close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దూరపు... కొండలు

దూరపు... కొండలు
- తులసీ బృంద జంపన

‘సంధ్య’... ఎంత అందమైన పేరది! ఆ అమ్మాయి రూపం కూడా పేరుకి తగ్గట్టే ఉంటే బాగుండు. ఇలా ఓ వందసార్లన్నా అనుకున్నానేమో! నేనీరోజు పెళ్ళిచూపులకి వెళ్ళబోతున్నాను. ఆ అమ్మాయి పేరే సంధ్య. ఇప్పటికే ఓ ఆరేడుగుర్ని చూసుంటా. కానీ ఏ ఒక్కరూ నచ్చలేదు. మొదట్నుంచీ అంతే. ఒకంతట ఎవరూ నచ్చరు. నా కోరిక వేరు, కలలు వేరు. నాకొచ్చే అమ్మాయి నా సర్కిల్లో ఎవరికీ లేనంత అందమైనదై ఉండాలి. ఒకవేళ... సంధ్య తను కోరుకున్నట్టే ఉంటే వెంటనే ఒప్పేసుకోవాలి. వూహల్లో తేలిపోతున్నాడు చందు. ఉరఫ్‌ దినేష్‌ చంద్ర.

ఒకవేళ ఆ అమ్మాయి నచ్చేస్తే! సమస్య తీరినట్టే. ఎందుకంటే... ఉన్న ఒక్క కొడుకూ వచ్చిన సంబంధమల్లా కాదంటుంటే... వాళ్ళమ్మానాన్నకు ఒహటే బెంగ. బుద్ధిమంతురాలు, గుణవంతురాలైన అమ్మాయొస్తే చాలంటారు వాళ్ళు. దానికేమాత్రం ఏకీభవించడు చందు. చూసినవాళ్ళలో ఏ ఒక్కరూ కంటికానక ఏదోక వంక చూపి కాదంటున్నాడు. అసలే... పెళ్ళీడు ఆడపిల్లలు అంతగా దొరకడం లేదు. మగపిల్లలంతా క్యూలు కడుతుంటే... ఇలా ఎంచుకుంటూ కూర్చుంటే వీడికసలు పెళ్ళవుతుందాని వాళ్ళ బాధ.

***

చెప్పాలంటే... అందగాడే. ఆరడుగుల పొడవుకు తగ్గ పర్సనాలిటీ. నొక్కుల జుత్తు, చురుకైన కళ్ళు. చూడగానే ఆకట్టుకునే రూపం. ఫొటోలోనే ఇంత బావుంటే... కచ్చితంగా బయటా బాగుండొచ్చు.ఇవే మొదటి పెళ్ళిచూపులు. నాకెలాగూ నచ్చేశాడు. ఇక నచ్చాల్సింది నేనే. నా ఫొటో కూడా వాళ్ళకివ్వలేదు. అయినా నాకేం తక్కువ! అప్సరసలా లేకున్నా అందగత్తెననే చెప్పాలి. అతడిలా పసిమిఛాయ కాకపోవచ్చు. కానీ, తేటైన రంగు. కుర్రాళ్ళు వెనక్కితిరిగి చూసేటంతటి అందమే. మరి ఇతగాడికి నచ్చుతానో లేదో! ఇదంతా... సంధ్య అంతరంగం.

‘ఎలా ఉంటే ఇష్టపడతాడో’ అనుకుంటూ పదిసార్లు అద్దంలో చూసుకుంది. అమ్మ... చీరే కట్టుకోమంది. డ్రెస్‌లోనైతే ఫ్రీగా ఉండొచ్చు. కానీ తప్పదుగా... అనుకుంటూ పసుపురంగు చీరని ఎంచుకుంది. ఆ చీరలో కాసింత తెల్లగా కనిపించొచ్చని. మూడు, నాలుగుసార్లు ప్రయత్నించి వీలుకాక పిన్నితో కట్టించుకుంది. డిజైనర్‌ బ్లౌజ్‌ చీరకి మరింత అందాన్నిచ్చింది. చిన్న నెక్లెస్‌, చెవులకి జూకాలు పెట్టుకుందంతే.

***

పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. నా కళ్ళు తారాడుతున్నాయి. సినిమాల్లో చూపించినట్టు సంధ్య ఏ కిటికీలోంచో చూడట్లేదు కదా!

