close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరుడు కావాలి!

వరుడు కావాలి!
- జీడిగుంట రాజ్యలక్ష్మి


ఏమండీ, ఒక్కమాట!’’ ఆఫీసు పని అయిపోగానే బయటకొచ్చి ఇంటికి బయల్దేరబోతున్న శశికళ ఆ పిలుపు విని వెనక్కితిరిగి చూసింది.

తన కంపెనీలోనే అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ పిలిచాడు. తనను, అతను ఎందుకలా పిలిచాడో అర్థంకాని శశికళ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది.

శశికళ ఆ కంపెనీలో చేరి ఇంకా నెలరోజులు కూడా కాలేదు. పొద్దున్న తొమ్మిది అయ్యేసరికి ఆఫీసుకి వస్తుంది. కంప్యూటరు ఆన్‌ చేసుకుని తన పని ఏదో అది చూసుకుంటుంది. తిరిగి ఆరయ్యేసరికి ఇంటికి బయల్దేరుతుంది. మధ్యలో ఓ గంటసేపు ‘లంచ్‌టైమ్‌’లో వెయిటింగ్‌ రూమ్‌కి వెళ్ళి, తను ఇంటి దగ్గర్నుంచి తెచ్చుకున్న భోజనం ముగించి మంచినీళ్ళు తాగి, మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతుంది. ఆఫీసులో కొత్తగా చేరటం వల్ల ఇంకా ఎవరూ స్నేహితులు దొరకలేదు. ఎవరితోనూ తనంతట తానుగా కల్పించుకుని మాట్లాడటం కానీ, అవసరంలేని కబుర్లు చెప్పటం కానీ ఆమెకు ఇష్టం ఉండదు.

అలాంటి శశికళ- వెంకటరమణ పిలుపు విని, ముందు కొంచెం భయపడింది. ఆ మాటకొస్తే- ఎందుకో ఒకందుకు చిన్నప్పట్నుంచీ భయపడటం ఆమెకు అలవాటే! ఏడెనిమిదేళ్ళు వచ్చేదాకా ఎలుకంటే భయపడేది. ఆ తర్వాత, పక్కింట్లో కాపురం ఉండే సుజాత మొగుడు రాత్రివేళల్లో బాగా తాగొచ్చి, సుజాతను కొడితే భయపడేది. కాలేజీలో చదువుకునే రోజుల్లో అల్లరి చేసే అబ్బాయిల్ని చూసి భయపడేది. ఆమధ్య తనను చూసుకునేందుకు పెళ్ళివారు వచ్చినప్పుడు కూడా భయపడింది. ఇప్పుడు ఉద్యోగంలో చేరాక సిటీబస్‌లో ‘కంపెనీ’కి వచ్చి వెళ్ళాలన్నా భయపడుతూనే ఉంది.

‘‘ఉద్యోగం చేసుకుంటున్న ఆడపిల్లవి, ప్రతి చిన్న విషయానికీ భయపడితే ఎలా అమ్మా? ధైర్యంగా ముందుకు సాగిపోవటం నేర్చుకోవాలి’’ అని ఆమె తండ్రి ఈమధ్య తరచుగా ఆమెకు హితవు చెప్తూనే ఉన్నాడు.

అందుకే తనలోని భయాన్ని పైకి కన్పించనీయ కుండా అలాగే నిలబడి వెంకటరమణ వైపు ‘ఏమి’టన్నట్టు చూసింది. అతను రెండడుగులు ఆమెవైపు వచ్చి ‘‘మరేంలేదు శశికళ గారూ, రేపు ఆదివారం కదా, మీ ప్రోగ్రామ్‌ ఏమిటో తెలుసుకుందామనీ?’’ అన్నాడు.

ఆ మాట విన్న శశికళకు మళ్ళీ భయం వేసింది. తన ప్రోగ్రామ్‌ ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం అతనికెందుకో అర్థంకాలేదు. కొంపదీసి ఏ సినిమాకైనా రమ్మనడు కదా..? అయినా పెళ్ళికాని ఆడపిల్ల కనిపించిందంటే చాలామంది మగవాళ్ళు అలాగే ప్రవర్తిస్తూంటారని తను కథల్లో చదివింది.

