close
వలలో చిక్కిన బాల్యం

వలలో చిక్కిన బాల్యం
జి. విజయకుమార్‌

గరంలో పేరు మోసిన చిల్డ్రన్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సుధాకర్‌ హాస్పిటల్‌ యథాప్రకారం ఈరోజూ పేషెంట్లతో కిక్కిరిసి ఉంది. ఏడాది పాప నుండి పదేళ్ళ పిల్లల వరకూ తల్లిదండ్రులతో బంధువులతో డాక్టర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. చిల్డ్రన్‌ స్పెషలిస్టే కాక సైకియాట్రిస్ట్‌ కూడా అయిన డాక్టర్‌ సుధాకర్‌ అరవై ఏళ్ళకు పైబడ్డా, కుర్రాడిలా చలాకీగా ఉంటాడు. ఆయన చేతివాసి గొప్పదని అందరూ నమ్ముతారు. వారంముందే అపాయింట్‌మెంట్‌ పొందితేగానీ ఆయన్ని కలవడం కుదరని పని.

పిల్లల గోల, తల్లుల లాలన, నర్సుల అదిలింపులతో సువిశాలమైన ఆసుపత్రి విజిటింగ్‌ హాలంతా చిన్నసైజు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వాతావరణాన్ని తలపిస్తోంది.

ఠంచనుగా తొమ్మిదికల్లా డాక్టర్‌ సుధాకర్‌ తన కన్సల్టింగ్‌ రూమ్‌కు చేరుకున్నాడు. ఆరడుగుల ఆజానుబాహుడు ఆయన. హుందాగా, గంభీరంగా నడిచి వచ్చిన డాక్టర్‌ను చూస్తూనే పిల్లలతోబాటు పేరెంట్సూ సైలెన్స్‌ అయిపోయారు.

హెల్ప్‌ డెస్క్‌లోని రిసెప్షనిస్ట్‌ సీరియల్‌ ప్రకారం ఒక్కొక్కరిని లోపలికి పంపడానికి సిద్ధమైంది.

‘‘బేబీ కీర్తన’’ మొదటి పేషెంటును పిలిచింది నర్సింగ్‌ స్టాఫ్‌.

ముద్దులొలికే బంగారుబొమ్మ లాంటి రెండున్నరేళ్ళకీర్తనను తీసుకుని డాక్టర్‌ గదిలోకి అడుగుపెట్టింది ఆ పిల్ల అమ్మమ్మ సుజాత.

‘‘గుడ్‌మార్నింగ్‌ డాక్టర్‌’’ విష్‌ చేసింది యాభై ఏళ్ళ సుజాత. అమ్మమ్మను అనుసరించి తనూ డాక్టర్‌ను విష్‌ చేసింది బేబీ కీర్తన.

‘‘హలో మేడమ్‌, బీ సీటెడ్‌’’ అంటూ చిరునవ్వుతో విష్‌ చేసిన డాక్టర్‌ సుధాకర్‌ ‘‘హే బేబీ, వాట్స్‌ యువర్‌ నేమ్‌?’’ అంటూ ప్రశ్నించాడు బేబీ చేతికి ఫైవ్‌స్టార్‌ చాక్లెట్‌ అందిస్తూ.

‘‘కీతన’’ ముద్దుముద్దుగా అంది పాప. కానీ డాక్టర్‌ అందించిన చాక్లెట్‌ బార్‌ను అందుకోలేదు. తన చూపు డాక్టర్‌ సుధాకర్‌ టేబుల్‌ మీదున్న అత్యాధునికమైన సెల్‌ఫోన్‌ మీదే కేంద్రీకృతమయింది. అమ్మమ్మ ఒడిలోంచి దూకి ఆ సెల్‌ఫోన్‌ను అందుకుంది రెప్పపాటులో.