అబ్బే... అటువంటి కిటికీలేవీ లేవా ఇంట్లో. చిత్రంగా అనిపిస్తోంది. ఇదివరకు పెళ్ళిచూపులకెళ్ళినప్పుడెప్పుడూ ఇంత ఇబ్బందిపడలేదు. ఈ రోజెందుకో కలవరంగా ఉంది. ఎప్పుడెప్పుడు సంధ్యని చూస్తానా అని మనసు ఆరాటపడుతోంది. ఆలోచనల్లో ఉండగానే... సంధ్యని తీసుకొచ్చారు. నచ్చాలని దేవుడ్ని కోరుకుంటున్నాను.

నాన్న చిన్నగా తట్టేసరికి ఉలిక్కిపడి తలతిప్పి చూశాను. తలొంచుకు కూర్చున్న సంధ్య తలెత్తింది. ఎలాగైతేనేం పరికించి చూశాను. అనుకున్నంత అందగత్తేమీ కాదు. ఛాయ కూడా తక్కువే. తన దగ్గర తేలిపోతుంది. కాస్త నిరాశ కలగడం వాస్తవం. నాకేమోగానీ... వేరెవరికైనా కచ్చితంగా నచ్చుతుంది. అలాగని నాకు నచ్చకుండా ఒప్పుకోలేనుగా. ఇప్పుడేం చెయ్యాలి? సంధ్య మాత్రం తన వంక ఇష్టంగా చూసింది. ఆమె పెదవులపై నవ్వొకటి విరిసి మాయమైంది. ఒకవేళ... తన అంతరంగాన్ని పసిగట్టేసిందా! ఛ... ఛ... అయ్యుండదు. పెళ్ళిచూపుల్లో అంతకన్నా నవ్వితే బాగుండదని కావచ్చు. అయ్యో, నిన్నట్నుంచీ ఎంతాశ పెట్టుకున్నాను. చెప్పాలంటే... సంధ్యకంటే... కాస్త పొట్టిగా ఉన్నా మూడో పెళ్ళి చూపుల్లో చూసిన రాధే బాగుంది. తిరుగు ప్రయాణంలో అమ్మ మొహం గంటు పెట్టుక్కూర్చుంది. నాన్న ఏమీ మాట్లాడకుండా గంభీరంగా ఉన్నారు. నేనూ కదపలేదు. మౌనంగానే డ్రైవింగ్‌ చేస్తున్నాను. కానీ ఎలా? మనస్ఫూర్తిగా నచ్చకుండా ఎలా చేసుకోను. రేపొద్దున్న... వెంట తిప్పుకోవాల్సిందీ, కాపురం చెయ్యాల్సిందీ నేనా, వాళ్ళా... సర్దిచెప్పుకున్నాను.

***

‘‘అహంకారం ఆడవాళ్ళకి ఆభరణం అంటారు. కానీ అతగాడికి నిలువెల్లా ఉన్నట్టుంది’’ అంటోందమ్మ నాన్నతో.

‘‘పోనీలే, ఏది జరిగినా మన మంచికే అనుకోరాదూ’’ అంటున్నారు నాన్న.

‘‘పాపం పిల్ల, ‘నేనింకా చదువుకుంటానమ్మా’ అని బతిమలాడింది. నేను వింటేగా! పిల్లాడు బాగున్నాడు. బాగా చదువుకుని ఉద్యోగం వెలగబెడుతున్నాడు. ఆస్తిపాస్తులకీ కొదవలేదని బలవంతంగా ఒప్పించా. ఎంత బుద్ధిగా ఒప్పుకుంది. అలాంటిది పిల్ల నచ్చలేదట. పైగా మొహమాటం లేకుండా ఫోన్‌ చేసి మరీ చెప్పారు. దానికేం తక్కువ? చక్కగా ఉన్న పిల్లే నచ్చలేదంటే... తీసి తీసి ఏ ఎంగిలాకులోనో వేసినట్టు కోతిలాంటిదెవతో వస్తుంది చూడండి’’ అక్కసంతా వెళ్ళగక్కుతోంది అమ్మ.