ఆలోచిస్తూనే నిలబడిపోయిన శశికళ పరధ్యానాన్ని గమనించి మళ్ళీ వెంకటరమణ అడిగాడు ‘‘రేపు సాయంత్రం ఏదైనా సినిమా ప్రోగ్రామ్‌ ఉందా మీకు?’’

అర్థంలేని ప్రశ్న... అయినా

‘‘ఏం లేదు’’ అని జవాబు చెప్పింది శశికళ.

‘‘అయితే, రేపు సాయంత్రం అయిదు గంటలకు ‘ఎన్టీఆర్‌ గార్డెన్స్‌’కి ఓసారి రావాలి... మీతో మాట్లాడాలి’’ గబగబా ఏదో పాఠం ఒప్పచెప్పినట్టు చెప్పేశాడు.

ఆ క్షణంలో శశికళ వెన్నులో సన్నటి వణుకు ప్రారంభమైంది. అసలు మగవాళ్ళతో మాట్లాడాలంటేనే తనకు ఎంతో భయం. అలాంటిది, ప్రత్యేకంగా ఓ గార్డెన్‌కి వెళ్ళి అతనితో మాట్లాడటాన్ని తల్చుకుంటేనే గుండెలు ఝల్లుమన్నాయి.

‘‘రేపు నాలుగున్నరకే నేను గార్డెన్స్‌కి వచ్చి మెయిన్‌గేటు దగ్గర మీకోసం వెయిట్‌ చేస్తూంటాను... వస్తారుగా’’ శశికళ సమాధానం కోసం ఎదురుచూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు వెంకటరమణ.

ఆ మర్నాడు తనతో ఆ వెంకటరమణ ఏం మాట్లాడతాడో వూహించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఇంటికి చేరుకుంది శశికళ. హాల్లోకి అడుగుపెట్టేసరికి లోపలనుంచి అమ్మ మాటలు వినిపిస్తున్నాయి.

‘‘పోనీ, ఆ వరంగల్లు వాళ్ళ సంబంధం ఏమిటో చూసి రాకూడదూ?’’ అమ్మ అడుగుతోంది.

‘‘అలాగే! ఓ పదిరోజులాగి వీలు చేసుకుని వెళ్ళొస్తాలే’’ అని నాన్నగారి మాటలు.

అంటే? ...బెజవాడ నుంచి వచ్చి ఆమధ్య తనను చూసుకుని వెళ్ళిన పెళ్ళివారు - తనను చేసుకోవటంలేదని ఫోన్‌ చేసేశారన్నమాట!

ఆ రాత్రి శశికళకు నిద్రపట్టలేదు. తన పెళ్ళి తనకూ, తనను కన్నవాళ్ళకూ ఓ సమస్యగా పరిణమించింది. సుమారు ఏడాదిగా తన పెళ్ళి కోసం నాన్న ప్రయత్నిస్తూనే ఉన్నారు. తను ఇంజినీరింగ్‌ పాసై నెలరోజుల క్రితమే ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగానికి చేరింది. తన తర్వాత, చెల్లెలు హైమ కూడా బిఎస్సీ పాసై పెళ్ళికి తయారుగా ఎదిగి కూర్చుంది. హైమ తర్వాత ఓ తమ్ముడున్నాడు. వాడు ఎప్పటికి పెద్దవుతాడు? నాన్న చేతికి ఎప్పుడు అందివస్తాడు..? ప్రస్తుతం నలభైవేలు జీతం తెచ్చుకుంటూ అద్దె ఇంట్లో జీవితాన్ని వెళ్ళదీస్తున్న నాన్న... మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేస్తాడు. ఆడపిల్లలు పెద్దవాళ్ళు కనుక చదువులు పూర్తయ్యాయి. ఇంకా తమ్ముడు చదువుకుంటూనే ఉన్నాడు.

