close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కళ్ళు

కళ్ళు
- ఓల్గా

ఆడపిల్ల కళ్లంటే సమాజానికి భయం. ఎత్తిచూస్తే చాలు ఎగిరెగిరిపడుతుంది. నల్లకాటుకతో గంతలు కట్టాలనుకుంటుంది. కన్నీళ్లలో మునకలేయించాలని ప్రయత్నిస్తుంది. ఓల్గా ‘కళ్లు’...పాతికేళ్ల పాత కథే అయినా, కంట్లో నలుసై వేధిస్తున్న తీవ్ర వివక్షను ప్రశ్నించే కథ.

నా కళ్ళు అందమైనవి అంటుంది అమ్మ. కళ్ళు నిండుగా కాటుక పెడుతుంది. ‘పచ్చటి చెంపల మీదుగా నల్లటి కాటుకా, తెల్లని కళ్ళలో నల్లని కాటుకా ఎంత కళ వుందే నీ కళ్ళలో’ అంటుంది వదిన కూడా.

నిజమే నా కళ్ళు పెద్దవే - కానీ ఏం లాభం, వాళ్ల రాముడివి చింతాకంతకళ్ళు. చీకిరి కళ్ళు, నాకూ పదేళ్లే. వాడికీ పదేళ్లే. ఇంకా పదిరోజులు వాడికంటే నేనే పెద్దదాన్ని. కానీ, మా వూళ్లొ వాడు చూసిన వింతల్లో వందోవంతు కూడా నేను చూడలేదు. మొన్నొకరోజు మా వాకిట్లో పెద్ద గొడవ అయింది. నేను బయటకు పరుగెత్తి గుంపులో నుంచున్నా, ఎక్కడ్నించి వచ్చాడో ఏమో మా అన్నయ్య బరబరా లాక్చొచ్చి ఇంట్లో పడేశాడు.

‘ఆడపిల్లవు భయం లేకుండా ఎట్లా నుంచున్నావే - ఆ అరుపులు ఇంట్లో వుండి వింటుంటేనే గుండె దడదడ లాడుతుంటేనూ’ అంది అమ్మ. ‘నాకు భయంవెయ్యలేదు’ అని చెబితే అందరూ తిట్టిపోశారు. మా వదిన పిరికితనం చూస్తే మా అన్నయ్యకి ఎంత సంతోషమో. వదిన్ని భయపెట్టి ఆమె దడుచుకుంటే కిలకిలా నవ్వుతాడు. వదిన కూడా అంతే - మాట్లాడితే ‘అమ్మో భయం’ అని కళ్ళు మూసుకుంటుంది. ‘కళ్ళు తెరిచి చూడు వదినా ఏం లేదంటే’ తెరవదే, వదిన కళ్ళు కూడా పెద్దవేకానీ ఏం లాభం, వదినకు ఆ కళ్ళు మూసుకుని ఉండటమే బాగుంటుంది. వీధిలోకి వస్తారా- అమ్మా, వదినా ఇక తలెత్తరు. వాళ్ల కళ్ళన్నీ నేలమీదనే, నేల మీద ఏముంటాయి, ఒకవేళ ఏమన్నా ఉన్నా ఎన్ని రోజులు అవే చూస్తాం? వీధిలో ఏమున్నాయో సరిగ్గా చూడనే చూడరు. పైగా అమ్మ నన్ను తిడుతుంది.

‘అలా దిక్కులు చూస్తావేం’ అని, ‘తలొంచుకు నడువు. నేల మీద చూడు’ అంటూ మొట్టికాయలు వేస్తుంది.

అమ్మో- నేనసలు అట్లా నడవను. వీధిలోకి వచ్చినపుడు అటూఇటూ చూడకపోతే అన్నీ నాకెట్లా తెలుస్తాయి. ఇరవై నాలుగ్గంటలూ వీధిలో తిరిగే రాముడు నన్నసలు లెక్క చేస్తాడా. కానీ వాడికి కూడా చాలా తెలియవు. ఆడవాళ్లు కొన్నిటిని మాత్రమే చూస్తేచాలని వాడికి తెలియదు. అమ్మకు అవన్నీ బాగా తెలుసు. మన ఒంటిని కూడా మనం సరిగా చూసుకోగూడదు. అమ్మకేకలేస్తుంది ఏంటా చూడటం అని. పెద్దవుతున్న కొద్దీ మగవాళ్లని అసలు సరిగ్గా చూడకూడదు. ఇప్పుడు నేను రాముగాడితో ఆడుకుంటున్నానా, ఇంకో రెండేళ్లుపోతే రాముడితో ఆడుకోగూడదు. రాముడు కనపడగానే ఇంట్లోకి వెళ్లాలి. బజార్లో కనపడితే తల పైకెత్తకుండా కళ్ళు మాత్రం పైకెత్తి చూడాలి. మా పక్కింట్లో ఉండే పద్మక్క అట్లాగే చూస్తుంది. ఎందుకక్కా అట్లా చూస్తావూ అంటే అలా చూస్తేనే భలే అందంగా ఉంటుందట. నాకింకా చేతకావటంలా అట్లా చూడటం. ఎప్పటికొస్తుందో ఏమో- రాముడికైతే చచ్చినారాదు.