వాళ్ళ మాటలు వింటూ గదిలోనే కూర్చున్నాను. బయటికి పోబుద్ధికావట్లేదు. ఇంకా నయం, ఎవరికీ పెళ్ళిచూపులని చెప్పలేదు - ఎందుకైనా మంచిదని బంధువులొస్తున్నారన్నా. ఆఖరికి ఆ మౌనిక అననే అంది ‘కాలేజ్‌కి బంక్‌ కొట్టి పెళ్ళిచూపులకి అటెండ్‌ అవుతున్నావా?’ అని. ‘నీ మొహం అన్నీ అనుమానాలే’ అని కొట్టిపారేయబట్టి సరిపోయింది. లేదంటే రేపు కాలేజ్‌లో తన పరిస్థితేంటి? ఇంజినీరింగ్‌ పూర్తయ్యేంత వరకూ మరో రెండేళ్ళు ఈ పెళ్ళిచూపులు, గిళ్ళిచూపులవీ పెట్టుకోవద్దని చెప్పేయాలి... నిర్ణయించుకుంది సంధ్య.

***

‘‘చూడు చందూ, ఉద్యోగమొచ్చి అప్పుడే మూడేళ్ళయింది. నీకేమో ఎవరూ నచ్చట్లేదు. ఆడపిల్లల్ని చూసేసి నచ్చలేదంటే ఏం బావుంటుంది చెప్పు. నువ్వో పనిచెయ్‌. ఎవర్నయినా ప్రేమిస్తే చెప్పు... వెళ్ళి మాట్లాడతాం. లేదంటే ఇప్పటికైనా చూసుకో, మేం మాత్రం ఇకమీదట ఎవర్నీ భోగట్టా చెయ్యం’’ అని కరాఖండిగా చెప్పేశారు నాన్న. అమ్మ వెనక నుంచి తలాడిస్తోంది. నా మొహానికి అంత తెలివేడిస్తే ఇంకేం. అమ్మ కూచిగా పెరిగాను. నాన్నగారంటే కాస్త భయం. ధైర్యం చేసి ఏ అమ్మాయికీ లైనేయలేదు. చదువుకునేటప్పుడు నావంక ఏ అమ్మాయైనా ఆరాధనగా చూస్తే తల తిప్పుకునేవాణ్ణి. ఒకవేళ ఇష్టమైనా దగ్గరకెళ్ళి చెప్పలేకపోయా. ఇలా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోయాను. ‘ఇక మీదటైనా నచ్చిన అమ్మాయిని నువ్వే చూపించు స్వామీ’ అని కళ్ళు మూసుకుని మళ్ళా దేవుణ్ణి వేడుకున్నాను.

***

రేపు వీకెండ్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కనుక రేపు, ఎల్లుండి సెలవు. ఆ ప్రభావం శుక్రవారం మీద పడుతుంది. అందుకే ఆఫీసులో పనెక్కువైంది. ఇంటికొచ్చి నిద్రపోయేముందు ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అవడం నాకలవాటు. లాగినై చెక్‌ చేస్తూ కూర్చున్నాను. ప్రొఫైల్‌ పిక్చర్‌లో నా ఫొటో చూసి చాలామంది అమ్మాయిలు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడుతుంటారు. వాటిలో చాలా తక్కువ మందివే ఓకే చేస్తుంటా. సంగతి తెలిసి ‘ఫేస్‌బుక్‌లో ఓకే చేసినంత మాత్రాన నిన్నెవరూ ఎత్తుకుపోరులేరా’ అని ఫ్రెండ్స్‌ ఆటపట్టిస్తుంటారు.

చెక్‌ చేస్తుంటే... తెలిసిన కొందరివీ, తెలియని ఎందరివో రిక్వెస్టులున్నాయి. ప్రొఫైల్‌ పిక్చర్‌కి బదులు అందమైన వనకన్యలాంటి అమ్మాయి పెయింటింగ్‌తో ఉన్న ఓ రిక్వెస్ట్‌ నన్ను ఆకర్షించింది. పేరు చూస్తే శ్రావణి. ఎందుకో ఓకే చేయాలనిపించింది. అనుకోవడమేముంది... చేసేశా.