అందుకే తను వెంటనే ఉద్యోగంలో చేరి, తనకు వచ్చే జీతంతో నాన్నకి ఎంతోకొంత అండగా ఉండి, ఎవరో ఒకర్ని తొందరగా పెళ్ళి చేసుకుని, తమ్ముణ్ణి తన దగ్గరే పెట్టుకుని బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఉద్యోగంలో చేరిన మర్నాడే తనకు ‘వరుడు కావాలి’ అని పేపర్లో ప్రకటన ఇచ్చింది.

ఆ ప్రకటన చూసి బెజవాడ నుంచి ఓ పెద్దమనిషెవరో ఫోన్‌ చేశారు. ఫోన్లో మాటలు పూర్తయ్యాక ఆయన తన కొడుకునీ భార్యనీ వెంటబెట్టుకుని శశికళను చూసుకునేందుకు వచ్చారు. అబ్బాయి తనను ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు అడిగాడు.

‘‘ఉద్యోగం ఎంత కాలం నుంచీ చేస్తున్నారూ?’’ - అది మొదటి ప్రశ్న.

సమాధానం చెప్పింది శశికళ.

‘‘సంగీతం వచ్చునా? ...ఐ మీన్‌ పాటలు పాడగలరా?’’ - రెండవ ప్రశ్న.

‘‘ఇంట్లో కూర్చుని పాటలు వినే తీరుబడే దొరకదు నాకు’’ జవాబిచ్చింది.

‘‘వంట బాగా చేయగలవా?’’ - మూడవ ప్రశ్న అడిగాడు.

‘‘చేయగలననే అనుకుంటున్నాను.’’

‘‘నెలకు మీకు జీతం ఎంత వస్తుంది?’’

ఆ ప్రశ్నకూ జవాబు చెప్పింది.

ఆ యక్ష ప్రశ్నలన్నీ అయ్యాక ‘‘ఇంటికెళ్ళాక మా నాన్నగారితో ఫోన్‌ చేయిస్తాను’’ అన్నాడు అబ్బాయి. మూడోరోజున శశికళ తండ్రికి వాళ్ళు ఫోన్‌ చేశారు. ఆ రాత్రి భోజనం చేస్తూంటే ఆమె తండ్రి ఆ విషయం చెప్పి- ‘‘కనీసం మూడు లక్షలైనా కట్నంలేందే లాభంలేదని వాళ్ళు పరోక్షంగా అన్నారు’’ అన్నాడు.

ఈమాత్రం దానికి ఆ రోజున అక్కర్లేని ప్రశ్నలన్నీ ఎందుకు అడిగాడు. ‘ఇంత కట్నం ఇవ్వగలరా?’ అని ఒక్క ప్రశ్న అడిగుంటే సరిపోయేదిగా. అయినా, లాభనష్టాలు బేరీజు వేసుకునేందుకు పెళ్ళి ఏమైనా వ్యాపారమా? అనుకుంది శశికళ.

ఇప్పుడు తన తండ్రి వరంగల్లు సంబంధం ఏదో తీసుకొస్తాడన్నమాట! వాళ్ళేం కోరతారో... పిల్ల నచ్చటం ఒక ఎత్తయితే, కట్నం కానుకలు నచ్చటం మరో ఎత్తయిపోతోంది ఈ రోజుల్లో!

ఇంతకీ వెంకటరమణ ఎన్టీఆర్‌ గార్డెన్స్‌కి రమ్మని తనను ఎందుకు పిలిచాడో!? ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌... నిన్ను దైవసాక్షిగా ప్రేమిస్తున్నాను... నువ్వు ‘వూ’ అన్నావంటే పెళ్ళి చేసుకుంటాను’ అని సినిమా హీరోలా డైలాగులు చెప్తాడేమో..! లేకపోతే తనతో ప్రత్యేకంగా మాట్లాడే విషయాలు అతనికేం ఉంటాయి..!

