేకుండా- ఎలాపడితే అలా వాడటం, దుబారా చేయడం వలనే మనకీ కష్టాలు... నీళ్ళకీ, కరెంటుకీ’’ గురగురలాడింది.

‘‘మామ్‌, నాన్న వంశం అని నువ్వూ, మీవాళ్ళ వలనే అని నాన్నా వాదులాడుకున్నా... ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నా, నిజంమాత్రం అదే. మీ పూర్వీకులు... ముందుతరాల గురించిన ఆలోచన లేకుండా చక్కగా దొరికిన సహజ వనరులన్నిటినీ అలా విచ్చలవిడిగా, అజాగ్రత్తగా వాడటం వలనే, ముందుచూపు లేకుండా ప్రకృతిని కలుషితం చేసి భూమిని డొల్లచేసి, పచ్చదనాన్ని కాలరాసి అతి తెలివితోనూ, దురాశతోనూ విపత్తులు కొని తెచ్చుకుని, వాళ్ళు బానే దాటేశారు. ఇదిగో, ఇప్పుడు మన చావుకొచ్చింది. ఈరోజు గుక్కెడు నీళ్ళకీ, పరిశుభ్రమైన గాలికీ, విద్యుత్తుకీ, అన్నిటికీ విలవిలలాడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళే కాస్త ముందుచూపుతో వాడకంలో జాగ్రత్త, తయారీలో క్రమబద్ధతా చూపి ఉంటే... సర్లే ఎవర్నని ఏం లాభం? మన రాత ఇలా తగలడ్డాకా... నువ్వు రెడీ అయి, ఫుడ్‌ పెట్టేస్తే... నిన్ను నీ ఆఫీస్‌ దగ్గర దించి, నేను వెళ్ళిపోతా.’’

‘‘నాన్నా, టిష్యూ పేపర్‌ అయిపోవచ్చింది... తెస్తావా? కాస్త ఖరీదైనా, ఆ సెంటెడ్‌ పేపరే తీసుకురా... ఛస్తున్నాం, మరీ వారానికి ఓరోజు స్నానం అంటే. నాకసలే ఈవేళ విదేశీ కస్టమర్స్‌తో బిజినెస్‌ మీట్‌ ఉంది’’ మళ్ళీ టేబ్లెట్‌ ముందరేసుకు కూర్చున్నాడు కార్తికేయ, కొడుకుతో అంటూ.

‘‘నాకూ చాలా విసుగ్గా ఉంటోంది. మా చిన్నప్పుడు వండిన గిన్నెలూ, తిన్న కంచాలూ అన్నీ చక్కగా నీళ్ళతో చకచకా కడుక్కునేవాళ్ళం. ఇప్పుడో... లిక్విడ్‌ సోప్‌తో రుద్దుకోవడం, తడిగుడ్డతో తుడుచుకోవడం... దిక్కుమాలిన రోజులొచ్చాయి’’ విసుక్కుంది శ్రేయ.

‘‘మా అమ్మ అస్తమానం చెప్పేది నీళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళ దగ్గర డబ్బు నిలవదూ అని. అందుకే ఇప్పుడు నీళ్ళూ లేవు, ఎంత సంపాదించినా డబ్బూ నిలవడం లేదు.’’

ఇంకా శ్రేయ గొణుగుడు ఆపలేదు.

‘‘మమ్మీ, కబుర్లకేంగానీ... ఒకసారి ఫుడ్‌ రెడీ అయిందేమో చూడు. మళ్ళీ ఈరోజు... కొంచెం సైక్లోన్‌ అనౌన్స్‌ చేశారు న్యూస్‌లో. అప్పుడు సోలార్‌ సిస్టం కూడా డౌన్‌ అవుతుంది. ముగ్గురం బయట ఫుడ్‌ అంటే... ఓ లక్ష రూపాయలు ఫట్‌’’ చెప్పాడు టో.

‘‘అవున్రోయ్‌, మర్చేపోయా... శ్రేయా, పద నేనూ హెల్ప్‌ చేస్తా’’ టేబ్లెట్‌ మూసి కొడుకు చేతిలోపెట్టి టెర్రెస్‌ పైకి పరుగుపెట్టాడు కార్తికేయ.

‘‘హూ, మన పెద్దవాళ్ళకి జాగ్రత్త లేకపోవడం మన చావుకొచ్చింది’’ భర్త వెనకాలే పరుగుపెట్టింది శ్రేయ.

‘‘మీ పెద్దవాళ్ళకి జాగ్రత్త లేకపోవడంకంటే, సహజ వనరులను యథేచ్ఛగా లూటీ చేసి, ప్రకృతి ప్రకోపాలకీ, వైపరీత్యాలకీ కారణం కావడమే ఇప్పటి ఈ పరిస్థితులకి కారణం... అన్న నిజం ఇప్పటికీ మీకర్థం కాకపోవడం చూస్తే జాలేస్తోంది. పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా దోచేసుకుని, ముందు తరాలకు దాచేసుకున్న ప్రబుద్ధులు, ముందు తరాలకి ధనం మాత్రమే ఇస్తే చాలదనీ, హాయిగా ఆనందంగా బతికేందుకు- గాలీ, నీరూ కూడా ముఖ్యం అన్న నిజాన్ని ఎలా మరచిపోయారో కదా... అమ్మో, గాలి అంటే గుర్తుకొచ్చింది... నా ఆక్సిజన్‌ సాక్‌... ఖాళీ అయిపోయింది... నాకు వూపిరి ఆడటం లేదు. ఓ మామ్‌, సేవ్‌ మీ, నాకు గాలి... వూపిరి...’’

‘‘ఒరేయ్‌, జాము పొద్దెక్కేదాకా పడుకుని ఏమిటా కలవరింతలు. లే, అప్పుడే పదవుతోంది. వెధవ నిద్రా నువ్వూనూ. అర్ధరాత్రిదాకా ఆ కంప్యూటర్‌ ముందు కూర్చోవడం... బారెడు పొద్దెక్కినా లేవకపోవడం... ఏమిటి? గాలీ, వూపిరీ అంటూ... ఏదైనా గాలి సోకిందా?’’ అమ్మ అరుపులతో మెలకువ వచ్చి అయోమయంగా చూశాడు- ఇదంతా కలా అనుకుంటూ. ఎంత భయంకరమైన కల... పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మనిషి మనుగడకి అత్యంత అవసరమైన గాలీ నీరూ కూడా ముందుముందు దొరకడం దుర్లభమే. ఎంతటి దుస్థితి..? కటకటా... అకటా, ముందు తరాలకు మొసళ్ళ పండగేగా అనుకుంటూ లేచాడు ‘టో’ అని పిలవబడే కిట్టూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.