సెలవే కదాని బద్ధకంగా లేచాను. స్నానపానాదులు కానిచ్చి టిఫిన్‌ తిన్నాను. లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఫేస్‌బుక్‌ తెరిచాను. ‘థాంక్స్‌’ అంటూ శ్రావణి నుంచో సందేశం. నాకెందుకో నవ్వొచ్చింది. స్నేహం విలువను తెలుపుతూ బదులిచ్చాను. ఆలోగా కిరణ్‌ వచ్చాడు. వాడుగానీ చూస్తే రెచ్చిపోతాడని క్లోజ్‌ చేశాను. తయారై కిరణ్‌తో బయటికెళ్ళాను. రెండవుతుందనగా ఇంటికొచ్చేశా. లంచ్‌ చేసి మంచమెక్కితే మత్తుగా నిద్రపట్టేసింది. టైమ్‌ చూస్తే 5.30. అమ్మ కాఫీ కలిపిచ్చింది. బయటికింక వెళ్ళాలనిపించలేదు. టీవీ పెట్టుకుని కూర్చున్నాను. అమ్మ నాకిష్టమని పకోడీలు చేసిపెట్టింది. శని, ఆదివారాల్లో నాకిష్టమైనవే చేస్తుంది. తింటూ కూర్చున్నాను. నాన్నగారు విజయవాడ పెళ్ళికి వెళ్ళి అప్పుడే వచ్చారు. అక్కడెవరో ఏదో సంబంధం ఉందని చెప్పారంటూ ఆ వివరాలు అమ్మకి చెప్తుంటే వినడం ఇష్టంలేక మేడమీద నా గదిలోకొచ్చేశాను.

భోంచేసి ఫేస్‌బుక్‌ తెరిచాను. కాసేపటికి శ్రావణి చాటింగ్‌లో కొచ్చింది. ‘ఏం చేస్తున్నారు’ అంటూ. ఉత్సాహం ఉరకలెత్తింది. ‘మీతో చాటింగ్‌ చేస్తున్నా’ అని పెట్టాను. ‘ఛ! అది మాకు తెలియదు’ అంటూ బదులిచ్చింది. ‘మీకన్నీ తెలిసిపోతాయిలా ఉందే’ అని రెట్టించా. ‘ఏంటో, చిన్నప్పటి నుంచీ అంతే’ ఆమె దగ్గర నుంచి బదులొచ్చింది. చాలా ఇష్టంగా అనిపించి ‘మీరేం చేస్తుంటారు’ అని పెడితే ‘ఏం చెయ్యాలో అర్థంకాక ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేస్తుంటా’ అని పెట్టింది. ‘ఎంతమంది ఫ్రెండ్సో’ - నాలో ఏదో సందేహం. గ్రహించిందేమో... బదులివ్వలేదు. నేనే తిరిగి ‘చదువుతున్నారా... ఎక్కడ’ అన్నా... ‘ఆహా! చెప్పేస్తారు మరి’- నాకన్నా తిక్కదిలా ఉందే అనిపించి... ‘సరే, మీ ఇష్టం’ అని పెట్టగానే ‘అయితే ఓకే’ అని, దానివెంటే... ‘బాయ్‌ దినేష్‌ చంద్రగారూ, మళ్ళా రేపు కలుద్దాం. గుడ్‌నైట్‌’ అంటూ రిప్లయ్‌ కోసం చూడకుండా క్లోజ్‌ చేసేసింది. చాలాసేపటి వరకూ నిద్ర రాలేదు- మధ్యాహ్నం బాగా నిద్రపోవడంవల్లో, శ్రావణి ఆలోచనలవల్లో!

***

ఎందుకో శ్రావణితో ఫేస్‌బుక్‌ పరిచయం పుణ్యమా అని రోజులు తెలియకుండానే గడిచిపోతున్నాయి. తనతో చాటింగ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటోంది. ఆఫీస్‌, లేదంటే ఫేస్‌బుక్‌. రాత్రివేళ అయితే వీలుగా ఉన్నట్టుంది. వెంటనే లైన్‌లోకొస్తుంది. పెళ్ళికాని అమ్మాయేనేమో! లేకుంటే ఈ వేళలో ఫ్రీగా ఎలా ఉంటుంది? ఎన్నో ఆలోచనలు. పొరపాటున కూడా తన వివరాలు చెప్పదు. మా ఇద్దరి సంభాషణల్లో సినిమాలూ, గాసిప్స్‌, క్రీడలూ ఒకటేమిటి, ప్రపంచాన్నే చుట్టేస్తున్నాం. తప్పకుండా చదువుకున్నదే అయి ఉంటుంది. అడగకుండానే నా వివరాలందించా. అలాగైనా తన గురించి చెప్తుందని. అబ్బే లొంగేదే లేదన్నట్టు అర్థమైపోతోంది.