అయినా తనకేం తక్కువని? అనేకసార్లు అద్దంలో చూసుకున్నప్పుడు, తానెంతో అందంగా ఉన్నట్టు తనకే అనిపించింది. ఇంజినీరింగ్‌ పాసయింది. ఉద్యోగం చేసుకుంటోంది. ఒకవేళ అతను తనను పెళ్ళి చేసుకుంటానంటే తానేం చెప్పాలి? అతనూ అందంగానే కన్పించాడు... ఆ బెజవాడ కుర్రాడిలా నంగనాచి ముఖం కాదు. మరి కులం ఏమిటో... మతం ఏమిటో..? ఏమైతేనేం మనసులు కలవటం ముఖ్యం. తన తండ్రిని ఒప్పించగలిగే ధైర్యం తనకుంది.

ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది శశికళ. తెల్లవారిన తర్వాత ‘సాయంత్రం ఎప్పుడవుతుందా?’ అని ఎదురుచూస్తూనే గడిపేసింది. గడియారంలో ముళ్ళు ముందుకు తిరుగుతున్నకొద్దీ మనసులో ఆందోళన పెరుగుతూనే ఉంది.

సాయంత్రం నాలుగు గంటలు కాగానే ‘గార్డెన్స్‌’కి వెళ్ళే ప్రయత్నంలో పడింది శశికళ.

అంతకుముందు తన పుట్టినరోజు కోసం కొనుక్కున్న ఆకాశంరంగు చీర కట్టుకుంది. తలనిండా సన్నజాజి పూలు పెట్టుకుంది. స్నేహితురాలింటికి వెడుతున్నట్టు ఇంట్లో చెప్పి- అయిదయ్యేసరికి ‘గార్డెన్స్‌’కి చేరుకుంది. గేటు దగ్గరే నిలబడి ఆమె కోసమే ఎదురుచూస్తున్న వెంకటరమణ, చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించి పలకరించాడు. బదులు చెప్పకుండా మౌనంగానే అతన్ని అనుసరించింది. ఇద్దరూ దూరంగా, ఎవరూలేని ప్రదేశంలోకి నడుచుకుంటూ వెళ్ళి, ఎత్తయిన దిబ్బమీద కూర్చున్నారు.

‘‘మీరు వస్తారో రారో అని భయపడ్డాను’’ అన్నాడు వెంకటరమణ.

‘‘భయం ఎందుకూ?’’ అడిగింది శశికళ.

‘‘అదే... నా మనసులోని మాట చెప్పలేకపోతానేమోనని!’’

అతని మనసులోని మాట ఏమిటో పసిగట్టింది శశికళ. అయినా ఏమీ తెలియనిదానిలాగే అడిగింది ‘‘మీ మనసులోని మాటా... ఏమిటది?’’

‘‘అదే...’’ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కొంచెం తికమకపడటాన్ని గమనించిన శశికళ మళ్ళీ అంది ‘‘ఫర్వాలేదు, చెప్పండి.’’

‘‘నేను... నెలరోజుల క్రితం మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నా మతి పోగొట్టుకున్నాను. అంటే, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను... మీకు అభ్యంతరం లేకపోతేనే! ఇంతకుముందే మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే - నేను ఈ క్షణంలోనే - ఇక్కణ్ణుంచి వెళ్ళిపోతాను...’’ అంటూ లేవబోయాడు వెంకటరమణ.

‘‘అయ్యో, కూర్చోండి’’ సిగ్గుపడుతూనే చెప్పిందామె.

‘‘థాంక్స్‌. అంటే... మీరు ఎవర్నీ ప్రేమించలేదన్నమాటేగా! అసలు మొన్ననే మావాళ్ళను, మన పెళ్ళి గురించి మాట్లాడటానికి మీ ఇంటికి పంపించాలని అనుకున్నాను. కానీ ముందుగా మీ అభిప్రాయం తెలుసుకోవాలని అన్పించింది.’’

శశికళ తల వంచుకుని కూర్చుంది. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న వెంకటరమణ, వాళ్ళ ఇంటి సంగతులన్నీ చెప్పాడు. అతని తల్లిదండ్రులకు తానొక్కడే సంతానమనీ, కొద్దోగొప్పో ఆస్తి ఉందనీ, కావాలనుకుంటే పెళ్ళి తర్వాత కూడా ఆమె ఉద్యోగంలో కొనసాగవచ్చుననీ వివరించాడు.