ఆడవాళ్ల కళ్ళ వెంట నీళ్లు తొందరగా రావాలిట. మొన్న అమ్మ పక్కింటామెను తిడుతోంది. ‘రాతిగుండె, కంటెమ్మట చుక్క నీళ్లు రాలేదు’ అని. ఆడవాళ్లకి వూరికూరికినే ఏడుపు రావాలిట. నాకెందుకో కోపం వస్తుంది గానీ ఏడుపురాదు. నన్ను వూరికే తిడితే నాకు కోపం వస్తుంది. వదినకైతే ఏడుపొస్తుంది. అప్పుడన్నయ్య కోపం తగ్గుతుంది.

‘చాల్లే ఇక ఆ ఏడుపు ఆపు’ అంటాడు. ఐనా సరే వదిన కుమిలి కుమిలి ఏడుస్తుంది. అన్నయ్యా వదినా పోట్లాడుకుంటే ఎప్పుడూ వదినే ఏడుస్తుంది. అన్నయ్య ఒక్కసారీ ఏడవడే. అమ్మా నాన్నా అయినా అంతే - ఎప్పుడూ అమ్మే ఏడవాలి. నాకు ఏడుపంటే ఇష్టంలేదు. ఏడిస్తే నా కళ్ళు ఏమీ బాగుండవు. మొహమంతా నల్లగా కాటుకవుతుంది. నేనెప్పుడూ ఏడవను బాబూ.

మన కళ్ళకి ఏం కనపడ్డా సరే మనం ఏం అనకూడదంట - ఏం చెయ్యకూడదంట. నాకు నాన్న చేతిలో మామిడిపళ్ల బుట్ట కనపడిందనుకో - ‘ఓ మామిడిపళ్లొ’ అని ఎగరబుద్ధేస్తుంది. ఎగరకూడదంట. ఆ మామిడిపండు మన కంచంలోకి వచ్చేవరకూ అరవకూడదంట. మన కంచంలోకి వచ్చాక బుద్ధిగా తినాలంట. మామిడిపళ్లు చూడగానే ఎగరకపోతే చూసిన ఫలితం ఏముంది?

అలాగే కోపం వచ్చేవి చూసినా అరవకూడదంట. అప్పుడొక రోజు ఏమయిందీ, కల్యాణి అక్క కాలేజీ నుంచి వస్తుంటే ఒకబ్బాయి సైకిల్‌ మీద నుంచి పడిపోయాడు గదా - కాలు బెణికి లేవలేకపోయాడు. రోడ్డు మీదేమో ఎవరూ లేరు. కల్యాణి అక్క అతన్ని లేపి, సైకిల్‌ లేపి స్తంభానికి ఆనించి పెట్టింది. ఆ అబ్బాయి కాలు విదిలించుకుంటుంటే అతను పడకుండా పట్టుకుందట. ఇదంతా మా ఎదురింటి మామయ్య చూసి కల్యాణి వాళ్ల నాన్నతో చెప్పాడట. కల్యాణి అక్కని బాగా కొట్టాడు. పరాయి మగాడిని రోడ్డు మీద కావలించుకుంటావా - అని తిడుతూ కొట్టాడు. పడిపోతే చూసి లేవదీశానంటే - చూస్తే చూశావు నీ దారిన నువ్వు రావాలి గానీ దేశసేవ చేస్తావా అంటూ తిట్టాడు. కల్యాణి వాళ్ల నాన్న కూడా మామయ్యే కానీ అక్కను అట్లా కొట్టాక నాకు కోపం వచ్చి మామయ్యతో పలకడం మానేశా. చూసిన తర్వాత ఏదన్నా చెయ్యాలి గదా - లేకపోతే చూడటం ఎందుకు? చూడక ముందూ చూసిన తర్వాతా ఒకరకంగా ఉంటే చూడటం ఎందుకు? అంటే అమ్మకు అర్థం కాదు. నోర్మూసుకో అంటుంది.

కళ్ళు మూసుకోవాలి. నోరు మూసుకోవాలి. మా అన్నయ్య ఆఫీసులో పనిచేసే ఆవిడొచ్చిందా- ఆవిడెంత బాగా నవ్వుతుందో. కానీ చిత్రం ఆవిడ బొట్టు పెట్టుకోలేదు. కాటుక పెట్టుకోలేదు. ఐనా సరే ఎంత బాగుందో. ఉన్నంత సేపు చక్కగా నవ్వుతూ ఉంది. ఆవిడ అమ్మకీ వదినకూ నచ్చలేదుట. ముఖాన బొట్టు లేకపోతే మెళ్ళొ గొలుసు లేకపోతే ఆ ముఖమే రోతగా ఉంటుందట. ‘నిజంగా బాగోలేదామ్మా, నిజంగా బాగోలేదామ్మా’ అని ఎన్నిసార్లో అడిగాను. ‘నా కళ్ళకు పరమరోతగా కన్పించిందే- బొట్టులేని ముఖం చూడబుద్ధవదు నాకు’ అంది అమ్మ. అమ్మంత అయితే నా కళ్లు కూడా అమ్మ కళ్లలాగే మారిపోతాయా. అమ్మో - అలా మారిపోతే నా కళ్ళకు ఏమీ కనపడవు.

‘ఎక్కడెక్కడివన్నీ నీ కళ్ళకు కనిపిస్తాయేమిటే’ అంటుంది అమ్మ. అమ్మ కళ్ళకు ఏమీ కనిపించవు. కనిపించిన వాటి గురించి అమ్మ పట్టించుకోదు. ఆడవాళ్ల కళ్ళు ఇట్లా ఎందుకుంటాయో..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.