అమ్మయితే ‘ఎప్పుడు చూసినా ఆ ల్యాప్‌టాప్‌ ముందేసుకుని కూర్చుంటాడు. లేదంటే... ఆఫీస్‌. పెళ్ళి చేసుకోడో ఏమో’నంటూ సణుక్కుంటోంది. నాన్నగారు అంతగా పట్టించుకోవట్లేదు. నాకెందుకో, నచ్చిన అమ్మాయిని తెచ్చి వాళ్ళ ముందుంచుతానన్న నమ్మకం ఈమధ్యే కలుగుతోంది.

***

నా ఆలోచనలు శ్రావణి చుట్టూ తిరుగుతున్నాయే తప్ప వివరాలైతే వీసమెత్తు కూడా తెలీలేదు. రెండు మూడుసార్లు తన పిక్స్‌ పంపించమని అడిగి చూశా. ససేమిరా అంది. అయినా నేనేంటిలా? కంటిముందున్నవాళ్ళని వదిలేసి కనిపించనంటున్న అమ్మాయి కోసం పాకులాడుతున్నాను. వయసు తెలియదు. చదువు, తాహతుల మాట దేవుడెరుగు. అందం గురించి వూహించడానికైనా ఆస్కారం లేదు. ఏమిటిదంతా? ఒకవేళ నేను తనని ప్రేమిస్తున్నానా? అదెలా! ఎలా సాధ్యం? అలా కూడా జరుగుతుందా? రంగూ రూపూ ముక్కూ మొహం తెలియకుండా ప్రేమించడం సాధ్యమా? మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న. నిద్రపోనివ్వడం లేదు. ఒకోసారనిపిస్తుంది... ఒకవేళ శ్రావణి అమ్మాయే కాకుంటే... తన ఫ్రెండ్స్‌లోనే ఎవరో ఇలా చేసి ఏడిపించటం లేదు కదా! అన్నీ అనుమానాలే. తన భావాలు చదువుతుంటే, అందమైన అమ్మాయి రూపమే అస్పష్టంగా కనిపిస్తుంది. ఒదిలేద్దామన్నా అదేదో వ్యసనంలా మనసెపుడూ ఫేస్‌బుక్‌ కోసమే కొట్టుకుంటోంది.

శనివారం... త్వరగానే లేచా. గుడికెళ్ళాలనిపించింది. అమ్మ పొద్దుటే లేచిన నన్ను వింతగా చూస్తోంది. ఈమధ్యెందుకో అమ్మ మొహంలో దిగులు కనిపిస్తోంది. నా పెళ్ళి గురించి బెంగ కావచ్చు. ఏదైనా నావల్ల కాకపోతే దేవుణ్ణి నమ్ముకోవడం నా కలవాటు. అందుకే పరిష్కారం చూపమని ప్రత్యక్షంగా వేడుకునేందుకు వేంకటేశ్వరస్వామి గుడికెళ్ళాను. కాస్త ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నా కోరికల చిట్టా విప్పా. వాటినిండా శ్రావణే. రేపట్లోగా నాకు దారి చూపమని వెంకన్నపై భారమేసి ఇంటికెళ్ళాను.

స్నేహితులొస్తే తలనొప్పిగా ఉందని తప్పించుకున్నాను. ఆరోజు గట్టిగా నిర్ణయించుకున్నాను... శ్రావణి ఎలా ఉన్నా నాకభ్యంతరం లేదు. తన భావాలూ, ఆలోచనా విధానం నాకు నచ్చినప్పుడు అందం కొరుక్కుతింటానా! నాలో మార్పు నాకే స్పష్టంగా తోస్తోంది. పోనీ వయసులో పెద్దదా? రెండూ మూడేళ్ళు తేడాకేమీ కాదు. అమ్మానాన్నల్ని ఒప్పించగలననే నమ్మకం నాకుంది. నిర్ణయం నాదే.

ఒక్కసారి కలవాలి. లేదంటే వెంటనే వేరెవరినన్నా పెళ్ళి చేసేసుకోవాలి. లేకపోతే నేనేమైపోతానో... అర్థమే కావటం లేదు. పట్టుమని ఏడాది కాలేదు. పూర్తిగా నా పంథానే మార్చేసింది. అంటే, తప్పకుండా నా జీవితాన్ని అందంగా మలుస్తుంది. ఈరోజు ఎలాగైనా అడిగేయాలి.