వెంకటరమణ చెప్పిన విషయాలన్నీ శశికళకు నచ్చాయి. అతన్ని పెళ్ళి చేసుకుంటే తాను సుఖపడగలననే నమ్మకం ఆమెలో ఏర్పడింది.

‘‘మిమ్మల్ని చేసుకునేందుకు నాకు అభ్యంతరం లేదు’’ అంది ముక్తసరిగా.

‘‘థాంక్స్‌, నా జన్మ ధన్యమైందనుకుంటాను’’ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు వెంకటరమణ.

ఆ రాత్రి నిద్రలో- తన భావిజీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నది శశికళ... ఆ కలలో తనూ, వెంకటరమణా... అందమైన ఇల్లూ... ముచ్చటగొలిపే బిడ్డలూ... మసకమసకగా కనిపించారు.

ఆ తర్వాత రెండు రోజులకే వెంకటరమణ తల్లిదండ్రులు, శశికళను చూసుకునేందుకు వచ్చారు.

‘‘మా అబ్బాయి- తనకు మీ అమ్మాయి ఎంతో నచ్చిందని చెప్పాడు. కానీ, మేము కూడా చూసి ‘ఓకే’ చేయాలని బలవంతం చేశాడు. అందుకే వచ్చాం!’’ అన్నాడు అతని తండ్రి.

అతని తల్లి ఆమెను రెండుమూడు ప్రశ్నలడిగింది. వాటికి ఏమాత్రం భయపడకుండానే సమాధానం చెప్పింది శశికళ. ‘‘వారం పదిరోజుల్లో ముహూర్తం పెట్టించి ఫోన్‌ చేస్తాను’’ అని చెప్పి వెళ్ళిపోయాడు వెంకటరమణ తండ్రి. శశికళ తల్లిదండ్రులు హాయిగా వూపిరి పీల్చుకున్నారు.

ఆ తర్వాత ఒకటి రెండుసార్లు వెంకటరమణ రమ్మంటే అతనితో సినిమాలకూ షికార్లకూ వెళ్ళింది శశికళ. బాగా పొద్దుపోయాక అతనే ఇంటివరకూ సాయం వచ్చి ఆమెను దిగబెట్టి వెళ్ళేవాడు. ఆఫీసులో కూడా ‘లంచ్‌ టైమ్‌’లో ఇద్దరూ కలిసే భోజనం చేసేవారు.

అనుకున్నట్టుగానే వెంకటరమణ తండ్రి పదిరోజుల తర్వాత ఫోన్‌ చేశాడు. ఆ మాటల్లో ముహూర్తం ఎప్పుడు ఉన్నదీ తెలియచేశాడు. కట్నం మీద తమకు అంతగా ఆశ లేకపోయినా, తన కొడుకు అమ్మాయిని ప్రేమించాడు కనుక- పెళ్ళి ఖర్చుల కోసం ఓ రెండు లక్షలు ఇవ్వమని అడిగాడు- ‘‘రెండు లక్షలే కదా, ఎలాగోలా ఇచ్చి అమ్మాయి పెళ్ళి చేసేద్దాం’’ అన్నాడు శశికళ తండ్రి.

కానీ, శశికళకు మాత్రం ఆ రాత్రి నిద్రపట్టలేదు. తనను ఎంతగానో ప్రేమించానని చెప్పాడు వెంకటరమణ. ఈ పదిరోజుల్లోనూ తనకు ఎంతో దగ్గరయ్యాడు. ‘నువ్వు లేనిదే నేను బతకలేను శశీ’ అని కూడా అన్నాడు. కలిసి షికార్లు తిరిగారు. కలిసి భోజనాలు చేశారు. మరి మధ్యలో ఈ కట్నం ఎందుకూ..? ఆడపిల్లగా పుట్టినందుకు ఈ కట్నాల ఉచ్చులో తాను చిక్కుకోక తప్పదా..?