సుజాత ‘‘వద్దు బేబీ’’ అంటూ వారించేలోగా డాక్టర్‌ ఫర్వాలేదన్నట్టు ఆమెను వారించాడు. నిశితంగా బేబీనే గమనించసాగాడాయన. బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఈజీగా ఆపరేట్‌ చేయసాగింది కీర్తన ఎంతో అనుభవం ఉన్నదానిలా.

‘‘ఐ వన్నా గేమ్స్‌’’ అంది డాక్టర్‌కు సెల్‌ అందిస్తూ కీర్తన. నిశ్శబ్దంగా గేమ్‌క్యూబ్‌ ఓపెన్‌ చేసి, ఆమె చేతిలో పెట్టాడు సెల్‌ను ఆయన, నిశితంగా బేబీనే పరిశీలిస్తూ. చిన్నారి చేతివేళ్ళతో గేమ్స్‌ను ఆపరేట్‌ చేస్తూ ఆనందిస్తోంది కీర్తన.

సడెన్‌గా పాపాయి చేతిలోని సెల్‌ను లాక్కున్నాడు డాక్టర్‌ సుధాకర్‌.

అంతే... అర సెకనులో ఆ రూమంతా అదిరిపోయేలా అరవడం మొదలుపెట్టింది కీర్తన. హిస్టీరియా పేషెంటులా గిలగిలా తన్నుకోవడం మొదలుపెట్టింది. డాక్టర్‌ టేబుల్‌ మీద పరికరాలు చిందరవందర అయ్యాయి. మనుమరాల్ని కంట్రోల్‌ చేయడానికి నానాతంటాలు పడుతోంది సుజాత.

ఇంతలోనే తిరిగి సెల్‌ను బేబీకి అందించాడు డాక్టర్‌ సుధాకర్‌. కనీసం కన్నీళ్ళయినా తుడుచుకోకుండా సెల్‌లో గేమ్స్‌ ఆడటం మొదలుపెట్టింది కీర్తన ఇందాకటి బాధనంతా మరచి.

‘‘ఇదే డాక్టర్‌, దాని ప్రాబ్లమ్‌. నిండా మూడేళ్ళు లేవు, సెల్‌ లేకపోతే ఇంటిని హెల్‌ చేసేస్తోంది. దీని అమ్మానాన్నలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. బెంగళూరులో పనిచేస్తున్నారు. ఓ మూడేళ్ళు నా దగ్గర ఉంచి, ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్‌ స్థాయి స్కూల్లో చేర్పించాలని నా కూతురు, అల్లుడి ఆలోచన.

చిన్నప్పటి నుంచే ముద్దుముద్దుగా సెల్‌తో ఆడుకోవడం, ఆపరేట్‌ చేయడం నేర్పించారు వాళ్ళు. ఇప్పుడు అది సెల్లూ, గేమ్సూ లేకపోతే తిండి తినడం లేదు. పాలు తాగడం లేదు. నిద్రపోవడం లేదు. అంతేకాదు, మమ్మల్నీ నిద్రపోనీయడం లేదు. బెదిరించయినా మానిపిద్దామనుకుంటే... ఫిట్స్‌ వచ్చినదానిలా మారిపోతోంది. అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చా’’ ఆవేదనగా అంది సుజాత.

సానుకూలంగా, సావధానంగా విన్న డాక్టర్‌ సుధాకర్‌ ‘‘ఇట్స్‌ ఓకే, తన ప్రాబ్లమ్‌ అర్థం అయింది. మీరు కాసేపు బయట కూర్చోండి. తన ట్రీట్‌మెంట్‌కంటే ముందు మీకు కాస్త కౌన్సిలింగ్‌ ఇవ్వాల్సి ఉంది’’ అంటూ కాలింగ్‌బెల్‌ కొట్టాడు. వీడియో గేమున్న సెల్‌ను కీర్తనకిచ్చి, డాక్టర్‌ బ్లాక్‌బెర్రీని బలవంతంగా పీకి ఆయనకు ఇచ్చి, బయటికి నడిచింది మనుమరాల్ని ఎత్తుకుని సుజాత.