సాయంత్రం తను వీలుగా ఉంటుందని ఫేస్‌బుక్‌ తెరిచాను. చాలాసేపు లైన్‌లోకి రాలేదు. ఓపిగ్గా ఎదురుచూస్తున్నా.

‘హాయ్‌’ అంటూ చాటింగ్‌లోకి వచ్చింది. నా వేళ్ళు చకచకా టైప్‌ చేస్తూ పోయాయి. ‘చూడండి శ్రావణిగారూ, మీ ఉద్దేశం ఏంటో

నాకు తెలియదు కానీ, నాది కేవలం ఫ్రెండ్‌షిప్‌ అని నేననుకోను. ఆఖరికి మీరెలా ఉంటారో కూడా తెలియదు. కేవలం మీ భావాలు నచ్చి ఇష్టపడుతున్నాను.

మీ శైలినిబట్టి నేనంటే మీకూ ఇష్టమనిపిస్తోంది. మీకభ్యంతరం లేకుంటే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ పిక్స్‌ పెట్టాల్సిన పనిలేదు. నన్నర్థం చేసుకుని ఒక్కసారి కనిపించండి. మీ అభిప్రాయాన్ని తెలపండి. నేనంటే మీకిష్టం లేకుంటే నేనింక మిమ్మల్ని ఇబ్బందిపెట్టను. ఒక్కసారంటే ఒక్కసారి కలవండి ప్లీజ్‌... మీరెలా ఉన్నా మనస్ఫూర్తిగా నాదాన్ని చేసుకుంటాను. ప్రామిస్‌’ అని మెసేజ్‌ పెట్టాను. చాలా కంగారుగా ఉంది- ఏమని సమాధానం వస్తుందోనని. ఒక అరగంట వరకూ తను చాటింగ్‌ చేయలేదు. కానీ, చదివినట్టు తెలుస్తోంది. నాలో అలజడి మొదలైంది... ఏమంటుందా అని. నిమిషాలు గంటల్లా గడుస్తున్నాయి.

ఎవరెవరో లైన్‌లోకి వస్తున్నారు. కట్‌ చేస్తున్నా.

‘రేపు సాయంత్రం ఆరుకల్లా కైలాసగిరికి రండి, నేనొస్తా’. అంతే, నా గుండె ఒక్కసారి ఆగి వేగంగా కొట్టుకుంది. కాసేపు వెయిట్‌ చేశాను. లాభంలేదని ‘ఎలా పోల్చుకోను మిమ్మల్ని’ అన్నా. ‘నేనే మీ దగ్గరికి వస్తాను’ లాగాఫ్‌ అయింది. ఇక రాత్రంతా శివరాత్రి జాగారమే.

***

రాత్రి చాలాసేపు నిద్రలేక బాగా పొద్దెక్కాక లేచాను. రోజంతా ఎన్నిసార్లు ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసినా తను చాటింగ్‌లోకి రాలేదు. నాలో ఉత్కంఠ క్షణక్షణానికీ పెరిగిపోతోంది. ఆకలేస్తోంది కానీ రుచించలేదు. గట్టిగా రూఢీ అయిపోయా ఇది ప్రేమేనని. క్లారిటీ వచ్చాక తేలిగ్గా అనిపించింది. ఐదుకల్లా తయారైపోయాను. బ్లూజీన్స్‌ మీద ఎల్లోబ్లూ చెక్‌ü్స షర్టు వేసుకున్నా. నాకు నేనే స్మార్ట్‌గా కనిపించాను. కాకుంటే నిద్రసరిపోక మొహం కాస్త పీక్కుపోయింది. అయినా సహజమైన అందం ఎక్కడికి పోతుందిలే! దాగున్న గర్వం తొంగిచూసింది నాలో.

ఐదు నలభైకల్లా కైలాసగిరి మీదకి చేరాను. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. వాచీ వంక చూసి ఇంకా టైమ్‌ ఉందని ఖాళీగా ఉన్న సిమెంట్‌ బెంచీ మీద కూర్చున్నాను. తను వచ్చాక రెస్టారెంట్‌కి నడవొచ్చని. ఆరుంపావు అవుతోంది. సింధూర వర్ణంలోకి మారిన సూరీడు సముద్రం వెనుక నుంచి కిందికి దిగిపోతున్నాడు. ఆ దృశ్యం మనసుకి మరింత హాయినిచ్చింది. చిరు చీకటికి సమయం ఆసన్నమవుతోంది.