మర్నాడు కంపెనీకి వెళ్ళగానే ముందుగా వెంకటరమణను కలుసుకుంది శశికళ. అంతకుముందు రోజు అతని తండ్రి ఫోన్‌ చేసి కట్నం అడిగిన సంగతి చెప్పింది.

‘‘పెద్దవాళ్ళ ముచ్చట కూడా తీరాలి కదా శశీ! అయినా రెండు లక్షలంటే ఏమంత ఎక్కువనీ? నాకు అయిదు లక్షలు కట్నం ఇస్తామంటూ పదిరోజుల క్రితం అమీర్‌పేట నుంచి ఓ సంబంధం వచ్చింది. కానీ, నాకు పెళ్ళి కుదిరిపోయిందని చెప్పి పంపించేశారు మా నాన్న. నిన్ను ప్రేమించాను కనుకనే రెండు లక్షలతో సరిపెట్టేశారు మావాళ్ళు’’ అన్నాడు వెంకటరమణ గొప్పగా పోజుపెట్టి.

ప్రేమించాడు కనుక రెండు లక్షలు చాలట! అదీ పెద్దవాళ్ళ ముచ్చట తీర్చటానికట... ఎంతటి ఆత్మవంచన? తనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని ఎందుకు సంపాదించుకోకూడదూ? తాను ప్రేమించిన యువతిని నిర్భయంగా ఎందుకు పెళ్ళి చేసుకోకూడదూ? మధ్యలో ఈ పెద్దవాళ్ళ ముచ్చట్లూ అభిప్రాయాలూ అవసరమా..?

ఆ రోజంతా ఆఫీసులో మౌనంగానే గడిపేసింది శశికళ. మధ్యాహ్నం ‘లంచ్‌టైమ్‌’లో కూడా వెంకటరమణను కలవలేదు. చిన్నప్పుడు ఎలుకలంటే భయపడిన ఆమె, ఈరోజు జీవితం పట్ల ధైర్యాన్ని పెంచుకుంది.

సాయంత్రం ఆఫీసులో పని అయిపోయిన తర్వాత వెంకటరమణ ఆమె దగ్గరకు వచ్చాడు.

‘‘ఇక బయల్దేరదామా?’’ అడిగాడు.

‘‘నేను రావటం లేదు... మీరు వెళ్ళొచ్చు’’ అంది ముక్తసరిగా.

వెంకటరమణ కొంచెం కంగుతిన్నాడు.

‘‘అదేమిటీ..? మన పెళ్ళి ఏర్పాట్ల గురించి, ఇవాళ ‘గార్డెన్స్‌’లో కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నాం కదా?’’ అన్నాడు వెంటనే.

‘‘నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని అనుకోవటం లేదు’’ నిశ్చయ స్వరంతో చెప్పింది శశికళ.

‘‘అంటే?’’ వెంకటరమణలో ఏదో ఆందోళన.

‘‘మన పెళ్ళి జరగదంటున్నాను.’’

‘‘ఏం... ఎందుకనీ?’’ అర్థంకాక అడిగాడు.

‘‘ఎందుకనో ఎల్లుండి ‘ఈనాడు పెళ్లిపందిరి’ కాలమ్‌లో నేను ప్రకటన ఇస్తున్నాను చూసుకోండి’’ అని చెప్పి, తన హ్యాండ్‌బ్యాగు భుజాన తగిలించుకుని వెంకటరమణ పిలుస్తున్నా వినిపించుకోకుండా విసురుగా బయటకు నడిచింది శశికళ.

ఆమె ఇంటికి చేరుకునేసరికి ‘పెళ్లి శుభలేఖ’ను ఎలా ప్రింటు చేయించాలో ‘మోడల్‌’ రాసి ఉంచాడు తండ్రి.

‘‘ఈ శుభలేఖ చూడమ్మా! నువ్వు ‘ఓకే’ చేస్తే రేపు ఉదయాన్నే వెళ్ళి ప్రెస్‌లో ఇచ్చేస్తాను’’ దాన్ని ఆమె చేతికి అందిస్తూ చెప్పాడు.