‘‘నమస్కారం డాక్టర్‌గారూ!’’ వినయంగా నమస్కరించారు ఆ దంపతులు. రెండో టోకెన్‌ వారిదే. కూర్చోమన్నట్టు సైగ చేశాడు డాక్టర్‌ సుధాకర్‌ వారి వెనుకే నించున్న ఎనిమిదేళ్ళ కుర్రాణ్ణి పరికించి చూస్తూ.

‘‘వీడు మా అబ్బాయి ప్రవీణ్‌. ఫిఫ్త్‌క్లాస్‌ చదువుతున్నాడు. మంచి స్టాండర్డ్‌ ఉన్న స్కూల్లో చేర్పించాం. మావారు బ్యాంకు ఆఫీసర్‌. వీడు చదువులో డల్‌, ఆటలు నిల్‌. ఇరవైనాలుగ్గంటలూ కంప్యూటర్‌ ముందు కూర్చుని యానిమేషన్స్‌, ఫొటో రియలిస్టిక్‌ గేమ్స్‌ ఆడుతుంటాడు. సూల్లో చదువుపట్ల శ్రద్ధ చూపడం లేదని కంప్లయింట్స్‌ వస్తున్నాయి. కానీ, కంప్యూటర్‌ ల్యాబ్‌లో మాత్రం హుషారుగా ఉంటున్నాడట. ఇంట్లో సిస్టమ్‌ పాడయితే, వీడి మూడూ పాడవుతుంది. పిచ్చాడిలా ప్రవర్తిస్తుంటాడు. విపరీతమైన చిరాకు, కోపం, అసహనాలూనూ. ఏం చేయాలో తోచక మీ దగ్గరికొచ్చాం’’ వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ గబగబా చెప్పుకొచ్చింది బ్యాంకు మేనేజరు భార్య.

ప్రవీణ్‌ చూపులు మాత్రం డాక్టర్‌ పక్కనున్న కంప్యూటర్‌కి అతుక్కుపోవడం ఆయన గమనించకపోలేదు.

టోకెన్‌ నంబర్‌ త్రీ. ఓ నడివయసున్న వ్యక్తి తన మేనల్లుడితో వచ్చాడు.

‘‘డాక్టర్‌గారూ, వీడు నా చెల్లెలు కొడుకు. పేరు ధ్రువ్‌. మా చెల్లీ, బావా పల్లెటూళ్ళొ ఉంటున్నారు. నేనిక్కడ సిటీలో బిజినెస్‌ చేస్తున్నాను. పట్నంలో ఉంటే బాగా చదివి పైకొస్తాడని మా చెల్లీ బావా వీణ్ణి నా దగ్గరుంచి వెళ్ళారు. మూడేళ్ళుగా మా ఇంట్లోనే ఉంటున్నాడు. చదువులోనూ చురుగ్గానే ఉంటాడు. మంచి స్కోరింగ్‌ వస్తోంది కానీ... ప్రాబ్లమల్లా ఒక్కటే. ఎప్పుడు కాస్త టైమ్‌ దొరికినా, ఇయర్‌ఫోన్స్‌ తగిలించుకుని మ్యూజిక్‌, క్రికెట్‌ కామెంటరీలూ వింటూండిపోతాడు. ఆ సమయంలో పిలిచినా, అరిచినా వినిపించుకోడు. ఆఖరుకు భోంచేస్తున్నప్పుడూ, పడుకొన్నప్పుడూ ఇదే తంతు. ఒళ్ళు మండి ఎంపీత్రీ, ఇయర్‌ఫోన్స్‌ లాగేసుకుని నాలుగు వడ్డించాను. మూడు రోజులు ఇల్లొదిలి పారిపోయాడు. మేమూ, వాడి అమ్మానాన్నలూ నానా అగచాట్లూపడి వెదికి పట్టుకొచ్చాం. ఎవడో ఫ్రెండుది వాక్‌మెన్‌ తీసుకుని రెండ్రోజులు తిండీ నీళ్ళూ లేకుండా, ఎక్కడో రైల్వేస్టేషన్లో పడి ఉన్నాడు. హిప్నటైజ్‌ చేసి వాణ్ణి మీరే మార్చాలి’’ ఆవేదనగా అన్నాడా వ్యాపారి.