అయ్యో, తనింకా రాలేదే. పదేపదే నా మనసు కొట్టుకుంటోంది. దూరంగా ఓ అమ్మాయి చెయ్యెత్తి వూపింది. నా గుండె రేసుగుర్రంలా పరిగెడుతోంది. లేచీకటిలో... తను తెల్లని చుడీదార్‌లో నడిచి వస్తుంటే దేవకన్యలా కనిపించింది. మొహం మాత్రం అంతే అస్పష్టంగా దగ్గరవుతోంది. ఇంకా దగ్గరకొచ్చింది. ఒక్కసారిగా నా కళ్ళను నేను నమ్మలేకపోయా. ఎందుకంటే... తను ‘సంధ్య’. నాకు నచ్చని సంధ్య ఇప్పుడు నేనెంతో కోరుకుంటున్న శ్రావణా..?

‘‘హాయ్‌ చందూ’’ అంది బాగా దగ్గరకొచ్చి.నాకర్థమయ్యేందుకు క్షణకాలం పట్టింది. బలవంతంగా నవ్వాను.

‘‘ఏంటి, షాక్‌ తిన్నారా? మరి నేనెలా ఉన్నా పెళ్ళాడతానన్నారుగా! ఇప్పుడేమంటారు?’’ అంది కవ్వింపుగా.

నేను కోలుకుని ‘‘సంధ్యా, మీ...రు’’ అతి కష్టంగా నా నోట్లోంచి మాటొచ్చింది.

తను పకపకా నవ్వుతూ ‘‘అవును చందూగారూ, నేను సంధ్యనే. శ్రావణసంధ్యని. కానీ అందరూ సంధ్య అనే పిలుస్తారు. అమ్మ సంధ్య అని పెడదాం అంటే... శ్రావణమాసంలో పుట్టానని అమ్మమ్మ శ్రావణి అందట. రెండూ కలిసి శ్రావణసంధ్యనయ్యా. ఇప్పుడు చెప్పండి నన్ను చేసుకుంటారా, లేదంటే నచ్చలేదంటారా’’ అంది చిలిపిగా.

తన మాటలు వింటున్నానన్నమాటేగానీ ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నాను. గొంతు సవరించుకుని ‘‘సంధ్యా, ఎందుకలా నాతో దోబూచులాడావు. నువ్వు నాకు నచ్చలేదని నేను చెప్పేసినా, నాతో స్నేహం చేయాలని నీకెలా అనిపించింది’’ అన్నాను.

‘‘మీరు నమ్ముతారో లేదో... మీ ఫొటో చూసే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. కానీ, మీకు నచ్చలేదని తెలిసి చాలా బాధనిపించింది. ఏం చేస్తాం? మగవాడిగా అది మీకు మామూలే. చాలారోజులు మరిచిపోలేకపోయాను. అనుకోకుండా ఓరోజు ఫేస్‌బుక్‌లో మీ ఫొటో కనిపించింది. అప్పుడే నా బుర్రలోకి ఈ ఆలోచన వచ్చింది. అంతే, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాను. ప్రొఫైల్‌లో నా ఫొటో తీసేశాను, మీరు చూస్తే ఒప్పుకోరని. నేననుకున్నట్టే మిమ్మల్ని ఇక్కడికి రప్పించగలిగాను’’ అంది నా ఫీలింగ్స్‌ ఎలా ఉన్నాయోనని చూస్తూ.నేను వెంటనే సంధ్య చేతులు పట్టుకున్నాను. ‘‘క్షమించు సంధ్యా, నేనసలు వూహించలేదు, నువ్వే శ్రావణివని. నా భ్రమలు పూర్తిగా తొలిగాయి. అందం తెలుపు రంగులోనో, పెద్ద కళ్ళలోనో ఉండదు. అసలు అందమనేది పైకి కనిపించేది కాదు. నీ మనసు తెలుసుకున్నాను కనుక చెప్తున్నా... ఇప్పుడు నువ్వు నా కళ్ళకి ఎంతో అందంగా కనిపిస్తున్నావు. నేనే నిన్నడుగుతున్నా... నన్ను పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా?’’ అన్నాను ప్రేమగా ఆమెవంక చూస్తూ. ఆ సందె వెలుగులో ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపునీ, శ్రావణసంధ్యనీ జీవితాంతం నా గుండెల్లో దాచుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.