‘‘అవసరం లేదు నాన్నా! నేను ఈ పెళ్ళి చేసుకోవటం లేదు’’ అంటూ ఆ కాగితాన్ని నలిపి పక్కనున్న చెత్తబుట్టలో వేసింది.

ఆమె తండ్రితోపాటు తల్లి కూడా ఆశ్చర్యపోయింది.

‘‘అదేమిటే... కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాన్ని కాలితో తన్నుకుంటావా... ఏమైందసలు?’’ అడిగింది తల్లి.

‘‘నన్ను విసిగించకండి. ఎల్లుండి పేపర్లో ‘వరుడు కావాలి’ అని మళ్ళీ ప్రకటన ఇస్తున్నాను. అది చూసుకోండి... మీకే అర్థం అవుతుంది’’ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు మూసుకుంది శశికళ.

మూడోరోజు ఉదయం పేపర్లో ఆ ప్రకటన అచ్చయింది.

‘‘వరుడు కావాలి - ఇంజినీరింగ్‌ పాసై, హైదరాబాదులోని ఓ ప్రయివేటు కంపెనీలో నెలకు ముప్ఫైవేలు జీతం తెచ్చుకుంటూ... అందమూ ఆకర్షణా కలిగిన పాతికేళ్ళ యువతికి ‘కన్యాశుల్కం’ ఇచ్చి పెళ్ళి చేసుకోగలిగిన ముప్ఫై సంవత్సరాలలోపు యువకుడు వరుడుగా కావాలి. ఆసక్తిగలవారు ఈ కింది నంబరుకు ఫోన్‌ చేయవచ్చు’’ అదీ ప్రకటన. దానికింద శశికళ సెల్‌ నంబర్‌ ఇవ్వబడింది.

‘‘ఇదేం చోద్యమే తల్లీ... కట్నం తీసుకుని పెళ్ళి చేసుకునే మగాళ్ళను చూశాం కానీ, ‘కన్యాశుల్కం’ తీసుకుని పెళ్ళి చేసుకునే ఆడపిల్లలు ఎక్కడైనా ఉంటారా? ఎవరైనా చూస్తే నవ్విపోతారు’’ - ఆ ప్రకటన చదివిన తల్లి బుగ్గలు నొక్కుకుని మరీ విస్తుపోతూ అడిగింది.

‘‘ఎందుకు నవ్విపోవాలీ... నువ్వు కన్యాశుల్కం సినిమా చూడలేదా? అందులో పన్నెండేళ్ళ పిల్లని పెళ్ళి చేసుకునేందుకు వేలకు వేలు ధారపోసే ముసలాడు కనిపిస్తాడు. అలాంటిది పుట్టింటివాళ్ళ ప్రేమానురాగాలతో పాతికేళ్ళు పెరిగిన ఓ ఆడపిల్ల - వేరే ఇంటికెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకు వండిపెడుతూ అత్తమావల్ని ఆప్యాయంగా చూసుకుంటూ, భర్తగారి ముద్దుముచ్చటలు తీరుస్తూ, వాళ్ళ వంశాన్ని ఉద్ధరించటానికి సంతానాన్ని కూడా అందించే ఆడపిల్ల ‘శుల్కా’న్ని కోరితే తప్పేమిటి? చూద్దాం... ఎవరో ఒకరు రాకపోరు - అప్పుడే చేసుకుంటాను పెళ్ళి!’’ అంది శశికళ ధైర్యంగా.

ఆ ప్రకటన చదివి ఎంతమంది మగాళ్ళు ఆమెకు ఫోన్‌ చేశారో తెలియదు కానీ, ఈ అయిదేళ్ళ వ్యవధిలో హాయిగా పెళ్ళి చేసుకుని, తను ఉద్యోగం చేసుకుంటూనే ఇద్దరు పిల్లలకు తల్లయి, తన తమ్ముణ్ణి విదేశాలకు పంపించి మరీ చదివిస్తోంది శశికళ!!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.