నాలుగో నంబరు దంపతులు శిరీష, శోభన్‌లు. వాళ్ళ రెండున్నరేళ్ళ పాప దివ్యతో వచ్చారు.

‘‘చెప్పండి, పాప ప్రాబ్లమ్‌ ఏమిటీ?’’ ప్రశ్నించాడు డాక్టర్‌ సుధాకర్‌ వారిని.

‘‘డాక్టర్‌గారూ, మేమిద్దరం ఉద్యోగులం. మా దగ్గరి బంధువులెవరూ లేరు. వూళ్ళొ ఉన్న ముసలివాళ్ళు పట్నానికి వచ్చి మా పాపను చూసుకునే ఓపిక లేనివాళ్ళు. అందుకే ఇక్కడే పేరున్న బేబీ కేర్‌ సెంటర్లో చేర్పించి, ఉదయం అక్కడ వదలి, సాయంత్రం ఇంటికి తీసుకువస్తున్నాం. ఈమధ్య మా పాప ప్రవర్తన అదోలా ఉంటోంది. బేబీకేర్‌ సెంటర్‌వాళ్ళను అడిగితే ఈమధ్య పాప సరిగ్గా అన్నం తినడంలేదనీ, యాక్టివ్‌గా ఉండటం లేదనీ అంటున్నారు. దగ్గర్లోని డాక్టర్‌కు చూపించాం. అయినా తన తీరు మారలేదు. మునుపటిలా హుషారుగా లేదు. మాకు భయమేసి మీ దగ్గరకు తీసుకొచ్చాం’’ అన్నారు దంపతులిద్దరూ.

‘‘మీరంటున్న కేర్‌ సెంటర్‌ ఎక్కడుంది?’’ ప్రశ్నించాడు డాక్టర్‌ సుధాకర్‌. వారిచ్చిన సమాధానం విని నింపాదిగా తలూపి, వారిని బయట వెయిట్‌ చేయమని చెప్పాడు.

ఆ కేర్‌ సెంటర్లో పిల్లలు అల్లరి చేయకుండా వీడియోగేమ్స్‌తో బుజ్జగిస్తారని ఆయనకు తెలుసు. మ్యూజిక్‌ థెరపీ పేరుతో చిన్నారులను మ్యూజిక్‌ మ్యాజిక్‌ మత్తులో ముంచి, చిరుప్రాయం నుంచే వారిని మ్యూజిక్‌కు బానిసలుగా చేస్తున్నారని విన్నాడు. ఫ్యూచర్‌లో ఈ చిన్నారులంతా శబ్దాల రొదలో చెవి సంబంధ వ్యాధులకు, మానసిక అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు అధికం అనిపించిందాయనకు.

డాక్టర్‌ సుధాకర్‌ కౌన్సిలింగ్‌ హాలది. సెంట్రల్‌ ఏసీ కాబట్టి హాయిగా ఉందక్కడ. తక్కువ వెలుగుతో లైట్లు వెలుగుతున్నాయి. ఓ ప్రొజెక్టర్‌, స్క్రీన్‌ అమర్చి ఉందక్కడ. దాదాపు పాతిక ముప్ఫైమంది సౌకర్యవంతంగా కూర్చోవడానికి అనువుగా సోఫాలు ఉన్నాయి.

‘‘డియర్‌ పేరెంట్స్‌, గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌. మీరందరూ మీ పిల్లల ప్రాబ్లమ్స్‌తో నా దగ్గరకు వచ్చారని నేననుకోవడంలేదు. వారి ప్రాబ్లమ్‌కన్నా మీ ప్రవర్తన ప్రమాదకరమైందిగా నాకనిపిస్తోంది. వారి జబ్బు నయం చేయడం సులభం. కానీ నేటి సమాజానికి సోకిన జబ్బును నయం చేయడానికి మనమందరం ప్రయత్నించాలి. అందుకే మొదట మీకు కౌన్సిలింగ్‌ నిర్వహించదలచాను’’ మంద్రంగా వినిపించింది డాక్టర్‌ సుధాకర్‌ స్వరం.

‘‘మనమందరం వివిధ సామాజిక స్థితుల నుండి, ప్రాంతాల నుండి వచ్చినవాళ్ళం. ఎంతోకొంత కష్టపడి నేటి స్థితికి చేరాం. కానీ, మన బాల్యం మనకింకా గుర్తుండే ఉంటుంది. గ్రామాల్లో అయితే కర్రాబిళ్లా, కోతికొమ్మచ్చి, చెడుగుడు, కోకో, తొక్కుడుబిళ్ళ, కబడ్డీ లాంటి ఆటలు... పట్టణాల్లో అయితే క్రికెట్‌, వాలీబాల్‌, హాకీ, స్పోర్ట్స్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ లాంటివి మనం విన్నవి, కన్నవి, ఆడినవి, ఆనందించినవి. కానీ, నేటితరం... బాల్యాన్నే మరచిపోతోంది. కాదు మరచిపోయేలా మనమే చేస్తున్నాం. చిన్ననాటి నుంచే పిల్లలను జీనియస్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నాం. పోటీపడుతున్నాం.

కానీ, ఇదే క్రమంలో వారిలోని బాల్యాన్ని క్రూరంగా చంపేస్తున్నాం. చిన్నతనాన్ని చిదిమేస్తున్నాం. చిన్నపిల్లలను ఆటలాడిస్తున్నామా? పదిమంది పిల్లలతో కలిసి గంతులేయనిస్తున్నామా? ప్రకృతిని పరిచయం చేస్తున్నామా? జీవకోటితో అనుబంధాన్ని పెంచుతున్నామా? లేదే..! బాల్యంలోనే వారికి వీడియోగేమ్స్‌, వీడియోలు, సెల్‌ఫోన్స్‌, కంప్యూటర్లతో తర్ఫీదునిస్తున్నాం. ఆ వస్తువులతోబాటు మన పిల్లలనూ మరబొమ్మలుగా మారుస్తున్నాం.

వారి చిన్న బ్రెయిన్‌లకు ప్రాబ్లమ్స్‌ తెస్తున్నాం. ఆధునికత, అత్యాశ, ఆడంబరం, అతి బోధన... అన్నీ మనం వారిపట్ల చూపుతున్న క్రూరత్వాలే. పసిమొగ్గలైన వారిని బలవంతంగా విచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాం. పోటీ ప్రపంచంలో వారిని అన్నిటా ముందుంచాలనే తాపత్రయంతో అనారోగ్యాలపాలు చేస్తున్నాం.

చిన్నతనంలోనే వారికి కంటిచూపు మందగిస్తోంది. దాంతో మందపాటి కళ్ళద్దాలు వారికి శాపంగా మారుతోంది. సరైన నిద్రలేదు. అజీర్తి, ఆకలి మందగించడం, శారీరక శ్రమ తెలియకపోవడం లాంటి వాటితోబాటు హియరింగ్‌ ప్రాబ్లమ్స్‌ త్వరగా వస్తున్నాయి. ఇంకా మొండితనం, పెంకితనం... వీటన్నిటికీ కారణం... వారికి మనం చేస్తున్న ఆధునిక అలవాట్లే. అన్నిటికీ మూలకారణం మనమే. మీరు ఒప్పుకున్నా లేకున్నా ఇది నిజం... ముమ్మాటికీ నిజం.

గోరుముద్దలు తినిపించాల్సిన వయసులో ఏకంగా బిరియానీ తినిపించాలని ప్రయత్నిస్తున్నాం.

ప్రకృతి ప్రసాదించిన బాల్యాన్ని అంతర్జాలమనే వలకు (నెట్‌) బలిచేస్తున్నాం. వండర్‌ కిడ్స్‌ని చేయాలన్న తపనతో, అత్యాశతో జోలపాటలకు టాటా చెప్పేశాం. టాయ్స్‌కు బదులు టాబ్స్‌ అందిస్తున్నాం. కాలక్షేపం కోసం కంప్యూటర్లు, అల్లరి చేయకుండా వీడియోగేమ్స్‌, ఆడుకోవడానికి సెల్‌ఫోన్‌లు ఇస్తున్నాం. తాత్కాలికంగా వారి దృష్టి మరల్చి మన పనులకు అడ్డురాకుండా చూసుకుంటున్నాం. ఆ అలవాటే వ్యసనంగా మారిపోతుందని మరచిపోతున్నాం. మారిన తర్వాత చింతిస్తున్నాం. ఇవన్నీ మనం తెలిసో తెలియకో చేస్తున్న తప్పులు. ఇప్పుడు ఈ స్క్రీన్‌పైన చూడండి’’ కొనసాగించాడు డాక్టర్‌ సుధాకర్‌.

స్క్రీన్‌పైన అలనాటి కంప్యూటర్‌ ప్రత్యక్షమైంది. భారీ రూమంత ఉందది. ‘‘ఇది తొలినాటి కంప్యూటర్‌. పెద్ద హాలంత ఉండేది. మరి నేటి కంప్యూటరో... అరచేతిలో ఇమిడేంత సెల్‌ రూపంలో కొందరికి వరంగానూ, పిల్లలకు శాపంగానూ మారింది.

1962లో మాసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో స్టీవ్‌ రస్సెల్‌ రూపొందించిన ‘స్పేస్‌ వార్‌ గేమ్‌’ను కంప్యూటర్‌లో తొలి గేమ్‌గా చెప్పవచ్చు. క్రమేణా యానిమేషన్‌, ఫొటో రియలిస్టిక్‌ త్రీడీ గేమ్స్‌, సరౌండ్‌ మ్యూజిక్‌తో కూడిన టెక్నాలజీ కంప్యూటర్‌ గేమ్స్‌, గేమ్‌క్యూబ్‌, చివరగా మైక్రోసాఫ్ట్‌ అద్భుత సృష్టి ‘ఎక్స్‌ బాక్స్‌’ ఇవన్నీ గేమ్‌ కన్సోల్స్‌ రంగంలో సంచలనాలు సృష్టించాయి. ఇంటర్నెట్‌తో విప్లవమే వచ్చింది.

యాక్షన్‌ గేమ్స్‌, అడ్వంచర్‌ గేమ్స్‌, స్ట్రాటజీ గేమ్స్‌, రోల్‌ప్లేయింగ్‌ గేమ్స్‌, చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ గేమ్స్‌... నేడు పీసీల్లోనూ, సెల్‌ఫోన్‌లోనూ ప్రత్యక్షమయ్యాయి. చిన్నారులకు అందుబాటులో ఉన్నాయి.

అవసరం మేరకు ఉపయోగించుకుంటే అంతా విజ్ఞానమే. అతిగా ఉపయోగించుకుంటే అంతా వినాశమే. ఇంటి సమస్యలూ, ఒంటి సమస్యలూ, ఆరోగ్య సమస్యలూ, బాల్యమే కనుమరుగయ్యే పెనుసమస్య...

కాబట్టి డియర్‌ పేరెంట్స్‌! ఇప్పటికైనా కళ్ళుతెరవండి. మీ పిల్లల ఆరోగ్యాన్ని బాగుచేసే విషయాన్ని నాకొదిలేసి, సమాజాన్ని బాగుచేసే పని మీరు చేపట్టండి. దయచేసి బాల్యాన్ని బలి ఇవ్వకండి’’ ముగించాడు డాక్టర్‌ సుధాకర్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.